[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]
మంటలు రేపే నెల రాజా,
ఈ తుంటరి తనమూ నీకేలా?
వలపులు రేపే విరులారా,
ఈ శిలపై రాలిన ఫలమేమి?
గేయ రచయిత ప్రతిభావంతుడయితే, ఒక వ్యక్తి వ్యక్తిగత దుఖాఃన్ని, ప్రపంచ ప్రజలందరి మనస్సులు స్పందించే గీతంగా మలచగలడు. కళాకారుల సమష్టి సృజన సమ్మిశ్రమ ఫలితం అయినా, ఒక సినిమా పాట సార్వజనీనతను సాధించటంలో గేయ రచయితదే ప్రాధాన్యం. సంగీత దర్శకుడు ఆకర్షణీయమైన బాణీని సమకూరుస్తాడు సందర్భానుసారంగా. దృశ్యాన్ని చిత్రీకరించే దర్శకుడు, కెమేరామేన్ సహాయంతో చక్కటి దృశ్యాలను కనువిందుగా, మనస్సును పట్టేట్టు ప్రదర్శిస్తాడు. కానీ గేయ రచయిత పాటలో పొదిగే భావాలు పాటకు సార్వజనీనతను ఆపాదిస్తాయి. తన పదాల ద్వారా గేయ రచయిత కలుగ చేసే భావాలకు ప్రతి ఒక్కరి హృదయం స్పందించినప్పుడే ఆ పాట సినిమా పరిధి దాటి నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ పాటలో తమని తాము చూసుకునే వీలు కలుగుతుంది. సంగీత దర్శకుడు సృజించిన బాణీకి తగ్గట్టు పదాలు పొదిగేవారు మాములు గేయ రచయితలు. వాళ్లు రాసే పాటలు హిట్ కావచ్చు. కాని పాటకు ప్రతి హృదయం స్పందించేట్టు గేయ రచన చేసేవారు మహా గేయ రచయితలు. ఆ పాటలే కాదు, పాటలతో వారూ చిరంజీవులుగా మిగిలిపోతారు. తరతరాల హృదయ స్పందనలలో సజీవంగా నిలుస్తారు. అలాంటి పాట ఇది.
‘రాము’ సినిమా సూపర్ హిట్ సినిమా. సర్వం కోల్పోయిన తండ్రి, మాట కోల్పోయిన తన కొడుకుకు మాట రప్పించటమే లక్ష్యంగా జీవిస్తుంటాడు. కొడుకుకు మాట రావటంతో సినిమా పూర్తవుతుంది. అతడి కొడుకుకు మాట పోవటానికి కారణం అతడి కళ్ల ముందే వాళ్ల ఇల్లు, అమ్మ కాలిపోవటం. ఈ మధ్యలో కొడుకు చికిత్స కోసం వెళ్తున్న వాళ్లు, ఓ ఊరిలో దుష్టులతో తలపడి గాయాల పాలవుతారు. వారికి చికిత్స చేసి ఆశ్రయమిస్తుందో ఒంటరి ధనవంతురాలు. ఆమె హీరో పట్ల ఆకర్షితురాలవుతుంది. ఆమెకు వ్యవసాయంలో హీరో సహాయం చేస్తూంటాడు. ఊళ్ళో వాళ్లు ఆమె వివాహం విషయం అడిగినప్పుడు ఆమె మనసులో మన హీరో మెదులుతాడు. ఆ రోజు రాత్రి ఆమె మంచంపై పడుకుని తనలో తాను పాడుకుటుంది.
కలగంటి కలగంటి కలువారేకుల వంటి
కన్నుల గల స్వామి కనుపించెనే
కలలో కనుపించెనే..
ఆమె ఉద్దేశ్యం స్పష్టం. ఊళ్లో వాళ్లు ‘పప్పన్నం ఎప్పుడూ?’ అన్నప్పుడు ఆమె సిగ్గుపడుతూ హీరో వైపు చూస్తుంది. హీరో నవ్వుతాడు. తరువాత దృశ్యంలో దీపం వత్తిని పెద్దదిగా చేయటం కనిపిస్తుంది. గదంతా వెలుతురు విస్తరిస్తుంది. ఆమె హృదయంలోనూ అశాజ్యోతి వెలుగుతున్నట్టున్న మాట. ఆమె పాట దైవం గురించి అనిపించినా, దానిలోని శృంగార భావన స్పష్టం.
