Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మధురగీతాలు – మనోహరదృశ్యాలు-61

[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]

ఏదో ఒక రాగం పిలిచిందీ వేళా
నాలో నిదురించే గతమంతా కదిలేలా
నా చూపుల దారులలో, చిరు దీపం వెలిగేలా
నా ఊపిరి తీగలలో, అనురాగం పలికేలా
జ్ఞాపకాలే మైమరపూ, జ్ఞాపకాలే మేల్కొలుపు,
జ్ఞాపకాలే నిట్టూర్పూ, జ్ఞాపకాలే ఓదార్పు.

కొన్ని సినిమా పాటలుంటాయి. ఆ సినిమాలు ఆ పాటల వల్లే సూపర్ హిట్లవుతాయి. ఆ పాటల వల్లే సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ‘రాజా’ సినిమాలో చిత్ర, బాలసుబ్రహ్మణ్యంలు విడివిడిగా పాడిన ఈ ‘టాండెమ్’ పాట అలాంటి ఒక సూపర్ హిట్ పాట. ఈ పాట ఎంతగా ‘హిట్’ అయిందంటే హిందీలోకి ‘మన్’ సినిమాలో ‘చాహా హై తుమ్ కో’ అంటూ వెళ్ళిపోయింది. హిందీలో కూడా ‘హిట్’ పాటగా నిలిచించి.  కానీ సినిమాను హిట్ చేసే పాటగా ఎదగలేకపోయింది.

‘ఉన్నడాతిల్ ఎన్నై కొడుదన్’ అనే తమిళ సినిమా ‘రాజా’ సినిమాకు ప్రేరణ. దాదాపు మక్కీకిమక్కీ ఆ సినిమాను తెలుగులో తిరిగి తీశారు.

పాటకు ‘సందర్భం ఉందా?’ అంటే ‘ఉంది’. ‘లేదా?’ అంటే ‘లేదు’. అంటే, ఈ పాట సందర్బం  బలం ఉన్నది కాదు. ఇలాంటి బలహీనమైన సందర్భం పాట ఇంతగా ‘హిట్’ అవ్వాలంటే, పాట బాణీ అత్యుత్తమైనదిగా ఉండాలి. పాట పాడినవారు, నటన, చిత్రీకరణ వంటివి ఎంతో గొప్పగా ఉండాలి. లేదా, పాటకు నటించిన నటులపై ప్రేక్షకులకు క్రేజ్ ఉండాలి.

‘రాజా’ సినిమాలో ‘అంజలి’ పాత్ర నాయిక పాత్ర. ఈ పాత్ర నటి సౌందర్య ధరించింది. ఇద్దరు దొంగలను (వారిలో ఒకరు హీరో వెంకటేష్) నాయిక వంటింట్లో బంధిస్తుంది. పోలీసులకు ‘చెప్తా’నని బెదిరిస్తూ వారితో పనులు చేయించుకుంటుంది. ఆమె ఓ ముగ్గురు పిల్లలతో ఆ ఇంట్లో ఉంటుంది. పిల్లల తల్లిదండ్రులు, వారి బాధ్యతను నాయికకు అప్పగించి ఊరు వెళ్తారు. నాయిక, నాయకుల నడుమ ‘చూపు’ సందేశాలు ప్రయాణిస్తుంటాయి కానీ ఏ భావం స్పష్టం కాదు. ఇంతలో వాళ్ళని నాయిక, పనిచేయని టెలిఫోన్‌ను చూపి బెదిరిస్తున్నదని తెలుస్తుంది, టెలిఫోన్ రిపేర్ అయ్యాక. ఆ తరువాత వేడి వేడి మిర్చీ బజ్జీలు వేసిస్తాడు హీరో.

అవి తీసుకునేటప్పుడు మళ్ళీ కళ్ళు కలుస్తాయి. అంతకుముందు ఆమె దిండు సర్దుతున్నప్పుడే పాట ఆరంభ బాణీ (ప్రిల్యూడ్) మొదలైపోతుంది. మిర్చీ బజ్జీలు పిల్లలకు ఇచ్చి పాట పాడటం ఆరంభిస్తుంది.

