[‘మధ్య తరగతి మందహాసం – బెహరా వెంకట సుబ్బారావు సర్వలభ్య రచనలు’ అనే పుస్తకాన్ని విశ్లేషిస్తున్నారు శ్రీమతి శీలా సుభద్రాదేవి.]
“చిన్న కథల్లో వస్తువు సూక్ష్మంగా వుండాలి. కథలో జీవితాన్ని ఏక మొత్తంగా చెప్పటానికి పూనుకోకూడదు. జీవితంలోని ఒక రేఖని స్ఫుటంగా, లలితంగా గీయగలగాలి” అంటారు ప్రముఖ కథకులు విహారిగారు..
ఇదే విధంగా “కథకు క్లుప్తత, గాఢత అవసరం” అంటూ కడియాల రామ్మోహన్ రాయ్ కథానికా లక్షణాలు చెప్పారు. బెహరా వెంకట సుబ్బారావుగారి కథలు చాలా వరకూ ఈ లక్షణాల్ని పొదువుకునే వున్నాయని చెప్పొచ్చు.
ఎక్కువ కథల్లో మధ్యతరగతి మందహాసాల్ని వివరించటం వలనే కావచ్చు, వారి సమగ్ర రచనల్ని అదే పేరుతో తీసుకు వచ్చారు. అంతేకాక కొన్ని కథలు మందహాసాల్నే కాదు మధ్యతరగతి దిగజారుడు మనస్తత్వాన్నీ, బతుకు విన్యాసాల్ని, దిగువతరగతి ప్రజలు ఔన్నాత్యాల్నీ కూడా చిత్రించారు.
మానవసంబంధాలలో వస్తున్న మార్పుల్ని కథనం చేయటమే కాకుండా, సామూహిక వాస్తవికతల్ని ప్రతిబింబించే కథలూ, సమాజంలోని ఆర్థిక రాజకీయవ్యవస్థలు మధ్యతరగతి జీవితాలపై కలిగించే ప్రభావాల్ని ప్లాస్టిక్ పూలు, స్వయంకృతం, విలువలు వంటి కథల్లో అక్షరీకరించారు రచయిత.
రాజకీయ కథలుగా రాజకీయబేతాళం కథలో అవకాశవాదరాజకీయాలు, ప్రామిస్ కథలో నిలబెట్టుకోలేని ప్రమాణాలూ కథల్ని గుర్తించవచ్చు.
“మానవ జీవితాల్ని పరిశీలించటంలోనే రచయితకు మహదానందం కలిగిస్తుంది” అన్నారు మధురాంతకం రాజారాంగారు. ఆ పరిశీలన, ఆ గమనింపు, నిశితమైన చూపు బెహరాగారి కథలలో కూడా అడుగడుగునా కనిపిస్తుంది. ముష్టివాడిలోని నిజాయితీని కథనీకరించటంగానీ, మనిషిని మించినది మాట విలువ అని తెలియజేసిన కథ గానీ, ప్రాణం ఎవరిదైనా వొకటేనని ‘ఒన్ మినిట్’ కథలో తెలియజెప్పటంలో, చదువుకోవాల్సిన విద్యార్థులకు కాలం విలువను బోధించే ‘ఓపెన్ జోకర్’ కథగానీ బెహరాగారి పరిశీలనాశక్తికి అద్దం పట్టే కథలే.
కథారచన పట్ల అంకితభావం, కథాప్రయోజనం తెలిసినవాడు కనుకే బెహరా సుబ్బారావు కథల్లో మతాతీత, కులాతీత భావన, ప్రజాజీవితాన్ని దుఃఖమయం చేసే అనేకానేక అంశాల్ని ఒడిసిపట్టి సమాజ శ్రేయస్సు కోసం రాసే కథలుగా అనేకం వున్నాయి. ఈ సర్వసమగ్ర గ్రంథంలో అన్ని తరగతుల ప్రజల మానసిక సంఘర్షణలోని అంతరాల్నీ చూపిన కథలున్నాయి.
నిజానికి సాహిత్యం ఎప్పుడూ రెండు పాయలుగా సమాంతరంగా సాగుతునే వుంటుంది. అందులో సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ పాఠకులను జాగృతపరిచి ఆలోచింప చేసేది ఒక పాయ అయితే, కేవలం వ్యాపార దృష్టితో కాలక్షేపం కోసం రాసే రచనలు మరొక పాయ. పాఠకులు వారికేది కావాలో నిర్ణయించుకొని చదవాల్సి వుంటుంది.
కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య, తండ్రీ కొడుకుల మధ్య, అత్తా కోడళ్ళు మధ్య, తల్లీ కొడుకుల మధ్య,తండ్రీ కూతుళ్ళ మధ్య ఉండాల్సిన బంధాన్ని, కౌటుంబిక విలువల్ని పలుకథల్లో ప్రస్తావించారు.
అయితే బెహరా సుబ్బారావుగారు రచనలు చేసిన కాలం 1970 – 95 వరకూ అని గుర్తించాలి. ఆ కాలంలో ప్రధాన సమస్యలన్నీ ఆర్థికపరమైనవే కావటాన అవి మధ్యతరగతి చిరుద్యోగ జీవులకు గుదిబండ గానే వుండేవి. ఆడపిల్లలకే గాక మగపిల్లల చదువులూ భారంగానే వుండేవి. ఆడపిల్లల వివాహసమస్య మరింత భారంగా భావించే పరిస్థితి. వీటినన్నింటినీ సమాజ పరిశీలనలో భాగంగానే రచయిత తన కథలలో కథనం చేసారు. సామాజిక సమస్యలైన అధికసంతానం, మద్యపానం, లంచగొండి తనం, వివిధ కార్యాలయాల్లో జరిగే వివిధరకాల మానవ మనస్తత్వాలూ సుబ్బారావుగారు తన పరిశీలనతో ఒడిసి పట్టుకొని కథలుగా కథనం చేసినట్లు పాఠకులకు అర్థమౌతుంది.
కొన్ని కథలూ మధ్యతరగతి జీవితాన్ని చిత్రించటం వలన వస్తు వైవిధ్యం లోపించి, కథలలో మొనాటనీ కనిపిస్తుందేమో అనే భావన విమర్మనాత్మక దృష్టితో గమనించినపుడు పాఠకులకు అనిపించటానికి అవకాశం ఉంది. కాని సామాజిక జీవితంలోని వైవిధ్యాన్నంతటినీ సాహిత్యంలో సమగ్రంగా చిత్రించటం అంత సులువేమీ కాదు.
అయితే బెహరా సుబ్బారావుగారు సామాజిక జీవితాన్ని ఎంత వరకూ పట్టుకోగలిగారు అనేది ముఖ్యంగా గమనించాల్సిన విషయం. ఏ సమస్యనైనా పైపైన స్పృశించి వదిలేయలేదు రచయిత.
పెరిగే నిత్యావసరాలు, వీటికి సరిపడేలా లేని ఆర్థికపరిస్థితి, మధ్యతరగతి జీవులు ఒక్కో సమయం రక్త సంబంధాల్ని దూరం చేసుకుని పలాయనవాదులు అయ్యే పరిస్థితి కూడా వుంటుంది. అంతేకాకుండా మధ్యతరగతివారిలో లేని తెగువా, నిజాయితీ, కలుపుగోలుతనం, తమ సమస్యల్నీ తామే పరిష్కరించుకోగల తెలివి, ఒక్కోసారి దిగువ తరగతి వారిలో కన్పించవచ్చు. వాటిని కూడా ఈ రచయిత రాసిన ‘అంతర్యం’, ‘భగవంతుడు’, ‘వీడ్కోలు’, ‘తన దాకావస్తే’ వంటి కొన్ని కథలో కనిపిస్తాయి. ‘లివ్ అండ్ లెట్ లివ్’, ‘ఇంటగెలుపు’, ‘పాఠం’, ‘పొరపాటు ఎక్కడుంది’ మొదలైన కథల్లో సమస్యను ప్రస్తావించటమే కాక పరిష్కారం దిశగా కథని రచయిత కొనసాగించారు.
దాహం రకరకాలు. కొందరికి ధనదాహం, మరికొందరికి పదవీదాహం, ఇంకొందరికి కామదాహం అవి తీర్చుకోటానికి చేసే జిమ్మిక్స్ ‘దాహం’ కథ.
హోదాల్ని, రూపాల్ని, ఆహార్యాన్ని బట్టి ఒక వ్యక్తి మంచి చెడ్డల్ని నిర్ణయించలేము. రిక్షావాడైనా మానవత్యం చూసినపుడు, టాక్సీ ఓబులేసైనా ప్రాణం విలువ తెలిపినపుడు భగవంతుడిలా కనిపిస్తాడు.
పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలోని కథ ‘హంసలా కలకాలం’. ఇందులో తలారి రాములు ద్వారా – “చేతికున్న అయిదువేళ్ళూ ఒక్కలా లేవుకదా! అలా మన జాతులు, వర్ణాలూ కూడా ఒక్కటి కాదు” అన్న శెట్టి మాటలికి – “నీ చేతికి వున్న అయిదువేళ్ళనీ ఒక్కలా చూసి అయిదేళ్ళకీ ఉంగరాలు తగిలించావు కదా” అని లా పాయింటు తీసిన తలారి రాములు చేత ఇంటగెలుపు కథలో భలేగా చెప్పించారు రచయిత.
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోయిన సందర్భంలో ఆడపిల్లల తల్లిదండ్రులు, బహు సంతాన కుటుంబీకులు, తమ స్వార్థమే చూసుకునే కుమారులు గల కుటుంబాల జీవితాలన్నీ కథ కాని కథలే.
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఒకరు కాకపోతే మరొకరి సంపాదనతో తల్లిదండ్రుల వృద్ధప్యాలు గడచిపోయేవి. తర్వాత్తర్వాత ఉద్యోగరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో కొడుకులు స్థిరపడినప్పుడు యుగధర్మాన్ని అనుసరించి తల్లిదండ్రులు కూడా పంపకమౌతున్నారు. ఈనాడు తల్లిదండ్రులు కొడుకుల ఇంటింటికీ తిరగక తప్పటంలేదు.
బెహరా సుబ్బారావు గారి కథలో రైలు ప్రయాణం, సిటీ బస్ లేదా ఎర్రబస్సు ప్రయాణాల నేపథ్యంలో జరిగిన కథలూ, కథనాలు చాలానే ఉన్నాయి. నాలుగు దశాబ్దాల క్రితం మధ్యతరగతి వారికి ఎక్కువగా జనతా కంపార్ట్మెంట్ లోనో, అరుదుగా దూరప్రయాణాలలో స్లీపర్ కోచ్ ప్రయాణాలే అందుబాటులో వుండేవి. అటువంటి ప్రయాణాల్లో వైవిధ్యమైన జీవితానుభవాలు, విభిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులను పరిశీలించటం వలన అనేక కథాంశాలు దొరుకుతాయి. సుబ్బారావుగారి పరిశీలనలో తన కథల్లో ఆ జీవితాల్నే చిత్రించారు.
బెహరా వెంకట సుబ్బారావుగారి మరణానంతరం వారి కుమారుడు బెహరా సత్యనారాయణమూర్తి సాధ్యమైనంత వరకూ తన తండ్రి గారి రచనలను మిత్రుల సహకారంతో సేకరించారు. డెభ్భైమూడు కథలనే కాకుండా ‘నిశ్శబ్దసంగీతం’, ‘దారితప్పకు’ అనే రెండు నవలల్ని కూడా పొందుపరిచి బెహరా సుబ్బారావుగారిని సాహిత్య రంగంలో చిరంజీవిగా నిలిపే ప్రయత్నంగా ‘మధ్యతరగతి మందహాసం’ పేరిట ఒక బృహత్ గ్రంథాన్ని వెలువరించటం సంతోషదాయకం.
***
(బెహరా వెంకట సుబ్బారావు సర్వలభ్య రచనలు)
సంపాదకులు: బెహరా పేరిందేవి, బెహరా సత్యనారాయణమూర్తి, డా. వి. వి. వెంకట రమణ
ప్రచురణ: అభ్యుదయ రచయితల సంఘం, విజయనగరం జిల్లా
పేజీలు: 480
వెల: ₹ 500
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
~
బెహరా పేరిందేవి
ఫ్లాట్ నెం. 1B, శ్రీనివాసా ఎన్క్లేవ్,
ప్రహ్లాదపురం, విశాఖపట్టణం 530027
ఫోన్: 9848318204, 8309574116
~
బెహరా లక్ష్మీ దివ్య స్ఫూర్తి
ఫోన్: 7396627924
~
ఆన్లైన్లో:
https://www.amazon.in/Madhya-Taragati-Mandahasam-Behara-Venkata/dp/B0FHQQ84LD
