[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]
మనసా కవ్వించకే నన్నిలా
ఎదురీద లేక కుమిలేను నేనూ
సుడిగాలిలో చిక్కినా నావనూ..
‘పండంటి కాపురం’ సినిమాలో సుశీల పాడిన ఈ పాటను ఒక ‘అద్భుతం’ అనటం, ఇంతకన్నా మరో పదం దొరక్క. సినిమా పాటలను సంగీతం కాదనీ, పాటల సాహిత్యాన్ని సాహిత్యం కాదనీ, సినిమా గానాన్ని చులకన చేస్తూ మాట్లాడేవారి అభిప్రాయాన్ని మార్చగల గొప్ప పాట ఇది. సినీ కళాకారులు తమ ప్రతిభతో లలిత గీతాలుగా భావించే సినీ పాటలను శాస్త్రీయ సంగీత స్థాయికి ఎదిగించటాన్ని నిరూపించే పాటలలో ఇదొక పాట. సినిమా సందర్భం దాటి సార్వజనీక స్థాయిని అందుకున్న పాట ఇది.
‘పండంటి కాపురం’ సినిమా ఉమ్మడి కుటుంబాలలో మానవ సంబంధాల స్వరూప స్వభావాలను గొప్పగా ప్రదర్శిస్తుంది. ప్రతీకారేచ్చతో రగులుతూ, మానవత్వం లేనట్టు, జాలి దయ లేనట్టు ప్రవర్తించే మహిళ నవనీతంలాంటి అంతరంగాన్ని ప్రదర్శిస్తుందీ సినిమా. ఈ సినిమాలో నటి జమున పాత్ర విలక్షణమైనది. హిందీ సినిమా ‘షికస్త్’ తరువాత అంత విభిన్నమైన మహిళ పాత్ర ఈ సినిమాలోని ‘మాలినీ దేవి’ పాత్ర. ఇప్పుడు సినిమాల్లో టీవీ సీరియళ్లలో దాదాపుగా దుష్ట పాత్రలలా కనిపించే ప్రతీకార వాంఛతో రగిలిపోయే మహిళల పాత్రలకు ‘బీజం’ మాలినీదేవి పాత్ర. అయితే, ఇప్పటి దుష్ట మహిళల పాత్రలకు అస్సలు మానవత్వం అన్నది లేనట్టుంటుంది. , పైకి కఠినంగా, క్రూరంగా కనిపించినా, అది మనుషుల్లో ఇంకా మానవత్వం సజీవంగా ఉన్న కాలం కాబట్టి ‘మాలినీ దేవి’లాంటి పాత్ర రూపొందింది. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన పురుషుడిపై, అతని కుటుంబాన్ని నాశనం చేయటం ద్వారా, ప్రతీకారం తీర్చుకునే పాత్ర ఇది. ముఖ్యంగా, అతడి వల్ల తనకు వివాహం కన్నా ముందే పుట్టిన సంతానం తనకు దూరమైందన్న బాధతో కుమిలిపోతుంటుందీ పాత్ర.
సినిమా స్క్రిప్టు రచయిత ఈ పాత్ర వ్యక్తిత్వాన్ని చక్కగా రూపొందించాడు. 1964లో విడుదలయిన ఆంగ్ల సినిమా ‘ది విజిట్’ ఈ సినిమాకు ప్రేరణ. ఆ ఆంగ్ల సినిమాకు అదే పేరుతో ఉన్న ఓ నాటకం ప్రేరణ. ఆంగ్ల సినిమాలో, యవ్వనంలో తనను గర్భవతిని చేసి న్యాయస్థానాన్ని కొనేసి తన ప్రవర్తన మంచిది కాదని నిరూపించి, ఊరి నుంచి గెంటేయిస్తాడు ఆమె ప్రియుడు. ఆమె బోలెడంత డబ్బు సంపాదించి, ఆర్థికంగా దిగజారుతున్న ఊరికి తిరిగి వస్తుంది. డబ్బు ఆశ చూపించి ఊళ్లో అందరినీ తనను మోసం చేసిన వాడికి వ్యతిరేకంగా మారుస్తుంది. అతడిని చంపమంటుంది. న్యాయమూర్తులు అతడికి మరణ శిక్ష విధిస్తారు. అతడి కుటుంబం కూడా అతడికి వ్యతిరేకమవుతుంది. మరణ శిక్ష అమలు అయ్యే సమయానికి ఆమె అతడిని విడిపించి, అన్ని బంధాలు డబ్బుపై ఆధారపడ్డవే అని వెక్కిరించి, డబ్బు కోసం అమ్ముడుపోయిన ఊళ్లోవాళ్లని హేళన చేసి వెళ్లిపోతుంది.
