Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మనసున మల్లెలమాలలూపిన మల్లీశ్వరి (1951)

[వాహిని వారి ‘మల్లీశ్వరి’ సినిమాను విశ్లేషిస్తున్నారు శ్రీ ఆచారం షణ్ముఖాచారి.]

నేపథ్యం

1939లో వాహిని సంస్థ సంస్థాపకుడు, దర్శక నిర్మాత పద్మభూషణ్ బి.యన్. రెడ్డి తన తొలి ప్రయత్నంగా ‘వందేమాతరం’ చిత్రాన్ని నిర్మించారు. బి.ఎన్. రెడ్డి అసలు పేరు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి. విజయా నాగిరెడ్డికి స్వయానా పెద్దన్నయ్య. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బి.యన్. రెడ్డి 30 ఏళ్ల పాటు ఉన్నారు. విచిత్రం ఏమిటంటే ఈ ముప్పై ఏళ్ళ కాలంలో బి.ఎన్.రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రాలు కేవలం 11 మాత్రమే అంటే నమ్మశక్యం కాదు. కానీ, అది నిజం. అందులో వాహిని సంస్థ బ్యానర్ మీద నిర్మించిన సొంత చిత్రాలు తొమ్మిది కాగా మిగిలిన రెండు పొన్నలూరి బ్రదర్స్ వారి కోసం దర్శకత్వ బాధ్యతలు నిర్వహించిన ‘భాగ్యరేఖ’ (1957), శ్రీశంభు ఫిలింస్ వారు నిర్మించిన ‘పూజాఫలము’ (1964) చిత్రాలు. 1969 లో నిర్మించిన ‘బంగారు పంజరం’ ఆయన నిర్మించిన చివరి చిత్రం. ‘స్వర్గసీమ’(1945) సినిమా నిర్మించిన తర్వాత బి.ఎన్.రెడ్డి ‘మల్లీశ్వరి’ చిత్ర నిర్మాణానికి అంకురార్పణ చేశారు. నిజానికి బి.ఎన్.రెడ్డికి ‘వందేమాతరం’ (1939) సినిమా నిర్మాణంలో ఉండగానే మల్లీశ్వరి చిత్రం తీయాలని ఆలోచన వచ్చింది. ‘వందేమాతరం’ సినిమాలో హంపి యాత్ర సన్నివేశం ఉండటంతో దాని చిత్రీకరణ కోసం బి.ఎన్.రెడ్డి బృందం హంపి విజయనగరం అవుట్‌డోర్ షూటింగుకు వెళ్ళింది. అక్కడకు వెళ్ళినప్పుడు ఆయన విరూపాక్ష ఆలయాన్నిసందర్శించారు. ఆలయం నడిబొడ్డున ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు నిలబడి దేవునికి ప్రార్ధనలు చేసిన ప్రదేశంలోనే తానూ నిలబడి వున్నానని ఊహించి దివ్యానుభూతి చెందారు.

విజయనగర సామ్రాజ్యాధినేత కళాదృష్టిని బి.ఎన్.రెడ్డి నిశితంగా పరిశీలించారు. అప్పుడే శ్రీకృష్ణదేవరాయలవారిని ముఖ్య పాత్రగా పెట్టి సినిమా తీయాలని ఆలోచన చేశారు. హంపి నుంచి తిరిగివచ్చాక కథ కోసం తన అన్వేషణ ప్రారంభించారు. తగిన ఇతివృత్తం కోసం సుదీర్ఘ అన్వేషణ సాగించారు. ఆ అన్వేషణ దాదాపు రెండు సంవత్సరాల పాటు కొనసాగింది. దీనికోసం బి.ఎన్.రెడ్డి. 16వ శతాబ్ద కాలం నాటి ప్రజాజీవనానికి సంబంధించిన కథల కోసం చాలా శ్రమించారు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఆ క్రమంలో ఒకరోజు బి.ఎన్.రెడ్డి మద్రాసు ఆకాశవాణి కేంద్ర రేడియో ప్రసారాలు వింటుండగా, అందులో బుచ్చిబాబు (శివరాజు వెంకట సుబ్బారావు) రచించిన ‘రాయలవారి కరుణాకృత్యము’ నాటకం ప్రసారమైంది. ఆ నాటకం బి.ఎన్.రెడ్డి మనస్సును హత్తుకుంది. మరొకచోట ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా సంచికలో ప్రచురితమైన దేవన్ శరార్ రచించిన ‘ది ఎంపరర్ అండ్ ది స్లేవ్ గర్ల్’ అనే కథ ఒకటి మల్లీశ్వరి చిత్ర నిర్మాణానికి సహకరించేదిలా అనిపించి, అదే ప్రేరణతో ఈరెండు కథలను సమన్వయించి ఒక నూతన కథను స్వయంగా అల్లుకున్నారు.

శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆనాటి రాజులు వారి రాజ్యంలో ఉన్న అందమైన యువతులను తమ అంతఃపురాలకు రప్పించి గానం, నాట్యం వంటి కళలలో వారికి తర్ఫీదు ఇప్పించి, వారిని అధికార నివాసులుగా మార్చే పధ్ధతి వుండేది. రాజ సంప్రదాయం ప్రకారం వారి కుటుంబాలకు ద్రవ్యం, ఆభరణాలు, బహుమతులు సమర్పించిన తరువాత, వారి ఇళ్లకు పల్లకీలు పంపి వారిని రాజమహలుకు తీసుకువచ్చి రాజవంశీయులు వారితో వినోద కార్యక్రమాలు జరుపుకునేవారు. అయితే వారు ఒకసారి రాజభవనం ప్రవేశించాక అనుమతి లేకుండా ఏ పురుషునితోను వారు సంబంధం పెట్టుకోకూడదు, ఏ పురుషుడూ వారిని చూడరాదు అనే నిబంధన అమలులో వుండేది. ఎవరైనా ఆ నిబంధనను ఉల్లంఘించి పట్టుబడితే వారికి మరణశిక్ష విధించేవారు. ఈ పద్ధతిని మల్లీశ్వరి చిత్రంలో చూపేందుకు ఇష్టపడని బి.ఎన్.రెడ్డి కొన్ని జాగ్రత్తలు తీసుకొని ‘రాణివాసం’ పేరుతో మహారాణికి ఇష్టసఖిగా వుండేలా కానుకలు సమర్పించి, పల్లకి పంపి మల్లీశ్వరిని రాజమందిరానికి రప్పించేలా కథలో మార్పులు చేశారు. శ్రీకృష్ణదేవరాయలు కరుణాసముద్రుడు కనుక హీరో దొంగతనంగా కోటలోనికి ప్రవేశించి పట్టుబడినా, మల్లీశ్వరితో అతనికి పెళ్ళాడే నేపధ్యం ఉండడంతో మరణ దండన విధించకుండా క్షమించి, పెళ్లిచేయించి వదిలి వేసినట్లు చిత్రీకరణ జరిపి సినిమాకు కొత్త వెలుగు తెచ్చారు. పదహారవ శతాబ్దపు చారిత్రక ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి, బి.ఎన్. రెడ్డి ప్రముఖ చరిత్రకారుడు, శాసన పరిశోధకుడైన మల్లంపల్లి సోమశేఖర శర్మను సంప్రదించారు. కళా దర్శకుడు ఎ. కె. శేఖర్ ఆ కాలపు సౌందర్యాన్ని ప్రతిబింబించేలా సూక్ష్మంగా స్కెచ్‌లు తయారుచేసి, సెట్లను రూపొందించడానికి దాదాపు రెండు సంవత్సరాలు వెచ్చించారు. మల్లీశ్వరి నిర్మాణ దశ రెండు సంవత్సరాలు కొనసాగింది.

దేవులపల్లి కృష్ణశాస్త్రి కవితలు అంటే బి.ఎన్. రెడ్డికి ఎంతో గౌరవం, ఇష్టం కూడా. అందుచేత కృష్ణశాస్త్రి తోనే మల్లీశ్వరి చిత్రానికి మాటలు, పాటలు రాయించాలని నిర్ణయించారు. సంభాషణలు, పాటల రచన చాలా ఆలస్యం కావడంతో చిత్ర నిర్మాణం కూడా రెండేళ్ల పాటు సాగింది. ఆ రోజుల్లోనే ఎనిమిది లక్షల రూపాయలకు పైగా ఈ చిత్ర నిర్మాణానికి ఖర్చు చేశారు. ఇక సంగీతం విషయానికి వస్తే సాలూరు రాజేశ్వరరావు చేత ఈ సినిమాకు సంగీతం నిర్వహింపజేశారు. ఆర్కెస్ట్రా నిర్వహణలో సహాయకుడిగా ఉండేందుకు అద్దేపల్లి రామారావును నియమించారు. ఈ చిత్రంలోని పాటలన్నీ దేవులపల్లి వ్రాసిన తర్వాతే రాజేశ్వరరావు ట్యూన్ చేశారు. ఒక్క పాట కూడా ట్యూన్‌కి రాసింది కాదు. చిత్రంలో పాటలన్నీ సూపర్ హిట్లుగా నిలిచాయి. ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఆది.ఎం.ఇరానీకి బి.ఎన్. రెడ్డి సోదరుడు బి.ఎన్. కొండారెడ్డి ఛాయాగ్రహణంలో సహకరించారు. కళాదర్శకుడుగా ఎ.కె.శేఖర్ అద్భుత ప్రజ్ఞ చూపారు. అతనికి తోట తరణి తండ్రి వెంకటేశ్వరరావు సహకరించారు. పసుమర్తి కృష్ణమూర్తి నృత్య దర్శకత్వం నిర్వహించారు. మల్లీశ్వరి చిత్రం 20 డిసెంబర్ 1951న విడుదలైంది. సినిమా గొప్ప క్లాసికల్ గా చరిత్రలో నిలిచిపోయింది. భానుమతి, ఎన్.టి. రామారావు ఇద్దరూ వెండితెర జంటగా మంచిపేరు తెచ్చుకున్నారు.

