Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మధురగీతాలు – మనోహరదృశ్యాలు-43

[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]

ఓ సాథీ రే,
తేరే బినా భీ క్యా జీనా
ఫూలోం మే కలియోం మే
సప్నోం కీ గలియోం మే
తెరే బినా కుఛ్ కహీ నా
తెరే బినా భీ క్యా జీనా

ముఖద్దర్ కా సికందర్’ సినిమాలో ‘ఓ సాథీ రే’ పాట అనగానే, విషాద గంభీర స్వరంలో కిశోర్ కుమార్ పాడిన   పాట గుర్తుకు వస్తుంది. ఎమోషన్స్‌తో, సున్నిత భావాలు ప్రదర్శిస్తున్న అమితాబ్ స్టేజిపై పాడిన పాట గుర్తుకు వస్తుంది. ఆ పాట సందర్భం అటువంటిది. చిన్నప్పుడు ‘మేమ్ సాబ్’ అంటూ ఆరాధించిన ఆమెను, అప్పటి నుంచీ  ప్రేమిస్తూ, ఆమె కోసం ఎదురు చూస్తూ, ఆమెకు తాను తగనని భావిస్తూ, అయినా ప్రేమిస్తూనే ఉన్న అమితాబ్ పాత్ర, ఇప్పుడు ధనవంతుడైనా, తనని తాను తక్కువగా భావిస్తూ నాయిక ఎదురుగా పాడే అత్యంత ఎమోషనల్ సందర్భంలో పాట గుర్తుకు వస్తుంది. ఈ సినిమాలో ఈ పాటను అతడు ఆమె ధనవంతురాలిగా, తాను సేవకుడిగా ఉన్నప్పుడు వింటాడు. తాను ధనవంతుడై, ఆమె పేదగా ఉన్నప్పుడు పాడతాడు.

పాత సినిమాల స్క్రిప్టు రచనను పరిశీలిస్తే పాత్రలను, సన్నివేశాలను, క్రమ పద్ధతిలో తీర్చిదిద్దటం కనిపిస్తుంది. పాత్రల నడుమ సంబంధాన్ని లాజికల్‌గా అభివృద్ధి చేయటం కనిపిస్తుంది. సినిమా నిడివి పెరిగినా, పాత్రల వ్యక్తిత్వాలను ప్రేక్షకులకు చేరువ చేస్తాయీదృశ్యాలు. కాస్త అసంబద్ధంగా అనిపించినా ఆ కాలంలోనే కాదు, ఇప్పుడూ బాగా పండుతాయి దృశ్యాలు.

మన హీరో అనాథ. అనుకోకుండా ఓ ధనవంతుడితో పరిచయమవుతుంది. అతడి దగ్గర పనివాడిగా చేరతాడు. అతడి కూతురు ‘కామ్నా’ ఈ పిల్లవాడిపై ‘జాలి’ చూపిస్తుంది. నిరాదరణ, అనాదరణ మాత్రమే తెలిసిన పిల్లవాడు, ఆమె జాలిని ‘ప్రేమ’ అనుకుంటాడు. ఆమెని ప్రేమిస్తాడు. కానీ ‘కామ్నా’ తండ్రికి ఇలాంటి ఆవారా, ‘గందీ నాలీ కే కీడా’ లంటే అసహ్యం. కామ్నా వాళ్లు ఊరు వదలి బొంబాయి వెళ్లారని తెలిసి వాళ్లని వెతుకుతూ బొంబాయి చేరతాడు. అనుకోని పరిస్థితులలో వాళ్లింటికే వెళ్తాడు. ఆమె పుట్టినరోజు నాడు అంతకు ముందు తాను విరగొట్టిన బొమ్మను బహుమతిగా ఇవ్వాలని వెళ్తాడు. ‘దొంగ’ అని ఇంట్లోంచి గెంటెస్తారు. అయినా సరే ఆ బొమ్మను పట్టకుని పుట్టినరోజు నాడు ఇంటికి వెళ్తాడు. పుట్టినరోజు సందర్భంగా పాప,  అంటే మన హీరో ‘మేమ్ సాబ్’ పాడే పాట అన్న మాట ఇది.

