Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మలుపులు తిరిగిన జీవితాలు-20

[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారి కలం నుంచి జాలువారిన ‘మలుపులు తిరిగిన జీవితాలు’ అనే నవలని సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. క్రిందటి వారం ఎపిసోడ్ ఇక్కడ చదవచ్చు.]

[తన తల్లి సుధాకర్‌ని కులగోత్రాలు లేని మనిషని అన్నందుకు బాధపడతాడు శేషు. అదే సమయంలో సుధాకర్ అక్కడికి వచ్చి ఆ మాటలు విని, వెనక్కి తిరిగి వెళ్ళిపోడం శేషుని ఇంకా బాధిస్తుంది. మర్నాడు సుందరం ఇంటికి వెళ్ళి సుధాకర్ ఉన్నాడాంకుల అని అడిగితే, ఉన్నాడు, దేనికో బాధపడుతున్నాడు, గదిలోంచి బయటకు రావడం లేదని చెప్తాడు సుందరం. లోపలికి వెళ్ళి చూస్తే, సుధాకర్ ఆలోచనల్లో లీనమై కనిపిస్తాడు. చిన్నప్పుడు తానూ, శాంతి సుధాకర్ కలిసి ఆడుకున్న ఆటలు, చేసిన అల్లరి గుర్తొస్తాయి శేషుక్కి. సుధాకర్‌ని పలకరిస్తాడు. తన తల్లి అన్న మాటలకు క్షమాపణ వేడుకుంటాడు. అవి మనసులో పెట్టుకుని బాధపడడ్దని కోరుతాడు. శేషు మాటలతో సుధాకర్ మనసు తేలికపడుతుంది. దుర్గమ్మ వాళ్ళ ఊరు వెళ్ళొచ్చినప్పటి నుండి సుమతి ప్రవర్తనలో వచ్చిన మార్పు రామ్మూర్తిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. చిన్నప్పటి నుంచి సుమతి ప్రవర్తనననీ, తమ వైవాహిక జీవితంలోని ఒడుదుడుకులను తలచుకుని బాధపడతాడు. సుకుమార్ గురించిన నిజాలు శేషు చెప్పాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే శాంతి జీవితం అస్తవ్యస్తమయ్యేదని అనుకుంటాడు. సుమతి కూడా తన ప్రవర్తనపై తర్కించుకుంటుంది. – ఇక చదవండి.]

అధ్యాయం 39

మాజంలో మన చుట్టూ కొంతమంది మనుష్యులు ఉంటారు.

వాళ్ళు తమ స్వంత ప్రయోజనాలు తీర్చుకుందామన్న కాంక్షతో ఎదుటి వాళ్ళను వాడుకుంటారు. ఎదుటివాళ్ళ వలన వాళ్ళకు ప్రయోజనం ఉంటే సిగ్గు బొగ్గూ లేకుండా ఎదుటి వాళ్ళ వెంట పడతారు. అదే ఎదుటి వాళ్ళ వల్ల ఏం ప్రయోజనం లేకపోతే వెంటనే అదృశ్యమవుతారు.

ఆ కోవకు చెందింది దుర్గమ్మ. తన కొడుకు సుగుణవంతుడు, మంచి హోదాలో ఉన్నట్టయితే తన కొడుక్కి పిల్లని ఇవ్వమని రామ్మూర్తి చుట్టూ తిరుగుతుందా? నానా వ్యసనాలు ఉన్నాయి తెలిసిన వాళ్ళు ఎవరూ పిల్లనివ్వరు. ఎంత ఆస్తిపాస్తులుంటే ఏు లాభం అనుకునే రామ్మూర్తి కుటుంబాన్ని తన స్వంత ప్రయోజనానికి వాడుకోవాలని చూస్తోంది.

వాళ్ళు పిల్లనివ్వడానికి తిరస్కరించినా శాంతిని తన కోడలిగా చేసుకోడానికి పట్టూ వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తోంది. ఇది ఆమెకి నామోషీగా అనిపించటం లేదు.

ఇలా ఎందుకు తాపత్రయం పడుతోంది అని ఆరా తీస్తే ప్రతీ విషయానికీ ఎదుటి వాళ్ళకి కనిపించని మరో చీకటి కోణం ఉంటుంది. కొంచెం లోతుగా ఆలోచించి చూస్తే తప్ప అసలు సంగతి అంతు పట్టదు. అందుకే దుర్గమ్మలాంటి వాళ్ళను జాగ్రత్తగా గమనించాలి.

