[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]
ఓహో గులాబి బాలా
అందాల ప్రేమ మాలా
సొగసైన కనులదానా
ఇంపైన మనసుదానా
నీ వారెవరో తెలుసుకో
ఒకప్పుడు ‘పియానో’ వాయిద్యం స్టాటస్ సింబల్‌గా ఉండేది. పాత్ర ధనవంతమైనది అని చెప్పేందుకు ఇంట్లో ‘పియానో’ ఉండాలి అన్నది అప్పటి సినిమాలో అప్రకటిత సూత్రం. ఇంట్లో ‘పియానో’ ఉన్నప్పుడు దాన్ని వాయించి పాడకపోతే పియానో వ్యర్థం కాబట్టి, తప్పనిసరిగా ఓ పియానో పాట ఉండేది. పియానో పాట కోసం చక్కటి సందర్భాలను కుదిర్చారు స్క్రిప్టు రచయితలు. అంతే చక్కని పాట రాశారు గేయ రచయితలు. పియానో వాయిద్యం ఎంత మధురంగా ధ్వనిస్తుందో, ఆ మాధుర్యానికి రెట్టింపు మధురమైన బాణీలు కుదిర్చారు సంగీత దర్శకులు. నటీనటులు, పియానో వాయించటం రాదని ప్రపంచానికి ప్రదర్శిస్తూ కూడా అభాసుపాలు కాకుండా ప్రేక్షకులను మెప్పించే రీతిలో నటించారు. చిత్రీకరణ కూడా పాత్రల మనోభావాలను ప్రేక్షకులకు చేరువ చేస్తూ సందర్భాన్ని అనుసరిస్తూ ఉండేది. అసలు ‘పియానో’ పాటలంటేనే ఎవో కొన్ని తప్పించి అధిక శాతం పాటలు ఎంతో ‘ఎమోషనల్’ పాటలయి ఉండేవి. పియానో వాయిస్తూ పాడే అధికశాతం పాటలు సూపర్ హిట్ పాటలు.
తెలుగులో పియానో పాటలనగానే ముందుగా గుర్తు వస్తుంది ‘నా హృదయంలో నిదురించే చెలీ’ అనే పాట. ఆ వెంటనే గుర్తుకు వస్తుంది ‘జగమే మారినది మధురముగా ఈ వేళ’ అన్న పాట. కొన్ని పాటల్లో పాత్రలు పియానో దగ్గర కూర్చుంటాయి తప్పించి పాటలో పియానో నోట్లు అరుదుగా వినిపిస్తాయి. ఇంకొన్ని పాటలు సూపర్ హిట్ పాటలయినా నాయిక పియానో వాయించిన పాత్రధారిగా ఎక్కువగా గుర్తుండి పోతాయి. ‘పగలే వెన్నెల, జగమే ఊయల’ ఇందుకు చక్కని నిదర్శనం. ‘ప్రతి పుట్టిన రోజు పండుగ కాదు’ పాటలో శోభన్ బాబు పియానో వాయించటం, పాట హిట్ కాకపోవటం వల్ల అంతగా గుర్తింపు పొందలేదు. పియానో సరిగ్గా వాయించటంలో మార్కులు పొందకున్నా ‘జగమే మారినది మధురముగా’ ‘నా హృదయంలో నిదురించే చెలీ’ పాటల సరసన మాధుర్యంలో, సాహిత్యంలో, చిత్రీకరణలో తల ఎత్తుకుని కాస్త ఎత్తునే నిలబడగల పాట ‘ఓహో గులాబి బాలా’ పాట.
‘నా హృదయంలో నిదురించే చెలీ’ పాట ఆరంభంలో పియానో వినిపిస్తుంది. చరణాల్లోనూ, ఇంటర్ల్యూడ్ , సంగీతంలోనూ అక్కడా వినిపిస్తూనే ఉంటుంది. కానీ అంత ప్రధానంగా కాదు. ‘జగమే మారినది’ పాటలో, ఆరంభంలో, చివర్లో తప్ప పాట మధ్యలో ఎంతో జాగ్రత్తగా వింటే తప్ప పియానో నోట్స్‌ను గుర్తించటం కష్టం ఇందుకు భిన్నంగా ‘ఓహో గులాబి బాలా’ పాట మొత్తంలో ఇతర వాయిద్యాలు వినిపిస్తున్నా ప్రధానంగా వినిపిస్తుంది పియానో.