‘దాశరథి’ పేరులోనే ఆయన శ్రీవైష్ణవ సాంప్రదాయానికి చెందిన వాడని తెలుస్తుంది. చారిత్రకంగా ‘దాశరథి’ అసలు పేరు స్వామి ముదలియానందన్ లేక కందాడై దాశరథి. కందాడై వంశ స్థాపకుడీయన. రామానుజాచార్యులు ఆయనను తన ‘త్రిదండం’గా అభివర్ణించారు. ‘ధాతి పంచకం’ రచన ద్వారా విశిష్టాద్వైత తత్వాన్ని ప్రకటించారాయన. ఆ వంశానికి చెందిన గేయ రచయిత దాశరథి శ్రీవైష్ణవ సిద్ధాంతాలను ఉగ్గు పాలతో నేర్పుకోవటంలో ఆశ్చర్యం లేదు. అందుకే ఈ పంక్తులలో ఎంతో సున్నితంగా ‘మధుర భక్తి’ భావనను స్పృశించాడు దాశరథి. ఈ సందర్భం గొప్పతనం ఏమిటంటే, ఇక్కడ ఈమె అంత ఆనందంగా శృంగార భక్తి భావనను ప్రదర్శిస్తూ, ‘కలువ రేకుల వంటి కన్నుల గల స్వామి’ని కలలో చూశానని ఆనంద తన్మయత్వం ప్రదర్శిస్తుంటే, వెంటనే ఈ శృంగార భావనను విరుస్తూ, విషాద సంగీతం వినిపిస్తుంది. ఆమె భావనలను అర్థం చేసుకున్న నాయకుడు తన దుర్భర విషాద పరిస్థితిని, స్పందనలు నశించి మోడై, రాయిలా మిగిలిన తన జీవచ్ఛవం లాంటి హృదయాన్ని ప్రకటిస్తాడు. భక్తి శృంగారరసం క్షణాలలో దుర్భర విషాద కరుణ రసాల్లోకి మారిపోతుంది.
ఈ సందర్భానికి ఖరహరప్రియ రాగంలో బాణీని కుదిర్చాడు సంగీత దర్శకుడు ఆర్. గోవర్ధనం. ‘రాము’ సినిమాను తమిళంలో ఇదే పేరుతో ముందుగా నిర్మించారు. తమిళంలో ఇదే బాణీలో పాటను రూపొందించింది ఎమ్మెస్ విశ్వనాథన్. ఎమ్మెస్ విశ్వనాథన్ దగ్గర సహాయ సంగీత దర్శకుడు ఆర్. గోవర్ధనం. ఈయన స్వతంత్ర సంగీత దర్శకుడిగా కూడా పాటలను రూపొందించాడు. ఖరహరప్రియ రాగం కరుణ, శృంగార రసాలను ప్రతిబింబిస్తుంది. ఈ సందర్భంలో కరుణ రసాన్ని ప్రతిబింబిస్తుందీ పాట. తమిళంలో పి. బి. శ్రీనివాస్ అద్భుతంగా పాడేడు. ఆయన మెత్తని గొంతులో విషాదం చిలికిస్తూ పాడిన ఈ పాట వింటుంటే ఎంతటి కఠిన హృదయం అయినా కరగి కన్నీరైపోతుంది.
నిలవే ఎన్నిడమ్ కెరుంగాదే
నీ నినైక్కుమ్ ఇడతిల్ నాన్ ఇల్లై
‘ఓ చంద్రుడా నా దరికి రాకు. నేను విషాదంలో ఉన్నాను’ అన్న భావనను పల్లవి ప్రదర్శిస్తుంది. తమిళంలో కె. ఆర్. విజయ విరహ వేదన అధికంగా కనిపిస్తుంది. ఆమె విరహ వేదన పై కెమేరా కాస్త ఎక్కువసేపు నిలుస్తుంది.
తమిళం పాటను ఇక్కడ వినవచ్చు.
https://www.youtube.com/watch?v=F0xW0-EfOrQ
ఈ పాటను అధారంగా తీసుకుని తెలుగులో దాశరథి పూర్తిగా స్వతంత్ర గీతాన్ని రచించాడు.ఒకే ఒక్క చరణంలోనే తమిళ భావాన్ని తీసుకున్నాడు. మిగతా అంతా స్వతంత్ర భావనలతో, తెలుగు కవిత్వంలోని పలు అలంకారాలతో పాటను రసమయం చేశాడు దాశరథి. ఇది ఆరంభంలో కలగంటి నుంచీ కనిపిస్తుంది. తెలుగులో విరహ భావనకన్నా, మధుర భావనపైనే దృష్టి. నటి జమున కూడా ఎంతో చక్కగా తనవదనంలో ఎలాంటి వికారభావనలు కనబడకుండా, ఒక అత్యంత మధురమైన భావనను ప్రదర్శిస్తుంది.
