Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మలిసంజ కెంజాయ! -7

[శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి రచించిన ‘మలిసంజ కెంజాయ!’ అనే నవలని ధారావాహికగా సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

[కూతురు మాటలకి నొచ్చుకున్న వసంతకి ఆ రాత్రి నిద్రపట్టదు. భర్తకి ఈ విషయం చెబితే, పిల్ల పుట్టినరోజని ఆయన సంబరపడతాడు. మర్నాడు పొద్దున్న నిర్మల అత్తగారు ఫోన్ చేసి నిర్మల పుట్టినరోజుని ఓ హోటల్‍లో చేస్తున్నామని, అక్కడే లంచ్ చేద్దాం రమ్మని వసంతని ఆహ్వానిస్తుంది. ఎంతో ఆప్యాయంగా మాట్లాడిన ఆమె మాటలకి వసంత కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అనుకున్నట్టే నిర్మల పుట్టిన రోజు ఫంక్షన్‍కి వెళ్లి ఆశీర్వదిస్తుంది వసంత. వచ్చిన బంధువుల్లో వసంతతో టీచర్‍గా పని చేసినావిడ ఒకావిడ ఉండడంతో, వసంత మనసు కుదుటపడుతుంది. ఆమెతో కబుర్లు చెప్పుకుని సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తుంది. నిర్మల అత్తగారు నిజంగా కడిగిన ముత్యమనీ, నిర్మలకేమో ఆవిడని చూసి నేర్చుకోవాలన్న ధ్యాసే లేదనీ బాధపడుతుంది. ఆ రోజు సాయంత్రం వసంత పెదనాన్న కొడుకు రామచంద్రం ఫోన్ చేస్తాడు. వసంత చెప్పిన ఉపాయం పాటించాననీ, పరిస్థితి చక్కబడిందని చెప్తాడు. వివరంగా చెప్పమని అడుగుతుంది. అల్లుడిని తమ ఇంట్లో ఒక రోజంతా ఉండేలా రమ్మని చెప్పి, ఒప్పించాననీ చెప్తాడు. భోజనాలయ్యి అందరూ కూర్చున్నప్పుడు తన ఆర్థికపరిస్థితిని అంతా అతనికి వివరించి చెప్పి, పెద్దకూతురికి, అల్లుడికీ ఏమీ ఇవ్వలేకపోతున్నానని చెప్పానని చెప్తాడు. క్షమించమని అడిగినట్టు చెప్తాడు. అందుకు అల్లుడు తాను, తన భార్య మామగారి నుంచి ఏమీ ఆశించడం లేదని – ప్రేమ పెళ్ళి చేసుకున్నా, తమని కలుపుకున్నందుకు అదే సంతోషమని చెప్పాడని చెప్తాడు. కూతురు కూడా ఇక డబ్బు గురించి అడగడం మానేసిందని, తన భార్య ఇప్పుడు మనశ్శాంతిగా ఉంటోందని చెప్తాడు. వసంత సంతోషిస్తుంది. కాసేపు మాట్లాడి రామచంద్రం ఫోన్ పెట్టేస్తాడు. వసంత మళ్ళీ తన కూతురు నిర్మల గురించి ఆలోచిస్తుంది. నిర్మలలో మార్పు ఎప్పుడొస్తుందో అని అనుకుంటుంది. వెంకటలక్ష్మి ఆశ్రమంలో ఉండే దుర్గమ్మ, జానకమ్మలు తూర్పూ పడమరలుగా ఉంటారు. దుర్గమ్మ నిష్ఠా, నియమాలు పాటించే ఇంట్లో పుట్టి పెరిగింది. భర్త పౌరోహిత్యం చేసేవాడు. కొడుకు పుట్టిన ఆరు నెలలకు రోడ్డు ప్రమాదంలో భర్త చనిపోతాడు. బంధుమిత్రులు ధైర్యం చెప్పగా, తన కొచ్చిన విద్యలతో – పండగలకీ, ఇతర శుభకార్యాలకీ, పిండివంటలు చేసి జీవిక గడుపుతుంది. పిల్లాడిని చదివిస్తుంది. కొడుకు బ్యాంకు ఉద్యోగం తెచ్చుకుంటాడు. తనకి ఉద్యోగం వచ్చాకా తల్లిని వంటలు చేయడం మానేయమంటే మానదు దుర్గమ్మ. కొడుకు పెళ్ళి చేస్తుంది. కోడలికి అత్తగారి తీరు నచ్చదు. ఇంట్లో గొడవలు జరిగి ఈ ఆశ్రమంలో వచ్చి చేరింది దుర్గమ్మ. ఆమె కొడుక్కి మరో బ్రాంచికి పక్క జిల్లాకి ట్రాన్స్‌ఫర్ అవడంతో వెళ్ళిపోతాడు. అతనికి ఒక కూతురు పుడుతుంది. ఎప్పుడైనా కూతుర్ని తీసుకుని తల్లిని చూద్దామని వచ్చినా, దుర్గమ్మ కొడుకు మొహం చూడదు. మనవరాలిని కూడా చూడడానికి ఇష్టపడదు. ఇప్పుడు దుర్గమ్మ కొడుకు మళ్ళీ ఆ ఊరికి ట్రాన్స్‌ఫర్ చేయించుకుని వచ్చాడన్న వార్త ఆశ్రమంలో తెలుస్తుంది. కొడుకు వచ్చి దుర్గమ్మని ఇంటికి తీసుకువెళ్తాడని వాళ్ళు అనుకుంటారు. కాదంటుంది దుర్గమ్మ. ఇక చదవండి.]