పాట జ్ఞాపకాల గురించి. కాబట్టి ఆమె పాట ఆరంభించే సమయంలో ఫౌర్‌గ్రౌండ్‌లో పిల్లల తలలు నీడలో చూపిస్తూ, ఆమెను వెలుతురులో ఉంచి, మళ్ళీ నేపథ్యంలో కాస్త చీకటి వెలుతురు ఉంటుంది. అప్పుడు పాట ఆరంభమవుతుంది. అంటే, అప్పటివరకు చీటికలో ఉండి, ఇంకా ఎన్నో జ్ఞాపకాలు చీకట్లో ఉన్నాయని, దాన్లో ఏదో ఒక జ్ఞాపకం ఆమె మనస్సులో జాగృతమైందనీ సూచిస్తుంది దృశ్యం.

నిజానికి ఈ సందర్భానికి,  ఈ పాట భావానికి అంతగా ఔచిత్యం అనిపించదు. ఆమె వ్యక్తిగతంగా, ఒంటరిగా, ఏదో జ్ఞాపకం మదిలో మెదిలింది అని పాడుకుంటే అది వేరు. పాత సినిమాలో ఇలాంటి పాటలు అనేకం ఉన్నాయి. కానీ ఇక్కడ నాయిక పిల్లలతో ఆడుతోంది. నృత్యం చేస్తోంది. కానీ గొప్ప తత్వం పాడుతోంది. జ్ఞాపకాల ప్రాధాన్యం చెబుతోంది. ఆమెలో నిదురించే కథలెన్నో కదిలాయని చెప్తోంది. ఎవరికి చెప్తోంది? పిల్లలకా? అది అర్థం కాదు. హీరోకా? అయితే, ఆమె వ్యక్తిత్వం ప్రశ్నార్ధకమవుతుంది. ఆమె పాడుకుంటూంటే, ఆమెకు తెలియకుండా హీరో వచ్చి ఆమె మనసుమాట వినటం వేరు. అనేక పాత సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలుంటాయి. ప్రేక్షకులకా? అయితే, పాట మాధురీ స్రవంతిలో మునిగినవారిలో ఈ ప్రశ్నలు ఉత్పన్నం కావు. రసపట్టులో తర్కం కూడదు. సినిమాల్లో ఔచిత్యం వెతకవద్దు. మరో విషయం. పాట ఆరంభమయ్యేప్పుడు గోడపై ఉన్న గడియారం నాలుగు గంటలు చూపుతూంటుంది. పాట అయ్యేవరకూ పిల్లలు బజ్జీలు తింటూంటారు. పాట అవగానే పడుకుంటారు. సమయం కుదరదు. తెరపై అందమయిన నాయిక సౌందర్య, అభిమాన హీరో వెంకటేశ్ కనిపిస్తూ, హిట్ పాట పాడుతున్నప్పుడు, గోడపై గడియారాన్ని చూసి సమయ ఔచిత్యం గురించి ఆలోచించేవాడు కచ్చితంగా, ‘బెన్ హర్’ సినిమాలో, చారియట్ రేస్ సమయంలో ఎర్రకారును చూసినవాడిలాంటివాడే అయ్యుంటాడు!

పాట బాణీ చాలా ఆకర్షణీయమైనది. పాట ప్రిల్యూడ్ సంగీతం, ఇంటర్లూడ్ సంగీతం అత్యంత మధురంగా ఉంటాయి. ముఖ్యంగా పాట ఆరంభాన్ని సూచించే ప్రిల్యూడ్ సంగీతం ఒక రకమైన ప్రశాంతతను, ఆలోచనాత్మకమైన వాతావారణాన్ని గిటార్ తంత్రుల స్పందనతో కలిగిస్తుంది. మధ్య మధ్యలో వినిపించే వేణువు మనసును ఊపేస్తుంది. మధురమైన భావన కలిగించే మెరుపుతీగ లాంటి చిత్ర స్వరాన్ని ఇనుమడింపజేస్తూ వాయిద్యాలు మ్రోగుతుంటాయి.

