Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మధురగీతాలు – మనోహరదృశ్యాలు-46

[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]

మనసున మనసై, బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యమూ, అదే స్వర్గమూ..

ఏమి కాలమది? గంధర్వులంతా కూడబలుక్కుని సరస్వతీ దేవి అర్చన కోసం మానవ రూపంలో భూమి పైకి వచ్చిన కాలం అది. తమ సృజనాత్మక కళావిష్కరణతో భూమిని స్వర్గంలా  మలచాలని ప్రయత్నించి భావితరాలకు అత్యుత్తమ ప్రామాణికాలను ఏర్పరచిన కాలమది.

పాట ముందరి సితార్ నోట్స్ చెవులబడగానే మనసు ఆనంద పరవశమైపోతుంది. హృదయపు లోలోతుల్లో అలవి కాని వేదన ఉబికి వస్తుంది. మానవ జీవితంలో, పైకి మనిషి ఎంత సంతృప్తిగా, ప్రశాంతంగా ఉన్నాననుకుంటున్నా, ఎక్కడో ఓ మూల ఉండే అసంతృప్తి జ్వాలపై నుండి చల్లని శీతల పవనం వీచిన భావన కలిగి సాంత్వన కలుగుతుంది.

‘డాక్టర్ చక్రవర్తి’ సినిమా  మధురమైన పాటల పేటీ. ఒకదాన్ని మించి మరొక పాట ఆ సినిమాలో. ప్రతి పాట హృదయాన్ని తాకేదే. కానీ ‘మనసున మనసై’ పాట మాత్రం హృదయం లోలోతుల్లో స్పందన కలిగిస్తూ. హృదయంలో సూక్ష్మరూపంలో ఉన్న జీవుడిని కదిలిస్తుంది.

ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఒంటరిగానే వస్తాడు. ఒంటరిగానే వెళ్తాడు. కానీ ఈ నడుమ ప్రయాణంలో తోడు కోరుకుంటాడు. అది తనను పూర్తిగా అర్థం చేసుకుని, తన కష్టసుఖాలలో తోడుండి, కలసి ఎదిగే ధార్మిక ప్రయాణంలో అడుగులో అడుగు కదిపే స్త్రీ తోడు. ఈ సృష్టి పూర్ణానుస్వారమయితే, స్త్రీ పురుషులిద్దరూ చెరి అర్ధభాగాలు. ఈ రెండు అర్ధభాగాలు కలవనిదే సృష్టి సంపూర్ణం కాదు. వైవాహిక వ్యవస్థ లక్ష్యం  ఇది. వ్యక్తికి తోడు నీడ, భాగ్యమూ, స్వర్గమూ లభించేది వివాహబంధంలోనే. ‘కల్ తక్ జో బేగానే థే, జన్మోంకే మీత్ రే’ అంటుందొక హిందీపాట.. నిన్నటిదాకా అపరిచితమైన వ్యక్తి, ఈరోజు, అంటే వివాహం అవగానే జన్మజన్మల తోడు(స్నేహితుడు, ప్రియుడు) అని అర్ధం.  ఎవరికయితే ఈ తోడూ నీడా వివాహంలో లభిస్తుందో వారు ధన్యులు. వివాహబంధానికావల తోడు లభించినవాడు శాపోపహతుడు. ఎక్కడా లభించనివాడు దురదృష్టవంతుడు.

కానీ నిజం ఎప్పుడూ   అనుకున్నట్టుండదు.

“There can be no disparity in marriage like unsuitability of mind and purpose” అంటాడు Charles Dickens ‘David Copperfield’ నవలలో. అనేక వివాహాలలో ఈ suitability of mind and purpose అంటే intellectual and moral compatibility ఉండదు కాబట్టి ‘మనసున మనసై’ అందరినీ అంతగా కదిలిస్తుంది. మురిపిస్తుంది. ఆనందింప చేస్తుంది. మనసులలో   విషాదాన్ని నింపుతుంది. అలవి కాని ఆవేదనను, అందనిదేదో అందకుండా పోతోందన్న తపనను  కలిగిస్తుంది.

