[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారి కలం నుంచి జాలువారిన ‘మలుపులు తిరిగిన జీవితాలు’ అనే నవలని సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. క్రిందటి వారం ఎపిసోడ్ ఇక్కడ చదవచ్చు.]
[తనకి అర్థం కాని లెక్కల్ని చెప్పమంటూ అన్నయ్య శేషుని అడుగుతుంది శాంతి. మొదట తర్వాత చెప్తానని అన్నా, చెల్లి ఒత్తిడి చేయడంతో అప్పుడే ఆమె సందేహాలు తీరుస్తాడు శేషు. వాళ్ళిద్దరి మధ్యా అభిమానం చూసి సంతోషిస్తాడు రామ్మూర్తి. తనని స్కూల్లో లెక్కల మాస్టారు మెచ్చుకున్న సంగతి శాంతి చెబితే, సుమతి ముచ్చటపడుతుంది. కూతురిని అభినందిస్తుంది. తల్లి తన మీద చూపిస్తున్న ప్రేమనీ, తండ్రి పట్ల‘ కనబరిచే ఉదాసీతనని, నిర్లక్ష్యాన్ని పోల్చుకుని బాధపడుతుంది శాంతి. అవధాని మాస్టారు డి.యి.ఓ. ఆఫీసుకు వెళ్తే, రామ్మూర్తికి పి.ఎస్‌లోను శాంక్షను అయిన విషయం తెలుస్తుంది. దాంతో ఆయన రామ్మూర్తి ఇంటికి వచ్చి ఆ వార్త చెబుతాడు. కాసేపు మాట్లాడుకున్నాకా, తన కుటుంబ విషయలు కొన్ని చెప్పి గతంలో తాను రామ్మూర్తిని హేళన చేసినందుకు క్షమించమంటాడు. ఆయనకి కాస్త మంచిమాటలు చెప్పి పంపిస్తాడు రామ్మూర్తి. పిఎఫ్ లోన్ డబ్బులు రాగానే కూతురి వేడుకకి చేసిన అప్పులు తీర్చేస్తాడు. మిగిలిన డబ్బుతో బైక్ కొనమంటాడు శేషు. చదువు కోసమైతే ఎంతైనా ఖర్చు చేస్తాను కానీ, ఇలాంటి వాటికి డబ్బులివ్వనని అంటాడు రామ్మూర్తి. మాటామాటా పెరుగుతుంది. తండ్రిని దూషిస్తాడు. ఇకపై తమ ఇద్దరి మధ్యా ఏ సంబంధం ఉండదంటాడు. కొడుక్కి వత్తాసు పల్కుతూ మీ నాన్నదంతా పిసినారితనం అంటుంది సుమతి. కోపం వచ్చిన రామ్మూర్తి లోపలి నుండి బ్యాంక్ పాస్ బుక్ తెచ్చి కొడుకు మీదకి విసిరేసి, అతని పై చదువుల కోసం తాను ఎంతలా డబ్బు దాస్తున్నది చెప్తాడు. బాధ, అశాంతితో పార్కుకి వెళ్ళి, ఓ మూలగా కూర్చుని ఏడుస్తాడు. – ఇక చదవండి.]
అధ్యాయం 27
‘సహనం, నిగ్రహం ఉన్నా వాళ్ళు ఎప్పుడూ ఎన్ని కష్టాలు వచ్చినా చలించరు. దురుసుగా ప్రవర్తించరు. సంయమనం పాటించి సమస్య పరిష్కార దిశగా నడిపించి సఫలీకృతులవుతారు. తన మన్ననలకు పాత్రులవుతారు. ఆత్మనూన్యతా భావం ఉన్నవారే పరుష పదాలు ఉపయోగిస్తారు. ఆధిక్యం నిలబెట్టు కోవాలని విఫల ప్రయత్నం చేస్తారు.
సహనం, నిగ్రహనికి మారు పేరు తన తండ్రి. అయితే ఆత్మనూన్యతా భావం కలవాడు తను. అమ్మ సృష్టిలో చాలా విలువైన వ్యక్తి. సహనానికి మారు పేరు అమ్మ. ఆవిడ నిజమైన మార్గదర్శి అంటారు. బిడ్డను సరియైన మార్గంలో పెడ్తుంది అమ్మ. ఆమె త్యాగం, కుటుంబం పట్ల ఆమె చూపే నిబద్ధత వల్ల పిల్లల జీవితాలు ఆనందమయంగా సాగుతాయి. ప్రపంచంలో అన్ని బంధాలు కన్నా అమ్మతో ఉన్న అనుబంధం గొప్పది. తన కుటుంబం అంటే అమ్మకి ప్రాణం అంటారు.
