[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]
మావ మావా మావా
ఏమే ఏమే భామా
‘మంచి మనసులు’ సినిమాలో ఈ పాట ఎంతగా ప్రజలను ఆకర్షించిందంటే, ఈ పాట సంగీత దర్శకుడు కె.వి. మహదేవన్, ఈ పాట తరువాత ప్రపంచం మొత్తానికీ ‘మామ’ అయిపోయాడంటారు. అంతగా ప్రజలను ఆకర్షించిన ఈ పాట సినిమాల్లో జానపద పాటలకు ఊపునిచ్చింది.
సినిమాలకు పాటలు వచ్చినప్పటి నుంచీ జానపద పాటలు ఏదో ఓ రూపంలో సినిమా పాటల్లో వినిపించేవి. కానీ ఈ జానపద పాటల వ్యాపార విలువలు 1950 చివరికి కానీ సినీ కళాకారులు గ్రహించలేకపోయారు. ముఖ్యంగా సామూహిక నృత్యాలు కల జానపద పాటల వ్యాపార విలువలు తెలిసిన తరువాత వీలయినంత వరకూ ఏదో ఓ రకంగా నృత్యాల జానపద పాటలకు సినిమాలో స్థానం కల్పించారు. అలాంటి జానపద గీతం ‘మంచి మనసులు’ సినిమాలోని ‘మావ మావ మావా’ పాట.
గేయ రచయిత కొసరాజును ‘జానపద గీతాల బ్రహ్మ’ అంటారు. జానపద గీతాల రచనతో అటు పామరులను, ఇటు పండితులను ఏక కాలంలో ఉర్రూతలూగించాడు కొసరాజు. ఆయన రాసిన పాటలు ఆనాటికీ ఈనాటికీ ఏనాటికీ సూపర్ హిట్లే. ‘ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా’, ‘జేబులో బొమ్మ’, ‘సరిగంచు చీరగట్టి’ వంటి హిట్ పాటలు ఎన్నో రాశారు. ‘అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే’, ‘సరదా సరదా సిగరెట్టు’ వంటి సరదా పాటలూ రాశారు. ఉత్తమ సాహిత్య విలువలు, గిలిగింతలు పెట్టే చమత్కారాలు, లోతైన తాత్విక భావాలను అలవోకగా పాటల్లో ప్రదర్శించే కోసరాజు రాసిన పాటలన్నింటిలోకీ ‘ఆణిముత్యం’ అనదగ్గ పాట ‘మావ మావా మావా’. ఈ పాటలో ఆయన పద ప్రయోగాలు ఎంత లయబద్ధంగా రమ్యంగా ఉంటాయో, ఆ పదాలు పలికే భావం అంత లోతైనదై ఆనాటికీ ఈనాటికీ కాదు ఏనాటికైనా వర్తించే రీతిలో ఉంటుంది. సమాజం సంపూర్ణంగా సిగ్గుజార్చి, సిగ్గువిడవనంతకాలం, ఎవరెంత కాదన్నా, కాదనుకున్నా కాదనలేని జీవిత సత్యాలను చెప్తున్నట్టే అనిపించకుండా చెప్తుందీ పాట.
పట్టుకుంటె కందిపోవు పండు వంటి చిన్నదుంటే
చుట్టు చుట్టు తిరుగుతారు మర్యాదా?
తాళి కట్టకుండ ముట్టుకుంటే తప్పు కాదా?
పల్లవిలోనే వైభవ్ సూర్య వంశీ, బుమ్రా మొదటి బంతిని సిక్సర్ కొట్టినట్టు కొట్టాడు కొసరాజు. అందమైన అమ్మాయి కనిపిస్తే చుట్టు తిరగటము, పలకరించాలని తపన పడటము యువకులకు సహజం. ఆ నిజాన్ని ఎంతో సుందరంగా చెప్తాడు. ఒక స్వాభావికమైన విషయాన్ని ఎంతో సహజంగా చక్కని పదాలతో చెప్పాడు. ఎలాంటి దూషణ లేదు. నిరసన లేదు. ఆవేశం లేదు. మగవాళ్లు డౌన్ డౌన్ అనటం లేదు. సింపుల్‌గా మర్యాద ఏమిటో ఎంతో సున్నితంగా చెప్పాడు మొదటి వాక్యంలోనే. పదము పదములో మధువులూరగా, అన్నట్టు, పదాలు పలుకుతూంటేనే పాటలయ వచ్చేస్తుంది.
