Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మధురగీతాలు – మనోహరదృశ్యాలు-59

[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]

నీ ధర్మం, నీ సంఘం, నీ దేశం నువు మరవద్దు
జాతిని నడిపి నీతిని నిలిపిన మహానీయులనే మరవద్దు.

‘కోడలు దిద్దిన కాపురం’ (1970) సినిమాలో డా. సి. నారాయణ రెడ్డి రచించగా, సంగీత దర్శకుడు టి.వి.రాజు స్వరపరచిన మధురమైన ప్రబోధాత్మక గీతం ఇది. ఈ పాట నటి సావిత్రిపై చిత్రితమయింది.

‘కోడలు దిద్దిన కాపురం’ సినిమా పేరులోనే సినిమా కథ తెలుస్తుంది. అస్తవ్యస్తంగా, అరాచకంగా ఉన్న కుటుంబాన్ని కోడలు ఒక దారిలో పెడుతుందని అర్థం అయిపోతుంది. ఈ పాట కోడలి పాత్ర వ్యక్తిత్వాన్ని, ఆలోచనలను; ధర్మం, సంఘం, దేశం పట్ల, నీతి, నియమాల పట్ల, నైతిక విలువలు పట్ల ఆ పాత్రకున్న అభిమానాన్ని, గౌరవాన్ని, భక్తిని ప్రదర్శిస్తుంది.

సందర్భాన్ని పాట డామినేట్ చేయటం ఈ పాట విషయంలో చూడవచ్చు. నాయిక పిల్లలకు పాఠాలు చెప్తుంటుంది. పిల్లలకు ఆమె చెప్పే పాఠాలు ఆమె వ్యక్తిత్వాన్ని సూచిస్తాయి. ఈ సందర్భంగా, మన సినిమాల్లో టీచర్లు  పాఠాలు చెప్పే పాటలను విహంగ వీక్షణం చేస్తే, ఇతర పాటలకు భిన్నంగా ఉన్న ఈ పాట గొప్పతనం తెలుస్తుంది.

‘నా మాటే నీ మాటై చదవాలి’ అనే ‘మట్టిలో మాణిక్యం’ సినిమా పాటలో ప్రేయసి, ప్రియుడికి చదువు నేర్పుతుంది.  ‘చదువురాని వాడవని దిగులు చెందకు’ అని ప్రేయసి ప్రియుడికి ధైర్యం చెప్తుంది అన్నం పెడుతూ, ‘ఆత్మబంధువు’ సినిమాలో.

తెలివి లేని లేగ దూడ పిలుచును ‘అంబా’ అని
యేమెరగని చంటి పాప యేడ్చును ‘అమ్మా’ అని
చదువులతో పని యేమి హృదయమున్న చాలు
కాయితంపు పూలకన్నా గరిక పూలు మేలు.

ఈపాట యూట్యూబ్ లో చూడవచ్చు.

ఈ పాటలో భావం ‘చదువులు’ ఎక్కువై ‘హృదయం’ తక్కువైన ఇప్పటి సమాజానికి అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ‘మనిషిని మనిషిగా నిలిపే విద్య’ – చదువులుగా మారినప్పటి నుంచి, మనిషి పశువై, చివరికి బొద్దింకగా, క్రిమికీటకాలుగా గుర్తింపు పొందేందుకు, అలా ప్రవర్తించేందుకు తహతహలాడటం చూస్తూంటే ‘మంచు వంటి మల్లెవంటి మంచి మనసుతో జీవించలేని పనికిరాని బ్రతుకులెందుకు?’ అన్న కవి ముందు చూపుకు , సామాజిక మనస్తత్వ అవగాహనకూ జోహార్లర్పించాలనిపిస్తుంది. ఇందుకు పూర్తిగా భిన్నమైన పాట ‘అమ్మ మాట’ సినిమాలోని ‘ఎప్పుడూ మీ పాఠాలంటే ఎలాగండి సార్’ అంటూ విద్యార్ధిని ‘కన్నెమేనిలో ఉన్నాయి, ఏ గనిలో దొరకని రతనాలు’ అని టీచర్‌కి ప్రేమ పాఠాలు నేర్పుతూ రెచ్చగొడుతుంది సంస్కారవంతంగా  ఈ పాటలో. ‘దేవుడు చేసిన పెళ్లి’ సినిమాలో హీరో ‘పాఠాలు నేర్పేటి పంతులమ్మా, ప్రేమ పాఠాలు చెబుతావా ఎప్పుడైనా?’ అని అడిగేస్తాడు.