ఈ పాట సెంటిమెంటల్, ఎమోషనల్ విలువలు పెంచేందుకు స్క్రిప్టు ఆరంభం నుంచీ సన్నివేశాలు సృష్టిస్తూ ఒక build up ఇస్తుంది. ఇప్పటి సినిమాల స్క్రిప్టు రచనలో ప్రధానంగా కొట్టొచ్చినట్టు కనబడే లోపం ఈ build up. అంటే ఒక ప్రధాన ఎమోషనల్ దృశ్యాన్ని ఎంచుకుని goal directed scene creation అన్నది ఇప్పటి స్క్రిప్టుల్లో కనబడదు. ఒక సినిమాలోనే పలు లక్ష్యాలుంటాయన్న మాట. ప్రధాన కథ అనే  నదికి ఉప నదుల్లాంటివి ఇవి.

‘ముఖద్దర్ కా సికందర్’ సినిమాలో ప్రధాన ప్రేమ కథ సికందర్, కామ్నాలది. సికందర్, కామ్నాని గాఢంగా ప్రేమించటం, ఆమె పట్ల ఒక యజమానిపై సేవకుడికి ఉండే తీవ్రమైన ఆరాధన భావం ఉండటాన్ని ప్రేక్షకుడు అర్థం చేసుకోవాలి. అయితే, కామ్నా దృష్టిలో సింకదర్ సేవకుడు, దొంగ. ఎంత ధనవంతుడయినా ఆమెకు అతడంటే సదభిప్రాయం ఉండదు. అంటే సికందర్ ప్రేమ భగ్నం అవటం తప్పనిసరి అన్నమాట. ‘ఓ సాథీ రే’ పాట భగ్న ప్రేమకు పరాకాష్ఠ. ఈ పాట ప్రభావం పెరిగేందుకు సినిమాలో ముందరే కొన్ని దృశ్యాలు సృష్టించారు. పాప పిల్లవాడిపై జాలి చూపటం, పిల్లవాడు పాప పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపటం వంటి దృశ్యాలు.  ముందరే  పిల్లవాడికి పియానోపై వాళ్లమ్మ పాడే ఈ  పాట పాప కొన్ని నోట్స్ వినిపిస్తుంది. అది ‘ఓ సాథీ రే’ పాట.

 పుట్టినరోజు నాడు పాపకు బహుమతిగా ఇచ్చేందుకు గతంలో తాను విరగొట్టిన బొమ్మను పట్టుకొస్తాడు పిల్లవాడు. కానీ లోపలకు పోలేడు. వారి నడుమ ఉన్న అంతస్తు తేడాలను ప్రస్ఫుటం చేస్తూ, సికందర్ పాత్రపై జాలి పెరిగే రీతిలో ‘పియానో’పై ఆమె పాడే ‘ఓ సాథీ రే’ పాటను చిత్రీకరిస్తారు. పాట ప్రేక్షకుడి మనస్సులో స్థిరపడుతుంది. దాంతో పెరిగిన తరువాత సికందర్ ధనవంతుడయినా న్యూనతా భావంతో తన ప్రేమను అదేపాట  ‘ఓ సాథీ రే’ పాట రూపంలో వ్యక్తపరచటం, నాయిక అతడిని గుర్తించటం ప్రేక్షకుడిని స్పందింపచేస్తాయి. అయితే ఆమె అప్పటికే మరొకరిని ప్రేమిస్తున్నదని ప్రేక్షకుడికి తెలుసు. కాబట్టి, సికందర్ పాత్ర పట్ల సానుభూతి మరింత పెరుగుతుంది. ‘ముఖద్దర్ కా సికందర్’ సినిమా  స్క్రిప్టు రచయిత విజయ కౌల్, అతి చక్కగా సికందర్ పాత్రను ఈ పాట ద్వారా ఒక ఉన్నత స్థాయి పై నిలిపేందుకు బీజం ఆరంభంలోనే వేశారు, ఆశా భోస్లే పాడిన ‘ఓ సాథీ రే’ పాటతో.