ఇతర రెండు పాటలతో పోలిస్తే ‘ఓహో గులాబి బాలా’ పాట సన్నివేశం కఠినమైనదే కాదు, ఆ సన్నివేశంలో పాట మెప్పించటం కూడా కొంచెం కష్టమైనది. ‘నా హృదయంలో నిదురించే చెలీ’ పాట హీరో, హీరోయిన్ను చూసి మైమరచి పాడే మధురమైన ప్రేమ గీతం. ‘మనసు స్పందిస్తే మాట పాట అవుతుందం’టాడు నాయకుడు, పాట పాడిన తరువాత. అలాంటి పాట. అత్యుత్తమ సాహిత్యం, అత్యుత్తమమైన గానం, చక్కటి నదీప్రవాహం లాంటి బెంగాలీ బాణీ కుదరటంతో ప్రేక్షకులను అలరించటంలో ఆశ్చర్యం లేదు. చిత్రీకరణ పెద్ద సమస్య కాదు. తెలివిగా, ఆరంభంలో వినిపించే పియానోకు తగ్గట్టుగా వేళ్లు పియానోపై కదలటం క్లోజప్పులో చూపించి, మిగతా పాట అంతా పియానో వెనుక నాయకుడి ముఖాన్ని క్లోజప్పులో చూపించీ పాటను చిత్రీకరించారు. పాట భావం, నటుడి నటన వంటివి పాటను మరపురాని పాటగా నిలుపుతాయి.
‘నా హృదయంలో నిదురించే చెలీ’ పాటలో ఒక దివ్యమైన సౌందర్యాన్ని చూసి చలించిన మనస్సు, మేఘాలను చూసిన నెమలి నటనలోని ఆనందాన్ని, అద్భుతాన్ని, శృంగారాన్ని చిలకరిస్తుంది. ఘంటసాల స్వరం, పాటలో పదాలు కూడా ఆ హృదయానంద స్పందన నర్తనాన్ని ప్రతిబించిస్తాయి. ‘మయూరివై వయారివై నేడే నటనమాడి నీవే’, ‘చకోరమై నిను వరించి అనుసరించినానే, కలవరించినానే’, ‘నివాళితో చేయి సాచి, ఎదురు చూచినానే’, – రొమాన్స్‌లో ఉన్న అపరిమితానందాన్ని అలతి పదాలలో పొదిగి అనంతానందాన్ని అపరిమితంగా కలిగించే సాహిత్యం ఇది. ఏ పదాల పూలమాల పాదాన్ని తాకితే మహతీవీణ మహదానందంతో ధ్వనిస్తుందో ఆ పదాలన్నీ ఏరి తెచ్చి పొదిగిన పాట ఇది.
(‘నా హృదయంలో నిదురించే చెలీ’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=aBDiqqg2H3I )
‘దేశద్రోహులు’ సినిమాలో ‘జగమే మారినది’ పాట సన్నివేశంలోనే ఉద్విగ్నత, ఆర్ద్రత, సంవేదనలున్నాయి. నాయిక నాయకుడు ప్రేమించుకుంటారు. కానీ నాయిక వేరే అతడిని వివాహమాడుతుంది. ఎన్నో ఏళ్ల తరువాత నాయకుడికీ విషయం తెలుస్తుంది. ఆ సందర్భంలో వస్తుందీ పాట. అంతకు ముందే వారిద్దరూ ప్రేమలో ఉన్నప్పుడు నాయిక ఈ పాటనే పాడుతుంది. అదే పాటను నాయకుడు ఇప్పుడు పియానో ముందు కూర్చుని పాడతాడు. పాటకూ నాయికా నాయకులకూ ఉన్న సంబంధం వారిద్దరికే తెలుస్తుంది. నాయిక ప్రక్కనే ఆమె భర్త ఉంటాడు. సన్నివేశంలో ఉద్విగ్నత వచ్చేసింది. అదే పాట పాడటంతో నాయికకు గతం గుర్తుకు తెచ్చినట్టవుతుంది. ఆ గతం మరచి భర్తతో సానుకూల జీవితం గడుపుతున్న ఆమె మనస్సు ఈ పాటతో తుఫానులో చిక్కిన నావ గతి అవుతుంది. అంటే సన్నివేశంలోనే ఒక తీక్షణత, గాంభీర్యం, హృదయ విదారకమైన భావోద్వేగం ఉన్నాయి. దీనికి తోడు ఘంటసాల స్వరం.