దుర్గమ్మ స్వభావం అలాంటిది కాబట్టే ఆమె దగ్గర ఎంత వరకు ఎలా మాట్లాడాలో ఎదుటివాళ్ళు ముందే నిర్ణయించుకోవాలి. ఆమె చెడు తలంపులు, స్వార్థబుద్ధి స్వప్రయోజనం కోసం ఎంత వరకైనా వెళ్ళగలదు అని ఆమె స్వభావం తెలిసిన వాళ్ళు ఆమెను దూరంగా ఉంచడానికే ప్రయత్నిస్తారు.

అలాంటి ఆమెతో వాద వివాదం కూడా పెట్టుకోకూడదు. జ్ఞానవంతుల్తో మాట్లాడవచ్చు, వివేకం లేని వాళ్ళతో మాట్లాడవచ్చు కాని మిడిమిడి జ్ఞానం, నోటి దురుసు ఉన్న వాళ్ళతో అసలు మాట్లాడ కూడదు అన్న విషయం ఆమెతో వాద వివాదం పెట్టుకున్న వాళ్ళకి ఆ తరువాత తెలుస్తుంది.

మనం ఏదేనా ఆశిస్తున్నాం అంటే మనకి దాన్ని పొందే అర్హత ఉంటేనే సాధ్యమవుతుంది. ఆ అర్హత లేకపోతే ఏదీ అంత తేలిక కాదు అని తెలుసుకోరు దుర్గమ్మ లాంటి వాళ్ళు.

దుర్గమ్మ స్వభావం తెలిసిన రామ్మూర్తి అనుకుంటున్నాడు. ఊరు నుండి వచ్చిన తరువాత సుమతి ఏం మాట్లాడక మౌనంగా ఉండిపోయిన కొడుకు శేషు ద్వారా సుకుమార్‌ భాగవతం అంతా విన్నాడు రామ్మూర్తి. ‘సుమతే స్వయంగా చూడకుండా ఉంటే ఎంత అనర్థం జరిగిపోయేది? అమాయకురాలైన తన కూతురు జీవితం సర్వ నాశనమయ్యేది,’ ఇలా అతని ఆలోచన్లు ఇలా సాగుతూనే ఉన్నాయి సుడిగాలిలా వచ్చింది దుర్గమ్మ.

“ఏమే అమ్మాయ్‌! మీరు మా ఊరు వచ్చి వెళ్ళి ఇన్నీ రోజులయింది. ఏ కబురూ లేదు కాకర కాయాలేదు,” గాలిలో చేతులూపుతూ తన హావభావాల్ని ప్రదర్శిస్తూ అంది దుర్గమ్మ. సుమతి ఏు సమాధానం ఇయ్యకుండా ఎటో చూస్తోంది.

“సుమతికి అక్కడికి వెళ్ళి వచ్చినప్పటి నుండి ఆరోగ్యం బాగులేదు,” రామ్మూర్తి అన్నాడు.

“ఏంటయింది.. ఏంటయింది మా అమ్మాయికి” ఆత్రుత ఒలకపోస్తూ అంది దుర్గమ్మ.

“నన్ను అడిగితే నేను చెప్తాను,” అన్నాడు శేషు.

“మీ దగ్గర నుండి ఏ కబురూ రాకపోయేసరికి నేను ఏదో జరిగిందని అనుకున్నానులే. మనస్సు శంకిస్తూనే ఉంది. అయితే మా వాడికి తెగ సంబంధాలు మీద సంబంధాలు వస్తున్నాయి. కాకినాడ సంబంధం వాళ్ళు గొప్ప ఆస్తిపరులు వాళ్ళు చేసుకోమని, ఇవతల విజయవాడ సంబంధం వాళ్ళు ఆస్తిపరులే కాదు రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళు. మరి విశాఖపట్నం సంబంధం వాళ్ళు కోటీశ్వరులే అనుకో,” ఇలా దుర్గమ్మ ఉపన్యాస ధోరణిలో అంటోంది.

“అయితే ఏదో సంబంధం చూసి నిశ్చయం చేసుకోలేకపోయారా?” శేషు అన్నాడు. ఆ మాటల్లో ఆమెకు వెటకారం కనిపించింది.

“అదేంటబ్బాయ్‌! అలా అంటావు? డబ్బు మనిషినా నేను. మనం మనం రక్త సంబంధీకులం. దగ్గర సంబంధం మా వాడికి చేయాలని నా తాపత్రయం,” దుర్గమ్మ దీర్ఘం తీస్తూ అంది.