ఈ పాట చిత్రీకరణలో పాటలో ప్రదర్శితమయ్యే భావ పరిధిని అనుసరించి కెమేరాను సృజనాత్మకంగా వాడేడు కెమేరా దర్శకుడు. పాటలో కాస్త ‘ఎమోషన్’ పలకగానే నాయికను క్లోజప్పులో చూపటం, వెంటనే ఇంట్లో బందీలా ఉన్న హీరోను చూపటం చక్కటి ప్రభావం కలిగిస్తుంది. ఇనుప ఊచల కిటికీ వెనకాల హీరోను చూపుతుండటం వల్ల నాయిక పట్ల పెరుగుతున్న అభిమానం, తన తక్కువ సామాజిక స్థాయి వల్ల దాన్ని వ్యక్తం చేయలేక, ఎమోషనల్‌గా బందీ అవటం స్ఫురింపజేస్తుంది కెమేరా. పిల్లలతో ఆడుతున్నప్పుడు ‘హై ఏంగిల్ షాట్లు’, కాస్త భావాత్మకమైన పాదం రాగానే ‘సర్క్యులర్ ట్రాకింగ్ షాట్లు’ వంటి పలు రకాల సృజనాత్మక కోణాలతో పాటను చూడటం చక్కటి అనుభవంలా మలుస్తాడు.

అమ్మా అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే
రా అమ్మా అని అమ్మే లాలించిన జ్ఞాపకమే
అమ్మ కళ్ళలో అపుడపుడు చెమరింతలు జ్ఞాపకమే
అమ్మ చీరనే చుట్టే పాప జ్ఞాపకం
అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం

ఇదంతా నాయిక గతం గుర్తు తెచ్చుకోవటం. గతమంతా కదిలిందని అన్నది కాబట్టి ఆమె గతం గుర్తుకు రావటం, ఆ గతంలోని దృశ్యాలను చూపటం మామూలే. సెంటిమెంటల్‌గా పాటలో భావం బాగుంది. కానీ పిల్లలతో ఆడుతూ పాడాల్సిన పాట ఇది కాదేమో అనిపిస్తుంది. పైగా, ఇంట్లో ఇద్దరు దొంగలు ఉన్నారు. వాళ్ళు యువకులు, వాళ్ళ ముందు ఇలా నృత్యం చేస్తూ, ఆడుతూ, పాడటం కూడా ఔచిత్యం కాదేమో అనిపిస్తుంది.

అయితే, ఇందుకు గేయ రచయితను తప్పు పట్టలేము. సందర్భోచితంగా రాసే గేయ రచయిత సీతారామశాస్త్రి. కానీ ఇక్కడ ఆయన తమిళ ఒరిజినల్ పాట భావానికి బందీ. మక్కీకి మక్కీగా కాకున్నా, ఆ భావాన్ని అనుసరించి రాయాల్సి వచ్చినట్టుంది.

(‘ఏదో ఒక రాగం పిలిచిందీ వేళా’ [ఫీమేల్ వెర్షన్] పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=DJsHiisfagY)

ఏదో ఒరు పాట్టూ ఎన్ కాదిల్ కేట్కుమ్
కేట్కుమ్ బోథెల్లామ్ సిల న్యాబగమ్ థాలత్తుమ్..

ఏదో పాట నా చెవుల్లో వినిపిస్తోంది. అది వినిపించినప్పుడల్లా నా జ్ఞాపకాలు నన్ను ఊయలలా ఊపుతున్నాయి. ఇలా సాగుతుంది పాట.

ఈ భావాన్ని అనుసరిస్తూ తెలుగు పాట సాగుతుంది. తమిళంలో హిట్ కాబట్టి తెలుగులోనూ దాదాపుగా ఇదే భావాన్ని అనుసరిస్తూ వీలయినంత  స్వతంత్రంగా అంటే, ‘స్వేచ్ఛానుసృజన’లా రచించారన్న మాట.

(‘ఏదో ఒరు పాట్టూ’ [ఫీమేల్ వెర్షన్] పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=8U-LQb6-pcE)

ఇదే రాగంతో, ఒక్క వాక్యం తేడాతో రెండోసారీ వస్తుందీ పాట. ఇప్పుడీ పాటను బాలసుబ్రహ్మణ్యం గొంతులో హీరో పాడతాడు. ఇక్కడ కూడా గేయ రచయితకు తమిళ గేయానికి అనుసృజన చేయాల్సి వచ్చింది. ఇప్పుడు హీరో మనసులో ఆ రాగం ఎన్నో కథలను కదిపింది. ‘ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా’ తప్ప, నాయిక పాటకూ నాయకుడి పాటకు పల్లవిలో  మరో మార్పు లేదు. సందర్భం మారుతుంది.