“కాదు. అస్సలు కాదు వాడు నన్ను తనింటికి తీసుకు వెళ్ళడు. ఆవిడ రానివ్వదు. వీడి వల్లకాదు తీసుకెళదామన్నా”

“నీ కొడుకు నీకు హక్కు. ఆవిడిష్టమేమిటి?” అందొకామె.

“పిచ్చి పీనుగుల్లారా! ఆవిడిష్టమే వీడిష్టం. కాదంటే వాడికే తిండి ఉండదు”

“అంత అర్థం చేసుకున్నప్పుడు కొడుకు మీద కోపమెందుకు?”

“ఎందుకంటే వాడు చవట సన్యాసి కాబట్టి. పెళ్ళాం కా, అంటే కా కీ అంటే కీ అనాలనుకునే దద్దమ్మ కనుక. ‘అలా మీసాలు లేని మగాడిలా ఉండకురా’ అని ఎన్నిసార్లుచెప్పినా వాడికి పెళ్ళాన్ని అదుపులో పెట్టడం చేతకాలేదు. వాడి తల్లి వాడి పెళ్లిరోజే చచ్చిపోయిందనుకున్నాడు”

“ఎన్నోసార్లు వచ్చాడిక్కడికి నిన్ను చూద్దామని, కానీ నువ్వేమో వాడు వెళ్ళేదాకా దాక్కున్నావు”

“జానకమ్మనైతే కొడుకు దగ్గరుండి ఇక్కడ దింపేసి వెళ్ళాడు పెళ్ళాం మాట పుచ్చుకుని. అయినా జానకమ్మ కోపం పెట్టుకోలేదు. కొడుకూ, మనవలూ వస్తే చక్కగా కబుర్లు చెప్పి నవ్వుతూ పంపుతుంది” అందొకామె

“దానికి కొడుకు తెచ్చే తిండి మీద ఆశ ఉండి అలా చేస్తుంది”

ఆ మాటకి జానకమ్మ చిన్నబుచ్చుకుంది.

“ఛీ! తప్పు అలా అనొచ్చా! అతను తెచ్చినవన్నీ తానొక్కతే తింటుందా? మనందరికీ తలా కాస్త పెట్టేస్తుంది అప్పటికప్పుడే, అస్సలు దాచుకోదు”

“అదంతా అనవసరం. నేను పౌరుషంగా బ్రతికాను, అలాగే పోతాను అంతే! నేను అన్యాయాన్ని సహించలేను. నోరెత్తకుండా పడి ఉండడం నా వల్ల కాదు”

“అలా కోపం పెట్టుకుంటావు కనకే నీకు రాత్రుళ్ళు నిద్ర పట్టదు. పిశాచమల్లే కూర్చుంటావు. కడుపులో మంటంటావు, మజ్జిగ త్రాగుతావు. నానా గందరగోళం చేస్తావు నిద్ర కోసం. జానకమ్మ ప్రశాంతంగా నిద్రపోతుంది”

“ఊరుకోండర్రా! ఎవరి మనస్తత్వం వారిది ఇంకొకళ్ళతో పోల్చకూడదు” అంది మరొకామె.

