[కన్నడంలో శ్రీ ప్రేమశేఖర్ రచించిన కథని ‘మలి సంజె వెలుగు’ అనే పేరుతో అనువదించి అందిస్తున్నారు శ్రీ చందకచర్ల రమేశబాబు.]
కళ్ళు గట్టిగా మూసుకుని దీర్ఘంగా శ్వాస లోనికి లాక్కుంది సుకన్య, మృణి ఆంటీ ఇంట్లో. మూసుకున్న కనురెప్పల వెనుక అరచేతిలో ఉన్న అదే ఫోటో మరింత స్పష్టంగా కనిపించింది.
అమ్మ పచ్చని చీరను గుండెకు హత్తుకుని నిలుచున్న పుస్తకం స్పష్టంగా గుర్తుకు వస్తోంది. ఆకుపచ్చ రంగు ప్రధానంగా ఉన్న ముఖచిత్రం కథా సంపుటి అది. అమ్మ అరవిచ్చిన పెదవుల పైన తృప్తిగా కనిపించే చిరునవ్వు. ఆ నవ్వు అపురూపమైనది.
సుకన్య కనురెప్పలు ఆమె నియంత్రణ నుండి తప్పుకుని తెరుచుకున్నాయి. చూపు అమ్మ మొహం పైన బాణంలా నాటుకుంది.
అమ్మ ఆ నవ్వు ఏడు సంవత్సరాల సుదీర్ఘ ఎడం తరువాత విడుదలైన నాలుగవ కవితా సంపుటి వెంబడే తన మొదటి కథల సంపుటిని ప్రకటించి, తన సాహిత్య ప్రయాణంలో మరో మజిలీని చేరిన సందర్భంలో.
అమ్మ పెదవుల పైని నవ్వు తనకు అరుదనిపిస్తుంటే, ఆమె కళ్ళలోని నవ్వు అపరిచితం అనిపిస్తోంది. బహుమతిని గుండెకు హత్తుకుని లోకాన్నే మరచిపోయి నించున్న చిన్న బాలిక ముగ్ధ నవ్వు అది.
అమ్మ ఎడమ వైపు నించున్న ఆ పొడుగ్గా సన్నగా ఉన్న మగవాడి మొహంలో కూడా నవ్వు విరిసింది. కానీ అమ్మ కంటే ఒక ఎనిమిది-పది సంవత్సరాలు పెద్దవాడిలా కనిపిస్తున్న ఆయన నవ్వులో గాంభీర్యం ఉంది. ఆయన చేతుల్లోనూ పుస్తకం ఉంది. మల్లెపువ్వులాంటి తెల్ల జుబ్బా ఛాతీపైన ఉన్న దాని కవర్ పేజి కెమెరాకు నేరుగా కనబడకపోయినా అది కూడా అమ్మ కథల సంపుటే అని బాగా తెలుస్తోంది.
సుకన్య రెప్పలు ఒకసారి మూసి తెరుచుకున్నాయి.
నలుపు రవికతో ఉన్న అమ్మ ఎడమ భుజం ఆయన తెల్ల జుబ్బా కుడి జబ్బకు అవునో కాదో అన్నట్టుగా నొక్కుకొనుంది. అమ్మ శరీరం పై భాగం అతడి వైపు కొంచెమే వాలినట్టుందేమో అనుకుంది సుకన్య. ఆమె కనురెప్పలు ఠక్కన మూసుకున్నాయి.
ఆ మూసిన కనురెప్పల వెనుక వాళ్ళిద్దరూ ప్రాణం పోసుకున్నారు, ఎదురెదురయ్యారు.
అమ్మ బాహువులు పైకి వెళ్ళి ఆయన మెడను చుట్టేసుకున్నాయి. మొహం కొంచెంగా ఎడమ వైపు ఆయన ఛాతీకి వాలింది. అతని ఒక అరచెయ్యి అమ్మ మొహాన్ని తన ఛాతీకి మృదువుగా నొక్కి ఉంచితే ఇంకో అరచెయ్యి ఆమె వీపును మెల్లమెల్లగా నిమురసాగింది. అతడి చెంప మెల్లగా అమ్మ తల వద్దకు దిగింది. ఇద్దరి కళ్ళూ మూసుకున్నాయి. నలభై దాటిన అమ్మ, యాభైకి దగ్గరగా ఉన్న ఆయన కౌగిలిలో చుట్టూరా ఉన్న ప్రపంచాన్ని మరిచారు.
ఉలిక్కిపడ్డట్టు టక్కున కళ్ళు తెరిచింది సుకన్య. తెరిచిన కళ్ళ ముందర అదే దృశ్యం మరింత స్పష్టంగా జీవం పోసుకుంది.
పన్నెండు సంవత్సరాల క్రితం చూసిన దృశ్యం అది.
సుకన్యకు బాగా జ్ఞాపకం ఉంది. అమ్మ మొదటి కథా సంపుటి విడుదల రోజది. అక్కడ నాన్న లేరు.
అమ్మ అక్షర ప్రీతి నాన్నకు పడని విషయం. దాని గురించి ఇద్దరి నడుమ కలిగే మనస్తాపాలకు సాక్షిగా ఉండడం సుకన్య బాల్యంలోని ఒక అవిభాజ్య భాగం.
అమ్మ కాలేజి మిత్రురాలి అన్నయ్య నాన్న. అమ్మను ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారట. పెళ్ళి ఫోటోలలో అమ్మ మొహంలో కనిపించే సంతోషం, సంబరం ఆ పెళ్ళి ఆమెకు చాల ఇష్టంగా ఉండిందని చెప్తాయి. కాని ఆ భావాలు పెళ్ళైన నాలుగో రోజు నాన్నతో సిమ్లా వెళ్ళిన అమ్మ మొహంలో కనిపించవు. రెండో ఆల్బం నిండా ఉన్న ఏ ఫోటోలోనూ అమ్మ మొహంలో నవ్వు కనిపించదు. ఒక వారంలో ఎంత మార్పు!
