Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మధురగీతాలు – మనోహరదృశ్యాలు-40

[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]

పదిమందిలో పాట పాడినా
అది అంకితమెవరో ఒకరికే
విరితోటలో పూలెన్ని పూసినా
గుడికి చేరేది నూటికి ఒకటే

‘ఆనంద నిలయం’ సినిమాలో హీరో పియానోపై పాడే,  మధురరసం అణువణువునా చిప్పిల్లే సుందరమైన గీతం ఇది. పాట మొదటి పాదం వినగానే ‘అబ్బ’ ఎంత బాగా రాశాడు అనిపిస్తుంది. ఎంత సార్వజనీక సత్యం చెప్పాడు అనిపిస్తుంది. మొదటి పాదం చెప్పిన సత్యాన్ని రెండవ పాదం ఉదాహరణతో బలపరుస్తుంది. అతి చక్కని పల్లవితో పాట ఆరంభమవుతుంది.

‘ఆనంద నిలయం’ సినిమాలో ఈ పాట కోసం సన్నివేశాన్ని సృష్టించారనవచ్చు. నిజానికి పాటకు పెద్ద సందర్భం ఉండదు. హీరో తండ్రితో విభేధించి ఇల్లు వదలి వస్తాడు. ఓ ధనవంతుల ఇంట్లో మేనేజర్ పని దొరుకుతుంది. అతడు అంతకు ముందే నాయికను ప్రేమిస్తాడు. కానీ ఆమె అతడిని అపార్థం చేసుకుంటుంది. కానీ అతడికి ఆమె మీద ప్రేమ తగ్గదు. ఇక్కడ అతడు పని చేస్తున్న ఇంట్లో ఓ యువతి ఉంటుంది. ఆమె ఇతడంటే ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటుంది. ఒక గంభీరమైన సన్నివేశం తరువాత హఠాత్తుగా ప్రారంభమవుతుంది పాట. పాట పాడతాడు. పాట అయిపోగానే అందరూ చప్పట్లు కొడతారు. దృశ్యం మారిపోతుంది.ఇంతే. ఆంటే, పాటకోసమే దృశ్యం అన్నమాట.

పాట కన్నా ముందు వచ్చే సన్నివేశంలో నాయిక తన తప్పు గ్రహిస్తుంది. నాయకుడు తననే ప్రేమిస్తున్నాడనీ, తానే అపార్థం చేసుకున్నదనీ గ్రహిస్తుంది. తాను చేసిన తప్పుకు ‘ఆయనే కాదు దేవుడు కూడా నన్ను క్షమించలేడు’ అంటుంది నాయిక. దృశ్యం మారుతుంది. పియానో మోగుతుంది. హీరో పియానో దగ్గర కూర్చుంటాడు. పక్కన అతడిని ఇష్టపడే యువతి ఉంటుంది. వెనుక ఆ యువతి తల్లి, అతడి యజమానురాలు ఉంటుంది. ఆమె ప్రవర్తన కూడా అతడితో ఏదోలా ఉంటుంది. తెరపై ఈ  మూడు ప్రధాన పాత్రలను చూపిస్తుండగా హియానో నోట్స్ వినిపిస్తూంటాయి. తగ్గ దృశ్యాలు కనిపిస్తుంటాయి. తెరపై పాట ఆరంభమవుతుంది. పాట పల్లవితో తొలి పాదంలోనే నాయకుడి హృదయం స్పష్టమైపోతుంది. ఆ గదిలో ఎంతో మంది ఉంటారు. అతడిని ఇష్టపడే యువతి ఆ పాట తన గురించి అనుకుటుంది. కానీ, అది అతడు తనని అవమానించినా పట్టించుకోకుండా, ప్రేమిస్తున్న యువతి గురించే అని పాట కాస్త తరువాత నాయకుడు ఊహిస్తున్నట్టు చూపి, నాయిక కూడా అక్కడున్నట్టు నాయకుడు ఊహిస్తున్నట్టు చూపుతాడు.

