[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]
ఏదో ఏదో అన్నదీ ఈ మసక మసక వెలుతురు
గూటి పడవలో విన్నది కొత్త పెళ్లికూతురు
బాపు రమణలు రూపొందించిన సినిమాల్లో అగ్రతాంబులం ‘ముత్యాల ముగ్గు’ సినిమాకే. పౌరాణిక గాథను సాంఘిక గాథగా మలచి, వర్తమానానికీ, పురాణ కాలానికీ నడుమ ఎల్లలను చెరిపివేసి కూడా ప్రేక్షకుల విపరీతమైన ఆదరణ పొందిన చిత్రం ‘ముత్యాల ముగ్గు’. ఈ సినిమాలో పాటలే కాదు, మాటలు కూడా సూపర్ హిట్. అనేక సంభాషణలు నిత్య జీవితంలో భాగం అయ్యాయి. ‘కళా పోషణ ఉండాలి’, ‘ఆకాశంలో మర్డరయినట్టుంది’, ‘డిక్కీలో తోసెయ్యి’ వంటివి. పాటల సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘ముత్యాలు ముగ్గు’ సినిమా పాట అనగానే, శేషేంద్ర శర్మ రాసిన ‘నిదురించే తోట లోకి పాట ఒకటి వచ్చింది’ ముందుగా గుర్తొస్తుంది. కానీ పాట, పాట బాణీ, బాణీలో ఒదిగిన పదాలు, పదాలు ప్రకటించే భావాలు, భావాలను అనుసరించి నటీనటులు ప్రదర్శించే హావభావాలు, వీటన్నిటినీ ప్రదర్శించటంతో పాటూ, పాటలో భావాన్ని ఇనుమడింపజేస్తూ, ప్రేక్షకులు దృశ్యంతో మమేకమయ్యే చిత్రీకరణ, ముఖ్యంగా, పాటకు సందర్భం వంటి సినిమా సాంకేతిక విషయాలను, కళాత్మక విషయాలను పరిగణనలోకి తీసుకుంటే, పాట చిత్రీకరణ పాటను సినిమాలో విడదీయరాని భాగంగా ఎలా మలుస్తుందో గమనిస్తే, మిగతా అన్ని పాటల కన్నా అత్యుత్తమము, అతి మధురము, అతి సుందరము, అతి మనోహరము అయిన పాట ‘ఏదో ఏదో అన్నదీ’ అనిపిస్తుంది.
‘ముత్యాల ముగ్గు’ కథ సినిమాలో ఓ పెళ్లికి వెళ్ళిన నాయకుడు, అక్కడ పెళ్లి అనుకోకుండా ఆగిపోవటంతో, పెళ్లికూతురిని పెళ్ళాడతాడు. సినిమా ఆరంభమయిన ఇరవై నిమిషాల్లో ఇది జరిగిపోతుంది. ఇక్కడి నుంచి సినిమా అసలు కథ ఆరంభమవుతుంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని తన ఇంటికి తీసుకువచ్చే సందర్భంలో వస్తుందీ పాట. పాట గొప్పతనం అర్థం కావాలంటే పాటకు దారితీసిన సంఘటనలు తెలుసుకోవటం తప్పనిసరి. అంటే, పాట చిత్రీకరణ అర్ధం కావాలంటే, సినిమా చూడాల్సిందేనన్నమాట.
హీరో ధనవంతుడు. మిత్రుడి చెల్లెలి పెళ్లికి అతడి తండ్రి ఆర్థిక సహయం చేస్తాడు. పెళ్లికి ఉరు వెళ్లి ఓ అమ్మాయిని దారి అడుగుతాడు. ఆ అమ్మాయికి మామిడి పళ్ళు, కోతి కోసి ఇస్తుంటుంది. ఆ కోతి పేరు రాజా. ఆ అమ్మాయి పెళ్లివారింటికి దారి చూపిస్తా రమ్మంటుంది. అప్పుడు అతడు, ఆమె తింటున్న మామిడికాయ రుచిగా వుందా? అని అడిగితే, ఆమె కాకి ఎంగిలి, అంటే, కాయపై గుడ్డ వేసి కొరికిన ముక్క అన్నమాట, అతడికి ఇస్తుంది. తరువాత ఆమెనే పెళ్లికూతురు అని తెలుస్తుంది. ఆమె పెళ్లి ఆగిపోతే, ఆమెనే పెళ్లి చేసుకుంటాడు హీరో. పెళ్లి చేసుకుని పడవలో ఆమెని తన ఇంటకి తీసుకు వెళ్తూ పాట పాడతాడు.
