[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారి కలం నుంచి జాలువారిన ‘మలుపులు తిరిగిన జీవితాలు’ అనే నవలని సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. క్రిందటి వారం ఎపిసోడ్ ఇక్కడ చదవచ్చు.]
[శేషుకి, ఎంబిఎ పూర్తి చేశాకా, బ్యాంకులో ఉద్యోగం వస్తుంది. శాంతి డిగ్రీ చివరలో ఉంటుంది. శాంతి పెళ్ళి ప్రస్తావన తెస్తుంది సుమతి. సుకుమార్‌తో పెళ్ళి జరిపిద్దామని అంటుంది. రామ్మూర్తి వద్దంటాడు. తాను పిన్నికి మాటిచ్చానంటుంది సుమతి. సుకుమార్‌ని చూడగానే అతని మీద తనకి మంచి అభిప్రాయం కలగలేదంటాడు రామ్మూర్తి. వాళ్ళిద్దరి మధ్య తీవ్రమైన వాదోపవాదాలు జరుగుతాయి. భర్త ఎందుకు వద్దంటున్నాడో తనకు తెలుసుననీ, శాంతిని సుందరం కొడుకు సుధాకర్‌కి ఇచ్చి పెళ్ళి చేయాలని అనుకుంటున్నాడని అంటుంది. అప్పటిదాకా తనకి ఆ ఆలోచన లేదని, ఇప్పుడొచ్చిందని, వాళ్ళిద్దరికీ పెళ్ళి చేస్తానని అంటాడు రామ్మూర్తి. కులం గోత్రం లేని వాళ్ళకి తన కూతుర్నిచ్చి పెళ్ళి చెయ్యనంటుంది సుమతి. అదే సమయంలో సుధాకర్ అక్కడికి రావడం, ఆమె అన్న మాట విని వెనక్కి తిరగడం జరుగుతుంది. అతనొచ్చి వెళ్ళిపోవడం శేషు తప్ప ఇంకెవరూ చూడరు. శేషు తల్లిని వారించే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆమె వినదు. చివరగా, తనూ సుమతి కలిసి సుకుమార్ వాళ్ళ ఊరు వెళ్ళి అంతా విచారించాలని, సంతృప్తి కలిగితే తల్లి మాట ప్రకారం చేద్దామని, లేని పక్షంలో తండ్రి మాట ప్రకారం జరగాలని అంటాడు శేషు. సరేనంటుంది సుమతి. దుర్గమ్మ వాళ్ళకి తాము వస్తున్నట్టు చెప్పకుండా, ఆ ఊరికి వెళ్తారు సుమతి, శేషు. ఊరు చేరాకా, ఊరు మొదట్లో పొలంలో ఓ విలాసవంతమైన ఇల్లు కనబడుతుంది. అటుగా వెళ్తున్న ఓ గ్రామస్థుడు వీళ్ళని పలకరించి ఎవరింటికి వెళ్ళాలని అడిగితే, చెప్తాడు శేషు. ఆ కనబడుతున్నది సుకుమార్ ఫామ్‌హౌస్ అని చెప్తాడు. వెళ్ళి చూసొస్తామని అంటే, ఇప్పుడొద్దని అంటాడు. శేషు, సుమతి వెళ్ళి తలుపు తట్టేసరికి ఓ స్త్రీ పొందులో ఉంటాడు సుకుమార్. వెనక తలుపు నుంచి ఆమెను పంపించేసి, వెళ్ళి తలుపు తీస్తాడు. లోపలికి వచ్చిన సుమతి, శేషు అక్కడ జరుగుతున్నదాన్ని గ్రహిస్తారు. సుమతిలో ఆత్మసంఘర్షణ మొదలవుతుంది. అనవసరంగా భర్తని ఆడిపోసుకున్నానని అనుకుంటుంది. ఇక్కడేం మాట్లాడద్దంటూ అమ్మకి నచ్చజెప్తాడు శేషు. దుర్గమ్మ ఇంటికి వెళ్తారు. ముందుకు ఇంటికి రాకుండా ఫామ్‌హౌస్‌కి వెళ్ళినందుకు గింజుకుంటుంది. తల్లీ కొడుకుని ఎన్నో విధాలుగా మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తారు దుర్గమ్మా, సుకుమార్. – ఇక చదవండి.]