ఇప్పటి ప్రామాణికాలతో చూస్తే ఇదొక ‘ఐటమ్ సాంగ్’. తరువాత సినిమాలలో రాను రాను జానపద పాటల స్థానాన్ని క్లబ్బు పాటలు ఆక్రమించాయి. కానీ ఈ ‘ఐటమ్’ పాటను సినిమాలో భాగం చేయటమే కాక, తరతరాలు విని, అర్థం చేసుకుని, పాటించదగ్గ జాగ్రత్తలను, నేర్చుకోదగ్గ నైతిక విలువలను పాట ద్వారా ప్రదర్శించారు ఆనాటి కళాకారులు. ఈ మంచి చెప్పటం, నైతిక విలువల బోధన ప్రత్యేకంగా జొప్పించినట్టు కాకుండా తెరపై జరుగుతున్న దానిలో భాగం చేశారు.
నాయకుడు, నాయిక ప్రేమించుకుంటారు. వారిది హద్దు దాటని ప్రేమ. అయితే నాయకుడి అన్న కూతురు ఓ యువకుడిని ప్రేమిస్తుంది. అతడిది ప్రేమ కాదు. అతడు ఆమెని తాకాలని, దగ్గర తీసుకోవాలని ప్రయత్నిస్తూంటాడు. అతడి ఉద్దేశ్యాలు స్పష్టం. ఈ సందర్భంలో వస్తుందీ పాట. ‘తప్పు తప్పూ’ అంటూ ఆరంభమవుతుంది. ఏమిటీ తప్పు? తాళి కట్టకుండా ముట్టుకోవటం తప్పు.
వివాహం అన్నది సామాజిక వ్యవస్థలో ప్రధానాంశం. వివాహం అన్నది ఒక కర్తవ్యం, బాధ్యత, విశ్వాసం. ఆ కాలంలో వాళ్లు ఇది నమ్మారు. యువతీ, యువకులిద్దరూ మానసా వాచా కర్మణా ఈ ధర్మాన్ని నిర్వహించాలి. ‘బ్రహ్మచారి’ అన్న పదం ఉంది. అదొక స్థితి. తరువాత సంసారం లోకి అడుగు పెట్టి వారు స్త్రీ పురుషులిద్దరూ పరమ పవిత్రంగా ఒకరినొకరు ధ్యానిస్తూ, ఇతర ప్రపంచాన్ని విస్మరించి, ధర్మం విధించిన పరిధుల్లో అర్థవంతమైన జీవితాన్ని ఆనందంగా గడపటం వైవాహిక జీవితం లక్ష్యం. వివాహం వరకూ ఒకరినొకరు తాకకపోవటం, తాకిన వారినే వివాహ మాడటం ఈ వ్యవస్థలో భాగమే. అందుకే ‘తాళి కట్టకుండా ముట్టుకుంటే తప్పుకాదా?’ అన్న వాక్యం. వివాహం ఎంత అద్భుతమైన వ్యవస్థ అంటే, అంతకు ముందురోజుదాకా అపరిచితులైన వారు, వివాహబంధం ద్వారా ఏకమైన మరుక్షణం అది జన్మజన్మల అనుబంధంగా పరిణమిస్తుంది. దీన్నే ఓ హిందీ పాటలో ‘ కల్ తక్ జో బేగానేథే జన్మోంకే మీత్ రే’ అంటాడు కవి. అయితే, ఇప్పుడు, వివాహ పూర్వపు ప్రేమ కన్నా, వివాహ బంధంలో ప్రేమనే అన్ని విధాలా అపురూపం అనే మాట అనేవారిని అనాగరికులుగానూ, అభివృద్ధి చెందనివారు గానూ భావించి తాళి కట్టకుండా తాకటమే అభివృద్ధి, అభ్యుదయం, హక్కు, స్వేచ్ఛ అనుకునే తరాలకు ఈ మాట వెనుక ఉన్న తత్వం, గొప్పతనం, ఆచరణ వల్ల కలిగే సౌఖ్యం, శాంతిల గురించి అర్థం కాదు. ‘కిత్నా సుఖ్ హై బంధన్ మే’ , బాంధవ్యపు బంధనంలోని సుఖం ఈ తరానికి తెలియదు. ఈ తరానికి తెలిసింది, శారీరక సౌఖ్యమే సర్వం అన్నది. అందుకే ఇప్పటి స్త్రీ పురుష సంబంధపు పాటలన్నీ, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ‘లైంగికచర్య చుట్టూ తిరిగేవే! ఇదే మాట ఇప్పటి తరానికి ఎంతో అందంగా కుండ బద్దలు కొట్టినట్టు గేయ రచయిత చంద్రబోస్ ‘ఊ అంటావా మామ’ పాటలో చెప్పాడు.
