[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]
ఓ పాపా లాలి, జన్మకే లాలి
ప్రేమకే లాలి, పాడనా తీయగా!
భారతీయ చలనచిత్ర ప్రపంచంలో పాటల చిత్రీకరణను సంపూర్ణంగా రూపాంతరమొందించిన దర్శకుడు మణిరత్నం. పాటల సన్నివేశాల సృజనలో ప్రత్యేకత లేకపోయినా, పాటల చిత్రీకరణలో మాత్రం అనూహ్యమైన మార్పులకు కారణమయ్యాడు మణిరత్నం. మణిరత్నం పాటలను, సన్నివేశాలను మరపురాని సంగీతమయంగా మార్చినది ఇళయరాజా. ఇళయరాజా, మణిరత్నం, వేటూరిలు కలిసి సృజించిన మ్యాజిక్‌ను ప్రేక్షకులకు చేరువచేయటంలో సినిమాటోగ్రాఫర్ పాత్ర అత్యంత ప్రాధాన్యం వహిస్తుంది. ఇళయరాజా బాణీలో ఒదుగుతూ, సందర్భ పరిధి దాటకుండా, సందర్భ స్థాయి అంబరాన్ని చుంబించే రీతిలో తన పదాలలో శక్తివంతమైన భావాలు పొదిగే పాటల రచయిత వేటూరి. పాటలు సినిమా పరిధి దాటి ప్రతి వ్యక్తి హృదయాన్ని స్పందింపచేసేట్టు చేస్తాడు వేటూరి. ఈ నలుగురి అత్యుత్తమ సృజనాత్మక ప్రతిభ ప్రదర్శనకు అత్యుత్తమ తార్కాణాలు ‘గీతాంజలి’ సినిమా పాటలు.
జగడ జగడ జగడం
చేసేస్తాం
రగడ రగడ రగడం
దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం
మేమేరా పిడుగులం
మరల మరల జననం
రానీరా
మరల మరల మరణం
మింగేస్తాం
భువన భగల గరళం
మా పిలుపే ఢమరుకం
మా ఊపిరి నిప్పుల ఉప్పెన
మా ఊహలు కత్తుల వంతెన
మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే..
అబ్బబ్బ.. ఏమి ప్రవాహం!!! సరస్వతి అంటే ప్రవాహం. ఇదీ సరస్వతి. ప్రతి ఒక్క పదం అర్థవంతం, అద్భుతం. యువతలోని జలపాత దూకుడును ప్రతిబింబిస్తూ ప్రవహించే అర్థవంతమైన పదాలు. చించి, తుంచి, వంచి, ముంచి, ఉంచి, దంచి, లంచి(lunch), కంచి అంటూ పదాలు కలపటమే ‘పాట’ అనుకునే వారికి సరస్వతి స్వరూపం, భగవంతుడి విశ్వరూపం సామాన్యులకు కనబడినట్టు కనబడదు. గేయ రచనలో దృశ్యం, సంగీతం మాత్రమే కాదు అనుభూతి కూడా వచ్చేస్తుంది.
(‘జగడ జగడ జగడం’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=_8pZt6sYLuU)
అయితే, ఇది సినిమా ఆరంభం మాత్రమే. సినిమాలో నాయిక, నాయకులిద్దరూ రోగగ్రస్థులే. రోజులు లెక్కపెట్టుకునే వారే. వారిద్దరి ప్రేమ కథ సినిమా. అంటే సినిమా ఆరంభంలో వచ్చే ‘జగడ జగడ’ పాటలో చరణంలో చెప్పినట్టు ‘నేడేరా నీకు నేస్తమూ, రేపే లేదు! నిన్నంటే నిండు సున్నరా, రానే రాదు’ లాంటి పరిస్థితి నాయికా నాయకులది. అప్పటిదాకా ‘మింగేస్తా గరళం’ అంటూ యవ్వన జోరులో పాడిన హీరో మరుక్షణం ‘తరాల నా కథ క్షణాలదే కదా, గతించి పోవు గాథ నేననీ’ అంటూ షాల్ కప్పుకుని మంచు కప్పిన మేఘాలు నిండిన ఊటీలో తిరుగుతూ పాడుకుంటుంటాడు. నిజానికి ‘గీతాంజలి’ సినిమా ఈ నలుగురు కళాకారుల విశ్వరూప ప్రదర్శనం లాంటిది.