‘జగమే మారినది’ పాటలో ఘంటసాల స్వరం, ‘నా హృదయంలో నిదురించే చెలీ’ పాటలో ఘంటసాల స్వరానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఆరాధన సినిమా 1962 నాటిది. దేశద్రోహులు 1964 నాటిది. రెంటి నడుమ తేడా రెండేళ్ళే అయినా ‘నా హృదయంలో’ పాటలోని లాలిత్యం, మృదుత్వం -‘జగమే మారినది’ లోని గాంభీర్యం, విషాదంలోని సౌఖ్యం, ప్రేయసి సుఖంగా ఉందన్న భావనవల్ల కలిగే ఆనందం, ఆమె పై ప్రేమను అణచి, ఆ ప్రేమ భావనను కేవలం స్నేహంగా ప్రకటించటం వల్ల కలిగిన విరక్తి భావనలోని సౌఖ్యం, బరువు దిగి మేఘం తొలగిన భావనలను ఘంటసాల ప్రదర్శించిన తీరు ఒక ఎత్తయితే, నాగేశ్వరరావు రామారావులకు పాట పాడే విధానంలో, పదాలు పలికే విధానంలో, భావం ప్రదర్శించటంలో, ఈ నటుల నటనలో వ్యక్తిత్వాలలో ఉన్న తేడాలను అతి సున్నితంగా స్వరం ప్రతిబించేట్టు చేయటం మరో ఎత్తు. ఇద్దరు వేర్వేరు నటులకు స్వరాన్ని వేర్వేరుగా ధ్వనింపచేస్తూ, ఆయా నటులే పాడుతున్నారన్న భ్రమను కలిగించటం సామాన్యమైన విషయం కాదు. అయితే నాగేశ్వరరావు, రామారావులు కూడా, తమ ముఖ కవళికల ద్వారా, నటన ద్వారా తామే ఆ పాట పాడుతున్న భ్రమను స్థిరపరిచారు. నటుడిపై నిలచిన గొంతు పాడే పాటతో ప్రేక్షకులను మెప్పించటం సులభం అవుతుంది.