మల్లీశ్వరి చిత్ర కథ

విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు పరిపాలన నేపథ్యంలో ఈ చిత్ర కథ నడుస్తుంది. నాగరాజు (ఎన్. టి. రామారావు), మల్లిక (భానుమతి) బావామరదళ్ళు. ఒక చిన్నపల్లెలో కలసిమెలిసి పెరుగుతారు. పెద్దయ్యాక ఒకరిపై ఒకరు మనసు పడతారు. నాగరాజు రాతిశిల్పాలు చెక్కడంలో నిష్ణాతుడు. మల్లిక మంచి గాయని, నాట్యమయి. ఒకసారి వారిద్దరు తిరునాళ్లకు వెళ్లి వస్తుండగా వర్షం కురుస్తుంటే ఒక పాతబడిన సత్రంలో తలదాచుకోగా, అక్కడకు దేశమాన పరిస్థితులను స్వయంగా తెలుసుకునేందుకు మారువేషంలో వస్తూ వర్షం రావడంతో తలదాచుకునేందుకు శ్రీకృష్ణదేవరాయలు (శ్రీవత్సవ), ఆయన ఆస్థాన కవి అల్లసాని పెద్దన (న్యాపతి రాఘవరావు) అదే సత్రంలోకి ప్రవేశిస్తారు. అప్పుడే మల్లీశ్వరి నాట్యంచేస్తూ తన గానంతో నాగరాజుని అలరిస్తూ వుంటుంది. శ్రీకృష్ణదేవరాయలు, వారి ఆస్థాన కవి ఆ నృత్యాన్ని చూసి ఆనందపడతారు. వారెవరో బాటసారులనియెంచి అతిథులకు మల్లిక, నాగరాజు పండ్లు సమర్పించి గౌరవిస్తారు. వర్షం వెలిసాక వారిని సాగనంపుతూ నాగరాజు వేళాకోళంగా “మా మల్లికి రాణివాసం పల్లకి పంపించండి” అని అంటాడు. తథాస్తు అంటారు మహారాజు.

మరోవైపు డబ్బు ఆశ ఎక్కువైన మల్లీశ్వరి తల్లి నాగమ్మ (ఋష్యేంద్రమణి) తన కూతురిని పెళ్ళాడాలంటే నాగరాజుని ధనం ఆర్జించుకొని రమ్మంటుంది. అది సంపాదించి మల్లీశ్వరిని చేపట్టడంకోసం నాగరాజు ఊరువిడిచి వెళతాడు. ఈలోగా శ్రీకృష్ణదేవరాయలు మల్లి ఇంటికి పల్లకితోబాటు ఆభరణాలు, ద్రవ్యరాశులు, బహుమతులు పంపి మల్లీశ్వరిని రాజకోటకు తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు. కూతురికి పట్టిన రాణివాస యోగం చూసి మల్లి తల్లి మురిసిపోతుంది. ఆ సంపద చూసి ఆమె మల్లీశ్వరిని రాజాస్థానానికి బలవంతాన పంపిస్తుంది. మల్లి క్రమంగా అంతఃపురంలో మహారాణికి ఇష్టసఖి అవుతుంది. రాణివాసం వలన వచ్చిన సంపద వలన నాగమ్మ తన కూతురిని నాగరాజు నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తుంది. తిరిగి వచ్చిన నాగరాజు హతాశుడౌతాడు. ప్రియురాలికి దూరమైన నాగరాజు, బావకు దూరమైన మల్లి విలవిలలాడిపోతారు. నాగరాజు విరాగిగా మారి ఊరు విడచి శిల్పాలు చెక్కుతూ ఒక బృందంతో కలిసి విజయనగరం చేరతాడు. రాజాస్థానంలో నూతనంగా నిర్మించతలపెట్టిన నాట్యకళా మందిరానికి శిల్పాలు చెక్కే పనిలో శిల్పిగా నియామకం పొంది అద్భుత శిల్ప సంపదను రూపొందిస్తాడు. అతడు చెక్కిన శిల్పాలలో మల్లీశ్వరి పోలికలే వుంటాయి. ఒకనాడు మంటప నిర్మాణం చూడడానికి వచ్చిన మల్లీశ్వరి బావను గుర్తిస్తుంది. మరునాడు వారిరువురు నదీ తీరాన కలుస్తారు. అక్కడనుండి ఆ మరునాడు తప్పించుకుని వెళదామని అనుకుంటారు. ఎంతకు రాని మల్లీశ్వరికై సాహసించి కోటలో ప్రవేశించిన నాగరాజును రాజసైనికులు బంధిస్తారు. అందుకై మరణశిక్ష పడవలసి ఉన్నా, వారిరువురి ప్రేమను అర్థం చేసుకున్న రాయలవారు పెద్ద మనసుతో వారిని క్షమించి వదిలేయడంతో నాగరాజు, మల్లీశ్వరిల వివాహంతో కథ ముగుస్తుంది.

