Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రవహించే నది లాంటి ‘మహతి’ కథ

[భువనచంద్ర గారి ‘మహతి’ నవలకి ప్రొ. సిహెచ్. సుశీలమ్మ గారు వ్రాసిన ముందుమాటని పుస్తక పరిచయంగా అందిస్తున్నాము.]

“కాలపు నదిలో పయనించే
జీవిత నావకు
మరణమే లంగరా
మనసు తెరమీద
కదిలే బొమ్మ లేగా
మనుషుల జీవితాలు!
……
తెలిసిన వారిని వదిలేస్తూ
తెలియని వూళ్ళని వదిలేస్తూ
సాగే సాగే ప్రయాణమా
నీ చిరునామా జీవితమా!”

‘వాళ్లు -2’ నవలలో భువన చంద్ర పై విధంగా అంటారు.

ఈ నవలలో గంభీరంగా ప్రవహించే ‘మహతి’ అనే నదిలో – ఎన్నో అలలు, వాగులు, ఉపనదులు కలిసిపోతూ, నవరసాలు నిండిన జీవిత సారంలా, చిక్కనైన పాటలా, తెలుగు నవలా లోకంలో మెరిసే మణిపూసలా ఈ కథ పాఠకుల హృదయాల్లో నిలిచిపోతుంది.

పెద్ద పుల్లేటికుర్రులో పుట్టిన పెంకి పిల్ల ‘సీత’ కథని, ఆమె లోని నిర్భీతిని, నిజాయితీని, హిపోక్రసీ లేని అందమైన అల్లరిని ‘మూడో సీత’ నవలగా అందించిన భువన చంద్ర ఆమె ఎస్సెల్సీ పాసవ్వడంతో ముగించారు. ఆ సీత ఎదిగి మహతి గా మారి, కాలేజీలో చేరి, ఇంటర్ చదువుతున్నప్పటి విశేషాలతో ఈ నవల ప్రారంభించారా అనిపించింది. అదే చిలిపితనం, అదే వ్యక్తిత్వం, అదే సేవాభావం, అదే నిబద్ధత. దేనికీ తొణకని బెణకని దృఢత్వం.

నవలని ఒక అద్భుతమైన ప్రణాళికతో, ఆకర్షణీయమైన శిల్పంతో, మొదట మహతి పరంగా 33 అధ్యాయాలు, అల చెప్పగా మహతి రాసినట్టు 34 నుండి 54 అధ్యాయం వరకు, మళ్లీ 55 నుండి మహతి – అల కలిసి ఆయా సంఘటనలను చెప్తున్నట్టు ఒక మంచి టెక్నిక్‌తో, పాఠకులకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా, ఎన్నో జీవితాలను ఇద్దరమ్మాయిల దృష్టి కోణం నుండి దర్శింపజేసారు. కథా నిర్మాణ రహస్యం బాగా ఆకళింపు చేసుకున్న రచయిత కనుకనే అధ్యాయాల విభజన లోని ఈ కొత్త టెక్నిక్‌తో పాఠకుల్ని మంత్రముగ్ధుల్ని చేసి పాత్రల విశిష్టతలను, వ్యక్తిత్వాలను అక్షరబద్ధం చేసారు. ఎంత సన్నిహితులైనా ఏ యిద్దరి మనోభావాలు ఒకేలా పూర్తిగా ఉండవు. ఒకవేళ ఉన్నా ఆయా సన్నివేశాల్లో స్పందించే విధానం వేరేగా ఉంటుంది కదా!