అధ్యాయం 37
శేషు మనస్సు మథనపడుతూనే ఉంది. ఆ రోజు జరిగిన సంఘటన తలచుకుంటూ ఉంటే అదీ సుధాకర్ గురించి. ఆ రోజు తన తల్లి కులం గోత్రం లేనివాడికి శాంతినిచ్చి పెళ్ళి చేయడానికి నేను ఇష్టపడను అంది. ఆ సమయంలోనే సుధాకర్ అక్కడికి వచ్చాడు. తన తల్లి అన్న మాటలు విన్నాడు. మనస్తాపంతో వెనక్కి తిరిగాడు.
తన తల్లి మాట దురుసే, మాట తీరే దీనికి కారణం. మాట ఆచి తూచి మాట్లాడాలి. ముందూ వెనకా ఆలోచించి మాట్లాడాలి. అదే గొప్పతనం. అలా ఆలోచించి మాట్లాడితే ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మాటని, నీటిని, కాలాన్ని సరిగా వాడుకోవాలి.
తన తల్లికి అభిప్రాయాలు ఉంటే ఉండచ్చు. మనిషి తన మటలు ద్వారా వెల్లడిచేస్తాడు. బుద్ధిని అనుసరించి మాటలు హృదయంలో నుండి కంఠం, నోరు, నాలుక ద్వారా బయటకు వెలువడుతాయి. నోరు ఉన్నప్పటికి నాలుక లేకపోతే మాట్లాడలేము. నాలుక ఉన్నప్పటికి బుద్ధి పని చేయనప్పుడు మాట్లాడలేము. మంచి మాట వల్ల ఎదుటివారి మీద గౌరవం కలిగిస్తాయి. మన మాటలు శాంతిని కలిగించేవిగా ఉండాలి. మాట యొక్క ప్రభావం వల్ల మనిషి ఉన్నతంగా ఎదగగలడు.
ఇదంతా ఎందుకు అంటే తన తల్లి మాట తీరు బాగులేదు. సెలవు రోజున సుధాకర్‌ని కలవడానికి వెళ్ళాలి. అతని మనస్తాపం తీర్చాలి శేషు ఆలోచిస్తున్నాడు.
అనుకున్న విధంగానే సెలవు రోజున శేషు బయలుదేరాడు. వెళ్తున్న విషయం ఇంటిలో చెప్పలేదు. శేషు వెళ్ళెప్పటికి సుందరం హాలులో కుర్చీలో కూర్చుని న్యూస్ పేపరు చదువుతున్నాడు. శేషుని చూడగానే చదువుతున్న పేపర్ని మడచి పక్కన పెట్టి ‘‘రా శేషూ!’’ అన్నాడు.
ఈ మధ్య శేషు మారినట్టు తండ్రి మీద అతనికున్న నెగిటివ్ ఫీలింగ్సు పోయి సాఫ్టుగా ఉంటున్నాడు. తండ్రి అంటే అభిమానంగా ఉన్నాడని విన్నాడు సుందరం. మొదట ఈ విషయం విని సంతోషించిన మొదట వ్యక్తి సుందరమే. పోనీ రామూర్తికి భార్య ఎలా ఉన్నా కొడుకు సపోర్టు లభిస్తోంది అది చాలు అని అనుకున్నాడు.
అన్ని విషయాలూ మాట్లాడుకున్న తరువాత ‘‘సుధాకర్ ఏడి అంకుల్’’ అని అడిగాడు. “వాడా మీ ఇంటికి వెళ్ళి వచ్చినప్పటి నుండి ఏు జరిగిందో కాని చాలా మూడీగా ఉన్నాడు. ఏ విషయం గురించో చాలా బాధపడ్తున్నట్లు ఉంది. వాడు అసలే సెన్సిటివ్.” అన్నాడు.
‘‘నేను కనుక్కుంటాను.’’ అన్నాడు శేషు.
“ఒక వయస్సు వాళ్ళు కదా! ఏు చెప్తాడో విను,’’ అన్నాడు సుందరం సుధాకర్ ఉన్న రూమ్ చూపిస్తూ. రూమ్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. సుధాకర్ దేని గురించో ఆలోచిస్తూ మథనపడ్తున్నట్లు అనిపించింది. అతని ఆలోచన్లకి అంతరాయం కలగకుండా శేషు అలాగే నిలబడి ఉన్నాడు.
