Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మధురగీతాలు – మనోహరదృశ్యాలు-37

[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]

 

హోలీ కె దిన్ దిల్ ఖిల్ జాతే హైఁ
రంగోం మే రంగ్ మిల్ జాతే హైఁ
గీలే షిక్వే భూల్ కే దోస్తో
దుష్మన్ భీ గలె మిల్ జాతే హైఁ

‘షోలే’ సినిమాలో ఈ హోలీ పాట సూపర్ హిట్ పాట అవటమే కాదు, సినిమాలో పాటను విడదీయరాని భాగం చేస్తూ, పాటను కీలకం చేసి మరుపురాని రీతిలో స్క్రిప్టులో పాటకు స్థానం కల్పించేందుకు చక్కని ఉదాహరణ.

స్క్రిప్టులో పాటకు చక్కని సందర్భం కుదిర్చారు. ఆ గ్రామాన్ని వేధిస్తున్న గబ్బర్ సింగ్ అనుయాయుల్ని మన హీరోలిద్దరూ తరిమి కొడతారు. దానికి గబ్బర్ సింగ్ మండిపడతాడు. ఓడిపోయి పారిపోయి వచ్చిన వారిని చంపేస్తాడు. ‘హోలీ ఎప్పుడు?’ అని అడుగుతాడు. వెంటనే గాల్లోకి రంగులు ఎగురుతాయి.

రంగులు నిండిన గిన్నెలు కనిపిస్తాయి.

పిచ్కారీలు కనిపిస్తాయి.

పళ్లేల్లోని రంగులు చేతులలోకి తీసుకుని విసుర్తారు.

ఇవన్నీ కొన్ని సెకెన్లు దృశ్యాలు తెరపై వెంట వెంటనే కనిపిస్తూంటాయి.

అక్కడ ‘హోలీ ఎప్పుడు?’ అని గబ్బర్ సింగ్ చెప్పిన దానికి సమాధానం ఇక్కడ లభిస్తుంది.

‘చలో సహేలీ’ అంటూ మహిళల గుంపు బయలుదేరుతుంది.

‘చలో రే సాథీ’ అంటూ పురుషుల గుంపు బయలుదేరుతుంది.

యె పకడో యే పకడో
ఇసే న ఛోడో
అ రా రా భయ్యా న తోడో
ఓయ్ జరా ఠహర్ భాభీ
క్యా ఓ రాజా గలీ మే ఆజా

ఇలా వెంట వెంటనే దృశ్యాలు మారుతూ, సంభాషణలు మారుతూ, ఆ గ్రామమంతా హోలీ పండుగ సంబరాలను ఆరంభించటం చూపిస్తుంది కెమేరా.

ఉత్తరాదిన హోలీ ప్రధానమైన పండుగలలో ఒకటి.

హోలీపండుగ అంటే, శ్రీకృష్ణుడు, గోపికలు ఒకరినొకరు ఏడ్పించుకుంటూ, రెచ్చగొట్టుకుంటూ చేసే ఆహ్లాదరకరమైన శృంగారకేళీవిలాసం. ఉత్తర భారతంలో అత్యంత ఉత్సాహంతో, సంబరంగా జరుపుకుంటారీపండుగను.

హిందీ సినిమాల్లో  కూడా హోలీ పాటలు అధికం. ‘హోలీ’ సందర్భంగా పాటను పెట్టి, ఆ పాటను సినిమాలో కీలక సన్నివేశాలకు దారి తీసేట్టు చేయటం హిందీ సినీ స్క్రిప్టు రచయితలకు వెన్నతో పెట్టిన విద్య. ఎలాంటి కీలక సన్నివేశానికి దారి తీయకపోయినా కనీసం నాయికా, నాయికల ప్రేమను ప్రదర్శించేందుకయినా హోలీ పాటను వాడుకుంటారు హిందీ స్క్రిప్టు రచయితలు.