పాటలు – అపురూప గీతాల రాజేశ్వర సంగీత-సాహిత్య సౌరభం

‘మల్లీశ్వరి’ని కేవలం ఎన్టీఆర్, భానుమతి నటించిన వాహిని వారి చారిత్రక ప్రేమకథగా మాత్రమే చూడలేం. తెలుగు చలనచిత్ర సంగీతంలో సాహిత్యం, స్వరరచన, గానం, దృశ్యకవిత్వం ఒకే కళాఖండంలో ఎలా కలిసిపోవాలో నిరూపించిన అద్భుత చిత్రమిది. ఈ చిత్రానికి దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన గీతాలే ప్రధాన సాహిత్య సంపద. సాలూరి రాజేశ్వరరావు వాటికి స్వరరూపం ఇచ్చి సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిపారు. భానుమతి, ఘంటసాల స్వరాలు ఆ కవిత్వానికి ప్రాణప్రతిష్ఠ చేశాయి. ఆర్కెస్ట్రాకు అద్దేపల్లి రామారావు, ప్రాసెసింగ్ కు ఎన్.సి.సేన్ గుప్తా అద్భుత సేవలు అందించారు. ఎ. కృష్ణన్, పి.వి. కోటేశ్వరరావు చేసిన సౌండ్ మిక్సింగ్ కూడా సినిమాకు, పాటలకు ఓ వన్నెతెచ్చింది. పురందరదాసు రచించిన “శ్రీగణనాధం భజామ్యహం” అనే సంప్రదాయ గీతంతో సినిమా ఆరంభం కావడం దర్శకుని ప్రతిభకు మచ్చుతునక. ఈ సినిమాలో మొత్తం 15 పాటలున్నాయి. ఈ గీతాలు ‘మల్లీశ్వరి’ సంగీత వైవిధ్యానికి సమగ్రంగా ప్రాతినిధ్యం వహిస్తాయి.

కోతీ బావకు పెళ్లంట కోవెల తోట విడిదంట, మల్లీమాలతి వస్తారా మాలికలన్నీ తెస్తారా, బంతీజాజీచేమంతీ బంతులు కట్టీ తెస్తారా

(గానం: భానుమతి)

నాగరాజు, మల్లీశ్వరిలది బాల్యస్నేహం, వారి మధ్య ఉండే చిలిపితనం ఈ పాటకు నేపథ్యం. ‘కోతి’బావకు పెళ్లి చేస్తున్నామంటూ ఊహాలోకాన్ని సృష్టించే బాల్య మనస్తత్వం ఈ పాటలో కనిపిస్తుంది. బి.ఎన్. రెడ్డి తన బాల్యస్మృతుల్లోని కొన్ని సరదా సంఘటనలను ఈ పాటకు ముందు వచ్చే నాగరాజు, మల్లీశ్వరి చిలిపి సందర్భానికి ప్రేరణగా చేర్చారు. “కోతీ బావకు పెళ్లంట, కోవెల తోట విడిదంట” అన్న పల్లవే దేవులపల్లి అసాధారణ ప్రతిభకు నిదర్శనం. ‘బావ’, ‘పెళ్లి’, ‘విడిది’ వంటి మానవ జీవిత పదాలను కోతికి ఆపాదించడం ద్వారా బాల్య కల్పనాశక్తిని కవి సజీవం చేశారు. “బంతీ జాజీ చేమంతీ బంతులు కట్టి తెస్తారా”అనే వరుస ఉచ్చారణలో పూలమాల ఊగినట్లున్న సంగీతం వినిపిస్తుంది. దేవులపల్లి పాట రాయలేదు.. పూలతో లయను అల్లారు. ఈ పాట జానపద-నాట్య స్వభావం కలిగిన స్వరరచనగా సాలూరు రాజేశ్వరరావు చిన్నచిన్న స్వరగతులలో కూర్చారు. భానుమతి స్వరంలో ఇక్కడ శాస్త్రీయ గాంభీర్యం కాదు.. చిన్నపిల్లల మనసు వినిపిస్తుంది. “పాత్రలోని పిల్లతనం కోసం గాత్రనటనే అవసరం” అని నిరూపించిన గీతమిది. ఈ పాటలో “కుచ్చుల తురాయి పెడతాము, హారాలేసి గంధం పూసి, కుళ్లాయెట్టి తురాయి పెడతాము” అనే చరణం ఉంది. ఇందులో కృష్ణ శాస్త్రి ఉపయోగించిన తురాయి అనే పదం మన తెలుగు పదం కాదు. శ్రీకృష్ణదేవరాయల నాటి కాలాన్ని గుర్తు చేయడానికి ఆ కాలంలో బహమనీ సుల్తానుల భాషా ప్రభావం మనమీద కూడా ఉన్నది అని గుర్తు చేయడానికి “కుచ్చుల తురాయి పెడదాము” వంటి ప్రయోగాలను చేశారు.

పరుగులు తీయాలీ గిత్తలు ఉరకలు వేయాలీ , బిరబిర చరచర పరుగున పరుగున ఊరు చేరాలీ మన ఊరు చేరాలీ

(గానం: ఘంటసాల, భానుమతి)

ప్రయాణం ఇక్కడ కేవలం ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి చేరుకోవడం కాదు. అది తమ మనసు కోరిన చోటుకు, తమ అనుబంధం కోరిన జీవితం వైపు పరుగెత్తడం. అందుకే పాట మొత్తం చలనం, వేగం, ఉత్సాహంతో నిండిపోతుంది. “బిరబిర చరచర పరుగున పరుగున” వంటి పదాలు కేవలం అర్థాన్నే ఇవ్వవు అవి బండిని లాగే ఎడ్ల పరుగుల ధ్వనిని సృష్టిస్తాయి. దేవులపల్లి ఇందులో బిరబిర, చరచర, గలగల, ఘణఘణ వంటి పదాలను రెండుసార్లు వాడి చరణాల బరువును పెంచారు. పదధ్వనిని సంగీతంగా మార్చడం దేవులపల్లి ప్రత్యేకత అయితే, రాజేశ్వరరావు ఈ గీతంలో వేగానికి ప్రాధాన్యం ఇచ్చారు. అందమైన ఎద్దుల గమనం, మువ్వల గలగలలు రిథం తప్పకుండా మ్రోగుతుంటాయి. దీనిని మధ్యమావతి, బృందావన సారంగ మిశ్రమ రాగ చట్రంలో రాజేశ్వరరావు బిగించి హిట్ చేసారు.