శాంతి, తను, సుధాకర్ చిన్నప్పుడు ఎంత సరదాగా ఉండేవారు కలిసినప్పుడు. ఎన్నో ఆటలు ఆడుకునేవారు. కలిసి తిరిగేవారు. శాంతి అంటే సుధాకర్‌కి ఎంతో అభిమానం ఓ పర్యాయం శాంతి కాలుకు దెబ్బతగిలి రక్తం కారుతే ఎంత హంగామా చేసాడు? ఎంత బాధపడిపోయాడు.
తనే తల్లి ప్రభావంలో పడి మాటలు తగ్గించి వేసాడు. సుధాకర్ బాధపడ్డాడు. తన ప్రవర్తన నెగిటివ్‌గా ఉన్న సమయంలో తన తండ్రి సుధాకర్‌తో తనని పోలుస్తూ ‘సుధాకర్‌ని చూడు ఎంత బుద్ధిమంతుడో’ అంటే తన అహం దెబ్బ తినేది. ఈర్ష్య భావం కలిగేది సుధాకర్ మీద. దానికి ఫలితమే సుధాకర్ మీద ద్వేషం పెంచుకున్నాడు. ఇప్పుడు తన తప్పు తెలుసుకున్నాడు. సుధాకర్‌ను క్షమాపణ అడగాలి. ఇలా సాగుతున్నాయి శేషు ఆలోచన్లు.
సుధాకర్ ఆలోచన్లు మరోలా ఉన్నాయి. తనూ, శేషు, శాంతి బాల్యంలో ఎన్ని ఆటలు ఆడుకునేవారు. ఎన్ని కబుర్లు చెప్పుకునేవారు. బాల్యం రోజులు ఎంత మధురంగా ఉండేవి. కబడ్డీ ఆట, గోళీ ఆట, బొంగరాల ఆట, తొక్కుడు బిళ్ళ ఆట ఇలా ఎన్ని ఆటలు ఆడుకునేవారు. కాగితపు పడవులు నీటిలో వదిలేవారు. కాగితంలతో రాకెట్లు చేసి గాలిలో వదిలేవారు. కొబ్బరి ఆకుల్తో బూరలు చేసుకుని ఊదేవారు. మామిడి కాయ ముక్కలుగా చేసి
ఉప్పు అద్దుకుని తినేవారు. పాటలు పాడుకునేవారు మైదానంలో గాలి పగడలు ఎగిరేసేవారు.
శాంతి అంటే తనకి చాలా ఇష్టం. శాంతి కూడా తను తినడానికి ఏం తెచ్చుకున్నా అన్నయ్యకి ఇవ్వకుండా తనకే ఇచ్చేది. అలాంటి బాల్యం ఎవరికైనా అపురూపమైనదే. మధురమైనదే అలాంటి మధురమైన బాల్యం జీవితంలో మరి రాదు ప్చ్..!
అయితే ఇది బాల్యం విషయం. వయస్సులు పెరుగుతున్న కొలదీ చదువు, బాధ్యతల మీద దృష్టి పెట్టడం వలన మధురమైన బాల్యం జ్ఞాపకాలన్నీ మరుగున పడిపోయాయి. యాంత్రిక జీవితం అయిపోయింది. అయితే ఆంటీ తనని కులం గోత్రం లేనివాడు అని అనడం తనకి ఎంతో బాధ కలిగించింది.
‘‘సుధా!’’ పిల్చాడు శేషు.
ఆ పిలుపు విని ఎన్నో సంవత్సరాలయింది. అందుకే ఆలోచనా ప్రపంచం నుండి బయటపడ్డ సుధాకర్ గుమ్మం వేపు చూశాడు. ఎదురుగా శేషు. విస్తుపోయి చూస్తున్నాడు.
‘‘నీవు అలా చూస్తావని నాకు తెలుసు. నీ భావోద్వేగం నాకు తెలుసు. శేషు ఇంత ఆప్యాయతగా పిలుస్తున్నాడా! అని అనుకుని ఉంటావు కాని నేను శేషునే. చిన్నప్పటి నీ స్నేహితుడు శేషునే,’’ అని అన్నాడు శేషు.
‘‘ఇప్పుడే మన బాల్యం సంగతుల్ని తలుచుకుంటున్నాను. ఇంతవరకూ నేనూ అదే ఆలోచన్లలో ఉన్నాను.”