అమ్మ గురించి అంత గొప్పగా చెప్పుకుంటారు. అయితే తన తల్లి అంత గొప్పదని చెప్పడానికి ఆమెలో పైన చెప్పబడిన గుణాలేవీ లేవు. సహనం లేదు. నిగ్రహం అంత కన్నా లేదు. తన బిడ్డని సరియైన మార్గంలో పెట్టడానికి తల్లి మార్గదర్శి అని అంటారు. కాని తండ్రి యడల తన మనసులో విష భీజాలు నాటడానికి మార్గదర్శి అయింది తన తల్లి. తన తల్లిలో త్యాగ గుణం లేదు. కుటుంబం యడల నిబద్ధత చూపే గుణం లేదు. అందుకే తన జీవితం ఆనందమయంగా కాకుండా తయారయింది. కుటుంబం అంటే అమ్మకి ప్రాణం అంటారు. ఆ కుటుంబంలో తన తండ్రి కూడా ఓ సభ్యుడు. అతని యడల ఎప్పుడూ సానుకూల దృక్పథంతో వ్యవహరించడం తను చూడలేదు. ఎప్పుడూ తండ్రిని సూటిపోటి మాటలతో, అతని మనస్సు బాధపెట్టడానికే పరిమితం అయింది. ఆమె బాటనే పట్టాడు తను.
తను కూడా తన తండ్రిని అది కావాలి, ఇది కావాలి అంటూ అతని శక్తికి మించిన కోరికలు కోరాడు. అతను తీర్చలేడు అని తెలిసి కూడా తండ్రి వాటిని తీర్చలేదని తండ్రిని ఎన్ని మాటలు అన్నాడు? తండ్రిని ఎన్నో విధాలుగా బాధపెట్టాడు. మనం దేనినైనా ఆశించడం వల్ల కాక దాన్ని పొందడానికి అర్హత సాధించడం వల్లనే దేన్నేనయినా పొందగలం. అది పొందాలంటే కృషి ఉండాలి. అయిష్టంగా చేస్తే సులువైన పని కూడా చాలా కష్టమనిపిస్తుంది. మనం దేనిలోనైనా గెలవాలనుకుంటే జీవితంలో అన్ని సవాళ్ళనూ ఎదుర్కోవాలి.
అన్ని సవాళ్ళు ఎదుర్కుని చదువును నిష్టగా, ఇష్టంగా మలుచుకోబట్టే సుధాకర్ చదువులో ముందున్నాడు. ఇంజనీరింగు పూర్తి చేశాడు. కేంపస్‌లో మంచి ఉద్యోగం కూడా సంపాదించాడు. చదువును అలక్ష్యం చేయబట్టే డిగ్రీతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. ఆ డిగ్రీ కూడా మంచి మార్కుల్తో కాదు.
ఇలాంటి తనకి ఏు ఉద్యోగం వస్తుందని తనని ఎం.బి.ఏ. చదివించడానికి పైసా పైసా కూడబెడ్తూ తన భవిష్యత్తుకి తండ్రి నిచ్చెనలు వేస్తూ ఉంటే దానిని అర్థం చేసుకోకుండా తను తండ్రిని అపార్థం చేసుకున్నాడు. నానా మాటలు అన్నాడు. తల్లితో జత కలిసి తండ్రికి మనస్తాపం కలిగించడానికి ప్రయత్నించాడు.
వయస్సు ప్రభావం కూడా ఆ సమయంలో అలా దోహదపడింది.
ఉరికే జలపాతం లాంటి వయస్సు అప్పుడు. ఆలోచనలు తక్కువ భ్రమలెక్కువ. బాధ్యతలు లేని జీవితం. ప్రపంచం మన చుట్టూ తిరుగుతుందన్న మిడిసిపాటు. సంపాదన లేకున్నా కోరికలు మాత్రమే జాస్తి.
తన తండ్రిని చూస్తూ ఉంటే ఇప్పుడు తన కడుపు తరుక్కుపోతోంది. జాలివేస్తోంది. బతుకు పోరాటంలో పోరాడి పోరాడి అలిసిపోయాడు తండ్రి. ప్రేమ రాహిత్యం ఒక ప్రక్క. మరో ప్రక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న అనిశ్చిత. భార్యా పిల్లలూ ఉన్నా లేనట్లే అతనికి. దీర్ఘకాలిక ఒంటరితనం లాంటి బతుకు. ఆడవాళ్ళకి గృహ హింస అని అంటారు. కాని తన తండ్రి గృహ హింసను ఎదుర్కొన్నాడు. సంతృప్తికరం కాని ఆర్థిక వ్యవస్థ. ఏ బాధ వచ్చినా తండ్రి ఒక్కడే మౌనంగా భరించేవాడు. ఎంత పెద్ద కష్టమొచ్చినా తన మనస్సులోనే కుమిలి పోతాడు. ఇలా ఏకాకిగా ఉంటూ ఉంటే ముందు ముందు డిప్రెషన్‌లోకి వెళ్ళి అవకాశం ఉంది. అతని జీవన పంథా ఆనందమయం అయ్యేటట్లు చూడాలి. కొడుకుగా ఇది తన బాధ్యత. ఇన్నాళ్ళూ ఎలా ఉన్నా ఇకపై తండ్రికి సుఖమైన మంచి జీవితం గడిపేటట్టు చూడాలి.
