[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారి కలం నుంచి జాలువారిన ‘మలుపులు తిరిగిన జీవితాలు’ అనే నవలని సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. క్రిందటి వారం ఎపిసోడ్ ఇక్కడ చదవచ్చు.]
[సుమతిలో మార్పు వస్తుంది. అప్పటివరకు తాను భర్తతో ప్రవర్తించిన తీరు పట్ల ఆమెలో పశ్చాత్తాపం, అశాంతి చెలరేగుతాయి. మానసికంగా క్రుంగిపోతుంది. మీ జీవితం అశాంతిపాలు చేశాను అంటూ పదే పదే రామ్మూర్తితో అనేది. సుమతి పరిస్థితి చూసి భయపడిన రామ్మూర్తి – సుందరంతో మాట్లాడుతాడు. అతని సలహాపై దగ్గరలో ఉన్న ఒక నర్సింగ్ హోమ్‌కి తీసుకువెళ్తాడు సుమతిని. అది ఇందిర నర్సింగ్‍హోమ్. తమ వంతు వచ్చేసరికి లోపలికి వెళ్ళీ నమస్కారం అమ్మా అంటాడు రామ్మూర్తి. ఇందిర రామ్మూర్తిని చూసి నివ్వెరబోతుంది. ఆమెలో పాత సంగతులు చెలరేగి, కన్నీరుబకగా, పక్కగదిలోకి వెళ్తుంది. రామ్మూర్తి, సుమతి అక్కడున్న కుర్చీల్లో కూర్చుంటారు. తిరిగి వచ్చిన ఇందిర రామ్మూర్తిని పలకరించి తనను తాను పరిచయం చేసుకుంటుంది. రామ్మూర్తికి కూడా గతమంతా గుర్తొస్తుంది. తాను చిన్నప్పుడు ఇందూకి అన్నం తినిపించిన రోజులు జ్ఞాపకం వస్తాయి. స్కూలు చదువు ముగిసాకా, తన జీవితం ఎలా సాగిందో ఆయనకి చెప్తుంది ఇందిర. అన్నీ విని ఆమెను అభినందిస్తాడు రామ్మూర్తి. అప్పుడు తానొచ్చిన పని చెప్తాడు. సుమతిని పరీక్షించి, శారీరిక ఇబ్బందేమీ లేదని, మానసికంగా బాధపడుతోందని చెప్పి, తన మిత్రురాలు, సైకియాట్రిస్ట్ డా. కోమలిని కలవమంటుంది. మర్నాడే తీసుకువెళ్తానని చెప్తాడు రామ్మూర్తి. – ఇక చదవండి.]
అధ్యాయం 49
ఇందిర పంపించింది కాబట్టి సుమతి కేసును ఎంతో ముఖ్యమైన కేసుగా తీసుకుంది కోమలి. ఆమె మాటలు, నెమ్మదితనం, శాంత స్వభావం చూసి తప్పకుండా సుమతిలో మార్పు వస్తుంది అని అనుకున్నారు రామ్మూర్తి మాస్టారు.
ఏ పుట్టలో ఏ పాము ఉందో అని అనుకుంటారు. అలాగే ఎవరి వల్ల సుమతిలో మార్పు వస్తుందో అనుకుంటున్న రామ్మూర్తి మాష్టారికి కోమలి మీద నమ్మకం కుదిరింది.
కోమలి మానసిక రోగుల ఉండడానికి ఓ ఆశ్రమంలాంటిది ఏర్పాటు చేసింది. అక్కడే యోగా కేంద్రం ఉంది. ధ్యాన మందిరం ఉంది. సూర్య నమస్కారాలు, ఆసనాలు వేయిస్తారు. ఆశ్రమంలో వివిధ రకాల పూల మొక్కలు పచ్చని చెట్ల మధ్య ఆ ఆశ్రమం ప్రకృతి సౌందర్యాలన్నీ అక్కడే ఉన్నాయా అని అనిపిస్తుంది. వచ్చిన వాళ్ళకి పది రోజుల వైద్యం చేస్తారు అక్కడ.
సుమతి ఆరోగ్యం వచ్చినప్పటి నుండి కొంచెం మెరుగుపడ్డం గమనించింది కోమలి. కోమలి ఎలా చెప్తే అలా చేస్తోంది సుమతి. కోమలి సుతిమెత్తని మాటలు సుమతికి అమృత గుళికల్లా అనిపిస్తున్నాయి. అయితే అప్పుడప్పుడు రాత్రి సమయంలో ‘జీవితంలో చేయరాని తప్పు పని చేసాను, మూర్ఖంగా ప్రవర్తించి అతని జీవితం నాశనం చేసాను. శాంతి లేకుండా’ ఇలా పలవరింతలు సుమతివి.