‘ఓ సాథీ రే’ పాట శివరంజని రాగం ఆధారంగా సృజించిన పాట. శివరంజని రాగం ఎమోషన్స్, విషాదాలను అత్యద్భుతంగా ప్రతిబింబిస్తుంది. తీవ్రమైన నిరాశలో ఉన్న వారికి ఉపశమనం కలిగిస్తుందీ హై పిచ్ విషాద రాగం. కిశోర్ కుమార్ పాడిన రెండు శివరంజని రాగ ఆధారిత గీతాలు ఎన్నటికీ మరుపురానివి. అవి ఒకటి ‘ఓ సాథీ రే’ రెండవది ‘మేరే నైనా సావన్ భాదో’. గమనిస్తే ‘మేరే నైనా’ పాటను లతా కూడా పాడింది. ‘ఓ సాథీ రే’ ఆశా భోస్లే కూడా పాడింది.

‘ముఖద్దర్ కా సికందర్’ సినిమాలో రెండు పియానో పాటలున్నాయి. ఆరంభంలో ‘ఆశా భోస్లే’ అతి మధురంగా చిన్న పిల్లకు సరిపోయే రీతిలో చక్కగా పాడిన ‘ఓ సాథీ రే’ పాట. ఇది సినిమాకు కీలకం.

లతా పాడిన పియానో పాట, తేనెలూరే పాట., ‘దిల్ తో హై దిల్’ పాట వింటుంటే,  లత స్వర తరంగాలు తీపి తేనియగా రూపొంతరం చెంది, ఆ తేనియ తీపి స్వర తరంగాలు  అణువణువునా కరిగిపోయి చెవుల ద్వారా హృదయంలో చేరి,  అక్కడ  ఒక  తీపి జల్లుగా నూతన రూపం ధరించి తేనె వర్షం కురిసినట్టనిపిస్తుంది.   నాయిక పియానోపై పాడుతుంటే,  ఇద్దరు నాయకులూ  ఆమె తన  గురించి పాడుతున్నట్టు భ్రమిస్తారు. అది సినిమాలో అపోహను మరింత నాటకీయం చేస్తుంది. ఉద్విగ్నతను మరింత సాంద్రతరం చేస్తుంది. గతంలో పలు హిందీ సినిమాలలో హీరో పియానోపై పాడుతూంటే, ఇద్దరు నాయికలు అది తమ గురించే అనుకుని పొరబడతారు. దాన్ని తిరగేస్తే, నాయిక పాడుతూంటే, ఇద్దరు హీరోలు తమగురించే అనుకుంటారు.

జానే కైసే అన్‌జానే హీ, ఆన్ బసా కోయీ ప్యాసే మన్ మే
అప్నా సబ్ కుఛ్ , ఖో భైఠే హైఁ, పాగల్ మన్ కే పాగల్‍పన్ మే
దిల్ కె అఫ్‌సానే, మై జానూఁ తూ జానే, ఔర్ యే జానే కోయీ నా

ఇది పెద్దలు పాడాల్సిన  ప్రేమ గీతం. కానీ సినిమాలో చిన్న పిల్ల పాడుతుంది. దానికి ఓ సెంటిమెంటు కథను జోడించారు. ఇది వాళ్ల అమ్మ పాడే పాట. అమ్మ చనిపోతుంది. పాప పియానో నేర్చుకుంటుంది. ఈ పాటను పుట్టిన రోజు పాడమని వాళ్ల నాన్న కోరతాడు. పాప పాడుతుంది. పాప ఈ పాట పాడుతున్న సమయంలో వాళ్ల నాన్న గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడు.