ఈ కథను పూర్తిగా మన వాతావరణానికి తగ్గట్టుగా మలచారు. అందరూ కలసి మెలసి ఉండే కుటుంబం, అహంకార కలహాలతో విచ్ఛిన్నమవుతున్న కుటుంబం (హిందీ సినిమా ‘దో రాస్తే’) ‘మాలినీదేవి’ కుట్రలతో పూర్తిగా విచ్ఛిన్నమైపోతుంది. ఆమెను మోసం చేసిన అతడి ఉద్యోగం ఊడగొడుతుంది. అన్నివైపులనుంచీ అతడిపై ఒత్తిడి పెంచుతుంది. ఆమెను మోసం చేసిన అతని పాత్రను ఉదాత్తంగా మలచి, ఆమె వదిలేసిన బిడ్డను ఈయన పెంచుకున్నట్టుగా చూపి, వేరే అమ్మాయిని వివాహమాడేందుకు ఓ కారణం చూపి ‘దుష్ట’ పాత్రను మన వాతావరణానికి తగ్గట్టు శిష్టంగా మలచారు. చక్కటి కుటుంబం విచ్ఛిన్నమైపోవటం ప్రేక్షకుల సెంటిమెంటును తాకితే, సినిమాలోని మెలోడ్రోమా, మాలినీదేవి ప్రతీకారేచ్ఛ సినిమాను మరుపురాని సినిమాగా నిలుపుతుంది.
గుమ్మడి పాత్ర మాలినీదేవిని మోసం చేస్తుంది. అందుకని అతడు పని చేసే మిల్లును కొనేస్తుంది. మిల్లు నుంచి అతడి ఉద్యోగం పీకిస్తుంది. అతడి కుటుంబంలో కలహాలు పెంచుతుంది. తన తప్పు ఏమిటో తెలుసుకునేందుకు అతడు, అంతవరకూ కలవని కొత్త యజమానిని కలసేందుకు వస్తాడు. అతడితో కఠినంగా మాట్లాడుతుంది. అహంకారంగా ప్రవర్తిస్తుంది. కానీ, అతడు వెళ్లిపోయిన తరువాత ఎంతో మానసిక సంఘర్షణను అనుభవిస్తుంది. ప్రేమ ద్వేషంగా మారినా, మౌనంగా ఆమె మంచితనం అణచిపెట్టి ఉంచిన ప్రేమ ఉబికి వస్తాయి. సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతూన్న తన మానసిక సంఘర్షణను పాట ద్వారా వ్యక్తపరుస్తుంది. ఆ పాటే ‘మనసా కవ్వించకే నన్నిలా’. ఆమె అతడిపై ప్రతీకారం తీర్చుకుంటున్నది, కానీ, అతడిపై ప్రేమను చంపుకోలేపోతున్నది. ప్రతీకారం సంతృప్తినిస్తున్నది. కానీ, శాంతిని ఇవ్వటంలేదు. అదంతా ఈ పాటద్వారా ఆమె ప్రకటిస్తున్నది.