‘‘సారీ!’’
‘‘ఎందుకు?’’
“నీవు మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ తొందరబాటులో మిమ్మల్ని అవమానించినట్లు మాట్లాడిన మాటలకి.’’
‘‘అప్పుడు నీవు అక్కడ ఉన్నావా? నన్ను చూశావా?’’
‘‘అవును. అయితే ఒక్క విషయం మా అమ్మ విషయం నీకు తెలుసు. ఆమె మనస్తత్వం, మాటతీరు తెలిసి కూడా నీవు ఇలా బాధపడ్డం భావ్యం కాదు. నీవు ఇలా మూడీగా ఉన్నావాని మీ నాన్నగారు ఎలా బాధపడ్తున్నారో తెలుసా.’’
‘‘నిజమే! ఆంటీ నన్ను మంచివాడు కాదు, చెడ్డవాడు అని నిందించినా నేను బాధపడేవాడను కాదు. ఆంటీ కులం గోత్రం లేనివాడు అని అంటే చాలా బాధ కలిగింది నాకు. ఇప్పటి వరకూ నన్ను ఎవరూ అలా అనలేదు.’’
‘‘నేను చెప్తున్నానా. ఆవిడ ప్రభావంలో పడి నేను కూడా కొన్నాళ్ళు అలా మూర్ఖంగా ప్రవర్తించి మా నాన్నగారికి మనస్తాపం కలిగించాను. నా ప్రవర్తనతో నిన్ను కూడా. అప్పుడు నా ప్రవర్తనతో నిన్ను చాలా బాధ పెట్టాను, నా తప్పు నేను తెలుసుకుని సారీ చెప్తున్నాను.’’
సుధాకర్ మనస్సు శేషు మాటల్తో తేలికపడింది. వారి మధ్యనున్న మంచి వాతావరణం ఏర్పడింది. అపోహాలు దూది పింజల్లా ఎగిరిపోయాయి. ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ బయటకు రావడం చూసి సుందరం మనస్సు తేలికపడింది.
అధ్యాయం 38
‘ఊరికి వెళ్ళి వచ్చినప్పటీ నుండి సుమతి ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. ఏదో దిగులు, పశ్చత్తాపం కళ్ళలో కనిపిస్తున్నాయి. తన వేపు సూటిగా చూడలేకపోతోంది. ఆత్మనూన్యతా భావంతో బాధ పడుతున్నట్లు ఉంది,’ అనుకుంటున్నాడు రామూర్తి భార్య ప్రవర్తన చూసి.
సుమతిలో సహనం నిగ్రహం లేవు. అవే ఉంటే ఇలా కృంగిపోతు బాధపడదు. బేలగా ఉండదు, లేకపోతే సంయమనం పాటించి సమస్యను పరిష్కా దిశగా నడిపించి సఫలీకృతురాలవుతుంది. అందరి మన్ననలను పొందుతుంది. సుమతి ప్రవర్తన అలా లేదు. అందుకే ఆత్మనూన్యతతో ఒక్కొక్క పర్యాయం పరుషమైన ఎదుటి వాళ్ళకి బాధ కలిగించే మాటలు మాట్లాడుతుంది. అలా తన ఆధిక్యతను నిలుపుకోవలను కుంటుంది.
అంతే కాదు సుమతిలో భావోద్రేకాలు ఎక్కువ. మనిషికి ప్రధాన శత్రువు కోపం, పగ ద్వేషం, అసూయ. ఇతరులు మాటలని చేతలని ఆమోదించలేని లక్షణం ఉంది. ఈ గుణాలుంటే మనిషి మృగంలా ప్రవర్తిస్తాడు. మనస్సుకి ప్రశాంతత లేకుండా పోతుంది. ఆప్యాయతతోనే మనిషికి ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యకరమైన మానవ సంబంధాలు ఉంటేనే మనిషికి ప్రశాంతత లభిస్తోంది. విలాసవంతమైన సుఖమైన జీవితం. దానికి అవసరమైన డబ్బే ప్రధాన మనుకుంటే మనిషిలోని నైతిక శక్తిని నాశనం చేస్తుంది. చివరకు మిగిలేది కక్షలు కార్పణ్యాలు మాత్రమే.