ఈ పాటలో గమనించాల్సిన అంశం ఆశా తన స్వరాన్ని ఓ పదేళ్ల పాపకు తగ్గట్టుగా మలచి పాడటం. మామూలుగా ఆశా భోస్లే పాటల్లో చూపించే వగలు, కవ్వింపు వంటివేవీ ఆమె స్వరం పలకదు. పూర్తిగా ఒక పదేళ్ల పిల్ల పాట నేర్చుకుని పాడితే ఎలా పాడుతుందో అలాగే పాడుతుంది. పదాలు పలికే విధానం కూడా మార్చింది. ‘ఓ సాథీ రే’ అంటూ దీర్ఘం తీసినప్పుడు ఎలాంటి అలంకారాలు లేకుండా ‘బినా’ అన్నప్పుడు ముక్కుతో ‘న’ దగ్గర వొత్తి పలకటంతో వినగానే ఇది మామూలు హీరోయిన్ల ప్రేమ గీతం కాదని తెలిసిపోతుంది. కలియోం, గలియోం దగ్గర పిల్లలు కాస్త ఒత్తి పలికినట్టు పలుకుతుంది. ‘క్యా’ అని ప్రతిసారీ భిన్నంగా పలుకుతుంది. అప్పుడప్పుడు అలంకారం వేసినా పిల్లల్లాగే పలుకుతుంది. దాంతో పాట ఒక రోమాంటిక్ పాటలాగా కాక, ఎంతో పవిత్రంగా అనిపిస్తుంది. పాట మొత్తం ఇలా కొన్ని పదాలు ఒత్తి పలకటం, కొన్ని చోట్ల అలంకారాలు వేయటం, ఎక్కడా ‘అతి’ చేయకపోవటం గమనించవచ్చు. ఆశా భోస్లే పాడిన గొప్ప పాటలనగానే ముందు ‘ఓ.పి. నయ్యర్’, తరువాత ఆర్డీ బర్మన్ పాటల గురించి చెప్తారు. లేకపోతే ఖయ్యామ్ రూపొందించిన ‘ఉమ్రావ్ జాన్’ పాటలు చెప్తారు. కానీ ఆశా భోస్లే గాన సంవిధానంలోని మరో కోణాన్ని ‘ఓ సాథీ రే’ పాట చూపిస్తుంది. చిన్న పిల్ల పాడే రోమాంటిక్ పాట ఇది. ఇదే పాట  యువ నటి పైన చిత్రించి ఉంటే, ఆశా తనకి అలవాటయిన రీతిలో పాడి ఉండేది.

వక్త్’ సినిమాలో ‘కోన్ ఆయా’ పాటలో పాటను సాధన, పియానో వాయిస్తూ పాడే చరణం  ‘కిస్కే ఖ్వాబోం నే  మేరీ రాతోం సే కుఛ్ మాంగా హై’ అనేప్పుడు ఆశా స్వరం సినిమాలో సాధన పాత్ర వ్యక్తిత్వాన్ని దృష్టిలో ఉంచుకుని సభ్యతా సరిహద్దులలోనే శృంగారం చిలికిస్తుంది. ఇదే సినిమాలో పియానో పై పాడిన పాటే ‘చెహెరే పె ఖుషీ ఛా జాతీ హై’ పాట నాయిక వదనంపై కనిపించే ‘ఖుషీ’ని ఇనుమడింప చేస్తుంది ఆశా స్వరం.

నర్తకి’ సినిమాలో నాయకుడు తనంటే ఇష్టపడుతున్నాడని తెలిసిన నాయిక పియానోపై ‘ఆజ్ దునియా బడీ సుహానీ హై’ అంటూ ఆశా స్వరంలో పాడుతుంది. ఈ పాటలో ఆశా స్వరం ప్రతి పదంలో వగలు వొలకబోస్తుంది. అవకాశం దొరికినప్పుడల్లా గమకాలు  గుప్పిస్తుంది. స్వరంలో రోమాన్స్ చిందులు తొక్కుతూంటుంది.