ఈచక్ దానా, బీచక్ దానా పాట ఇక్కడ చూడండి.

హిందీలో ‘శ్రీ 420’ సినిమాలో నాయిక ‘ఈచక్ దానా బీచక్ దానా’ అంటూ పొడుపు కథల పాటలు పాడుతుంది. ‘కాగజ్ కే ఫూల్’ లో ‘ఏక్ దో తీన్ చార్’ అంటూ అంకెలు నేర్పుతూ ‘0’ ను నాయకుడికి ప్రతీక చేసి, అతడిని అందరూ వదిలేశారని, ఒంటరిగా మిగిలి పోయాడని పాటలో చెప్తుంది నాయిక. ‘ఏక్ బిఛ్‌డా తన్హా తన్హా ఫిర్‌తా థా ఆవారా సా’ అంటూ చదువు ముగిస్తుంది. ‘గంగా జమునా’ సినిమాలో టీచర్ ‘ఇన్సాఫ్ కీ డగర్ పె బచ్చో దిఖావో చల్కె, యే దేశ్ హై తుమ్హారా, నేతా తుమ్హీ హో కల్ కే’ అంటూ పిల్లలు న్యాయబాటలో నడవాలనీ, భవిష్యత్తు నాయకులు వారేనని, దేశం వారిదేనని బోధిస్తూ పాడుతాడు.

“ఇన్సాఫ్ కీ డగర్ పే ” పాట చూడండి

ఇంకా ఈ పంథా లోనే అనేక గీతాలున్నాయి. అవి అటు నీతి  నేర్పేవో, ఇటు నాయికానాయకుల పరిస్థితిని పాటలోని పాఠాలలో ప్రదర్శించేవో అయి ఉంటాయి. ఇందుకు భిన్నంగా, పాత్ర వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూ, కథలో అంతర్భాగమై, సినిమాలో తరువాత సంభవించే సంఘర్షణల స్వరూపాన్ని లీలగా ప్రదర్శిస్తూ, సమాజానికి ధర్మం, సంఘం, దేశం గురించిన అవగాహన కల్పించే పాట ‘కోడలు దిద్దిన కాపురం’ సినిమాలోది.

‘నీ ధర్మం, నీ సంఘం’ పాటకు సంగీత దర్శకుడు టి.వి.రాజు. అత్యద్భుతమైన గీతాలను సృజించిన సంగీత దర్శకుడు. పాటను మృదుమధురంగా ఒక జోలపాటలా, ఒక నీతి బోధన పాటలా, ఒక దేశభక్తి పాటలా గేయ రచనను అనుసరించి బాణీని  రూపొందించాడు. ముఖ్యంగా పల్లవికీ బాణీకీ నడుమ ఉన్న సంగీతం పాట భావాన్ని బట్టి మారుతుంది. పాటలో వ్యక్తపరచిన విభిన్నమైన భావాలకు  పాట ఒక పాఠం అన్న నిజానికీ నడుమ అద్వితీయమైన రీతిలో సమన్యాయం సాధించాడు.

శాంతిని, నైతిక విలువల స్పష్టతనూ, భక్తి భావాన్ని, గౌరవ భావాలను మనసులో కలిగించే మోహన రాగంలో పాటను రూపొందించాడు సంగీత దర్శకుడు. గేయ రచయిత పాట రచనలో చమత్కారం చేశాడు. నిజానికి డా. సినారె రాసిన పాటలను, పాటల సందర్భాలు, పాత్రల వ్యక్తిత్వాలతో, తరువాత సినిమాలో జరిగే సంఘటనలతో పరిశీలిస్తే, నారాయణ రెడ్డి గేయ రచనా నైపుణ్యం అర్థమవుతుంది. సినిమాలో పాటలు రాయాలనే ఉత్సాహం ఉన్న వారికి పెన్నిధి ఆయన పాటలు. తరగని గని ఆయన గేయాలు.