అంతేకాదు ఎదుటి వాళ్ళ మీద ప్రతీకార ధోరణి మనిషిలోని వివేకాన్ని అణచి వేస్తుంది. మనిషిని తప్పుడు మార్గంలో మళ్ళిస్తుంది. ఆలోచనా శక్తిని దూరం చేస్తుంది. మనిషి ప్రశాంత వాతావరణంలో తనలోని లోపాల్ని ఆత్మవిమర్శ చేసుకుంటే తనలోని నైపుణ్యాలు గుర్తించగలగుతారు, సుమతిలో అది లేదు.
ముఖ్యంగా మనిషికి అహంకారం పనికిరాదు. అది మనిషి విచక్షణా జ్ఞానాన్ని దృష్టిని మందగింప చేస్తుంది. జీవితాన్ని విషపూరితంగా మార్చెస్తుంది. అహంకారం ఉన్న వ్యక్తికి అందరూ పనిముట్లలా అగుపడ్తారు. వాళ్ళకి స్వార్థం పాలెక్కువం. అందరూ తమ మాటే వినాలి. తన దగ్గర తలవొంచాలి అని అనుకుంటారు. అహంకారం వల్ల జీవితంలో అన్ని జరుగుతాయి అని అనుకుంటారు. కాని వారి భావం తప్పు అని తెలుసుకోలేరు. వినయం నమ్రత వల్లనే అన్ని పనులూ జరుగుతాయి. దానిలో తృప్తి ఉంది. అహకారంలో అసంతృప్తి ఉంది. వినయంలో ప్రేమ ఉంటుంది.
తన తల్లి మామయ్య ఈ ఇద్దరి మాటకు కట్టుబడి తను సుమతిని పెళ్ళి చేసుకుని ఇంత వరకూ అనైక్యత దాంపత్య జీవితాన్ని గడిపాడు. జీవిత చరమాంకంలో వచ్చేసేరు తాము. ఇన్నాళ్ళు వైవాహిక జీతంలో ఆనందంగా గడిపిన క్షణాల్ని వేళ్ళ మీద లెక్కపెట్ట వచ్చు. విధి నిర్ణయం ఇలా ఉంటే ఎవ్వడూ ఏు చేయలేరు. జీవితంలో కొందరు ఎప్పుడూ కష్టాలు అనుభవించడానికే పుడ్తారేటో? తన కన్నా సుందరం బాల్యంలో కష్టాలు అనుభవించినా వాడి జీవితమే నడయం. ప్రేమించి పెళ్ళాడిన జీవిత భాగస్వామి లభించింది. ప్రేమించి పెళ్ళాడక్కర లేదు. పెద్దలు కుదిర్చిన పెళ్ళి సంబంధాలు చేసుకున్న వాళ్ళు ఎంతమంది సుఖంగా జీవితం గడపటం లేదు. ఇదంతా తన కర్మ. విధి నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఇలా సాగిపోతున్నాయి రామూర్తి ఆలోచనలు.
సుమతి కూడా ఆలోచిస్తోంది. ఆమె మౌనంగా కూర్చోలేదు. ఆలోచిస్తూ బాధపడుతోంది. పశ్చత్తాపం పడుతోంది. ఇవి తనకి సంబంధిచిన సమస్యలు అని ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తోంది. ఆత్మవిమర్శ చేసుకుంటోంది సుమతి.
‘చిన్నతనం తనకి మూర్ఖత్వం ఆవేశం ఎక్కువ. ఇవే అన్ని అనర్థాలకి మూలం. అనవసరంగా మాటిమాటికీ ఆవేశపడకూడదు. దీనివల్ల మనిషి మంచి చెడ్డల్ని మరిచిపోతాడు. విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతాడు. ఆవేశ సమయంలో తనేు చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో తెలసుకోలేని పరిస్థితి. తప్పు తెలుసుకుని వెనక్కి తిరిగి చూసే సరికి జరగవలసిన అనర్థం జరిగిపోతుంది. ఎటువంటి కష్ట పరిస్థితి ఎదురైనా మనం శాంతంగా
ఉంటే ఆ సమస్యకి పరిష్కారం లభించినట్టే. అనవసరంగా అవేశ పడితే సమస్య మరింత కష్టతరం అవుతుంది.