ఒక పాట ప్రేక్షకులకు నచ్చాలంటే సందర్భం ఉండాలి పాటకు. కానీ ఇక్కడ సందర్భం ఏర్పాటు చేసినది. కథాగమనానికి  పాటతో ఏ మాత్రం సంబంధం లేదు. కేవలం హీరోకు నాయిక పట్ల ప్రేమలో ఏమీ మార్పు లేదని నిరూపించటానికి తప్ప పాటకు మరో లక్ష్యం, ఉద్దేశాలు లేవు. ఈ పాట తీసేసినా కథాగమనానికి ఏమీ లోటురాదు.  కానీ సంగీత దర్శకుడు, గేయ రచయిత, గాయకుడు కలసి ఈ పాటను ఒక అద్భుతమైన పాటగా మలచారు. సినిమా వ్యాపారవిలువను పెంచేపాట ఇది.

‘పదిమందిలో పాట పాడినా’ పాటను సంగీత దర్శకుడు పెండ్యాల అభేరీ రాగంలో రూపొందించాడు. హిందుస్తానీ సంగీతంలో దీనికి ‘భీమ్ పలాసి’ సమానరాగం. అందుకే పాటలో హియానో నోట్స్, వయెలిన్ కదలికలు పలు హిందీ పాటలను తలపుకు తెస్తాయి. సినిమా పాటలలో ఏ రాగాన్ని శుద్ధరాగంగా వాడరు. దాన్లో ఇతర రాగాలు కలుస్తూంటాయి. అందుకే ఈ పాట ఆరంభం, ఇంటర్ల్యూడ్ సంగీతం వింటుంటే ఓ వైపు ‘మేరే మహబుబ్’ సినిమాలో ‘ఏయ్ హుస్న్ జరా జాగ్’ (యమన్ కళ్యాణ్), ‘రామ్ ఔర్ శ్యామ్’ సినిమాలో ‘ఆజ్ కీ రాత్ మేరే దిల్ కీ సలామీ లేలే’ (పహడీ), ‘యే కౌన్ ఆయా రోషన్ హోగయీ’ (సాథీ) లాంటి హిందీ పాటలు గుర్తుకు వస్తాయి. కానీ ‘పది మందిలో పాట’ దేనికీ  అనుకరణ కాదు. స్వతంత్రమైన అతి చక్కటి పాట. అతి చక్కని బాణీ, అతి చక్కని వాయిద్యాల కలయికతో కూడుకున్న మృదు మధురమైన పాట.

అభేరీ రాగ లక్షణం కరుణ, భక్తి రసాలను అతి సుందరంగా పలుకుతుంది. భావోద్వేగ పూరితమైన అందమైన రాగం. ఈ పాట వింటుంటేనే మనసంతా హాయితో నిండిపోతుంది. ప్రశాంత భావన హృదయాన్ని క్రమ్ముకుంటుంది.  ఒకరమైన సంపూర్ణ సమర్పణ భక్తి భావనను అతి నిర్మలంగా, మనోహరంగా ప్రదర్శిస్తుంది పాట. ఎంత మంది ఎదరుగా ఉన్నా ప్రేమలో ఉన్న వాడికి ప్రేయసి తప్ప మరేమీ కనబడదు.

‘యాద్ తూ ఆయే మన్ హోజాయే భీడ్ కే బీచ్ అకేలా’ అంటాడు నీరజ్ ‘ప్రేమ్ పూజారి’ సినిమాలో,  ‘ఫూలోం కీ రంగ్ సే’ పాటలో. అంటే చుట్టూ ఎంతో మంది ఉన్నా ఆమె జ్ఞాపకం రాగానే, అతడి మనసు అందరి నడుమ ఒంటరి అయిపోతుందట. కాబట్టి పాట పదిమందిలో పాడినా వంద వేల మంది నడుమ పాడినా అంకితం ఒకరికే. రెండవ పాదం ఈ భావనను ఉదాహరణతో బలపరుస్తుంది. తోటలో పూలెన్నో ఉంటాయి. కానీ దేవుడి పాదల చెంత నిలిచేవి కొన్నే. దేవుడి మెడలో హారమయ్యేవి కొన్ని మాత్రమే, అంటే పల్లవిలోనే తానీ పాట అందరి ముందు పాడుతున్నా తన మనసులో ఉన్నది నాయికనే అని స్పష్టం చేస్తున్నాడు హీరో.

