[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]
నీ మది చల్లగా, స్వామీ నిదురపో
దేవుని నీడలో, వేదన మరచిపో..
‘ధనమా? దైవమా?’ సినిమాలోని రెండు విభిన్నమైన సన్నివేశాలలో వచ్చే జోలపాట మరపురానిది, మధురమైనది, ఆచరణీయమైన చక్కని ఆలోచనలను అందించేది మాత్రమే కాదు, ప్రేరణగా హిందీ పాట బాణీని తీసుకున్నా, దాన్ని సంపూర్ణంగా తమ సృజనాత్మకతతో రూపాంతరం చెందించి, మాతృకకు దీటుగా నిలపగలగటమే కాదు, తరచి చూస్తే, మాతృకను మించి మనసును దోచి, సాంత్వనను, శాంతిని కలిగించే స్ఫూర్తిమంతమైన గీతంగా ఎదిగింపచేసే కళాకౌశలానికి మచ్చుతునక ఈ పాట.
‘ధనమా? దైవమా?’ సినిమా ఆదర్శాలకు, ఆచరణకు నడుమ ఉన్న తేడాలను ప్రదర్శిస్తూ నైతిక విలువలకూ, ప్రలోభాలకూ నడుమ నలిగే మానవ మానసిక సంఘర్షణను ప్రదర్శిస్తుంది. భారతీయ తాత్విక భాషలో చెప్పాలంటే, శ్రేయస్సు, ప్రేయస్సుల నడుమ నలిగే మనిషి సంఘర్షణ ఈ సినిమా అనవచ్చు. ‘ప్రేయస్సు’ అంటే ఆకర్షణీయంగా ఉండే భౌతిక సుఖలాలస. కానీ ఈ మార్గం ఎంచుకున్న వారికి తాత్కాలికంగా సౌఖ్యం లభించినా జననమరణ చట్రంలో ఇరుక్కుని సుఖదుఃఖాలను అనుభవిస్తూనే ఉంటారు. ‘శ్రేయస్సు’ అన్నది కఠినమైన మార్గం. ప్రలోభాలను, భౌతిక సుఖాలను కాలదన్ని ‘అసిధార వ్రతం’ లాంటి నిర్మోహం, నిశ్చలమైన మానసిక స్థితికి ఎదిగి భగవంతుని దర్శించే లక్ష్యంతో జీవించాలి. అతి కఠినమైన ఈ మార్గం శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది. జననమరణ చక్రం నుండి తప్పిస్తుంది.
సినిమాలో హీరో ఆదర్శవంతుడు. నైతిక విలువలు కలవాడు. సినిమా ఆరంభ దృశ్యాలలోనే, ఉదయమే, ఇంటిల్లపాదీ ‘రామా, శ్రీరామా’ అనే భక్తిగీతం పాడుతూ పరిచయం అవుతారు. ఇది ధార్మిక వాతావరణం, నైతిక విలువల పాలనలను స్పష్టం చేస్తుంది. మంచి మార్గం ఎప్పుడూ కఠినమైనది. వ్యక్తిత్వాన్ని పరీక్షిస్తుంది. డబ్బు లేమితో హీరో అష్టకష్టాలు పడుతుంటాడు. అతని శక్తి అతని భార్య. అతను కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతూ దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు అతని భార్య అతనికి శక్తిగా నిలబడుతుంది. కర్తవ్యబోధ చేస్తుంది. సాంత్వననిస్తుంది. భార్యాభర్తల సంబంధంలోని సున్నితత్వాన్ని, ఔన్నత్యాన్ని ఈ సినిమా చక్కగా చూపిస్తుంది. స్త్రీ తోడవకపోతే, పురుషుడు ఎంత బలహీనుడో మనసుకు హత్తుకునే రీతిలో చూపిస్తుందీ సినిమా. అంతేకాక, భార్యా భర్తలలో హక్కులు, అహంకారాలు, పీడిత పీడకులు వంటి భావాలకు తావులేదనీ, అది జోడెద్దుల ప్రయాణంలాంటిదనీ గొప్పగా చూపిస్తుందీ సినిమా. ఇలాంటి సినిమాలు చూస్తూ పెరిగిన తరానికి వివాహం ఒక వ్యక్తిగత నిబద్ధత, సామాజిక బాధ్యత. ఈ సినిమాలో, మొదటిసారి ఈ జోలపాట, హీరో ధన లేమితో బాధ పడుతూ నిద్రపట్టని స్థితిలో ఉన్నప్పుడు అతని భార్య పాడుతుంది.
