Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మధురగీతాలు – మనోహరదృశ్యాలు-41

[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]

మీకు మీరే మాకు మేమే
ఎందుకీ వస వస నస నస

తెలుగులో ‘మాయాబజార్’ తరువాత మరో అతి గొప్ప చిత్రం, తరతరాల ప్రేక్షకులంతా కలసి చూస్తూ, ఆనందిస్తూ, చూసిన ప్రతిసారి కొత్త కొత్త అర్థాలను తెలుసుకుంటూ పరమానందం అనుభవించగల మరొక గొప్ప సినిమా ‘మిస్సమ్మ’. ఒకప్పటి తెలుగు సినిమా వైభవాన్ని, అది సినిమాటిక్‌గా అందుకున్న ఎత్తులను ప్రపంచానికి ప్రదర్శించేందుకు ఈ రెండు సినిమాలు చాలు. ‘మిస్సమ్మ’ సినిమాలో మొత్తం 11 పాటలున్నాయి, క్రికెట్ జట్టులో 11 సభ్యుల్లాగా. కానీ క్రికెట్ జట్టులో 12వ ఆటగాడు కూడా ఉంటాడు (ఇటీవలి IPL కాలంలో IMPACT PLAYER అంటున్నారు) ఈ ఆటగాడు ఆటగాడిగా పరిగణనకు గురవకుండానే ఆటను ప్రభావితం చేయగలగుతాడు. అలాంటి పన్నెండవ పాట కాని పాట ‘మిస్సమ్మ’ లోని ఈ పాట.

‘మిస్సమ్మ’ సినిమాలో  ‘పియానో’ ఒక ప్రధాన పాత్ర. సినిమాలోని 12 పాటలలో (‘మీకు మీరే’తో సహా) అయిదు పాటలలో పియానో ప్రధాన పాత్ర. నాయికా నాయకుల కోపాలు తాపాలు, విసుర్లు, ఎత్తుకు పై ఎత్తులు, మాటకు మాటలు, ప్రేమ ప్రకటనలు, అసూయలు అన్నిట్లో పియానో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

‘తెలుసుకొనవె చెల్లీ’ అని పాడుతూ మగవాళ్లకు దూరంగా ఉండాలి, లేకపోతే వాళ్లు అలుసుగా భావించి చులకనచేస్తారని  నాయిక నాయకుడిపై విసుర్లు విసురుతుంది, పియానో వద్ద నుంచే. దానికి ప్రతిగా ‘తెలుసుకొనవె యువతీ’ అంటూ నాయకుడు అలకలు, మూతి ముడుపుల కాలం చెల్లిందని, ప్రేమగా పలకరించటమే ఉత్తమం అని తన వంతు విసుర్లు విసిరిందీ  పియానో వద్ద నుంచే.

‘కావాలంటే ఇస్తాలే, నావన్నీ ఇక నీవేలే’ అంటూ పరోక్షంగా, నాయకుడు ప్రేమ ప్రకటించేదీ పియానో వద్ద నుంచే. నాయకుడు, రెండో నాయకుడికీ అసూయ కలిగించి. ఆ పై పుండు మీద కారం అద్దినట్టు ‘ఎందుకే రాధా ఈసునసూయలు, అందములందరి ఆనందములే’ అనే అద్భుతమైన గీతం గానం చేసేది పియానో వద్ద నుంచే.

కావాలంటే ఇస్తాలే పాట లింకు

చివరికి తన ప్రేయసిని ఆకర్షించేందుకు రెండవ నాయకుడు తానూ పాడటం నేర్చుకోవాలనుకుంటాడు. అలా నేర్చుకోవాలన్న ప్రయత్నం తెలుగు సినిమా చరిత్రలో ప్రాత్రల వ్యక్తిత్వాల ఆధారంగా సృజించిన అత్యత్భుతమైన హాస్య సన్నివేశం (character driven situational comedy) గా రూపొందింది. సినిమాలో కథ కన్నా పాత్రల వ్యక్తిత్వ రూపకల్పన సరిగ్గా ఉంటే, స్క్రిప్టు రచనలో ఆయా వ్యక్తిత్వాల ప్రదర్శన కోసం సన్నివేశాలు రూపొందిస్తే, ఒక సన్నివేశం నుంచి మరో సన్నివేశం బావిలో ఊట ఊరినట్టు ఊరుతూ సినిమాను గమ్యం వైపు పరుగులు తీయిస్తుందని నిరూపిస్తుందీ దృశ్యం.