గోపాలుని కెంత మంది గోపికలున్నా
గుండెలోన నెలకొన్న రాధ ఒక్కటే
ఆకాశ వీధిలో తారలెన్ని ఉన్నా
అందాల జాబిల్లి అసలు ఒక్కటే..

చెప్పిన విషయాన్ని మరింత నొక్కి చెప్పాడు. చక్కటి ఉదాహరణలతో పాటలో ద్విత్వాక్షరాలు అతి తక్కువగా ఉండటం వల్ల, ఉన్నవి కూడా పదే పదే రీపీట్ అవుతుండటంతో పాట కదలికూ ఒక ఊపు వస్తుంది. చెవులకు అతి సుందరంగా ధ్వనిస్తాయి పదాలు. ‘గోపికలున్నా, నెలకొన్న తారలెన్ని ఉన్నా’ పలుకుతుంటే మధురంగా ఉంటుంది. బాణీలో ఒదిగి పదాలు  -మెలికలు తిరేగే దారుల్లో చుట్టూ సుందరమైన ప్రకృతి దృశ్యాలను చూస్తూ ఆనందిస్తూ నెమ్మదిగా ప్రయాణిస్తున్న భావనను కలిగిస్తాయి.

ఏడాదిలో ఎన్ని ఋతువులున్ననూ
వేడుక చేసే వసంత మొక్కటే
నా కన్నులందు ఎన్నివేల కాంతులున్ననూ
ఆ కలిమి కారణం నీ ప్రమ ఒక్కటే

అదే భావనను మరిన్ని ఉదాహరణలతో చెప్తున్నాడు అతి సుందరంగా. మళ్లీ మాటి మాటికీ వచ్చే ద్విత్వాక్షరంతో  అందంగా చెప్పాడు గేయ రచయిత ఆరుద్ర. దాంతో పాట వింటుంటే ఒక వేగం అనుభవిస్తాడు శ్రోత. ఆ వేగం పాటలో కన్నా శ్రోత మనసులోని వేగం. అది పాటలో పదాలు కల్పించిన వేగం. మనసు అనుభవిస్తుంది.

ఇక ఘంటసాల పాడిన విధానం, శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం ఉన్న గాయకుడు ఒక గీతానికి ఎన్ని అందాలు జోడించగలడో తెలుసుకోవటానికి పాఠ్య పుస్తకం లాంటిది. తన స్వరాన్ని మృదువుగా చేసి పాట పాడేడు. ఎంత మృదువుగా అంటే,  ‘పది మందిలో పాట పాడినా’ అని దగ్గర కూర్చుని ఏదో జీవిత సత్యం వివరిస్తున్నంత మృదువుగా! ఇక పాటలో ‘పాడినా’, ‘ప్రేమించినా’, ‘ఒక్కరే’ దగ్గర అలంకారాలు అద్భుతం అనిపిస్తాయి. పాట ఎంతో సన్నిహితమైన భావన కలిగిస్తాయి. ‘ఒకటే’ దగ్గర ‘అలంకారం’ పాటకు మరింత చేరువ చేస్తుంది. గమనిస్తే ఒక పల్లవిలో గమకాలు, కణస్వరాలు, నోట్స్‌ను కలిపే దీర్ఘాలు (మీండ్).. ఎన్నెన్ని వాడేడంటే, పాటలు పాడటం నేర్చుకోవాలనుకునే వారికి ‘ట్యూటోరియల్’ లాంటిది ఈ పాట. ఇలా ఈ పాటను మరుపురాని పాటగా చేయటంలో గాయకుడి పాత్ర ఎంతో ఉంది.