సందర్భం కుదిరింది చక్కటి పాటకు. ఇక్కడ ఓ యుగళ గీతం పెట్టవచ్చు. కానీ నాయిక అప్పుడే పాట పాడటం ఔచిత్యం కాదు. నాయిక ఒంటరిగానే ‘నా జీవితాన్ని ఉద్ధరించావు’ అంటూ పాడవచ్చు. కానీ బాపూరమణల సినిమాల్లో స్త్రీ పాత్రలు ‘సీత’ లాంటి వ్యక్తిత్వం కల పాత్రలు. వాళ్లు దుష్టుడితో ఒంటరిగానైనా పోరాడుతారు (గోరంత దీపం), భర్తపై కోపం వస్తే కాళ్లు, చేతులకే కాదు కళ్ళల్లో కూడా గోరింటాకు పెట్టుకుని ఏడ్పించగలరు (పెళ్లి పుస్తకం), మాట తప్పిన ప్రియుడిని కనికరం లేకుండా శిక్షించగలరు (బుద్ధిమంతుడు), హద్దుల్లో ఉంటూనే తండ్రిని ఎదిరించగలరు, నాయకుడిని ఏడ్పించగలరు (అందాల రాముడు). కాబట్టి నాయిక పాట పాడటం కుదరదు. అందుకని అక్కడ హీరో పాట పాడటమే ఔచిత్యం.
పాట రాగం, భావం, దృశ్యాల నడుమ విడదీయరాని సంబంధం ఉంటే ఆ పాటను వినటం ఎంత గొప్ప అనుభవమో, చూడటం అంతకన్నా గొప్ప అనుభవం. అయితే ఆ పాటకు సినిమా లోని ఇతర సంఘటనలతో సంబంధం ఉంటే, ఆ పాట వింటూ మైమరచిపోయినా, చూస్తూ అనుభవించే ఆనందం, మామూలు కన్నా రెట్టింపు అవుతుంది. అది ‘ఏదో ఏదో అన్నదీ’ పాట నిరూపిపిస్తుంది.
ఈ పాటకు ముందు నాయకుడు నాయికను, ఆమె అంతకు ముందు పెళ్లి చూపుల గురించి ప్రశ్నిస్తాడు. అక్కడ నాయకుడి వక్తిత్వం, అందులోని లోపం తెలుస్తుంది. అప్పుడు నాయిక ఇచ్చిన జవాబు, ఒకప్పటి తరాలన్నిటికీ వర్తిస్తుంది. “కన్నెపిల్ల మనసు అద్దంలా ఉంటుంది. అందులో తాళి కట్టేవాడి బొమ్మ పడగానే పటంలా మారిపోతుంది.”
నిజం చెప్పాలంటి, స్త్రీ పురుష సాన్నిహిత్యం లోని మాధుర్యం అనుభవించాలన్నా, దాంపత్య ధర్మం లోని సున్నిత భావనలను, ఔన్నత్యాన్ని అర్థం చేసుకోవాలన్నా, తాత్కాలిక ఆకర్షణలు, ఆవేశాల జలపాతాల దూకుడు స్థాయి నుంచి, అవక్షేపాల బరువుతో, మంద్రంగా మైదానంలో ప్రవహిస్తూ, చివరికి పాయలుగా చీలి సముద్రంలో మిళితమయ్యే స్థితి వరకూ, స్త్రీ పురుషులు కలిసి చేసే ప్రయాణం తప్పనిసరి. అవగాహన, సున్నిత భావనల మృదుత్వం, సాన్నిహిత్యంలోని స్నిగ్ధత్వం, విడదీయరాని అనుబంధాలకు బలమైన పునాది ఏర్పడే ఆ సుదీర్ఘ ప్రయాణారంభంలోని తొలి అడుగును ఈ పాట అతి గొప్పగా, అతి సుకుమారంగా, అందంగా ప్రదర్శిస్తుంది.
పాటలో ముందుగా సంగీతం ఆకర్షిస్తుంది. నాయికానాయకులు తోటలో కలసినపుడే నేపథ్యంలో ఈ పాట బాణీని తలపించే సంగీతం వినిపిస్తుంది. గిటార్ తంత్రులు మోగుతుంటే నీళ్లు, బోటు కనిపిస్తాయి తెరపై. పాటంతా వెంటాడే లయ, మృదువుగా, శాంతిని కలిగించే రీతిలో వినిపించటం ఆరంభిస్తుంది. ఇది తెడ్డుతో నీటిని కోస్తున్నట్టుంటుంది.