పిలచిన బిగువటరా ఔరౌర చెలువలు తామే వలచి వచ్చిన పిలచిన బిగువటరా

(గానం: భానుమతి)

ఇది పైకి ఒక చిలిపి పాటలా కనిపిస్తుంది. కానీ అంతర్లీనంగా చూస్తే, స్త్రీహృదయంలోని “నేను నిన్ను పిలవను. నువ్వే నా దగ్గరకు రావాలి” అనే మనోభావం ఇందులో ఉంది. “చెలువలు తామే వలచి వచ్చిన” అన్న వాక్యంలో ప్రేమలోని చొరవ, మానసిక గర్వం, ఆడపిల్ల బిడియం అన్నీ కలిసి ఉన్నాయి. స్వరనిర్మాణంలో లాస్యం ప్రధానమైనది. పల్లవిలోని “ఔరౌర” అనే పలుకు సంగీతాత్మక నాట్యభావాన్ని కలిగిస్తుంది. ప్రారంభంలో ప్రేమపిలుపు, తరువాత వియోగవేదన, ఆపైన ఆశాభావం ఈ పాటలో వినిపిస్తాయి. తరువాత దీనికి గట్టి రాగబంధనం కంటే చలాకీ, లలితమైన సినీ-నృత్య సంగీత స్వభావమే ముఖ్యమైనది. ఈ పాటను బి.ఎన్.రెడ్డి కథ నుండి వేరుచేయలేదు; కథలోని విరహాన్నే ప్రకృతి భాషలో చెప్పించారు. సంగీత దర్శకుడు రాజేశ్వరరావు ఈ పాటను తనకు అత్యంత ప్రీతిపాత్రమైన ‘మల్లీశ్వరి’ గీతాలలో ఒకటిగా భావించి, తరువాత కూడా వేదికలపై ప్రదర్శించేవారు. భానుమతి పై చిత్రీకరించిన ఈ పాటకు జావళి పోకడలున్నాయి. ఈ పాటను రాజేశ్వరరావు సంపూర్ణంగా కాపీ రాగంలో స్వరపరిచారు.

ఎవరు ఏమని విందురు ఎవ్వరేమని కందురు ఈ జాలి గాథ, ఈ విషాద గాథ

(గానం: భానుమతి)

మల్లీశ్వరి జీవితంలో విపరీతమైన మలుపు రావడంతో బాల్యంలోని స్వేచ్ఛాయుతమైన అమ్మాయి ఇప్పుడు రాణివాస నియమాలకు బందీ. ఈ పాట ఆమె వ్యక్తిగత విషాదాన్ని ప్రపంచం ముందు ఉంచుతుంది. “జాలిగాథ, విషాదగాథ” అనే జంటపదంలో దేవులపల్లి ధ్వన్యాత్మక సౌందర్యం కనిపిస్తుంది. ఒకే భావాన్ని రెండు పదాలతో పునరుక్తి చేయడం కాదు.. జాలి అనేది బయటివారి ప్రతిస్పందన అయితే, విషాదం ఆమె అంతరంగపు స్థితిని తెలియపరుస్తుంది. ఇది ప్రధానంగా కరుణరసాన్ని కేంద్రంగా చేసుకున్న లలిత స్వరరచన. మంద్రస్థాయి వైపు దిగే స్వరాలు, నెమ్మదిగా సాగిపోయే గమనం, వాక్యాల మధ్యనున్న విరామాలు విషాదాన్ని మరింత పెంచుతాయి.

ఈ పాటలో భానుమతి గళం ఏడవదు; ఏడుపును అణచుకుంటుంది. అదే ఈ గీతం గొప్పదనం. అతిశయోక్తి లేని ఆవేదన.

ఔనా నిజమేనా మరతునన్నా మరవలేని మమతలన్నీ కలలేనా? రాణివాసమేగేవా? బావ మాట మరచేవా?