నాన్న ప్రేమ పైకి కనిపించీ కనిపించనట్టున్నా షరతులు, ఆంక్షలు ఉన్నా ఆ ప్రేమలో స్వార్ధం ఉండదు. కొడుకు ప్రేమలోనే స్వార్ధం ఉంటుంది. ఎవరైనా తమకి ఆత్మీయులనుకున్న వారితో బాధను పంచుకుంటే ఆ బాధ సగం తగ్గుతుంది. ఆనందం రెట్టింపు అవుతుంది. తను మాత్రం ఎప్పుడూ తనని ఇతరులతో పోల్చుకుంటాడు. ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుండి ఆశించడం రెండూ వదిలి వేస్తే జీవితంలో సగం సమస్యలు పోతాయి.
మనిషిలో నిజమైన ప్రేమ తగ్గిపోతోంది. చిన్నప్పుడు తను తండ్రిని ఎంతగా ప్రేమించాడు? అభిమానించాడు? తండ్రి స్కూలు నుండి వచ్చిన లగాయతూ అతనితోనే తన ప్రపంచం. రాత్రి పడుకోవడం అతని ప్రక్కనే. తండ్రి స్కూలు నుండి ఎప్పుడు వస్తాడా అని అతని కోసం ఎదురుచూపు. తండ్రిని చూడగానే తనలో వెయ్యి ఏనుగులు బలం వచ్చేది. ఎంతో ఆనందం, ఉత్సాహం, శక్తి వచ్చేవి. తండ్రి కూడా తనని ఆడిస్తూ పాడిస్తూ తనతో కబుర్లు చెప్తూ తను నవ్వుతే నవ్వుతూ తను ఆనందపడ్తే తనూ ఆనందపడ్తూ తను ఏడుస్తే బాధపడ్తూ ఉండేవాడు.
అందరి పిల్లలకీ మొదట వచ్చేది నోటంట అమ్మ శబ్దం. కాని తనకు మాత్రం ఎప్పుడూ వచ్చేది ‘నాన్నగారూ.. నాన్నగారూ!’ అని పిలవడం. అతని నామాన్నే ఉచ్చరించేవాడు. తండ్రి అంటే తనకి అంత అభిమానం ఆర్తి. అలాంటి తను ఈ రోజు భావోద్రేకానికి లోనయి “మీకూ నాకూ ఏ సంబంధం లేదు. మనిద్దరి మధ్యా ఏ రక్త సంబంధం లేదు అని అన్నాడు. పాపం అతను తన మాటలకి ఎంత కృంగిపోయారో? మానసికంగా చాలా బాధపడ్డారు.
తను తొందరబాటు పడ్డాడు. ఇప్పుడు తనకి తెలుస్తోంది. పశ్చత్తాపం కలుగుతోంది. నోరు జారాక ఇప్పుడు పశ్చత్తాపం పడ్తే లాభమేుటి? నోటి మాట చేతిలో ఆయుధం ఈ రెండూ జారకూడదు. ఎందుకంటే మాట జారితే అది ఎదుటి వాళ్ళను బాధించే పరుషమైన మాటలు మాట్లాడితే ఎదుటి వాళ్ళు బాధపడతారు. మన విలువ కూడా తగ్గిపోతుంది ఎదుటి వాళ్ళ దృష్టిలో. అదే ఆయుధం జారితే మనిషి గాయాల పాలవుతాడు. మనిషి పోతాడు.
తన తల్లిలో ఎందుకనో తన తండ్రి అంటే అంత చులకన భావం. అతడ్ని ద్వేషిస్తుంది అకారణంగా. ద్వేషంలో ఉన్న మనుషుల్తో సంబంధం ఉంటే వాళ్ళని కూడా మనం మార్చవచ్చు. ద్వేషాన్ని తలకిందలు చేస్తే ప్రేమ ఉంటుంది. ప్రేమకు వ్యతిరేక దిశలో ద్వేషం ఉంటుంది. కొంతమంది చలనం లేనివారు, స్పందన లేని వారు ఉంటారు.
తన తల్లి అలాంటిదే. ఇలాంటి వాళ్ళతోనే ప్రమాదము. వాళ్ళను మార్చలేము. మారే పరిస్థితులు వస్తే తప్ప వాళ్ళు మారరు. మారాలన్న దృష్టి కూడా వాళ్ళకుండదు. అందుకే సులోచనా ఆంటీ తన తల్లిని మార్చడానికి ప్రయత్నం చేసి చేసి విఫలురాలయింది.