కెమేరా నెమ్మదిగా కదులుతూ, పడవను ఆనుకుని ప్రశాంతంగా ఉన్న నాయకుడిని చూపిస్తుంది. పాటలో హరికాంభోజి రాగం ఛాయలు కనిపిస్తాయి. సంగీత దర్శకుడు కె.వి. మహదేవన్, పాటను రూపొందించిన విధానంలో గొప్పతనమేమిటంటే సాంప్రదాయిక సంగీత పరిధిలోనే ఒదుగుతూ, వాద్య ధ్వనుల కూర్పు పాశ్చాత్య పోకడలు పోతూ అద్భుతంగా ఉంటుంది. తీగ వాయిద్యాలు, వాయువు వాయిద్యాలు, తబలా, మృదంగాల కలయికతో పాట ఆరంభానికి ముందే ఒక సున్నితమైన, తీయనైన భావనని కలిగిస్తుంది సంగీతం. ముఖ్యంగా, కెమేరా పడవ కదలికలను చూపుతూ, వినిపించే సంగీతం అలల కదలికలను అనుభూతికి తెస్తూంటే పడవలో ప్రయాణిస్తూ ఊగుతున్న భావన కలుగుతుంది. ఇంతలో కెమేరా ఒదిగి కూర్చున్న నాయికను చూపిస్తుంది. నాయిక కనబడగానే గిటార్ ఆగి, వీణా నాదాలు అతి మృదువుగా వినిపిస్తాయి. కెమేరా కదలికలన్నీ పడవ ప్రయాణాన్ని తలపుకు తెస్తాయి. కెమేరా ‘లో ఏంగిల్’ లో, నీటి మట్టం స్థాయిలో ఉండటం ఈ భావాన్ని కలిగిస్తుంది. అందుకే కెమేరా నాయిక క్లోజప్పుకు వెళ్తూ పడవ నీటిలో జారినట్టు జారుతుంది. వీణ కూడా అలాగే ధ్వనిస్తుంది. నాయికను దాటగానే వేణువు వినిపిస్తుంది. పాట అనుభవిస్తున్న వారికి ఒకో లోకం దాటుతున్నట్టు అనిపిస్తుంది ఒకదాన్ని మించి మధురమైనది ఇంకోటి. ఈ పాటకు ప్రాణం, ఈ ప్రిల్యూడ్ సంగీతం. ఈ ఆరంభ సంగీతం మొత్తం పాట ‘మూడ్’ను స్థిరపరుస్తుంది. నీటిని చూపినప్పుడు గిటార్, నాయిక కనిపిస్తే వీణ ధ్వనులను స్థిరపరుస్తుంది. పడవ ప్రయాణంలో నదిపై వీచే గాలి స్వరం వేణువుది. అందుకే తెరపై తెరచాప కనపడగానే వీచే గాలిలా వేణువు వినిపిస్తుంది. ఈ సినిమా ఆరంభ సంగీత చిత్రీకరణ గేయరచయిత, దర్శకుడు, సంగీత దర్శకుడు, కెమేరామన్ల నడుమ ఉన్న చక్కని అవగాహనకు నిదర్శనం. అంటే, అందరూ కలసి కూర్చుని చర్చించి, ప్రతి ఫ్రేమ్ గురించి ఆలోచించి, ప్రతి ఒక్క ధ్వనిని, స్వరాన్నీ, పదాన్నీ, దృశ్యాన్నీ అర్థవంతంగా, ఔచితీమంతంగా, సుందరంగా రూపొందించారన్నమాట. అందుకే ఆరంభ సంగీతం, దానికి తగ్గట్టు కనిపించే దృశ్యాలు మనసును దోచేస్తాయి.
గేయ రచయిత, సంగీత దర్శడు కలసి పాటను ‘గజల్’ అనిపించే రీతిలో రూపొందించారు. ముఖ్యంగా ఆరంభ సంగీతంలో వినిపించే తీగవాయిద్యాలు, తబలా దరువులు ఒక చక్కని గజల్ వింటున్న భావనను కలిగిస్తాయి. కానీ ఇది గజల్ కాదు. అయినా సరే ‘గజల్’లు ప్రదర్శించే ప్రేమ, తపన, సాన్నిహిత్య భావనలను పాట ప్రదర్శిస్తుంది. ఈ పాటను గజల్ ‘ఆత్మ’ చుట్టూ అల్లిన కర్ణాటక సంగీత ఆధారిత పరిమళ భరిత మృదు శృంగార భావనల ముత్యాలమాలగా భావించవచ్చు.
‘ఆరుద్ర’ పాట ఆరంభం నుంచీ చక్కని పదాలతో, అలంకారాలతో, ప్రతీకలతో అతి సున్నితమైన శృంగార భావాలతో స్త్రీపురుష సంబంధంలోని అత్యంత మృదువైన సాత్విక శృంగార భావనలతో, పాటను మృదుమధుర భావాల సరితా స్రవంతిలా మలుస్తాడు.
