Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మధుర భావానందలహరి – ‘మహాదేవి’ మత్తేభ తారావళి

[అప్పాజోస్యుల సత్యనారాయణ గారు వ్రాసిన ‘మహాదేవి మత్తేభ తారావళి’ అనే పుస్తకాన్ని విశ్లేషిస్తున్నారు ధూళిపాళ అరుణ.]

చరాచర జీవకోటిలో ఇతర జీవరాశుల నుండి మనిషిని సుస్పష్టంగా వేరు పరచగలిగేది జ్ఞానం ఒక్కటే.

సృష్టి నిర్మాణం నుండీ మిగతా జీవరాశులన్నీ యథాతథంగా ఉండగా కేవలం మానవుడు మాత్రమే క్రమంగా ఊహించని రీతిలో ఉన్నతస్థానానికి చేరుకున్నాడు. జంతుజాలములలో కూడా ప్రత్యేక మార్పులు వస్తున్నాయని మనం గమనిస్తున్నా అది కూడా మానవుని మేధస్సుతో జరుగుతున్నదే కానీ వాటి స్వయంకృషి కాదన్నది నిర్వివాద పరిశోధనాంశం.

“ఆహార నిద్రా భయ మైథునం చ
సామాన్యమేతత్ పశుభిర్నరాణామ్!
జ్ఞానం హి తేషా మధికో విశేషో
జ్ఞానేన హీనాః పశుభిస్సమానః!!”

మానవుడు తనకున్న జ్ఞానాన్ని పదును పెట్టుకొని, ఆలోచనాత్మకంగా అవకాశాలను వినియోగించుకుంటూనే జీవితాన్ని సఫలం చేసుకోవడానికి మరింతగా అన్వేషణ కొనసాగిస్తూ ఉంటాడు. ఈ ప్రయత్నంలో కొంతమంది ఉన్నతోన్నతమైన వ్యక్తిత్వంతో నిస్వార్థంగా ఇతరుల కోసం తమ జీవితాన్ని వెచ్చిస్తూ ఉంటారు. అందులో ముందు వరుసలో ఉండదగిన అరుదైన వ్యక్తుల్లో ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ గారు ఒకరు.

ఆయన ఒక వ్యక్తి కాదు శక్తి. ‘అజో విభో కందాళం’ సంస్థ వ్యవస్థాపకులుగా సాహితీ జగత్తులో సమున్నతంగా గుర్తింపబడిన మేరు శిఖరం. అసాధ్యాలను సుసాధ్యం చేసే శాస్త్రవేత్తగా అసాధారణ విజ్ఞానంతో ప్రపంచ ప్రసిద్ధులు. కానీ అటువంటి జ్ఞానానికి పూర్తిగా భిన్నమైన ఆధ్యాత్మిక, తాత్త్విక, సాహిత్య చింతనా పరంపరలు ఆయన హృదయసాగరాన్ని మథిస్తూనే వచ్చాయి. ఆ లోతుల్లోంచి పెల్లుబికిన భావనలు ఆయనను కుదురుగా ఉండనీయక సాహితీ సరస్వతికి అక్షరమందారాలు అర్పించే వరకు కొనసాగాయి. హృద్యమైన పద్య రచనలో భావగాంభీర్యం, పద సొగసులతో కవిత్వ నిర్మాణ శైలిలో తమకు తామే సాటి అనిపించుకున్నారు.

ఆయన రచించిన ‘మహాదేవి మత్తేభ తారావళి’ భక్తిభావ స్ఫోరకంగా జగన్మాతను హృదయంలో తల్లీనం చేసుకునే విధంగా సాగుతుంది. మత్తేభ గమనంతో ఇరవై ఏడు పద్యాల నక్షత్రమాలికను కూర్చి అమ్మవారికి అలంకరించి అమందానంద తన్మయస్థితిలో పరవశించి పోతారాయన.

