[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]
నీ లీల పాడెద దేవా
మనవి ఆలించ వేడెద దేవా
నను లాలించు మా ముద్దు దేవా
కొందరు కళాకారులు తమ జీవితంలో ఎన్నెన్నో సాధిస్తారు. కానీ ఏదో ఒక్క విషయం వారికి ‘మారు పేరు’గా నిలుస్తుంది. అంతకు ముందు, ఆ తరువాత, వారు ఎన్నెన్ని గొప్ప పనులు చేసినా వారి పేరు చెప్పగానే ఆ ఒక్కటి వెంటనే గుర్తుకు వస్తుంది. గాయని ఎస్. జానకి తన సినీ గీతాల జీవితంలో ఎన్నెన్నో మరపురాని గీతాలు పాడింది. ప్రజలను తన గాన పటిమతో ఉర్రూతలూగించింది. కానీ గాయని ఎస్. జానకిని ఇతర గాయనిలకు భిన్నంగా నిలిపి, ప్రత్యేకతనాపాదించి, ఎస్. జానకి అనగానే వెంటనే గుర్తుకు వచ్చే పాట ‘మురిపించే మువ్వలు’ సినిమాలోని ‘నీ లీల పాడెద దేవా’ పాట.
‘మురిపించే మువ్వలు’ సినిమా ‘కొంజుం సలంగై’ అనే తమిళ సినిమాకు డబ్బింగ్ సినిమా. తమిళ సినిమా పేరుకు తెలుగు అనువాదం ‘మురిపించే మువ్వలు’. ‘మురిపించే మువ్వలు’ సినిమా సంగీత నృత్య ప్రాధాన్యం కల సినిమా. సినిమా కథ కాల్పనికం. ఈ సినిమాలోని సంగీతం, నృత్యాలు అత్యంత ప్రామాణికం. పాటలు పరమానందం కలిగిస్తాయి, ప్రతి పాట శాస్త్రీయ సంగీత ఆధారితం. ప్రతి పాటలో భక్తి, నృత్యం సరస సలల్లాపాలాడుతుంటాయి. అయితే అన్ని పాటలనూ మించి సినిమాకు గుర్తింపుగా నిలుస్తుంది ‘నీ లీల పాడేద దేవా’ పాట.
సినిమాలో, జెమినీ గణేశన్ రాజవంశానికి చెందినవాడు. అమరేంద్రన్ అతని పేరు. అమరేంద్రన్ శాంత అనే గాయని ప్రేమలో పడతాడు. అది అతను పరోక్షంగా ప్రకటిస్తాడు. శాంత (సావిత్రి)కి అర్థమవుతుంది. అంతకు ముందు ఆమె పలు సందర్భాలలో గుడిలోనూ, రాజసభలోనూ ఆయన నాదస్వరం అద్భుతంగా వాయించటం, అందరూ మంత్రముగ్ధులవటం చూస్తుంది. ఆమె కూడా అతనంటే ఇష్టపడుతుంది. ఓ రోజు గుడిలో గంధం అరగదీస్తూ ఆమె కూనరాగం తీస్తుంది. వెంటనే నాదస్వరం సమాధానంగా వినిపిస్తుంది. మళ్లీ రాగం తీస్తుంది. నాదస్వరం సమాధానం ఇస్తుంది. అతడు కనపడగానే ఆమె ఆ పాట ఆపేస్తుంది. అతని నాదస్వరంతో తాను పోటీ పడలేనంటుంది. అతడు ఒప్పిస్తాడు. ఆమె పాట అందుకుంటుంది. ఇదీ ఈ పాట సందర్భం.
‘మురిపించే మువ్వలు’ సినిమా సంగీత, నృత్య ప్రధానమైనది. అద్భుతమైన నృత్య గీతాలున్నాయి. వాటి చిత్రీకరణ కూడా చాలా బాగుంటుంది. కానీ ‘నీ లీల పాడెద దేవా’ మిగతా అన్ని పాటలనూ డామినేట్ చేస్తుంది.