అ పొడుపుకథను పూర్తిగా విప్పడానికి సుకన్యకు ఇంతవరకూ కుదరలేదు. ఇకపైన కూడా అది వీలుకాదు.
అలాగెందుకని సుకన్య ఆశ్చర్యపడి, చింతించి, అమ్మను అడిగినా ఆమెనుండి ఎలాంటి జవాబు కూడా రాలేదు. తరువాత సుకన్య చూస్తున్న అమ్మ దినచరి, ఆమె మొహంలోని నవ్వు మాయమై పోయింది ఎక్కడికి అని అడగరాదు, అడిగి ఆమెను నొప్పించరాదు అని ఆమెకు తెలిపింది.
ఆ జ్ఞాపకాలు ఈ రోజు తన వృత్తిజీవితంలో అడుగడుగునా చూసే పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ లోని బుల్లెట్ పాయింట్ల మాదిరి ఆమె మూసుకున్న కనురెప్పల వెనుక తెరచిన తెరపైన ముద్రించబడ్డాయి.
ఆమె తన కళ్ళను ఇంకా గట్టిగా మూసుకుంది. కనురెప్పల వెనక ఉన్న చిత్రాలు కనుల ఎదుటే ఉన్నంత స్పష్టంగా ఉన్నాయి.
అమ్మ కళ్ళలో నీరు, చేతుల్లో ఆకుపచ్చ రంగు గుడ్డల తునకలు..
అమ్మకు ప్లెసెంట్ సర్‌ప్రైజ్ ఇచ్చే ఉద్దేశంతో ఏ సూచనా ఇవ్వకుండా ఢిల్లీ నుండి ఎగిరి వచ్చి, నాన్నక్కూడా చెప్పకుండా ఊబర్లో ఇంటికి దూసుకువచ్చిన సుకన్యకు కథా సంపుటి విడుదల ఫంక్షన్ కు రెండుంపావు గంటల ముందు తన తల్లి ఇలా కనిపించింది.
జీవితంలో అతిముఖ్యం అనిపించే మొదటి కథల సంపుటి విడుదల సభకు అమ్మ కొత్త చీర కొన్నదట. ఆ ఆకుపచ్చ చీర మ్యాచింగ్ రవికెను నాన్న తన మీసాలు ట్రిమ్ చేసుకోవడానికి పెట్టుకున్న చిన్న కత్తెరతో ముక్కలు ముక్కలుగా కత్తిరించి అమ్మ చిన్న టేబల్ పైన గుట్టగా వేశారు.
అలా చేసి తను అదేమో నాటకం చూడడానికి వెళ్ళిపోయారు..
ఆఫీసు పనులకని నాన్న ఊళ్ళకు వెళ్ళినప్పుడు నాన్న మంచి చీరలు తేవడం జరిగేది. ఎక్కడికైనా కలిసి వెళ్ళాలనేటప్పుడు, అది కట్టుకో ఇది కట్టుకో అని బలవంతం చేసి తనకు కావలసినట్టుగా అమ్మ తయారయేలా చేసేవారు. కానీ, అమ్మ సాహిత్యాభిరుచి గురించి మాత్రం అర్థం కాని తిరస్కారం. ఒక్కోసారి తిరస్కారాన్నీ మించిన, అమ్మను ఏడిపించాలనే శాడిస్ట్ మనోభావన ఆయనది.
అలాంటి ఒక ఉదాహరణ. అమ్మకు సంతోషం, ఆశ్చర్యం కలిగించాలని పరిగెత్తి వచ్చిన సుకన్య చూసింది అమ్మ కళ్ళలో నీళ్ళు, చేతుల్లో పచ్చని రవిక తునకలు.
మరో విషయం హఠాత్తుగా గుర్తుకు వచ్చింది సుకన్యకు. నాన్న మెచ్చుకుని తెచ్చిన చీరలు అమ్మ కట్టుకోవడం ఆయన చెప్పినప్పుడు మాత్రమే. నాన్న భువనేశ్వర్ నుండి తెచ్చిన డార్క్ నీలం రంగు చీర అమ్మకు బాగుంటుంది అని పక్కింటి సుజాత ఆంటీ అన్నప్పుడు, స్కూల్లో చదువుతున్న సుకన్యకు కూడా అలాగే అనిపించింది. ఆ నెల పేరెంట్స్-టీచర్స్ మీటింగ్‌కు ఆ చీర కట్టుకొమ్మని తను చెప్పినప్పుడు అమ్మ బదులు చెప్పలేదు. ఆ చీర కట్టుకోనే లేదు. నెల క్రితం గౌరి పండుగకు తన అన్నయ్య పెట్టిన చీరనే కట్టుకుంది. ఎందుకు ఇలా చేశావు అని సుకన్య మొహం చిన్నది చేసుకున్నప్పుడు అమ్మ పెదాల అంచునుండి ఒక శుష్కమైన నవ్వు కనిపించి క్షణంలో మాయమయ్యింది. అది ఎండిపోయిన నవ్వు అని సుకన్యకు అనిపించసాగింది, హైస్కూల్లో చేరినాక కథల, నవలల పిచ్చి తగులుకున్నప్పుడే. తను చెప్పినప్పుడు కట్టుకోని నీలం చీర మరుసటి రోజు ఆదివారం సాయంత్రం ఎవరిదో రిసెప్షన్ కని వెళ్ళేటప్పుడు కట్టుకొమ్మని నాన్న చెప్పగానే వద్దనకుండా, ఎండిపోయిన నవ్వు కూడా చూపకుండా కట్టుకుని నాన్న వెంబడి వెళ్ళిపోయింది. అమ్మమ్మను ఆనుకుని నిల్చుని తను ఊపిరి బిగబట్టుకుని అమ్మకు టాటా అని గుసగుసలాడింది సుకన్యకు చాలా రోజుల వరకు గుర్తొచ్చేది.