ఆ పరాశక్తి తత్త్వాన్ని లేశ మాత్రమూ తెలియని ఒక సాధారణ భక్తురాలిని అయిన నేను, ఆయన నాకు స్వయంగా ఇచ్చిన ‘మహాదేవి మత్తేభ తారావళి’ చదివి ఒక రోజు మొత్తం మామూలు స్థితికి రాలేక పోయానంటే నమ్మగలరా? కానీ ఇది నా అనుభవం. ఒక్కొక్క పద్యం చదువుతూ పులకించిన మనసులో

తెలియకుండానే అవ్యక్తమైన ఆనందంతో కళ్ళు ఎన్నిసార్లు చెమరించాయో చెప్పలేను. అంతటి రచనాశక్తి ఆయనది. అందులోని శబ్దం, భావం, కవిత్వం ముప్పేటలుగా అల్లుకొని పఠితృలను రంజింపజేసి, వారిని ఏవో లోకాలలో విహరింపజేస్తాయి.

అది ఆయనలోని తాత్కాలికమైన అనుభూతి కాదు. ఎద నిండా గాఢంగా ప్రోది చేసుకున్న అలౌకికానందం, అనుభవైకవేద్యం. అంతకుమించి చెప్పడానికి ఏమీ లేనంత పులకింత. అది కేవలం ఆయన నుండి ఉత్పన్నమైనదేనా? కాదు. ఆ పరమేశ్వరి అనుగ్రహార్ణవం ఆయనలో అణువణువూ నిండి, ఉత్తుంగ తరంగమై ఎగిసిన రస ప్రవాహ మాధుర్యం.

“తలపన్ జీవన వాహినిన్ తడిసి ముద్దౌచున్ మదీయాత్మలో
పల నీ దివ్య గృహంబు గంటి, తడవో పంజాల నేనింక,వె
న్నెల రాకన్ వికసించు మంజుల మహన్నీలోత్పల శ్యామ చి
ద్విల సద్రూపమ! గారవించ తగదే దేవీ! కృపామూర్తివై!”

అని మొదటి పద్యంలోనే తనను ఆదరించుమని వినమ్రంగా వేడుకుంటారాయన. లౌకిక బంధాలలో చిక్కుకున్న జీవన ప్రవాహంలో, ఆలోచనాన్వేషణ సాగించి అంతస్సులోనున్న జగన్మాత దివ్యమందిరాన్ని ఆయన దర్శించారు. ఇప్పటివరకూ కాలం కరిగిపోయింది. ఇంకా వ్యర్థం చేసుకోవడం దుర్భరంగా తోచింది. అందువల్ల రాకాచంద్రుని రాకతో మృదువుగా, మహత్వపూర్ణంగా వికసించిన నల్లకలువ వంటి ప్రకాశంతో కూడిన జ్ఞానరూపసి అయిన ఆ పరమేశ్వరిని తనపై దయారసాన్ని చిలకరించుమని కోరుకుంటారు.

అపార కరుణామూర్తి అయిన జగన్మాత ఆది శంకరాచార్యుల వారి స్తుతులకు మెచ్చి కనకవృష్టిని కురిపించినట్లే, అప్పాజోస్యుల వారు ఎంతో ఆర్ద్రంగా, మాధుర్య భావనతో కోరుకున్న వెంటనే మురిసి, అక్షర సిరులను కురిపించింది.

‘సౌందర్య లహరి’ లో “సుధా సింధోర్మధ్యే…… ………..చిదానందలహరీమ్” అని శంకరాచార్యుల వారు అమృత సింధువు మధ్యన బిందు ప్రాయమైన త్రిజగన్మోహన రూపాన్ని మనోనేత్రంతో ప్రత్యక్షం చేసుకున్నట్లు తన మనోమందిరంలో ఆ జగజ్జనని ధామాన్ని దర్శించారు అప్పాజోస్యుల వారు.

“పులకల్ పుట్టును దేహమంతయు నుప్పొంగున్, మహోత్సాహ సం
కుల సంభావనమై గళ స్వనము సంకోచించు, రాలున్
ముద
శ్రులు ముత్యంబుల మాడ్కి, నీ యెదుట కూర్చున్నట్లు
గన్ దేవి! గుం
డెలు తూగాడును సత్యలోకపు చిరంటీ! నీ యుపాయాంతంబునన్!”