సినిమా సంగీత దర్శకుడు ఎస్.ఎం. సుబ్బయ్య నాయుడు. ఎమ్మెస్ విశ్వనాథన్ ఇతని అసిస్టెంట్. తమిళ సినీరంగంలో అందరి గౌరవమన్నలందుకున్న వాడు ఎస్.ఎం. సుబ్బయ్య నాయుడు. ఈయన పాటలను పూర్తిగా శాస్త్రీయ సంగీత ఆధారంగానే సృజించాడు. పాశ్చాత్య సంగీతం జోలికి పోలేదు. ఎమ్మెస్ విశ్వనాథన్, కణ్ణదాసన్ వంటి కళాకారులు తమ విజయానికి సుబ్బయ్య నాయుడు ప్రధాన కారణం అన్నారు. సుబ్బయ్య నాయుడి చివరి దశలో ఆయనకు ఎమ్మెస్ విశ్వనాథన్ ఆశ్రయమిచ్చాడు. సుబ్బయ్య నాయుడును తమిళ ఓ.పి.నయ్యర్ అంటారు. కానీ పాట విషయంలో రాజీ పడడు. అనుకున్నది అనుకున్నట్టు రావాల్సిందే. ఈ విషయంలో తమిళ ‘సజ్జాద్ హుస్సేన్’ అంటారు. కానీ వారిద్దరికీ ఉన్న అహంకారం కాని, తొందరపాటు గానీ సుబ్బయ్య నాయుడుకు లేదు.
ఈ సందర్భం కోసం అభేరి రాగంలో నాదస్వరాన్ని రికార్డు చేశారు. నాదస్వర విద్వాంసుడు కరుకురిచి పి.అరుణాచలమ్, సుబ్బయ్య నాయుడు సూచనలను అనుసరించి నాదస్వరాన్ని పలు విభిన్నమైన పోకడలలో వినిపించాడు. ఒకసారి పరుగులిడే నిండు ప్రవాహమయితే, మరోసారి మెలికలు తిరిగే నది అయి; ఒకసారి దూకుతూ పరుగులిడే హరిణమైతే, మరోసారి క్లిష్టమైన భుజంగ నృత్య భంగిమలై వంపులు తిరుగుతూ ధ్వనింపచేశాడు. ఇప్పడు ఆ నాదస్వరంతో పోటీపడి, తన స్వరాన్ని నాదస్వరంతో లయించి, సమన్వయాన్ని సాధించి మధురంగా పాడగల స్వరం కోసం అన్వేషణ ప్రారంభమయింది.
అప్పుడున్న గాయనిలెవరూ నాదస్వరం స్థాయిలో స్వరాన్ని ప్రకంపింప చేస్తూ, ఆ పిచ్ లో, పాడగలవారు కారు. ఉత్తరాది గాయనిలు హిందుస్తానీ సంగీతంలో పాడగలరు. హిందుస్తానీ సంగీతం, సుల్తానుల దర్బారుల్లో, సుల్తానులను మెప్పించి, వారికి అర్థమయ్యే మాధుర్యం, లాలిత్యం ప్రాధాన్యం కల సంగీతంగా రూపాంతరం చెందింది. అక్కడి రాగాలు, అలంకారాలు, ఆలాపనలు అన్నీ సరళము, లలితము, ఆకర్షణీయము. కర్ణాటక సంగీతం ఇందుకు భిన్నం. సంగీతమన్నది భగవంతుని చరణ కమలాలను చేరే నిర్వాణ సోపాన అధిరోహణానికి త్రోవ చూపుతుంది అని నమ్ముతుంది కర్ణాటక సంగీతం. కర్ణాటక సంగీతం దైవ ప్రాధాన్యం కలది. సుల్తానుల మెప్పు కోసమో, జనరంజకంగా ఉండాలనో తపన లేనిది. దైవం తప్ప మరో ధ్యాస లేనిది.
విశ్వనాథ సత్యనారాయణ రచించిన నవల ‘మ్రోయు తుమ్మెద’లో ఒక సందర్భంలో నాయకుడికి ఒక స్త్రీ కనిపించి ‘ఇద్దరిలో నీకెవరిష్టం?’ అని అడుగుతుంది. ఇద్దరెవరు అంటే, ఒకరు హిందుస్తానీ సంగీతం, మరొకరు కర్ణాటక సంగీతం. నాయకుడు తనకిద్దరూ కావాలంటాడు. ఆమె తాను మహా ఆపదలో ఉన్నాననీ రక్షించమని అడుగుతుంది. అప్పుడతడు “నీవొక మధురమైన, అచ్చమైన, మర్త్యలోకసంబంధమైన సామవేదమునందుండి పుట్టినలయానుకూలమైన, సప్తస్వరమేళనజనితమైన యొక నాదవిద్య వంటి బాలికవా? నిన్నతడు (తురుష్కుడు-సం) చెరయందుంచెనా? నీవు షరాయి తొడిగికొంటివి; నీవు తురుష్క బాలికవలె పెంపబడితివా? నీ యాత్మమాత్రము వేదవాసనను వదలిపెట్టుటలేదా?” అని ప్రశ్నిస్తాడు. రక్షించమని అడిగిన ఆ స్త్రీ, హిందుస్తానీ సంగీతం! ఇదీ హిందుస్తానీ సంగీతం పట్ల పండితుల దృక్పథం.