‘మిస్సమ్మ’ ఒక బెంగాలీ నాటకం. రవీంద్రనాథ్ మైత్ర 1932లో ‘మన్మోయీ గర్ల్స్ స్కూల్’  నాటకం రాశాడు. 1935లో అది సినిమాగా వచ్చింది. 1955లో తెలుగులో సినిమాగా వచ్చి ఘన విజయం సాధించింది. 1958లో బెంగాలీలో ‘మన్మోయీ గర్ల్స్ స్కూల్’ సినిమా వచ్చింది. ‘మిస్సమ్మ’ను 1957లో ‘మిస్ మేరీ’గా హిందీలో నిర్మించారు.  ‘మిస్సమ్మ’ను తిరగేసి బాపు, రమణలు, ‘పెళ్లి పుస్తకం’ సినిమాగా రూపొందించి ఘన విజయం సాదించారు.

తెలుగు ‘మిస్సమ్మ’ మిగతా అన్ని భాషల ‘మిస్సమ్మ’కన్నా ఎత్తున నిలబడుతుంది. ఇందుకు ప్రధాన కారణం పాత్రల వ్యక్తిత్వాలను నిర్దుష్టంగా రూపొందించిన స్క్రిప్టు. అయితే, ఆయా పాత్రలలో జీవించిన నటీనటులు మరో ప్రధాన కారణం. ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది ‘మీకు మీరే మాకు మేమే’ సన్నివేశం.

‘మిస్సమ్మ’ సినిమాలో ‘రాజు’ పాత్ర చాలా చక్కగా రూపొందించిన  పాత్ర. అతడు డిడెక్టివ్ అనుకుంటాడు. ఏమీ తెలియకున్నా అన్నీ తెలుసనుకుంటాడు. ఎంతగా అమాయకుడంటే తెలుగు సమాజంలో ‘తైలం’ అన్న మాటకు కొత్త అర్థం రావటంలో రేలంగి పాత్రతో కలసి తన వంతు బాధ్యత నిర్వహించిన వాడు. అతడికి పాట రాదు. కానీ మహాలక్ష్మి, రావు మాస్టారి వైపు ఆకర్షితురాలవుతున్నదని భావించి ఆమెను తన వైపు ఆకర్షించేందుకు పాట నేర్చుకోవాలనుకుని, అది ఎంతో సులభం అని అనుకునేంత అమాయకుడు.

రావు పాత్ర పరిణితి చెందిన పాత్ర. ఇది అతని ప్రవర్తనలో ప్రతి అడుగులో కనిపిస్తుంటుంది. నాయిక ‘మేరీ’ పట్టుదల, తొందరపాటు, కోపం, అసూయ వంటివి ఉన్న మంచి అమ్మాయి. సున్నిత మనస్కురాలు. ఇవన్నీ ‘స్క్రిప్టు’ ఒక్క మాట ఎదుటివారితో అనిపించకుండా సన్నివేశాల ద్వారా ప్రదర్శిస్తుంది. ‘దేవయ్య’ పాత్ర ఎలాగోలా జీవించేయగల మనిషి. ఎటంటే అటు మాట తిప్పగల మనిషి. కానీ మంచివాడు. రావు పట్ల విధేయత కలవాడు. డిటెక్టివ్ అంటే చులకన భావం కలవాడు. మేరీ పట్ల గౌరవాభిమానాలున్నవాడు. ఆమెను అర్థం చేసుకున్నవాడు. ఈ మూడు పాత్రల అధారంగా రాజు సంగీతం నేర్చుకోవాలన్న కోరిక అధారంగా ఈ హాస్య సన్నివేశాన్ని సృజించారు.

ముందుగా తాను పియానో వద్ద కూర్చుని శృతి చూసుకుంటుంది మేరీ. ఆమె పియానోపై వాయించే సమయంలో రాజు పాత్ర కాస్త బెరుకుగా కదులుతూంటుంది, ఆ పాత్ర nervousness ని చూపిస్తూ, నాయిక పాటకు ముందు స్వరాలు పలుకుతుంది.

ఈపాట చిత్రీకరణలో పెద్ద గిమ్మిక్కులు లేకపోయినా, కెమేరా ఒక్కో పాత్రను అవసరార్ధం తెరపై ప్రదర్శిస్తూంటుంది. అలా ఒక్కొక్క పాత్రనూ చూపిస్తూ, అన్ని పాత్రలు తెరపైకి వచ్చాక, అన్ని పాత్రలనూ తెరపై చూపిస్తూ, ప్రతి ఒక్క పాత్ర హావభావాలను చూస్తూ పడీ పడీ నవ్వే వీలును కలిగిస్తుంది.