దీనికి తోడు ‘జగమే మారినది’ పాటలో గేయ రచయిత చేసిన చమత్కారం, సంగీత దర్శకుడు ఆ చమత్కారాన్ని ప్రస్ఫుటింప చేసే రీతిలో పాటను రూపొందించటం, సరిగ్గా ఆ ప్రస్ఫుటింప చేసిన చమత్కారాన్ని తెరపై దర్శకుడు ప్రదర్శించటంతో ‘జగమే మారినది’ పాట స్థాయి ఎంతో ఎత్తుకు ఎదిగి పోతుంది. నాయిక సంతోషంగా పాట పాడే సందర్భంలో రెండవ చరణం చివరలో నాయకుడు పాడతాడు. ‘ఎదలో ఇంతటీ సంతోషమెందుకో, ఎవ్వరి కోసమో ఎందుకంత పరవశమో’ అంటూ పాడతాడు. ‘ఎదలో ఇంతటి సంతోషమెందుకో’ అనగానే ఆనందాన్ని ప్రతిబింబించే సంగీతం వస్తుంది. ఇదే ఘంటసాల పాడే సందర్భంలో ‘కమ్మని భావమే కన్నీరై చిందెను’ అని మార్చి పాడతాడు. ఇది పాట స్థాయిని, విలువను, భావాన్ని సంవేదనాత్మకతను అందనంత ఎత్తుకు ఎదిగేట్టు చేసింది. మొదటి పాటలోని ‘సంతోషం’ ‘పరవశం’ రెండవ పాటలోని ‘కమ్మని భావం’ గేయ రచయిత పాత్రలలో పరకాయ ప్రవేశం చేసి, వారి మనోభావాల సముద్రపు లోతులను అర్థం చేసుకుని రచించిన పదాలలా అనిపిస్తాయి. ‘కమ్మని భావమే కన్నీరై చిందెను’ అన్న వాక్యానికి భాష్యం రాస్తే ఓ పుస్తకం అవుతుంది. నాయకుడికి, నాయకకు అంతకు ముందు ఉన్న ప్రేయసీ ప్రియల బంధం, జీవితాంతం కలసి గడపాలనుకున్న అనుబంధం. కానీ ఇప్పుడు దాని స్వరూపం మారింది. ఇప్పుడు ఆమె మరో వ్యక్తి భార్య. ఇప్పుడు వారిది ‘స్నేహ బంధం’. ఎలాంటి వివాదాలకు తావులేక ఒకరు నొకరు సంపూర్ణంగా అర్థం చేసుకుని, ఒకరి శ్రేయస్సు మరొకరు వాంఛించే తీవ్రమైన గాఢనుబంధం. ఒకప్పటి తీవ్రమైన అనురాగానికీ, ఇప్పటి బంధానికీ పోలిక లేదు. సంపూర్ణంగా విభిన్నమైన బంధం. సూర్యుడికీ చంద్రుడికీ నడుమ ఎలాంటి తేడా ఉంటుందో అలాంటి బంధం. సూర్యుడి వెలుగు లేకపోతే చంద్రుడికి వెలుగు లేదు. సూర్యరశ్మికీ వెన్నెల వెలుగు నడుమ ఉన్న తేడా లాంటి బంధం. వారికి పూర్వ ప్రణయం లేకపోతే ఇప్పటి బంధం లేదు. కానీ అప్పటి అనుబంధానికీ ఇప్పటి బంధానికీ తేడా ఉంది. అప్పటిది సంతోషం, పరవశాలకు దారితీసే బంధం. ఇప్పటిది కమ్మటి భావం. ఎంత కమ్మటిదంటే కన్నీరు చిందించేటంత కమ్మటిది. గేయ రచయిత ఎటువంటి గేయ రచయిత! మానవ సంబంధాల సముద్ర లోతులలో అన్వేషించి, ముత్యాలు పగడాలు ఏరితెచ్చి వాటిలో మేలైనవి, ప్రజానీకానికి భావల రూపంలో పంచి పెట్టేటటువంటి కవి. కమ్మదనం అంటే ఆహ్లాదకరమైన రుచి వాసన, వాతావరణం, వగైరా వగైరా. అలాంటి ఒక భావం, కన్నీరై చిందింది. పాటలో ఈ పాదం పాడగానే చక్కటి సంగీతం వస్తుంది. కెమేరా నాయకను క్లోజప్పులో చూపిస్తుంది. ఆమె కళ్లు మూసుకుంటుంది. అది తన్మయత్వమా? కోల్పోయిన భవిష్యత్తును గుర్తుకు తెచ్చుకుంటున్నదా? మారిన పరిస్థితిని మనసులో మళ్లీ స్థిరపరుస్తోందా? ‘కమ్మని భావమే కన్నీరై చిందెను’ అని రెండో మారు అనేప్పుడు నాయకుడిని క్లోజప్పులో చూపిస్తారు. ఒకసారి కళ్లు మూసుకుని భావావేశాన్ని అదుపులో పెట్టుకుని కళ్లు తెరచి నవ్వుతూ పలుకుతాడు. అబ్బ, ఏమి నటన! పదాల భావాన్ని వదనంపై ప్రతిబింబింస్తూ, కొత్త కొత్త అర్థాలను స్ఫరింపచేస్తూ, సన్నివేశంలోని ‘ఆర్ద్రత’ను, ముంచెత్తే అర్ణవంలా మార్చి ప్రేక్షకులను భావతరంగాల తాకిడితో ఉక్కిరి బిక్కిరి చేయటం అంటే ఇదే.