కాబట్టి, హిందీ సినిమా పాటలు పాడే వారు కర్ణాటక సంగీతంలో, నాదస్వరంతో పోటీపడి పాడటం కష్టం. కర్ణాటక సంగీతంలోని పవిత్రతనూ, హిందుస్తానీ సంగీతంలోని జనరంజకత్వాన్నీ ఎంతగా మెచ్చుకున్నా, సంగీతాన్ని భగవదారాధనలో భాగంగా భావించేవారు మాత్రం హిందుస్తానీ సంగీతాన్ని మిశ్రమ సంగీతంగానే భావిస్తారు. అలాగని హిందీ సినిమాల్లో గానానికీ, వాయిద్యానికీ జుగల్‌బందీ లాంటి పాటలు లేవనుకోవటం పొరపాటు.
‘బసంత్ బహర్’ సినిమాలో ‘మై పియా తేరీ తూ మానే య నా మానే’ అనే పాట లత స్వరానికీ, పన్నాలాల్ ఘోష్ వేణువాయిద్యానికీ నడుమ పోటాపోటీ లాంటి జుగల్ బందీ పాట. శంకర్ జైకిషన్ సంగీత దర్శకులు.
(‘మై పియా తేరీ తూ మానే య నా మానే’ పాటని యూట్యూబ్లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=9AD6EvZ4S44)
నృత్య గీతం అయిన ” లగా చునిరీ మె దాగ్” ( దిల్ హీ తో హై) పాట చివరలో గాయకుడు పలికే స్వరాలతో తబలా, మంజీరా, హార్మోనియంలు పోటీ పడతాయి. ఇది హిందుస్తానీ సంగీతంలో వేగంగా స్వరాలు పలికేందుకు ఉదాహరణ.
‘లగా చునరీ మె దాగ్’ పాటను యూట్యూబ్ లో చూడవచ్చు.
‘కహె ఝూమ్ ఝుమ్ రాత్ యే సుహానీ’ అనే ‘లవ్ మేరేజ్’ సినిమాలో పాట లత పాటకు అకార్డియన్ స్వరానికీ నడుమ కొద్దిపాటి జుగల్ బందీ లాంటి పాట. లత ప్రశ్నకు అకార్డియన్ జవాబులా, అకార్డియన్ స్వరానికి, లత ప్రతిధ్వనిలా ఉంటుందీ పాట. ఈ పాటలు వింటే హిందుస్తానీ సంగీతంలోని లాలిత్యం, హోయలు, అందమైన వొంపులు, సొంపులు తెలుస్తాయి. కానీ ‘నీ లీల పాడెద దేవా’ లాంటి పాట ఇలాంటి సారళ్యం, లాలిత్యాలున్న పాట కాదు. అదొక వేగంగా వీచే సుడిగాలిలా ఉక్కిరిబిక్కిరి చేసే పాట.
(‘కహె ఝూమ్ ఝుమ్ రాత్ యే సుహానీ’ పాటని యూట్యూబ్లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=W2y8TaoTjVk)
సుళ్లు తిరుగుతూ ముంచెత్తాలని ఎగసి పడే అల్లకల్లోల వరదకు ఉక్కిరిబిక్కరవుతూ, నదీ ప్రవాహంలో సజీవంగా నిలవాలని పోరాడుతూ, ప్రవాహానికి ఎదురీదే చిన్న దొప్ప చేసే సాహసంవంటి , అత్యంతానందకరమయిన సాహస ప్రయాణం లాంటిదీ పాట. నాదస్వరానికీ, మానవ స్వరానికీ నడుమ ఈ పాట అందమైన, అద్భుతమైన ఆట.