సమస్త లోకాలలో మహోన్నతమైన సత్యలోకపు సామ్రాజ్ఞి, పెద్ద ముత్తైదువరాలు ఆ దేవి. అంతకుముందు తన హృదంతరాళంలో ఆమె దివ్య మందిరాన్ని దర్శించిన కవి ఇప్పుడు స్వయంగా జగజ్జనని ఎదురుగా కూర్చున్నట్లు అనుభూతి చెందుతారు. అత్యంత మనోజ్ఞమైన ఊహలో తనను తాను మరచిపోతారు. తనువంతా పులకించి ఉప్పొంగిపోయినట్లు, మహోత్సాహము, ఆనందోత్ఫుల్లమైన తలపులతో కంఠస్వరం సంకోచించి మాటలకతీతమైన భావన ఏర్పడినట్లు పరవశిస్తారు.

అతిశయించిన తన్మయ స్థితిలో కంటి నుండి అశ్రు ముత్యాలు జాలువారుతుండగా బ్రహ్మానందాన్ని అనుభవిస్తారు.

ఇక్కడ ఆయన ఆలోచన దిగంతాలను దాటి, సత్యలోకాన్ని సందర్శించింది. లోకాతీతమైన భావన కవి ఎదను స్పృశించి, బాహ్య ప్రపంచంలో అమ్మవారి ఎదుట కూర్చున్న అనుభూతిని అందించింది. ఏకాగ్రచిత్త స్థితిలో తనను తాను వశ్యం చేసుకున్న సాధకుని సాధనా మార్గమిది.

శ్రీనాథుడు కాశీ ఖండంలో “వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి యైన పెద్ద ము త్తైదువ కాశికా నగర హాటక పీఠ శిఖాధిరూఢ య య్యాదిమశక్తి..” అని వేదవ్యాసునికి సాక్షాత్కరించిన పార్వతీదేవిని వర్ణించి ఆమె వైభవాన్ని నుతించాడు. ఆచార్య అప్పాజోస్యుల వారు కూడా పెద్ద ముత్తైదువ అయిన మహాదేవిని కన్నులారా దర్శించారు.

“ప్రకటోన్మీల భవత్కనీనికల సంభావ్య ప్రభావోల్లస త్సుకృతిన్, నా మది నిర్మలావృత బృహజ్జ్యోతిర్లతా వీధి యందొక సౌహిత్యము గాంచు దేవి! హృది నీ యోంకార భ్రూమధ్య దీప్తికి చైతన్యము నూని మానవుడనై దివ్యుండనై వెల్గెదన్!!”

మంగళరూపియైన ఆ తల్లి కనుల కొనలు వెల్లడించిన అమృత కటాక్ష తేజస్సు చేత ఆయన హృదయం రాగమయమై ఉప్పొంగింది. నిర్మలమైన లతా కాంతులు వెలువడే నభో వీథిలో విహరించి అనుపమానమైన తనివిని ఆస్వాదించింది. అందుకే ఆమె భ్రుకుటి మధ్యంలో రూపు దాల్చిన ఓంకార కాంతి వలన చేతనా జ్ఞానాన్ని పొందిన దివ్యమానవునిగా ప్రకాశిస్తానంటారు. సాధన చేత కర్మల నుండి విముక్తుడైన మానవుడు దైవీ గుణములను సిద్ధింపజేసుకుంటాడు. సాంసారికమైన సుఖాలలో మునిగి, లౌకిక బంధనాల వలలో తగులుకున్న మానవుడు అటువంటి స్థితిని పొందడం అసాధ్యం. కానీ ఇక్కడ కవి, సుజ్ఞానవంతుడై పరాశక్తి అనుగ్రహాన్ని తేజస్సుగా తనలోకి ఒంపుకోగలిగారు. సృష్టికి మూలాధారమైన ఓంకారాన్ని జగన్మాత కనుబొమల మధ్యన దర్శించి దివ్యత్వాన్ని పొందారు.

ఇదే భావాన్ని మరింత గాఢంగా అనుభూతి చెందుతూ తరువాతి పద్యంలో..