పాటలో ఆమె మానసిక సంఘర్షణను చక్కగా ప్రదర్శించాడు గేయ రచయిత మైలవరపు గోపి. పల్లవిలోనే పాత్ర సంఘర్షణను, మానసిక వేదనను అత్యద్భుతంగా ప్రదర్శించాడు. మౌలికంగా ఆమె మంచిదే. ఆమెలో కాఠిన్యం పరిస్థితుల వలన వచ్చి చేరింది. ప్రతీకార భావనతో రగులుతున్నా, అతని పై ప్రేమ సజీవంగానే ఉంది. ఇన్నాళ్ల తరువాత అతడిని చూడగానే గతం మనసులో మెదలింది. ఆమెకు తన ప్రవర్తన తన స్వభావానికి విరుద్ధమైనదని తెలుసు. కానీ మోసం చేసినవాడిని క్షమించటం కుదరదు. తాను ఎంత ధనవంతురాలైనా, జీవితంలో తాను కోల్పోయిన దాన్ని ధనంతో కొనలేదనీ తెలుసు. మానవ మనస్తత్వాన్ని, మంచి చెడులను, సంఘర్షణలను చాలా చక్కగా ఈ పాత్ర ద్వారా ప్రదర్శించారు. మిగతావన్నీ మూస పాత్రలే.
ఈ సందర్భంలో పాటను సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి ‘తిలాంగ్’ రాగంలో మలచాడు. ‘మనసా’ లో ‘సా’ దగ్గర రాగం తీయటం – సుశీలకున్న ఊపిరిపై నియంత్రణని ప్రదర్శించటమే కాదు, తన మనసుకు తానే నచ్చచెప్తున్నట్టు, మనసులో మాట చెప్పుకునేందుకు ఎవ్వరూ లేని ఒంటరితనానికి దీర్ఘ నిశ్వాసం తీస్తున్నట్టు అనిపిస్తుంది. ‘మనసా’ దగ్గర సుశీల ఆలాపన వినగానే, ‘మై నషే మే హుఁ’ సినిమాలో శంకర్-జైకిషన్ సంగీత దర్శకత్వంలో ‘లతా’ పాడిన ‘సజన్ సంగ్ కాహే నేహా లగాయా’ పాట గుర్తుకు వస్తుంది. ముఖ్యంగా ‘కాహే’లో ‘కా’ దగ్గర లత అలాపన, ‘మనసా’లో ‘సా’ దగ్గర సుశీల ఆలాపనలు ఒకే రాగాన్ని రెండు విభిన్నమైన భావాలు వ్యక్తపరచేందుకు వాడటానికి చక్కని ఉదాహరణ. ‘తిలాంగ్’ రాగం వేదనను, విరహాన్ని, విషాదాన్ని ధ్వనింప చేస్తుంది.
‘మనసా’, ‘సజన్ సంగ్’ రెండూ విషాద గీతాలే అయినా ‘మనసా’ పాట పూర్తిగా ఆంతరంగికం. నాయిక తనలో తాను పడుతున్న మథనం. అదే ‘సజన్ సంగ్’ పాట తన వేదనను బాహ్యంగా వ్యక్తపరుస్తూ, తనని తాను దూషించుకుంటున్న పాట. రెండు పాటలు ‘ఫిర్యాదు’ పాటలే అయినా ‘మనసా’ తనలో తాను కుములుతున్న పాట. ‘సజన్ సంగ్’ తనను తాను దూషించుకునే పాట. తెలుగులో తిలాంగ్ రాగాన్ని శుద్ధంగా అనుసరిస్తే, హిందీ పాటలో తిలాంగ్ రాగాన్ని సరళం చేసి, దానికి పాశ్చాత్య సంగీతంతో కలిపి విభిన్నమయిన రీతిలో రూపొందించారు. నిజానికి, పండిత రవిశంకర్, భారతీయ పాశ్చాత్య సంగీతాల కలయిక అయిన ఫ్యూజన్ సంగీతానికి ప్రాచుర్యం తెచ్చినా, శంకర్ జైకిశన్, వారి తొలిసినిమా ‘బర్సాత్’ నుంచీ ఫ్యూజన్ సంగీతాన్ని ఇస్తునే ఉన్నారు. దానికి ఈ పాట ఒక చక్కని నిదర్శనం.