మీ కళ్లల్లోనే అంతా ఉంది…
సందు దొరికందంటే సాలు…
అందిన ద్రాక్షే తీపి మీకు….
ఒంటిగ సిక్కామంటే సాలు….
మంచీ కాదు సెడ్డా కాదు అంతా ఒకటే జాతండీ
దీపాలన్నీ ఆర్పేసాక, అందరి బుద్ధి వంకర బుద్ధే
ఈ పాట చరణాలన్నీ కలిపి చెప్పిన దాన్ని ఎంతో సొంపుగా ‘పట్టుకుంటే కంది పోవు పండు వంటి చిన్నదుంటే చుట్టు చుట్టు తిరుగుతారు మర్యాదా’ అన్న మాటతో చెప్పటమే కాదు, ఇదంతా ‘మర్యాద కాదని’ చెప్పాడు కవి. అది ‘మర్యాద’ తెలిసిన సమాజం. ఇప్పటి సమాజానికి మర్యాద అన్నది తెలియకుండా చేశాం. అందుకని అప్పటి ‘యువతి’ మర్యాద చెప్పింది. మన్నన నేర్పింది. పద్ధతి చెప్పింది. అప్పటి యువకుడు విన్నాడు. సమాజం ఆదరించింది. ఇప్పుడు చెప్తే వినే రోజులు పోయాయి. బట్టలు వేసుకోమంటే, బట్టలు విప్పే స్వేచ్ఛ కావాలంటారు. ఒళ్లు కప్పుకోమంటే, అచ్ఛాదన అనాగరికం అంటారు. ‘ఎవరి ఇష్టం వారిది’ అంటారు. సమష్టి సంక్షేమం పోయి వ్యక్తిగతం ప్రాధాన్యం పొందుతున్న కాలం ఇది. ‘నా ఇష్టమే అందరి ఇష్టం’ కావాలనే దౌర్జన్య అదర్శాల కాలం ఇది. ఒకప్పుడు పట్టుకుంటె కందిపోవు పండు వంటి చిన్నది ఉంటే చుట్టు తిరిగే వారు. ఇప్పుడు చిన్నది లేదు పెద్దది లేదు. యువతి లేదు, ముసలి లేదు. వావి లేదు వరస లేదు.. ‘అందరి బుద్ధి వంకర బుద్ధే’. ఇది మనం సామాజికంగా, మానసికంగా సాధించిన అభివృద్ధి.
వాలు వాలు చూపులతో గాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపు వాళ్లు మీరు కాదా!
చెయ్యి వెయ్య బోతె బెదురుతారు వింత కాదా!
ఇది మగవాళ్ల డైలమా! అమ్మాయికి తన శక్తి గురించి తెలియదు. కుతూహలం. అబ్బాయికి ఆత్రం. తనకు ఒక శక్తి ఉన్నదని తెలియగానే, తొందరపడి దెబ్బతిన్నది కుంతి. కాబట్టి స్త్రీలు ఎప్పుడూ జాగ్రత్త పడతారు. కుతూహలం, ఉద్విగ్నతలున్నా, ప్రకృతి నియమించిన పరిధులు, పరిమితుల ప్రకారం సహజంగా స్త్రీ జాగ్రత్త పడుతుంది. ప్రేమలో స్త్రీ ఒక అడుగు వేస్తే, పురుషుడు, పది అడుగులు పరుగిడతాడంటారు. ఈ తొందర వల్ల స్త్రీ జాగ్రత్త పురుషుడికి ఎప్పుడూ ఆశ్చర్యంగా, అసహనంగా, అన్యాయంగా, మోసంగా అనిపిస్తూంటుంది. వొచిన చిక్కేమిటంటే, మంచివాడిని అనుమానంగా చూసిన యువతి, వేటగాడి వలలో చిక్కటం.