ఆమనీ పాడవే హాయిగా, మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూల రాగాలతో, పూచేటి పూల గంధాలతో
మంచు తాకి కోయిల, మౌనమైన వేళల..
ఇందాకటి ప్రవాహ దూకుడు ఏమైపోయింది? ఈ మృదు మధుర గానంలో ఒదిగిన దీర్ఘమైన వేదన ఎక్కడి నుంచి వచ్చింది? మూగవటమేమిటి? ఈ మౌనం ఏమిటి? రాలేటి పూల రాగాలేమిటి? అద్భుతానికే అద్భుతమనిపించే అద్భుతం! ఆ బాణీ, ఆ బాణీలో ఒదిగిన పదాలు, భావాలు, అంత మృదు విషాద భావనలలో తీవ్రమైన ఆలోచనలను జొప్పించిన పదాలకు ప్రాణం పోసే గానం. తెరపై కనబడే ఆ దృశ్యాలు, వెలుగు నీడలు, పొగమంచు, మేఘాలు, లోయలు, సంధ్యాసమయపు నీడలు – కళ పరమ ప్రయోజనం మనిషి శరీరంలో ఒదిగిన అనంతత్వాన్ని గ్రహింపుకు తెచ్చి, ఆ అనంతత్వం శారీరక పరిధి దాటి విశాల గగనపుటనంతంలో విహరించే రెక్కల నివ్వటమే అయితే, ఆ ప్రయోజనం నెరవేర్చే ప్రయాణ దిశలో ఈ కళా సృజన ఒక అడుగు.
శుకాలతో పికాలతో ధ్వనించిన మధూదయం
దివీ భువీ కలా నిజం సృజించిన మహోదయం
మరో ప్రపంచమే మరింత చేరువై
నివాళి కోరిన ఉగాది వేళలో
గతించి పోవు గాథ నేనని..
సినీ గీతాలలో ఇంత మార్మికత, ఇంత తాత్వికత, ఇంత అందమైన పదాలు సృజించే అందమైన దృశ్యాలలో అంత అనంతమైన ఆలోచన, ఆవేదన.. సరస్వతీ దేవి స్వయంగా వేలు పట్టి రాయించినట్టుంది! ఈ పాట బాణీ, వాయిద్యాలు, ప్రతి పదం, ప్రతి స్వరం, సంగీత సాహిత్యాల మహత్తర మేళనానికి మురిసిన పార్వతీ పద నూపుర నిస్వనం అనిపిస్తుంది. అయితే వీటికి ఆధునిక కళ అయిన సినిమాకే ప్రత్యేకమయిన కెమేరా దర్శకుడి సృజనాత్మక ప్రతిభ తోడై పాటను దర్శించటం పరమ అధ్యాత్మిక అనుభూతి స్థాయికి ఎదిగిస్తుంది.
(‘ఆమనీ పాడవే హాయిగా’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=01ehaxggApE)
ఈ సందర్భంలో మనం ఈ సినిమాలో నటీనటులు, పాటలు, నేపథ్య సంగీతంతో పాటు తాను ఓ పాత్ర అయి, తనదైన ప్రత్యేక వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూ, ప్రత్యేక అస్తిత్వాన్ని ప్రస్ఫుటం చేసే కెమేరా పనితనం గురించి చర్చించుకోవాల్సి ఉంటుంది.
‘గీతాంజలి’ సినిమా, జీవితం, మరణం అనే రెండు ధృవాల నడుమ ఊగులాడే కల లాంటి సుందరమైన ప్రపంచం లోని అందమైన ప్రేమ కథలో అంతర్గతంగా ఒదిగిన గాఢమైన విషాదంలోని తీపి మాధుర్యాన్ని ప్రదర్శిస్తుంది. అది పాటలో కన్నా దృశ్యంలో అధికంగా కనిపించేట్టు, దృశ్యాన్ని ఒక ప్రధాన పాత్ర చేశారు మణిరత్నం, పి.సి. శ్రీరామ్‌లు.