వీటిని విన్న కోమలి ఆవిడ పరిస్థితిని అర్థం చేసుకుంటోంది. రామ్మూర్తి మాస్టారు రోజూ ఏదో సయమంలో అక్కడకి వస్తారు. ప్రోగ్రెస్ తెలుసుకుంటారు. శాంతి, శేషు కూడా వస్తూ తల్లి పరిస్థితి అడిగి తెలుసుకుంటున్నారు.
“కోమలీ! అమ్మగారి పరిస్థితి ఎలా ఉంది?” ఇందిర అడిగింది కోమలిని. ఆవిడ పరిస్థితి వివరించింది కోమలి. “ఎందుకో ఆవిడ ఏదో విషయం గురించి బాధపడుతోంది. అది తొలగిపోతే ఆవిడ మానసిక పరిస్థితి మెరుగు పడినట్లే!” అంది కోమలి.
“ఈ విషయం గురించి మాష్టారితో నేను చర్చిస్తాను,” ఇందిర అంది.
ఇందిర ఆలోచిస్తోంది. మాష్టారి దాంపత్య జీవితంలో ఏదో తెలియని అపశృతి ఉంది. ఒక్కొక్క పర్యాయం అతను దేనికోసమో మథనపడుతున్నారని తనకి అనిపించేది. అంత బాధపడుతూనే అతను తన చిన్నతనంలో తనని ఓదార్చేవారు. క్రొవ్వొతి మండిపోతూ తనకి బాధ కలుగుతున్నా వెలుతుర్ని నలువేపులా విరజిమ్ముతుంది.
అలాగే మాస్టారు తను బాధపడుతూ ఎదుటి వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. ఎదుటి వాళ్ళను ఓదారుస్తున్నారు. ఊరట కలిగిస్తున్నారు. అతడ్ని అడిగితే బాధపడతారేటో తిరిగి ఇందిరలో సంకోచం.
‘కొంతమంది ఆత్మాభిమానం గల మనష్యులుంటారు. వాళ్ళు కుటుంబ గౌరవాన్ని ఎక్కువ అభిమానిస్తారు ఇంటి గుట్టు రట్టు చేసుకోరు. వాళ్ళ ఆలోచన ప్రకారం ఇంటి గుట్టు భద్రంగా ఉంటేనే పరువు ప్రతిష్ఠలు, కుటుంబ గౌరవం సమాజంలో పదిలంగా ఉంటాయి. కాలు జారితే వెనక్కి తీసుకోగలం కాని నోరు జారుతే వెనక్కి తీసుకోలేము. విలువలకి ప్రధాన్యత ఇవ్వాలి.
ఎలాంటి పొరపొచ్చాలున్నా నాలుగు గోడల మధ్యనే ఉండాలి. గడపదాట కూడదు. పెదవి దాటి బయటకు రాకూడదు. పొరుగు వాడికి కూడా వినిపించకూడదు. కాని నేటి సమాజంలో జరుగుతున్నదేంటి? సంసారాలను బట్టబయలు చేసుకుని నలుగురు నోళ్ళలోనూ నానుతున్నారు.
భార్యాభర్తల మధ్య జరుగుతున్న కలహాలు అద్దం మీద ఆవ గింజలాంటివి అన్న సామెతకు అర్థం లేకుండా పోయింది. కోర్టులకు ఎక్కి విడాకులు వరకూ వస్తున్నాయి. గుప్పిట మూసి ఉంచినంత వరకే గుట్టు. గుప్పిట తెరిస్తే అంతా బట్టబయలే. అంతా బహిరంగమే.