(‘నీ మది చల్లగా’ ఫస్ట్ వెర్షన్ పాటని యూట్యూబ్లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=lcKHxKWZkn4)
ఋజుమార్గంలో ప్రయాణించటం కఠినమని గ్రహించిన హీరో నీతికి నైతిక విలువలకు తిలోదకాలిస్తాడు. అడ్డదార్లు తొక్కుతాడు. అబద్ధాల బాట పడతాడు. భార్యను విస్మరించి ఇంకో అమ్మాయి వలలో పడతాడు. స్త్రీ తోడులేకపోతే పురుషుడెలా గమ్యరహితుడవుతాడో గొప్పగా ప్రదర్శిస్తుందీ సినిమా. ఇప్పుడతనికి నిజంగానే మనశ్శాంతి పోతుంది. ఎంత డబ్బు సంపాదించినా ఆశాంతితో, అసంతృప్తితో, నేరభావనతో, క్రుంగిపోతుంటాడు. నిద్ర కోసం తపిస్తూంటాడు. ఆ సమయంలో రెండోసారి ఇదే జోలపాట వస్తుంది.
(‘నీ మది చల్లగా’ సెకండ్ వెర్షన్ పాటని యూట్యూబ్లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=mkZXeZ7AtJw)
ఈ రెండు సందర్భాలలో జోల పాటకు బాణీని సంగీత దర్శకుడు హిందీ సినిమా ‘శర్మీలీ’ లోని సూపర్ హిట్ పాట ‘ఖిల్తె హైఁ గుల్ యహాఁ’ నుంచి తీసుకున్నాడు. ‘భీమ్ పలాసి’ రాగంలో ఎస్డీ బర్మన్ రూపొందిచిన ఈ పాట రొమాంటిక్ పాట. ‘శర్మీలీ’ సినిమాలో కూడా ఈ పాట రెండు సార్లు వస్తుంది.
మొదటిసారి అమ్మాయిలందరి ముందు శశికపూర్ పాడతాడు. కానీ అతని దృష్టి నాయిక పైనే ఉంటుంది. ఈ పాటను కవి నీరజ్ తాత్విక శృంగార గీతంగా రచించాడు. జీవితం క్షణికం. ఈ క్షణమే మనకున్నది. కాబట్టి ఈ క్షణమే మనం జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాలన్న భావనను పాటలో పొదిగాడు.
ఖిల్తె హైఁ గుల్ యహాఁ, ఖిల్ కె బిఖర్నే కో
మిల్తె హైఁ దిల్ యహాఁ, మిల్ కె బిఛడ్నే కో
‘రాలిపోయేందుకు పూలు పూస్తాయి. విడిపోయేందుకే హృదయాలు కలుస్తాయి’ అంటూ ఆరభమయ్యే ఈ పాటను నీరజ్ ఎంతో కవితాత్మకంగా రాశాడు. సరస్సుల పెదవులపై మేఘాల రాగాలున్నాయి. పెదాలలో ఒదిగిన తీయని గీతాలున్నాయి. ఈ ప్రేమ వాతావరణం రేపు ఉన్నా లేకున్నా, వసంతం ఆగినా ఆగకున్నా, ఈ రోజు లభించిన ఈ నాలుగు క్షణాలను ప్రేమలో గడిపేద్దాము అంటూ సాగుతుంది పాట. కిషోర్ కుమార్ చక్కగా ఆకర్షణీయంగా పాడేడు. సూపర్ హిట్ అయింది పాట.