“మా చెల్లెల్ని నీ కొడుక్కి ఇచ్చి పెళ్ళి చేసే ప్రసక్తే లేదు,” శేషు అన్నాడు. బాంబు పడినట్లు అదిరిపడిరది దుర్గమ్మ.

“ఎందుకని?”

“ఎందుకో మీకు తెలియదా?”

“చెప్తే కదా తెలిసేది”

“మీ కొడుకు ఎలాంటి వాడో మీకు తెలియదా?”

“అదేంటి అబ్బాయ్‌! అలా అంటావు? నీవు చిన్నపిల్లాడివి. నీకు తెలియదు. ఇది పెద్దవాళ్ళు మాట్లాడుకునే విషయం,” అంది.

“ఈ ఇంట్లో పెద్దవాళ్ళ మాటే నా మాట, నా మాటే పెద్దవాళ్ళ మాట.”

“నా కొడుకు ఆస్తిపరుడు, అందగాడు.”

“మరి త్రాగుడు, మిగతా వ్యసనాల గురించి ఏంటి?” శేషు ప్రశ్నకి కంగుతింది దుర్గమ్మ. ఆమెకి కోపం వస్తోంది. రోషం పొడుచుకుని వస్తోంది.

‘అవునులే కోరుండి పిల్లనివ్వమని అడగడానికి వచ్చాను కదా! అందుకు నీకు మేమంటే లోకువ’, అని అనుకుంటున్న దుర్గమ్మ వసుదేవుడు వంటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడుట ఆ సామెతలా ఉంది ఇక్కడ పరిస్థితి.

తప్పదు. తన కొడుకే సవ్యమైన వాడయితే ఇలా అందర్నీ ప్రాధేయపడే పరిస్థితి వచ్చేదే?. అయినా ఆ రోజు ఏ కబురు చేయకుండానే వచ్చేరు. అదే కబురు చేసి వచ్చి ఉంటే కొడుకుని హెచ్చరించి ఉండేది. జాగ్రత్తపడి ఉండేవాడు.

“ఏంటి ఆలోచిస్తున్నారు? కబురు పెట్టకుండా వచ్చేమనా? అలా చేయబట్టే అసలు బాగోతం బట్టబయలు అయింది. లేకపోతే మా పరిస్థితి ఏంటో ఊహించడానికే భయంగా ఉంది.”

‘ఈ పిల్లాడు మహా గట్టివాడు ఆవులిస్తే ప్రేగులు లెక్కబెట్టే రకం,’ అనుకుంది దుర్గమ్మ.

“ఏు అల్లుడూ! నా మనుమడు చిన్నవాడు. వాడికంటే తెలియదు. పెద్దవాడివి, నీవు చెప్పు,” రెట్టించింది దుర్గమ్మ. సుమతి ఇదంతా చూస్తూ ఉండిపోయింది కాని ఒక్క మాట మాట్లాడలేదు.

“నేను చెప్తున్నానా నా మాటే వాళ్ళ మాట,” అన్నాడు శేషు.

“చేసుకోదల్చుకున్న దానివి శాంతి తల్లీ, నీవు చెప్పమ్మా. మామయ్యని పెళ్ళి చేసుకోవడం నీకిష్ఠమేనా?,” శాంతిని అడిగింది దుర్గమ్మ. శాంతి అయోమయంగా దిక్కులు చూస్తోంది.

“అది చిన్న పిల్ల. అదేం చెప్పగలదు? నేను చెప్తున్నాను కదా! ఈ పెళ్ళి జరగదు. ఈ సంబంధం మాకు ఇష్టం లేదు,” శేషు గట్టిగా అన్నాడు. అతని మాటలకి మండిపడింది దుర్గమ్మ. ఆమె తన కోపాన్ని అదుపులో పెట్టుకో లేకపోయింది. రోషం పొడుచుకొస్తోంది.

“నేనూ చూస్తాను మీరు ఎలాంటి సంబంధం తెచ్చి పెళ్ళి చేస్తారో? ఏ సంబంధం చేసినా ఏు సుఖపడుతుందో?” దుర్గమ్మ శాపం పెడ్తున్నట్లు అంది. దుర్గమ్మ మాటలు శేషుకి పిచ్చి కోపాన్ని తెప్పిస్తున్నాయి. కోపాన్ని తట్టుకోలేకపోతున్నాడు.