పెళ్లికి ముందు నాయికా నాయకులకు పెద్దగా పరిచయం లేదు. అలాగని ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదు. నాయిక పాత్ర సగటు భారతీయ సాంప్రదాయిక యువతి. “నేను ఆడపిల్లని. పైగా పేదపిల్లని. మాకు నచ్చటం, ప్రేమించటం అంటూ ఉండదు” అనే అవగాహనతో పాటు, ‘పెళ్ళయ్యాకే ప్రేమ’ అన్న స్పష్టమైన అభిప్రాయం కల అమ్మాయి. ఇప్పుడితడితో పెళ్లయింది. ‘తాళి కట్టినవాడి పటం’ ఆమె హృదయంలో స్థిరపడింది. అతడే ఆమె ప్రపంచం. కానీ తొలినాళ్లలో ఉండే బిడియం, స్నిగ్ధత్వం, తొలి పురుష సర్శలో ఉండే సౌఖ్యం, ఉద్విగ్నతలు, ఉద్రేకం, ఉత్సాహం వంటివన్నీ ఆమె అనుభవిస్తూంటుంది. పురుషుడు ప్రదర్శించినంతగా చొరవ స్త్రీ, కనీసం, ఆ తరం నాటి స్త్రీ, ప్రదర్శించలేదు. బికినీల్లో బ్రదర్లకు రాఖీలు కట్టటాన్ని ‘నా బట్టలు, నా ఇష్టం’ అని సమర్థించుకునే మొరటుతనపు కరకు, ఇరుకు మెదళ్ళ తరాలకు, వారిని గుడ్డిగా సమర్దించే ఆధునిక అభ్యుదయభావాల, సాంప్రదాయ వ్యతిరేక విప్లవభావాల ఉద్యమకారులకూ ఈ భావనలన్నీ అనాగరికంగా, ‘సో బార్బేరియస్’గా అనిపించటంలో ఆశ్చర్యం లేదు. కానీ ఈ సుఖాన్ని, ఈ సాహచర్యాన్ని, ఈ సంబంధంలోని మృదు మధుర భావనలను అనుభవించిన తరాలకు ఇది బాగా అర్థమవుతుంది. మళ్ళీ గతం నాటి అనుభూతి తాజా అవుతుంది. అంతేకాదు, తొలి స్పర్షలోని ఈ మృదుమధురసౌఖ్యానుభూతులే, భవిష్యత్తులో అనుబంధం దృఢతరమవటానికి తొలిమెట్లు. ఇది ఇప్పటి ఫోటోషూట్ల, ప్రిన్యుప్షియల్ సహజీవన అసహజ అనుబంధాల తరాలకు అర్ధంకాదు. కనీసం ఇలాంటి పాటలు చూస్తూంటేనయినా తాము కోల్పోయిన అమాయకత్వం వారికి అర్ధమవచ్చు.
ఈ సినిమా సందర్భంలోని యువతీ యువకుల మానసిక స్థితిగతులను అర్థం చేసుకున్న గేయ రచయిత ‘మసక మసక వెలుతురు – ఏదో అన్నది, దాన్ని కొత్త పెళ్లికూతురు విన్నది’ అంటూ పాటను ఆరంభించాడు. ‘మసక వెలుతురు ఏదో అనటం’, కొత్తగా పెళ్లయి తొలి సమాగపు ఉద్విగ్నతావేశ సౌఖ్యానుభూతుల ఒడిలో పరవశం చెందిన జంటకు పెద్దగా వివరణ అవసరం లేదు. ఆ అన్నదాన్ని విని సిగ్గుతో ముగ్ధ మనోహరంగా యువతి ముడుచుకుపోవటమూ అంతే.
కెమేరా దర్శకుడు ‘ఇషాన్ ఆర్య’ అత్యద్భుతంగా ఈ ‘మూడ్’ను దృశ్యరూపంలో బంధించాడు. కెమేరాను, బోటు స్థాయిలోనే ఉంచటం వల్ల, ప్రేక్షకుడు తానూ బోటులో ప్రయాణం చేస్తున్నట్టు భావించి దృశ్యంలో తానూ భాగమవుతాడు. వారిద్దరి ఆంతరంగిక శృంగార సంభాషణానుభూతిని అనుభవిస్తాడు. పరవశం చెందుతాడు.
ఒదిగి ఒదిగి కూర్చుంది బిడియ పడే వయ్యారం
ముడుచుకునే కొలది మరీ మిడిసిపడే సింగారం
సోయగాల విందులకై వేయి కనులు కావాలీ
పాటలోని ప్రతి పదం, దృశ్యం సాత్విక శృంగారాన్ని ప్రతిధ్వనిస్తుంది. నాయిక ‘సంగీత’ కూర్చున్న విధానం, నాయకుడి వైపు కళ్ళెత్తి చూడటం, తల దించుకోవటం, ముడుచుకుపోవటం కెమేరా క్లోజప్పుల్లో చూపిస్తుంది. కాస్సేపు ప్రేక్షకుడే నాయకుడై ఆ వయ్యారాన్ని, సింగారాన్ని దర్శించి, పులకించి, పరవశించి పోతాడు. పదానికీ, ధ్వనికీ, దృశ్యానికీ నడుమ విడదీయరాని సంబంధం ఉన్నప్పుడు ఇలాంటి మరపురాని సినిమా రూపొందుతుంది. నిజానికి ‘సంగీత’ పెద్ద అందగత్తె కాదు. కానీ ‘యువతికి సిగ్గే సింగారం’ అంటారు. సిగ్గు అలంకరణ అయ్యి, ఆమె మరింత అందంగా అనిపించటం ఈ పాటలో చూడవచ్చు. బాపు బొమ్మలా అనిపిస్తుంది. ” సింగార్ కీ తుఝె క్యాహై జరూరత్, తేరా సింగార్ తేరా యవ్వన్ హై” అంటాడో హిందీ సినీ గేయ రచయిత. “సింగారించుకోవాల్సిన అవసరం ఏముంది, నీ యవ్వనమే నీ సింగారం” అన్నది ఇక్కడ నాయికకు సరిగ్గా సరిపోతుంది. ఈ యవ్వన సింగారపు సొగసు తెలియని తరాలు కృత్రిమ అలంకరణలు, శరీర ప్రదర్శననే సింగారం అనుకుంటున్నది. అభాసుపాలవుతున్నదన్న విషయం కూడా గ్రహించలేనంతగా ‘ మెదడు కడిగి’న వివశత్వంలో ఉంది.