ఇంట్లో తల్లిదండ్రుల ప్రవర్తన సరిగా లేకపోతే పిల్లలు మానసిక వత్తిడికి లోనవుతారు. పెరిగి పెద్దయ్యాక వాళ్ళ జీవిత భాగస్వాములతో కూడా గొడవ పడ్తారు. తల్లిదుడ్రుల ప్రభావం ఇలా పిల్లల మీద పడుతుంది. మరీ సున్నిత మనస్కులైన పిల్లలు కుంటుబాటుకి గురైతే మరి కొంత మంది చాలా మొండిగా తయారవుతారు. నేరస్థులుగా మారుతారు. సంఘ విద్రోహక శక్తులుగా మారుతారు.
సుందరం అంలకుల్ ఓదార్పు తన తండ్రికి ఉండబట్టే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు చవిచూసినా అలా తట్టుకున్నారు. లేకపోతే డిప్రెషన్‌లోకి వెళ్ళి ఉండేవాడు’. ఇలా తన తండ్రి యడల తన ప్రవర్తనకి పశ్చత్తాప పడ్తూ ఆత్మవిమర్శ చేసుకుంటున్నాడు శేషు.
తన తల్లికి కొన్ని భావాలున్నాయి. విశ్వాసాలు ఉన్నాయి. మనసులో అవి అలానే ఉండిపోయాయి. వాటిని బట్టే ఆవిడ ప్రవర్తన ఉంటుంది. అందుకే ఆవిడ తన భావాలకి అనుకూలంగా ఎవరైనా మాట్లాడితే సంతోషిస్తుంది. వ్యతిరేకంగా మాట్లాడితే బాధపడుతుంది. ‘ఆవిడ భావాలు సరి అయినవి కావు అని చెప్పిన సందర్భాలు రావాలి అప్పుడే ఆవిడ మారుతుంది,’ అనుకుంటున్నాడు శేషు.
ఆ రోజు కొడుకు అన్న మాటలకి బాధపడ్తూ బోరున విలపించి తన దుఃఖభారాన్ని తేలిక పరుచుకుని వచ్చాడు రామ్మూర్తి. అతనికి తిండి సరిగా తినబుద్ధి వేయలేదు. నాలుగు మెతుకులు కతికి భారమైన కలత చెందిన మనస్సుతో వచ్చి పక్క మీద వాలాడు.
పక్క మీద అటు ఇటు దొర్లుతున్నాడే కాని సరిగా నిద్ర పట్టటం లేదు. చాలా సేపు ప్రయత్నించగా ప్రయత్నించగా నిద్ర పట్టింది. సగం రాత్రయింది. తన గుండెల మీద ఎవరో చేతులు వేసి పడుకున్నట్టు అనిపించింది. అతనికి చాలా పరిచితమైన స్పర్శ అది. చాలా సంవత్సరాల తరువాత అలాంటి స్పర్శ సుఖం అతనికి లభించింది. అనుభూతి లభించింది. అతను కళ్ళు తెరిచి చూశాడు. తన పక్కన శేషు.
“శేషూ!!!” పిల్చాడు.
“ఊఁ! నేనే నాన్నగారూ!” అన్నాడు.
“ఏంటయింది?”
“ఏం అవలేదు. నన్ను ఇలాగే ఉండనీయండి. నా చిన్నప్పుడు రోజుల్లా ఉండనీయండి. నేను ఎన్నో తప్పులు చేశాను. మిమ్మల్ని పరుషంగా మాట్లాడాను, హేళన చేశాను. అమ్మతో కలిసి మీకు ఎంతో మనస్తాపం కలిగించాను. నన్ను క్షమించండి,” అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు.
రామ్మూర్తి కూడా భావోద్వేగానికి గురయ్యాడు. ఎన్ని సంవత్సరాల నుండో అతని హృదయాంతరాలలో గూడకట్టుకున్న బాధంతా అగ్ని పర్వతం బ్రద్ధలయితే పైకి విరజిమ్మిన లావాలా పైకి ఉబికింది. దుఃఖం తెరలు తెరలుగా బయటకు వస్తోంది. కొడుకుని గట్టిగా పట్టుకుని మౌనంగా రోదిస్తున్నాడు రామ్మూర్తి. కొంతసేపటికి వారి ఇద్దరి మనసులు తేలికబడ్డాయి.
అధ్యాయం 28
దుర్గమ్మ, మొగుడు సాంబయ్యని కొడుకు సుకుమార్‌ని వెంటబెట్టుకుని వచ్చింది. వాళ్ళంటే అతనికి ఇష్టం లేదు. రామ్మూర్తికి ముఖ్యంగా దుర్గమ్మ అంటే అతనికి నచ్చదు. మొదటిసారి తన పెళ్ళిలో ఆవిడ్ని చూశాడు. ఆ తరువాత అత్తయ్య చనిపోయినప్పుడు, మామయ్య చనిపోయినప్పుడు కూడా వచ్చింది. ఆవిడ ప్రవర్తన మాట తీరు తనికి నచ్చదు. అతని మనస్సు దుర్గమ్మ గురించి ఆలోచిస్తోంది.