సాని సరిమ రీని సస

ఇక్కడే హాస్యం ఆరంభమవుతుంది. నాయిక ‘లీల’ గొంతు అద్భుతంగా స్వరాలు పలుకుతుంది. రాజు పాత్ర తడబడి, మేకపోతు గాంభీర్యంతో మళ్లీ ‘ఓసారి’ అంటాడు. ఇక్కడ పెద్ద హాస్యం లేదు.

పాప పమ పమ పమ పమ పస

ఇక్కడి నుంచీ హాస్యం మొదలవుతుంది. నాయిక పాడుతుంటే అంతలోనే స్వర్గద్వారం వరకూ వెళ్లి వచ్చేస్తాడు ప్రేక్షకుడు. వెంటనే ఆ ఆనందం పాడటం తెలియని రాజు పాత్ర గొంతు విని విరుగుతుంది. నవ్వు తన్నుకు వస్తుంది. దీనికి తోడు, ఆ పాత్ర తన దోషాన్ని  పక్కనే ఉన్న దేవయ్య మీద ఆపాదించటం, ఇంకా హాస్యం కలిగిస్తుంది. దేవయ్య ప్రోత్సాహకరంగా పలికే పలుకుల్లో వ్యంగ్యం ఇంకా హాస్యం కలిగిస్తుంది.

రాజు పాత్ర పాప పసలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న సమయంలో రావు పాత్ర ప్రవేశిస్తుంది. అడుగు పెట్టి ఒక్క నిమిషం ఆగి, కళ్లెగరేసి, జేబులో చేతులు పెట్టకోవటంలోనే ఆ పాత్ర భావనలు ప్రేక్షకుడికి తెలిసిపోతాయి. ఇంకా అధికమైన హాస్యాన్ని అనుభవించేందుకు మానసికంగా సిద్ధమైపోతాడు ప్రేక్షకుడు.

ఎపుడయితే రావు వెళ్లి పియానో దగ్గర నుంచుంటాడో, గమనించకుండా రాజు ‘పసపన’ అంటూ చివరి ‘స’ దగ్గర కాలెత్తి నేలను తొక్కుతూ ‘పస’ అంటాడో నవ్వు ఆగదు. ఇక్కడ కూడా రావు పాత్ర ప్రోత్సాహ వచనాల్లో ప్రోత్సాహం కన్నా వ్యంగ్యం ఎక్కువుంటుంది. ఇది గ్రహించిన మేరీ, రావును వెళ్లమంటుంది. ఇక్కడి నుంచి హాస్యం చూసి అనుభవించాల్సిందే. తలచుకుని  తలచుకుని నవ్వుకుంటూండాల్సిందే. ముఖ్యంగా రాజు పాత్రలో నాగేశ్వరరావు నటించేడనే కన్నా జీవించాడనవచ్చు. ఆయనకు నిజంగా పెద్దగా పాటలో ప్రవేశం లేకపోవటం ఈ సన్నివేశం మరపురానిదిగా ఎదగటంలో ఎంతగానో తోడ్పడింది.

ప్రతి ఒక్క నటుడు ఈ సన్నివేశాన్ని ‘హాస్యమయం’ చేయటంలో తమ వంతు పాత్ర సమర్ధవంతంగా పోషించారు. దేవయ్య అడ్డుగా నిలబడటం, గొడుగు తేవటం.., రాజు గొడుగు క్రింద నుంచి, పై నుంచి చూడటం, మేరీ పాత్ర రుసరుసలు, బుసబుసలు; రావు పాత్ర గంభీరమైన ప్రవర్తన, అల్లరి చూపులు.. ఒకటేమిటి, ఈ రెండున్నర నిమిషాల దృశ్యం ఒక గొప్ప హాస్య గీతం అంత. స్క్రిప్ట్  రచయిత, నటీనటులు, దర్శకుడు. సంగీత దర్శకుడు ప్రతి ఒక్కరూ కలసి, పాట కాని పాటను ‘సూపర్ హిట్’ చేశారు. 12వ ఆటగాడు బరిలో దిగి క్యాచులు పట్టి రనౌట్లు చేసి ఆట గెలిపించినట్టు, ఇంపాక్ట్ ఆటగాడు వచ్చి సెంచురీ చేసి గెలిపించినట్టు, ఈ రెండున్నర నిమిషాల పాట కాని పాట సన్నివేశం మరపురాని ఆనందకరమైన అనుభూతిని తరతరాలుగా కలిగిస్తోంది.