పాట చిత్రీకరణలో చాలెంజ్‌లు ఏమీ లేకపోయినా, ఇప్పుడు చూస్తుంటే కథనాయకుడు కాంతారావు నటన అతిగా, హాస్యాస్పదంగా  అనిపిస్తుంది. అప్పటికే నటుడిగా అతడి ‘చార్మ్’ తగ్గిపోయింది. ఇంకొన్నాళ్లలో కాంతారావు ‘విలన్’గా నటించి ఎంతో మంది అభిమానులకు తీరని బాధను కలిగించాడు.

(‘పదిమందిలో పాట పాడినా’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=KPSewL3i_cE )

‘ఆనంద నిలయం’ విడుదలకు రెండేళ్ల ముందు ఘంటసాల పాడిన మరో అమర పియానో గీతం తెరపైకి వచ్చింది. ఈ పాటకు సినిమాలో చక్కని సందర్భం ఉంది. అయితే ఈ పాట సందర్భ పరిధి దాటి, వీధి విధీనా మారుమ్రోగింది. ఎంతగా, ఈ పాట ప్రజల మనస్సులు  దోచిందంటే, ఆ కాలమే కాదు, ఇటీవలి కాలంవరకూ  రైళ్లల్లో గుడ్డి బిచ్చగాళ్లు పాటలు పాడుతూ అడుక్కునేంత వరకూ ప్రతి ఒక్కరూ పాడిన పాట ఇది. చివరికి ఒక దశలో ఈ పాట ‘బిచ్చగాళ్ల పాట’ అయిపోయింది. అంతగా ప్రజాదరణ పొందిన అద్భుతమైన పాట. గమనించాల్సిందేమిటంటే, ఈ పాటలో ఘంటసాల స్వరం! ‘పదిమందిలో పాట పాడినా’ పాటలో స్వరం, ఈ పాటలో స్వరం నడుమ ఎంత తేడా!

భలేమంచి రోజు, పసందైన రోజు
వసంతాలు పూచే నేటి రోజు.. ఆ.. ఆయ్
వసంతాలు పూచే నేటి రోజు

‘జరిగిన కథ’ అపార్థ ప్రేమల సినిమా. ప్రసాద్ (జగ్గయ్య) శాంత పాత్రను ప్రేమిస్తాడు. తమ్ముడు ఆమె ప్రేమించుకున్నారని తెలిసి తన ప్రేమ త్యాగం చేస్తాడు ప్రసాద్. అసలు నిజం తెలియక ముందు ఆమె మీద ప్రేమ భావన వల్ల సంతోషంగా పాడతాడీ పాటను. అంతకు ముందు దృశ్యంలో వాళ్లమ్మ ఉన్నప్పుడెలా కళకళలాదేదో  శాంత రాక వల్ల పూజామందిరం అలా  కళకళలాడుతోందంటాడు. పెళ్లెందుకు చేసుకోలేదన్న ప్రశ్నకు ‘అనుకూలవతి దొరక్క’ అంటాడు. ‘ప్రయత్నం చేయకపోతే ఎలా దొరుకుతుంది?’ అన్న ప్రశ్న వేస్తుంది. అప్పుడు పక్కనే ఉన్న వారు ఆమెను  పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనను ప్రతిపాదిస్తారు. ఆ తరువాత ప్రసాద్ వాళ్ల అమ్మ గొలుసు ఆమెకు ఇస్తాడు. తరువాత దృశ్యంలో ఈ పాట పాడతాడు. అతని ఆనందాన్ని ప్రతిబింబిస్తుంది పాట.

గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు
గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు
నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలచిన రోజు

‘పది మందిలో పాట పాడినా’ అన్న పాటలో ‘ఒక్కటే’ అన్న పదం వాడుకతో ‘విరోధాభాస’ను కలిగించి, ఎంత మంది ఉన్నా, అతని మనసులో ఉన్నది ‘ఒక్కటే’ అన్న భావన కలిగించినట్టు,  ఈ పాటలో ‘రోజు’ అన్న పదం పాటంతా వస్తూ ఆ రోజు ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తుంది. నొక్కి చెప్తుంది. ఆ రోజు ప్రాధాన్యం ఏమిటంటే, వాళ్ల అమ్మ ప్రసాద్ పెళ్ల గురించి కన్న కలలు, నిజమవుతున్నాయి. అతని మనసులో తన భార్య గురించి ఉన్న ఆలోచన రూపం ధరించి అతనికి అందిన రోజు. అందుకే గుండెలో కోరికలు గువ్వలై గూటికి  చేరాయి. నింగిలోని అందాలు ముంగిటిలో నిలచాయని అంటున్నాడు హీరో.

చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు
తొలి వలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు
కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు..
భలేమంచి రోజు

ఇన్ని ఆశలు కోరికలు తీరిన రోజు భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే రోజు కాకపోతే ఇంకేమవుతుంది? గాలి వీయటం, నీరు పారటం ఎంత స్వాభావికంగా సంభవిస్తాయో, పాట బాణీ, పదాలు, భావాలు అంత హాయిగా సాగిపోతాయి. మనసును మురిపిస్తాయి.

‘భలే మంచి రోజు’ సంగీత దర్శకుడు ఘంటసాల. ఈ పాట ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేసే ‘మోహన రాగం’లో రూపొందించాడు ఘంటసాల. అందుకే ఆనందంగా ఆహ్లాదంగా అనిపిస్తుంది పాట వింటుంటే.  పాట చిత్రీకరణ చాలా సులభం.

ఓ వైపు తను ఇష్టపడిన అమ్మాయి తన భార్య అవుతుందన్న ఆనందంలో ఆహ్లాదంగా గానం చేస్తుంటాడు ప్రసాద్. ఇంటర్ల్యూడ్ సంగీతం వచ్చే సమయంలో ఆమె అతని తమ్ముడిని ప్రేమిస్తున్నదని, వారి ఆటపాటలు చూపిస్తూంటాడు. అంటే ఓ వైపు  ఆనందం, వెంటే పొంచి ఉన్న విషాదం అన్న మాట. అందుకే ఆరంభంలో పియానో గంభీరంగా మ్రోగుతుంది. ఏదో చెడు జరగబోతోందన్న భావన కలిగిస్తుంది. పాట ఆహ్లాదకరంగా హాయిగా సాగుతుంది. చిత్రీకరణలో పెద్ద సమస్యలేమీ లేవు. జగ్గయ్య చాలాకీగా పాటకు తగ్గట్టుగా నటిస్తాడు.

ఘంటసాల గాన సంవిధానాన్ని గమనిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన పదాలు పలకటం, వాటిలో భావాన్ని గొంతులో పలికించటం, ‘నవ్విన రోజు’ అన్నప్పుడు ‘నవ్వు’ను పాటలో భాగం చేయటం, ‘ఆ హాయ్’ అన్నప్పుడు ఆ హాయి. సంతోషం చివరిలో రాగాలాపనలో ఒకరమైన సంతోషం.. అన్నీ అత్భుతం. ఒకే గాయకుడు ‘భలే మంచి రోజు’, ‘పది మందిలో’ లాంటి రెండు భిన్నమైన పాటలను ఇంత భిన్నంగా, వైవిధ్యభరితంగా పాడగలగటం అదీ వేర్వేరు వ్యక్తులకు పాడుతూ, వారే పాడుతున్న భ్రమను, ‘మిమిక్రీ’ చేయకుండా కలిగించటం అద్బుతం. ఆ కాలంలో నటుల క్లోజప్పులు అధికంగా ఉండేవి. అందుకని నటులు ముఖంలో భావాలు తగ్గట్టు పలికిస్తే నటుడే పాడిన భ్రమ కలిగించటం  సులభమయ్యేది.