ఈ పాట ‘నీ ధర్మం, నీ సంఘం, నీ దేశం’ అంటూ ఆరంభవుతుంది. మొదటి చరణం ధర్మం గురించి చెప్తుంది. నైతిక విలువలు నేర్పుతుంది. ధర్మం తరువాత, సంఘం, సంఘం గొప్పతనం, బాహ్యం నుంచి కృత్రిమ ప్రేరణ లేకుండా ఎలాగ భారతీయ సమాజం తనని తాను  సంస్కరించుకుంటూ, లోపాలను సవరించుకుంటూ, అన్యాయాలను సరిదిద్దుతూ సజీవ నదిలా  ముందుకు సాగుతున్నదో చూపిస్తుంది. మూడవ చరణం దేశం గురించి, దేశం కోసం సర్వం త్యాగం చేసిన వారి గురించీ చెప్తుంది. అంటే పల్లవిలో ఏ క్రమంలో అయితే ధర్మం, సంఘం, దేశం అన్నాడో అదే క్రమంలో ఒకో  చరణం ఆ అంశం గురించి రాశాడన్నమాట. సినారే  రాసిన ఇతర పాటలను పరిశీలిస్తే కూడా పాటను నిర్మించిన విధానం అబ్బురపరుస్తుంది. అతి తక్కువ మంది గేయ రచయితలు పాటను ఒక భవంతిని నిర్మించినట్టు ఒక ఇటుక  తరువాత మరో ఇటుక పేర్చినట్టు  పాటను నిర్మిస్తారు.  మనిషికి అన్నిటికన్నా ముఖ్యం ధర్మం. ధర్మాన్ని పాటిస్తే, సంఘం అభివృద్ధి చెందుతుంది. సంఘం అభివృద్ధి చెందితే అది దేశాభివృద్ధికి దారితీస్తుంది. ధర్మం, సంఘం, దేశం.. ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవి. ధర్మం పాటించకపోతే సంఘం అల్లకల్లోలమవుతుంది. అల్లకల్లోమయిన సంఘం దేశం అల్లకల్లోలమయ్యేందుకు దారి తీస్తుంది. కాబట్టి, సంఘం, దేశం బాగుండాలంటే, ధర్మం పాటించాలి. అందుకే, నీ ధర్మం, నీ సంఘం, నీ దేశం అని పాటను ఆరంభించాడు కవి. నైతికవిలువలు లేని వ్యక్తులద్వారా సంఘం దెబ్బతింటుంది. దెబ్బతిన్న సంఘం దేశాన్ని దెబ్బతీస్తుంది. “నీ ధర్మం, నీ సంఘం, నీ దేశం నువు మరవద్దు” అంటూ పాటను ఆరంభించటంలోనే, సత్ప్రవర్తన, క్రమశిక్షణ, ధర్మపాలనల ప్రాధాన్యం స్పష్టమవుతుంది.

సత్యం కోసం సతినే అమ్మిన దెవరూ?
హరిశ్చంద్రుడు
తండ్రి మాటకై కానలకేగిన దెవరూ?
శ్రీరామ చంద్రుడూ
అన్న కోసమే అంకితమైనది ఎవరన్నా?
లక్ష్మన్న
పతియే దైవమని తరించి పోయిన దెవరమ్మా?
సీతమ్మ
ఆ పుణ్యమూర్తులు చూపిన మార్గం అనుసరించే ధర్మం
అనుసరించుటే నీ ధర్మం.