అనసూయమ్మ అదే తన అత్తయ్య చెల్లెలు దుర్గమ్మ. ఆవిడ మొగుడు సాంబయ్య. వాళ్ళు తమకు లేక లేక పుట్టిన పుత్ర రత్నం సుకుమార్‌ని వెంటబెట్టుకుని వచ్చారు. సాంబయ్య మొదట్లో అతి సామాన్యమైన మనిషి. ఆర్థికంగా వెనకబాటు వలనే బాగా ఆర్థికంగా ముందన్న భుజంగరావుకి సాంబయ్య అంటే చులకన. సాంబయ్యను ఓ పురుగును చూసినట్లు అంతహీనంగా చూసేవాడు భుజంగరావు.
ఓడలు బండ్లువుతాయి. బండ్లు ఓడలవుతాయి. అన్న సామెతలా సాంబయ్య తన తెలివితేటల్ని ఉపయోగించి అంచెలంచెలుగా ఎదిగాడు. భుజంగరావు వ్యవసాయం చేయిస్తూ వ్యవసాయదారుడుగా చెలామణి అవుతున్నాడు. పంటలు సరిగా పండకపోవడం భుజంగరావు తాగుడు, జూదం లాంటి వ్యసనాలతో బాగా చితికి పోయాడు. అందుకే అంటారు ఆచెంచల లక్ష్మి భుజంగరావును వదిలి సాంబయ్యను వరించింది.
తన అక్క బావ కుటుంబం ఆర్థికంగా బాగా చితికి పోయిన తరువాత వాళ్ళకి మేము కనిపించాము. వాళ్ళ పరిస్థితి బాగున్నప్పుడు మమ్మల్ని ఎంతహీనంగా చూచారు. ఇప్పుడు మా బాహుటా వాళ్ళకి చూపించాలి అన్న ఉద్దేశ్యంతోనే దుర్గమ్మ వస్తోందే కాని నిజమైన అభిమానంతో మాత్రం కాదు.
సుమతికి ఈ పెళ్ళి ఇష్టంలేదని దుర్గమ్మకి తెలుసు. మొదటి రాత్రి రామ్మూర్తి సుమతి మధ్య జరగవల్సిన తంతు ఏు జరగలేదని ఆవులిస్తే పేగులు లెక్కపెట్టే దుర్గమ్మకి తెలుసు. ఈ విషయాన్ని అనసూయ దగ్గర నిలదీసింది. తన వల్లే సుమతి ఇంత మొండిగా తయారయింది అని అనసూయ చెల్లెలు దగ్గర పశ్చత్తాపడింది. బాధపడింది. ఒకప్పుడు ఎంతో అహంకారంతో తనని చులకన చేసిన అక్క బావలకి మంచి పని జరిగిందని మనసులో సంతోష పడిన వ్యక్తి దుర్గమ్మ.
తన అత్త మామయ్యకి శ్రాద్ధకర్మ ఆ తరువాత జరగవలసిన తంతు జరిపిస్తే ఎంత హంగామా చేసింది. “బాగా బతికిన వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళ శ్రాద్ధకర్మలు ఇలా జరిపించడమా? బాగా జరిపించాలి. వాళ్ళ ఆత్మల సంతృప్తి పడ్తాయి. మీకు డబ్బు చేతిలో లేకపోతే చెప్పండి నేను అప్పుగా ఇస్తాను,” అంది. ఆవిడికి వత్తాసు పలికింది సుమతి. అప్పుడు తను ఆవిడికి గట్టిగానే సమాధానమిచ్చాడు. “బ్రతికున్న రోజుల్లో వాళ్ళకి మనస్తాపం కలిగించకుండా సంతోషంగా ఉంచాలి కాని. వాళ్ళు చనిపోయిన తరువాత చాలా ఆడంబరంగా శ్రాద్ధ కర్మ చేయిస్తే వాళ్ళ మనసులు సంతోషిస్తాయేుటి? అయినా అప్పు చేసి శ్రాద్ధకర్మ జరిపించడం నాకు ఇష్టం లేదు” తను అన్న మాటలకి దుర్గమ్మ ముఖం చిన్నబోయింది. సుమతి తన గురించే భర్త ఇలా మాట్లాడుతున్నాడని అనుకుని ముఖం చిటపటలాడ్తూ పెట్టింది.
ఆ రావడం రావడం మళ్ళీ కుటుంబ సమేతంగా ఇప్పుడు మళ్ళీ వచ్చింది. వచ్చినప్పటి నుండి శాంతిని పొగడ్తల్తో ముంచెత్తుంది. దాన్ని బట్టి రామ్మూర్తి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఇప్పుడిప్పుడే తనని అభిమానిస్తున్న కొడుకుతో చెప్పాడు. నేను అదంతా చూసుకుంటానని శేషు తండ్రికి మాట ఇచ్చాడు.