తమ ప్రమేయం లేకుండా, తల్లిదండ్రులు చెప్పిన కోర్సుల్లో చేరి, ఏదోలా చదువు పూర్తి చేసే అమ్మాయిలు అబ్బాయిల్లా కాకుండా తనేం చదవాలో తనకంటూ స్పష్టంగా తోచాలని నిర్ణయించుకున్న మహతి, చక్కగా పాటలు పాడే హరగోపాల్, ఏ భావాన్నీ దాచుకోక ముఖంలో ప్రస్ఫుటంగా పలికేలా ఉండే అనంతలక్ష్మి (అల), తన ధోరణిలో తను చదువుకొనే తిరుమలరావు (తిమ్ము), పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొని జీవితాన్ని కోల్పోయిన కుసుమ వంటి పాత్రల చుట్టూ తిరిగే కథ ఇది. తల్లిదండ్రులు గౌతమ్, అహల్యల సంస్కారవంతమైన పెంపకంతో, తాతయ్య అనుభవం రంగరించిన మార్గదర్శకంతో, చక్కని ఆలోచనా పరిణితి కలిగిన ‘మహతి’ఈ అందరికీ కేంద్రబిందువు వంటిది.

జూ. కా. (జూనియర్ కాలేజీ) ల్లో జరిగే సరదా సంఘటనలు బాల్యవస్థ దాటి, పూర్తిగా వ్యక్తిత్వం సంతరించుకోని యవ్వనపు తొలి రోజుల ఊహలు, సరైన నిర్దేశకత్వంతో మంచి మార్గంలోకి మళ్ళే కొన్ని జీవితాలు, తొందరపాటు చర్యలతో పక్కదారి పెట్టే కొందరు యువతరం – వారి మనసు పొరల్లోకి తొంగి చూసి రచయిత చెప్తున్నారా అన్న అబ్బురపాటు కలుగుతుంది పాఠకులకు. ప్రతి పదేళ్లకు సమాజంలో, కుటుంబ వ్యవస్థలో, మనుషుల్లో ‘నూతన తరం’ లక్షణాలు పొటమరిస్తాయి అంటారు విజ్ఞులు. శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, కుటుంబ పరిస్థితులు అర్ధం అయ్యీ కానీ కన్ఫ్యూజన్ స్టేజ్‌లో, ఏమి చేయాలో చేయకూడదో తెలీని స్థితిలో ఉంటారు ఇంటర్ విద్యార్ధులు. కానీ డెభయ్యో దశకంలో ఉన్న భువనచంద్ర గారు టీనేజ్ పిల్లల ఊహల్లోకి వెళ్లి, వారి పక్వ, అపక్వ ఆలోచనలను ఒడిసి పట్టుకుని, చాలా సరదా సన్నివేశాలను సరిగ్గా వర్ణించడం ఆశ్చర్యం, అత్యంత అభినందనీయం.

తెలిసీ తెలియని వయసులో ఆకర్షణే ప్రేమ అనుకొని, ఎదుటి వ్యక్తి లో ఆ ఆలోచన లేకపోవడంతో, మూర్ఖత్వంతో అతన్ని వేధించిన అల అనుకోకుండా సినిమా లోకి సెలెక్ట్ అవ్వడం, ఏ భావాన్నైనా ముఖంలో చక్కగా పలికించటంతో ఏకంగా హీరోయిన్ పాత్ర దక్కటం జరిగింది.

సినీ ప్రపంచంలో ఉంటూ, వేలాది పాటలు రచించిన భువనచంద్ర గారికి ‘సినిమా’, దాని వెనక ఉన్న నీడలు, మరకలు తెలుసు. ఎన్నో విషాదాలు తెలుసు. ‘అన్‌టోల్డ్ స్టోరీస్’ అంటూ జూనియర్ ఆర్టిస్టుల దుఃఖపూరితమైన గాధలను చెప్పారు కూడా. కానీ ఇక్కడ అల సినీ తారగా జీవితం ప్రారంభించినది మొదలు, ఒక్కో విషయం ఆసక్తిగా తెలుసుకుంటూ, వినయంతో, అదే సమయంలో ఏ ప్రలోభాలకి లొంగక, ‘కష్టపడి పనిచేయాలి మంచి నటిగా పేరు తెచ్చుకోవాలి’ అన్న పట్టుదల మరియు ప్రయత్నాలతోను, మంచి మనసుతో ‘సినిమా బాగా రావాలి’ అనే సద్భావనతో ఆమెకు సహకారం అందించిన తోటి సినీ సహచరుల కృషిని వివరించారు.