“మీలాంటి వాళ్ళకి అందుతే జుత్తు. అందకపోతే కాళ్ళు. మీ స్వభావం తెలుసు కాబట్టే మేము ఈ సంబంధం వద్దనుకున్నది.”

కోపంతో బుసలు కొడ్తున్న దుర్గమ్మ “ఈ రోజుతో మీకూ మాకూ ఏ సంబంధం లేదు” అంటూ కొంగు విసురుగా గాలిలోకి దులిపి అక్కడి నుండి బయలుదేరింది. ఇదంతా రామ్మూర్తి, సుమతి చూస్తూ ఉండిపోయారే కాని ఏం మాట్లాడలేదు. దుర్గమ్మ వెళ్ళిన తరువాత తుఫాను వచ్చి వెళ్ళిన తరువాత వాతావరణం ఎలా ఉంటుందో అంత ప్రశాంతత చోటు చేసుకుంది.

అధ్యాయం 40

ప్రతీ ఒక్కరూ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండాలంటే కుటుంబ సభ్యుల మధ్య మానవ సంబంధాలు పటిష్టంగా ఉండాలి. ముఖ్యంగా ఇంట్లో దంపతుల మధ్య అనుకూల వాతావరణం ఉండాలి. అదే ప్రతికూలంగా ఉన్న పక్షంలో దాని ప్రభావం కటుంబసభ్యుల మీద పడుతుంది. ముఖ్యంగా పిల్లల మీద తల్లిదండ్రుల ప్రభావం పడుతుంది.

ఇంట్లో రామ్మూర్తి సుమతిల మధ్య ఉండవల్సిన మంచి దాంపత్య సంబంధం లేదు. దాని ప్రభావం పిల్లల మీదపడితే మొదట బాధపడేది నలిగిపోయేది పిల్లలే.

ఈ విషయం గురించే ఆలోచిస్తోంది శాంతి. తనకి జ్ఞానం వచ్చినప్పటి నుండి చూస్తోంది. తన తల్లిదండ్రులు ఇద్దరూ ఎప్పుడూ చిటపటలాడ్తూ ఉండటమో లేక ముభావంగా ఉండటమో తను చూస్తోంది. ఒక్కనాడు కూడా వాళ్ళిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకోవడం కాని, మనసారా నవ్వుకోడం కాని దంపతుల మధ్యనున్న ఆప్యాయతానురాగాలతో మెలగడం కానీ తను చూడలేదు.

మనిషి అన్న తరువాత భావోద్వేగాలు, రాగద్వేషాలు ఉండొచ్చు. అయితే అవి పరిమితిలో ఉండాలి. అతిక్రమిస్తేనే అనేక సమస్యలు.

తన తండ్రి విషయానికి వస్తే అతను సౌమ్యుడు. తన తల్లి ఎంత మానసికంగా అతన్ని కృంగదీస్తున్నా సహనం కోల్పోలేదు. తల్లితో అసంతృప్తే తండ్రిని ఇలా మనస్తాపానికి గురిచేస్తోంది అని తనకి అనిపించేది. ఒక్కొక్కసారి తల్లి ప్రవర్తనకి మనస్తాపానికి గురయి కళ్ళలో చిప్పలాడిన కన్నీళ్ళను తండ్రి ఎవరూ చూడకుండా చేతి రుమాలుతో తుడుచుకోవడం తను చూసింది.

నాన్నమ్మ ఎన్ని కష్టాలో అనుభవించిందట. ఇంట్లో తన తల్లి ప్రవర్తన కూడా నాన్నమ్మ యడల సవ్యంగా ఉండేది కాదు. భర్త చనిపోయిన తరువాత కొడుకును తీసుకుని పుట్టినింటికి వచ్చిన నాన్నమ్మని సరిగా చూసుకునేవారు కాదని తను వింది. తన తల్లి కూడా అంతే. నాన్నమ్మ ఎంతో సహనపరురాలట. అందుకే తన తండ్రి తనకి నాన్నమ్మ పేరు పెట్టారు. తన తండ్రి కూడా తల్లి లాగా బాగా సహనపరుడు.