“పోల్చడం కాదు. తక్కువ చెయ్యడమూ కాదు. తన కోపమే తన శత్రువు అన్నట్టు కోపం నిప్పులాంటిది. కోపంతో గింజుకొని కృశించిపోతే నష్టం మనకే. పంతాలు పట్టింపులు పెట్టుకుంటే మనకవుతుందా?”

“నాకవుతుంది. నేనిలాగే ఉంటాను. ఏ ఎండకి ఆ గొడుగు పట్టలేను” అంది దుర్గమ్మ ఎటో చూస్తూ.

అంతా మాట్లాడకుండా వింటున్న ఇంకొకామె “అవన్నీ వదిలేయండి. రావు గారి దయవల్ల మనకు ఈ గూడు దొరికింది. నేనైతే ఇది మన అదృష్టం అనుకుంటాను” అంది.

ఆ మాటకి ఎవరూ ఏమీ మాట్లాడకుండా అవును అన్నట్టు మౌనంగా ఉండిపోయారు.

***

వైజాగ్‌లో ఉండే పార్వతమ్మ చిన్నకొడుకు రాజేష్ రాణీ దంపతులు కూతుర్ని తరతరాలుగా బాగా ఆస్తి ఉన్న ధనవంతులైన శేషాద్రి గారి పెద్ద కొడుక్కిచ్చి పెళ్లి చేశారు. శేషాద్రి రాష్ట్ర మంత్రిగా కూడా పని చేసాడు. బాగా సంపాదించాడు. కొడుకులిద్దరినీ డిగ్రీ వరకూ మాత్రమే చదివించి మానిపించాడు. పెద్ద కొడుక్కి తన తండ్రి ఆస్తిపై వచ్చే ఆదాయం లెక్కలూ, ఇతర పనులూ చూసుకోవడానికి రోజంతా సరిపోతుంది. చిన్న కొడుకు వరి ఇంకా ఇతర పొలాల విషయంలో తండ్రికి సాయంగా ఉంటాడు. అతను కూడా డిగ్రీ చేసాడు. తండ్రికి బిజినెస్ వ్యవహారాలూ, పొలాల విషయంలో కొడుకు లిద్దరూ చేదోడు వాదోడుగా ఉంటారు.

శేషాద్రి భార్య సుభద్ర ఎంత డబ్బున్నా కట్టూ బొట్టూ దగ్గరినుంచీ అన్ని విషయాల్లోనూ సామాన్యంగా ఉంటుంది. వంట మనిషిని పెట్టుకోకుండా అందరికీ తానే వండిపెడుతూ ఉంటుంది. పని వాళ్లపై ఎక్కువ ఆధారపడడం ఆమెకిష్టం ఉండదు. సుభద్ర నిరాడంబరత రాణికి కంపరం పుట్టిస్తుంది. అది ఆమెకి పిసినారితనంగా కనబడి ఆమెపై విసుక్కుంటూ కూతుర్ని ‘మీ పిసినారి పాపమ్మత్త’ అంటూ వెక్కిరిస్తూ ఉంటుంది.

రాజేష్, రాణిల కొడుకు సంతోష్ ఫిజిక్స్‌లో ఎం.ఫిల్. చేసాడు. వైజాగ్ లోనే కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తూ ఉంటాడు. బాగా కట్నం తెచ్చే పిల్లనే చూసి కొడుక్కి చేసుకుంది రాణి.

కొడుకునీ కోడలిని వేరు కాపురం పెట్టకుండా గట్టిగానే ప్రయత్నించింది రాణి. కోడలు నెమ్మదస్తురాలే. ఒక సంవత్సరం గడిచింది. అత్తగారి వెనకాల తిరుగుతూ కోడలు ఒద్దిక గానే ఉన్నా, ఆ పిల్ల పట్ల ఏదో అసంతృప్తి ఉన్నట్టుగానే ఉంది తప్ప కోడలిని తనతో కలుపుకోలేదు రాణి. తల్లి పెత్తనపు హడావిడి బాగానే గుర్తుపట్టాడు కొడుకు. అందుకే మెల్లగా “కాలేజీకి దగ్గరగా ఉండాలమ్మా! నాకు పిల్లల కోచింగ్ క్లాసుల్లో లేట్ అవుతుంటుంది” అని తల్లి వెనకే కూర్చుని నెమ్మదిగా ఒప్పించాడు. తండ్రికి ముందే చెప్పాడు గనక ఆయనేమీ అనలేదు.