అమ్మ ఎక్కువగా మాట్లాడేది కాదు. తనకు ఇష్టమైన విధంగా తయారవమని నాన్న చెప్పినప్పుడు అమ్మ మూగదానిలా మాటల్లేకుండా తయారై నిలుచునేది. కీ ఇచ్చిన బొమ్మలా నాన్న వెంట అడుగులు వేసేది. అప్పుడప్పుడు ప్రాణం వచ్చినట్టు మెల్లగా మాట్లాడేది. అవి కూడా కూతురు అవసరాల కోసం, ఇంటి అవసరాల కోసం. అంతే. తన రాతల గురించి నాన్నతో మాట్లాడింది సుకన్య విననేలేదు. పత్రికలో వచ్చిన కథలను నాన్నముందు పెట్టిందయితే ఎన్నడూ చూడలేదు. కానీ తన కథలను, కవితలను చూస్తూ ఆమె కళ్ళు కొలనులవడం మాత్రం సుకన్య చాలా సార్లు చూసింది. అప్పుడంతా ఏం చెప్పాలో తెలియక చాలా రోజులు గడిచిపోయాయి.
పన్నెండు సంవత్సరాల క్రితం మధ్యాహం కూడా సుకన్యకు అలాగే అయ్యింది. ఊరికే అమ్మవద్దకు వెళ్ళి ఆమె భుజం పట్టుకుని నిలబడింది. అదే సమయంలో సరిగ్గా లోపలికి వచ్చింది అమ్మ ప్రియసఖి మృణి. తన ఆత్మీయ మృణి ఆంటీ, నాన్న చెల్లెలు మృణ్మయి. తను కూడా అమ్మ భుజం పట్టుకుని నిలబడింది, అప్పటికే అక్కడున్న సుకన్య చేతులనూ కలుపుకుని.
తరువాత సుకన్యకు జ్ఞాపకమున్నది ఒక చేతిలో తెలుపు, ఇంకో చేతిలో నలుపు రవిక పట్టుకుని కళ్ళు మూసుకుని కప్పు వైపు తల ఎత్తి నిలుచున్న అమ్మ బొమ్మ.
ఒకటిన్నర గంట తరువాత ‘ఉగాది’ కథా సంపుటి విడుదల కార్యక్రమానికి బయలుదేరిన అమ్మ ఒంటిపై ఉన్నది ఆకుపచ్చ చీర, నలుపు రవిక.
ఔత్సాహిక రచయిత్రుల బృందం ‘నందిని’ హోటల్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం అది. కథా సంపుటిని విడుదల చేసి, దాని గురించి మాట్లాడినవారు ఆ పొడుగ్గా, సన్నగా ఉన్నాయన. పదమూడు కథలలో చివరిదైన ‘ఉగాది’ శీర్షికనే కథా సంపుటికి పేరుగా అమ్మ ఎంపిక చేసినందుకు ప్రశంసిస్తూ తమ మాటలను ప్రారంభించిన ఆయన అమ్మ కాలేజ్ విద్యార్థినిగా ఉన్నప్పుడే మంచి కథలను, కవితలను రాస్తున్నదాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. ఈమె ముందు ముందు సాహిత్య క్షేత్రంలో పెద్ద పేరును సంపాదించుకుంటుందని తమకు అనిపించిందని, అది నిజమవుతూ పోయినదాన్ని తను చూస్తూ సంతోషించేవాడిననీ చెప్పారు. తరువాత అమ్మ కథలను ఒక్కొక్కటిగా తీసుకుని క్లుప్తంగా, తగిన విధంగా ఆయన సమీక్షించిన విధానం సుకన్యకు చాలా నచ్చింది. ఆయన కాలేజిలో తమ ఇంగ్లీష్ లిటరేచర్ లెక్చరర్‌గా ఉండేవారని మృణి ఆంటి తన చెవిలో గుసగుసగా చెప్పింది, సుకన్యకు ఇప్పుడే చెప్పినట్టుంది.
సభలో అమ్మ ఎక్కువగా ఏమీ మాట్లాడలేదు. తనకు ఆధునిక ఇంగ్లీష్, రష్యన్ గద్య సాహిత్యాన్ని బోధించిన తనకు ఇష్టమైన గురువుగారే తన మొదటి కథా సంపుటిని పాఠకుల ముందుంచుతుండడం తన సాహిత్య జీవితపు పెద్ద ఆశ నెరవేరినట్టయింది అనింది. కాలేజి తరగతి గదులలో కూర్చుని ఆయన పాఠాలు వింటున్నట్టు అనిపిస్తుందనీ, ఈ క్షణం వాస్తవం అనిపించే ఆ స్థితిలో తను, తనకు తెలియకుండా గంటలు గడిపేస్తుందని మొహాన్ని కొంచెమే పైకెత్తుకుని కళ్ళు సగం మూసుకుని కలలోనేమో అన్నట్టుగా అమ్మ సన్న గొంతుతో చెపుతూ పోయినప్పుడు తను వందలాది సభికుల ముందు వేదిక పైన ఉన్నది తనకు గుర్తులేదేమో అనే విచిత్రమైన సందేహం సుకన్యను వేధించి క్షణకాలం ఆతంకపరచింది.