(‘ఖిల్తె హైఁ గుల్ యహాఁ’ మేల్ వెర్షన్ పాటని యూట్యూబ్లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=gc51A0ncc1M)
సినిమా కొన్ని మలుపులు తిరుగుతుంది. ఇద్దరూ ఒకే రకంగా ఉండటంతో ఒకరొకరని పొరపడి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటాడు హీరో. ఆ నిరాశలో అతడు తాగుడులో పడి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాడు. అతడు వివాహమాడిన అమ్మాయి అతడి వేదనను గ్రహించి, తానే అతడు ప్రేమించిన అమ్మాయి అని భ్రమింప చేస్తుంధి. అతడిని భ్రమింప చేయటం ఈపాట రెండొసారి రావటంతో ఆరంభమవుతుంది. ఈ పాటను పాడింది లతా మంగేష్కర్.
ఒకే పాటను గాయకుడు, గాయని వేర్వేరుగా పాడే పాటలను, ‘టాండెమ్’ పాటలంటారు. అధిక సందర్భాలలో గాయకుడు పాడినది అధికంగా ప్రజాదరణ పొందుతుంది. అందుకే ఇలాంటి పాటలలో లతా మంగేష్కర్, తనదైన ప్రత్యేకతను ప్రదర్శిస్తూ ఒకే బాణీ అయినా, తాను పాడే పాటను గాయకుడి పాటకు భిన్నంగా తీర్చిదిద్దుతుంది. ‘శర్మీలీ’ సినిమాలో పాటల సందర్భాలు వేరు. కిషోర్ కుమార్ పాడేది ఆనందకరమైన రొమాంటిక్ సందర్భం. నాయిక పాడే సందర్భం గంభీరమైనది. హీరో ఆరోగ్యం బాగుయ్యేందుకు నాయిక మరొకరిలా ప్రవర్తిస్తున్నది. భ్రమింపచేస్తోంది. హీరో ఆమెని దగ్గర తీసుకోవటం కూడా ఆమె మరెవరో అనుకుని. అంటే సందర్భంలో విషాదం అంతర్గతంగా ఉంది. కాబట్టి గాయని అదే పాట, అవే పదాలు పాడినా పాటలో ఓ రకమైన విషాదాన్ని అంతర్లీనంగా ధ్వనింప చేస్తుంది లత. పాటలో బిఖర్నే కో, బిఛడ్నే కో లను సాగదీసి పాడటంలో వేదనను ప్రతిఫలింప చేస్తుంది. ముఖ్యంగా ‘కో’ అని సాగదీసి అనటం, ‘బిఛడ్’ ను నొక్కి పలకటం విడపోవాల్సి వస్తుందన్న వేదనను ఇనుమడింప చేస్తుంది. ఆమె నటన ఎంతో కాలం నడవదని ఆమెకు తెలుసు.
‘హో, ఝీలోం కె హోఠోం పర్’ అనేప్పుడు ‘హో’ అనటంలో రోదనను ధ్వనింప చేస్తుంది ‘కణస్వరం’తో. ఇక పాటనిండా గమకాలు, దీర్ఘాలు, ఒత్తి పలకటం, మృదువుగా పదాన్ని పాడటం, పదాలు పలకటం నడుమ ఎడం ఉంచటం.. ఒక పాటను ఎంత అద్బుతంగా పాడవచ్చో, అంత అద్భుతంగా పాడింది లత. తాను పాడే విధానంతో పాట స్థాయిని పెంచింది. కిషోర్ కుమార్కు శాస్త్రీయ సంగీతం అంతగా రాదు. దాన్ని ఆసరాగా తీసుకుని, తన శాస్త్రీయ సంగీత ప్రతిభతో పాటకు సంపూర్ణంగా నూతన రూపురంగులను అద్దింది లత. గాయనిగా కిశోర్ కుమార్ కన్నా తాను ఏరకంగా ఒక మెట్టుపైనున్నదో పాటద్వారా ప్రదర్శించింది.