హిందీ సినిమాల్లో తొలి హోలీ పాట, 1940లో ‘ఔరత్’ సినిమా లోనిది. ‘ఆజ్ హోలీ ఖేలేంగే సజన్ కే సంగ్’ అనే పాట ఆ కాలంలో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ పాటను స్వరపరచిందీ పాడిందీ అనిల్ బిశ్వాస్. ఇదే సినిమాలో ‘జమునాతట్ శ్యామ్ ఖేలే హోలీ’ అనే హోలీ పాట కూడా ఉంది. ఈ రెండు పాటలూ సూపర్ హిట్ అయ్యాయి. మళ్లీ 1957లో ‘ఔరత్’ సినిమా ‘మదర్ ఇండియా’ గా రూపొందించినప్పుడు మహబూబ్ ఖాన్ హోలీ పాటను సినిమాకు కీలకమైన సందర్భంలో ఉంచాడు. ఇది భావి తరాలకు మార్గదర్శకమయింది.

‘మదర్ ఇండియా’ దాదాపుగా ‘ఔరత్’కు రీమేక్ అయినా, మారిన కాలాన్ని దృష్టిలో ఉంచుకుని స్క్రిప్టును రూపొందించాడు మహబూబ్ ఖాన్. ‘ఔరత్’ లో రెండు హోలీ పాటల రెండు విభిన్నమైన పరిస్థితులను సూచిస్తాయి. మొదటి హోలీ పాటలో అందరూ ఆనందిస్తుంటారు. రెండవ  హోలీ పాట ‘ఆజ్ హోలీ ఖేలే సజన్ కే సంగ్’ సందర్భం వచ్చేసరికి ఊళ్లో అందరూ ఆనందిస్తుంటారు. కాని నాయిక ఇంట్లో పని చేస్తుంటుంది. ‘హోలీ యువత పండుగ’ అంటుంది. ఇంట్లో వాళ్లకు తినటానికి తిండి కోసం ఆలోచిస్తూంటుంది. ఈ మారిన పరిస్థితులను చూపేందుకు ‘ఔరత్’ సినిమాలో హోలీ పాటలను వాడుకున్నాడు. ఒక హోలీ ఆనందమయం అయితే మరో హోలీ బాధల బరువులమయం.

‘మదర్ ఇండియా’ రూపొందించే సమయానికి మహబూబ్ ఖాన్ అగ్రశ్రేణి నిర్మాత దర్శకుడయ్యాడు. సాంకేతికంగా కూడా సినిమా అభివృద్ధి చెందింది. స్వాంతంత్య్ర పూర్వ పరిస్థితులకూ స్వతంత్రం తరువాత పరిస్థితులకూ నడుమ తేడాలు వచ్చాయి. దేశాభివృద్ధికి ప్రభుత్వం పథకాలు వేస్తోంది. ఇవన్నీ ‘మదర్ ఇండియా’లో చోటు చేసుకున్నాయి. సుఖ సంతోషాలను చూపేందుకు ‘మత్‌వాలా జియా డోలె పియా’ అనే పాటను, పెరిగే బాధ్యతల బరువును చూపేందుకు ‘గుజరియా కట్‌తీ జాయేరే’ అనే పాటను వాడుకున్నాడు. ఇప్పుడు సంగీతం మారింది.గాయనీగాయకులు మారేరు,  గేయ రచయితలూ  మారటంతో ‘ఔరత్’ సినిమాలోని లేని విశ్వజనీనత, తాత్త్వికత ‘మదర్ ఇండియా’ సినిమాలో కనిపించాయి.

హోలీ పాట కోసం మాత్రం ప్రత్యేకంగా కీలకమైన సన్నివేశాన్ని రూపొందించాడు మహబూబ్ ఖాన్.