రాణి అయిష్టంగానే ఒప్పుకుంది. సెలవు రోజుల్లో మాత్రం తప్పకుండా రావాలని షరతు పెట్టింది. “అలాగే అమ్మా!” అంటూ వేరుకాపురం పెట్టుకుని వెళ్ళిపోయాడు సంతోష్. ఎవరి కొడుకులు వేరు కాపురం పెట్టినా ఇష్టం వచ్చినట్టు విమర్శించే రాణి ఇప్పుడు సెలవు రోజుల కోసం ఎదురుచూస్తూ ఉంటోంది. తానేదో కోడరికం పెట్టి బాధ పెట్టిందన్న అపప్రధ బంధువులల్లో రాకుండా చూసుకునే పనిలో ఉందిప్పుడు.

అలా ప్రతి ఆదివారం ఇంకా పండగలనీ, పిల్లల పుట్టినరోజులనీ, అన్నిటికీ కొడుకూ, కోడలూ రావాలని మరీ మరీ అడిగి, వైజాగ్లోనే ఉండే కూతురిని కూడా పిలిచి సంబరపడుతోంది రాణీ. ఇద్దరు వంట మనుషుల్ని పెట్టి వంటలన్నీ ఆర్భాటంగా చెయ్యడం చేస్తుంటుంది. కోడలి పుట్టింటి వారు కూడా వైజాగ్‌లో ఉన్నా, అక్కడికి వెళ్ళడానికి వీల్లేదనేది రాణి. ఇది కోడలికి సహజంగానే విసుగ్గా ఉండేది.

పైగా కొడుకు ఇంట్లోకి ఏం కొనుక్కున్నా ఈవిడ సలహా ప్రకారమే కొనాలి తప్ప వాళ్ళకి వాళ్ళు నిర్ణయం తీసుకోరాదు. ఈ దాష్టీకాలన్నీ భర్త రాజేష్ చూసి రాణిని కంట్రోల్‌లో పెడదామని చూసినా ఆమె వినే రకం కాదని తెలిసి వదిలేసాడు. మౌనంగా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. చూసి చూసి ఏదో ఒక రోజు కొడుకే బుద్ధి చెబుతాడులే అని ఊరుకున్నాడు.

ఆ రోజు అత్తగారిని అమలాపురం నుంచి వైజాగ్ కార్లో తీసుకొచ్చింది రాణి. ఆవిడకి ఒక గది చూపించి బాగ్‌లన్నీ అందులో పెట్టుకోమని చెప్పింది.

రాజేష్ వైజాగ్ సిటీకి కాస్త దూరంగా పెద్ద స్థలంలో ఖరీదైన విల్లా కట్టుకున్నాడు. కింద రెండు బెడ్ రూమ్‌లూ, రెండు హాళ్ళూ పైన మూడు బెడ్ రూములూ, రెండు హాళ్ళూ ఉండేట్టుగా కట్టుకున్నాడు. ఇంటి చుట్టూ చాలా ఖాళీ స్థలం ఉంచాడు. స్వయంగా ఇంజనీర్ కాబట్టి ఎక్కడా ఏ లోపమూ రాకుండా బాగా ప్లాన్ చేసి చక్కగా కుదిరేలా చూసుకున్నాడు ఇంటిని.

***

ఇంటిముందు కారాగిన శబ్దానికి కిటికీ లోంచి చూసింది వసంత. ఎవరో ముప్ఫయి నలభై మధ్య వయసు గల యువకుడు దిగి లోపలికి రావడం చూసి ‘ఎవరబ్బా’ అనుకుంటూ తలుపు తీసి వాకిట్లోకి వచ్చిందామె.

“వసంత పిన్నీ! నన్ను గుర్తు పట్టలేదా? నేను భానక్క కొడుకుని” అన్నాడు.

“అవునవును భాస్కర్! రామ్మా!” అంటూ లోపలి నడిచిందామె.