కార్యక్రమం పూర్తయి, హాల్ ఖాళీ అయినాక అక్కడే కింది అంతస్తులో ఆయన దిగిన గదికి బయలుదేరిన అమ్మ, మృణి ఆంటీతో పాటు సుకన్య కూడా నడిచింది.
ఆయన ముగ్గురినీ ఆదరంగా ఆహ్వానించారు. సుకన్యను ప్రత్యేకంగా అడిగారు. “అమ్మలా నువ్వు కూడా రాస్తావా? సాహిత్యాభిరుచి నీకు రక్తంలోనే ఉండాలిగా” అని ఆయన అడిగినప్పుడు సుకన్య ఒక ఇబ్బందికరమైన నవ్వు నవ్విందంతే. అమ్మ మాత్రం ఉత్సాహంగా “రాస్తుంది. నా కూతురు తప్పకుండా రాస్తుంది. ఇప్పుడు చదువు వైపు ధ్యాస అంతే. అదయిపోగానే తప్పకుండా రాస్తుంది నా కూతురు.” అంది. అమ్మ అలా ఒకే గుక్కలో అంత మాట్లాడింది సుకన్యకు కొత్తగా అనిపించింది. మొదటి కథా సంపుటికి ‘ఉగాది’ అని పేరుపెట్టి, ఉగాది పండగ రోజే తనకిష్టమైన గురువుగారితో విడుదల చేయించిన సంబరం ప్రభావం అయ్యుండవచ్చు. ఇలాగే ఉండనీ అని మనసులోనే కోరుకుంటున్న సుకన్యను హెచ్చరించింది అమ్మ గొంతు.
“వేదిక పైన పుస్తకం పట్టుకుని నిలబడడానికయితే కుదరలేదు. ఇప్పుడు కానీ.” అంటూ తనకిష్టమైన ప్రాధ్యాపకుడి పక్కన నిలబడ్డ అమ్మ, ఫోటో తియ్యమని మృణి ఆంటీకి చెప్పింది. కెమెరా తీసుకున్న మృణి ఆంటీ ఉత్సాహం చూసిన సుకన్యకు నవ్వొచ్చింది.
తరువాత అమ్మ, ఆయన మాట్లాడుతూ నిలుచున్నారు. కార్యక్రమానికి వచ్చిన అనేక రచయిత్రులు ఆయన చుట్టూ నిలుచుని ఆయనకు ఇచ్చిన వాళ్ళ కొత్త పుస్తకాలు అక్కడే టేబుల్ పైన్ కనిపించాయి. వాటి వైపు మృణి ఆంటీ లక్ష్యం మళ్ళగా, సుకన్య కూడా అటు వైపు తిరిగింది.
అరుదనిపించిన అమ్మ గలగలా మాటలు ఒక్కసారిగా ఆగిపోయనట్టనిపించి ఆ వైపు తిరిగిన సుకన్య చూసింది,
వాళ్ళిద్దరూ ఆలింగనంలో ఉన్నారు. అమ్మ తన చేతులను ఆయన మెడ చుట్టూ వేసి కళ్ళు మూసుకుని ఆయన గుండెకు ఒరిగి కనిపించింది. ఆయన ఒక చేత్తో కొంచెం కూడా ఇబ్బంది కాకుండా అమ్మ మొహాన్ని తమ గుండెకు మృదువుగా నొక్కి ఉంచి, ఇంకో చేత్తో ఆమె వీపును నెమ్మదిగా రాస్తున్నారు.
సుకన్యకు అది నమ్మశక్యం కాని దృశ్యం. తను ఎక్కడో ఉన్నట్టు, తనకు కనిపిస్తున్నది గదిలో ఉన్న టివిలో వస్తున్న ఏదో సీరియల్లో అనుకున్నది ఒక్క క్షణం. లేదు. టివి తెర నల్లగానే ఉంది. అదీ కాక, అది వాళ్ళిద్దరికి నేపథ్యంలా మంచానికవతల ఉంది. ఇదేదో అకాలపు కల అనుకుంది తరువాత.
అదే సమయంలో మృణి చూపు కూడా అటు తిరిగింది. వెంటనే ఆమె తన భుజాన్ని చుట్టేసి మాట్లాడకుండా ఆ గదినుండి తనను బయటికి తీసుకువచ్చింది సుకన్యకు ఇప్పటికీ ఒక కలనుండి ఇంకో కలకు ప్రయాణం చేసినట్టుంది.
మృణి ఆంటి చప్పుడు చేయకుండా తలుపు మూస్తున్నప్పుడు చెవిన పడ్డ “నాకింతే చాలు. ఈ జ్ఞాపకంతోనే జీవితమంతా నెమ్మదిగా గడిపెయ్యగలను” అన్న మాటలు అమ్మ అన్నవా లేదా ఆ క్షణంలో తన చెవిన పడరాదని మృణి అన్న మాటలా అని సుకన్య తరువాత ఎంతో సేపు ఆలోచించింది.
తన చేయి పట్టుకుని పొడుగైన కారిడార్‌లో గురిపెట్టిన బాణంలా సాగిన మృణి ఆంటీ హఠాత్తుగా ఆగి, ఆయాసం తీర్చుకునేలా ఒకసారి ఊపిరి పీల్చుని, “కాలేజు తరువాత ఇదే ప్రథమం వాళ్ళు కలుస్తున్నది.” అంటూ చిన్నగా అన్నాక ఆమె కనురెప్పలు పటపటమని కొట్టుకోవడం సుకన్యకు గందరగోళంగా అనిపించింది. అది కాస్త తేటపడుతోంది అనిపించింది అమ్మ స్నేహితురాలు, తన ప్రియమైన మృణి ఆంటీ అవడంతోపాటు నాన్న చెల్లెలు కూడా అయిన ఆ నలభై ఏళ్ళ మనిషి “ అమ్మను ఏమీ అడగొద్దు.” అని మెల్లగా ఒక్కొక్క పదాన్నీ నొక్కి పలికి, వెనిక్కి తిరిగి రెస్టోరెంట్ వైపు మెల్ల మెల్లగా మెట్లు దిగినప్పుడు.