ధర్మాసూక్ష్మాన్ని ఒక్క ముక్కలో చెప్పేశాడు గేయ రచయిత. నైతిక విలువలు, మానవ సంబంధాలు ఉత్తమ ఆదర్శాలను బోధించి, వారిని అనుసరించటమే ధర్మం, అదే నీ ధర్మం అని అతి గొప్పగా చెప్పాడు. సత్యం పాటించాలి. పెద్దలను గౌరవించాలి. కుటుంబ బంధాలకు గౌరవమివ్వాలి. దాంపత్య ధర్మాన్ని పాటించాలి. ఇది మన ధర్మం. ఇదే మన ధర్మం. భారతీయ ధర్మం.  ఎవరికయినా ఏదైనా సందేహం వస్తే సమాధానం శాస్త్ర గ్రంథాలలో లభ్యం కాకపోతే పెద్దలు, ఉత్తములు నడచిన బాటను అనుసరించమంటుంది. ‘యద్యదాచరతి శ్రేష్ఠ స్తత్త దేవేతరో జనః’, గొప్పవారు, సమాజంలో శ్రేష్ఠులైన వారు ఏ పని చేస్తారో సామాన్య ప్రజలు కూడా అదే పని చేస్తారు. పెద్దలు దేనిని ప్రామాణికంగా నమ్ముతారో, లోకమంతా దాన్నే అనుసరిస్తుంది (భగవద్గీత 3.21).

మొదటి చరణంలో చివరి పాదం ఇదే చెప్తుంది. వారు పుణ్యమూర్తులు. వారు చూపించిన మార్గాన్ని అనుసరించటమే ధర్మం. అయితే, పూర్వీకులన్నా, పెద్దలన్నా గౌరవాభిమానాలులేక,  తూష్ణీభావం ప్రదర్శించటమే అభ్యుదయం,  తిరుగుబాటు పేరిట పెద్దలు నేర్పిన నైతిక విలువలను త్రోసి రాజనటమే అభివృద్ధి అనుకుని దీపం వైపు దూసుకెళ్లే దీపం పురుగుల్లా పరుగులు  తీసేవారికి ఎవరు మాత్రం ఏం చెప్పగలరు? ఇది మంచి, పాటిస్తే మంచిది. లేకపోతే మీ ఖర్మం అని తమ కర్తవ్యం నిర్వహించి చేతులు దులుపుకోవటం తప్ప మరేం చేయగలరు? ఇది నీ ధర్మం అంటే నా ధర్మం కాదని, నీ సంఘం అంటే నాకీ సంఘంతో పని లేదనీ, ఇది నీ దేశం అంటే నాకు దేశం అనే  భావం లేదని కాలర్లు ఎగరేసే వారిని ఏమంటాం? నువ్వెలాగో మునుగుతావు,  మిగతా అందరినీ ముంచుతావని దండం పెట్టటం తప్ప. అయినా ఇలాంటి పాటలు గుర్తు చేసి వివరించటం  మన కర్తవ్యం. వింటే బాగుపడతారు. లేకపోతే సమస్త సమాజాన్నీ నష్టపరుస్తారు. వారితోపాటూ అందరూ అనుభవిస్తారు.

సుశీల ఈ పాటను అద్భుతంగా పాడిందనటం, అంతకన్నా చక్కని పదం దొరకకపోవటం వల్ల. పిల్లలను ఒకో ప్రశ్నా అడిగేప్పుడు అలవోకగా ప్రశ్నకు తగ్గ భావం ఆమె స్వరం పలుకుతుంది. హరిశ్చంద్రుడనేప్పుడు ఒక రకమైన గర్వం, రాముడనేప్పుడు భక్తి భావం, లక్ష్మణుడనేప్పుడు ఆనందం, సీతమ్మ అనేప్పుడు కరుణతో పాటు ఆరాధనా భావం కూడా పలుకుతుంది. అతి  గొప్ప గాన సంవిధానం ఇది. ఈ రకమైన గాన సంవిధానాన్ని ఈ పాటలో చరణాల్లోని ప్రతి పాదంలో గమనిచవచ్చు. ఆ పాదం పలికే విధానంలోనే భావం అనుభవానికి వస్తుంది.