24 ఫ్రేమ్స్ ఎంత శ్రమ పడి, శ్రద్ధతో పని చేస్తే ఒక సినిమాగా రూపొంది ప్రేక్షకుల ముందుకు వస్తుందో నిజాయితీగా చెప్పారు. సినిమా అంటే చాలామంది కి చులకన భావం ఉంటుంది. కానీ, దర్శక నిర్మాతలతో పాటు మేకప్‌మేన్, కెమెరామేన్ నుండి టచప్ విమెన్ వరకు ఎవరి పనులు వారు చేసుకుని పోవడం అన్నది నిజం. ఎక్కడో కొన్ని అవాంఛనీయమైన విషయాలు, విషాదాలు ఉండవచ్చు. కానీ ఈ నవలలో ఎలాంటి కల్మషం, విధ్వంసం, నెగెటివ్ షేడ్స్ ప్రస్తావన లేకుండా, పాఠకుల మనసులు కలుషితం కాకుండా పాజిటివ్ దృక్పథంతో చెప్పారు రచయిత.

అలాగే సందర్భం వచ్చినప్పుడల్లా మాంఛి తెలుగువారి మధురమైన వంటకాలను సవివరంగా వర్ణించారు. అల ‘ధీర’ హిందీ వెర్షన్ కోసం ముంబై వెళ్ళినప్పుడు, అందమైన లోకేషన్స్ కోసం వివిధ రాష్ట్రాల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాల వంటకాలను నోరూరించేలా వర్ణించారు.

సుదీర్ఘ కాలం ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసిన (1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధం లోనూ) భువనచంద్ర ‘మహతి’ అన్నయ్య సురేంద్ర ఇండియన్ ఆర్మీలో చేరాడని చెప్పడం సమంజసంగా ఉంది. అతని స్నేహితుడు ఫాలాక్ష అలకి, ఆ షెడ్యూల్ లో పనిచేసిన వారికి నిస్సహాయ పరిస్థితిలో సహాయం చేసే సమయంలో అతని హుందా, మంచితనం తెలుస్తుంది. అదే సమయంలో రచయిత ప్రవేశపెట్టిన ఫాలాక్ష అక్కయ్య ‘కళ్యాణి’ మరో మంచి పాత్ర. ఎదుటివారి మనసు, అవసరం తెలుసుకుని, చొరవగా తనకు చేతనైనంత ఆర్థిక హార్దిక సహాయం చేయగల సహృదయురాలు ఆమె.