(‘సజన్ సంగ్ కాహే నేహా లగాయా’ పాటని యూట్యూబ్లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=dRbIg-ZncEI)
పైకి ఎంతో కఠినంగా, అహంకారంగా, ఎవ్వరినీ లెక్కచేయని ‘ఉక్కు’ మనిషిలా కనిపించినా, అంతరంగికంగా వ్యక్తి ఎంత సున్నితమనస్కుడో, ఎంత బలహీనుడో, మానసిక సున్నితత్వాన్ని కప్పిపుచ్చుకునే బాహ్య కవచం అహంకారం ప్రదర్శన, కాఠిన్య ప్రదర్శన అని ‘పల్లవి’ లోనే అతి చక్కగా చెప్తాడు గేయ రచయిత. సుశీల ఈ బలహీనతలను, సంఘర్షణలను, ఆవేదనలను అతి చక్కగా తన స్వరంలో ధ్వనింప చేసి పాట ప్రభావాన్ని ఇమడింప చేస్తుంది.
పాటలో వాయిద్యాలను ఎంతో సృజనాత్మకంగా వాడేడు సంగీత దర్శకుడు. వీణ, సితార్ లతో చరణానికి పల్లవికీ నడుమ, గతం గుర్తుకు రావటం వల్ల కలిగిన ఆనందాన్ని, ఆ వెంటనే విషాదాన్ని అద్భుతంగా ప్రదర్శిస్తే, రెండవ చరణానికి ముందు వేణువుతో కరుణరసాన్ని పలికింప చేసి పాట ప్రభావాన్ని పెంచుతాడు. ముఖ్యంగా పాట ఆరంభంలోని తబలా తాళం పాట ప్రభావాన్ని ఇనుమడింప చేస్తూ, ఆకర్షణీయం చేస్తుంది.
ఆనాడు వెన్నెల నేనై కరిగాను కౌగిలి లోనా
ఈనాడు చీకటిలాగా మిగిలాను చీకటిలోనా
నేనోడిపోయి గెలుపొందినాను
గెలిచానని, నవ్వనా? ఏడ్వనా?
దర్శకుడికీ, గేయ రచయితకూ , కెమేరామెన్కూ, ఎడిటర్కూ నడుమ చక్కటి సమన్వయాన్ని ప్రదర్శిస్తుంది పాట చిత్రీకరణ. మానసిక సంఘర్షణను పలికే పదాలు వచ్చినప్పుడు నటి ముఖంలోని నిరాశను ఆవేదనను క్లోజప్పుల్లో చూపించటం, అద్దంలో నాయిక కనిపించటం, పాత్ర ‘alter-ego’ తన మనసును తాను ప్రశ్నిస్తున్న భావనను కలిగించేందుకు కెమేరా నటిని వెంబడిస్తూ ‘లో ఏంగిల్ ట్రాకింగ్ షాట్స్’ లో చూపటం వంటి చక్కని అవగాహనను కెమేరా ప్రదర్శిస్తుంది. నేపథ్యం లోని విశాల భవనం ఆమె ఒంటరితనాన్ని తెలుపుతుంది. అంతేకాదు, చుట్టూ ఉన్న వాతావరణం ముందు ఆమె ఒంటరితనంతో పాటు, విధి ముందు ఆమె ఎంత అల్పమైనదో చూపిస్తుంది.
పాటలో సుశీల వేదనాభరితమైన రాగాలు తీసినప్పుడు, గమకాలు వేసినప్పుడు కేవలం నటి ముఖాన్ని మాత్రమే క్లోజప్పులో చూపిస్తూ, సుశీల స్వరం పలికుతున్న వేదనను నటి వదనంలో ప్రదర్శించటాన్ని ప్రేక్షకులకు చేరువ చేస్తుంది కెమేరా. ఇప్పటి సినిమాల్లో ఇలాంటి ఎమోషనల్ పాటలు లేకపోవటం, క్లోజప్పులో నటులు హావభావాలను ప్రదర్శించటం లేకపోవటం వల్ల గాయకులకు, నటులకు నడుమ పాత సినిమా పాటల్లో ఏర్పడిన సంబంధం ఇప్పటి సినిమాల్లో ఏర్పడటం లేదు. అంతేకాదు, ఇప్పటి సినిమా హీరోలు మనుషులన్న భావనకూడా కలగటంలేదు.