తండ్రికి తనంటే ఎంతో ఇష్టం. సాధారణంగా ఆడపిల్లలకి తండ్రి మీద ఎక్కువ అభిమానం ఉంటుంది. మగపిల్లవాడికి తల్లి మీద అభిమానం ఉండేది. అయితే తన తండ్రి అన్నయ్యని, తనని ఎంతో ముద్దు చేసేవారు. అన్నయ్య కూడా తన తండ్రిని ఎంతో అభిమానించేవాడు. ఒక్క క్షణం కూడా అతడ్ని వదిలి ఉండేవాడు కాదు. ఆ తరువాత తరువాత అన్నయ్యలో ఏదో మార్పు. అది సరియైన మార్పు కాదు. తన తల్లి యొక్క విష భావాల ప్రభావం.

అన్నయ్య కూడా తండ్రిని కొన్ని కొన్ని విషయాల్లో మనస్తాపానికి గురి చేసేవాడు. ఈ మధ్యనే తన తప్పును తెలుసుకుని పశ్చత్తాప పడి తండ్రికి చేరువయ్యాడు. అది వేరే విషయం.

అయితే పిల్లలు విషయంలో పిల్లలకి ఇవతల నాన్న ప్రేమ కావాలి. అవతల అమ్మ ప్రేమ కావాలి. అమ్మ తన కుటుంబం కోసం పడే తాపత్రయం పిల్లల జీవితాన్ని ఆనందమయం చేస్తాయి. పిల్లల మనస్సు ఎరిగి మసలుతుంది అమ్మ. తను పస్తు పడుకున్నా పిల్లల ఆకల్ని తీరుస్తుంది అమ్మ. అందరూ తిన్న తరువాత మిగిలినది తిని తన కడుపు నింపుకుంటుంది. పిల్లలకి ఏ కష్టమొచ్చినా తల్లడిల్లిపోతుంది.

మరి నాన్నో? నాన్న తన పిల్లల భవిష్యత్తు గురించి ఆరాటపడ్తాడు. క్రొవ్వొతి తాను మండిపోతూ తన చుట్టూ ఎలా వెలుతురు విరజిమ్ముతుందో తండ్రి కూడా ఎంతో కష్టపడి డబ్బు సంపాదించి తన పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు చేస్తాడు. పిల్లల కష్టాల్లో అండగా ఉంటాడు. సుఖాల్లో పాలు పంచుకుంటాడు. తన పిల్లలకి జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులూ రాకుండా అండగా ఉంటాడు. ఇలా చెప్పుకుపోతే అమ్మా నాన్నల గురించి ఎంతో ఉంది.

అయితే దురదృష్టం ప్రేమానురాగాలు, ఆదరణ, గౌరవం లాంటివి పెద్దవాళ్ళ నుండి ఆశిస్తున్న వాళ్ళు వాటిని తాము కూడా పెద్ద వారికి ఇయ్యాలన్న జ్ఞానం నేటి మనుష్యుల్లో కనిపించటం లేదు.

ఇక సుందరం అంకుల్‌, సులోచనా ఆంటీ ఎప్పుడూ ఎంత సంతోషంగా ఉంటారు? వాళ్ళు తమ ఇంటికి వస్తే ఇంటి వాతావరణం మారిపోతుంది. సందడే సందడి. తన తల్లి కూడా రోజూ కన్నా భిన్నంగా వాళ్ళున్నాళ్ళూ ప్రవర్తిస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత తిరిగి పూర్వ వాతావరణమే. తన తండ్రికి, సుందరం అంకుల్‌ మధ్య ఎంత మంచి స్నేహం.

స్నేహం గురించి చెప్పు కొస్తే స్నేహానికి, హద్దులు పరిమితులు ఉండవు. స్నేహం ఓ ప్రవాహంలాంటిది. అనిర్వచనీయమైనది. త్యాగానికి మారుపేరు నిజమైన స్నేహం. త్యాగం, ప్రేమను కోరుకుంటుంది. అనురాగాన్ని కురిపిస్తుంది. సంతోషాన్ని కలిగిస్తుంది. తృప్తినిస్తుంది. అటువంటి నిజమైన జీవితంలో స్వార్థం ఉండదు.

తన తండ్రి ఇటువంటి అశాంతిమయ వాతావరణంలో తన జీవన యాత్ర సాగిస్తున్నా అంత నిబ్బరంగా ఉండడానికి సుందరం అంకులే కారణం. తన తండ్రిని ఓ స్నేహితుడిలా కాకుండా ఓ తండ్రిలా ఓదారుస్తాడు. తన తండ్రిలో ఆత్మస్థైర్యం నింపుతాడు. ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకునేందుకు తగిన సూచనలు సలహాలు ఇస్తాడు.