మానవ స్వరం కూడా ఒక వాయిద్యం లాంటిదే. ఎలాగయితే వాయిద్యంలోకి గాలిని ఊది, ఆ గాలి కదలికలను నియంత్రించటం వల్ల పలు స్వరాలను పలికిస్తారో, అలాగే మానవ స్వరంలో ఊపిరితిత్తులు గాలిని అందిస్తాయి. స్వర తంత్రులు కంపించే రెల్లు (reed) లా పని చేస్తాయి. గొంతు, నోరు, నాసిక కుహారాలు ప్రతిధ్వనించే వీచికలా పనిచేస్తాయి. ఊపిరితిత్తులు స్వరతంత్రులు (vocal chords), గొంతు నోరు కలసి భావ వ్యక్తీకరణను, సంగీత వాయిద్యంలా విసృత భావాలను, రాగాలను పలుకుతాయి. వాయిద్యాలకు పరిమితులుంటాయి. అవి రాగం, భావం, లయ, భాషల నడుమ, మానవ స్వరం విహరించినంత స్వేచ్ఛగా విహరించలేవు. మానవ స్వరం సంగీతానికి భాషను కలిపి భావాలు, దృశ్యాలను సృజించినట్టు వాయిద్యాలు సృజించలేవు. రాగంలో స్వరాలను అందరూ గుర్తించలేరు. ఈ పాట వాయిద్యానికీ, మానవ స్వరానికీ నడుమ జుగల్‍బందీ మాత్రమే కాదు, వాయిద్యం, మానవ స్వరాల నడుమ పోటీలో మానవ స్వరం ఔన్నత్యాన్ని ఉత్తమత్వాన్ని, ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. గెలుపోటములు లేని ఆట ఇది. ఇలా వాయిద్యం – స్వరం స్థాయిలో మానవస్వరం పోటీగా పాడటం కష్టమైన విషయం. ఆ కష్టమైన పనిని ఎంతో సులభంగా అనిపించేట్టు అలవోకగా సాధిస్తుంది గాయని జానకి. అందుకే ఈ పాట ద్వారా గాయనిగా జానకి గుర్తింపును పొందటమే కాదు, జానకి అనగానే గుర్తు వచ్చే పాటగా ఎదిగిందీ పాట. ఇంతకు ముందు కానీ, తరువాత కానీ ఇలాంటి పాటను రూపొందించే సాహసం ఎవ్వరూ చేయకపోవటంతో, ఇక భవిష్యత్తులో ఎవరూ చేసే ఆశలు లేకపోవటంతో భారతీయ సినీ సంగీత ప్రపంచంలో అతి అరుదైన పాటగా ‘నీ లీల పాడెద దేవా’ పాట నిలచిపోతుంది.
‘నీ లీల పాడెద దేవా’ పాటను ‘జుగల్‌బందీ’గా రూపొందించిన సంగీత దర్శకుడు అన్నీ సాంప్రదాయకమైన వాయిద్యాలు వాడేడు. నాదస్వరంతో పాటూ, తమిళనాడుకే ప్రత్యేకమైన థావిల్ వాయిద్యాన్నీ, తబల, వేణువు, వయోలిన్, వంటి ఇతర వాయిద్యాలతో పాటను అలంకరించాడు. ‘థావిల్’ తమిళనాడుకు చెందిన ప్రత్యేకమైన వాయిద్యం. ఇది మృదంగంలా ధ్వనిస్తుంది. కానీ మృదంగం కన్నా శక్తివంతంగా, ఖంగుమని మ్రోగుతుంది. ఈ పాటను మృదంగంపై పాడతారు కొందరు, కానీ ఆ మెత్తని స్వరం వల్ల పాట తేలిపోతుంది.
పాట పల్లవి, చరణాలు అభేరి రాగంలో ఉన్నా, పాటలో ఇతర సమయాల్లో మ్రోగే నాదస్వరాన్ని రాగమాలికలా రూపొందించాడు సంగీత దర్శకుడు. చరణాల నడుమ వినిపించే నాదస్వరం, చివరికి మానవ స్వరాన్ని అనుసరిస్తూ పలికే స్వరాలలో అన్యస్వరాలను వాడేడు. సింధుభిరవి రాగం పలుకుతూ, కళ్యాణి రాగంలో తేలి, మళ్లీ వెంటనే అభేరి రాగంలోకి వచ్చేస్తుంది పాట. ఎంతో అద్భుతమైన రీతి రాగాల పోహళింపు ఇది.