మహాదేవి భ్రూమధ్యమును దర్శించిన వెంటనే ఆ రెండు కనులలో ఒకవైపు వాత్సల్యము, మరోవైపు వాల్లభ్యము రెండూ సమ్మిళితమై అనేక మహనీయ భావాలతో అమృతవృష్టి కురిసింది. అది మిన్నేటిగా ప్రవహించి అందులో కవి మునకలు వేసినట్లు దివ్యానుభూతి చెందినట్లు చెబుతారు. అక్కడ ద్యావా, పృథ్వీ అనే అంతరం లేక భువి దివిగా భ్రమను గొలిపిందంటారు.

“తొలి జన్మంబున జేసినట్టి క్రియలెంతో యంతగానౌచు త
త్ఫలముల్ నేడు భుజింపకెవ్వరికి తప్పంగాను రాదండ్రు, జీ
వుల కర్మానుభవంబు లిట్లగుట, సర్వోత్కర్ష కార్యంబు నే
వెలయం జేసినదేమి నీ లలికి? దేవీ! పూర్వ జన్మంబునన్”

అంతో ఇంతో జ్ఞానం ఉన్న ప్రతీ ఒక్కరికీ పూర్వ కర్మ ఫలాన్ని అనుభవింపక తప్పదని తెలుసు. జీవులు తమ పాప పుణ్య కర్మ ఫలితాలను ఏ విధంగానూ తప్పించుకోలేరని, వాటిని బట్టే పునర్జన్మలు సంప్రాప్తమవుతాయనీ తెలుసు. అయినా ఎప్పటికప్పుడు అజ్ఞానంలో పడిపోవడం సహజలక్షణం.

ఇక్కడ కవి అవ్యక్తమైన పరాదేవి వాత్సల్యాతిశయము తన మీద ప్రసరించడానికి పురాజన్మలో ఎటువంటి గొప్ప సత్కర్మ చేసి ఉన్నానో అని ఆశ్చర్యాన్ని వెలువరిస్తూ అనుభూతి చెందుతారు.

“జిగి రూపై యమృతంబు దేహమభి వర్షింపంగ సర్వోన్నతం
బగు నీ రూప మెవండు హృద్గత మొనర్పంజాలునో దేవి! యీ
జగతిన్ వాడమృత స్వరూప నయన భాషా పూర్ణ సంవిత్తి సం
పెగ వోలెన్ సురభీకరించు ఘన శ్రీవిద్యా విశిష్టాకృతీ!”

వైయక్తికంగా తాను అనుభూతి చెందుతూనే దానిని విశ్వవ్యాప్తం చేయాలనుకున్న కవి తపన ఇక్కడ స్పష్టమౌతుంది. సకల విద్యా ప్రదాయిని అయిన పరమేశ్వరి సకల శుభాలను ఇవ్వడమే కాక భాషా పరిజ్ఞాన పరిమళాలను అందిస్తుందని ఆయన వర్ణిస్తారు.

పరాశక్తి త్రిపురసుందరిగా ప్రణవనాదమై వాగ్రూపంగా

అవతరించింది. ఛందస్సారము, శాస్త్రసారము, మంత్రసారమూ సమస్తం ఆమే అయింది.

సంతత శోభాయమానంగా విరాజిల్లే శ్రీవిద్యా రూపము లోకాన అమృతాన్ని ప్రవర్షిస్తుంది. అటువంటి ఆ రూపాన్ని ఎవరైతే హృదయస్థం చేసుకుంటారో వారు సమస్త శుభాలను పొందడమే కాక కడు రమ్యమైన భాషా జ్ఞాన ప్రపూర్ణులై కీర్తి ప్రతిష్ఠులవుతారు. జగత్తును సంపెంగ వలె సుగంధభరితం చేయగలుగుతారని అజ్ఞాన తిమిర వలయాలను దాటించే శ్రీవిద్యాదేవితో ఆత్మానుసంధానం చేసుకోమని ఆయన చెబుతారు.