ఆ ఊళ్లో అందరూ ‘మదర్ ఇండియా’లా భావించే రాధకు ఇద్దరు పిల్లలు, రాము, బిర్జు. రాము సౌమ్యుడు. బిర్జు తుంటరి. రెండు చేతులు కోల్పోవటంతో ఇంట్లో వాళ్ల మీద బరువుగా ఉండటం ఇష్టం లేక ఇల్లొదిలి ఎటో వెళ్లిపోతాడు రాధ భర్త. చట్టూ అప్పులుంటాయి. అయినా వ్యవసాయం చేస్తూ పిల్లలను పెంచుతూ అప్పు తీర్చాలని ప్రయత్నిస్తుంటుంది రాధ. ఇంట్లో వస్తువులు ఒకటొకటిగా ఊళ్లోని వడ్డీ వ్యాపారి దగ్గరకు ‘తాకట్టు’గా చేరుకుంటాయి. అలా రాధ గాజులు కూడా చేరతాయి. ఆ గాజులను విడిపించివ్వాలన్నది బిర్జు తపన. వాటిని చూస్తూంటే ఒళ్లు తెలియని కసి కలుగుతూంటుంది బిర్జుకు. ఆ వడ్డీ వ్యాపారి కూతురును ఏడిపించటం బిర్జుకి సరదా. ఈ పరిస్థితిలో హోలీ పండుగ వస్తుంది.

హోలీ ఆయీరే కన్హాయా హోలీ ఆయారే
హోలీ ఆయీరే కన్హాయీ  రంగ్ చలాకే సునా దె జరా బాసురీ

ఊరంతా సంబరాలలో మునిగి తేలుతుంటారు. రాము అతని ప్రేయసి శృంగార హోలీ ఆడుతుంటారు. ఇంతలో చేతికి రాధ గాజులు తొడుక్కుని వడ్డీవ్యాపారి కూతురు బిర్జు ముందుకు వస్తుంది. రెచ్చగొడుతూ అతని ముఖం ముందు గాజుల చేయి ఊపుతుంది. ఒళ్లు పై మరచిన కోపంతో బిర్జు ఆమె చేయి పట్టుకుని గాజులు లాగుతాడు.

గొడవ ఆరంభమవుతుంది. వ్యాపారి మనుషులు కర్రలతో బిర్జుపై దాడి చేస్తారు. క్షణంలో సంబరాలు కాస్తా పోరాటంగా మారిపోతాయి. అంత వరకూ ఆనందంగా పాడుతూ ఆడుతూన్న వారి కేరింతలు ఆవేశపూరిత కేకలు హాహాకారాలుగా మారిపోతాయి.

(‘హోలీ ఆయారే కన్హాయీ’ పాటను యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=4B1O03kLr7U )

అద్భుతమైన సృజన ఇది. ఈ దొమ్మి ఫలితంగా బిర్జు ఊరొదిలి పారిపోయి బందిపోట్లలో చేరతాడు. కానీ సంబరాలలో సర్వం మరచిన వారు, మరుక్షణం అనూహ్యమైన సంక్షోభాన్ని ఎదుర్కోవటమనేది మన స్క్రిప్టు రచయితల మొదళ్లలో నాటుకు పోయింది. దీన్ని అత్యంత ప్రతిభావంతంగా వాడుకున్నది ‘సలీమ్ – జావేద్’లు.

‘మేరా గావ్ మేరా దేశ్’ ను తిరగేసి మరగేస్తే ‘షోలే’ స్క్రిప్టు అవుతుంది. దీన్లో పాటలకు సందర్భాలు ఏర్పాటు చేయటంలో వారి ప్రతిభ తెలుస్తుంది. ముఖ్యంగా ‘మదర్ ఇండియా’ ప్రభావంతో తమదైన ప్రత్యేకమైన రీతిలో సందర్భాన్ని ఏర్పాటు చేశారు. ఊరంతా హోలీ సంబరాలలో ఉంటుంది. ఒక హీరో నాయిక వెంట పడుతుంటాడు.

గోరీ తేరీ రంగ్ జైసా
థోడా సా మై రంగ్ బనాలూ
ఆ తేరీ గులాబీ గాలోంసే
థోడా సా గులాల్ చురాలూ

అంటూ వెంటపడతాడు. నాయిక అతడిని తిరస్కరిస్తూంటుంది.