తరువాత సుకన్య తను చాల దగ్గరనుకున్న మృణి ఆంటీని ఏమీ అడగలేదు.
కానీ ఆ రాత్రి మూడు నాలుగు గంటల మగత నిద్రలో తనను తనే మళ్ళీ మళ్ళీ అడిగింది ఇప్పటికీ స్పష్టంగా గుర్తుకు రాని ఒక కలవరింత.
మరుసటి రోజు ఉదయాన్నే తనను లేపింది తన అమ్మే అని అర్థమయినప్పుడు పూర్తిగా ఆక్రమించిన సాయంత్రం ప్రశ్నను ఒంటిపైనున్న దుప్పటిని జరిపేసినట్టు తోసేయాల్సిన అనివార్యతను ఆమె జీవితం అప్పటికే ఏర్పాటు చేసేసింది. ఎయిర్‌పోర్ట్ వైపు పరిగెత్తిన ఆమె మనసు నిండా నిండుకుని ఉండింది తన ఫ్లైట్ ఏ కారణం చేతనైనా ఆలస్యం కాకూడదనే కోరిక. ఆ రోజు పదకొండు గంటలకు ప్రారంభం కానున్న సెమిస్టర్ పరీక్షలను మిస్సయే స్థితిలో ఆమె ఉండలేదు.
ఐఐటి చేరుకున్న ఇరవై నాలుగు నిమిషాలలో పరీక్ష ప్రారంభమయ్యింది. ఆ వారమంతా అలాగే.. తరువాతి సెలవుల్లో మొదలై ముందు సెమిస్టర్ వరకూ ప్రాజెక్ట్ వర్క్, తరువాత క్యాంపస్ సెలెక్షన్, ఇంటర్వ్యూ, మళ్ళీ పరీక్షలు, వైవా… గుడ్గాంవ్‌లో ఉద్యోగం, పిజిలో నివాసం.. కొత్త ప్రదేశం, కొత్త జనాలు, కొత్త కొత్త అనుభవాలు, కొత్త సవాళ్ళు.. ఇలా బ్రతుకే ఒక కథగా మారిపోగా అమ్మ తన ఇష్టమైన ప్రాధ్యాపకుడికి చెప్పినట్టుగా కథ రాయడానికి సుకన్యకు వీలుకాలేదు. ఇప్పటి దాకా కూడా కాలేదు.
వీటన్నిటి నడుమ తన అమ్మకే తను తల్లి కావాలి అని సుకన్యకు స్ఫురించిన సమయంలో పాత ప్రశ్నలన్నీ ఆమె మనుసునుండి వలస వెళ్ళి ఎక్కడికో వెళ్ళిపోయాయి.
“ఏం ఆలోచిస్తున్నావు సుకీ?”
మృణి ఆంటీ గొంతు విని చటుకున్న కళ్ళు తెరిచింది సుకన్య. “ఏం లేదు అంటీ” అంటూ సర్దుకుని కూర్చుంది. “చాల్రోజుల తరువాత అమ్మది ఈ కథల సంపుటి కనిపించింది మీ ఇంట్లో. ఇది అమ్మ వద్ద కూడా లేదు. పట్టుకుని కూచున్నా.” అన్నది.
“అమ్మ కథల సంపుటి దొరికింది. అందులో అమ్మ ఫోటో కనిపించింది. నీ తలలో చక్రం తిరగడం మొదలైంది.” మెత్తగా నవ్వింది మృణ్మయి.
ఎన్నో సంవత్సరాలుగా మనసులో పాతిపెట్టిన ప్రశ్నను కట్టేసుకుని పెట్టుకోవడానికి ఇక వీలుకాదు అనిపించింది ముఫైమూడు సంవత్సరాల సుకన్యకు. ఆత్రంగా పదాలను కూర్చుకుంది.
“అమ్మ గురించి నాన్న నిరాసక్తి, కోపాలకు కారణం ఆమె తన ప్రాధ్యాపకుడిని.. ఇష్టపడింది కారణమా ఆంటీ?”
ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తల అల్లాడించేసింది మృణ్మయి. “కాదు కాదు. వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదు. క్లాస్ రూమ్‌లో శ్రద్ధగా ఆయన పాఠం వినడం, అప్పుడప్పుడు ఒక ప్రశ్న అడిగి ఆయన నిమిషమంతా ఆలోచిస్తూ విగ్రహంలా నిలబడేలా చేయడం తప్ప మీ అమ్మ ఆయనతో ఇంకేమీ మాట్లాడలేదు. క్లాస్ రూమ్ బయట కూడా వాళ్ళిద్దరూ ఏనాడూ మాట్లాడుకోలేదు. కాలేజి అయిపోయినాక కూడా అంతే. నాకు బాగా తెలుసు. ఫేస్‌బుక్‌లో తను పోస్ట్ చేసిన కవితలకు ఒక్కొక్కసారి ఆయన మంచి కామెంట్ రాసేవారు. తను థ్యాంక్స్ సార్ అని రియాక్ట్ అయ్యేది. ఇది తప్ప వాళ్ళిద్దరూ నేరుగా మాట్లాడుకున్నట్టు నాకు గుర్తు లేదు. నిజం చెప్పాలంటే ఈ కథా సంపుటి విడుదలకు ఆయనను పిలుద్దాం అని మీ అమ్మకు సలహా ఇచ్చిందే నేను. పిలిచింది కూడా నేనే. ఆయన సరే అన్నారు. మా నందిని గుంపు కార్యదర్శి.. ఆమె ఎవరబ్బా.. లతా జోషి అని ఉండేవారు కదా, ఆమె కూడా సంతోషంగా ఒప్పుకున్నారు.”