ఈ పాటను అభేరి రాగంలో కూర్చటం ఎందుకంటే అభేరి రాగం తీవ్రమైన భక్తిని ధ్వనిస్తుంది. సున్నితమైన శృంగారాన్ని స్ఫురింపచేస్తుంది. ఈ పాటలో రెండింటి అతి చక్కని మేళవింపు కనిపిస్తుంది.
మురుగన్ కోవెలలో, గంధం అరగదీస్తూ, నాయిక రాగం తీస్తుంది. ఆమె వదనంపై సంతృప్తి, అమాయత్వం, భక్తి భావాలు కనిపిస్తాయి. కాని ఎప్పుడయితే నాయకుడు వచ్చి పాటను కొనసాగించమంటాడో, అప్పుడు భక్తి భావంతో శృంగార భావం ఆమె ప్రదర్శిస్తుంది. సావిత్రి తన వదనంతో ప్రదర్శించిన ఈ భావాలను కెమేరా చక్కగా చూపిస్తుంది. ‘నీ లీల పాడెద దేవా’ అని ఆరంభించటంలోనే ఆ స్థాయి, ఆ స్వరం ఒక తీయని వాయిద్యంలా ధ్వనిస్తాయి. ఆ అద్భుత భావనను అర్థం చేసుకుని, అనుభవించి తేరుకునే లోగా, మళ్లీ ఊపిరిని స్తంభింపచేసే బలమైన అల తాకిడిలా నాదస్వరం మ్రోగుతుంది. ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇక ఇక్కడి నుంచి జానకి స్వరం, నాదస్వరాల నడుమ జరిగే జుగల్‌బందీకి ప్రామాణికతను, విశ్వసనీయతను అపాదిస్తూ, ఆ పాట తానే పాడుతున్నట్టు ముఖంలో పొంగిపొర్లే ఆనందాన్ని కనిపింప చేస్తూ, పాటలోని స్వరాలకు తగ్గట్టు తల ఊపుతూ, కళ్లల్లో నాయకుడిపై ప్రేమను చిలికిస్తూ, స్వరంలో దైవభక్తిని ధ్వనింపచేస్తున్నట్టు అద్భుతంగా నటిస్తుంది సావిత్రి. ఆమె మహానటి ఎందుకయిందో పల్లవిలోనే ప్రస్ఫుటం చేస్తుంది. ‘నను లాలింపు మా ముద్దు దేవా’ అనటంలో, ‘దేవా’ దగ్గర జానకి పాడిన విధానం, సావిత్రి నటించిన విధానం చాలా గొప్పగా ఉంటాయి. పాట రెండు భావాలను స్ఫురింప చేస్తుంది.
‘సింగార వేలనె దేవా’ అంటూ ఆరంభమవుతుంది తమిళ పాట. ఇది ‘మురుగన్’ ప్రార్థనా గీతం. ఈ పాట ఓ వైపు మురుగన్ ప్రార్థన, మరో వైపు నాయకుడిపై, నాయిక మనసులోని ఆరాధన భావన వ్యక్తీకరణ. ‘వేలాయుధాన్ని ధరించిన అందమైన దైవమా, నీ కరుణ నిండిన హృదయంతో నన్ను ఆశీర్వదించమ’ని వేడుకుంటుంది నాయిక తమిళంలో. ఇది దైవానికి వర్తిస్తుంది. హీరోకి వర్తిస్తుంది. ఇదే భావనను తెలుగులో ‘ఆరుద్ర’ చక్కగా ప్రదర్శించినా, తమిళంలో ధ్వనించినంత స్పష్టంగా తెలుగులో స్ఫురించదు. తెలుగులో శృంగారం కన్నా భక్తి భావన అధికంగా కనిపిస్తుంది. చరణంలో గాయని, నాదస్వరం కలసి ఒకే స్వరంగా ధ్వనించటం పరమాద్భుతంగా అనిపిస్తుంది.
తమిళంలో మొదటి చరణం ‘తిరుచెందురులో నిత్యం కొలువై ఉండే దేవా, ప్రకాశవంతమైన వదనంతో, విరిసిన మల్లెపూవు వంటి స్వచ్ఛమైన చిరునవ్వుతో నా దరికి రావా’ అన్న అర్థాన్నిస్తుంది.
సిందూర రాగంపు దేవా
దివ్య శృంగార భావంపు దేవా
వల్లి చెలువారు నిను కోరు నీవే రావా..