సినిమా ప్రధానంగా ‘ఊటీ’లో షూట్ అయింది. ఊటీ లోని ప్రకృతి అందాల నేపథ్యంలో, మానవ జీవితంలోని అందమైన విషాద ప్రేమ గాథను చూపిస్తుంది సినిమా. పొగమంచు నిండిన అస్పష్టమైన ప్రకృతిని సృజనాత్మకమైన లైటింగ్ టెక్నిక్‌లతో, చక్కని ఫ్రేమింగ్‌తో నేపథ్యంలో కనబడే ప్రకృతి దృశ్యాలు, తెరపై పాత్రల నడుమ జరిగే విషాద, శృంగార, హృదయాన్ని కదలించే సన్నివేశాల ప్రభావాన్ని ఇనుమడింప చేసే ప్రధాన పాత్రలా మలచాడు కెమేరా దర్శకుడు. దృశ్యానికి గాంభీర్యాన్ని, తాత్వికతను ఆపాదించాడు కెమేరా దర్శకుడు.
కెమేరాలో soft lenses వాడేడు, పాత్రలను చూపించేప్పుడు. దాంతో పాత్రలు ఏదో కలల లోకంలో ఉన్నట్టనిపిస్తారు. పొగమంచును ఒక ప్రధాన పాత్రగా ఎలా చేశాడంటే, పొగమంచులో ఏముందో తెలియదు. సందర్భాన్నిబట్టి, పొగమంచును సందిగ్ధానికి, విషాదానికి, మరణానికీ చిహ్నంగా నిలిపాడు సినిమాటోగ్రాఫర్.
సంసార్ కే హర్ షయ్ కా ఇత్నా హీ ఫసానా హై
ఎక్ ధుంధ్ సే అనాహై, ఎక్ ధుంధ్ మే జానా హై
ఇది సాహిర్ లూధియాన్వీ పాట. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి పొగమంచులో నుంచి వచ్చినట్టు వస్తాడు. పొగమంచులోకి పోయినట్టు పోతాడు. ఇదే ప్రతి వ్యక్తి కథ. ఇప్పుడు పొగమంచు ప్రతీక ఇంకా బాగా అర్థమవుతుంది. పొగమంచుని అనేక భావాలు కలిగించేందుకు అత్యంత సృజనాత్మకంగా వాడుకున్నాడు సినిమాటోగ్రఫర్.
ఇలా వాతావరణాన్ని పాత్రల సంవేదనలను ప్రతింబింబించే ఒక మాధ్యమంగా వాడడంతో తెలియకుండానే పాత్రల మనోభావాలు, వేదనలు ప్రేక్షకుడి మనస్సులో ముద్రించుకుపోతాయి. సినిమా ప్రభావం పెరుగుతుంది. ఇలా నేపథ్యంలో ప్రకృతి ఒక పాత్ర అయి తెరపై కనబడే దృశ్యాల ప్రభావాన్ని ఇనుమడింప చేస్తూ, పాత్రల మనోభావాలను ప్రతిబింబిస్తూ, వాటిని ప్రేక్షకుడు తీవ్రంగా అనుభవించేట్టు చేయడానికి తిరుగులేని నిదర్శనం ‘ఓ పాపా లాలి’పాట చిత్రీకరణ.
ప్రేయసీ ప్రియులిద్దరూ రోగ బాధితులే. మృత్యు ముఖం వైపు పరుగులిడుతున్నవారే. ఏ క్షణంలో ఏమౌతుందో తెలియదు. అందుకని బ్రతికి ఉన్న ప్రతి క్షణం అపురూపం. ఉన్నది ఆ క్షణమే అన్నట్టు ఆనందంగా జీవించాలి. అలాంటి పరిస్థితులలో అమ్మాయిఆరోగ్య పరిస్థితి తీవ్రమౌతుంది. ఆమెని ఆసుపత్రిలో చేరుస్తారు. డాక్టర్లు ఆశ ఇవ్వరు. అప్పుడు గది బయట నుంచుని, ఆమెకు జరిగే చికిత్సను నిస్సహాయంగా చూస్తున్న హీరో హృదయ స్పందన ఈ పాట.