(‘ఖిల్తె హైఁ గుల్ యహాఁ’ ఫీమేల్ వెర్షన్ పాటని యూట్యూబ్లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=tlnIot7sw1A)
తెలుగులో ఇదే బాణీని తీసుకుని జోలపాటగా మలచటంతో సంగీత దర్శకుడు టి.వి. రాజు ప్రతిభ ద్యోతకమవుతుంది. బాణీ అదే. కానీ, రొమాంటిక్ పాట జోలపాటలా మారిపోయింది. హిందీ పాటలోని సంతూర్, సాక్సాఫోన్, వైబ్రాఫోన్, వయోలిన్లు; తెలుగులో గిటార్, వేణువు, వీణ, తబలాలుగా మారిపోయాయి. పాట లయ అదే అయినా భావన మారిపోయింది. హిందీలోని రొమాంటిక్ భావన తెలుగులో ప్రశాంత భావనగా మారిపోయింది.
గేయ రచయిత డా. సి. నారాయణరెడ్డి పల్లవి ఆరంభించటంలోనే గొప్ప చమత్కారం చేశాడు. ఆనంద భైరవి రాగానికి చెందిన ప్రఖ్యాత కీర్తన, కవి మాతృభూతయ్య రచించిన ‘నీ మది చల్లగా నన్ను బ్రోచుట’ నుంచి ‘నీ మది చల్లగా’ను తీసుకున్నాడు. దాంతో పాటకు ఆకర్షణీయమైన ఆరంభం దొరకటమే కాదు, పాటలో తరువాత ప్రకటించే ఆలోచనకు తాత్విక భూమిక దొరికినట్టుయింది. శ్రేయస్సు, ప్రేయస్సులలో శ్రేయస్సుకు ప్రాధాన్యమిచ్చి భౌతిక సుఖలాలసను వర్జింప చేసినట్టయింది పల్లవిలోనే. అన్ని వేదనలను భగవంతుడిపై భారం వేసి ప్రశాంతంగా ఉండమని పల్లవి చెప్తోంది.
కవి మాత్రుభూతయ్య పాట ‘ నీ మది చల్లగా ఇక్కడ వినండి.
ఏ సిరులెందుకు? ఏ నిధు లెందుకు?
ఏ సౌఖ్యము లెందుకు? ఆత్మశాంతి లేనిదే
మనిషి బ్రతుకు నకరమౌను, మనసు తనది కానిదే.
సినీ సాహిత్యమే ప్రధాన సాహిత్యంగా సమాజంలో చలామణీ అవుతున్న సమయంలో సినీ సాహిత్యాన్ని సమాజానికి మంచి చెప్పేందుకు వాడాల్సి ఉంటుంది. ధనం వెంట పడి ఆత్మశాంతి కోల్పోయి బ్రతుకు నరకం చేసుకోవద్దని, భౌతిక సుఖాలాలసలో ఆత్మను కోల్పోతున్న సమాజానికి నిజం చెప్పి, సరైన దారి చూపి కౌన్సిలింగ్ చేస్తున్నట్టుంటుందీ పాట. రాత్రింబవళ్లు ఎవరి అభివృద్ధి, సౌఖ్యాలు కోరి డబ్బు వెంటపడుతున్నారో, వారిని పట్టించుకునే తీరిక లేకుండా జీవితాలు గడిపేస్తున్న వారందరినీ ఆపి, ఆలోచింప చేస్తుందీ పాట. ఎన్ని సౌఖ్యాలున్నా ఆత్మశాంతి లేకపోతే ఏం లాభం?