చాప కూడుతో సమతను నేర్పెను వాటి పలనాటి బ్రహ్మన్న
మేడి పండులా మెరిసే సంఘం గుట్టు విప్పేనూ వేమన్నా
వితంతువుల విధి వ్రాతలు మార్చి బ్రతుకులు పండించె కందుకూరి
తెలుగు భారతిని ప్రజల భాషగా తీర్చిదిద్దెను గురజాడ
ఆ సంస్కర్తల ఆశయ రంగం నీవు నిలబడిన సంఘం
నీవు నిలచిన నీ సంఘం..

సంఘ సంస్కరణల గురించి చెప్పటంలో ప్రధాన ఉద్దేశ్యం భారత సమాజం ఎన్నడూ నిశ్చలంగా లేదని, నిత్యచలనశీలి అని చూపించటం కోసం.  అంటే, భారతీయ సమాజం ఒక సజీవ నదిలా ప్రవహిస్తూ, ఉపనదులను చేర్చుకుంటూ, కల్మషాలను ప్రక్షాళన చేసుకుంటూ, అవసరమైన చోట తన గతిని మార్చుకుంటూ ప్రవహిస్తున్న సజీవనది అని నిరూపించటమే కాదు ఆ సంస్కర్తల ఆశయ రంగమైన ఈ సంఘం నీది, దీనిలో మంచిని పెంచి చెడును తొలగించే బాధ్యత నీ వారసత్వం అని సున్నితంగా చెప్తున్నదీ పాట. సంకుచితత్వం వదలమని చెప్తున్నది. కులం, మతం, ప్రాంతం, భాష వంటి సంకుచిత భావనలు నాటి వారికి లేవు. ఆధునిక సాంకేతిక వైజ్ఞానిక అభివృద్ధికి ప్రతినిధి అయిన నీకూ సంకిచితం వలదని, అతి సున్నితంగా హెచ్చరిస్తున్నది పాట.

ఇటీవలి  కాలంలో కొందరు మేధావులుగా చలామణీ అవుతున్న వారు భారతీయ సమాజం ఆరంభం నుంచీ  ఒకేలాగ ఉందని తీర్మానాలు చేస్తున్నారు. నిత్య చలనశీలి , నిత్య పరిణామ శీలి భారతీయ సమాజం.  పరిస్థితులకు తగ్గట్టు తనని తాను పునర్మించుకుంటూ, పునర్నిర్వచించుకుంటూ,  నూతన రూపు ధరించినా మౌలిక ధర్మాన్ని వదలకుండా ముందుకు సాగుతున్న భారతీయ సమాజం గురించి వారికేమీ తెలియదని అనుకోవాలి. లేదా విద్వేషపూరితమయిన, విఛిన్నకర భావజాలాన్ని కావాలనే ఒక పద్ధతిప్రకారం సమాజంలో విస్తరిస్తున్నారని అనుకోవాలి.  ఈ నిజాన్ని మరింత స్పష్టం చేస్తూ ఆ సంస్కర్తల ఆశయ రంగం అంటూ బ్రహ్మన్న కాలం నుంచి నేటి వరకూ వివిధ రూపాల్లో నిత్య పరిణామశీలి  అయిన భారతీయ సమాజ స్వరూపాన్ని ఆవిష్కరించాడు గేయ రచయిత.

స్వతంత్ర భారత రథసారథియై సమరాన దూకె నేతాజీ
సత్యాగ్రహమే సాధనమ్ముగా స్వరాజ్యమే తెచ్చె బాపూజీ
గుండు కెదరుగా గుండె నిలిపెను ఆంధ్రకేసరి టుంగుటూరి
తెలుగు వారికొక రాష్ట్రం కోరి ఆహుతి ఆయెను అమరజీవి
ఆ దేశ భక్తులు వెలసిన దేశం, నీవు పుట్టిన భారతదేశం
నీవు పుట్టిన ఈ దేశం..