“జల సంప్రోక్షణ దేహమున్, వితత సౌజన్యంబునన్ చేతమున్
పలు సద్విద్యల బుద్ధి వైభవము, శుంభత్ శుద్ధి మార్గంబులై
చెలగున్ గాని ఘటించనేరవు కథంచిత్ జన్మ నిర్వృత్తి,
శోభిలు నీ కంటి వెలుంగె కోరెదను దేవీ! జ్ఞాన
సూన స్థితా!”

బ్రహ్మజ్ఞాన పుష్ప నిలయిని అయిన దేవి కంటి వెలుగు తప్ప తనకు మరేదీ అక్కర్లేదని అంటారు కవి.

ఎందుకంటే శరీరం పైని మలినాన్ని నీటి చేత శుభ్రపరచుకోవచ్చు. సౌజన్య భావంతో అంతః కరణమును శుద్ధిచేసుకోవచ్చు. అనేక విద్యల జ్ఞానము ద్వారా బుద్ధిని సన్మార్గంలో నడిపించుకోవచ్చు.

అనగా దేహము, మనస్సు, బుద్ధి ఈ లౌకికమైన మూడు విషయాలను ప్రయత్నపూర్వకంగా శుద్ధిచేసుకోగలం. కానీ, ఏవిధంగా కూడా జన్మ సంబంధమైన బంధనాల నుండి విడివడి మోక్షాన్ని పొందలేము. అది కేవలం ఆదిశక్తి కృపాదృష్టి వల్లనే సాధ్యమవుతుంది. అందువల్ల జగన్మాత పట్ల పరిపూర్ణ విశ్వాసాంతరంగుడై మోక్ష సాధనకు మార్గమైన ఆ వెలుగునే కోరుతానంటారు కవి. నిర్మలమైన చిత్తవృత్తితో, ఇంద్రియ విజేతగా సాధకుడు కోరుకునే పథాన్ని అభిలషిస్తారు కవి. లౌకిక జీవనం నుండి పారమార్థిక జీవనం వైపు, అంతస్సు నుండి అమృతత్వం వైపుగా ముందుకు సాగుతారు.

“హృదిలో కొన్ని దినాల నుండి యెవరో హిందోళ నాగస్వర
మ్ము దివా రాత్రము లీలగా నభిరుతా పూరంబుగా నూదుచు
న్నది? తన్మూలమునన్ సమూలము మదంతఃచేత
ముప్పొంగు, నే
నిది తర్కింపగ దేవి! నీవవుదువా నీలాభ్రరాగోజ్జ్వలా!”

అప్పాజోస్యుల వారి భక్తి భావ తత్పరతను వెల్లడించు మరో పద్య రత్నమిది. మొదటగా చెప్పుకున్నట్లు ఆయనలోని అవ్యక్త భావన అంతఃచేతనమై ప్రవహిస్తూనే ఉంది. కొన్ని దినాలుగా రేయింబవళ్ళు హృదయంలో ఎవరో మధుర నాగస్వరాన్ని వినిపిస్తున్నారు. రమ్యమైన ఆ స్వరం కారణంగా ఆయన అంతరంగమంతా ఉప్పొంగుతున్నది.

దీనికి నిమిత్తం నీలి మేఘ ఛాయతో ప్రకాశించే మహారాజ్ఞి తన అనురాగాన్ని ప్రసరింపజేయడమేనని తెలుసుకున్నారు.

కవి ఇక్కడ హిందోళ రాగాన్ని ప్రత్యేకంగా పేర్కొనడానికి కారణం ఉంది. ఇది జనరంజకమైన ప్రసిద్ధ రాగం. అయిదు స్వరాలతో కోమలంగా ఊయల లూగుతున్నట్టు, వినడానికి హాయి గొలిపే రాగం. ఇది వసంత ఋతువు శోభను అనుభూతి పరం చేయిస్తుంది. సమ్మోహన శక్తి గలదైన నాగస్వరం సర్పాలను వివశులను చేసి వశ్యం చేయిస్తుంది.