జీవితంలో ఇప్పటి వరకూ జరిగిన ఎదుర్కున్న సమస్యలన్నీ తను తనకు తానుగా తెచ్చుకున్న సమస్యలే. వీటినన్నింటికి పరిష్కారం లభించాలంటే స్థిమితంగా కూర్చుని తన మనసులోకి తొంగి చూస్తు తన తప్పొప్పులను విశ్లేషించుకోవాలి. నిశ్శబ్దంగా కూర్చుని ప్రశాంతంగా ఆలోచించడం వల్ల మనస్సు నిర్మలమవుతుంది. తనలోని లోపాలను సరిదిద్దుకుని మానసిక బలహీనతలు తొలగించుకుంటే మానసిక శక్తి అలవడుతుంది.
మనిషి జీవితంలో అందరికీ ఉన్నట్టే తనకూ భావోద్వేగాలు, భావోద్రేకాలు ఉంటున్నాయి. రక్త సంబంధాల్లో ఈ భావోద్వేగాలు వాటి ప్రభావం చూపుతాయి. వీటి వల్ల ఒకప్పుడు ఆనందం కలుగుతుంది. మరొక సమయంలో బాధ కలుగుతుంది. ఇవి లేకపోతే మానవ జీవితమే లేదు.
అయితే తను తన జీవిత కాలంలో భావోద్వేగాలతో ఎదుటివాళ్ళకి ఆనందం పంచి ఇయ్యలేక పోయింది. ఎదుటి వాళ్ళ జీవితాన్ని బాధమయంగా చేసింది. తను బాధపడింది. తన భర్తని బాధ పెట్టింది. తనది భర్తది రక్త సంబంధం. భావోద్వేగాల్లో ఒకటయిన ఆనందాన్ని తన భర్తకి పంచి ఇచ్చిందా? లేదే?
సుందరం, సులోచనా దాంపత్య జీవితం ఎంత ఒడిదొడుకులు లేకుండా ప్రశాంతంగా జరిగిపోతోంది. వాళ్ళను చూస్తే తనకి అసూయ. వాళ్ళలా తను ఎందుకు ఉండటేక పోతోంది అన్న ఆత్మవిమర్శ. తనలో ఎందుకు ఈ సమన్వయ లోపం అనే దిగులు.
తను సుఖపడలేకపోతోంది. తన భర్తను సుఖ పెట్టలేకపోతోంది. శేషుని కూడా తనలాగా మూర్ఖుడుగా అహంభావిగా మార్చాలని చూసింది. శేషు తన తప్పు తాను తెలుసుకున్నాడు కనుక సరిపోయింది.
మూర్ఖంగా ఆలోచించి సుకుమార్‌కి శాంతికి పెళ్ళి జరిపించాలని చూసింది. శేషు తన కళ్ళు తెరిపించ బట్టి కాని ఎంత అనర్థం జరిగి ఉండేది. కూతురు జీవితాన్ని చేజేతులారా తనే నాశనం చేయడానికి కారకురాలయ్యేది.
ఉన్న దానితో సంతృప్తిపడాలి. మన కన్నా దిగువ స్థాయిలో ఉన్నవాళ్ళతో మనల్ని సరిపోల్చుకోవాలే కాని మనకన్నా ఎగువ స్థాయిలో ఉన్నవాళ్ళతో మనల్ని సరిపోల్చుకూడదు అని తన భర్త ఎన్ని పర్యాయములు చెప్పినా పెడచెవిన పెట్టింది.
మేనత్తకి శాంతి లేకుండా చేసింది. తల్లికి శాంతి లేకుండా చేసింది. తండ్రికి శాంతి లేకుండా చేసింది. ఇప్పుడు తన భర్తకి శాంతి లేకుండా చేస్తోంది. తను మారాలి. తన భావాలు మార్చుకోవాలి. తన ఆలోచనలు మార్చుకోవాలి. తన చేతులు మార్చుకోవాలి. లేకపోతే అందరి జీవితాల్లో సుఖ సంతోషాలే ఉండవు. ఆనందం ఎండమావే,’’ సుమతి ఆలోచన్లు ఇలా సాగిపోతున్నాయి.
(ఇంకా ఉంది)
విజయనగరం వాస్తవ్యులైన శ్రీ గూడూరు గోపాలకృష్ణమూర్తి హిందీ ఉపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. వారు రాసిన కథలు వివిధ వార్తపత్రికల్లో ప్రచురితమయ్యాయి. కొన్ని కథలు సంకలనంగా వెలువడ్డాయి.