ఆశ్చర్యంతో కూర్చుండిపోయింది సుకన్య. మృణ్మయి గొంతు తగ్గించింది. “ఆ సభ తరువాత వాళ్ళిద్దరి మధ్య ఏం మొదలైందో నాకయితే తెలియదు.” మృణ్మయి గొంతు చటుకున్న ఆగిపోయింది. సుకన్య వైపు కళ్ళు చికిలించి చూసింది. సుకన్య ఆత్రంగా కాచుకుంది. అమ్మ వయసున్న ఆంటీ మాటలు మెల్లగా మొదలయ్యాయి. “ ఆ రోజు.. హ్హ.. మనిద్దరం చూశాం కదా.. హ్హ.. హ్హ.. మొదలై ఉండవచ్చు అనిపిస్తుంది. ఒకవేళ అలా అయ్యుంటే దానికి కారణం మాత్రం అంతవరకూ ఉన్న మీ నాన్న ప్రవర్తన.”
మాటలు రాకుండా కూర్చుండి పోయింది సుకన్య. మృణ్మయి అలాగే నిదానంగా కొనసాగించింది. “వాళ్ళిద్దరి మధ్య ఏమైనా ప్రారంభమైనా అదెన్ని రోజులు కొనసాగుతుంది? ఆ సభ ముగిసిన సంవత్సరానికి విడాకులు వచ్చాయి కదా. ఈమెను నువ్వే తీసుకెళ్ళి తోడుగా ఉంచుకున్నావు. ఈ పదకొండు సంవత్సరాల్లో ఈమె ఇటువైపు రానేలేదు. దాంతో పాటు ఈమె రాయడం కూడా మానేసింది. వాళ్ళిద్దరి మధ్య ఉండవచ్చు అనుకునే ఒకే ఒక అనుబంధం సాహిత్యాభిరుచి. అదే లేనప్పుడు ఇంకేం ఉంటుంది? ఒకవేళ వేరే ఏమైనా మిగిలుంటే అది వాళ్ళిద్దరి మనసులో ఒక మూలలో మాత్రం కొద్దిగా అభిమానం. దాంతో మీ నాన్నకు ఎలాంటి సంబంధమూ లేదు. ఆయన ఇంకో పెళ్ళి చేసుకుని హాయిగా ఉన్నాడు.”
ఒక నిమిషం తరువాత కష్టపడుతూ సుకన్య నోరు తెరిచింది. “ ఆ ప్రొఫెసర్ విషయం ఏమైంది? ఆయన కుటుంబం?”
“హ్హ.. హ్హ ఆయన పెళ్ళే చేసుకోలేదు. ఒక్కరే ఉంటున్నారు. ఈ మధ్య బయట కనబడడం లేదు. కనుచూపు అకస్మాత్తుగా తగ్గిందట పాపం. ఉద్యోగానికి రాజీనామా చేసి, ఇల్లు కూడా అమ్మేసి ఏదో వృద్ధాశ్రమంలో ఉన్నారని విన్నాను. మీ అమ్మకు ఇదేమీ తెలిసుండదులే! ఈ ఉగాదికి ముందు ఒకసారి ఊరికి వెళ్ళొద్దాం అని మొండిపట్టు పట్టి నిన్ను బయలుదేరదీసి వచ్చినామె నిన్నటినుండి నా ముందు ఒక్కసారి కూడా ఆయన పేరును ఉచ్చరించలేదు. తనదే కథల సంపుటి, దాన్ని విడుదల చేసిన ప్రాధ్యాపకుడు ఆమెకు గుర్తున్నట్టు లేదు. నేను కూడా ఎందుకులే అని..” లోపలెక్కడో ఫోన్ రింగయింది. తను “..ఊరుకున్నాను.” అంటూ మాట ముగించి లోపలికి వెళ్ళింది.
సుకన్య సమయం చూసింది. ‘కొన్ని పుస్తకాలు కొనాలి, చాలా ప్రత్రికలవి ఉగాది ప్రత్యేక సంచికలు వచ్చుంటాయి, చాలా రోజులైంది అలాంటి వాటిని చదివి, వెళ్ళి తీసుకొస్తాను’ అని అమ్మ బయటికి వెళ్ళి మూడు గంటలే అయ్యింది. తనేం పుస్తకాల కొట్టే కొంటోందా?
సుకన్య ఆలొచిస్తుండగా, మృణ్మయి పరిగెత్తినట్టుగా వస్తూ ఎదురయ్యింది. మొహంలో వర్ణించలేని ఆశ్చర్యం.
“ఇదేం కాకతాళీయం చూడు సుకీ! మనిద్దరం ఇక్కడ వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుతూ కూర్చున్నారు.” ఒకే గుక్కలో అనింది.
“ఆంటీ!” అంటూ కళ్ళు విప్పార్చింది సుకన్య. మృణ్మయి మొహంలో చిన్న నవ్వు వెలిగింది. “ఆయనను వెతుక్కుని ఈమె వృద్ధాశ్రమానికి వెళ్ళింది. ‘నేను ఇక్కడినుండి రావాలంటే మీరిద్దరూ వచ్చి తీసుకు వెళ్ళాలి. లేకుంటే ఇక్కడే ఉండిపోతాను’ అంటోంది!”
తను వినిందేమిటి అని అర్థం చేసుకోవడానికి సుకన్యకు కొన్ని నిమిషాలు పట్టింది. మృణ్మయి ఓపిగ్గా వేచింది.