‘ప్రియమగు చెలిమి సాటి లేని కలిమి’ తమ మారిన తమ బంధం స్వరూపాన్ని స్పష్టం చేశాడు. ‘ప్రియమగు చెలిమి’ నాయిక వదనంలో బాధ కనిపిస్తుంది. కళ్లు మూసుకుంటుంది. పడిపోతుంది. అంతకు ముందు ‘కమ్మని భావం’ అన్న తరువాత సంగీతం వచ్చే సమయంలో ఆమె భర్తకు అనుమానం రావటం ఆ పాత్ర కంటి కదిలికలతో స్పష్టం అవుతుంది. అద్భతమైన పాటకు, అగాధమైన రచనకు, అద్వితీయమైన గానానికి, అమోఘమైన నటనకు, ఔచితీవంతమైన చిత్రీకరణ తోడయింది.
(‘జగమే మారినది’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://youtu.be/YphehEakNew?list=RDYphehEakNew )
‘ఓహో గులాబి బాలా’ పాట దగ్గరకు వచ్చే సరికి పై రెండు పాటలకున్న సౌలభ్యాలు లేవు. సన్నివేశంలో ఉద్విగ్నత ఉంది. నాయకుడు దొంగ. నాయిక వల్ల అతడు మారతాడు. నాయికను మరొకడు ప్రేమిస్తుంటాడు. అతడు సామాజికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవాడు. అతడికి ఈ దొంగ విషయం తెలుసు. నాయిక ప్రేమిస్తున్న వాడు మంచివాడు కాదని తెలుసు. ఇదంతా పాటలో వ్యక్తపరచాలి. తనది అసూయ కాదు, తాను నిజం చెప్తూ హెచ్చరిస్తున్నాడని నమ్మకం కలిగించాలి. ఆమె పట్ల తన నిజాయితీని నిరూపించుకోవాలి.
ఓ ఓ గులాబి
వలపు తోటలో విరిసిన దానా
లేత నవ్వుల వెన్నెల సోనా!
పాట ఆరంభంలో ‘ఓ గులాబీ’ అనగానే ఆకర్షిస్తుంది. ఇంతకు ముందు చర్చించిన రెండు పాటలలో గాయకుడి స్వరం నటుడికి అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. కానీ ఈ పాటను పాడింది సుతిమెత్తని వెన్నెల కిరణాల వంటి మృదువైన స్వరం కల పి.బి. శ్రీనివాస్. పాటకు నటించింది ‘కంచు కంఠం’గా ప్రసిద్ధి పొందిన జగ్గయ్య. పాట అతి సున్నితమైనది. జగ్గయ్యకున్న ఇమేజ్ ఇందుకు భిన్నం. అంతకు ముందు పి.బి.శ్రీనివాస్ జగ్గయ్యకు పాటలు పాడినా, ఈ పాట పూర్తిగా జగ్గయ్య పైనే అధారపడిన పాట. అందుకే ఆరంభంలో లాంగ్ షాట్లో చూపిస్తారు. పి.బి.శ్రీనివాస్ స్వరం ప్రేక్షకుల ఆమెదానికి గురవుతుంది. పాట ఆకర్షిస్తుంది. తరువాత జగ్గయ్యను ‘మీడియం షాట్’లో చూపిస్తారు. తెరపై జమున వీపు కెమేరా వైపుంటుంది. పియానోను ఆనుకుని జగ్గయ్య కనిపిస్తాడు. ఇప్పటికి ప్రేక్షకుడు జగ్గయ్య పై పి.బి.శ్రీనివాస్ స్వరానికి అలవాటు పడుతాడు. ఇక పాట పాడుతున్నది తానే అని ప్రేక్షకులను నమ్మించాల్సిన బాధ్యత జగ్గయ్యదే.