‘మిస్సమ్మ’ హిందీలో ‘మిస్ మేరీ’ అయింది. కానీ ఈ దృశ్యం హిందీలో  అంతగా పండలేదు. కారణాలనేకం.  మీనాకుమారి నటన కృత్రిమంగా అనిపించటం, జెమినీ గణేశన్‌లో ఎన్టీయార్ ‘చార్మ్’ లేకపోవటం; ఓంప్రకాశ్‌లో రేలంగి హాస్యం  కనబడకపోవటంతో పాటూ విలనీ కనబడటం,  పాటరాని నాగేశ్వరరావు పాట పాడాలని ప్రయత్నిస్తే కలిగే హాస్యం, పిచ్చి కూతలు వేసినా మధుర గీతంలా ధ్వనించే కిశోర్ కుమార్ పాట రానట్టు నటించాలని విఫల ప్రయత్నం చేయటం కూడా హిందీలో ఈ సన్నివేశం పండకపోవటానికి కారణాలు. ముఖ్యంగా నాగేశ్వరరావు  పాట పాడలేకపోవటం సహజంగా అనిపించి నవ్విస్తుంది. కానీ కిశోర్ కుమార్ పాట పాడలేకపోవటం అసహజంగా, కృత్రిమంగా, తెచ్చిపెట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఈలోపం గ్రహించినట్టు, కిశోర్ కుమార్‌కు ప్రత్యేకంగా ఓ పాట పెట్టారు. హిందీలో ‘గానా నా ఆయా బజాన  నా ఆయా..’ అంటూ. కిశోర్ ఎంత అల్లరి చేసినా పాట బాగుంటుంది కానీ హాస్యం కనబడదు.

‘మీకు మీరే మాకు మేమే’ను హిందీలో ‘ఖుష్ యహాఁ హమ్, ఖుష్ వహాఁ తుమ్, కిస్ లియే ఫిర్ తెరీ మేరి దుష్మనీ’ అంటూ లతా మంగేష్కర్ పాడింది. కానీ తెలుగులో ‘మీకు మీరే’ లో ‘మీరే’ దగ్గర, ‘మాకు మేమే’లో ‘మేమే’ దగ్గర ‘లీల’ గొంతు తీగ సాగినట్టు సాగి, మెరుపు వంపులు తిరుగుతుంది. అతి సున్నితంగా అద్భుతంగా అనిపిస్తుంది. నాలికపై తేనె బిందువులు నాట్యం చేస్తుంటే ఎలా ఉంటుందో, చెవులలో ఆ స్వరాలు ధ్వనిస్తుంటే అలా ఉంటుంది. మనస్సు మయూరమైపోతుంది. ఆ కొద్ది సేపు పోలిస్తే లత పాట కన్నా ‘లీల’పాట బాగా అనిపిస్తుంది. ‘ఎందుకీ వసవస రుస బుస’? ( ఈ పాట పాడింది లీల కాదు, స్వయంగా సావిత్రి పాడిందని శ్రీ గోనుగుంట మురళీకృష్ణ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్య ను చూడండి. ఒకవేళ అదే నిజమయితే, కొంచెమే అయినా సావిత్రి అద్భుతంగా పాడింది. ఈ పొరపాటుకు క్షంతవ్యులము)

‘మీకు  మీరే మాకు మేమే’ బాణీకి మూలం 1937లో వచ్చిన హిందీ సినిమా ‘వహాఁ’ సినిమాలో  శాంతా ఆప్టే పాడిన ‘హర్ గలీ మే హైఁ బగీచే, ఫూల్ ఫల్ హై సబ్ రస్ రస్ రస్’ అన్న పండిత నరోత్తమ రావు రచించిన పాట. ఆ కాలంలో పెద్ద సంచలనం సృష్టించిందీ పాట. ఈ పాట పల్లవి మాత్రం తీసుకున్నారు తెలుగులో. ఈ సినిమా నేపథ్య సంగీతంపై ‘ఆవారా’ సినిమా పాటల ప్రభావం స్పష్టంగా తెలుస్తూంటుంది.

‘వహా’ సినిమాలోని ‘హర్ గలీ మే హై బగీచే’ పాట లింక్..విని ఆనందించండి.

ఇతర సినిమాలలో ‘పియానో’ పాట సమయంలోనే వాడుకుంటే ‘మిస్సమ్మ’లో మాత్రం ‘పియానో’ ఓ పాత్రగా ఎదిగింప చేశారు. అందుకే తెలుగులో ‘పియానో’ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ‘మిస్సమ్మ’ సినిమా అందులోని పాటలు.

(‘మీకు మీరే మాకు మేమే’ సన్నివేశాన్ని యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=RkWdNT7i4Rg )

Images Credit: Internet

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version