ఇదీ పాట.  మూడు నిముషాల్లో దేశ ధర్మాన్ని, సంఘాన్ని దేశ స్వతంత్రపోరాటాన్ని హృదయానికి హత్తుకునే రీతిలో వివరించాడు గేయ రచయిత. కొందరికి నెహ్రూ, పటేల్‌ల పేర్లు ప్రస్తావించలేదన్న సందేహం రావచ్చు. ఈ పాటలో నాలుగు పాదాల పరిమితిలో వైవిధ్యాన్ని విభిన్నత్వాన్ని ప్రదర్శించాడు గేయ రచయిత. పటేల్, నెహ్రూలు గాంధీ, మార్గాన్ని అనుసరించినవారు. దేశ స్వతంత్ర పోరాటంలో రెండు విభిన్నమైన మార్గాలు హింస పూరిత పోరాటం, అహింసాయిత పోరాటం. పోరాటపథాన్ని ఎంచుకున్నవాడు నేతాజీ. అహింస పద్ధతికి ప్రతినిధి గాంధీజీ. ఈ రెండు పాయలు ప్రస్తావిస్తే దేశ స్వతంత్ర పోరాట వీరులందరినీ స్మరించినట్టు అవుతుంది. అందరూ ఈ రెండు మార్గాల్లో ఒదుగుతారు. ఏ ప్రజలయితే తమ దేశం కోసం పోరాడిన వీరులను అవమానిస్తారో, వారికి ఆ పోరాట ఫలితాలను అనుభవించే హక్కు లేదంటారు. అందుకే ‘నీవు పుట్టిన ఈ దేశం’ని నొక్కి చెప్తున్నాడు గేయ రచయిత. ఇటీవలి కాలంలో ఇజాల, రాజకీయాల కళ్ళద్దాలు ధరించి దేశ భక్తులను దూషించటం, అవమానించటం, వారి త్యాగాలను హేళనచేస్తూ చులకనగా మాట్లాడటం, సంకుచిత, విద్వేషకర భావజాలంతో, త్యాగధనులను, గౌరవార్హులను తీసిపారేయటం సాధారణమవుతున్నది.  తనవారిని గౌరవించలేనివాడు స్వయంగా గౌరవహీనుడవుతాడన్న సత్యాన్ని విస్మరించి నాశనం కోసం పరుగులు తీస్తున్న మిడుతల్లా ప్రవర్తిస్తున్న సమాజానికి, మేలుకొల్పులాంటిదీ  పాట.  సిద్ధాంతం ఏదయినా కావచ్చు. ప్రాంతం ఏదయినా కావచ్చు. భాష ఏదయినా కావచ్చు. భావజాలం ఏదయినా కావచ్చు. కానీ, అందరిదీ ఒకటే దేశమయినప్పుడు, దేశభక్తులు, త్యాగధనులు, కులం, మతం, ప్రాంతం, భాషలతో ప్రమేయం లేకుండా  అందరికీ గౌరవపాత్రులే. ఈ విచక్షణ మరచిన సమాజానికి ఇలాంటి పాటల అవసరం చాలా ఉంది.

పాట చిత్రీకరణ ఆ కాలం నాటి పాటల చిత్రీకరణ స్థాయిలోనే ఉంది. పెద్ద ట్రిక్ ఫోటోగ్రఫీ అవసరం లేదు. మహానటి సావిత్రి, ముఖ కవళికలను, ప్రదర్శించిన భావాలను క్లోజప్పులో చూపిస్తే పాట పండుతుంది. సుశీల గానాన్ని సావిత్రి అనుసరించింది. సావిత్రిని అనుసరించి సుశీల భావ ప్రకటన చేసింది. అంతే! అయితే, సావిత్రి రూపం మారటం తెలుస్తుంది. బాధగా అనిపిస్తుంది. పాట ఏయే గొప్పవారిని ప్రస్తావిస్తున్నదో, వారి విగ్రహం సరసన నటిని క్లోజప్ లో చూపించటం తప్పనిసరి. ఈ రకంగా పాట చిత్రీకరణకు సూచనలిస్తుంది.