‘డాక్టర్ చక్రవర్తి’ సినిమాలో హీరో ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుంటాడు. ఆ పెళ్లి చేసుకున్నామెతో unsuitability of mind and purpose తో బాధపడుతుంటాడు. ఆమెకు  కూడా ఇతడితో అదే బాధ. కానీ మన సినిమాలు అధికంగా పురుష దృష్టి ప్రధానమైనవి కావటంతో ఆమె హీరోని హింసించే విలన్ అవుతుంది. హీరో ఆమె వేధింపులను భరిస్తూ ప్రేమకోసం తపించే  త్యాగధనుడవుతాడు. అందుకే ‘మనసున మనసై’ పాట అతడు పాడితేనే పండుతుంది. సానుభూతి వెల్లువవుతుంది. గమనిస్తే, ఒక పురుషుడిలా ఒక స్త్రీ ప్రేమకోసం తపిస్తూ పాడిన పాటలు అరుదు. ఆమె అసంతృప్తి “నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు?” అనటం దగ్గరే ఆగిపోతుంది. లేకపోతే ” మౌనమె నీ భాష ఓ మూగమనసా?” అంటుంది. గమనిస్తే, స్త్రీ ఒంటరిగా జీవించగలదు. స్త్రీ తోడు లేకుండా పురుషుడు జీవించటం కష్టం. ఆమె లేకుండా బ్రతికిఉన్నా జీవచ్చవంలానే జీవిస్తాడు.

స్క్రిప్టు రచయిత కూడా ‘మనసున మనసై’  పాటకు చక్కటి సందర్భాన్ని ఎంచుకున్నాడు. అంతకు ముందు దృశ్యంలో హీరో భార్య పుట్టినరోజు మరచి స్నేహితుడి భార్య (అతడికి ఆమెను చూస్తే చెల్లెలు గుర్తుకు వస్తుంది.) వచ్చి  ఎవరికో అనారోగ్యం అని పిలవగానే  అన్నీ వదిలి వెళ్లిపోతాడు. సంవత్సరానికి ఒకసారి వచ్చే పుట్టినరోజు కూడా తనతో గడపకపోతే ఎలాగంటుంది భార్య. రోగులు అంటాడు హీరో. ఇలా ఇద్దరూ వారి వారి దృష్టిలో సమంజసం అనిపించే రీతిలో విభేదిస్తారు.ఆమె తనను అర్ధం చేసుకోవటంలేదని బాధపడతాడు హీరో.  హీరోని సంపూర్ణంగా ప్రేమిస్తుంది అతని భార్య, కానీ ఆమెని మనస్పుర్తిగా ప్రేమించలేకపోతాడు హీరో. కానీ వివాహంలో తనకొక్కడికే అన్యాయం జరుగుతుందన్నట్టు ప్రవర్తిస్తాడు. ప్రేక్షకులు కూడా హీరో పక్షమే. ఈ సంఘటన తరువాత ఓ తోటలో చెట్టు క్రింద నీడలో హాయిగా కూర్చుని సితార్ వాయిస్తూ మనసుతో పాట ఆరంభిస్తాడు హీరో.