ఈ రెండు పాటలనూ పోలిస్తే సామాన్యుడికి ‘భలే మంచి రోజు’ పాట పాడటం సులభం. భావ ప్రకటన కూడా సులభం. పెద్ద అలంకారాలు క్లిష్టమైనవి లేవు. భావం సార్వజనీనం. అదే ‘పది మందిలో పాట’ మాములుగా పాడుకోవచ్చు. కానీ ఘంటసాలలా అలంకారాలు వేసి పాడటం అందరికీ సాధ్యం కాదు.

(‘భలేమంచి రోజు పసందైన రోజు’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=QchMYtu3N4U )

పాటపై గాయకుడి ప్రభావం, ఆ నటుడి ప్రభావం అర్థం కావాలంటే ‘జరిగిన కథ’ కన్నడ భాష లోని ‘నన్న  థమ్మ’ సినిమాలో ‘భలే మంచి రోజు’ బాణీలోనే ఉన్న ‘ఇదే హోస హాడు’ పాట చూడాలి. తెలుగు, కన్నడ పాటలను వెంట వెంటనే విని పరిశీలిస్తే, నటుడి నటనా సంవిధానం, గాయకుడి పాడే విధానం; అదే బాణీ, అదే భావం కాని పాట ప్రభావాన్ని ఎంతగా మార్పు చెందిస్తాయో బోధపడుతుంది.

కన్నడలో ‘ఇదే హోస హాడు’ పాటను పి.బి. శ్రీనివాస్ పాడేడు. తెలుగు కన్నా వేగంగా అనిపిస్తుంది కన్నడ పాట. కన్నడ రాజ్ కుమార్ నటన జగ్గయ్యకు పూర్తిగా భిన్నం. జగ్గయ్యలో లేని చురుకుదనం, విశ్వాసం రాజ్ కుమార్‌లో కనిపిస్తాయి. పి.బి.శ్రీనివాస్ పాట పాడిన విధానంలో కూడా తేడా కనిపిస్తుంది. ఏ మాత్రం ఘంటసాలను అనుకరించే ప్రయత్నం చేయకుండా తన ప్రత్యేకను ప్రదర్శిస్తూ పాడేడు పి.బి.శ్రీనివాస్. తను పాడకుండా పి.బి.శ్రీనివాస్‍తో పాడించటంలో ఘంటసాల ‘ప్రతిభ’ తెలుస్తుంది. తెలుగులో ఘంటసాల ‘బృందావని నవ్విన రోజు’ అని నవ్వితే ‘మైమరసి నగిసో హాడు’ అన్నప్పుడు ‘మైమరసి’లో మైమరపు పలికిస్తాడు పి.బి.శ్రీనివాస్. ఇద్దరి రాగాలాపాన కూడా వేరుగా ఉంటుంది.

ఇక్కడే మనకు కళాకారులు కళకు తమ వ్యక్తిత్వాన్ని ఆపాదించటం కనిపిస్తుంది. ఎవ్వరూ ఎవ్వరి కన్నా గొప్ప కాదు, తక్కువ కాదు. ఎవరి స్థాయి వారిదే. భలే మంచి రోజు ఆహ్లాదం కలిగిస్తే, ‘ఇదే హోస హాడు’ ఆనందం కలిగిస్తుంది. ‘పదిమందిలో పాట పాడినా’ మైమరపిస్తుంది. ఏ పాట గొప్పదనం ఆ పాటే. ఇది తీయలేము. అది కాదనలేము. కళాకారుడు బ్రహ్మ.  కళ ఆనందం. ఆనందో బ్రహ్మ.

(‘ఇదే హోస హాడు’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=3GmMLKfS72U )

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version