ఇది సినిమాలో పాట సందర్భం. కానీ పాట చిత్రీకరణ, పాటలో పదాలు పాటలోని భావాలకు సార్వజనీనతని ఆపాదిస్తాయి. ప్రతి మనిషి హృదయ స్పందనగా పాటను మలుస్తాయి.
పాటను పాడుతూ హీరో, ఆమెను తాను లాలిస్తున్నట్టు, ఆమె తన ఒడిలో పడుకుని సేద తీర్చుకుంటున్నట్టు, ఆమెను తన బాహువుల్లో బంధించి రక్షణనిస్తున్నట్టు ఊహిస్తుంటాడు. పాట నేపథ్యమంతా పొగమంచు, పొంచి ఉన్న మరణంవల్ల కలిగిన అశ్చింత పరిస్థితిని తలపింప చేస్తుంటుంది. పాటలో పదాలు, ఈ చిత్రీకరణకు అన్వయిస్తే, పాట ప్రేయసీ ప్రియుల స్థాయి దాటిపోయి, మనిషికీ మనిషికీ నడుమ ఉన్న అనుబంధం స్థాయికి ఎదుగుతుంది.
మనకు ప్రియమైన వారు, మన జీవితంలో విడదీయరాని విధంగా పెనవేసుకు పోయినవారు ఆస్పత్రిలో తీవ్రమైన స్థితిలో ఉంటే బయట నిస్సహాయంగా నిలబడి లోపల ఏమౌతున్నదో తెలియదు. మూసిన ఐసీయూ గదిలో శరీరాన్ని బాగుచేయాలని ఎన్నెన్ని బాధలు పెడుతున్నారో, అది మనసుకెంత బాధను కలిగిస్తున్నదో, ఇన్ని బాధలు పడినా ఫలితం ఏమౌతుందో తెలియక,ఆశలేని పరిస్థితిలో కూడా ఆశను వదలలేక, అలాగని సంభవాన్ని ఊహించలేక, ఇదంతా కల అయితే బాగుండుననుకుంటూ, మనకు ఇష్టమైన వ్యక్తి, ప్రాణంలో ప్రాంలాంటి వ్యక్తి పడే కష్టాన్ని చూస్తూ, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిని, దుర్భర వేదనను అనుభవిస్తున్న, అనుభవించిన, అనుభవించే, ప్రతి మనిషి తనను తాను ఈ పాటలో చూసుకుంటాడు.
పాట ‘ఓ ప్రేయసీ/ ఓప్రియా/ఓ సఖీ/ఓ చెలీ లాలి’ అని ఉంటే, అది సందర్భానికి పరిమితం అయి ఉండేది. ‘ఓ పాపా లాలి’ అనటంలో పరిధి విస్తృతమైపోయింది. ‘పాప’ చిన్న పిల్ల కావచ్చు. కూతురు కావచ్చు. స్నేహితురాలు కావచ్చు. ప్రేయసి కావచ్చు. భార్య కావచ్చు. చెల్లి కావచ్చు. తల్లి కావచ్చు. ‘పాప’ అన్న పదం ఎన్నిటి బంధాలకో వర్తిస్తుంది. అన్ని అనుబంధాలకు ఈ పాట వర్తిస్తుంది. ఆమెను దగ్గరకు తీసి ఓదార్చలేడు. కంటనీరు తుడవలేడు. ‘నేనున్నాను’ అనలేడు. ‘నీకేం భయం లేదు’ అని ఓదార్చలేడు. ఆమె బాధ తగ్గటంలో ఏమీ చేయలేడు. అలాంటి నిస్సహాయమైన దుర్భర వేదనను అనుభవించే తీవ్రమైన మానసిక స్థితిని ప్రతిబింబిస్తుందీ పాట. మనం ఎంత కష్టమైనా అనుభవిస్తాం. కానీ, మన వారి కష్టం ఊహనే భరించలేము.