‘జిందగీ ఔర్ మౌత్’ సినిమాలో సి. రామచంద్ర సృజించిన అతి మృదువైన, సుందరమైన ‘దిల్ లగాకర్ హమ్ యె సుమఝే’ పాటలో ఎటువంటి భావాలు ప్రదర్శించని నాయిక కోసం ఎన్నెన్నో భావాలు చిలికిస్తూ ఆతి మృదువైన భావాల పదాలను అంతకన్నా  మృదువుగా, సుందరమైన అలంకారాలతో సుందర శృంగార ఉద్యానవనంలా, చివరికి నిరాశ ప్రేమ గీతంలా  మార్చింది ఆశా భోస్లే.

ప్యార్ సచ్చా హై మేరా తో దేఖ్ లేనా  ఏయ్  సనమ్
ఆప్ ఆకర్ తోడ్ దేంగే ఖుద్ మేరీ జంజీర్-ఎ-గమ్
బందా పర్‍వర్ జాన్ లేంగే  బందగీ క్యా చీజ్ హై

‘దిల్ లగా కర్’ పాటలో ఈ చరణం ఆశా పాడిన విధానం చాలా గొప్పగా ఉంటుంది. ఎన్నెన్నో భిన్నమైన భావాలను కలబోసి ఒక్కో పదాన్ని పలుకుతుంది.

ధుంధ్’ సినిమాలో ఆయోమయంలో ఉండి దిక్కుతోచని స్థితిలో,  అప్పటికే ‘దమ్ మారో దమ్’ అంటూ యువ హృదయాలను గిలిగింతలు పెట్టిన జీనత్,  విషాదంగా ‘ఉల్ఝన్ సుల్ఝే నా’ అంటూ పాడే అతి చక్కని పియానో పాటలో, పాత్ర సందిగ్ధాన్ని తన స్వరంలో ఎంత గొప్పగా పలికించిందటే,  నటి వదనంలో కనబడే భావం  కన్నా అధికమైన ‘జాలి’ కలిగేట్టు చేస్తుంది ఆశా స్వరం.

హర్ ధడ్‌కన్ మే ప్యాస్ హై తేరీ,
సాంసోం మే తేరీ  ఖుష్బూ హై
ఇస్ ధరతీ సే ఉస్ అంబర్ తక్,
మేరీ నజర్ మే తూ హీ తూ హై
ప్యార్ యే టూటే నా, తూ ముఝ్ సే రూఠే నా
సాథ్ యే ఛూటే, కభీ నా

చిన్నపిల్ల పెద్ద మాటలు మాట్లాడినట్టుంటుందీ చరణం. కానీ చిన్నపిల్ల పెద్దలు నేర్పితే పాడింది అన్న భావన కలిగిస్తుంది ఆశా స్వరం.

తుమ్ బిన్ జోగన్ మేరీ రాతే, తుఝ్ బిన్ మేరీ దిన్ బంజారే
మేరా జీవన్ జల్తీ ధూనీ, బుఝె బుఝె మేరే సప్నే సారే
తేరా బినా మేరీ, మేరే బినా తేరీ
యే జిందగీ జిందగీ నా