యెలమి నీ లీల పాడెద దేవా
సుబ్రహ్మణ్యస్వామి (మురుగున్) భార్య వల్లి. దాంతో ‘వల్లి చెలువారు నిను కోరు’ అన్నాడు తెలుగులో. ఇక్కడ తనని తను ‘వల్లి’గా నాయిక భావించుకుంటున్నట్టుంటుంది. నాయిక నటన ఆమె ప్రదర్శించిన భావన. ‘నీవే రావా..’ అనగానే నాయకుడు దగ్గరగా వచ్చి వాయించేప్పుడు సావిత్రి చిరునవ్వుతో కనబరచిన భావన అద్భుతం. ఆ కాలంలో నటులు వదనంతో నటించేవారు. కనులలోన, కనుబొమలలోన, అధరమ్ములోన, వదనమ్ములోన, గళసీమలోన అత్యద్భుతమైన నటన ప్రదర్శించేవారు. వారి శరీరాకృతి ఎవ్వరికీ పట్టేది కాదు. యెలమి లేక ఎలమి అంటే ఆనందం, సంతోషం, అనురాగం, ఉల్లాసం, ఉత్సాహం, కృప, కోరిక వంటి అర్థాలున్నాయి.
“ప్రాచీన పవిత్ర తమిళ భాష దైవమా! ఆయుధం ధరించి, దుష్ట శిక్షణ చేసి దేవతలను విడిపించి, వారి కష్టాలను తీర్చినవాడా నీ లీల పాడెదను” అంటుంది తమిళంలో రెండవ చరణం:
అనుపమ వరదానశీలా
వేగ కనుపించు కరుణాలవాల
యెలమి నీ లీల పాడెద దేవా..
ఇక ఇక్కడి నుంచి అద్భుతమైన ‘జుగల్‌బందీ’ ఆరంభమవుతుంది. గాయని స్వరాలను పలకటం, నాదస్వరం ప్రతిధ్వనించటం, ఎవరు ఎవరిని పరీక్షిస్తున్నారో తెలియదు కానీ, వింటున్న శ్రోతకు ఆనందం అరవై అర్ణవాలై పొంగిపోర్లుతుంది. అసలు ఏమిటిది? ఇలాంటి పాటను ఊహించి రూపొందించిన సంగీత దర్శకుడికి, గానం చేసిన గాయనికి, నాదస్వర వాయిద్యకారుడికి ఎన్ని నీరాజనాలర్పించినా సరిపోదు. సంగీత సరస్వతి వీణా తంత్రులు మానవ రూపాల్లో వచ్చి, సంగీత ఔన్నత్యాన్ని, ఉత్తమత్వాన్ని, అది కలిగించగల అలౌకిక ఆనందాన్ని, మన కోసం ప్రదర్శించి, భావి తరాలు అందుకోవాలని ప్రయత్నించాల్సిన ప్రామాణికాలు ఏర్పరచి పోయారనిపిస్తుంది. ఏం చేసి వారి ఋణం తీర్చుకోగలం? ఇలాంటి పాటలు పదే పదే వింటూ సంగీతంలోని దైవత్వాన్ని అనుభవిస్తూ, ఆ అలౌకిక ఆనంద భావనను పదిల పరుచుకోవటం, పదిమందికీ పంచటం తప్ప. ఎందుకంటే ఇలాంటి పాటలు సృజించేవారు, సృజించాకా ఇలా పాడేవారు, వాయిద్య ప్రావీణ్యం కలవారు కనుచూపు మేరలో కనబడటం లేదు. దీనికి తోడు, సంగీత సరస్వతి అన్న భావనను, సాహిత్యం సరస్వతి స్వరూపం అన్న ఆలోచనను, ఈసడించి, తిరస్కరించి, సభాసరస్వతి అనటాన్ని ఆక్షేపించి, సభారంభంలో జ్యోతి ప్రకాశనాన్ని తృణీకరించి , తమ కలుషిత కుళ్లిన మెదళ్ల మూర్ఖత్వపు నీచమైన కంపును బహిరంగపరచి, విస్తరింపచేసే తెలివి లేని, బుద్ధిహీన మేధావులు పెరిగిపోతున్న సమాజంలో ఇలాంటి పాటలు సృజించటం అటుంచి, ఉన్నదాన్నైనా పదిలపరచి, అందించే వారినీ ఊహించటం కష్టం. పరదేశీయ భావాలతో బంధితమైన మెదళ్ళకి ఈ స్వరాలు, సంగతులు, జుగల్‌బందీలు కర్ణకఠోరంగా, అర్థంకాని శబ్దాలుగా అనిపించటంలో ఆశ్చర్యం లేదు. వారి సంస్కారం అంతే.