పాట చిత్రీకరణలో గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే, ‘ఆనాడు వెన్నెల నేనై’ అన్నప్పుడు ఆరుబయట, వెలుతురులో దృశ్యం కనిపిస్తుంది. ‘ఈనాడు చీకటి లాగా’ అన్నప్పుడు విశాలమైన గదిలో ఓ మూల చీకటి నీడ పక్కన నేపథ్యంలో ఖాళీగా ఉన్న చోట నటి కనిపిస్తుంది. తరువాత క్లోజప్పులో నటి వదనం చూపించినప్పుడు పెదువుల వణుకు, కళ్లల్లో భావనలు స్పష్టంగా తెలుస్తాయి. భావాలను సుశీల స్వరం ధ్వనింప చేయటంతో పాటుగా, ప్రతి పదాన్ని స్పష్టంగా ఉచ్చరించటం కూడా నటి ప్రదర్శించే భావనల స్వరూపాన్ని ప్రేక్షకులను చేరువ చేస్తుంది.
మోముపై ముంగురలేమో వసివాడి మల్లియలాయే
గుండెలో కోరికలన్నీ కన్నీటి చారికలాయే
ఏ తీవెకైనా కావాలి తోడు
నా జీవితం శాపమా? పాపమా?
‘ఏ తీవెకైనా కావాలి తోడు’ అన్నది సత్యం. మనిషి పైకి ఎంత మొండిగా ప్రవర్తిస్తూ, అహంకారం ప్రదర్శించినా ‘చీకటి ముసిరిన ఏకాంతంలో తోడొకరుండిన అదే భాగ్యమూ, అదే స్వర్గమూ’ అన్న భావనకు లొంగకుండా ఉండలేడు. ఒంటరి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ‘జీవితానికి అర్థం ఏమిటి? గమ్యం ఏమిటి?’ వంటి ప్రశ్నలు తలెత్తి బాధించకుండా ఉండవు. గెలుపు, ఓటములను నిర్దేశించేది ప్రపంచం కాదు. మనిషి మనసు. ప్రపంచం పైపై మెరుగులు చూస్తుంది. అంతరంగంలోకి చూడలేదు. అందుకే ప్రపంచం అసూయతో జిలుగు వెలుగుల వైపు చూస్తూంటే, ఆ వెలుగుల్లో ఉన్నవారు మానసికంగా దుర్భరమైన చీకటిలో మగ్గుతూంటారు. అర్ధాంతరంగా జీవితాలను అంతం చేసుకుంటారు. మళ్లీ ప్రపంచం వారి వైపు జాలిగా అయోమయంగా చూస్తుంది.వారి ఐశ్వైర్యాన్ని, విజయాన్ని ఆరాధించిన ప్రపంచం, వారి అంతరంగంలోని ఒంటరి తనాన్ని, ప్రేమరాహిత్యభావననూ అర్ధం చేసుకోలేదు.
సినిమాలో మాలినీదేవి పాత్ర ధనవంతురాలు. కొండ మీద కోతి కూడా పరుగెత్తుకు వస్తుంది ఆమె దగ్గరకు. ప్రపంచం పాదాక్రాంతం అవుతుంది ఆమె ఐశ్వర్యానికి. బయట నుంచి చూసే వారికి ఆమె భవంతి, వారు అనుభవిస్తున్న ఇతర సౌఖ్యాలు, సుఖజీవనం కనిపిస్తుంది. కానీ అసలు మానసిక సంఘర్షణలు, ఆవేదనలు, ఆశ నిరాశలు ఈ వెలుగుల నీడల్లో ఒదిగి ఉంటాయి. అందరి ముందు ఠీవిగా ఉండే ఆమె, ఒంటరితనంలో ‘మనసా కవ్వించకే నన్నిలా’ అంటూ తాను గెలిచిందా? ఓడిందా? అన్న మీమాంసలో రగులుతూంటుంది.