పాట ఆరంభంలో నాగభూషణం పాత్ర వాసంతిని తాకాలని ఆత్ర పడుతూంటుంది. ‘అప్పుడే తాళికట్టకుండా తాకటం తప్పు’ అన్న వాక్యం వినిపిస్తుంది. చక్కటి సమన్వయం. నిజానికి ఇది ‘ఐటమ్ సాంగ్’ లాంటిదయినా కథ గమనంలో చక్కగా ఒదిగిపోతుంది. ఒక వైపు మంచి, చెడు పాట ద్వారా చెప్తున్నాడు. నాగభూషణం పాత్ర ప్రవర్తన ద్వారా ‘చెడు’ను చూపిస్తున్నాడు. పాటలో నృత్యం చేసే అమ్మయి వి.ఎన్.జ్యోతి మాత్రం బలహీనతలకు లొంగక బుద్ధి చెప్తోంది. కానీ నాగభూషణంతో ఉన్న అమ్మాయి నటి వాసంతి తెలిసీ బలహీనతలకు లొంగిపోతోంది. ఇదే సమయానికి, నాగేశ్వరరావు పాత్ర, పాట చూస్తూ ఆనందిస్తూంటాడు. చివరలో, నాగభూషణం కౌగిలిలో, అన్నకూతురిని చూస్తాడు. ఒక ఐటం పాటను, కథాగమనంలో కీలకం చేసే చక్కని స్క్రిప్ట్ రచనను ఇక్కడ చూడవచ్చు.
నీ వాళ్లు నా వాళ్లు రాకనే, మనకూ నెత్తి మీద అక్షింతలు పడకనే
సిగ్గు దాచి, ఒకరొకరు సిగను పూలు కట్టుకోని టింగు రంగ యంటు ఊరు తిరగొచ్చునా?
లోకం తెలుసుకోక మగవాళ్లు మెలగొచ్చునా?
అద్భుతం! ఆడవాళ్లకు లోకం తెలుసు. మగవాళ్లతో సన్నిహితంగా ఉంటే చెడ్డ పేరు వచ్చి జీవితం నాశనం అయ్యేదెవరిదో తెలుసు. మగవాడికి నష్టం లేదు. వాడికది గొప్పతనం. వాడే కనుక నిజంగా అమ్మాయిని ప్రేమించి ఉంటే, ఆమె కష్టం, నష్టం తెలుసుకుని జాగ్రత్తగా వ్యవహరిస్తాడు. ‘లోకం తెలుసుకోక మగవాళ్లు మెలగొచ్చునా?’ సాధరణంగా మహిళకన్నా ఎక్కువ వయసుంటుంది పురుషులకు . కాబట్టి బాధ్యత వారి పైనే అధికంగా ఉంటుంది. కాని శిక్ష పడేది మాత్రం మహిళకే. అందుకని మగవాడికి బాధ్యతను గుర్తు చేస్తూ తన జాగ్రత్త తాను పడాలి మహిళ. అందుకే వివాహం అన్నది ఒక బాధ్యత అని, అది వ్యక్తిగతం కాదు. సామాజికం అనీ మొదటి పాదంలో ‘నీ వాళ్లు నా వాళ్లు రాకనే, నెత్తి మీద అక్షింతలు పడకనే’ అని స్పష్టం చేసింది. తరువాత ‘సిగ్గు దాచి టింగు రంగ’ అంటూ తిరగకూదని చెప్పింది. పాపం, కొసరాజుకేం తెలుసు, ఇప్పుడు ఇలా అంటే స్వేచ్ఛ స్వతంత్రాలను హరించే ‘హిట్లర్’, ‘ఫాసిస్టు’, ‘విజిలాన్ట్’ వంటి పదాలను వాడి దూషిస్తారని! ఆ కాలం కాబట్టి ఆయన తన బాధ్యతగా మంచి చెప్పాడు. ఇది ‘టుక్డే టుక్డే ఆజాదీ’ల కాలం కాబట్టి ఇప్పుడు అమ్మాయిలు మన సినిమాల ప్రకారం వేరే రకంగా పాడతారు.