‘వలపు తోటలో’ అని పి.బి. శ్రీనివాస్ పాడేప్పుడు ‘తోట’ దగ్గర దీర్ఘం తీస్తూ కాస్త స్వరస్థాయిని పెంచి ‘కణస్వరం’ వేస్తాడు పి.బి.శ్రీనివాస్. జాగ్రత్తగా వింటే ఇది తెలుస్తుంది. వినకపోయినా ‘తోట’ దగ్గర దీర్ఘానికి తగ్గట్టు తల కదిపి జగ్గయ్య అది తెలిసేట్టు చేస్తాడు. ‘విరిసిన దాన’ దగ్గర ‘న’ దగ్గర నవ్వి ‘దానా’ దీర్ఘం దగ్గర మళ్లీ లయబద్ధంగా తల కదుపుతాడు. ఈ పాట జగ్గయ్య పాడటం లేదనే వారుండరు. ఇలా, ఇంకా పాట ‘సాకీ’ దశలో ఉండగానే పాట తానే పాడుతున్న భ్రమ కలిగించటం వల్ల జగ్గయ్య, పి.బి. శ్రీనివాస్ స్వరాన్ని తనది చేసుకున్నాడు. పాట చూస్తుంటే జగ్గయ్య పాడుతున్నట్టే అనిపిస్తుంది. గాయకుడి గానం, నటుడి నటనల నడుమ సమన్వయం సాధించటం వల్ల కలిగే ఆనందానుభూతి ఇక్కడ కలుగుతుంది. ఇక తెరపై జగ్గయ్య కనబడడు. పి.బి. శ్రీనివాస్ వినబడడు. పాత్ర మనస్సులోని మాట ప్రేక్షకుడి మనస్సులో ప్రతిధ్వనిస్తుంది. జగ్గయ్య అక్కడితో ఆగడు. ‘లేత నవ్వుల వెన్నెల సోన’ అనేప్పుడు అతని హావభావాలు చూడాలి. అనుభవించాలి. ‘లేత నవ్వుల’ అని ఆరంభించినప్పుడు అతని వదనంలో గాంభీర్యం కనిపిస్తుంది. ‘నవ్వుల’ అన్నప్పుడు తనలో తాను నవ్వుకుంటున్నట్టు చేసి, ‘గులాబీ పూల’ను అపురూపంగా, అతి జాగ్రత్తగా పట్టుకుని, దీపశిఖను కాపాడుతున్నట్టు చేయి అడ్డు పెట్టి ఆప్యాయంగా ‘వెన్నెల సోన’ అంటాడు. అద్భుతమైన నటన ఇది. అంటే, పాట ఆరంభమయ్యే సరికే పాట ప్రేక్షకులను మెప్పించే కళాకారుల ప్రతిభ స్పష్టమయ్యేది. ‘లేత నవ్వుల వెన్నెల సోన’ అన్నప్పుడు జగ్గయ్య నటన ఒక్కసారి రాజ్ కపూర్‌ను తలపుకు తెస్తుంది.
‘అనాడి’ సినిమాలో ‘సబ్ కుఛ్ సీఖా హామ్ నే, న సిఖీ హోషియారీ’ అని పాట ఉంటుంది. నాయిక తనను మోసం చేసిందని, అబద్ధాలు చెప్పిందని నాయకుడికి తెలుస్తుంది. అతని హృదయం వెయ్యి వక్కలవుతుంది. మనస్సులో విషాద తరంగాలు ఎగసి పడుతుంటాయి. కానీ పైకి నవ్వుతూ పాడాల్సి ఉంటుంది.