‘ఆశా భోస్లే’ ఈ పాటను పాడిన విధానంలో గొప్పతనం, పాట సందర్భాన్ని, పాత్రనూ దృష్టిలో ఉంచుకుని చేసిన చమత్కారాలు అర్థం కావాలంటే ఆశా పాట విన్న తరువాత కిశోర్ కుమార్ పాట వినాలి. ఆ పై మళ్లీ ఆశా పాట వినాలి. అదే పాటను ఇద్దరూ ఎంత విభిన్నంగా తమదైన ప్రత్యేక శైలిలో పాడేరో గమనిస్తే చిన్నపిల్ల పాత్ర కోసం పాడటం కోసం తన స్వరాన్ని ఎంతగా నియంత్రణలో ఉంచుకుని ఆశా పాడిందో అర్థమవుతుంది(ఆశా పాట విన్న తరువాత కిశోర్ పాట మరీ loudగా అనిపిస్తే దోషం గాయనీ గాయకులది కాదు, సందర్భానిది). పాటలో పదాలు పలకటం నుంచి, దీర్ఘాలు, రాగాలు, గమకాలు సర్వం పూర్తిగా పాత్రలో లీనమైపోయి, పూర్తి నియంత్రణతో పాడటం తెలుస్తుంది. కానీ సందర్భం వల్ల, సాధారణంగా పురుష పాత్ర పాట కుండే అధిక ఆకర్షణ వల్ల, కిశోర్ కుమార్ వల్ల, అమితాబ్‌కి ఉన్న ఆకర్షణ వల్ల, పురుష పాత్రధారి పాట వీధి వీధినా మ్రోగింది. ఆశా భోస్లే తన మామూలు పాటలకు భిన్నంగా పాడిన అతి గొప్ప పాట అంతగా ప్రచారానికి రాని పాటలా మిగిలిపోయింది.

తన పాటల ద్వారా ఆశా తనకొక ఇమేజ్‌ని సృష్టించుకుంది. ఎన్నెన్ని విభిన్నమైన రకాల పాటలను అలవోకగా పాడినా ఆశా భోస్లే పాటలనగానే అధికంగా హెలెన్‌కు పాడిన పాటలు ప్రస్తావిస్తారు. ఆర్ఢీ బర్మన్, ఓ.పి. నయ్యర్‌ల పాటలను పదే పదే ప్రస్తావిస్తారు. కానీ ఆ పాటలలో కన్నా, ఆశా ప్రతిభ ఇలా కుదురుగా పియానో దగ్గర కూర్చుని పాడిన  అర్థవంతమైన పాటలలో,  అతి సున్నితమైన భావాలు ప్రకటిస్తూ, పాత్ర మనోభావాలను తన స్వరం ద్వారా ఉద్దీపింప చేస్తూ,  అత్యంత స్వర నియంత్రణను ప్రదర్శిస్తూ పాడిన పాటలలోనే ఆశాభోస్లే గాన సంవిధానంలోని అద్వితీయ ప్రతిభ ద్యోతకమవుతుంది.

ఆశా సినీ జీవితంలో  ఆమెను విమర్శించారు ఎంతో మంది. ఆమెపై వ్యక్తిగతంగా వ్యాఖ్యానించారు అనేకులు. ఆమె జీవితంలో  అనేక వివాదాలున్నాయి. ఓ.పి.నయ్యర్‌తో సంబంధం, ఆర్డీ బర్మన్‌తో అనుబంధం, ఆర్డీ బర్మన్ తల్లిని ఆశా ఆదరించకపోవటం  వంటి  ఆరోపణల ద్వారా ఆశా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించారనేకులు. వ్యక్తిగతంగా కూడా ఆమె మొదటి వివాహం చేదు అనుభవం, లతాతో పోటీ, కొన్నాళ్ళు ఆమె, లతా మాట్లాడుకోకపోవటం,  ఆర్ఢీ మరణం, ముగ్గురు పిల్లల్లో ఒక అబ్బాయి, అమ్మాయి మరణం వంటి అనేక విషాదాలు ఆశాను మానసికంగా దెబ్బ తీసినా, ఆశా పైకి హాయిగా ఆడుతూ పాడుతూ ‘జిందగీ ఏక్ సఫర్ హై సుహానా’ అన్నట్టే గడిపింది. నవ్వుతూ తుళ్లుతూ, నర్తిస్తూ, ఆనందిస్తూ గడిపింది. గుండెల్లో గూడుకట్టుకున్న విషాదాలను, నిరాశలను తన పాటలలో అవకాశం దొరికినప్పుడల్లా పలికిస్తూ సాంత్వన పొందింది.  అందుకే పాట పియానోపై చిత్రించారో లేదో తెలియదు కానీ పియానోపై వింటుంటే అత్యద్భుతంగా వినిపించే  ‘ప్రాణ్ జాయే పర్ వచన్ నా జాయే’ సినిమాలో  పాట ఆశా హృదయాన్ని ఆవిష్కరిస్తుందనిపిస్తుంది.  సినిమాలోని ఈ పాట ఆశా హృదయానికి, గాన సంవిధానానికి భారతీయ సినీ గేయ ప్రపంచంలో, నిజజీవితంలో ఆశా అనుభవించిన ఆవేదనలు,   సంవేదనలకు అత్యద్భుతమైన తార్కాణంలా నిలుస్తుంది.