పొద్దున్నొస్తే ముద్దు కాఫీ ఇస్తాలే
లంచ్ కొస్తే హగ్ మీల్స్ ఏయ్ పెడతాలే
రాతిరొస్తే బెడ్ మీద..
చీరలొద్దు నగలు వొద్దు అమ్మా నాకు
వీడి పిల్లలకు అమ్మ అవ్వలెయ్..
‘సిగ్గు దాచి’ ఒకరొకరు సిగను పూలు కట్టుకొని టింగు రంగ యంటు ఊరు తిరగొచ్చునా? అనే అనాగరిక స్థితి నుంచి ‘కోడినిట్ట తన్ను కెళ్లే గద్దల్లే! చేపనిట్ట ఎత్తుకెళ్లే కొంగల్లే! సొత్తునిట్ట కొల్లగొట్టే దొంగల్లె! దొంగిలించి వీడిని దాచేయ్యాలిలే’ అనే స్వేచ్ఛ, స్వతంత్ర బరితెగించిన భావాల వరకు అభివృద్ధి చెందించాము విశృంఖల ఇజాల వాదాల స్వేచ్చ స్వతంత్రాల ఆజాదీలతో! పెళ్ళి అన్న నియమం లేకపోతే, మనిషికీ పశువుకూ తేడాలేదన్న మౌలిక పరిజ్ఞానాన్ని విడచి మేధావులని గుర్తింపు పొందినవాళ్ళు వివాహ వ్యవస్థను అనాగరికంగా ప్రచారం చేశారు. వివాహ వ్యవస్థను తృణీకరించి, అక్రమ సంబంధాలే సక్రమమని ప్రచారం చేసిన వాళ్ళే, ఎవరో ఒక మగవాడి తోడు లేకుండా జీవితాన్ని గడపలేకపోతున్నారు. తమతో ఉన్న పురుషుడు ఉత్తముడు. మితగావారంతా తోడేళ్ళు, నక్కలు. ఈ ప్రచార ప్రలోభంలో పడి కొన్ని తరాల యువతులు సర్వం కోల్పోయి, నిరాశా, నిస్పృహల్లో జీవితాలను వ్యర్ధం చేసుకుంటున్నారు. ప్రపంచంలో ప్రతి విషయంలో రాజీపడి, కేవలం వివాహ విషయంలో పంతాలకు పోయి, చెలియలికట్టను దాటుతున్నారు. మైదానపు మురుగులో ఇరుక్కుని విలవిలలాడుతున్నారు.
కళ్లు కళ్లు కలుసుకొను రాకముందే, అహ కప్పుకున్న సిగ్గు జారిపోకముందే
మాయజేసి, ఒహో మరులుగొల్పి మాటలోన మాట గల్పి
మధురమైన మా మనసు దోచవచ్చునా?
నీవు మర్మమెరిగి ఈ మాట అడగవచ్చునా!
పాపం ఆ కాలం యువకులు అమాయకులు. అమ్మాయి బాధ్యతను గుర్తు చేయగానే డిఫెన్స్‌లో పడ్డారు. అది అమాయకుల కాలం, అమ్మాయిలైనా అబ్బాయిలైనా!
పడుచుపిల్ల కంటబడితె వెంటబడుదురూ
అబ్బో వలపంతా వలకబోసి ఆశపెడుదురు
పువ్వు మీద వాలు పోతు తేనెటీగ వంటి మగవాళ్ల
జిత్తులన్నీ తెలుసు లేవయ్యా
మా పుట్టి ముంచు కథలన్నీ విన్నామయ్యా
‘పువ్వు మీద వాలు పోతు తేనెటీగ వంటి మగవాళ్లు జిత్తులన్నీ తెలుసు’ ఆ అమ్మాయికి. ‘పుట్టి ముంచు కథలన్నీ విన్నది’ అందుకని జాగ్రత్త పడుతుంది. ఎంత చక్కని పదాలు. ఎంత గొప్పగా వాడేడీ పాటలో. ప్రతి పదం మధురం. అర్థవంతం. లయబద్ధం. ఒకప్పుడు ‘పుట్టి’ లలో నది దాటేవారు. ‘పుట్టి మునగటం’ అంటే సర్వం కోల్పోవటం. జిత్తులమారి మగవాళ్లు ‘పుట్టి ముంచే’ కథలన్నీ తెలుసుకున్నది. కాబట్టి పెళ్లి వరకూ తాకద్దంటున్నది. ఆమె వాదనను అతడు ఆమోదించాడు. అది అతడి మంచితనం. ఒక వైపు పాటలో ఇన్ని చేదు నిజాల గురించి ఇంత తీయని విధంగా చర్చ జరుగుతుంటే నాగభూషణం, అంచెలంచెలుగా వాసంతి పాత్రకు దగ్గరవుతుంటాడు.