ఈ పాటలో దృశ్యాలను బొమ్మల్లా ఫ్రేమ్ చేయటం చూడవచ్చు. ‘మసక చీకటి’ అన్నప్పుడు ‘లాంగ్ షాట్’లో బోటుపై నుంచున్న నాయకుడిని ‘మసక చీకట్లో’ చూపించటం, ‘గూటి పడవ’ అన్నప్పుడు నాయికను చూపించటం, నాయకుడు నుంచుంటే, ఒదిగి కూర్చున్న నాయిక కోణం లోంచి ఇద్దరినీ చూపించటం.. ఇలా వారిద్దరి సాన్నిహిత్యం, ప్రేమ, భావనలను ప్రేక్షకుడి అనుభూతికి తెస్తుంది దృశ్యం. నేపథ్యంలో సంగీతం ఈ అనుభూతిని గాఢతరం చేస్తుంది. అంటే కళ్ళ ద్వారా చూసేదాన్ని, చెవులు వినే సంగీతం ధ్వనించటం వల్ల ఇంద్రియాలు సర్వం కలసి హృదయంలో ఒక గాఢమైన సాత్విక శృంగార అనుభూతిని సృజిస్తున్నాయన్నమాట.
పల్లవికీ, చరణానికీ నడుమ సంగీతం వస్తున్నపుడు నాయిక శరీరం ఏ మాత్రం కదలకుండా బుట్టలోంచి పండు తీసి చూపించి మళ్ళీ బుట్టలో వేస్తుంది. నాయకుడు దగ్గరగా వచ్చి కూర్చుని పండు తాను కొరికి ఆమెకిస్తాడు. ఆమె మనోహరంగా నిరాకరిస్తుంది. అప్పుడు కాకి ఎంగిలి చేసి ఇస్తాడు. వెంటనే ప్రేక్షకుడి పెదవులపై చిరునవ్వు నిలుస్తుంది. ఇది గతంలో మామిడితోటలో జరిగిన సంఘటనను గుర్తుకు తెస్తుంది. సినిమా చూడకుండా కేవలం పాటనే చూస్తే ప్రేక్షకుడు ఈ మృదువైన చమత్కారాన్ని తెలుసుకోలేడు. పాటకు సినిమాతో విడదీయరాని సంబంధం కల్పించటం అంటే ఇదే!
ఇక ‘ఒదిగి ఒదిగి కూర్చుంది’ అన్నప్పుడు వెలుగు నీడలలో నాయికానాయకులను ‘లో యాంగిల్’ షాట్లో చూపించటం ఒక పెయింటింగ్‌లా కనిపిస్తుంది. ఈ పాటలో నాయిక సిగ్గు పడటం, బిడియంగా ముడుచుకోవటం, కళ్ళెత్తి చూడటం, ముగ్ధమనోహరంగా మందహాసం చేయటం, తల ఊపటం, నిరాకరించటం ప్రతి ఒక్కటీ అద్భుతంగా అనిపిస్తుంది. ఒక వ్యక్తి అందం శరీర నిర్మాణంలోనో, జీరో సైజులోనో, కృత్రిమ అలంకరణల్లోనో కాదు, వ్యక్తిత్వంలో, ప్రవర్తనలో ఉంటుందన్న భావనను స్థిరపరుస్తుందీ చిత్రీకరణ. స్త్రీ పురుష దాంపత్య సంబంధం గట్టిపడి అపురూపమైన అనుబంధంగా ఎదగటానికి ఇలాంటి సాన్నిహిత్యం, సంఘటనలు పునాదుల వంటివి.
చరణం చివరలో ‘సోయగాల విందులకై వేయి కనులు కావాలి’ అంటాడు నాయకుడు. అద్భుతం. ఎక్కడా వెకిలి భావన లేదు. లైంగిక భావన సూచనప్రాయంగా కూడా లేదు. ఆనాటి కళాకారుల అత్యుత్తమ సంస్కారానికీ, స్త్రీ పురుష సంబంధం పట్ల వారికున్న మధురమైన భావనకూ, సమాజం ముందు సంస్కారయుతమైన దాంపత్య సంబంధాన్ని ఆదర్శంగా ఉంచాలన్న అవగాహనకు ఇది చక్కని నిదర్శనం.