జా రే జా దివానా తూ హోలీకి బహనే తూ
ఛేడ్ నా ముఝే బేషరమ్

అయితే, పాట పూర్తవుతుండగానే గబ్బర్ సింగ్ దాడి చేస్తాడు. అప్పటి దాకా సంబరాలలో, శృంగార భరితమైన ఆట పాటలతో ఆనందంగా ఉన్న దృశ్యం క్షణంలో మారిపోతుంది. తుపాకుల మోతతో హాలు దద్దరిల్లిపోతుంది. ఎలాగయితే ‘మదర్ ఇండియా’లో పాట గుర్తుండిపోతుందో, అలాగే క్షణంలో ‘మూడ్’ మారిపోయే ‘హోలీ కే దిన్’ పాట కూడా గుర్తుండిపోతుంది. ముఖ్యంగా, ఈ పాట తరువాత ‘ఠాకూర్’ పాత్ర గతం తెలియటంతో హీరోలలో నిజాయితీ జాగృతమవుతుంది. అందుకని సినిమాలో అతి కీలకమైన సన్నివేశంగా నిలుస్తుంది ‘హోలీ కే దిన్’ పాట.

(‘హోలీ కె దిన్’ పాటను యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=-GPAzK1hMfg )

మహబూబ్ ఖాన్ సినిమా ‘ఆన్’లో కూడా హోలీ పాట ఉంది. ఉత్తర భారతంలో ‘హోలీ’ని శ్రీకృష్ణుడు, గోపీకల శృంగార కేళికలాపాల పండుగగా భావిస్తారు. అందుకని సినిమాల్లోని ‘హోలీ’ పాటలన్నీ శృంగారభరింతంగా రాథా, కృష్ణుడు, గోపీకల సరససల్లాపాల పాటలుగా ఉంటాయి.

ఖేలో రంగ్ హమారే సంగ్
ఆజ్ దిన్ రంగ్ రంగీలా ఆయా

‘ఆన్’ సినిమాలో ఈ పాటను కూడా అత్యంత ఉత్కంఠభరితంగా రూపొందించటమే కాదు సినిమాకు కీలకం చేశాడు మహబుబ్ ఖాన్. ‘ఆన్’ సినిమా ‘టేమింగ్ ఆప్ ది ష్రూ’ అనే షేక్స్‌పియర్ నాటకానికి భారతీయీకరణ. రాకుమారిని ప్రేమించిన ఓ సామాన్యుడైన హీరో, ఆమెని ఎత్తుకుపోయి ఆమె తనను ప్రేమించేట్టు చేసుకుంటాడు. దానికి నాంది ప్రస్తావన లాంటిదీ పాట.

హీరోతో పాటు మరో యువతి ఉంటుంది. ఆమె కూడా హీరోను ప్రేమిస్తూంటుంది. వారిద్దరూ హోలీ ఆడుతుండగా, ఆమె చేతిలోని వస్త్రం(రుమాలు) ఎగిరి వెళ్లి రాకుమారిపై పడుతుంది. ఇదే సమయంలో హీరోని పట్టుకోవాలని భటులు వెంట పడతారు. ‘టార్జన్’లా హీరో వారిని తప్పించుకుంటాడు. మరో వైపు నాయికుడిని ప్రేమించిన సామాన్యురాలిపై రాకుమారుడి కన్ను పడుతుంది. పాట అయ్యేలోగా ఆమెను ఎత్తుకుపోతాడు. హీరో  తప్పించుకుని రాకుమారిని ఎత్తుకుపోతాడు. ఇలా ఓ వైపు ఏక్షన్, రోమాన్స్, సస్పెన్స్ అన్నీ కలగలసి ఈ పాట చిత్రీకరణ అత్యంత ఆసక్తికరంగా సాగుతుంది. సినిమా కథను మందుకు నడుపుతుంది.

(‘ఖేలో రంగ్ హమారే సంగ్’ పాటను యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=jki8jWjPEJc )

హిందీ సినిమాలలో ఈ పాటల ప్రభావంతో అనేక హోలీ పాటలు రూపొందాయి. కానీ సినిమాలో అంతర్భాగమవటమే కాదు; ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా ఉంటూ కీలకంగా, మరపురాని పాటలుగా రూపొందిన పాటలు తక్కువ.