పాటలో రచయిత ప్రదర్శించినవి సార్వజనీన భావాలు. ఈ విశ్వంలో ఎంత వెతికినా ‘అసంతృప్తి’ లేని వ్యక్తి లభించడు. ఏదో ఒక విషయంలో, ఏదో ఓ రూపంలో,  దేనికోసమో ‘అసంతృప్తి’ అన్నది ప్రాణం ఉన్నంత వరకూ తప్పదు.అందులో ప్రేమ రాహిత్యభావన సార్వజనీన భావన. పైగా, ప్రతి వ్యక్తిమనసులో ఉండే  ఒక ఆదర్శమనదగిన  ప్రేమ భావనకు అక్షరరూపం ఇచ్చాడు గేయ రచయిత. ప్రేమ పిపాసులకు జాతీయ గీతంలాంటిదీ పాట. అసలు ప్రేమకు సిసలైన గీటురాయిలాంటిదీ పాట.  కాబట్టి ఈ పాటలో భావాలు చైతన్యం ఉన్న ప్రతి జీవిని కదిలిస్తాయి,  స్పందింప చేస్తాయనటంలో సందేహం లేదు. స్త్రీ పురుష బేధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఇలాంటి ‘నేనున్నానని నిండుగ పలికే తోడు’ గురించిన కోరిక, అన్వేషణ ఎదురు్చూపులు, ఆశాభంగాలు, నిరాశలు, అసంతృప్తులు  ఉంటాయి.

బాణీ అద్భుతమైనది.  సినిమా పాటల పరిధులను, పరిమితులను దృష్టిలో ఉంచుకుని, అతి క్లిష్టమైన జైజయవంతి రాగాన్ని లలితంగా మలచి అందించాడు సంగీత దర్శకుడు. జైజయవంతి రాగానికి సమానమైన కర్ణాటక రాగం ద్విజావంతి. ‘ద్విజావంతి’ రాగం సంతోష విషాద భావాల మేళవింపు. ఈ రాగం తీవ్రమైన విరహ వేదనను, శృంగార భావాన్ని ప్రతిబింబిస్తుంది. అందుకే పాట వింటుంటే ఆనంద విషాదాల కలగలపు భావం కలుగుతుంది.

తెలుగు సినిమాలలో సితార్ కన్నా అధికంగా వీణను వాడతారు. కానీ పాట లాలిత్యాన్ని పెంచి, భావాన్ని ఇనుమడింప చేసేందుకు సితార్‌ను వాడటం పాటకు  వన్నె తెచ్చింది. తెలుగులో సితార్‌ను వాడిన అతి అరుదైన పాటగా నిలుస్తుందీ పాట. నిజానికి వీణపాటలకు ప్రసిద్ధుడయిన ఎస్ రాజేశ్వర రావును,  అధికంగా సితార్ ప్రధానమైన ఈపాటకోసం గుర్తుచేసుకోవటం ఒక విచిత్రం.

కర్ణాటక సంగీతంలో ‘వీణ’ అధికంగా వాడతారు. సరస్వతీ దేవి సైతం వీణనే ధరిస్తుంది. వేదంలోనూ వీణ ప్రస్తావనలున్నాయి.

‘సితార్’ విషయంలో కొందరు అది వీణ ఆధారంగా రూపొందించిన వాయిద్యంలా భావిస్తారు. కానీ అధికులు ‘సితార్’ను మధ్య ప్రాచ్యానికి చెందిన వాయిద్యంలా భావిస్తారు. ‘సితార్’ అన్న పేరు కూడా సెహ్, తార్ అనే పర్షియన్ పదాల కలయిక వల్ల ఏర్పడిందంటారు. సెహ్ తార్ అంటే మూడు తీగలు. ‘మనసున మనసై’ అనే మృదువైన సున్నిత భావాల పాట కోసం అంతే మృదువైన సున్నిత స్వరాల సితార్‌ను వాడటంతో బంగారానికి తావి అబ్బినట్టయింది. సహజంగా హిందుస్తానీ సంగీతంలో ఉండే లాలిత్యం, జనరంజకత్వం పాటకు పాకృతికంగానే అబ్బాయి. ఇక కావాల్సింది పాట చిత్రీకరణ.

సందర్భం కుదిర్చారు. భార్య వేధిస్తున్నది. భరించలేక ఒంటరిగా ఏకాంతంలో అన్ని బాధలూ ప్రక్షాళన అయ్యేలా  సితార్ వాయిస్తూ పాట పాడుకుంటున్నాడు హీరో.