అమ్మమ్మ చనిపోయినప్పుడు తాతయ్యకు తోడుగా, సహాయంగా కర్రావూరి ఉప్పలపాడులో ఉండిపోయిన మహతి గ్రంథాలయానికి పిల్లలు వెళ్ళేలా చేయడం, ఒక్క డాక్టర్, నర్స్ తో కిక్కిరిసిన ఉన్న హాస్పిటల్‌కి తనంత తానుగా కొన్ని సంస్కరణలు చేపట్టడమే కాక, ప్రెసిడెంట్ గారు, ఊరి పెద్దలను, సత్యసాయిబాబా సేవా సంస్థ వాలంటీర్లను, స్కూల్ లోని స్కౌట్ బృందాన్ని కలుపుకుని ఒక పద్ధతిగా ఊరంతా మెచ్చుకునేలా పనులు చేపట్టింది. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడక హాస్పిటల్ చుట్టూ పేరుకుపోయిన చెత్తాచెదారం తీసేయడం, వేచిచూస్తున్న వారికోసం బెంచీలు వేయించడం, వేరే ఊర్ల నుండి వస్తున్న వారికోసం తాతయ్య ఇంటి ముందు స్థలంలో తాటాకు పందిరి వేయించడం, చివరికి డాక్టర్ గారికి తమ ఇంట్లో వసతి ఏర్పాటు చేయడం వరకు ఎంతో చొరవ చూపింది. అట్టముక్కల మీద నెంబర్లు వేసి వరుసగా క్యూ లో పంపించడం, తాగే నీటి కోసం మట్టి కుండలు ఏర్పాటు చేయడం – చిన్న విషయాలే అనిపించవచ్చు కానీ పనులు సాఫీగా, క్రమబద్ధంగా జరగడానికి కేవలం రాజకీయ నాయకుల మీద, ప్రభుత్వ ఉన్నతోద్యోగుల మీద ఆధారపడితే అయ్యే పనేనా! ఒంటరితనంతో ఉన్న తాతయ్యకి పనులు పురమాయించడమే కాక, కుసుమ చనిపోవడంలో తమ మూర్ఖత్వం ఉందని కుమిలిపోతున్న అమ్మ, అమ్మమ్మలకు విస్తర్లు కుట్టే పని అప్పగించడం వల్ల వారికి, వారితో పాటు మరి కొందరికి పని కల్పించడమే కాక ప్లాస్టిక్ భూతానికి అడ్డుకట్ట వేసినట్లయింది. యువత మనస్పూర్తిగా తలుచుకుంటే ఏదైనా చేయగలరు అనే దానికి ఒక ఉదాహరణగా మహతిని చూపారు రచయిత. నేటి కళాశాలల్లో ఇలాంటి చురుకైన విద్యార్థులు ఉంటే ఎంత బాగుంటుంది అనుకోక తప్పదు (33 ఏళ్లు అధ్యాపక వృత్తిలో ఉండి, విద్యార్థులతో కలిసి మెలిసి ఉన్న నేను ఈ సంఘటనల్ని చదువుతున్నప్పుడు బాగా కనెక్ట్ అయ్యాను).

చక్కగా హుషారుగా సాగిపోతున్న కథలో ఒక తుఫానులా ప్రవేశించింది ‘ఇందిర’. చూడగానే ‘అలసిపోయిన అందం’లా కనిపించే ఆమెలో దాచినా దాగని అహం, మూర్ఖత్వం, ‘స్వేచ్ఛా’ విహారం వంటి ప్రవర్తన.. సీరియల్‌గా వస్తున్నప్పుడే పాఠకులు కొంత అసహనానికి గురయ్యారనే చెప్పాలి. గౌతమ్, అహల్య అన్యోన్య దాంపత్యం లోకి హఠాత్తుగా దూసుకుని వచ్చింది ఈ ఇందిర.

ఇలాంటి పరిస్థితుల్లో స్థిరమైన వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకున్న పాత్ర ‘అహల్య’. తామిద్దరి మధ్యకు దూసుకువచ్చిన ఇందిర, ఆమె దూకుడు స్వభావం సహించరానిదే అయినా భర్త కోసం, పిల్లల కోసం, కుటుంబం కోసం సహించింది. కానీ ఎంతకీ ఏదో ఒకటి మాట్లాడని భర్త ప్రవర్తన వల్ల ఇందిర పట్ల అతనిలో ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉందన్న ఊహే భరించరానిదైంది. అయినా బైట పడకుండా, కోసేస్తున్న బాధను వ్యక్తం చేయకుండా ‘కన్నతండ్రి ని, కన్నబిడ్డలను చూసుకోవాలి గా’ అంటూ గంభీరంగా బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోవడం లో ‘అహల్య’ లోని హుందా యైన వ్యక్తిత్వం ఎవరికైనా నచ్చుతుంది.

ఇందిర ‘అతి’ వల్ల ఆమె మనసులోని అల్లకల్లోలం పాఠకులకు తెలుస్తుంది, కానీ మౌనంగా పంటి బిగువన దాచిన అహల్య ‘నొప్పి’ బయటకు తెలీదు.

కానీ మనిషి బాహ్య స్వరూపం, ప్రవర్తన వెనుక ‘అంతచ్చేతన’ క్రమక్రమంగా రచయిత వెల్లడించడంతో – ఇందిర కఠినమైన మనసు వెనుక సున్నితమైన మనోభావాలు, దెబ్బతిన్న అభిమానం, కోల్పోయిన ప్రేమ ఉందని తెలిసి సానుభూతి కలుగక మానదు.