“అమ్మెలా ఉంది? అక్కాచెల్లెళ్లంతా బావున్నారా? ” అంది మంచినీళ్లిస్తూ

“అందరినీ చూడాలంటే మా గృహప్రవేశానికి మీరూ చిన్నాన్న గారూ తప్పక రావాలి”

“ఓహో! సూపర్ కదా! కొత్తిల్లు కట్టావా?”

“అవునండీ పాత ఇల్లు తీసేసాం. డూప్లెక్స్ కట్టాను. పైన రెండూ, కింద మూడూ బెడ్ రూంలుంటాయి. అమ్మ మిమ్మల్ని తను మరీ మరీ రమ్మన్నానని చెప్పమంది. వచ్చే గురువారంనాడు ఫంక్షన్”

“తప్పకుండా వస్తాను” అంది వసంత ఆనందంగా.

“వెళ్ళొస్తాను పిన్నీ!” అంటూ లేచాడు భాస్కర్.

“టీ తాగి వెళ్ళు” అన్నా టైం లేదన్నాడు.

“అమ్మ బానే ఉంది కదా! అయిదేళ్ల క్రితం నాన్నగారు పోయినప్పుడొచ్చాను. మళ్ళీ రాలేదు”

“అమ్మ బావుంది పిన్నీ. మీరు ఒక వారం ముందే వస్తే ఊరంతా ఒక చుట్టూ చుట్టేయొచ్చు” అంటూ నవ్వాడు.

“అలాగే! తప్పకుండా వస్తాను. అందరినీ అడిగానని చెప్పు” అంటూ గేట్ వరకూ వచ్చి కారు వెళ్లే వరకూ నిలబడి చూసింది వసంత.

ఆమెకు తన సొంత ఊరినుండి ఎవరొచ్చినా అపురూపంగా ఉంటుంది. అక్కడికి ఆమె పుట్టి పెరిగిన ఊరు ఇరవై మైళ్ళు మాత్రమే. వసంత తల్లి తండ్రులు పదేళ్ల క్రితమే పోయారు. ఉన్న ఒక్క తమ్ముడూ గుజరాత్‌లో బట్టల వ్యాపారంలో స్థిరపడ్డాడు. ఇక్కడెవరుంటారు అన్నట్టుగా తమ్ముడు ఉన్న రెండెకరాల పొలమూ ఇల్లూ కూడా అమ్మకానికి పెట్టాడు.

‘ఆ ఇల్లు ఉంటే ఎప్పుడైనా ఆ ఊరికి వెళ్ళడానికి బావుంటుంది మన తల్లి తండ్రులు ఉన్న ఇల్లు అన్న గుర్తులుండాలి కదా!’ అని వసంత ఎంతో బెంగపడింది. ఆ మాటే తమ్ముడితో చూచాయగా అని చూసింది వసంత. అయితే తమ్ముడు “గుజరాత్ నుండి చీటికీ మాటికీ రాలేనక్కా! అదీ గాక నాకు డబ్బుంటే రొటేషన్‌కి బావుంటుంది కదక్కా!” అన్న అతని మాటలకి తలూపింది వసంత.

తమ్ముడూ, మరదలూ వచ్చారనీ, ఇల్లు బేరం కుదిరి అమ్మేస్తున్నారనీ, తెలియగానే సెలవు పెట్టి ఊరికి పరిగెత్తింది వసంత. అన్ని గదుల్లోకి తిరుగుతూ గదుల గోడలను తడిమి తడిమి కళ్లనీళ్లు పెట్టుకుంది. ఇంటిలో ఏ భాగం చూసినా అమ్మా, నాన్నా కనబడ్డారామెకి. తమ్ముడూ, తానూ వాళ్ళ వెనక తిరుగుతున్నట్టే ఉంది. తనకి లంగా, వోణీ కట్టించినప్పుడూ, పెళ్లికూతుర్ని చేసినప్పుడూ, పెళ్లయ్యాక భర్తతో ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడూ కలిగిన అనుభూతులు ఆ ఇంటినిండా రాశీభూతమై ఉన్నట్టు తోచిందామెకు. వీధి మెట్లపై మౌనంగా కూర్చుని ఎంతో సేపు ఉండిపోయింది. వాకిలంతా మరీ మరీ తిరిగింది. తాను నీళ్ళు పోసి పెంచిన కొబ్బరిచెట్ల వైపు ఆర్తిగా చూసింది. ప్రహరీ గోడను తాకినా ఆమెకు కన్నీళ్ళొచ్చేయి. తమ్ముడి భార్య నిర్లిప్తంగా చూసింది ఆడపడుచు వైపు.