సితార్ నోట్స్ వినిపిస్తుండగా కెమేరాకు అడ్డుగా చెట్లును తొలగించి బృందావన్ గార్డెనను ఎత్తు నుంచి ఒక half panoramic view చూపిస్తుంది కెమేరా. తెరపై కనిపిస్తున్న విశాలత్వం, నాయకుడి ఒంటరితనాన్ని మరింత ప్రస్ఫుటం చేస్తుంది. ప్రిల్యూడ్ సంగీతం సితార్‌పై వినిపిస్తున్నంత సేపూ స్పందనల స్వరూపాన్ని అవగతం చేసుకుంటూ, ఒంటరిగా కూర్చున్న హీరో మనసులోని ఆశలు, నిరాశలు, ఆవేదనలు, సంవేదలను తాను అనుభవిస్తూ ప్రేక్షకుడు నాయకుడైపోతాడు కొన్ని సెకన్లు. పాట ఆరంభమయ్యే సరికి సితార్ పట్టుకున్న నాయకుడిని ఫోర్‌గ్రౌండ్‌లో క్లోజప్పులో చూపిస్తూ, మిగతా తెర అంతా విశాల అకాశం కనిపిస్తుంది. నాయకుడు అత్యద్భతంగా సితార్ వాయిస్తున్నా  అతడి ముఖం సీరియస్‌గా ఉంటుంది. ముఖంలో భాధ కనిపిస్తూంటుంది. విషాదం తొణికిసలాడుతుంటుంది. దాంతో ప్రేక్షకుడు అతడి భార్య మనిషి కాదా? ఆమె బాధపడదా? అన్న తర్కాన్ని పూర్తిగా మరచిపోయి హీరో మనోవేదనతో మమేకమైపోతాడు. పాట ఆరంభమవుతుంది.

ఘంటసాల ఎంత మృదువుగా, లలితంగా విషాదం లీలా మాత్రంగా స్ఫురించేట్టు, ఆలోచన అధికంగా ధ్వనించేట్టు పాడతాడంటే,  పాట ఆరంభమవుతూనే ఏదో తాత్విక గీతం వింటున్న పవిత్ర భావన కలుగుతుంది. చేదు  జీవితసత్యాలను తీపిగా వినిపించే తాత్విక గీతం ఇది.   పదాల నడమ వినిపించే ఫిల్-ఇన్ (fill-in) సితార్ నోట్స్ హీరో బాధతో స్పందిస్తున్నట్టు, సానుభూతి చూపిస్తున్నట్టు ధ్వనించి, పాటలోని melancholy ని మరింత పెంచుతాయి.

అసలు పాట ఆరంభమయేసరికి కెమేరా కోణం మారుతుంది. తపోవనంలో ఋషిలా ఉంటాడు హీరో. ఒక చిత్రపటం లాంటి ఫ్రేమ్ ఇది. పాట ఆరంభంమవుతుంది. పాటతో పాటు కెమేరా కదలుతూ హీరోను చూపుతుంది. ఇంతలో ఆ దృశ్యం కట్ అయి, తోటలోకి వస్తున్న హీరో ఫ్రెండును, అతని భార్యను చూపుతుంది. పాటకు సందర్భం అంతకు ముందు దృశ్యం కల్పిస్తే, సందర్భానికి అర్ధం వచ్చేసింది.

అక్కడ నాయకుడి భార్యలో అసూయ, అనుమానం కలిగాయి. ఇక్కడ ఇప్పుడు నాయకుడి స్నేహితుడి ఆలోచనలో మార్పు వస్తుంది,  పాట పూర్తయే సరికి. భవిష్యత్తులో, నాయకుడి, భార్య వీళ్లద్దరి సంబంధంపై అనుమానాన్ని కలిగిస్తూ ఆకాశరామన్న ఉత్తరం రాస్తే అతడు నమ్మేందుకు బీజం ఈ పాటతో పడింది. ఇక్కడే స్త్రిప్టు రచయిత ప్రతిభ తెలిసేది. డాక్టర్ చక్రవర్తి సినిమాలో ఏ పాట కూడా వ్యర్థంగా రాదు. ఏ పాటకు కూడా సందర్భం,  అర్థం, ఉపయోగం లేకుండా లేవు. ప్రతి పాట కథా గమనంతో ముడిపడి ఉంటుంది.