నా జోలలా లీలగా తాకాలని
గాలినే కోరనా జాలిగా
నీ సవ్వడే సన్నగా ఉండాలని
కోరనా గుండెనే కోరిక
కలలారని పసిపాప తల వాల్చిన ఒడిలో
తడి నీడలు పడనీకే ఈ దేవత గుడిలో
చిరు చేపల కనుపాలకిది నా మనవీ..
ఒక్క కఠిన పదం లేదు. కానీ ఎంత లోతైన భావం! ఎంతటి మృదువైన పదాలలో ఎంతటి బరువైన సంవేదనలను ప్రదర్శించాడో కవి. ఆమె అసలే బాధలో ఉంది. అందుకని తన జోల పాటతో మృదువుగా వీయమని గాలిని కోరుతున్నాడు. ఆమెకేమౌతుందో అన్న భయంతో గుండె వేగంగా కొట్టుకుంటే ఆమె భయపడుతుందని గుండె సవ్వడిని తగ్గమంటున్నాడు. కంట్లోంచి నీళ్లను కూడా రావద్దంటున్నాడు. ఎదుటి వారి బాధను చూసి మనం బాధపడితే వారి బాధ మరింత ఎక్కువవుతుంది. అసలిది పాటనా! మానవ హృదయలోతుల సంవేదనల మూటనా! ఇలాంటి గేయ రచయిత తెలుగు భాషవాడు కాక ఇతర ఏ భాషవాడయినా నెత్తిన పెట్టుకునేవారు. ఆయన నడిచే బాటలో పూలు పరచేవారు. తెలుగు భాషలోని మాధుర్యమే కాదు, అత్యంత మృదువైన, లోతైన భావనలను అంతే మృదువైన పదాలతో ప్రదర్శించగల భాషా శక్తిని ప్రదర్శించాడు కవి. ఇలాంటి గేయ రచయిత తెలుగువాడవటం మన అదృష్టంగా భావించాలి. . ఆ గేయ రచయిత ద్వారా ప్రకటతమవుతున్న సరస్వతికి నీరాజనాలర్పించాలి.
చిత్రీకరణలో క్లోజప్పులు నాయికానాయకుల సాన్నిహిత్యాన్ని చూపుతాయి. దూరం నుంచి చూపినప్పుడు విశాల ప్రకృతి ముందు మానవ అవేదనల లోతు అర్థమవుతుంది. నేపథ్యంలో అన్నిటినీ ముంచుతున్న పొగమంచు కలిగించే భావన వర్ణనాతీతం.
పాటలో ఇంటర్ల్యూడ్ సంగీతం అద్భుతంగా ఉంటుంది. వేణువు విషాదంతో రోదిస్తున్నట్టు వినిపిస్తుంది. కానీ కోకిల ఆనందంతో కూస్తున్నట్టనిపిస్తుంది. పియానో, అకౌస్టిక్ గిటార్లు లయబద్దమైన రోదనకు స్పందిస్తున్నట్టుంటాయి. కీరవాణి రాగంలో పాటను రూపొందించటంతో ఆ రాగం ప్రదర్శించే ఎమోషన్లు, రాగం ప్రతిబింబించే ధ్యానం లాంటి భావనలు ఈ పాటకు వన్నెతెచ్చాయి. ఇక్కడ ఇళయరాజా మరో చమత్కారం చేశాడు. గిటార్‌పై స్వరాలను కలిపి వాయించే బదులు ఒక్కో స్వరాన్ని ఒకదాని తరువాత ఒకటిగా మెల్లిగా వినిపిస్తూ విషాదంలో సస్పెన్స్‌ను కలిగించాడు. ఈ లయను ‘Arpeggio Rhythm’ అంటారు. దాంతో పాటలో మార్మికత, విషాదం, సాంద్రతలు వచ్చి చేరాయి. అత్యద్భుతమైన సంగీత సృజన ఇది.
aarpeggiyO rhythm video ఇక్కడ చూడండి
ఓ మేఘమా! ఊరమకే ఈ వేళకి గాలిలో తేలిపో వెళ్లిపో!
ఓ కోయిలా పాడకే నా పాటనీ తీయనీ తేనెలే చల్లిపో!
ఇరు సందెలు కదలాడే ఎద ఊయల ఒడిలో
సెలయేరుల అల పాటే వినిపించని గదిలో
చలి ఎండకు సిరివెన్నెలకిది నా మనవి!