(గానం: ఘంటసాల, భానుమతి)

విధి నాగరాజు, మల్లీశ్వరిలను విడదీసింది. ఇప్పుడు ఒకరిపై మరొకరికి ప్రశ్నలు. నిజంగా ఆమె అతన్ని మరచిపోయిందా? రాణివాసపు జీవితం పాత ప్రేమను చెరిపేసిందా? “మరతునన్నా మరవలేని” అనే ఈ పదబంధంలోనే పాట యొక్క మొత్తం విషాదం ఉంది. బయటకు మరచిపోయినట్లు కనిపించినా, అంతరంగం మరచిపోదు. అలాగే “మమతలన్నీ కలలేనా?” అనే ప్రశ్నకు సమాధానం పాటలో లేదు. ఎందుకంటే ప్రేమలోని సందేహాలకు ఎప్పుడూ తార్కిక సమాధానం ఉండదు. ఈ పాటలో స్వరప్రవాహం సంభాషణాత్మక ద్వంద్వగీతంగా నిర్మించబడింది. ప్రశ్న-ప్రత్యుత్తరం, సందేహం-వేదన, ఆరోపణ-వివరణ అనే భావాలు గాత్రాల మధ్య మారుతూ ఉంటాయి. ఘంటసాల స్వరంలో గాయపడిన ప్రేమికుడి ప్రశ్న ఉంటే, భానుమతి గళంలో సమాధానం చెప్పలేని ప్రేమికురాలి బాధ ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఏర్పడిన సంగీత ఉద్రిక్తతే పాట ప్రాణం. ఈ పాటను మోహన రాగంలో స్వరపరచారు.

మనసున మల్లెల మాలలూగెనే, కన్నుల వెన్నెల డోలలూగెనే; ఎంత హాయి ఈ రేయి నిండెనో, ఎన్ని నాళ్లకీ బ్రతుకు పండెనో!

(గానం: భానుమతి)

ఈ గీతం యమన్ కల్యాణి రాగాధారంగా రూపొందినది. ఈ పాటను రాజేశ్వరరావు కచేరీ వేదికపై వినిపించే రూపంలో కాకుండా, ప్రేమికురాలి హృదయంలో వికసించే వెన్నెలగా కల్యాణి రాగంలో మలిచారు. దేవులపల్లి ప్రేమను నేరుగాచెప్పరు. మనసులో మల్లెలు ఊగుతున్నాయి, కన్నులలో వెన్నెల డోలలూగుతోంది అంటారు. ఇది ఆయన కవిత్వ రహస్యం.. ప్రేమ అని చెప్పకుండా ప్రేమను చూపించడం. “ఎన్ని నాళ్లకీ బ్రతుకు పండెనో” అనే ఈ ఒక్క పాదంలో మల్లీశ్వరి జీవిత చరిత్ర ఉంది. ఎన్నాళ్ల వియోగం, నిరీక్షణ, బాధ తరువాత వచ్చిన ఆనందం. ఆమె గళంలోని తేనెలాంటి మాధుర్యమే ఈ పాటను ఆమె వ్యక్తిత్వంతో ఏకం చేసింది. ఈ పాట బరువు పెంచేందుకు ఇందులో కూడా దేవులపల్లి కొమ్మల గువ్వలు గుసగుసమనినా, రెమ్మల గాలులు ఉసురుసురనినా, అలలు కొలనులో గలగలమనినా అనే జంట పదాలను వాడారు. ఈ పాట ప్రత్యేకత ఏమిటంటే ఎక్కడా పల్లవి రిపీట్ కాదు. ఈ పాటకోసం బి.ఎన్. రెడ్డి తుంగభద్ర తీరాన్ని స్టూడియో ఫ్లోర్‌లోనే పునర్నిర్మించి ఈ పాటకు దృశ్యవాతావరణాన్ని సృష్టించారు. ముఖ్యంగా పాటలో కనిపించే ప్రకృతి సౌందర్యం వెనుక ఏ.కె. శేఖర్ కళా దృష్టి ఉంది. ‘మల్లీశ్వరి’లోనే కాదు తెలుగు సినిమా చరిత్రలో సాహిత్యం, రాగం, గానం, దృశ్యం సమపాళ్లలో కలిసిన అగ్రశ్రేణి ప్రేమగీతాలలో ఇది ఒకటి.

ఎందుకే నీకింత తొందర ఇన్నాళ్ళ చెరసాల ఈ రేయి తీరునే, ఓ చిలుక నా చిలుక ఓ రామచిలుక, ఒయ్యారి చిలుక నా గారాల మొలక!

(గానం: భానుమతి)

ఈ పాటను ఖమాస్ రాగంలో స్వరపరచారు. ఖమాస్ రాగంలో సహజంగా ఉండే లాస్యం, మృదుత్వం, శృంగార భావం ఈ గీతానికి అత్యంత అనుకూలం. ఇది చిలుకతో మాట్లాడే పాట మాత్రమే కాదు. మల్లీశ్వరి తన జీవితంలోని స్వేచ్ఛను, బంధాన్ని, ప్రేమను ఆ చిన్న పక్షిలో చూస్తుంది. “నా చిలుక, నా రామచిలుక, నా గారాల మొలక” అనే పిలుపుల్లో తల్లి మమత, చెలిమి, ప్రేమ, మూడూ కలుస్తాయి. ఖమాస్ రాగంలోని లాస్యస్వభావాన్ని రాజేశ్వరరావు అత్యంత సహజంగా వినియోగించారు. రాగాన్ని ప్రదర్శించాలనే ఉద్దేశం కనిపించదు; పాత్ర హృదయానికి స్వరం ఇవ్వాలనే ఉద్దేశం మాత్రమే కనిపిస్తుంది. “చిలుక” అనే పదాన్ని భానుమతి ప్రతిసారి పలికే విధానం వేరువేరు భావాన్ని వ్యక్తం చేస్తుంది. అదే గాత్రాభినయం. గాయని పాత్రగా మారిపోతే ఎలా ఉంటుందో ఈ పాట చెబుతుంది.