కవి ఒకవైపు అనురాగానికి ప్రతీక అయిన హిందోళ రాగాన్ని, సమ్మోహ లక్షణం కలిగిన నాగస్వరంగా చెబుతూ అటువంటి స్వరం తన హృదయంలో అనుక్షణం వినిపిస్తుందనడం, అది అమ్మవారి అనురాగమేనని చెప్పడం ఆయన భక్తికి పరాకాష్ట. దట్టమైన నీలి మేఘం వర్షాన్ని కురిపించి ప్రకృతిని పరవశింపజేస్తుంది. అట్లాగే భవబంధనాలలో తగులుకొన్న కవి హృదయాన్ని సంగీత సారస్వత సమలంకృత అయిన పరాంబిక నాదమయం చేసింది.

“గతమా రాదు, భవిష్యమేమో యెరుగంగాన్ రాదు, జన్మాంతరా
గత సంసిద్ధికి వర్తమానము పరీక్షా వేళ దేవీ! సమం
చిత రీతిన్ చరియింతు నీదు నవ రాజీవేక్షణా వేల్లిత
ద్యుతి విద్యుత్ ప్రతిభా విదగ్ధ భవ నిత్యోపాస్తి యోగంబునన్!”

కవి ఈ పద్యంలో నిత్య జీవన సత్యాన్ని తెలుపుతున్నారు. క్షణాలుగా జారిపోయే కాలాన్ని అడ్డుకోలేము. హఠాత్తుగా ఆగిపోయే ఊపిరినీ బంధించలేము. గడిచిపోయిన దానికి చింతించి లాభం లేదు. భవిష్యత్తును ఊహించడానికి వీలు లేదు. గత జన్మ కర్మ ఫలితం ఎప్పటికప్పుడు వెంటాడుతూనే ఉంటుంది.

ఈ తత్త్వాన్ని అర్థం చేసుకుంటే కనీసం మరుజన్మలో నైనా సుకర్మ ఫలాలను సిద్ధింపజేసుకోవడానికి వర్తమానం మన చేతుల్లోనే ఉంది.

“నళినీదళగతజలమతి తరళం
తద్వజ్జీవిత మతిశయ చపలమ్
విద్ధి వ్యాధ్యభిమాన గ్రస్తం
లోకం శోక హతంచ సమస్తమ్”
(మోహముద్గరం)

ఈ సత్య వివేచన కలిగిన కవి, శోకపీడితమైన లోకం నుండి విముక్తుడవడానికి పద్మదళాయతాక్షి కొనచూపుల ప్రకాశంతో ఆమె ఉపాసనలో నిమగ్నుడై జన్మాంతర ఉపాసనా యోగ మార్గాన్ని కూడా పొందగలనంటారు. కాలచక్ర భ్రమణంలో జీవితం చేజారిపోకముందే మానవుడు వర్తమాన విచక్షణ కలిగి ప్రవర్తించడం మంచిది. అప్పా జోస్యుల వారు అంతశ్చరయోగి కాబట్టి జ్ఞాన సంపన్నులై ఆత్మానాత్మల వివేచన కలిగి మోక్ష సాధనా మార్గంలో పయనిస్తున్నారు.

“పరిణామాస్పదమైన దేహమున విభ్రాజిల్లు సర్వాంగముల్
జరచే జర్జరమై నశించునవి, ప్రాంచద్భూషలున్ మందు ల
త్తరి వ్యర్థంబు, నిరామయప్రద చికిత్సా శుష్మ దేవీ! భవ
త్కరుణా లోక మయూఖ మాలికలు శ్రీ కైవల్య చింతామణీ !”

నశ్వరము, అశాశ్వతము అయిన ఈ దేహం జననం నుండి మరణం వరకు నిరంతర పరిణామ శీలానికి లోనవుతుంది. యవ్వనంలో ప్రకాశించిన శరీరావయవాలు వృద్ధాప్యం వలన ఒక్కొక్కటిగా పటుత్వాన్ని కోల్పోతాయి. నశించేవాటిని కాపాడుకునే ప్రయత్నంలో ఉపయోగించే ఔషధాలు కానీ, మెరిసే ఆభరణాలు కానీ ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చలేవు. సర్వ వ్యాధులను ఉపశమించేది, జరా మరణాల నుండి జీవులకు ఊరట నిచ్చేది ఆ జగన్మాత మాత్రమే. ఆమె అమృత చూపుల ప్రసారంతో ఆరోగ్యప్రదమైన విద్యను అందిస్తుంది.