చంద్రుడు శృంగార భావనలకు ప్రేరణ. కానీ విరహంలో ఉన్నవారికి శత్రువు చంద్రుడు. చల్లని వెన్నెలలు కురిపిస్తాడు. కానీ ఇక్కడ మన హీరో ‘మంటలు రేపే నెలరాజా’ అంటూ సంబోధనలోనే స్వభావోక్తి అలంకారం
జిన్ రాతోంకీ భోర్ నహీ హై, ఆజ్ ఐసీ హీ రాత్ ఆయీ
వో జిసే గమ్ మే డూబ్ గయా దిల్, సాగర్ కి హై గహరాయీ..
‘సూర్యోదయం అన్నదే లేని రాత్రి వచ్చిందీ నాడు. విషాద సాగర లోతుల్లో మునిగింది హృదయం’ అంటాడు హిందీలో హీరో. పాట రాసింది శైలేంద్ర. (ఈపాటను ఇక్కడ చూడవచ్చు…https://www.youtube.com/watch?v=TC9pjy8jSOk). శైలేంద్ర కవి అయినా అచ్చమైన గేయ రచయిత. దాశరథి సినీ గేయ రచయిత అయినా ప్రధానంగా కవి. తెలుగులో పాట ‘గజల్’లా ధ్వనిస్తుంది. ఆరంభంలోని వీణ వాదన వింటూనే ఇది ‘గజల్’ అనిపిస్తుంది. గజల్‌కు ఉండవలసిన అన్ని లక్షణాలూ తెలుగు పాటలో ఉన్నాయి. కానీ గజల్ నియమాలను పాటించలేదు. ఏ చరణానికి ఆ చరణం విడిగా అర్ధం చేసుకుని ఆనందించవచ్చు. గజల్ నియమాలను పాటించకున్నా ఒక అచ్చమైన గజల్ ఎలా ఉండాలో అలా ఉన్నదీపాట. ప్రతిభావంతుడి ప్రయోగం మరి! ఇటీవలి కాలంలో ఏది తోస్తే అది రాసి ‘గజల్’ అని ప్రకటించుకునే వారంతా దాశరథి పాటను అధ్యయనం చేస్తే ‘గజల్’ ఎలా ఉంటుందో అర్థమవుతుంది.
ఆకాశానికి అంతుంది.. నా అవేదనకూ అంతేది
మేఘములోన మెరుపుంది.. నా జీవితమందున వెలుగేది
అందమైన వెన్నెల రాత్రి. విరబూసిన విరుల నడుమ విషాదాన్ని అనుభవిస్తూ శిలలా అయిన నాయకుడి మనోభావాలను అతి గొప్పగా ప్రదర్శించిన తరువాత చరణంలో అతడి పరిస్థితిని మరింత లోతుగా వివరించాడు కవి. అంతులేని ఆవేదనను అద్భుతంగా ప్రదర్శించాడు. అకాశానికి అంతు ఉంది. ఆవేదనకు అంతు లేదు. విరోధాభాస అలంకారం ధ్వనిస్తుంది.
వీణ, వయోలిన్లు, తబల, మృదంగం, వేణువు వంటి వాయిద్యాలతో సంగీత దర్శకుడు అద్బుతాన్ని సృష్టించాడు. ముఖ్యంగా చరణాలకు నడుమ వచ్చే ఇంటర్ల్యూడ్ సంగీతాన్ని పాట మూడ్‌కు తగ్గట్టు సృజించటమే కాకుండా చరణం అంతం నుంచి మరో చరణం ఆరంభానికి అతి సుందరంగా దారి తీస్తుందీ ఇంటర్ల్యూడ్ సంగీతం. ఈ చరణంలో ఘంటసాల ఆకాశం అని పలికిన తీరు గమనిస్తూనే ఆవేదన దగ్గర పలికించిన అలంకారం అత్యంత విషాదాన్ని అద్భుతంగా ప్రకటిస్తుంది. గమనిస్తే, ఈ పాటంతా ఘంటసాల విషాదాన్ని ధ్వనింపచేస్తూ అద్భుతంగా పాడేడు.