సావిత్రిని లో-ఏంగిల్ క్లోజప్పులలో చూపించటం వల్ల ఆమె పిల్లలకు అధికారి అన్న భావన కలగటంతో పాటు, వారిని రక్షిస్తున్న మాతృమూర్తి అని అనిపిస్తుంది. పిల్లలు ఏకాగ్రతగా వింటున్నట్టు చూపించేందుకు ‘ఐ లెవెల్ షాట్స్’ వాడేరు. దాని వల్ల పిల్లలందరూ పాఠాలు వింటున్నట్టు అనిపించటంతో పాటు, ప్రేక్షకులు తామూ ఆ తరగతిలో భాగం అయినట్టు భావిస్తారు.

కెమేరా కదలికలతో పాటు, భావాన్ని అనుసరిస్తూ తాన్పూరా, హార్మోనియంలు, అందంగా మ్రోగుతాయి. ఇంటర్ల్యూడ్ సంగీతం వీణ, వేణువుల అద్భుతమైన కలయికతో పాటకు  ఊపునిస్తుంది. తబలా లయను పాటిస్తుంది. నేతాజీ ప్రస్తావన వచ్చినప్పుడు ‘సైన్యం నడక’ను తలపింప చేసే సంగీతం వస్తుంది. ఈ రకంగా సంగీతం, సాహిత్యం, దృశ్యం, గానం కలగలసి ఈ పాటను నిత్యం వినవలసిన, విని పాటించవలసిన గొప్ప మధురమైన  పాటగా నిలిపాయి.

ఇలాంటి పాటలు ఇప్పటి సినిమాల్లో కనిపించవు. ఒకప్పుడి సినీ కళాకారులు తప్పనిసరిగా ఏదో ఒక సందర్భంలో తమ దేశం, ధర్మం, సంస్కృతి, సంప్రదాయాల ఔన్నత్యాన్ని తెలుపుతూ, నైతిక విలువలను బోధించే పాటలను చొప్పించేవారు.  మంచి చెప్పేవారు, నైతిక విలువలు నేర్పిస్తూ, దేశభక్తి బోధించేవారూ ఇప్పటి సినిమాలకు అవసరం లేదు.  సమాజపుటాలోచనలను, సంస్కృతిని నిర్దేశించే స్థాయిలో ఉన్న సినిమాలకూ, సినిమా కళాకారులకు సైతం సామాజిక బాధ్యత గురించిన చైతన్యం ఉన్నట్టు కనబడదు. ఇంకో కోణంలో చూస్తే,  ఇలాంటి పాటల అవసరం కూడా సమాజానికి ఉన్నట్టు అనిపించదు. ధర్మం, సంఘం దేశం – ప్రస్తుతం రాజకీయాల  రంగులు పులుముకుని, కలుషితమైన మెదళ్లకు ఉచ్చరించకూడని పదాలుగా మారేయి. ఇలాంటి పరిస్థితులలో ధర్మక్షేమం, సంఘక్షేమం, దేశక్షేమం కోరేవారు ఇలాంటి పాటలను సమాజానికి పరిచయం చేయాలి. నిజానిజాలు నవ తరానికి వివరించటం  ద్వారా వారిలోని ధర్మభక్తినీ, సంఘభక్తినీ, దేశభక్తినీ  జాగృతం చేయటం ఒక ఉద్యమంలా చేపట్టాలి.తమకు ఆశ్రయమిస్తున్న కొమ్మనే నరుకుతూ, అదే గొప్ప అని విర్రవీగుతున్న వారి మత్తును వదల్చి కనీసం రాబోయే తరాలకోసం ధర్మరక్షణదీక్షాబద్ధులను చేయాలి. “నీ ధర్మం, నీ సంఘం, నీదేశం నువు మరవద్దు, జాతిని నడిపి, నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు” అన్నది ప్రతి పౌరుడి హృదయంలో ప్రతిధ్వనించాలి.

~

(‘నీ ధర్మం, నీ సంఘం, నీ దేశం’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=SDAomyuZKTc)

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version