‘అనుపమ వరదానా శీలా’ లో ‘శీలా’ అంటూ కంపిస్తున్న జానకి స్వరానికి స్పందిస్తూ సావిత్రి నాయకుడి వైపు చూడటం పరమాద్భుతం. ఇక స్వరాల జుగల్‌బందీ ఆరంభమయ్యే ముందు, ఇద్దరూ గర్భగుడి ముందు పై మెట్టుపై కూర్చంటారు. ఇక మొదలవుతుంది ‘న భూతో న భవిష్యత్’ అనే దగ్గ ‘జుగల్‌బందీ’.
కెమేరా ఒకరి నుంచి ఒకరి వైపు తిరుగుతూంటుంది. దూరం వెళ్లి ఇతర వాయిద్యకారులు దగ్గర రావటం చూపుతుంది. తరువాత మళ్లీ అటు ఇటు తిరుగుతుంది. ఇంతలో నాయిక లేచి వెళ్లి దీపాన్ని ఎగదోస్తుంది.
అప్పుడు నాయకుడూ లేచి వస్తాడు. ఇప్పుడు ఇద్దరూ ఒకేసారి అద్భుతమైన సమన్వయంతో పాడతారు. చివరికి మనం చూస్తూ, వింటూ ఎలా మైమరచిపోతామో, నాయిక కూడా అలాగే పూలు తీసుకుని పాట పాడుతూ తన్మయురాలైపోతుంది. ఈ పాటను పోల్చేందుకు మరో పాట లేదు.
ఎస్. జానకి మరణించిన తరువాత కొందరు కుళ్లిన మెదళ్ల అసంతృప్త అపరిణిత మనస్కులు తరువాతి కాలంలో ఆమె పాడిన బూతు ధ్వనించే పాటలను ప్రస్తావించి తమ కుతి తీర్చుకున్నారు. ఇంకొందరు కులం ప్రసక్తి తీసుకొచ్చారు. వారి స్థాయి అంతే! వారి సంస్కారానికి నమస్కారం. ఒక మహానది ప్రవహిస్తున్నప్పుడు దానిలో పలు కలుషితాలు వచ్చి చేరతాయి. అలా బురదమయమైన ఒక ప్రాంతంలో నీటిని చూపి మొత్తం నదిని తీసిపారేసేవారు బురద నిండిన మెదళ్ళవారు. బురదను దాటి చూడలేరు. వారంతే. నిజానికి కళాకారుడి శరీరం అదృశ్యం అవుతుంది కానీ అతడు సృజించిన కళలో కళాకారుడు ఎల్లప్పటికీ సజీవంగా ఉంటాడు. తాను సృజించిన కళ ద్వారా తరతరాలకు ఆనందం పంచుతూనే ఉంటాడు. కళకు దూరంగా ఉండటమే కళాకారుడి అసలు మరణం. శరీరంతో సంబంధం లేదు. అందుకే గాయనిగా ఎస్. జానకి ప్రతిభా ప్రదర్శనకు పరాకాష్ఠ అయిన ‘నీ లీల పాడెద దేవా’ పాట వింటూ అలౌకికానందాన్ని అనుభవిస్తూ గాయని జానకి గానలీల తలచుకుంటూనే ఉంటాం. కలసికట్టుగా తమలోని అత్యుత్తమ కళాకారుడికి ప్రోత్సాహాన్నిస్తూ, వెలికితీస్తూ, మహోన్నతమైన ప్రామాణికాలు ఏర్పరచిన ఆ తరం కళాకారులందరికీ నిత్యం నీరాజనాలర్పిస్తూంటాం.
~
(‘నీ లీల పాడెద దేవా’ పాటని యూట్యూబ్లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=pTf6JnsddSQ)
వేదికపై జానకి ‘నీ లీల పాడెద దేవా’ పాడటం యూట్యూబ్ లో వింటూ చూడవచ్చు.
ఒక సంగీత కార్యక్రమంలో గాయని జానకి పాడిన ‘నీ లీల పాడెద దేవా’ పాటను చూడండి. వినండి.
(మళ్ళీ కలుద్దాం)