మల్లీశ్వరి చిత్రంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి అల్లసాని పెద్దనామాత్యుని శైలిలో అల్లిన జిగిబిగి పద్యం

(అభినయం: భానుమతి, ఎన్.టి. రామారావు కలిసి.. శ్రీకృష్ణదేవరాయలు పాత్రలో శ్రీవత్స, అల్లసాని పెద్దన పాత్రలో న్యాపతి రాఘవరావుల సమక్షంలో, గానం: మాధవపెద్ది సత్యం)

ఈ పద్య సన్నివేశంలో మల్లీశ్వరి, నాగరాజు తిరునాళ్లకు వెళ్లి తిరిగివస్తూ వర్షంరావడంతో తలదాచుకోవడానికి ఆదరణలేని ఒక పాడుబడిన సత్రంలోకి వెళ్తారు. చిరుజల్లులతో అలరిస్తున్న వాతావరణ ప్రభావానికి స్పందించి మల్లీశ్వరి తన బావను అలరించడానికి “పిలచిన బిగువటరా” అంటూ తనదైన రాగంలో అద్భుతంగా నృత్యం చేస్తుంది. అదే సమయంలో అక్కడకు వచ్చిన రాయలవారు, కవివరేణ్యులు అల్లసాని పెద్దనామాత్యులు ఆ నృత్యం చూసి అమితానందభరితులౌతారు. అప్పుడు మల్లీశ్వరి నృత్యాన్ని పొగడుతూ పెద్దనామాత్యులు ఆశువుగా ఓ పద్యం అల్లుతారు. ఆ సందర్భంకోసం బి.ఎన్.రెడ్డి కృష్ణశాస్త్రిని అల్లసాని పంథాలోనే ఒక పద్యం వ్రాయమని కోరారు. అలా కృష్ణశాస్త్రి చేత వంద పద్యాలు వ్రాయించి దర్శకుడు అందులో ఈ క్రింద ఉదహరించిన పద్యాన్ని ఎంపికచేశారు. పెద్దనామాత్యులు మల్లీశ్వరి నాట్యప్రతిభను గురించి చెప్పే పద్యం ఆషామాషీగా ఉంటే ప్రేక్షకులు, పండితులు, రసజ్ఞులు ఒప్పుకుంటారా మరి! అసలే విలువలకు వలువలు కట్టి కాపాడుకున్న రోజులవి! అందుకే ఈ పద్యం పండిత పామరులను రంజింపజేసింది. కృష్ణశాస్త్రి అల్లసాని శైలిలోనే మలిచిన పద్యం ఇదే: 👇

భళిరా! ఎన్నడు జారెనీ భువికి రంభారాగిణీరత్నమే
ఖలయో! నిర్జరవల్లభప్రియవధూకంఠస్రవద్దామమో
మలయాశాగతమారుతోల్లలితపంపావీచికాడోలికా
చలదుత్ఫుల్లజలేజమాలికయో! చంచచ్చంచలాతన్వియో

మల్లీశ్వరిని నేరుగా పొగడకుండా, ఆమె నాట్యచలనాల సౌందర్యానికి నాలుగు అద్భుతమైన ఉపమానాల మధ్య ఆశ్చర్యంగా ఊగిసలాడే భావం ఈ పద్యంలోని ప్రధాన విశేషం. ఈ పద్య భావం:- ఔరా! ఈ భూమిమీదకు ఎప్పుడో ఆకాశం నుండి జారిపడిన రంభ అనే అప్సరస యొక్క నాట్యరాగరత్నమా ఇది? లేక దేవతల అధిపతి ఇంద్రుని ప్రియభార్య అయిన శచీదేవి మెడనుండి జారిపడిన పుష్పహారమా? లేక మలయపర్వత దిక్కునుండి వచ్చిన సుగంధ పవనానికి ఉల్లాసంగా ఊగిపోతున్న పంపాసరోవర అలల తీరంలోనున్న వికసించిన కమల మాలికా? లేక ఈ చలాకీ, చంచలమైన సుందరి తానేనా?.. అని పెద్దన భానుమతి గానాన్ని, పులకింపజేసిన నృత్యాన్ని ప్రశంసించిన విధానమది. ఇందులో మల్లీశ్వరి నాట్యచలనాల్లోని మృదుత్వం, లయ, ఊగిసలాట, చిరుజల్లుల నేపథ్యం.. అన్నీ కలిసిపోతాయి. రంభ నాట్యరత్నమా? శచీదేవి పూలహారమా? గాలికి ఊగే కమలమాలికా? అని మూడు అద్భుతమైన ఊహలలో తేలియాడిన కవి చివరకు.. అసలు ఇవేమీ కావు.. మన కళ్లముందే చంచలాతన్వి మల్లీశ్వరి నృత్యం చేస్తోంది అనే భావానికి అంతరార్థం.