తీగలు తెగిన వీణియపై ఇకపై తీయని రాగం పలికేనా?
ఇసుక ఎడారిని ఎప్పుడైనా ఒక చిన్న గులాబీ విరిసేనా?
తీగలు తెగిన వీణ రాగం పలకదు. ఎడారిలో గులాబీ పూయదు. ఆమెకి అతడిపై ఆశలు పెంచుకోవద్దని సూచిస్తున్నాడు. ఇక్కడ అర్ధాంతరన్యాస అలంకారాన్ని రూపాలంకారాన్ని వాడేడు కవి. పాట పల్లవి లోనే ఉపమేయమైన చంద్రుడికి ఉపమానాలు మంటలు, తుంటరి మధ్య అభేదాన్ని పాటించటం వల్ల రూపకాలంకారాన్ని ధ్వనింపచేశాడు. ఇక్కడా అంతే. సందర్భం విషాద గజళ్లకు తగినది. దాశరథి తన గజళ్ల అవగాహానను, రచన ప్రతిభను విజృంభించి ప్రదర్శించాడు.
మదిలో శాంతి లేనపుడు ఈ మనిషిని దేవుడు చేశాడు
సుఖము శాంతి ఆనందం నా నొసటను వ్రాయుట మరిచాడు
ఇది తమిళ చరణంలోని భావాన్ని తీసుకుని తన రీతిలో ప్రకటించాడు దాశరథి. మొదటి చరణంలో ‘ఈ మనిషి’ అన్నప్పుడు అది మొత్తం మానవ జాతికి వర్తిస్తుంది. అసలు మనిషిని తయారు చేయటమే ఒక గొప్ప విషాదం. సృష్టి ఒక వికారం. విషాదమయం. ఒక కళాకారుడి సృష్టి స్వభావం, ఆ కళాసృష్టి సమయంలో కళాకారుడి మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. అశాంతిభూయిష్టమైన ప్రపంచాన్ని సృష్టించాడు కాబట్టి, సృష్టించే సమయంలో దేవుడి మనస్సు కూడా అశాంతిగానే ఉండి ఉండాలి. రెండవ చరణం ‘పంచ్ లైన్’ సినిమాలో పాత్రకు వర్తిస్తుంది. భార్య మరణించింది. ఇల్లు కాలిపోయింది. కొడుకు మాట పోయింది. అన్ని దౌర్భాగ్యాలు అతడి చుట్టే తిరుగుతున్నాయి. ఘంటసాల దేవుడు అన్నపదాన్ని ఉచ్చరించిన విధానం గమనించండి. ఒకసారి నిర్లిప్తత, మరోసారి ఫిర్యాదులు ధ్వనిస్తాయి.
లోకాన బాధలన్నీ మా కొరకె ఏకమాయే
కష్టాలు నన్ను చూసి పండుగలు చేసుకున్నాయీ
‘నిండు సంసారం’ సినిమాలో ఆరుద్ర రాసిన పాట ఇది. లోకంలో బాధలన్నీ ఆమె కొరకే ఏకమయ్యాయంటోంది. ఇక్కడ హీరో, సుఖము, శాంతి, ఆనందం తన భాగ్యంలో రాయటం దేవుడు మరచిపోయాడంటున్నాడు హీరో. ఇక్కడ కవి వరుసగా, సుఖము, శాంతి, ఆనందం అనటం వెనుక ఓ అర్థం ఉంది. సుఖం శరీరానికి సంబంధించినది, భౌతికమైనది. శాంతి మానసికమైనది. ఆనందం.. ఆధ్యాత్మికమైనది. ఆత్మకు సంబంధించినది. భౌతికం, మానసికం, ఆత్మికం అయిన ఏదీ అతడి భాగ్యంలో లేదట. సంపూర్ణ దౌర్భాగ్యం. ఇహ ఇంతకు మించిన దురదృష్టాన్ని దేవుడు కూడా ఊహించలేడు. సుఖం భూమి స్థాయి. శాంతి ఆకాశం స్థాయి. ఆనందం అంతరిక్షం స్థాయి. ఏ స్థాయిలోనూ ఆనందం లేదతని జీవితంలో.