దునియా నే కితనా సమ్ఝాయా
కోన్ హై అప్నా కోన్ పరాయా
ఫిర్ భీ దిల్ కే చోట్ ఛుపాకర్
హమ్ నే ఆప్ కా దిల్ బహలాయా
అంటూ పాడతాడు. నవ్వుతూనే ఉంటాడు పైకి. మరో వైపు విషాదం అంతర్లీనంగా చూపిస్తుంటాడు. చరణం చివరలో ‘ఫిర్ భీ దిల్ కే చోట్ ఛుపాకర్, హమ్ నే ఆప్ కా దిల్ బహలాయా’ అంటాడు. ‘మనసుకయిన గాయాన్ని దాచుకుని మిమ్మల్ని ఆనందింపచేస్తున్నాను’ అని అర్థం వస్తుంది. ఆ తరువాత ‘ఖుద్ పే మర్ మిట్నే కీ యే జిద్ హై హమారీ’ అని రెండు సార్లంటాడు. మొదటి సారి తనలో తాను తన అమాయకత్వానికి నవ్వుకుంటున్నట్టుంటాడు. అదే రెండోసారి అనేటప్పుడు రాజ్ కపూర్, నవ్వుతూనే నాయికవైపు చూస్తాడు. ఆ ‘చూపు’ గుండెల్లోకి సూటిగా దూసుకుపోయే బాణం లాంటిది. అప్పటి దాకా నవ్వుతున్న వాడు, ఆ ఒక్క ‘చూపు’తో అతని బాధను, విషాదాన్ని, అగ్రహాన్ని, కసిని, క్రోధాన్ని అన్నిటినీ చూపిస్తాడు. ‘ఓహో గులాబి బాల’ పాటలో జగ్గయ్య నటన ఆ స్థాయిలో ఉంటుంది.
(‘సబ్ కుఛ్ సీఖా హామ్ నే, న సిఖీ హోషియారీ’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=OLZoBJxlQBA )
ఆరంభంలోనే పాటను ప్రేక్షకులకు చేరువచేసి చేసి, వారి ఆమోదం పొందటంతో ఇక పాట చిత్రీకరణ సులభం అయిపోతుంది. పాటలో పదాలు ప్రదర్శించే భావాలకి తగ్గట్టు కెమేరా ఎవరెవరిని చూపించాలో చూపిస్తుంది. ఎవరెవరు ఆయా సందర్భానికి ఎలాంటి భావాలు ప్రదర్శించాలో ప్రదర్శిస్తారు. ‘నీవారెవరో తెలుసుకో’ అన్నప్పుడు నాయిక పాత్ర నాయకుడి వైపు చూస్తుంది. అదే మళ్లీ అనే సమయంలో జగ్గయ్య వేపు అయోమయంగా, సందిగ్ధంగా చూస్తుంది. ఇవి కెమేరా ప్రదర్శిస్తే చాలు.
ఈ పాట బాణీ గులాబీ పూరేకంత మెత్తగా ఉంటుంది. పదాలు మెత్తగా ఉన్నా వాడి అయిన కత్తుల్లా ఉంటాయి.
కొంటె తుమ్మెదల వలచేవూ
జుంటి తేనెలందిచేవూ
మోసం చేసి మీసం దువ్వే
మోసకారులకు లొంగేవు
నమ్మించి, మోసం చేసే మోసపు ప్రేమికుల నుంచి జాగ్రత్త పడమని యువతిని ఇంతకన్నా నిక్కచ్చిగా హెచ్చరించటం వీలు కాదు. అది అప్పటి కాలానికే కాదు ఇప్పటి కాలానికీ వర్తిస్తుంది. ప్రేమ భ్రమలో పడి నిజానిజాలు తెలుసుకోకుండా ప్రేమించి మోసపోయి ఫ్రిజ్జుల్లోను, సూట్కేసుల్లోను, బ్యాగుల్లోనూ ముక్కలు మక్కలయిపోతున్న యువతులకూ హెచ్చరికలాంటిదీ పాట.
రూపం చూసి వస్తారు
చూపుల గాలం వేస్తారు
రేకులు చిదిమి సొగసులు నులిమి
చివరకు ద్రోహం చేస్తారు.