కళ్ళను చికిలించి తనలో అనుకున్నట్టు చెప్పుకుంది సుకన్య “వృద్ధాశ్రమంలో ఉండాల్సిన పరిస్థితి అమ్మకు రాలేదు.”
“అయితే పద మరి! వెళ్ళి తీసుకొద్దాం.” మృణ్మయి మాటలు కూడా తనలో చెప్పుకున్నట్టున్నాయి.
***
“ఆ రోజు పుస్తకం విడుదల ఫంక్షన్లో చూసింది! చాలా ఏళ్ళయింది. ఎలాగున్నావమ్మా?” అడిగారాయన. సుకన్య చిన్నగా నవ్వింది. “నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు? ఇక్కడుండడం..” పెదవి కొరుక్కుంది. ఇప్పుడు నవ్వడం ఆయన వంతయ్యింది.
“ఒక్కణ్ణే ఉండడం కష్టమనిపించింది. నా పనులు నేనే చేసుకుంటాను. కొంచెం శ్రమ అనిపిస్తుంది. చదవడం, రాయడం చేతకాదు. ఒకరి సహాయం కావాలి.” మెల్లగా అన్నారు.
జుట్టు కొంచెం వెనిక్కి జరగడం తప్ప ఈ పన్నెండు సంవత్సరాలలో ఎక్కువ తేడా కనిపించలేదు ఆయనలో సుకన్యకు.
‘కళ్ళలో కాంతి మాత్రం అలాగే ఉంది! కళ్ళకు కనబడనివి ఈ లోకంలో ఏమేం ఉన్నాయో?’ అని ఆమె అనుకుంటుండగానే ప్రశ్న తేలి వచ్చింది. “అమ్మ చెప్తోంది, నువ్వింకా పెళ్ళి చేసుకోలేదని. ఎందుకమ్మా?”
ఈ ప్రశ్న తనకు ఎదురైనప్పుడల్లా మౌనంగా నవ్వడం అలవాటు చేసుకున్నా ఎప్పుడో ఒకప్పుడు ఎదురు ప్రశ్న వేయడం తనకు ఇటీవల అలవాటవడం వల్ల తన నియంత్రణనూ దాటి అది చటుక్కున బయటికి వచ్చేసింది.
“మీరూ పెళ్ళి చేసుకోలేదని ఆంటి చెప్పారు. ఎందుకు సార్, చేసుకోలేదు?” వెంటనే వెంబడించిన కొంటెనవ్వును మాత్రం ఆపుకోగలిగింది. కానీ ఆయన నవ్వు మాత్రం ఆగలేదు.
“హ హ్హ హ్హ.. ఇదీ వరస! బావుంది. చెప్పొచ్చేదేమంటే, నిన్ను పెళ్ళి చేసుకుంటాను అని ఈ భూలోకం అప్సరసలు ఎవరూ అనలేదు నాతో! ‘ఎలాంటెలాంటి సౌందర్యవతులను సృష్టించాడు ఆ బ్రహ్మ! నాకు మాత్రం ఒక్కరూ దొరకలేదు. నాదేం కర్మ!’ అన్నాడో కవి తెలుసా? నాదీ అదే కథ.” మొహమంతా నవ్వు చేసుకున్నారు. విజిటర్స్ రూమంతా నవ్వు పరచుకుంది. అంతలో అకస్మాత్తుగా ఆగిపోయింది. తెల్ల దుస్తులు ధరించిన ఒక యువతి పెద్ద పెద్ద అడుగులతో లోపలికి వచ్చింది. “ఓ ఇక్కడున్నారా? మీ అభిమాన పత్రిక ఉదయం వచ్చింది. నేను ఇప్పుడు ఫ్రీ అయ్యాను. ఎప్పటిలా మీకు చదివి వినిపిద్దాం అని అన్ని చోట్లా వెతికాను. సరేలెండి! మీరేమో నవ్వుకుంటున్నారు. ఎంజాయ్! లంచ్ తరువాత నేను మళ్ళీ ఫ్రీ అవుతాను కదా. అప్పుడు చదివి వినిపిస్తాను.” అంటూ ఒకే గుక్కలో చెప్పి వెనుతిరిగింది. “ఓకే ఓకే” అన్నారీయన.
వెంటనే “ఏముందనయినా చెప్పేయ్ చిన్నీ! నాకూ ఆత్రత కదా” అన్నారు ఆత్రంగా.
ఆ శ్వేతవస్త్ర ధారిణి నవ్వుతూ “ఓకే అంకల్” అని పుస్తకం పేజీలు తిప్పింది. “కథలు, కవితలూ ఏవున్నాయో అని మాత్రం చెప్పు. మిగతావి తరువాత చూద్ధాం.” అన్నారాయన. యువతి “ప్రత్యేక కథ” అని ఒకసారి, “కథలు” అంటూ ఏడు హెడ్డింగులను, వాటి రచయితల పేర్లను చదివి వినిపించింది. ఆయనకు అవేం ఆసక్తి కలిగించినట్టు కనబడలేదు.
“మరువలేని కథలు-పదమూడు” అని చదివింది యువతి. “హ్హ.. ఈ సారి ఏ కథ వేశారు ఈ సిరీస్‌లో?” కుతూహలం ఆపుకోలేక నిటారుగా కూర్చున్నారాయన.
“ఉగాది” అన్నదామె. “ఆఁ!” అన్నారాయన. మరుక్షణంలో బాణంలా ఆయన ప్రశ్న తగిలింది. “ఎవరు రాశారు?”
“నిత్యకల్యాణి.” జవాబు వచ్చింది రాగబద్ధంగా.
నాలుగు ఊపిరులు ఒక్కసారిగా సశబ్దంగా బయలుదేరాయి. “దాన్ని.. ఆ కథను.. ఇప్పుడు చదవగలవా చిన్నీ?” ఆయన వణుకుతున్న గొంతు తప్ప అక్కడి ప్రపంచమంతా మౌనమయ్యింది.