మనకు ఆనందం అనుభవించాలని ఎంతగా ఉన్నా, విషాదంలో ఉండేందుకే మనిషి తపన పడతాడు. అందుకే మనకు అధికంగా నచ్చి ఎల్లప్పుడూ స్మరించే రచనలు, సినిమాలు, పాటలు ఏమైనా అధికంగా విషాదమైనవే అయి ఉంటాయి. విషాదాంతం కాకపోతే, దేవదాసు, మరో చరిత్ర వంటి సినిమాలు అంతగా గుర్తుండేవి కావు. ఎన్నో సుఖాంత ప్రేమ గాథల నడుమ ఈ విషాదాంత గాథలు పర్వతాల్లా నిలుస్తాయి. పాటలూ అంతే. ఎందుకంటే, విషాదంలో ఓ రకమైన ఆనందం ఉంటుంది. విషాదగీతాలు పాడుకోవటంలో సంతోషం ఉంటుంది. అందుకే ఏబాధా లేకపోతే, ఏదో ఒక బాధ సృష్టించుకుని బాధలో సౌఖ్యం అనుభవిస్తాడు మనిషి. తనను మించిన బాధలెవరికీ లేవని రోదిస్తాడు ఆనందంగా. అందుకే, ఎవరినయినా ‘ఎలావున్నావు?’ అని అడిగితే, బాధలు చెప్పటంలో కనిపించే ఉత్సాహం, బాగున్నాననటంలో ఉండదు.
చీజ్ ఇస్ గమ్ సే బడీ ఇస్ జమానే మే నహీ
జో మజా రోనే మే హై ముస్కురానే మే నహీ..
‘దోస్త్’ సినిమాలో ఆనంద్ బక్షి రాసిన పాట. ఏడవటంలో ఉన్నహాయి, ఆనందం, నవ్వటంలో లేవంటాడు. ఇది నిజం. ‘రాము’ సినిమాలో పాటలన్నీ చక్కటివి. ‘మామిడికొమ్మ మళ్లీ మళ్లీ పూయునులే’, ‘పచ్చని చెట్టు ఒకటి, వెచ్చని చిలకలు రెండు’, ‘రారా కృష్ణయ్య..’ ఇలా అన్నీ హిట్ పాటలే. కానీ ఆ హిట్ పాటలు వింటుంటే కలిగే ఆనందం వేరు. ‘మంటలు రేపే నెలరాజా’ పాటలో మమేకమై పోయి, ప్రతి పదాన్ని, భావాన్ని అనుభవిస్తూ, ‘జీవితంలో కోల్పోయిన వాటిని, లభించని వాటిని, చేజార్చుకున్న వాటినీ తలచుకుని, తలచుకుని, నా ఆవేదనకు అంతులేదని విలపిస్తూ, సుఖము శాంతి ఆనందం నా నొసటను దేవుడు వ్రాయలేద’ని విషాదంతో పాడటం ఇచ్చే సాంత్వన ఇతర గీతాలేవీ ఇవ్వలేవు. ఆ ఆనందం వేరు. ఈ ఆనందం స్థాయి వేరు.
పాటను ఘంటసాల పాడిన విధానం చాలా గొప్పది. విషాద గీతాలలో గాయకుడు ఏడవకూడదు. గాయకుడి స్వరంలో ధ్వనించే విషాద భావానికి శ్రోత మనస్సు విషాదంతో నిండాలి. ఘంటసాల స్వరం అదే చేస్తుంది. పాట ఆరంభం నుంచీ ఘంటసాల గాన సంవిధానం గమనిస్తే పాట భావాన్ని అనుభవించటం కాదు, తానే పాటై పోయి పాడుతున్న భావన కలుగుతుంది. ఖరహరప్రియ రాగంలో గమకాల స్థానాలు ప్రాధాన్యం వహిస్తాయి. ఘంటసాల పాడిన విధానం ఆ నియమాలను అనుసరిస్తూ, భావాన్ని ఇనుమడింప చేస్తుంది.