ఎలా వస్తాయి ఇలాంటి ఊహలు? ఊహలు వచ్చినా వాటిని ఇంత అద్భుతంగా ఎలా వ్యక్తపరుస్తారు? మామూలు కవి కాదు వేటూరి. మామూలు మనుషులకు దివ్యలోకపు భావనలు కలిగించి, అత్యుత్తమ ప్రామాణికాలు ఏర్పరచి వెళ్లేందుకు శాపవశాత్తు భూమికి వచ్చిన ఓ విద్యా దేవతనో! పూర్వ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడో, ఈ జన్మలో ఇంతగా సున్నితమైన భావాలను ఇంత సున్నితంగా, ప్రతిభావంతంగా ప్రదర్శించేంతగా సరస్వతీ కటాక్షం లభించేందుకు? ‘ఇరు సందెలు కదలాడే ఎద ఊయల ఒడి!’ ఏం చెప్పాలి! ఏం చెప్పాడు! చేతులెత్తి దండం పెట్టి పదే పదే పాటను వింటూ పలు విభిన్న భావనలను అనుభవించటం తప్ప ఏమీ చేయలేము!
‘దెబ్బకు దిక్కులు పిక్కటిల్లటం’ నుంచి, ‘తరాల నా కథా క్షణాలదే కదా!’, అన్న ఆలోచన నుంచి, ‘ఇరు సందెలు కదలాడే ఎద ఊయల ఒడి!’ అనే అవగాహన వరకూ, ఒక వ్యక్తి మానసిక పరిణామక్రమాన్ని, ఆలోచనా పరిణతిని ఎంత సున్నితంగా, ఎంత సరళంగా, మనసుకు హత్తుకునేట్టు, అదీ చిన్న చిన్న వాక్యాలలో, అలతి అలతి పదాలతో ప్రదర్శించటం సరస్వతీదేవి కరుణారస ప్రవాహంలో తడిసిముద్దయినవాడికే సాధ్యం.
(‘ఓ పాపా లాలి’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=j-S_lUIzqBw)
ఒక మామూలు కమర్షియల్ సినిమాను, తమ పాటలతో క్లాసిక్ సినిమాల కన్నా ఉత్తమ కళా ప్రదర్శనలా నిలిపారు, ఇళయరాజా, వేటూరి, పి.సి. శ్రీరామ్, మణిరత్నం, గాయకుడు బాల సుబ్రహ్మణ్యంలు! సినిమా సమష్టి కళ. ఆ కళా ప్రదర్శనలో మెళుకువలు, సాంకేతికత ప్రేక్షకుడికి తెలియాల్సిన అవసరం లేదు. ఏమీ తెలియకున్నా కళాకారులు కలిగించాలనుకున్న స్పందనలు ప్రేక్షకుడిలో కలుగుతాయి. కళాకారుడు కలిగించాలనుకున్న భావాలు ప్రేక్షకుడిలో కదలుతాయి. కానీ ఆ కళా ప్రదర్శనలో మర్మాలు తెలిస్తే అనుభూతి మరింత గాఢమవుతుంది. భావనలు మరింత చిక్కనవుతాయి. అవగాహన లోతు పెరుగుతుంది. తనలో తనకు తెలియకుండా దాగి ఉన్న సున్నిత భావనలను, సున్నిత మనస్కుడిని మనుషులు గుర్తిస్తారు. ఇదే అత్యుత్తమ కళ పరమార్థం. ఆ లక్ష్యసాధన అతి సులభంగా సాధించిన పాటలివి. అందుకే ఈ నాటికీ ‘గీతాంజలి’ సినిమా పేరు విగానే హృదయలోతుల్లోంచి నిట్టూర్పు వెలువడుతుంది. ప్రతి పాట తనదైన ప్రత్యేక అనుభూతిని మిగిలుస్తుంది. ‘ఓ పాపా లాలి’ పాట మాత్రం ‘ఇరు సందెలు కదలాడే ఎద ఊయల ఒడిలో’ జోల పాడుతూ ఊయల ఊపుతుంది.
(మళ్ళీ కలుద్దాం)