మొదటి నుండి పద్ధతిగా ఉన్న పాత్రను కొనసాగించడం రచయితకు నల్లేరు మీద నడక లాంటిది. కానీ ఇలాంటి వైరుధ్యమైన పాత్రను చిత్రిస్తూ, ఎక్కడా బాలెన్స్ కోల్పోకుండా, చివరికి పాఠకులకు ఆ పాత్ర అసలైన స్వభావాన్ని చెప్పి ఒప్పించడం కత్తి మీద సాము లాంటిది. దానిలో భువనచంద్ర గారి కలం విజయవంతం అయింది.

శీర్షిక అయిన మహతి పాత్ర మాత్రమే కాక, మరో ప్రధాన పాత్ర అల మాత్రమే కాక, దాదాపు అన్ని స్త్రీ పాత్రలను ఎంతో ఆసక్తితో నైపుణ్యంతో చిత్రించారు భువనచంద్ర. రచయిత్రులు మాత్రమే స్త్రీల మనసుని, వారి మనోభావాలను వెల్లడించగలరు అనుకోవడం పొరపాటు. పురుష రచయితలు కూడా స్త్రీల మనోభావాలను ‘సహ అనుభూతితో గుర్తించి రాయగలరు అని చెప్పటానికి ఈ నవల చక్కని ఉదాహరణ. హరగోపాల్, తిమ్ము, సినీ యాక్టర్ వినోద్ కుమార్, ఆఖరికి మహి తండ్రి గౌతమ్ కంటే కూడా ఈ స్త్రీ పాత్రల చిత్రీకరణలో రచయిత మనసుపెట్టి, గుండెలనంతా నిండిన గౌరవంతో రాసారని తెలిసిపోతుంది. అల హిందీ చిత్రరంగానికి వెళ్ళినప్పుడు సినీ ప్రముఖులు మాత్రమే కాక డ్రైవర్, ప్రొడక్షన్ మేనేజర్ కూడా ఆమె పట్ల గౌరవంతో ప్రవర్తించటం వల్ల ఆమె వ్యక్తిత్వం ఎంత హుందాగా, గౌరవప్రదంగా ఉందో తెలుస్తుంది. ఇంకా – సమాజాన్ని, కుటుంబాన్ని ఎదిరించలేక జీవితం దుర్భరమై తనువు చాలించిన కుసుమ, కోల్పోయిన దాన్ని తిరిగి పొందలేకపోయినా ఆత్మాభిమానంతో గౌరవాన్ని నిలుపుకుంటూ నిలిచిన త్రిపుర, తన స్వంతం కాని నలుగురు పిల్లల్ని పెంచి, వారి చేత మాటలు పడి, ‘బ్రతకాలని ఉంది నేస్తం’ అంటూ నాలుగు పదులు నిండని వయసులో తనువు చాలించిన ‘మృదుల’.. ఎందరో అద్భుతమైన స్త్రీలు.

సామాజిక సేవ, దయాగుణం, నిండైన చైతన్యం మూర్తిభవించినది మహతి. తనకేం కావాలో ఇందిర ఇదమిత్థంగా నిర్ణయించుకోలేకపోయింది. సరైన సమయంలో తనదైన స్పందనను తెలుపలేకపోయింది. ఆ తర్వాత ఎంత మథనపడినా లాభం ఏముంది! ఉక్రోషంతో తన చర్యలు ద్వారా ఎదుటివారిని మానసిక హింస గురి చేయటం తప్ప!

తన చుట్టూ ఉన్న వారిని విసిగించిన అల సినిమాలాంటి చిత్ర విచిత్ర లోకంలోకి అడుగుపెట్టి, అడుగడుగున తనను తాను మలుచుకుంటూ, తన చుట్టూ ఉన్న వారిని ఆహ్లాదకరంగా ఉంచగలిగింది.