జీవుడెప్పుడూ దేహభ్రాంతితో కాలం వ్యర్ధంగా గడుపుతుంటాడు. సృష్టిలో ప్రతీది నశించిపోయేదే. ఆ విచక్షణ లేకుండా మోహ వలయంలో చిక్కుకోవడం, తదనంతరం పశ్చాత్తాపపడడం ప్రయోజనశూన్యం.

“శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం” పురుషార్థాలు సాధించడానికి దేహమే సాధనం. అటువంటి దేహాన్ని ఆరోగ్యప్రదం చేసుకోవడానికి మోక్షాన్ని సాధించడానికి

ఆమె కరుణాకటాక్ష వీక్షణమే పరమైక సాధనమని కవి వివరిస్తారు.

“వర హేరాళ వికాస భావ భవదద్వైతా పూర సుం
దర నిధ్యానము నేను గోరెదను, సుంతై కాదు సూ! గాఢ దు
స్తర మౌఢ్యంబు క్షయించు దర్శన మహద్భాగ్యంబు, గండూష మా
త్ర రసోల్లాసము దేవి! యొల్లను, శరత్తారాధ్వ నీల ద్యుతీ!”

శరత్కాలపు నీలి మేఘము వలె అతిశయించు ప్రకాశం కలిగిన ఆ మహాదేవి దర్శనాన్ని ఆయన కాంక్షిస్తారు. ఆత్మ పరమాత్మల సమ్మిళితమై, పరిపూర్ణమైన అద్వైత భావంతో ఆ దేవిని దర్శించుకోవాలని కోరుకుంటారు. అది కూడా స్వల్పంగా కాదు. తనలోని దట్టమైన మూఢత్వాన్ని నశింపజేసి శాశ్వతానందాన్ని ఇవ్వగలిగే సాక్షాత్కార మహద్భాగ్యాన్ని మనసారా అభిలషిస్తారు.

జీవుడు అవస్థాత్రయంలో నిరంతర దుఃఖాన్ని అనుభవిస్తుంటాడు. దీనినుండి బయట పడడానికి ఆత్మజ్ఞానం అవసరం. ఆ జ్ఞానాన్ని పొందిన కవి జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని గుర్తించి అటువంటి శాశ్వతాభేద దర్శనాన్ని కోరుకుంటారు. “నిశ్చల చిత్తే జీవన్ముక్తిః” అన్నట్టు నిశ్చల చిత్తంతో ఆ పరమేశ్వరిని సాకారం చేసుకునే ప్రయత్నం చేస్తారు.

“పరదైవంబని కీర్తికాంత వెనుకన్ పర్వెత్తగా లేను, దు
స్తర దుఃఖత్రయ జన్మ తారణకునుత్తాలంబు దేవీ! భవ
త్పర మార్థప్రద ప్రత్యభిజ్ఞ ఘనమై బ్రహ్మమ్ము దీపింప,
న శ్వర సౌఖ్యంబులవేల నాకు నిఖిల జ్ఞాన ప్రభావ ప్రభా!!”

ఎప్పుడైతే కవి మనస్సు ఏకాగ్రచిత్తంలో పరాదేవీ తత్త్వాన్ని అనుభూతి చెందడం ప్రారంభించిందో ఆయనకు లౌకిక విషయ వాసనల వ్యామోహం అర్థ రహితంగా తోచింది. దట్టంగా అల్లుకున్న దుఃఖత్రయాల నుండి తప్పించి జన్మ తరించడానికి, పారమార్థిక జ్ఞానాన్ని అందించే మార్గాన్ని సులభతరం చేయడానికి, హృదయంలో దట్టమైన బ్రహ్మజ్ఞానాన్ని వికసింపజేయడానికి పరాత్పరి అనుగ్రహప్రాప్తి చాలంటారు. పరదేవతగా భావించే కీర్తికాంతా ఘనత ఇక అవసరం లేదంటారు. అశాశ్వతములు, క్షణికములు అయిన లౌకిక సుఖాలు అవసరం లేదంటారు. ఆయనలోని అంతర్గత చేతన, హృదయ వికాసము అమ్మవారి సాన్నిహిత్యాన్ని అనుభూతి చెందే పరిపూర్ణ మానవునిగా ఆయనను రూపుదిద్దాయి.