తేరే సాయే కో సమఝ్ కర్ మై హసీన్ తాజ్‌మహల్
చాంద్నీ రాత్ మే నజ్రోంసె తుఝే ప్యార్ కరూఁ
ఇవి ‘మేరే మహబూబ్’ సినిమాలో శకీల్ బదాయుని రాసిన పాట చరణంలోని రెండు పాదాలు. ఆమె నీడను అందమైన తాజ్‌మహల్‌గా భావించి, వెన్నెల రాత్రులలో కళ్లతో ప్రేమిస్తాడట. అనిర్వచనీయమైన, అద్భుతమైన అనుభూతి హృదయం లోలోతుల్లో కలుగుతుంది. ఎంత సున్నితమైన భావన! ‘సోయగాల విందులకై వేయి కనులు కావాలి’. వేయి కనులేమిటి, ఒక జీవిత కాలం సరిపోదు, జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవటానికి, ఆమె సాంగత్యంలోని మాధుర్యాన్ని అనుభవించి ఆ అనుబంధాన్ని అస్వాదించటానికీ, స్త్రీ పురుష సంబంధంలో ఇమిడి ఉన్న దైవత్వభావనను రేఖామాత్రంగానయినా దర్శించటానికి.
‘మేరే మహబూబ్ తుఝే’ పాటను చూడండి.
మెహమాన్ నజర్ కీ బన్జా ఎక్ రాత్ కే లియే
మై జన్మోం సే తరసా హూఁ తేరే ప్యార్ కే లియే
ఆమె ప్రేమ కోసం జన్మల నుండీ తపిస్తున్నాడట. అందుకని ఒక రాత్రి కోసం ఆమెని తన కళ్ళకు అతిథిగా రమ్మంటున్నాడు.
కభీ మేరీ సాథ్ కొయి రాత్ గుజార్
తుఝె సుబాహ్ తక్ మై కరూ ప్యార్
ఎప్పుడయిన నాతో ఏదో రాత్రి గడుపు. ఉదయం వరకూ నిన్ను ప్రేమిస్తాను.
ఒకరి జన్మజన్మల తపన , మరొకరి ప్రేమ ఒక్కరాత్రితో తీరిపోతున్నది, ఆధునిక తరాలకు.
స్త్రీ, పురుష సంబంధాల విషయంలో మనం అభివృద్ధి చెందామా? ఆరోగ్యకరమయిన ఆలోచనలను సమాజానికి అందిస్తున్నామా? అన్న అనుమానాన్ని స్థిరపరుస్తాయి ఇలాంటి భావనలు.
పావు తక్కువ పదింటికోసారీ..
పడుకుంటె ఓసారి.. మేల్కుంటె ఓసారి
ఏమి తోసక కూసుంటె ఓసారీ..
యేలు నొక్కుతుంటే ఓసారి ఓసారి
కాలు తొక్కుతుంటే ఓసారి ఓసారి
నువ్వు పక్కనుంటే ప్రతొక్కసారీ
వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్సు!
స్త్రీ పురుష సంబంధాన్ని ఆధునిక అభ్యుదయ విప్లవ విముక్తి విచ్చలవిడి ఉద్యమాలు ఏ స్థాయికి ఎదిగించాయో, కేవలం లైంగిక చర్యకు కుదించి పశు స్థాయికి దిగజార్చాయో ఎవరికివారు నిర్ణయించుకోవాలి. “సోయగాల విందులకై వేయికనులు కావాలి” లో ఒదిగిన సాత్విక శృంగార భావన, స్త్రీ సౌందర్యాన్ని ప్రకృతికి ప్రతీకగా చేసి దర్శించే పురుషుడు సృష్టికర్త స్థాయికి ఎదగటంలోని ఔన్నత్యం, ఆందులోని అద్భుతం అన్నీ, ఉల్లిగడ్డ పొరలు ‘పీల్’ చేసినట్టు ఒలిచి, ఆ సంబంధాన్ని కేవలం ఒక పశుత్వం ప్రకోపింపచేసే పాశవిక చర్యగా ప్రదర్శించటంలో మన సినిమాలు ఎంత అభివృద్ధి సాధించాయో ఎలాంటి ‘ఫీలింగ్’ లేకుండా ‘పీలింగ్’ చేసిచూపుతున్నారు మన కళాకారులు.