ఉత్తర భారతదేశంలో ముఖ్యమైన ప్రదేశాన్ని అల ద్వారా పాఠకులకు కూడా సైట్ సీయింగ్ చేయించారు రచయిత. ఆయా ప్రాంతాలు, ప్రజల జీవన విధానాలు, ఆహారపు అలవాట్లు, రుచులు తెలియజేశారు. సినిమా ప్రజలందరూ దుర్మార్గులు కారు. అది వారి జీవనోపాధి. మోసపోయిన కొందరు దుఃఖాన్ని గొంతులోనే అణిచిపెట్టుకొని, మరే పని చేతకాక, అక్కడే బ్రతుకుతున్న వారూ ఉంటారు. కానీ ఆ నెగటివ్ షేడ్స్‌ని చెప్పి మంచి విషయాలకు చోటు లేకపోయే ప్రమాదం తీసుకోలేదు రచయిత. నిజానికి

ప్రతి మనిషిలోపల మరో మనిషి ఉంటాడు. ఆ లోపల ఉన్న మనిషే అసలు సిసలు మనిషి. బయటకు కనిపించే మనిషి మొహానికి ఎన్నో ముసుగులు ఉంటాయి. లోపలి మనిషికి ఏ ముసుగులో ఉండవు.

ఈ పాత్రలను, వారి జీవన గమనాలను చిత్రించటంలో రచయిత సంపూర్ణంగా సక్సెస్ అయ్యారు. ఆయన కలం నుండి ప్రాణం పోసుకొని ఆద్యంతం జీవంతో తొణికిస లాడిన పాత్రలు పాఠకుల్ని ఆకట్టుకుంటాయి. ఎక్కడా సినిమాటిక్స్ సన్నివేశాలు ఉండవు. ఎక్కడెక్కడ నుండో వచ్చిన వారిని సినిమా అనే కళ కలిపింది. తింటున్న భోజనాలను పంచుకున్నట్టే కష్టసుఖాలని కలబోసుకున్నారు. ఒకరికొకరు సహకరించుకుంటూ, ఓదార్చుకుంటూ, ధైర్యం చెప్పుకుంటూ, తమ ఉమ్మడి శ్రమతో, గౌరవంగా, ప్రాణం పెట్టి, తమకు తిండి పెట్టే ‘కళామతల్లి’ గా భావించి సినిమాను పూర్తి చేస్తారు. ఎన్ని వేల మంది మనో మధనం ఈ సినిమా! సినిమ ని తిరగేస్తే మనిసి కదా!

ఏ నవలలో నైనా మధ్య మధ్యలో మంచి మంచి పాత హిందీ పాటలని, వాటి అర్థాలను తెలియజేయడం భువనచంద్ర గారికి ఇష్టమైన విషయం. అంతేకాక ‘పాదచారి’ పేరున (ఆయనే) కొన్ని అర్థవంతమైన కవితలను సందర్భానుసారంగా చెప్తారు. అలతి అదితి పదాలలో అనంతమైన అర్ధాన్ని వెలిబుచ్చుతారు. జీవిత పరమార్థాన్ని అర్థమయ్యే రీతిలో చెప్తారు. ఒకప్పుడు నవలల్లో చిన్నచిన్న చిట్కాలను చెప్పే రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి. ఆ రోజుల్లో వాటిని చాలామంది అనుసరించే వారు కూడా. అలాగే ఈ నవలలో కూడా సందర్భానుసారంగా చిన్నచిన్న చిట్కాలను యువతకు ఉపయోగపడేలా చెప్పారు భువనచంద్ర.