దానికి భంగం కలిగించింది ఆమె నవ్వు. “నిత్య కల్యాణి అన్న పేరు వినగానే ఎంత ఎక్సైటయ్యారు అంకల్! మీ కళ్ళు ఎంత వెలిగాయి తెలుసా! మీకంత ఇష్టమా ఆమె అంటే? మీకు తెలుసా?”
“హ్హ హ్హ..” తడబడ్డారు ఆయన. “ ఈ.. ఈ.. కథ ఇంతకు ముందు చదివాను. మళ్ళీ చదవాలని ఆశ అంతే.”
ఆ యువతి బొమ్మలా అయిపోయింది. సుకన్య తన అమ్మ వైపు తిరిగింది.
రచయిత్రి కళ్ళు విప్పారాయి. నోరు కొంచెంగా తెరుచుకుని ఉండింది. ఒళ్ళు సన్నగా వణుకుతోంది.
ఎక్కడో ఎవరో ఎవరినో పిలిచినట్టయింది. యువతి వెంటనే తను నిలుచున్న చోటునుండే ఓ అనింది. “సారీ అంకల్. కమలక్క పిలుస్తున్నారు. కిచెన్లో సామాన్లు వచ్చుండాలి. నేను వెళ్ళి చెక్ చెయ్యాలి. సాయంత్రం చదవనా?”
ఆయన బదులివ్వలేదు. సుకన్య లేచి నిలుచుంది. “నేనే చదువుతాను. ఇవ్వండి.” అంటూ రెండడుగులు ముందుకు వేసి చేయి చాచింది. “సరే” అన్నదామె. “వెళ్ళేటప్పుడు మరవకుండా అంకల్ చేతికివ్వండి.” అంటూ పుస్తకాన్ని అందజేసింది.
నిల్చున్న చోటే పుస్తకం పుటలు తిప్పింది సుకన్య. కావలసింది దొరికినట్టు పుస్తకాన్ని వెడల్పు చేసి అరచేతిలో పెట్టుకుంది. మూడు జతల కళ్ళు ఆమెను చూస్తున్నాయి.
“అమ్మా!” అంది కూతురు. కల్యాణి కళ్ళు చికిలించింది. పెదాలు తెరుచుకున్నాయి.
“లేచి వెళ్ళి ఆయన కుడివైపు కూర్చో.”
సుకన్య గొంతులోది సలహానా, ప్రార్థననా, ఆజ్ఞనా మృణ్మయికి అర్థం కాలేదు. తన స్నేహితురాలి వైపు చూసింది.
కల్యాణి కళ్ళు అకస్మాత్తుగా కొలనులయ్యాయి. ఎవరో కొట్టి లేపినట్టు లేదా ఇప్పుడు చెప్పినట్టు చెయ్యకపోతే అమూల్యమైందేదో పోగొట్టుకు పోతుందన్న భయంతో బెదిరినట్టు చటుక్కున లేచింది. కూతురివైపు నడిచింది. ఏం మాట్లాడకుండా తనను హత్తుకుంది. మృణ్మయి కళ్ళంతా చేసుకుని చూసింది.
నిశ్చలంగా నిలుచున్న కూతురు భుజాన్ని తన కన్నీళ్ళతో తడిపిన కల్యాణి మెల్లగా కూతురునుండి తన చేతులను తీసుకుని. పక్కకు తిరిగింది. కలలో నడచినట్లుగా తల వంచుకుని మెల్లమెల్లగా నడిచింది. ఆయనను సమీపించి వంగింది. ఆయన పాదాలకు నమస్కరించింది.
తన ఒంట్లో జీవసంచారమైనట్టు ఆయన ఒక్కసారిగా ఒళ్ళు కదిపి లేచి నిలుచున్నారు. కల్యాణి భుజాలను పట్టుకుని పైకి లేవనెత్తారు. మొదట ఆమెను తన కుడివైపు కూర్చోబెట్టుకుని తామూ కూర్చున్నారు. సుకన్య చదవనారంభించింది. “మరవలేని కథలు-పదమూడు. శీర్షిక- ఉగాది. రచయిత్రి-నిత్యకల్యాణి” ఆపింది. చిన్నగా నవ్వింది.
ఎదురుగా ఉన్న జంటల కళ్ళల్లో ప్రశ్న. దానికి జవాబుగా సుకన్య నవ్వు ఇంకా పెద్దదయింది. “ఇప్పటికి ఇంత చాలు. ఈ కథను మీ ముగ్గురికీ చదివి వినిపించేది ఎల్లుండి ఉగాది రోజున, ఢిల్లీలోని మా ఇంట్లో.”
కళ్ళకు రుమాలును ఒత్తుకుంటున్న మృణ్మయి వైపు తిరిగింది సుకన్య. “ఆంటీ! ఈ మ్యాగజిన్ నా వద్దనే ఉంటుంది. మీరు దయచేసి దీని ఇంకో కాపీని ఎలాగైనా సంపాదించి ఆ అమ్మాయికిచ్చేయండి. అంతలో నేను రేపు సాయంత్రానికి నాలుగు ఏర్ టికెట్లు బుక్ చేస్తాను.” అంటూ తన మాటలు ముగించి దుపట్టా చివరతో తన కళ్ళు తుడుచుకుంది సుకన్య. “తప్పకుండా సుకీ.” అంది మృణ్మయి.
“అది ఎక్కడున్నా వెతికి తెస్తాను. దానికోసం నా ప్రాణమైనా ఇస్తాను.”
కన్నడ మూలం: ఎల్. ప్రేమశేఖర్
తెలుగు: చందకచర్ల రమేశబాబు