తమ్ముడు “ఏంటక్కా? అంతలా బాధ పడుతున్నావు? అమ్మా నాన్న లేకపోతే తోడబుట్టినవాణ్ణి నేను లేనా? వాళ్ళిద్దరినీ నాలో చూసుకో! ఇక నా ఇల్లే నీకు పుట్టిల్లు, గుజరాత్ వస్తూ పోతూ ఉండు!” అన్నాడు ఓదార్పుగా. నిజమే నాకు తమ్ముడున్నాడు కదా! అని ఊరట చెందింది వసంత మనసు.

తమ్ముడి మాటలు ఉత్తుత్తి మాటలే అని వసంతకి తర్వాత తెలిసింది. అతను తన దగ్గరికి రమ్మని ఏనాడూ మర్యాద కోసం కూడా పిలవలేదు. పిల్లలు పుట్టారని కూడా ఫోన్ లోనే చెప్పాడు. పోన్లే వాడు చిన్నవాడు. వాణ్ణి నేను పిలుస్తాను అనుకుంటూ తమ్ముడిని, మరదలినీ పిల్లలనీ తీసుకురమ్మని ఎన్నోసార్లు ఫోన్‌లో పిలిచింది. ఒకసారి కూడా అతను రాలేదు. పిలిచి, పిలిచి విసుగేసి ఊరుకుందామె. ఇల్లు, పొలం అమ్ముకున్నాక అతను ఒక్కనాడూ సొంత ఊరికి రాలేదు.

తమ ఇల్లు కొనుక్కున్న వాళ్ళు కూలగొట్టి కొత్తిల్లు కట్టుకున్నారని తెలిసి, తమ ఇల్లు లేకపోవడం నేను చూడలేను అనుకుంటూ ఒక్కసారి కూడా వెళ్ళలేదు వసంత. భాను అక్క భర్త పోయినప్పుడు మాత్రం ఎవరో తెలిసిన వాళ్ళు కారులో వెళుతుంటే వాళ్లతో వెళ్లి అక్కకి కనబడి వెంటనే వచ్చేసింది తప్ప తమ ఇంటివైపు కూడా తొంగి చూడలేదు వసంత.

ఉద్యోగంలో ఉండగా ట్రాన్స్‌ఫర్‌ల మీద ఊళ్లు మారడమూ, పిల్లల్ని చదివించుకోవడమూతో సరిపోయింది వసంతకి. రిటైర్ అయ్యాక అమ్మనీ, నాన్ననీ తరచుగా తన ఇంటికి పిలవడమో తానే అక్కడికి వెళ్లి వాళ్ళకి సేవ చెయ్యడమో చేస్తూ ఉండాలని ఆశ పడిందామె. ఆమె సర్వీస్‌లో ఉండగానే తల్లి తండ్రులిద్దరూ ఆరునెలల తేడాతో వెళ్లిపోయారు. ఆ బాధ కూడా ఎప్పుడూ వసంతను వెంటాడుతూ ఉంటుంది. కన్న వాళ్ళను చూడడానికి అప్పుడూ, ఇప్పుడూ అంటూ వాయిదా వెయ్యకూడదు. ఎంత వీలయితే అంత ఎప్పటికప్పుడు చూడాలి అని తన మిత్రులకి చెబుతూ ఉంటుంది వసంత.

భర్త వెంకట్రావు రాగానే సంబరంగా తమ ఊరినుండి వచ్చిన గృహప్రవేశపు పిలుపు చెప్పి, “వెళ్ళనా?” అంది. “వెళ్ళు మనకి దగ్గరేగా” అన్నాక మరింత ఉద్వేగపడిపోయిందామె మనసు. ఆ రాత్రంతా భానక్క గురించిన తన చిన్నప్పటి ఆలోచనలు ఆమెను చుట్టుముట్టాయి. భాను పేరు సత్యభాను. చిన్న పిల్లలందరినీ వెంటేసుకుని వాళ్ళ చేత ఆటలాడిస్తూ ఉండేది భాను, తన వయసు వాళ్ళెవరూ లేక. వాళ్లంతా పిలిచి పిలిచి ఆమె పేరు భానక్కగా స్థిరపడిపోయింది. ఆమె కన్నా చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా ఊరంతా ఆమె పేరు అదే అయిపోయింది.