హీరో చెల్లెలు ‘పాడమని నన్నడగవలెనా’ అని పాడటం ఎందుకంటే, ఆమె మరణం తరువాత స్నేహితుడి భార్య ‘పాడమని నన్నడగతగునా’ అని పాడినప్పుడు హీరో ఆమెలో తన చెల్లెలిని చూసుకుంటున్నాడని ప్రేక్షకులకు తెలిపే వీలు, ఇతరులలో అసూయ, అనుమానాలు కలుగుతున్నాయని చూపే వీలు చిక్కేందుకు. అలాగే, ‘నీవు లేక వీణ’ పాట కూడా పాడే ఆమె ఉద్దేశం వేరు. ఆమెకు తెలియకకుండా ఇంట్లో అడుగు పెట్టి వింటున్న అతడి దృష్టి వేరు. కానీ అర్థమయింది వేరు. ఇలా స్క్రిప్టు ఒకో తాడు అల్లుతూ, ముడి వేసే చోట పాటను వాడుతూ స్క్రీన్ ప్లే ను రచించటం చక్కగా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే రచన పై ఆసక్తి ఉన్న వారికి అధ్యయనానికి పనికి వస్తుంది.

ఆశలు తీరని ఆవేశములో, ఆశయాలలో ఆవేదనలో
చీకటి మూసిన ఏకాంతములో తోడొకరుండిన అదే భాగ్యమూ..

శ్రీశ్రీ పాటను ఎంత చక్కగా, లోతైన భావాలతో రచించారంటే, ఈ పాట విన్న తరువాత మరో పాటను మెచ్చాలంటే, ఈ పాట ప్రభావ తీవ్రత తగ్గాల్సిందే. ఆవేశం, నిరాశలు, వేదనలు ఎన్ని ఉన్నా ఉదయం గడచిపోతుంది. ఆ రోజు అనుభవించిన నిస్పృహలు నిరాశలు అన్నీ సతాయించేది చీకటి మూసిన ఏకాంతంలోనే. అప్పుడే మనిషికి ‘తోడు’ అవసరం. పాట వింటూంటే, ఘంటసాల స్వరం పలికే భావాల తరంగాల తాకిడిని అనుభవిస్తూంటే, ఎంత ఆనందం కలుగుతుందో, అంత విషాదభావన కూడా కలుగుతుంది.

స్నేహితుడు, అతని భార్య కనబడగానే ఆమెకు సితార్ ఇస్తాడు హీరో. అంతకు ముందు వారిద్దరూ ‘ఆదిదంపతులలా’ వచ్చారనటం హీరో దృష్టిని సూచిస్తుంది. అయితే, అంతకుముందు ఒక దృశ్యంలో   నాయిక వీణ వాయిస్తుంది. ఇప్పుడు ‘సితార్’ రాదనకుండా వాయించేస్తుంది. నాయకుడు సినిమాలో ఇంతకు ముందు, తరువాత కూడా సితార్‌తో కనబడడు.

అయితే, పాట మాధురీ ప్రవాహంలో తలమునకలవుతున్నప్పుడు ఇదంతా ‘పిడకల వేట!’

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు
నీ కోసమే కన్నీరు నించుటకు
నేనున్నానని నిండుగ పలికే
తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గమూ..