‘సిల్‍సిలా’ సినిమాలో ‘రంగ్ బర్సే’ అంటూ అమితాబ్, హరివంశరాయ్ బచ్చన్ కవితను స్వయంగా పాడాడు. ఆ పాట సందర్భంలో హీరో భార్యకు స్నేహితుడికీ, స్నేహితుడి భార్య పట్ల హీరోకు ఆసక్తి ఉందని తెలుస్తుంది. పాట హిట్ అయింది. హోలీ అనగానే ముందు వినిపించే పాట ఇదే. కానీ చిత్రీకరణ విషయంలో కానీ, కథకు ఊపునివ్వటంలో కానీ పాట అంతగా అలరించదు.

‘కోహినూర్’ సినిమాలో ‘తన్ రంగ్ లో జీ’, ‘కటీ పతంగ్’ లో ‘ఆజ్ న ఛోడెంగే’ వంటి పాటలు హిట్ అయినా సినిమా స్క్రిప్టు పరంగా పెద్దగా ఉపయోగకరం కావు. ‘రాజ్‌పుత్’ సినిమాలో ‘భాగీ రే భాగీ బ్రిజ్ బాలా’ పాట అయిన తరువాత ఒక నాయికను దొంగలు ఎత్తుకుపోతారు. కానీ, విజయ్ ఆనంద్ క్షీణదశలో వచ్చిన సినిమా అవటంతో పాట అంతగా నప్పదు. ‘నవరంగ్’ లో ‘అరె జారే హట్ నట్‍ఖట్’ చిత్రీకరణ పరంగా, సన్నివేశ పరంగా చాలా గొప్ప పాట. సృజనాత్మక కవి హృదయాన్ని అద్భుతంగా ప్రదర్శిస్తుందీ పాట.

‘బాగ్‌బన్’ లో ‘హోలీ ఖేలే రఘువీర్’; ‘యే జవానీ హై దివానీ’లో ‘బలమ్ హిచ్‌కారీ’; ‘బద్రీ కీ దుల్హనియా’లో టైటిల్ పాట; ‘జాలీ ఎల్.ఎల్.బి.2’ లో ‘గో పాగల్’ పాట; ‘మొహబ్బతేఁ’ లో ‘సోనీ సోనీ’; ‘మిలన్ టాకీస్’లో ‘మైండ్ న కరియో హోలీ హై’ వంటి ఎన్నెన్నో హోలీ పాటలు హిట్ అయ్యాయి. కాని ‘మదర్ ఇండియా’, ‘ఆన్’, ‘షోలే’ సినిమాలలో హోలీ పాటల లాగా మరుపురాని రీతిలో ఉండవు. రచన పరంగా, సంగీత పరంగా, గానం పరంగా, చిత్రీకరణ పరంగా, స్క్రిప్టు పరంగా కూడా అత్యద్భుతమైన హోలీ పాటలు ఇవి. ఇప్పుడు సినిమాల్లో హోలీ పాటలున్నా అవి ప్రధానంగా హీరోయిజం ప్రదర్శించేవిగానో శృంగార ప్రధానంగానో ఉంటున్నాయి, అర్ధవిహీనంగా ఉంటున్నాయి తప్ప ‘హోలీ’ పండుగలోని శృంగారంలో నిబిడీకృతమై ఉన్న తాత్వికతను ప్రదర్శించే పాటలు కావు. సినిమాలో భాగం కూడా కావు. రాను రాను పాటల్లో చిలిపి శృంగారం కన్నా, అశ్లీలం, అంగాంగ ప్రదర్శనలు, అర్ధంలేని పదాలు ఎక్కువయ్యాయి.

డూ మీ ఎ ఫేవర్ లెట్స్ ప్లే హోలీ

రంగోం మె హై ప్యార్ కీ బోలీ

హో మేరే పీచె పీచె పీచే క్యూ ఆయే

మేర జియా జియా క్యూన్ ధఢ్కీ

జారే జా డోంట్ తచ్ మై చోలీ

ఈ పాటను ఇక్కడ చూడండి.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version