సులోచనా ఆంటీ చెప్పిన సూచనలు, సలహాలు తన తల్లికి నచ్చవు. ఈ చెవితో విని, ఆ చెవితో వదిలెస్తుంది. వాళ్ళు చెప్తున్నప్పుడు మాత్రం తలూపుతుంది. అయితే ఒక్క విషయం ప్రతీ మనిషికీ ఇష్టాలు, అయిష్టాలు ఉంటాయి ఊగిసలాటలుంటాయి. ఏ ఇద్దరి ఇష్టాలు ఒక్కటిగా ఉండవు అయినా అభిరుచుల్ని ఆలోచనల్ని వివరించడం అవసరం. మనం కోరుకున్నంత మాత్రాన్న ఇష్టాలు తీరవు. నిత్య జీవితంలో, ఒక కుటుంబలో ఒకరి ఇష్టం మరొకరికి కష్టమో నష్టమో కలిగించే విధంగా ఉంటుంది. ఆపోహలను, అపార్థాలను పెంచి తీరని మనస్తాపాన్ని గురి చేస్తుంది.

“అభిరుచులు, ఆలోచన్లు కలవకపోయినా రాజీపడి జీవించాలి దాంపత్య జీవితంలో” అని ఒకసారి క్లాసులో మనుష్యుల మానసిక సమస్యల గురించి చెప్తూ హిస్టరీ లెక్చరర్‌ సుమిత్రా మేడమ్‌ అన్నారు. నిట్టూర్పు విడుస్తూ అప్పుడే తనతో చదువుతున్న కొంతమంది మేడమ్‌ జీవితంలో కూడా ఏదో అసంతృప్తి ఉందన్నారు.

ఇప్పుడు తన తల్లిదండ్రుల జీవితం చూస్తుంటే వాళ్ళ జీవితాలు కూడా ఇలాగే ఉన్నాయి. అని తనకి అనిపించింది. ఇక బాల్యం రోజుల్ని ఓమారు నెమరు వేసుకుంటే ఆ రోజులు ఎంత బాగుండేవి?

సుందరం అంకుల్‌ కుటుంబంతో వచ్చినప్పుడు, తాము వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఎన్నెన్ని ఆటలు ఆడుకునేవారు. సుధాకర్‌కి తనంటే ఎంత ఇష్టం ఓ పర్యాయం తన కాలికి దెబ్బ తగిలి రక్తం కారుతుంటే సుధాకర్‌ ఎంత హైరాన పడిపోయాడు? తన అన్నయ్య తను పడిపోతే నవ్వాడు. కాని సుధాకర్‌ ఎంత బాధపడ్డాడు. దీన్ని బట్టి సుధాకర్‌కి చిన్నప్పటి నుండి తన మీద ఎంత ప్రేమ ఉంది? ఎంత ఆప్యాయత ఉంది? అది చిన్న వయస్సు కాబట్టి తను ఈ విషయం అర్థం చేసుకోలేకపోయింది.

సుకుమార్‌ విషయంలో వాద వివాదం జరుగుతున్నప్పుడు సుధాకర్‌ ప్రస్తావన వచ్చింది. అప్పటి నుండే తను సుధాకర్‌ గురించి ఆలోచిస్తోంది. సుకుమార్‌ అందగాడే అయితే అతడ్ని చూడగానే ఆకర్షణ భావం కలిగింది తనలో. అది ఆకర్షణే కాని నిజమైన ప్రేమ కాదు అని ఇప్పుడు తను అనుకుంటోంది.

ఈ వయస్సుల్లో స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ఉండడం సహజం. ఆకర్షణ తాత్కాలికం, ప్రేమానురాగాలు శాశ్వతం. ఈ మధ్య తన అన్నయ్య, తల్లి సుకుమార్‌ ఊరు వెళ్ళినప్పుడు బయట పడ్డ నిజాలు విని తను విస్తుపోయింది. అందమైన గులాభీ ముళ్ళ మధ్య ఉండి మనల్ని ఊరిస్తున్నట్లు సుకుమార్‌ అందమైన రూపం వెనుక ఇన్ని చెడు అలవాట్లు ఉన్నాయా అని తనకి అనిపించింది.

వయస్సుకి మించిన ఆలోచన్లు శాంతి మదినిండా పరుచుకుని ఉన్నాయి.

(ఇంకా ఉంది)

Exit mobile version