దుర్గమ్మ కొడుక్కి శాంతి చుట్టూ తిరిగి దాని అభిమానం సంపాదించు అని చెప్పి ఉంటుంది. సుకుమార్ ఆ పనిలోనే ఉన్నాడు. సుకుమార్ పట్నం కాపురం వెలగబెట్టాడు ఇన్నాళ్ళూ. పట్నంలో ఒంటరి జీవితం. విలాసవంతమైన జీవితం. చదువు మాత్రం అబ్బలేదు. కాని వ్యసనాలకి మాత్రం బానిస అయ్యాడు. అయితే పేరుకు తగ్గట్టు అతి నాజుగ్గా సుకుమారంగా స్మార్ట్‌గా అందంగా ఉంటాడు. సినీ అవకాశాల కోసం వెతుకులాట కూడా చేశాడు. కొందరు పెట్టుబడిపెడ్తే తాము తీయబోయే సినీమాల్లో హీరో వేషం ఇస్తానన్నారు.
తల్లిని డబ్బు అడిగాడు కాని ముందు చూపున్న దుర్గమ్మ ససేమేరా ఒక్క పైసా కూడా ఇవ్వను అని కరాఖండీగా చెప్పింది. అతను తన అందం ఆయుధంగా ఉపయోగించి కన్నె పిల్లల్ని వల్లో వేసుకుంటాడు.
ఆ ఆయుధంతోనే ఎంతమంది ఆడ పిల్లల జీవితాల్తో ఆడుకున్నాడు. చదువు ఆపు చేయడానికి కాలేజీ వాళ్ళు డిబార్ చేయడానికి కారణం ఇదే. “మా నాని గాడి ఆరోగ్యం బాగులేదు. అందుకే చదువు మానేసేడు. వాడికి డిగ్రీ లేకపోతేనేం అందం ఉంది. తెలివితేటలున్నాయి. ఎలాగయినా బతికెస్తాడు. మాకున్న డబ్బు ఎవరు తినాలి. సినీమాల్లో హీరో వేషం ఇస్తానన్నారు. నేనే వద్దన్నాను” అని దుర్గమ్మ అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకి అందరికీ చెప్తు ఉంటుంది ఇలా.
మామయ్య చనిపోయినప్పుడు వచ్చినప్పుడు తిన్నగా ఊరుకుందా? లేదు. సుమతిని ఓదారుస్తూ “ఏడవకు అమ్మాయ్! విరిగిన గాజు బొమ్మను, చెట్టు నుండి రాలిపోయిన కాయను అతకడం ఎంత అసాధ్యమో చావును నియంత్రించడం అంతే కష్టం. పుట్టుకని నిరోదిస్తున్న మనిషి మృత్యువును నిరోధించలేకపోతున్నాడు. బ్రతికి ఉన్నన్నాళ్ళూ ఏ మనిషిని ఈసడిస్తారో ఆ మనిషి చనిపోయిన తరువాత రాగాలు తీస్తాము. బ్రతికి ఉన్నప్పుడు మనిషి పనులు అతిశయోక్తిగా చెప్తారు. అందుకే అంటారు చచ్చినవాడి కళ్ళు చారడేసి అని ఎవరు ఎన్ని విధాలు ఏడ్చినా చనిపోయిన మీ నాన్న తిరిగిరాడు,” అంది.
ఆవిడ సుమతిని ఓదారుస్తోందా? లేక పరోక్షంగా మామయ్య ఒకప్పుడు తమని ఈసడించేవాడు అని విసుర్లా? ఆవిడ ఉద్దేశ్యం ఏుటో తనికి అర్థం కాలేదు. అంతటితో ఊరుకుందా? ఆరాలు తీయడం ఆరంభించింది.
“అమ్మాయ్! రేపు మేము వెళ్ళిపోతున్నాము. నిన్ను చూసి చాలా రోజులయింది. ఓ పర్యాయం మా ఇంటికి రాకూడదూ. మీ తమ్ముడు కూడా నాకు అక్కచెల్లెళ్ళూ, అన్నదమ్ములూ ఎవ్వరూ లేరంటూ బాధపడుతున్నాడు,” అంది దుర్గమ్మ. ఆమె మాటల్లో మర్మం అప్పుడు సుమతికి అర్ధం కాలేదు. కాని ఇప్పుడు కుటుంబ సభ్యులందరూ రాకతో తనకి ఇప్పుడు అర్థం అవుతోంది. వాళ్ళ రాకలో కారణం.