హిందీతో పోలిస్తే, పాట బాణీ వేగాన్ని కాస్త తగ్గించారు. తెలుగు పాటను గాయని సుశీల సుతిమెత్తగా, ఒక పిల్లవాడిని మృదువుగా జోకొడుతూ, ఉయ్యాల ఊపుతూ జోలపాట పాడుతున్నట్టు పాడుతుంది. తెలుగు పాట వింటుంటే నిశ్శబ్ద ప్రశాంత సముద్రం ఎదురుగా కూర్చుని, సముద్రపు ప్రశాంత గీతాన్ని అనుభవిస్తూంటే, మౌనపుటలల ప్రశాంత సంగీతం అణువణువునా పరవళ్లు త్రొక్కుతున్నట్టుంటుంది. పాట రచనలో నారాయణ రెడ్డి వాడిన పదాలు, హిందుస్తానీ బాణీలోని కర్ణాటక సంగీత ఛాయలను అనుసరించి ఉన్నాయి. దాంతో హిందుస్తానీ బాణీ మారకుండానే పాటకు తెలుగుదనం వచ్చింది. ఇలా హిందుస్తానీ బాణీని అనుసరించినా, హిందుస్తానీ వాసనలు తెలియకుండా గీతాన్ని రచించటం అంత సులువు కాదు. కానీ, సినారే ఎంతో అలవోకగా పాటను రచించినట్టనిపిస్తుంది. అందుకే, తెలియకపోతే, ఇది హిందీ బాణీకి అనుకరణ అన్న ఆలోచన రానేరాదు.
ఈ పాటను సుశీల పాడిన విధానం, హిందీలో లత పాటతో పోటాపోటీగా ఉంటుంది. లత పాటలో ఎన్ని భావాలు ప్రకటిస్తూ, ఎన్నెన్ని అలంకారాలతో పాటను అలంకరించిందో, తెలుగులో అన్ని అలంకారాలనూ ధ్వనిస్తూ, సుశీల మృదువుగా, అప్పుడప్పుడు గుసగుసలాడుతున్నట్టు, పిల్లవాడిని అనునయిస్తున్నట్టు పాడుతూ గమకాలతో, దీర్ఘాలతో, పాటను భగవంతుడికి అర్పించే మాలికలా రూపొందించింది. ‘ఖిల్’ అన్న పదం బాహ్యంగా ధ్వనిస్తే, ‘నీ’ అంటూ తెలుగులో ఆరంభమే, అంతరంగ లోలోతుల్లోనుండి వెలువడే భావనలా పాట ఆరంభమవుతుంది. ‘చల్లగా’ అని ఎంత చల్లగా అంటుందో, ‘స్వామీ నిదరపో’ లో అంతగా ప్రేమ, అభ్యర్థనలు ధ్వనిస్తాయి. ‘నీడలో’ని వేదన పదాలలో పలికించిన భావం ఎంతో గొప్పగా ఉంటుంది. ‘యే సిరులెందుకు నిధులెందుకు’ అనటంలో తూష్ణీభావం ధ్వనిస్తుంది. ‘యే సౌఖ్యం’ లో సౌఖ్యం ఎంత కష్టమో అన్నట్టుంది. అదే సమయంలో ‘బుజ్జగింపు’ కూడా ధ్వనిస్తుంది.
చీకటి ముసిరినా, వేకువ అగునా
ఏ విధి మారినా దైవం మారునా?
కలిమిలోన లేమిలోన పరమాత్ముని తలచుకో..
అతి చక్కటి భావం, కష్టాలు ఎల్లప్పుడూ ఉండవు. వచ్చే కష్టాలు పోతాయి. రాత్రి తరువాత పగలు రాకమానదు. ఈ ప్రపంచంలో అన్నీ క్షణభంగురమైనవే. ఏదీ శాశ్వతం కాదు. శాశ్వతం దైవమే. కాబట్టి కష్టం లోనే కాదు సుఖంలో కూడా, అంటే నిరంతరం భగవంతుడిని తలచుకోవాలి. మనకు భగవంతుడంటే ధర్మం. కాబట్టి ధర్మం పాటిస్తూ, నిస్వార్థంగా, నిర్మోహంగా, నిరంతరం భగవధ్యానం చేస్తూ జీవించాలి. ‘దేవుని నీడలో వేదన మరచిపో’ అని పల్లవిలో అన్నది భారం భగవంతుడిపై వేసి నిశ్చింతగా జీవించమని మళ్లీ చెప్తోంది.