‘రేపే’ వద్ద ‘రాజా’ వద్ద దీర్ఘం తీయటంలోనే – అటు నెలరాజు ఎంత తీవ్రంగా మంటలు రేపుతున్నాడో తెలుపుతూ, నెలరాజును జాలిగా సంబోధించటం అర్థమవుతుంది. ‘నీకేలా?’ వద్ద అభ్యర్థన తెలుస్తుంది. అదే ‘వలపులు రేపే’ వద్ద ఫిర్యాదు ధ్వనిస్తుంది. ‘ఫలమేమి?’ వద్ద ‘నిస్పృహ’ పొంగిపొర్లుతూంటుంది. ఇలా ఒక్కొక్క పదాన్ని అర్థవంతమూ, అనుభూతిమయమూ చేస్తూ ఘంటసాల పాడిన విధానం పాట స్థాయిని, విలువను, శ్రవణానుభూతి స్థాయినీ పెంచుతుంది. ‘ఖరహరప్రియ’ రాగంలో రెండు అర్ధ భాగాలు సమానం. ఆ సమానత్వాన్ని పాటిస్తూ అంతలోనే ‘అలంకారాలు’ గుప్పించటంచూస్తే, శాస్త్రీయ సంగీత ప్రావీణ్యం ఉన్న గాయకుడు, ఆ ప్రావీణ్యంతో లలిత సంగీతానికి శాస్త్రీయ సంగీత గంథం ఆపాదించటం అర్థమవుతుంది. లత, రఫీ, మన్నాడే, ఘంటసాల, సుశీల జానకి వంటి వారి పాటలు ఇతరుల పాటలకన్నా భిన్నంగా నిలవటం తెలుస్తుంది.
చివరలో ‘రే’ వద్ద ఘంటసాల వేసిన అలంకారం పాట స్థాయిని, భావనను ద్విగుణీకృతం చేస్తుంది. మళ్లీ పాట చివరలోనే ఈ అలంకారం వేస్తాడు. అప్పటిదాకా వివిధ రకాలుగా మంటలు రేపటాన్ని తన స్వరంలో ధ్వనింపచేస్తాడు ఘంటసాల. ఈ పాటలో ఒక్కో పదాన్ని పట్టి పట్టి వినటం, వింటూ అనుభవించటం ఒక అద్భుతమైన అనుభవం. అయితే, ఈ పాటలో ఘంటసాల ఊపిరి పీల్చటం తెలుస్తుంది. పాట పాడే సమయంలో మైకుకు పట్టుబడకుండా ఊపిరి తీయాలి. కానీ ఘంటసాల చివరి దశలో పాడిన పాటల్లో ఈ లోపం తెలుస్తూంటుంది అప్పుడప్పుడూ. ఈ సినిమా 1968లో వచ్చింది. అంతానికి ఆరంభం సూచించినట్టనిపిస్తుంది ఈ ఊపిరి శబ్దం.
పాట చిత్రీకరణ సులభం. నాయకుడి విషాదానికి నాయిక స్పందించటం. ఆకాశంలో వెన్నెల, పూల చెట్లు, నాయిక నాయకుల హావభావాలు మార్చి చూపిస్తే సరిపోతుంది. అయితే జమున ఆనందంగా తన్మయత్వంతో పాడటాన్ని క్లోజప్‌లో చూపించి, ఆ పై ఆకాశంలో చంద్రుడి చూపగానే, వీణా వాదన ఆరంభమవటం అద్భుతంగా అనిపిస్తుంది. అప్పుడే పాట పట్టేస్తుంది. తెలుగు సినిమా పాటల్లో ‘గజల్’గా ప్రకటించకుండానే సృజించిన అద్భుతమైన ‘గజల్’ లాంటి పాట ఇది. తమిళంతో పోలిస్తే, తెలుగు పాట చిత్రీకరణలో నియంత్రణలో ఉన్న జమున విషాద ప్రకటన గొప్పగా అనిపిస్తుంది. ఎన్టీయార్ భావాలు ఘంటసాల పట్టుకుని ధ్వనించాడో, ఘంటసాల భావాలను ఎన్టీయార్ ప్రదర్శించాడో అనిపిస్తుంది. అంత సమన్వయం వీరిద్దరి నడుమ.
ఇటీవలి సినిమాల్లో ఇలాంటి పాటలు ఊహించటం కష్టం. హీరోలు సూపర్ స్టార్లయి, సినిమాల్లో సూపర్‌మేన్లు హ్యుమనాయిడ్లు, ప్రిడేటర్లు తప్ప మనుషులు కనబడని పరిస్థితులలో మనుషుల ఆశనిరాశలు, ఆవేదనానందాలు, ఆలోచనా సంవేదనల పాటలు ఊహించటం కూడదు. అందుకే ‘మంటలు రేపే నెలరాజా’నే సాంత్వననిస్తున్నాడిప్పటికీ ఎంతగా మంటలు రేపుతున్నా.
~
(‘మంటలు రేపే నెలరాజా’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=PwDv_53d9-s)
(మళ్ళీ కలుద్దాం)