ఆ తరువాత అంతటితో ఊరుకుందా “అవునే అమ్మాయ్! ఇప్పుడు మీరిద్దరూ సఖ్యతగా ఉంటున్నారా?” అని అడిగింది. ఇలా వ్యక్తిగత విషయాలు ఆవిడ జోక్యం చేసుకోవడం తనకి నచ్చలేదు. ఆమె ప్రశ్నకి సుమతి ఏు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. కాని సుమతి మౌనం వెనుకనున్న పరిస్థితిని అంచనా వేస్తోంది దుర్గమ్మ. ఆ తరువాత మాట మార్చి వాతావరణంలో మార్చు తేవడానికి ప్రయత్నించింది దుర్గమ్మ.
పాత విషయాలన్నీ ఒక్కసారి రామ్మూర్తికి గుర్తుకు వచ్చాయి. ఈసారి వచ్చి ఊరుకుందా? అదీ లేదు.
“అమ్మాయ్! ఎంతయినా మనది రక్త సంబంధం. ఈ రక్త సంబంధం ముందు ముందు కూడా ఇలాగే ఉండాలి. అలా ఉండాలంటే నా మనుమరాల్ని అదే శాంతిని మా వాడికిచ్చి పెళ్ళి జరిపించాలి. శాంతి నా కోడలు,” అంది దుర్గమ్మ.
అంతవరకూ ఎవరి మనస్సుల్లో ఇటువంటి ఆలోచనలు రాలేదు. దుర్గమ్మ మాటల్తో ఒక్కొక్కరూ ఒక్కొక్క విధంగా ఆలోచిస్తున్నారు.
“ఈ ఆలోచన ఇంతవరకూ నాకు రానేరాలేదు. పిన్ని ఎంత మాట” అంది. ‘నిజంగా ఈ పెళ్ళి జరుగుతే శాంతి చాలా అదృష్టవంతురాలు. ఆస్తిపరుడు. అందగాడు భర్తగా వస్తున్నాడు. తనది అసంతృప్తికరమైన జీవితం. అడుగడుగునా అన్నిటికీ సర్దుకుపోయిన జీవితం. ఏ కోరికలు ముద్దు ముచ్చట్లూ లేకుండా పరిస్థితుల్తో రాజీపడి జీవితం గడిపెస్తోంది. ఈ సంబంధం చేస్తే నిజంగా శాంతి సుఖపడ్తుంది,’ సుమతి ఆలోచిస్తోంది.
మనిషి చూడ్డానికి అందంగా ఉన్నా బుద్ధులు మాత్రం మంచిగా లేకపోతే? గులాబీ చెట్టు మీద పువ్వు అందంగా ఉంటుంది. అదే కోయబోతే ముళ్ళూ గుచ్చుకుంటాయి. అదే టైపు ఈ సుకుమార్. ‘నిలకడలేని మనసు స్థిరం లేని వీడికి తన చెల్లెల్ని కట్టబెట్టడమా’ శేషు ఆలోచనలు ఇవి.
‘శాంతికి ఇప్పుడిప్పుడే పెళ్ళి చేయాలన్న ఆలోచన తనకి లేదు. ఇష్టం లేని పెళ్ళి చేసుకుని సంపూర్ణమైన తృప్తిలేని దాంపత్య జీవితం గడుపుతున్న తమలాగా తమ కూతురి జీవితం అవకూడదు. శాంతి ఇంకా శారీరకంగా మానసికంగా ఎదిగినప్పుడే దాని పెళ్ళి,’ రామ్మూర్తి అనుకుంటున్నాడు.
కౌమార వయస్సు దాటి ప్రారంభ యవ్వనావస్తకి చేరుకుంటున్న శాంతి ఆలోచన్లు మరోలా ఉన్నాయి. ఈ వయస్సు వాళ్ళు తొందరగా అబ్బాయిల ఆకర్షణకి లోనవుతూ ఉంటారు. ఇది వయస్సు ప్రభావం. ఆ సమయంలో ఎదుటి వాళ్ళలో ఎంత సేపూ అనుకూల భావాలే అగుపడ్తాయి కాని, ప్రతికూల భావాలు అగుపించవు.
‘సుకుమార్ మామయ్య సినీ హీరోలా ఉన్నాడు. ఉంగరాల జుత్తుతో ఎంత అందంగా ఉన్నాడో?’ అనుకుంటోంది శాంతి. ఆమె ఆ సమయంలో చూస్తుంది కేవలం అందాన్నే కాని అతని గుణగణాల్ని మాత్రం కాదు. అందుకే మొదటే చెప్పుకున్నట్టు ఇదంతా వయస్సు ప్రభావం. బాహ్య సౌందర్యమే చూస్తోంది కాని అంతరంగిక విషయాల్ని చూడటం లేదు.
‘ఇంత వరకూ ఎంతమంది ఆడపిల్లలనో బుట్టలో వేసుకుని పబ్బం గడుపుకున్నాడు తను. శాంతి చాలా అమాయకురాలు. అలా చేయకూడదు. మూడు ముళ్ళూ వేసి తనదానిగా చేసుకోవాలి,’ అనుకుంటున్న సుకుమార్ చిలిపిగా శాంతి వేపు చూశాడు. సిగ్గుతో తల వొంచుకుంది శాంతి.