పాట చిత్రీకరణ ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది. అలాగని కెమేరా చిత్ర విచిత్రాలు చేయదు. సన్నివేశం గంభీరమైనది. అందుకని పాత్రల భావాలు ప్రేక్షకులకు తెలిపేందుకు క్లోజప్పులు, ‘మిడ్ షాట్’లు అధికంగా వాడేరు. ‘మిడ్ షాట్’ అంటే నడుం పై భాగంపై దృష్టి పెడుతుంది కెమేరా. ఇందువల్ల హావభావాలు, శరీర కదలికలపై ఫోకస్ ఉంటుంది. ప్రేక్షకులకు పాత్రల భావాలను అర్ధం చేసుకునే వీలుంటుంది. అందుకే నేపథ్యంలో గోడలపై ఆకర్షించేవేవీ ఉండవు. ‘మిడ్ ఫ్రేమింగ్’ వల్ల ప్రేక్షకుల దృష్టి అంతా పాత్రల మీదే ఉంటుంది. అటూ ఇటూ చెదరదు. దీని వల్ల పాత్రలతో ప్రేక్షకులు తాదాత్మ్యం చెందుతారు. అప్పుడప్పుడు డాలీ షాట్లు, ట్రాకింగ్ షాట్లతో పాత్రలను వెన్నంటి ఉండి ఎమోషన్లను ప్రేక్షకులకు చేరువ చేస్తుంది చిత్రీకరణ. ఈ చిత్రీకరణ వల్ల పాటలో పదాల భావం ప్రేక్షకుడు అనుభవిస్తాడు. దృష్టి పదాల పైనే నిలుస్తుంది. గంభీరమైన, అర్థవంతమైన పాటల చిత్రీకరణలో ఈ టెక్నిక్ వాడతారు.
రెండవసారి ‘నీ మది చల్లగా’ పాట వచ్చేసరికి పరిస్థితి మారిపోతుంది. గతంలోని ఆత్మీయిత ఉండదు నాయికా నాయికల నడుమ. మత్తుమందు లేనిదే నిద్ర పట్టదు నాయకుడికి. ఇప్పుడతడి వెంట మరో అమ్మాయి ఉంటుంది. డబ్బుంటుంది. శాంతి ఉండదు. ‘మార్ఫియా’ కావాలంటాడు హీరో నిద్రపట్టటానికి. అప్పుడు డాక్టరు అతడి భార్యతో మార్ఫియా ఇస్తే ‘వారికి వారే దక్కరు’ అంటాడు. పిల్లలు నాన్నకి నిద్ర ఎందుకు పట్టట్లేదని అడిగితే అతని భార్య ‘మనిషి పడుకున్నా మనసు పడుకోని వాళ్లకు, సంపాదనే తప్ప సంతృప్తి లేని వాళ్లకు నిద్ర పట్టదు. మనశ్శాంతి దొరకదు’ అని సమాధానం ఇస్తుంది. ఎప్పుడయితే మార్ఫియా ఇస్తే వారికి వారే దక్కరు అని డాక్టర్ అంటాడో అప్పుడామో ‘నీ మది చల్లగా’ అని పాట అందుకుంటుంది. పాటకు ప్రిల్యూడ్ సంగీతం ఉండదు. హఠాత్తుగా ఆరంభమవుతుంది.
ఇప్పుడు కూడా పాట రెండు చరణాలుంటుంది. పాట బాణీ అదే అయినా పాట పాడే విధానంలో తేడా ఉంటుంది. ఇప్పుడు శాంతంతో పాటు కరుణ భావం కూడా ధ్వనిస్తుంది. ఇంటర్లూడ్ సంగీతం లోనూ, పాడే విధానం లోనూ, ‘ఏ సిరులెందుకూ?’ చరణం అదే పాడినా, ఇప్పుడు ప్రేక్షకులకు అది అర్థమయ్యే తీరు వేరు. మొదటి సారి పాట వచ్చినప్పుడు ఈ చరణం హెచ్చరిక. ఇప్పుడు చేదు నిజం.