భాను తాతగారూ, వసంత తాతగారూ అన్నదమ్ములు. పక్క పక్క ఇళ్లు. భాను తాతగారు ఇల్లరికం వెళ్లారట. ఆయన అత్తగారు బాగా ధనవంతులు. భార్యకు బోలెడంత బంగారం పెట్టారట. పొలాలూ, తోటలూ బాగా ఉండేవట. అత్తగారూ, మావగారూ పోయాక ఆయన తిరిగి తన సొంతఊరు వచ్చేశారట. భానక్క తల్లి వడ్డాణంతో సహా నిండుగా నగలు వేసుకుని కేలండర్‌లో లక్ష్మీదేవిలా ఉండేది. భానక్క కూడా ఎక్కువ పట్టులంగాలే వేసుకునేది. వసంతకి చిన్నప్పటినుండీ భానక్క అంటే ఎంతో ఇష్టం. భాను కూడా వసంత లేకుండా ఎక్కడికీ వెళ్ళేది కాదు. ఒకరిపై మరొకరికి వాత్సల్యంతో కూడిన దగ్గరితనం ఉండేది. వారి వయసులో పదేళ్లు అంతరం ఉన్నా వారి స్నేహానికి అది అడ్డు కాలేదు.

వసంత తల్లి తండ్రుల దగ్గరికి వెళ్ళినప్పుడల్లా భానక్కని కలిసే వచ్చేది. ఇల్లంతా లక్ష్మీకళ ఉట్టిపడే భానక్క ఇల్లంటే వసంతకి ఎంతో ఇష్టం. “అక్కా! డబ్బున్నా, నీలా టేస్ట్ ఉండే వాళ్ళు ఉండరు. చక్కగా పెట్టుకుంటావు ఇల్లు” అని మెచ్చుకునేది తాను. అక్క పిల్లల ఫంక్షన్లూ, వాళ్ళ పెళ్ళిళ్ళూ అన్నీ చూసింది వసంత. అప్పుడప్పుడూ ఎవరైనా ఊరివాళ్ళు కనబడితే చెప్పేవారు. “తల్లీ తండ్రీ వెళ్ళిపోతే మాత్రం నేను లేనా? ఈ అక్క గుర్తులేదేమో వసంతకి” అంటూ భానక్క బాధపడుతోందీ అని. ఎందుకో అమ్మానాన్నా లేని, ఇల్లు కూడా లేని తన ఊరికి వెళ్లాలంటే వసంతకి మనసు ఒప్పేది కాదు.

భానక్క తండ్రికి ఒకే కూతురు కావడంతో ఇల్లరికం అల్లుడిని ఏరి కోరి ఎంచుకున్నాడు. భానక్క అందగత్తె. ఆమె అందానికి సరిజోడీ అయిన డిగ్రీ చదువుకున్న బంధువుల అబ్బాయి రమేష్ బాబును అల్లుడిని చేసుకున్నాడు. భర్త ఇల్లరికం కావడం వల్ల ఆమె ఊరిలోనే ఉండిపోయింది అత్తవారింటికి వెళ్లే అవసరం లేకుండా.

రమేష్ బాబు ఆ ఊరిలోని కుర్రాళ్లతో, పెద్దలతో బాగా కలిసిపోయాడు. ఆ ఊరి కొడుకులకన్నా ఇతనే మంచివాడు అన్న పేరు తెచ్చుకున్నాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా పరుగున వచ్చేవాడు. తన కారులో వాళ్ళని దగ్గరున్న పట్నం హాస్పిటల్‌కి తీసుకుని వెళ్లేవాడతను. ‘మరీ ఇంత మంచితనం అవసరమా?’ అన్నంతగా ఉండేవాడతను. అయిదేళ్ల క్రితం రమేష్ బాబు పోయినప్పుడు ఊరంతా అదే మాటన్నారు. ఆ బెంగ తోనే భానక్క తల్లితండ్రులు ఒకరివెంట ఒకరు పోయారు.