ప్రతి యువతికీ, యుక్తవయసు వచ్చినప్పటి నుంచీ రోజూ జాతీయ గీతంలా వినిపించి, నరనరాన అర్థం జీర్ణించేట్టు చేయాల్సిన పాట ఇది. మగవాడిని చూసి భయపడటం కాదు, తన జాగ్రత్తల్లో తానుండటం నేర్పాలి. పైపై భ్రమలకు లొంగిపోవటం కాదు, లోతైన ఆలోచనలతో, అవగాహనతో జీవితాలను తీర్చిదిద్దుకునే విచక్షణను నేర్పే పాట ఇది. క్షణికావేశానికి లొంగే బదులు, గతవర్తమాన భవిష్యత్తుల గురించిన ఆలోచనతో, కొంటె తుమ్మెదల ఆకర్షణ నుంచి తప్పించుకుని, మోసకారులకు లొంగకుండా, చూపుల గాలలకు చిక్కకుండా, ద్రోహం చేసే వారిని తప్పించుకోమని నాడు చేసిన హెచ్చరిక ప్రాసంగిత ఈనాడు మరింతగా ఉండటం కవికి ‘ద్రష్టత్వాన్ని’ ఆపాదిస్తుంది. సినిమా సందర్భంలో ఒదుగుతూ, సార్వజనీనమైన భావాలను ప్రదర్శించిన పాట ఇది. సమాజహితం కోరే కవులు రచించిన పాటలు తరాలు మారినా వాటి ప్రాధాన్యతే హెచ్చుతుంది తప్ప తగ్గదనటానికి ఈ పాట నిదర్శనం.
ఈ పాటలో గమనించాల్సిన అంశం పి.బి.శ్రీనివాస్ పాడిన విధానం. సుతిమెత్తని పూరేకు అతి మృదువుగా నేలను తాకినట్టు అతని స్వరం హృదయాన్ని తాకి, హృదయలోతులలో స్పందన కలిగిస్తుంది. ప్రతి పదం ఆయన పలికిన విధానంతో, పలికించిన భావంతో, నూతనార్థాలను సంతరించుకుని మెదడులో అవగాహనా దీపాలను వెలిగిస్తాయి. హృదయంతో ఆనందతాండవం చేయిస్తాయి. గులాబి బాల, అన్నప్పుడు ‘బాల’ ని పలికినప్పటి మృదుత్వం, ‘మాల’ అనేప్పుడు వేసిన అలంకారం, పాటను సుందరంగా అలంకృతం చేస్తాయి. పాటలో విషాదం ధ్వనింపచేస్తూ, బాధను పలికిస్తూ, హెచ్చరికను తీయ్యని పూతపూసిన చేదు నిజంలా పలకటం.. పరమాద్భుతమైన గాన సంవిధానం. ఇతర గాయకుల జిలుగు వెలుగులో ఈ గాయకుడి ప్రతిభను సినీ పరిశ్రమ సరిగ్గా వాడుకోలేదనిపిస్తుందీ పాట వింటుంటే.
ఇలా అన్ని రంగాల కళాకారులు తమ కళాసృజనను అత్యుత్తమ స్థాయిలో, నిజాయితీగా, సమాజ హితాన్ని దృష్టిలో ఉంచుకుని సృజించటం వల్లనే ఆనాటి కళాకారుల కళ ఈనాటికీ సజీవంగా ఉంది. ఆ కళాకారులు చిరంజీవుల్లా మన హృదయాలలో సజీవంగా నిలుస్తూ మన వెంటే నడుస్తూ మార్గదర్శనం చేస్తున్నారు. సాంత్వననిస్తున్నారు. కన్నీరు తుడుస్తున్నారు. హుషారునిస్తున్నారు. జీవిత సత్యాలు బోధిస్తున్నారు. మన నిత్యజీవితంలో అవిభాజ్యమైన అంగమైపోయారు.
(‘ఓహో గులాబి బాలా’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=VBpU16Z7T3I )
(మళ్ళీ కలుద్దాం)