చివరిలో అయినా ప్రముఖంగా చెప్పుకోవలసిన పాత్ర ‘అభిమన్యు’. ఉన్న కొద్దిసేపైనా మహతి లాంటి వ్యక్తి మనసులో నిలిచిపోయిన అభిమన్యు కథానాయకుడు పాత్రలో తర్వాత భాగంలో ప్రత్యక్షమవుతాడని అనుకోవచ్చు. అతని వేషభాషల్ని, గాంభీర్యమైన ప్రవర్తనని, లోతైన భావ వ్యక్తీకరణని, తాత్త్విక సంభాషణ రచయిత వర్ణించిన తీరు గమనించి, మహతితో పాటు పాఠకులూ అతని ప్రేమలో పడిపోయారు. భయంకరంగా కురిసిన కుంభ వర్షం వల్ల ఊరంతా చెరువులా మారి, ప్రజల గుండె చేరువైన సందర్భంలో దైవమే పంపినట్లుగా వచ్చాడు అభిమన్యు. స్వామి వివేకానంద ఆశించిన ‘భారతీయ యువకుడు’ లా, మూర్తీభవించిన సంస్కార పురుషుడిగా ఉన్న అభిమన్యు తుఫాను మిగిల్చిన దయనీయమైన పరిస్థితినంతా తన చేతుల్లోకి తీసుకున్నాడు. పడిపోయిన చెట్లను తొలగించటం, రోడ్లు బాగు చేయటం, లారీలతో ఆహార పదార్థాలను, తగిన మందులను తెప్పించడమే కాక ప్రకృతి సృష్టించిన ఆ భయానక వాతావరణన్ని చక్కదిద్దే ప్రయత్నాలన్నీ చేశాడు. ప్రజల అభిమానాన్ని సంపాదించడమే కాక మహతి ఆలోచనల్లోనూ చోటు సంపాదించుకున్నాడు.

అనేక మలుపులు తిరుగుతున్న కథ, పాత్రల ప్రయాణం 580 పేజీల వరకు నడిచినా కొంత విరామం తీసుకున్నట్లు ఉంది కానీ శుభం కార్డు పడలేదు.

సంచిక అంతర్జాల పత్రికలో 2021 – 22లో ప్రతి వారం ఉత్కంఠతో పాఠకుల్ని ఆకర్షించిన ‘మహతి’ సీరియల్ లో చివరి వారం ప్రతి పాత్రా తన ‘అభిప్రాయాలు’ తనదైన రీతిలో చెప్తుంది. కానీ ముగింపు చెప్పలేదు. కాబట్టి తరువాయి భాగం ఉందని ఖచ్చితంగా తెలుస్తోంది.

ముందుమాటలో కథంతా ఏకరువు పెట్టకూడదు అనే సిద్ధాంతం ప్రకారం వీలైనంతవరకు పాత్రల వైశిష్ట్యాన్ని చెప్పాను కానీ కథను చెప్పలేదు. అద్భుతమైన పాత్రలు, సన్నివేశాలు ఎవరికి వారు చదివి మనసారా ఆస్వాదించుకోవాలని నా నిశ్చితాభిప్రాయం. మహతి తో పాటు – మూడో సీత, మనసు పొరల్లో, వాళ్ళు 1&2, అన్‌టోల్డ్ స్టోరీస్ చదివితే భువనచంద్ర గారి రచనా వైదుష్యం, ‘వస్తు’ వైవిధ్యం తెలుస్తుంది. ఆయన ఆంతర్యంలోని లోతు కొంచెం అవగాహన కలుగుతుంది. వేలాది సూపర్ డూపర్ సినీ గీతాల రచయితగా కంటే ఆయన మనసులోని గంభీరమైన ‘తాత్వికత’ బోధపడుతుంది. ఆయన అభివ్యక్తి లోని అంతశ్శక్తి గోచరమవుతుంది.

మహతి సీరియల్ మొదటి భాగం చదివిన చాలామంది లాగానే తర్వాతి భాగం చదవాలనే కుతూహలంతో..

***

మహతి (నవల)
రచన: భువనచంద్ర
ప్రచురణ: సాహితీ ప్రచురణలు, విజయవాడ.
పేజీలు: 480
వెల: ₹ 300/-
ప్రతులకు:
సాహితీ బుక్స్, చుట్టుగుంట,
విజయవాడ. ఫోన్: 9849992890
~
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా,
హైదరాబాద్. ఫోన్ 9000413413
~
ఆన్‍లైన్‍లో:
https://www.amazon.in/Mahathi-Bhuvanchandra/dp/B0G4H5H4MJ/

~
భువనచంద్ర గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-bhuvanachandra/

Exit mobile version