[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘మహోన్నత మానవతామూర్తి.. ఉపాధ్యాయుడు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
తరగతి నాలుగు గోడల మధ్య
విద్యార్థులకు అందమైన ప్రపంచాన్ని
ఊహాలోకంలా ఆవిష్కరింప జేస్తూ
తన ప్రశ్నలతో సరికొత్త ఆలోచనలు రేకెత్తించే
స్ఫూర్తిప్రదాత ఉపాధ్యాయుడు!
నల్లని బోర్డుపై
ముచ్చటైన శ్వేతవర్ణ అక్షరాలను లిఖిస్తూ
జ్ఞానామృతాన్ని విద్యార్థులకు పంచే
దైవ స్వరూపుడు ఉపాధ్యాయుడు!
నిరంతరం క్రమశిక్షణ, అధ్యయనం,
మానవతా విలువలను ప్రబోధిస్తూ
రేపటి ఉత్తమ పౌరులను తీర్చిదిద్దే
సత్ సమాజ నిర్మాత ఉపాధ్యాయుడు!
పుస్తక పఠనమే లోకం కాకుండా చూస్తూ
ఆటపాటల్లో ఇతర సంగీత, సాహిత్య, కళా రంగాల్లో సైతం
శిష్యులని ప్రోత్సహిస్తూ
విద్యార్థుల ఉన్నతే తన కర్తవ్యంగా శ్రమిస్తూ
వారి అభ్యున్నతికై సదా కృషి చేసే
మహోన్నత మానవతామూర్తి ఉపాధ్యాయుడు!
చిన్ని చిన్ని అపజయాలు ఎదురై
కృంగిపోతున్న వేళ
రేపు సాధించబోయే
ఘన విజయాలను గుర్తు చేస్తూ
విద్యార్థుల్లో నవ్య చైతన్యాన్ని నింపే
సన్మార్గదర్శి ఉపాధ్యాయుడు!
తన విద్యార్థి ఉన్నత శిఖరాలు
అధిరోహించినప్పుడు అభినందిస్తూ
తానే గెలిచినంతగా సంబరపడుతూ
మురిసే వాత్సల్యానికి ప్రతిరూపం ఉపాధ్యాయుడు!
గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో మేనేజర్‌గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.