చైన్ సే హమ్ కో కభీ ఆప్ నే జీనే నా దియా
జహర్ భీ  చాహ అగర్ పీనా తో పీనే నా  దియా

ఈ పాటకు ఆశా భోస్లేకు అవార్డు వచ్చింది. కానీ ఆశా ఆ అవార్డును తిరస్కరించింది. చివరికి సినిమాలోంచి కూడా ఈ పాటను తొలగించటంతో పాటను, ఎలా చిత్రీకరించారో కూడా తెలియదు. అందుకే, దూరదర్శన్‌లో ఆశా ఈ పాట పాడినప్పుడు, ఈ పాట ఆశాకు ప్రతీకగా ఎదిగింది. ఆమె వ్యక్తిగత జీవితానికి ప్రతినిధిగా భావిస్తూన్నారు.

ఆప్ కా గమ్ జో ఇస్ దిల్ మే, దిన్ రాత్ అగర్ హోగా
సోచ్ కే యే దమ్ ఘుట్ తా హై, ఫిర్ కైసే గుజర్ హోగా
కాశ్ న ఆతీ అప్‌నీ జుదాయీ, మౌత్  హీ ఆజాతీ
కోయీ బహానే చైన్ హమారీ, రూహ్ తో పా జాతీ
ఏక్ పల్ హసనా కభీ, దిల్ కి లగీ నే  న దియా

ఆశా భోస్లే, ఆత్మ  అమరలోకంలో లత, రఫీ, ముకేశ్, కిశోర్ కుమార్, శంకర్ జైకిషన్, ఎస్డీ బర్మన్, ఓ.పి. నయ్యర్ లతో సహా పలు కళాకారులతో ప్రశాంతంగా సంగీత సభలో పాల్గొంటూ,  శాంతిని ఆనందాన్ని పొందుతూండి ఉంటుంది. ‘కోయీ బహనే చైన్ హమారీ రూహ్ తో పా జాతీ.’ భూమిని సంగీత స్వర్గం చేసిన వారంతా ఇప్పుడు స్వర్గలోకంలో అమరులై, అమరులకు  గానామృతాన్ని పంచుతున్నట్టున్నారు.

~

(ఆశా భోస్లే పాడిన ‘ఓ సాథీ రే’ పాట (సినిమా నుండి) వీడియో విడిగా యూట్యూబ్‌లో లభించలేదు. ‘ముఖద్దర్ కా సికందర్’ సినిమా వీడియో నుంచి 15.36  వద్ద పాట చిత్రీకరణ  చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=XPEwqPlGFj8 )

కళ్ళు మూసుకుని పాటను వింటూ ఆశా స్వరతరంగాల ద్వారా అందే అమృతాన్ని గుండెల నిండా నింపుకోవాలనుకునేవారు  ఆశా   పాటను ఇక్కడ వినవచ్చు.

కిశోర్ కుమార్ పాడిన ‘ఓ సాథిరే’ పాటను ఈ లింకులో వినండి.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version