ఇప్పుడు నాయిక పిల్లలతో వర్షంలో తడుస్తూంటే, ఆమెను ఆటో ఎక్కించి పంపిస్తాడు హీరో. ఆటోలో వెళ్తూ నాయిక అతడికి చెయ్యి ఊపుతుంది. అంతే, నాయకుడి మదిలో నిదురించే కథలన్నీ కదలిపోతాయి. ‘సింగింగ్ ఇన్ ది రెయిన్’ లోలా గొడుగు తిప్పి విసిరేసి, రెండు చేతులూ చాపుతాడు. తరువాతి దృశ్యంలో సముద్రతీరంలో ఒంటరిగా నిలచి ఉన్న ద్వారబంధం వెనుక ఎగిరే పక్షుల నడుమ స్లో మోషన్‌లో పరుగులు పెడుతూ నాయికా నాయకులు కనిపిస్తారు. పాట ఆరంభం అవుతుంది.

పాట చిత్రీకరణ  చక్కగా ఉంటుంది. నేపథ్యంలో కొండలు, పచ్చటి చెట్లు, నీలి సముద్రం ఉంటాయి. లయబద్ధంగా నాయికానాయకులు అడుగులు వేస్తూంటారు. ఇప్పుడు సంగీతం మారుతుంది. వాయిద్యాలు మారతాయి. లయ అదే అయినా పాశ్చాత్య ‘బీట్’ తెలుస్తుంది. రొమాన్స్ ఉట్టిపడే బాలసుబ్రహ్మణ్యం స్వర ప్రభావాన్ని పెంచుతూ ‘బోంగో’లు మ్రోగుతుంటే లయబద్ధంగా స్వరాలను వినిపించే ‘బ్రష్డ్ స్నేర్ సెటప్’ [జాజ్ సంగీతంలో డ్రమ్‌లపై లయను సృజించే బ్రష్షులు] దానికి తాళం అందిస్తూ పాట ప్రభావాన్ని పెంచుతుంది.

ఈ పాట రచనలో సిరివెన్నెల ప్రేమ భావనను ఒక పద్ధతి ప్రకారం ప్రదర్శించాడు. పల్లవిలో ప్రేమ భావన జాగృతమవటాన్ని సూచించాడు. చరణంలో గాలి, పూలు వంటి ప్రతీకల ద్వారా, ఇంట్లోని పవిత్రమైన వస్తువుల ద్వారా ‘భూమి స్థాయి’ ప్రేమను ప్రదర్శించాడు.

వీచే గాలులలో నీ ఊసులు జ్ఞాపకమే
పూచే పువ్వులలో నీ నవ్వులు జ్ఞాపకమే
తూరుపు కాంతుల ప్రతి కిరణం నీ కుంకుమ జ్ఞాపకమే
తులసి మొక్కలో నీ సిరుల జ్ఞాపకం
చిలక ముక్కులా నీ అలక జ్ఞాపకం

ఇందులో నాయికను జ్ఞాపకం తెచ్చిన వస్తువులను పరిశీలిస్తే, భౌతిక స్థాయి నుంచి పవిత్రమైన ఆధ్యాత్మిక స్థాయికి ప్రేమ ఎదగటం కనిపిస్తుంది. గాలి, పూల నుండి తూరుపు కాంతులు, తులసి మొక్క వరకూ ఈ ఎదుగుదల చూడవచ్చు. చిత్రీకరణలో, అందంగా చిత్రించటంపై ఉన్న ధ్యాస, పాటలోని భావాన్ని ప్రతిబింబించటంపై కనిపించదు. ఫ్రేమింగ్ అందంగా ఉంటుంది. ముఖ్యంగా నాయికానాయకులు కసరత్తులు, వ్యాయామాలు చేయకుండా గౌరవప్రదంగా వ్యవహరించటం, ఎంతో హాయిగా అనిపిస్తుంది. కానీ పూలు, తులసిమొక్క లాంటివేవీ లేకుండా, కనీసం పాటలో భావానికి తగ్గ హావభావాల క్లోస్ అప్ లు లేకుండా, కేవలం,  అందమైన దృశ్యాలు చూస్తుంటే పాటకూ, దృశ్యానికీ సంబంధ లేమి తెలుస్తుంది.