ఒక్కమాటలో చెప్పాలంటే, మల్లీశ్వరి పాటల, పద్య సాహిత్యంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి- కవి; సాలూరు రాజేశ్వరరావు- స్వరశిల్పి; భానుమతి, ఘంటసాల- భావగాయకులు; బి.ఎన్.రెడ్డి- దృశ్యకవి. పై పాటలను గమనిస్తే.. బాల్య చిలిపితనం, యవ్వన ఉత్సాహం, ప్రేమ పిలుపు, విరహవేదన, బందీ జీవితం, కలయికలో ఆనందం, లాస్య మాధుర్యం వంటి మల్లీశ్వరి జీవనచక్రం మనకు కనిపిస్తుంది. అందుకే ‘మల్లీశ్వరి’ సినిమా పాటలు, పద్యాలు కథ మధ్యలో వచ్చే విరామాలు కావు; అవే కథకు మరో రూపం.

మరిన్ని విశేషాలు

మల్లీశ్వరి చిత్రం మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకొని సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తెలుగు చిత్రసీమలో ‘మల్లీశ్వరి’ ఒక కల్ట్ క్లాసికల్ మూవీ స్టేటస్‌ను సంపాదించుకుంది. చిత్రనిర్మాతగా బి.ఎన్. రెడ్డి నిర్మించిన ఉత్తమ చిత్రాలలో ఒకటిగా మల్లీశ్వరి సినిమా పరిగణించబడింది. ప్రముఖ భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి ఈ సినిమాతోనే చిత్రరంగ ప్రవేశం చేసారు. ఈ సినిమా రచన చేసినందుకు మద్రాసు పచ్చియప్ప కళాశాల అధ్యాపక బృందం కృష్ణశాస్త్రిని సన్మానింపగా “మల్లీశ్వరి సృష్టిలో మేమంతా నిమిత్తమాత్రులం. బి.ఎన్.రెడ్డే దీనికి సర్వస్వం” అని వారు స్పందించారు. నాటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ ఈ సినిమా చూసి బి.ఎన్.రెడ్డిని సన్మానించారు. 1951 డిసెంబర్ 20 న విడుదలైన మల్లీశ్వరి చిత్రం 1952 ఫిబ్రవరి 28 నాటికి 71 రోజులు ఏకధాటిగా 13 కేంద్రాలలో ప్రదర్శితమైంది. అయితే ఈ సినిమాను విడుదల చేసిన విజయా సంస్థ ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇందులోని 11 కేంద్రాలలో మల్లీశ్వరి చిత్రాన్ని తీసివేసి తాము నిర్మించిన ‘పెళ్లిచేసి చూడు’ చిత్రాన్ని విడుదల చేసారు. అందువల్ల మల్లీశ్వరి చిత్రం మిగిలిన రెండు కేంద్రాలలోనే శతదినోత్సవం చేసుకుంది. రెండవ విడత విడుదలలో మల్లీశ్వరి చిత్రం మంచి లాభాలు ఆర్జించింది.

గతంలో బి.ఎన్.రెడ్డి నిర్మించిన ‘దేవత’, ‘స్వర్గసీమ’ వంటి సినిమాలు ఆరోజుల్లోనే విదేశాలలో ప్రదర్శితమయ్యాయి. బి.ఎన్ స్వయంగా వాటిని తీసుకువెళ్లి చైనా వంటి దేశాలలో సినిమాను ప్రదర్శించారు. అయితే మల్లీశ్వరి చిత్రానికి ఆ ప్రయాస తప్పింది. చైనీయులు ఈ సినిమా ప్రదర్శన హక్కులు కొని సబ్ టైటిల్స్ తో అక్కడ ప్రదర్శిస్తే మల్లీశ్వరి చిత్రం శతదినోత్సవం చేసుకుంది. అంతేకాదు విదేశాలలో వందరోజులు ఆడిన తొలి తెలుగు సినిమాగా నిలిచింది. 14 మార్చి 1953న బీజింగ్‌లో జరిగిన పెకింగ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. 16 mm కు కుదించిన మల్లీశ్వరి ప్రింట్ అమెరికాలో ప్రదర్శితమైంది. అక్కడ ఈ చిత్రాన్ని తిలకించిన కొన్ని విశ్వవిద్యాలయ అధిపతులు ఈ సినిమా స్క్రిప్ట్‌ను తమ విద్యార్ధులకు పాఠ్యాంశంగా ప్రవేశపెట్టేందుకు బి.ఎన్.రెడ్డి అనుమతి తీసుకున్నారు. ప్రముఖ సినీ విమర్శకుడు బాబురావు పటేల్ ‘ఫిలిం ఇండియా’ పత్రికకు సమీక్ష రాస్తూ “Malliswari is an inspiring motion picture which would save us the blush when compared with the best of motion pictures of the World” అని ప్రశంసించారు. ‘విజయచిత్ర’ సినిమా పత్రికలో ధారావాహికగా ప్రచురితమైన మొట్టమొదటి చిత్ర స్క్రిప్ట్ ఇదే. తరువాత రావి కొండలరావు ఈ సినిమాను వెండితెర నవలగా వెలువరించారు. ఏప్రిల్ 2013లో భారతీయ సినిమా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా, CNN-IBN సంస్థ తమ ‘సార్వకాలిక 100 గొప్ప భారతీయ చిత్రాలు’ జాబితాలో ‘మల్లీశ్వరి’ చిత్రాన్ని చేర్చింది.

Exit mobile version