“అమ్మాయ్! మీరు బాగా ఆలోచించి మాకు కబురు చేయండి. ఆ కబురు కూడా అనుకూలమైనదై ఉండాలి. మా వాడికి ఎంతోమంది బొలెడు కట్న కానుకలు ఇచ్చే సంబంధాలు వస్తున్నాయి. అయితే మనది రక్త సంబంధం. ఇలాంటి సంబంధం ఉన్న పిల్లనే కట్న కానుకలు లేకపోయినా కోడలిగా చేసుకోవాలని నా ఆలోచన,” దుర్గమ్మ దీర్ఘం తీస్తూ అంది.
“అలాగే పిన్నీ! మేము కూడా ఇంతకన్నా మంచి సంబంధం తెచ్చి చేయగలమా? మా కూతురు సుఖపడ్డమే మాకు చాలు.” సుమతి దుర్గమ్మకి ఇస్తున్న భరోసా రామ్మూర్తికి నచ్చలేదు, శేషుకి కూడా. ఇంటి యజమాని తనా, నేనా? ఇంటి యజమాని అయిన తన ఉద్దేశ్యం తెలుసుకోకుండా సుమతి భరోసా ఇవ్వడమేంటి? రామ్మూర్తి అనుకుంటున్నాడు.
‘తమిద్దరి మధ్యా సఖ్యత లేదు అన్న విషయం దుర్గమ్మ కనిపెట్టే అక్కడి నుండి నరుక్కు వస్తోంది. సుమతి ఇలా భరోసా ఈయడం తనని చులకన చేయడమే. తనని అవమానించడమే. సుమతి ఈ పని తెలిసి చేస్తోందా లేక తెలియక చేస్తోందా?’ తెగ మదనపడ్తూ ఆలోచిస్తున్నాడు రామ్మూర్తి. అతనికి సుమతి మీద చాలా కోపం వచ్చింది. ఆ కోపాన్ని అణచుకుంటున్నాడు.
శేషుకి కూడా తల్లి మీద చాలా కోపం వచ్చింది. తల్లి ప్రవర్తన ఈ మధ్య అతనికి నచ్చటం లేదు. ఆమె చెప్పినట్టు నడుచుకోవటం లేదు. అందుకే సుమతికి కొడుకు మీద కోపం జాస్తీగా ఉంది. తన తల్లి తప్పుదార్లో నడుస్తోంది అనుకుంటున్నాడు శేషు.
“అమ్మాయ్! నీకు మరో పర్యాయం చెప్తున్నాను. మనది దగ్గర సంబంధం. కాబట్టి కట్న కానుకల్తో లాంచనాలతో సంబంధం లేదు. మాకు ఒక్కడే కొడుకు. మాకున్న మా ఆస్తి పాస్తులన్నీ వాడివే. మావాడు బుద్ధిమంతుడు. మంచివాడు. మీకు అవసరమయితే వాకబు చేసుకోండి,” అంది దుర్గమ్మ.
పింతల్లి మాటలకి నొచ్చుకుంది సుమతి. “మాకేం అభ్యంతరం లేదు పిన్ని. అయితే శాంతి చదువుకుంటోంది. చదువు అయిన తరువాత పెళ్ళి చేస్తాం,” అంది సుమతి.
“పెళ్ళయ్యాక మా పిల్లే కదా! మా పిల్లని మేము చదివించుకుంటాం. అది ఎంత చదువుతానంటే అంత,” దుర్గమ్మ అంది.
“అలా అని కాదు. మాకు ఉన్నది ఒక్క ఆడపిల్ల. దాని అచ్చటా ముచ్చటా మాకు తీరలేదు. అందుకే ఇప్పటి నుండి పెళ్ళి చెయ్యం అంటున్నాను,” సుమతి అంది.
“అలాగే కానీయ్! మావాడికి పెద్దలంటే గౌరవం. మేము ఎంత చెప్తే అదే శిరోధార్యం వాడికి. అయితే శాంతి మాత్రం మా కోడలే, మరో మాట లేదు. మీరు మాట తప్పకూడదు” అంది దుర్గమ్మ. ఆ ఇంటి యజమాని ప్రసక్తే లేకుండా అలాగే అన్నట్టు తలూపింది సుమతి.
(ఇంకా ఉంది)
విజయనగరం వాస్తవ్యులైన శ్రీ గూడూరు గోపాలకృష్ణమూర్తి హిందీ ఉపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. వారు రాసిన కథలు వివిధ వార్తపత్రికల్లో ప్రచురితమయ్యాయి. కొన్ని కథలు సంకలనంగా వెలువడ్డాయి.