చిత్రీకరణ, గేయ రచయిత భావాన్ని అనుసరించకపోవటం రెండో చరణంలో కూడా కనిపిస్తుంది. మొదటి చరణంలో భౌతికం నుంచి ఆధ్యాత్మికం వైపు అడుగులు వేసినట్టే,  రెండో చరణంలో కూడా,  పాట భావం చక్కగా పవిత్రంగా ఉంటుంది.

మెరిసే తారలలో నీ చూపులు జ్ఞాపకమే
ఎగసే ప్రతి అలలో నీ ఆశలు జ్ఞాపకమే
కోవెలలో దీపంలా నీ రూపం జ్ఞాపకమే
పెదవిపైన నీ పేరే చిలిపి జ్ఞాపకం
మరుపురాని నీ ప్రేమే మధుర జ్ఞాపకం.

మెరిసే తారలలో అన్నప్పుడు తారలూ లేవూ, కళ్ళూ లేవు. నాయిక క్లోజప్ మాత్రం ఉంది. నాయకుడు మాత్రం పట్టిపట్టి నాయిక కళ్ళల్లోకి చూస్తున్నట్లు, నాయకుడు మీదకు వస్తుంటే నాయిక వెనక్కు నడవటం వల్ల అనిపిస్తుంది. అలలు లేవు, కోవెలలో దీపం లేదు. అంటే, పాటలో గేయ రచయిత ప్రదర్శించిన భావంతో దృశ్యాన్ని అనుసంధానం చేసి, పాటను దృశ్యాన్ని మరింత అర్థవంతం, భావనామయం చేసే బదులు, పాట దారి ఎటో, దృశ్యం దారి ఎటోగా అనిపిస్తుంది.ప్రేక్షకులు పాటను ఆదరించినా, చిరకాలం ప్రేక్షకుల మదిలో నిలచి, పదే పదే వినాలి, చూడాలి అనిపించటానికి ఇది ప్రతిబంధకం అవుతుంది.  అత్యంత ప్రజాదరణ పొందిన ఈ మధురమైన పాటను చూస్తుంటే  పాటకూ, దృశ్యానికి సంబంధం లేకపోవటం వల్ల ఒక ‘విరపు’ కలుగుతుంది. అది ఈ పాట మరింతగా అద్భుతంగా ఎదగటంలో అడ్డు పడుతుంది.

(‘ఏదో ఒక రాగం పిలిచిందీ వేళా’ [మేల్ వెర్షన్] పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=PeuUA3DCf9k)

సినిమా దృశ్య ప్రాధాన్యమైనదైనా, శబ్దానికీ దృశ్యానికీ మధ్య సంబధం లేకపోతే, ప్రేక్షకులు ఎంతగా మెచ్చినా, ఆ పాట ఎంత మధురమైనదైనా, దృశ్యాలు ఎంత అందంగా ఉన్నా సినిమా నిర్మాణపరంగా అది లోపమే. తమిళ, తెలుగు, హిందీలలో సూపర్ హిట్ గీతంలా నిలిచి, ఈనాటికీ వింటున్న ప్రతి శ్రోతనూ ఉర్రూతలూగించే  ఈ పాట అత్యంత మధురగీతమైనా, అతి మనోహర దృశ్యాలతో ఉన్నా, ‘గొప్ప’ పాటగా భావించటం కష్టం. అయితే ఒకప్పటిలా కాక, ఇప్పటి ప్రేక్షకులు అల్ప సంతోషులు. చక్కటి బాణీ, గానం, దృశ్యాలతో పాటు తమ ఫేవరెట్ హీరో, హీరోయిన్లు ఉంటే చాలు, ఔచిత్యం గియ్ చిత్యం జాన్తా నై.. వెయ్యండి వీరతాడు.. హై హై నాయకా!

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version