జానకి సహనము, రాముని సుగుణము
ఏ యుగమైననూ ఇలకే ఆదర్శము
వారి దారిలోన నడచు వారి జన్మ ధన్యము
గొప్ప భావం. చక్కని పద ప్రయోగం. అతి సున్నితము, సరళము, అద్భుతమైన రచనా సంవిధానం. ఏ యుగంలోనయినా ఆదర్శం సహనం, సుగుణం. మిగతావన్నీ ఈ రెంటి ముందు దిగదుడుపే. ఇవి లేకపోతే అశాంతి. ఎపుడయితే సమాజం ఈ రెంటినీ తిరస్కరించి తాటకిని, శూర్పణఖను, రావణాసురుడినీ ఆదర్శంగా తీసుకుంటుందో అప్పుడు ఆ సమాజం అశాంతిమయమవుతుంది. ఈ విషయంలో ఎవరికైనా సందేహలుంటే ఒక్కసారి కళ్లు తెరచి సమకాలీన సమాజాన్ని చూస్తే చాలు బోధపడుతుంది.
ఈ పాట నారాయణ రెడ్డి ఎంత గొప్పగా రచించాడంటే సినిమా లక్ష్యం మొత్తం ఈ పాట ప్రతిబింబిస్తుంది. మార్ఫియా తీసుకుంటే ‘వారికి వారే దక్కరంటాడు’ డాక్టరు. ‘వారి దారిలోన నడుచు వారి జన్మ ధన్యం’ అంటుంది పాట. ఎవరిదారిలో నడవాలో వ్యక్తి నిర్ణయించుకోవాలి. వ్యక్తి నిర్ణయం సమాజంపై ప్రభావం చూపిస్తుంది.
ధర్మ మార్గం కంటకాకీర్ణ మార్గమయినా ఆ మార్గంలో ఉన్న సంతృప్తి , శాంతి, సౌఖ్యం అధర్మ మార్గంలో ఉండదు. అధర్మ మార్గంలో సౌఖ్యం అధికంగా ఉన్నట్టనిపించినా శాంతి ఉండదు. డబ్బు ధ్యాసలో వారికి వారే కాకుండా పోతారు మనుషులు. ఇందుకు భిన్నంగా ధర్మ మార్గమైన జానకీరాముల బాటలో నడచేవారు ధన్యులు. రాముడు మూర్తీభవించిన ధర్మం. అధర్మ మార్గం ప్రేయస్సు, ధర్మ మార్గం శ్రేయస్సు. ఇదీ పాట.
సందర్భం, బాణీ, సంగీతం, పదం, స్వరం, దృశ్యం అన్నిటి నడుమా అవగాహన, సమన్వయం ఉండటం వల్ల వేర్వేరు వాయిద్యాలు కలసి సృష్టంచే మధురమైన ధ్వని (symphony) ఎంత గొప్పగా ఉంటుందో, అంత గొప్పగా పాట రూపొందింది. మనస్సుకు శాంతి కలుగుతుంది. అంటే, సినిమా పాటలు ఒక రకంగా సమాజానికి కౌన్సిలింగ్ చేస్తున్నాయన్నమాట. ఈ కౌన్సిలింగ్ శ్రేయస్సు వైపుంటే దేవుడి నీడలో వేదన మరచిన సమాజం ఆత్మశాంతితో, జీవితాన్ని ధన్యం చేసుకుంటుంది. ఇందుకు భిన్నంగా కౌన్సిలింగ్ ప్రేయస్సు వైపుంటే మనిషి మనసు తనది కాకుండా, ధనంతో సహా భౌతిక సుఖాల మృగతృష్ణల వెంట పడి, బ్రతుకు నరకం చేసుకుని అశాంతి అగ్నికీలలలో దగ్ధమౌతూ అలమటిస్తుంది సమాజం.
‘వారి దారి లోన నడుచు వారి జన్మ ధన్యం’. ఎవరి దారిలో నడవాలో ఎంచుకునే బాధ్యత వ్యక్తిది. సమాజానిది.
(మళ్ళీ కలుద్దాం)