ఒంటరి జీవితాల సంఖ్య ప్రస్తుత సమాజంలో పలు కారణాల వల్ల పెరుగుతున్నది. అహంకారాలకు ఇచ్చిన ప్రాధాన్యం సామరస్యానికి ఇవ్వటంలేదు. ఆవేశమే అలంకారం అయింది సమాజంలో. వ్యక్తిగతానికి ఇచ్చిన ప్రాధాన్యం సమాజానికి, సమష్టికీ లభించటంలేదు. “మనము”ను వదలి “నేను” అనటమే ఆధునికం అయింది. కలసి ఉండటం కష్టం, విడిపోవటం సుఖం అనుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. రాజీ పడటం చేతకానితనం, అవమానం అయింది. దాంతో ఒంటరిగా జీవించేవారి సంఖ్య అధికమవుతున్నది. ఒంటరి జీవితం సృజించే మానసికసమస్యల ప్రభావం వ్యక్తులజీవితాలనూ, సమాజాన్నీ అల్లకల్లోలం చేస్తున్నది. ఒంటరిగా బ్రతకటం ఊహలో అందంగా, ఆనందంగా అనిపించినా, ఒంటరిగా ఉండేవారికి ఏదో ఒకసమయంలో తోడు అవసరం తెలియటంతో మాయమాటలతో మోసంచేసేవారికి అవకాశాలు పుష్కలంగా లభిస్తున్నాయి. మోసపోయి జీవితం శూన్యంగా అనిపించి జీవితేచ్ఛ నశించేవారి అధికమవుతున్నారు.” ఏ తీవెకైనా కావాలితోడు” అన్న సత్యం బోధపడేసరికి తీవెలు తొలిచేపురుగుల తావులైపోతున్నాయి. సామాజిక సౌఖ్యాలు విపరీతంగా పెరుగుతున్నా, వ్యక్తుల జీవితాలలో సందిగ్ధాలు, అసంతృప్తులు అంతకన్నా ఎక్కువవుతున్నాయి. ప్రపంచం విజేతలుగా పరిగణిస్తున్న వారు అనూహ్యంగా అకస్మాత్తుగా అదృశ్యం అయి అయోమయాన్ని ఆవేదనను, కలిగించటం అనుభవిస్తూనే ఉన్నాం. మనం అభిమానించేవారు, ఆరాధించేవారు, ఆత్మీయులు ఇలా అన్యాయంగా దూరమవటం ఎంతో క్షోభను కలిగిస్తుంది. మాట పంచుకునే మనిషి లేకపోవటం కలిగే అనర్థం ఇది. ఆ నిజాన్ని స్పష్టం చేస్తుందీ పాట. అహంకారంతో అనాలోచితంగా దూరదృష్టి లేక, ‘స్వేచ్ఛ’ అన్న పదానికి సరైన అర్థం తెలియక, తాత్కాలిక ఆకర్షణల ప్రలోభంలో పడి శాశ్వతంగా ఆనందాలను అనుబంధాలను దూరం చేసుకునే వారందరూ విని, అర్థం చేసుకుని భవిష్యత్తును వర్తమానంలో తీర్చిదిద్దుకొనేందుకు ఉపయోగపడుతుందీ పాట. ఇలాంటి పాటలు ముత్యాల మూటలు. సమాజాన్ని ప్రభావితం చేసే కళ ద్వారా సమాజానికి ఉపయోగపడే సందేశం ఇస్తూ, సమాజం ప్రయాణిస్తున్న దారివల్ల భవిష్యత్తులో జరిగే పరిణమాల స్వరూపాన్ని వివరిస్తూ మార్గదర్శనం చేయటం ఉత్తమ కళాకారుల కర్తవ్యం. ఇందుకుభిన్నంగా, పతనంవైపు సమాజాన్ని ప్రోత్సహిస్తూ అదే ఉత్తమ కళ అని ప్రచారం చేసేవారినీ, సమాజానికి హితం చెప్పే కళాకారులను వేరుచేసి చూపిస్తాయి ఇలాంటి కౌన్సిలింగ్ చేసే పాటలు.
~
(‘మనసా కవ్వించకే నన్నిలా’ పాటని యూట్యూబ్లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=_A2Cm4dlSYQ)
(మళ్ళీ కలుద్దాం)