భానక్కకి నలుగురు కూతుళ్లు. ఇద్దరు కొడుకులు. నలుగురు ఆడపిల్లలకీ పెళ్లిళ్లు చేసారు. పెద్ద కొడుకు మెరిట్ విద్యార్థి. చాలా బాగా చదివేవాడు. ఐ.ఐ.టీ., ఢిల్లీలో ఇంజనీరింగ్ చదువుకునే రోజుల్లో తనతో చదువుకుంటున్న అమెరికా అమ్మాయిని రిజిస్టర్ పెళ్లి చేసుకున్నాడు. తండ్రి బాగా కోప్పడడంతో “మళ్ళీ ఈ గుమ్మం తొక్కను” అని ఆ పిల్లతో అమెరికా వెళ్ళిపోయాడు. మళ్ళీ రాలేదు. అయిదేళ్ల క్రితం గుండెనొప్పితో భానక్క భర్త చనిపోయాడు. బంధువుల సాయంతో ఆఖరి వాడైన చిన్న కొడుక్కి పెళ్లి చేసింది భానక్క.

భానక్క కొత్తిల్లు కట్టుకుంది అంటే వసంతకి ఉత్సాహం వచ్చేసింది. వెళ్లాల్సిందే! అనేసుకుంది. ముందు రోజు రాత్రే బాగ్ సర్దేసుకుంది. గిఫ్ట్‌గా ఇవ్వాల్సిన వెయ్యిరూపాయలు ఒక కవర్‌లో పెట్టి పేరు రాసి పర్స్‌లో పెట్టుకుంది. ఆ గృహప్రవేశం రోజు ఉదయం ఐదుకే లేచి రెండు రోజులకి సరిపడా కూరలు చేసి పెట్టేసింది. “భానక్క కొడుకు పుణ్యమా, అని మా ఊరికి వెళుతున్నాను” అంది భర్తతో ఆనందం పట్టలేక.

వెంకట్రావు ఆమె హడావిడి గమనిస్తూనే ఉన్నాడు. “నీకు ఉండాలంటే మరో రోజు కూడా ఉండిరా వసంతా! నేనేమో రోజంతా షాప్‌కి వెళ్ళిపోతాను. నువ్వు ఇంటిలోనే ఉండి, ఉండి నీకు విసుగు వస్తూ ఉండొచ్చు. మొన్నటిదాకా ఉద్యోగం చేసినదానివి. పైగా మీ పిన్ని ఫ్రెండ్ కూడా లేరాయె” నవ్వుతూ అన్నాడు.

వసంత చిరునవ్వులు చిందిస్తూ “అలాగే! వాళ్లంతా ఉండమంటే రేపు కూడా ఉండి ఎల్లుండి సాయంత్రానికి వచ్చేస్తాను” అంది. “అలాగే” అన్నాడతను.

పనులన్నీ ముగించుకుని భర్తని పంపేసి ముందుగా మాట్లాడుకున్న ఆటో వాడికి ఫోన్ చేసింది. ఆటో రాగానే తలుపులన్నీ వేసి ఉత్సాహంగా ఆటో ఎక్కి ‘ఊరు పోవాలి, మా అక్కను చూడాలి’ అని పాట కూడా అల్లుకుని దీర్ఘం తీసుకుంది మనసులో. గతుకుల రోడ్‌లో ఒళ్ళంతా హూనమవుతున్నా పట్టించుకోలేదు వసంత. రోడ్ పక్కన పంట కాలవనీ, చేలనీ చూస్తూ కూర్చుంది. ఆటో ఊరిలో ప్రవేశించగానే ఉద్వేగపడింది వసంత మనసు. కొంచెం తమాయించుకుని, ‘ఎంత మారిపోయిందో ఊరు! అసలు ఆనవాలే లేదు’ అనుకుంటూ కళ్లింతలు చేసుకుని చూస్తూ ఉండిపోయింది.

ఇంతకు ముందుండే భానక్క ఇంటి స్థానే, కొత్త ఇల్లు రంగులతో మెరిసిపోతోంది. ఇంటి ముందు షామియానాలూ, పెరటివైపు పందిళ్ళూ వేసి ఉన్నాయి. బైట చమ్కీ దండలతో, లోపల పూలదండలతో చక్కగా అలంకరించబడిన డూప్లెక్స్ ఇంటి ముందు ఆటో దిగింది. అంత చక్కని ఇల్లు చూడగానే వసంత మనసు ఉప్పొంగిపోయింది.

(సశేషం)

Exit mobile version