నింగిలోని వేలుపులు ఎంత కనికరించారో
నిన్ను నాకు కానుకగా పిలిచి కలిమినొసగేరో
పులకరించు మమతలతో పూల పాన్పు వేశారో
రెండవ చరణానికి ముందు కనిపించే దృశ్యాలు, పడవ ప్రయాణానుభూతిని స్థిరం చేస్తాయి. నాయిక కోతి స్నేహితుడు ఆమె వెంట వస్తున్నట్టు చూపిస్తారు. నాయకుడు పాట పాడేప్పుడు ఆమె దగ్గరగా కూర్చుని సన్నిహితంగా ‘నిన్ను నాకు కానుకగా’ అంటుంటే, ‘ఇది కదా దాంపత్య సంబంధం లోని ఔన్నత్యం’ అనిపిస్తుంది. పురుషుడు ఎంత గొప్పవాడయినా ఆమె శరీరాన్ని గెలవగలడేమో కానీ, హృదయాన్ని గెలవాలంటే, జీవితాంతం తపించాలి. తన జీవితాన్ని సంపూర్ణం చేసేందుకు భగవంతుడు తనకు ఇచ్చిన వరం, తన జీవిత భాగస్వామి అన్న అవగాహనతో అనుక్షణం, ఆమెను అపురూపంగా భావించాలి. సినిమాల్లో ఇలాంటి ఆరోగ్యకరమైన సంబంధాన్ని ప్రదర్శించటం వల్ల సమాజం ముందు ఉత్తమ ప్రవర్తనను ఆదర్శంగా ఉంచుతున్నట్టువుతుంది. ప్రేక్షకుల మనస్సులలో సున్నిత భావనలు జాగృతం చేయటం వల్ల వారు మనుషలుగా ఎదిగే మార్గాన్ని చూపించట్టవుతుంది. మనుషుల్లోని పశుత్వాన్ని రెచ్చగొట్టటం సులభం. మనుషుల్లో పశువు పైనే ఉంటాడు. కానీ ఆ పశువు క్రింద అణగివున్న మనిషిని తట్టిలేపటం కళాకారుల కర్త్యవ్యం. వారి ప్రతిభకు, సామాజిక బాధ్యత పట్ల అవగాహనకూ నిదర్శనం.
‘పులకరించు మమతలతో పూల పాన్పు వేశారో’ అంటున్నప్పుడు క్లోజప్పులో వారిద్దనీ సన్నిహితంగా చూపుతూ, వారి నడుమ అస్తమిస్తున్న సూర్య కాంతిని చూపటం అతి గొప్ప భావాత్మకమైన ప్రతీక. గొప్ప ‘షాట్’ ఇది. ‘పులకరి౦చు మమతలు’ ఎక్కడా ఇబ్బందికరమైన ఆలోచన రాదు. పైగా అద్భుతంగా అనిపిస్తుంది. తీయని బాధ కలుగుతుంది. ఎంత గొప్పది దాంపత్య సంబంధం! రెండు శరీరాలు ఏకమవటం ద్వారా, శారీరక పరిథి దాటి రెండు హృదయాలు కలవటం, రెండు శరీరాల్లో ఒదిగిన వేర్వేరు ఆత్మలు ఏకమవటం అన్న భావన కలుగుతుంది. పవిత్రమైన, ప్రాకృతికమైన, సహజ సుందరమైన స్త్రీ, పురుషుల కలయికను ఏ స్థాయికి దిగజార్చారు కళాకారులు ఈనాడు అన్నది విస్పష్టం చేస్తుందీ పాట.
ముఖ్యంగా, ” పులకరించు మమతలతో పూల పాన్పు” వేల్పులు వేయటం అన్న భావన అత్యద్భుతమయినది. మన సినిమాల్లో, ” తొలిరాత్రి” అన్న భావన ఎంత వెకిలిగా చూపచ్చో అంతకన్నా వెకిలిగా చూపిస్తారు. అసలు పెళ్ళే ‘అందుకోసం’ అన్నట్టు తపించే నాయికా నాయకులు సమాజంలో ఈ దిగజారుడు భావనను విస్తరింపచేశారు. కానీ, అక్కడ పూలపాన్పు పులకరించు మమతలతో వేసినది. లైంగిక చర్య ఏదో కండరాల రాపిడి కాదు. పశుత్వ చర్య కాదు. అది మనిషిని బ్రహ్మ స్థాయికి ఎదిగింపచేసే అత్యంత అద్భుతమయిన ఆధ్యాత్మిక అనుభూతి. అదొక తపస్సు.
ఓ ఋతురాజ్ఞీ నా తనువెల్ల నీ అనుకూల పవనములు వీచి
ఓ సురవేణీ నీ క్రతు హోమ గుండమున నా జీవితమునే వ్రేల్చి
నీలో కొలది కొలది నశించి నాలో తరతరమ్ముల వికసించి
నాలో ఒదిగి ఒదిగి ఆక్రమించు నీలోపల నే కదలి పునరుద్భవించి
ఇది సృష్టి
ఇది, మిథస్సమాశ్లేష చరిత తనుయష్టి
నేనొక పరమేష్టి, ఇది నీవు, ఇది నేను ,ఇరువురము ఒకటైన ఈ నిమేషమ్ము
విశ్వరహస్యమ్ము
ఇది దేవరకొండ బాలగంగాధర్ కవిత ‘అద్వితీయం’. వ్యష్టి పరమేష్టిగా ఎదిగే చర్య ఇది. సృష్టి కార్యం ఇది. పులకరించు మమతలతో పూలపాన్పు వేయటం ఎందుకు, ఆంటే, ఇందుకు!