ఈ సందర్భంగా గాయని జమునారాణి పాటను పాడిన విధానాన్ని ప్రస్తావించుకోవాలి. ఆమె పదాలను పలకటం, వగలు చిలికించటం, కొన్ని పదాలను సాగదీసి వాటి అర్ధాన్ని మరింత ప్రస్ఫుటం చేయటం, మరి కొన్ని పదాలను పలికి, ఆపి, మళ్ళీ గమ్మత్తుగా పలకటం.. ఆమె గానసంవిధాన విశ్వరూప ప్రదర్శన ఈ పాటలో చూడవచ్చు. ‘మావ’ అన్న పదాన్ని ఆమె ప్రతి ఒక్కసారి ఒక్కో రకంగా ఉచ్ఛరించటం, పాటభావానికి తగ్గట్టు లాగదీసి వదలటం, నిజంగా ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. వింటున్నకొద్దీ కొత్త కొత్త ఆలోచనలు కలుగుతాయి. ఘంటసాల వంటి గాయకుడిని డామినేట్ చేయటం అనే అతి అరుదయిన విషయం ఈ పాటలో కనిపిస్తుంది.
కొత్త కొత్త మోజుల్నీ కోరువారు, రోజు చిత్రంగా వేషాలు మార్చుతారూ
టక్కరోళ్లుంటారు, టక్కులు చేస్తుంటారు
నీవు చెప్పు మాట కూడ నిజమేనులే
స్నేహం దూరంగా ఉన్నప్పుడే జోరవునులే
ఔనె ఔనె భామా..
ఒకప్పుడు ‘సోషల్ మీడియా’ ఇంతగా అభివృద్ధి చెందనప్పుడూ, ఇంత ఘోరంగా, విస్తృతంగా తీవ్రంగా మోసాలు జరిగేవి కావు. ఇప్పుడు మారు పేర్లతో, మాయమాటలతో మాయ చేసి మోసం చేసి దాచటం సులభమైపోయింది. మనుషులలో ఆధ్యాత్మికత దారి విడిచి భౌతికత వైపు ప్రయాణించటంతో అది సర్వనాశనం వైపే దారి తీస్తోంది. ఫలితంగా ప్రేమించిన వాడితో కలసి పెళ్లి చేసుకున్న వాడిని చంపటం, డబ్బు సంపాదనకు విడాకులొక సాధనం అవటం, పచ్చని సంసారాలు పాడుచేసుకుని అందరికీ శోకం మిగల్చటం.. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలలో ఎన్నెన్ని వికృతులు వింతగా చూసి ఆశ్చర్య పోయేవారమో, ఈ రోజు అవన్నీ మన ముంగిట్లో మన ఇంట్లోనే చూసి, అనుభవించి బాధలు పడుతున్నాం.
సువ్యవస్థితమైన ప్రశాంత నాగరిక వ్యవస్థను త్రోసిరాజని, నిప్పు వైపు పరుగిడే శలభంలా పాశ్చాత్య పద్ధతులకు పెద్ద పీట వేసి, తానున్న కొమ్మనే నరుక్కునే మూర్ఖత్వం భారతీయ సమాజం ప్రదర్శిస్తున్నది. ఈనాడు ప్రైమరీ స్కూళ్ల నుంచి ప్రతీదీ పొంగిపొర్లే వికృత ప్రేమల నిలయంగా మారుతోంది. ఈనాడు ‘టీనేజ్ ప్రేగ్నెన్సీ’ ఒక సమస్యగా పరిణమిస్తోంది. అటు సంపూర్ణంగా పాశ్చాత్య భౌతికతను స్వీకరించలేక ఇటు మనసులోంచి ఆధ్యాత్మికతను తొలగించ లేక అశాంతికి లోనవుతున్నాము.