ఈ చరణంలో ముగ్గురి విభిన్నమైన భావాలను క్లోజప్పుల్లో చూపించటం కథను ముందుకు నడిపిస్తుంది. అయితే హీరో ‘నిన్ను నిన్నుగా’ అనేప్పుడు కెమేరా స్క్రీన్ మధ్యలో చెట్ల నడుమ హీరోను ఫ్రేమ్ చేసిన విధానం గొప్పగా అనిపిస్తంది. హీరో తాత్త్వికుడు అన్న భావన కలిగిస్తూ, పాటను తాత్త్వికుడి ప్రవచన గీతంలా అనిపించేట్టు చేస్తుంది. స్నేహితుడి పాత్ర క్లోజప్పుపై ఫోకస్ ఒక ఆలోచనను కలిగిస్తే నాయిక వదనం, సితార్‌ల నడుమ నుండి ‘నేనున్నానని’ అని హీరో పాడటం మరో భావం కలిగిస్తుంది.

ఇంటర్‌ల్యూడ్ సంగీతం సమయంలో స్నేహితుడు తన భార్య వైపు చూడటం, ఆమె నాయకుడి వైపు చూడటం, నాయకుడు ఓ ఆకులు లేని మోడైన చెట్టు దగ్గర ఉండటం సర్వం సినిమా కథను చెప్తూనే ఉన్నాయి. పాత్రల మనోస్పందనలను ప్రేక్షకుడిని తేటతెల్లం చేస్తూంటాయి. అనుమానం, అసూయలు తెలుస్తాయి. వీటితో సంబంధం లేని హీరో, స్నేహితుడి భార్యల ఆలోచనలు ప్రేక్షకుడికి తెలుస్తాయి. జరగబోయే దుస్సంఘటనలు ఊహకు అందతాయి.

చెలిమియే కరువై వలపే అరుదై చెదరిన హృదయమే శిలయైపోగా
నీ వ్యథ తెలిసి నీడగ నిలిచే తోడొకరుండిన
అదే భాగ్యమూ, అదే స్వర్గమూ..

మోడైన చెట్టు నడుమ ‘చెలిమియే కరువై’ అనే ముందు హీరో నిలబడటం అతడి  హృదయం చెదిరి శిల అయిపోయిందని తెలుపుతుంది. పాట చివరలో స్నేహితుడు, అతని భార్యల దృష్టిలో హీరోను చూపటం, వెనుక ప్రవహిస్తున్న నది ఒక చక్కటి భవనను కలిగిస్తాయి. అనుమాన బీజాలు గట్టి పడుతున్నాయి కాబట్టి, రాబోయే తుఫాను స్వరూపం ప్రేక్షకుడి ఊహకు అందుతుంది. దాంతో ‘తోడు’ కోసం తపిస్తూన్న ఒంటరి హీరోపై జాలి పెరిగిపోతుంది. హాయిగా సితార్ వాయిస్తున్న పాత్ర పాట్ల సానుభూతి కలుగుతుంది.

సినిమాలో పాట  చిత్రీకరణ అత్యంత అర్థవంతము  అవటంతో, ప్రేక్షకుడు సినిమాలో జరుగుతున్న దానితో తాదాత్మ్యం చెందుతాడు. ఆ పాత్రలతో మమేకం అవుతాడు. ఇలాంటి సినిమా అనుభవం అతని మనస్సు లోని అనేక సున్నితమైన  భావాలను జాగృతం  చేస్తుంది. తనను తాను అర్ధం చేసుకుని  ఉత్తమ వ్యక్తిగా ఎదిగే వీలు కలిగిస్తుంది. కళ ప్రధానోద్దేశం కూడా అదే. అందుకే “creativity is divinely inspired to reflect beauty, tell stories and serve  a higher purpose” అంటారు. ఆ లక్ష్యాన్ని నెరవేర్చే ఇలాంటి పాటలు తరతరాలను ప్రభావితం చేస్తాయి. అత్యుత్తమ కళాప్రదర్శనకు తార్కాణంగా నిలుస్తాయి.

~

(‘మనసున మనసై’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=9G91yw7zwdM )

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version