ఈపాట బహుశా గాయకుడు రామకృష్ణ పాడిన పాటలన్నిటిలోకీ అతి గొప్ప పాట. ఆయన పాడిన విధానం అద్భుతంగా ఉంటుంది. ఎక్కడా హైపిచ్ లేకుండా, ఒకే స్థాయిలో పాటను పాడుతూ, అలంకారాలు వేస్తూ, భావాలను తాను అనుభవిస్తున్నట్టు ప్రకటిస్తూ, ప్రేక్షకుల అనుభూతికి అందేట్టు పాడటం చాలా కష్టం. కానీ, ఆయన అలవోకగా పాడినట్టనిపిస్తుంది. ముఖ్యంగా, ప్రతి చరణం తరువాత పల్లవిని అందుకోవటంలో, చివరలో పాట అయినతరువాత చేసిన హమ్మింగ్ గాయకుడి ప్రతిభకు నిదర్శనం.
ప్రేమ భావనలోని ఆధ్యాత్మికతను మరచి, లైంగిక చర్యనే ప్రేమగా భావించి, ప్రేమ అన్వేషణలో కీటకంలా ఒక పువ్వు నుంచి, మరో పువ్వుకు ఎగుర్తూ పోయి, ఎంత అనుభవం సాధించినా సంతృప్తిలేక, అసంతృప్తి అగ్నిలో దహించుకుపోతూ చివరికి ఒంటరిగా మిగిలి కుమిలిపోవటమే ‘గొప్ప వక్తిత్వం’గా, ప్రచారం చేస్తున్న అభ్యుదయ, ఆధునిక, స్వేచ్ఛావిముక్తి సిద్ధాంతాల ప్రచారాల వల్ల అసలు వ్యక్తిత్వం ఆలోచనలు మరుగునపడి, అసంతృప్తి, నిరాశలలో సూర్యుడి కోసం చేయి సాచితే అంధకారం అందినట్టు అశాంతితో కొట్టుమిట్టాడుతున్న సమాజానికి శాంతి వైపు దారి చూపుతూ సాంత్వనా వచనాలు పలికే సాత్విక శృంగార భావనల పల్లకీ ఈ పాట. స్త్రీ పురుష సంబంధంలోని దైవత్వాన్ని మనసుకు మెరుపులా దర్శింపచేసే పాట ఇది. ఇలాంటి పాటలు, దృశ్యాలు అదృశ్యమవటం వల్ల సమాజానికి కలిగిన నష్టాన్ని స్పష్టం చేస్తుందీ పాట. సమాజం ఎప్పుడూ హీరోలను ఆదర్శంగా తీసుకుంటుంది. వారిని అనుసరిస్తుంది. కళ సమాజాన్ని ప్రభావితం చెస్తుంది. పలుకళల మిశ్రమమయిన సినిమా ఇతర అన్ని కళల కన్నా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అందుకే, నాయికా నాయకులుగా ఉన్నవారు ఉత్తమ ప్రవర్తనను, ఉన్నత ఆదర్శాన్ని ప్రదర్శిస్తే, సమాజం వారిని అనుసరించి ఉత్తమంగా, ఉన్నతంగా ఎదుగుతుంది. ఇందుకు భిన్నంగా , నాయికా నాయకులు దుష్టులు, పాపిష్టులు, కోపిష్టులు, రేపిష్టులు, దొంగలు, దోపిడీదార్లు, హంతకులు, హింసను ఆనందంగా నెరపేవారు, నీచులు , పెద్దలను లెక్కచేయనివారు, ఆవేశపరులు, నీతినియమాలు లేనివారు, చట్టాన్ని గౌరవించనివారు, అసభ్య సంభాషణలు పలికేవారు, కుసంస్కారులు అయితే…..సమాజం ఎలావుంటుందో చర్చించాల్సినపనిలేదు. మనచుట్టూ చూస్తే చాలు. హీరో హీరోయిన్లు సంస్కారవంతులయితే ఎలావుంటుందో ” ఏదో ఏదో అన్నది” పాట తెలుపుతుంది. హీరో హీరోయిన్లు సంస్కారవంతులయినా, ఒకరిపై ఇంకొకరికి ఎంత గాఢమయిన అభిమానానురాగాలున్నా, చుట్టూ ఉన్న సమాజానికి సంస్కారం లేకపోతే ఏమవుతుందో ‘ముత్యాలముగ్గు’ సినిమాలో తరువాత జరిగేది తెలుపుతుంది.
(‘ఏదో ఏదో అన్నదీ’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=TUmWhcRod8I)
(మళ్ళీ కలుద్దాం)