“For the world, which seems
To lie before us like a land of dreams,
So various, so beautiful, so new,
Hath really neither joy, nor love, nor light,
Nor certitude, nor peace, nor help for pain;
And we are here as on a darkling plain
Swept with confused alarms of struggle and flight,
Where ignorant armies clash by night.”
Matthew Arnold రాసిన Dover Beach కవితను అనుభవిస్తున్నాం మనం. ఇప్పటికయినా ‘మావ మావా మావా’ అనే జానపద వినోదాత్మక గీతంలో కొసరాజు పొందు పరిచిన సలహాను సూచనను భవిష్యత్తరాలు అర్థం చేసుకుని స్మరిస్తూ జీవితంలోని ఆకర్షణలను, అవి కలిగించే అనర్ధాలను గ్రహించి, వదుల్చుకుని సంతోషంగా నీతిగా, నిజాయితీగా ఉత్తమ విలువలతో తమ జీవితాలను తీర్చిదిద్దుకోవాలని ప్రార్థించటం పాటలు వింటూ గతించిన కాలాన్ని తలచుకోవటం తప్ప ఏమీ చేయలేము. ‘సబ్ కో సన్మతి దే భగవాన్’ అని ప్రార్థించటం తప్ప ఏమీ చేయలేం.
పాట పూర్తయ్యే సరికి నాగేశ్వరరావు పాత్ర నాగభూషణం పాత్ర, తన సోదరుడి కూతురితో సన్నిహితంగా ఉండటం చూస్తుంది. ఈ పాట కోరియోగ్రఫీ అద్భుతంగా ఉంటుంది. లయ బద్ధమైన నృత్యంతో, చక్కని హావభావాలతో, జానపద నృత్య పద్ధతులను తెరపై ప్రదర్శిస్తుందీపాట. ఇక పాటలో సాంప్రదాయ వాయిద్యాలను అతి చక్కగా వాడి, లయతో శరీరాన్ని, భావంతో మనసునూ ఊపేస్తారు ఆనాటి కళాకారులు. వీటన్నిటినీ సమన్వయం చేస్తూ, చివరలో ఆచరించవలసిన నీతిని, పాటించవలసిన విలువల సారాన్ని అతి చక్కగా బోధిస్తుంది పాట.
కట్టుబాట్లు ఉండాలి, గౌరవంగా బ్రతకాలి
ఆత్ర పడక కొంతకాలం ఆగుదామయ్యా
పెళ్ళున పెళ్ళయితే.. ఇద్దరికీ అడ్డు లేదయ్యా
మావ మావా మావా..
~
‘కట్టుబాటు ఉండాలి. గౌరవంగ బ్రతకాలి’. తారకమంత్రంలా నిత్యం జపించాల్సిన మాటలివి. కేవలం స్త్రీ పురుష సంబంధంలోనే కాదు, జీవితంలో ప్రతి విషయంలో కట్టుబాటు ఉండాలి. ప్రతి క్షణం గౌరవంగా బ్రతకాలి. ఈ విషయాన్ని అర్ధం చేసుకుని పాటిస్తే, జీవితాలు అర్ధవంతం అవుతాయి. సమాజం సుఖవంతం అవుతుంది. ధర్మాన్ని పాటించాలి. మనసులో అలల్లాగా నిరంతరం ఎన్నెన్నో ఆలోచనలొస్తుంటాయి. ఎన్నెన్నో కోరికలు అలుపులేకుండా ఎగసిపడుతూంటాయి. కానీ, ‘మనసు గుర్రమురోరి మనిసీ, మనసు కళ్ళెములాగు మనిసీ’ అనుకుంటూ, మనస్సు చెలియలికట్ట దాటకుండా జాగ్రత్త పడాలి. ‘కట్టుబాటు ఉండాలి, గౌరవంగా బ్రతకాలి’… వ్యాపార విలువలు ప్రదర్శిస్తూ, కళాకారులుగా తమ సామాజిక బాధ్యతను మధుర గీతాలు, మనోహర దృశ్యాల సృజన ద్వారా సక్రమంగా నిర్వహించిన ఆనాటి కళాకారులందరికీ జోహార్లు.
(‘మావ మావా మావా’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=yyFj_WHyOR4)
(మళ్ళీ కలుద్దాం)