“ఇదమిత్థంబని చెప్పజాలనిది, తాదృక్షంబు వేరొండు లే
నిది, సృష్టి స్థితి నష్టి కారణ సమున్నిద్రాత్మ తేజంబు,
జీవద సర్వస్వము, విశ్వతోముఖ మహా బ్రహ్మాండ చిచ్ఛక్తి, స
ర్వదమై దేవి రహించు నా హృదిని నిర్వార్యోప
కంఠ స్థితిన్”

చివరగా ఆయన తనలో త్రిజగజ్జనని వాత్సల్య విశేషం, అనుగ్రహం, యోగముల చేత విశ్వ వ్యాప్తమైన చేతనతో బ్రహ్మ జ్ఞానము ఆవరించిందని చెబుతారు. ‘ఇదీ’ అని చెప్పడానికి, ‘ఇంతే’ అని నిర్ధారించడానికి వీలులేనిది, సృష్టి, స్థితి, లయాత్మకమైన పరమాత్మ తేజోవికసన తరంగం పూర్ణమై హృదయమంతా వ్యాపించిందని అనుభూతి చెందుతారు. ఇప్పటి వరకూ అనేక విధాలుగా పరాత్పర రూప గుణ వైభవాలను వెల్లడించి, ఆమె కరుణా రస ప్రవాహ మాధుర్యాన్ని తెలుపుతూ, మోక్షసాధన మార్గాన్ని అన్వేషిస్తూ సాగిన అప్పాజోస్యుల వారి కవిత్వం చివరగా అద్భుతావహమైన పద్యంతో పరిపుష్టమైంది.

ఆత్మలో పరమేశ్వరిని దర్శించిన ఆయన ఆ జ్ఞానశక్తిని అంతర్గతం చేసుకొని అవ్యక్తానందాన్ని అనుభవించారు. అది అపారమై, సమగ్రమై, మహత్వపూర్ణ సిద్ధిని ఆయనలో కలుగజేసింది. ఆమె కటాక్షం వలన నిరంతర వాహినిగా పొంగే తాదాత్మ్యతను కైవసం చేసుకున్న మహోన్నత మూర్తిమత్వం ఆయనది. పంచ భూతాత్మకమైన దేహాన్ని త్రికరణశుద్ధిగా అమ్మవారికి అర్పించి జీవితాన్ని ధన్యం చేసుకున్న యోగి.

సారస్వత భాస్కరులు అప్పాజోస్యుల వారు తమ సృజనాత్మక కవిత్వ కళానైపుణ్యంతో కావ్య మర్మములను తెలుసుకొని, భావ రసానుభూతితో కవితారూప తపస్సు చేస్తూ, వాసికెక్కిన కవి పుంగవులు.

తారావళి, శతకం మొదలైన వివిధ ప్రక్రియల్లో ఆయన రచనలు పాఠకుని హృదయంలో చెరగని ముద్ర వేస్తాయి. జీవితాన్ని వ్యర్థమయం చేసుకోకుండా కరుగుతున్న కాలపు విలువను గుర్తెరిగి సంపూర్ణ జీవన పరమార్థాలను అందుకోవాలనుకున్న అరుదైన సంకల్పాన్ని ఆలోచనా నిర్దిష్టతతో మనో నిశ్చలతతో సాధించిన మహనీయులు ఆయన.

***

ప్రతులకు:
అజో-విభొ-కందాళం ఫౌండేషన్
3-3-24/1ఎ, మొదటి అంతస్తు
ఎక్‌బొటె హౌస్, వైశ్య హాస్టల్ ఎదురుగా,
కాచిగూడ క్రాస్ రోడ్స్, హైదరాబాద్ – 500027
ఫోన్ : 040-40179673

Exit mobile version