కుటుంబ వ్యవహారాలు వీధి పోరాటల స్థాయికి దిగజారిపోయి ఆందోళన కలిగించే స్థాయికి దిగజారిపోయాయి. మనిషి విలువ, గౌరవం, ఆత్మాభిమానం, సామాజిక కట్టుబాట్లు మటుమాయమయ్యాయి. వాటి స్థానంలో విచ్చలవిడితనం, అసభ్యత, మితిమీరిన స్వేచ్ఛ, మొండి వైఖరి చోటు చేసుకుని గుట్టుగా బ్రతకవల్సిన మనుష్యులు రోడ్డు మీద పడుతున్నారు. వ్యక్తిగత విషయాలు రెండో వ్యక్తికి తెలియకుండా ఎలా దాచుకోవాలో జాగ్రత్తపడుతున్నారు కొందరు. అప్పుడే గౌరవంతో పాటు భద్రత సాధ్యం. సుఖశాంతులు లభిస్తాయి. గుట్టురట్టు చేయాలని చూస్తే అది స్వయం కృపారార్ధమే,’ ఇందిర ఆలోచనలు ఇలా సాగుతున్నాయి.
“ఇందూ! దేని గురించో ఆలోచిస్తూ ఉన్నట్టుంది?”
“మీ గురించే మాష్టారూ!”
“నా గురించా?”
“అవును. మీ గుండెల్లో విషం ఉంచుకుని పైకి ఎలా అమృతాన్ని చిందిస్తున్నారో తెలియటం లేదు. అదే మీ హృదయంలో అంత ఆవేదన బాధ దాచుకుని పైకి అంత శాంతంగా ఔదార్యంగా ఉంటున్నారు. మీరు మీకు మీరే సాటి.”
“ఏంటి ఇందూ నీవంటున్నది.”
ఇందిర రామ్మూర్తి మాష్టగారికి కోమలి చెప్పిన మాటలు సుమతి పలవరింతలు గురించి చెప్పింది విన్న తరువాత మాస్టారి ముఖం పాలిపోయింది.
“మాష్టారూ! మీ ఆవేదనా బాధా నిన్నటి మొన్నటిది కాదు. అనేక సంవత్సరాల నుండి మీ గుండెల్లో గూడు కట్టుకుపోయి ఘనీభూతమై ఉండిపోయింది అది. మనకి ఆత్మీయులనుకున్న వాళ్ళకి ఆ ఆవేదన చెప్పుకుంటే మనసులో బాధకి ఉపశమనం కలుగుతుంది. మీరు మీ మనసులో బాధను దాచుకుని చిన్నతనంలో నన్ను ఓదార్చారు. ఇన్ని సంవత్సరాలుయినా ఆ బాధను అలాగే గుండెల్లో దాచుకున్నారు. నాకు అనుమానం వచ్చినా అడగలేకపోయాను. ఇవాళ అమ్మగారి పలవరింతల వల్ల ఊహించగలిగాను. నేను మీ కన్న కూతుర్ని కాకపోయినా కూతురులాంటిదాన్ని అనుకుని మీ బాధను నాకు చెప్పి మనస్సు తేలికపరచుకోండి ప్లీజ్..! కాదనకండి.”
ఇందిర మాటలతో అన్ని సంవత్సరాల నుండి మనస్సులో ఘనీభూతమైన ఆవేదన బాధ ఒక్కసారి తన్నుకొచ్చాయి. మరి దాచుకోవడం అతనికి సాధ్యం కాలేదు. తను మామయ్య ఇంటికి తండ్రి చనిపోయిన తరువాత వచ్చినప్పటి నుండి బాల్యంలో తను అనుభవించిన నరకయాతన సుమతిని తనకి ఇష్టం లేకపోయినా తల్లి కోరికపై పెళ్ళి చేసుకోవడం, సుమతి వల్ల దాంపత్య జీవతంలో తాను అనుభవించిన అవమానాలు, తిరస్కారాలు. బాల్యంలో తనని ఎంతో అభిమానించిన శేషు పెద్దయ్యాక అతని ప్రవర్తన, ఆ తరువాత అతను మారిన విధానం. ఆ తరువాత శాంతి పెళ్ళి విషయంలో సుమతి తన తప్పు తెలుసుకుని పశ్చత్తాపం పడ్డం. తన దు:ఖాన్ని సుందరం ఓదారుస్తూ ఎలా దూర చేసేవాడో అన్ని విషయాలు చెప్తున్న రామ్మూర్తి మాస్టారి గొంతుక చివర్లో దుఃఖంతో పూడుకుపోయింది. మరి చెప్పలేక పైకుబికి వస్తున్న కన్నీటిని చేతి రూమాలుతో తుడుచుకున్నారు.
ఇందిర కళ్ళల్లో కూడా కన్నీరు వచ్చింది. “ఇంత ఆవేదనని ఇన్నాళ్ళూ ఎలా దాచుకున్నారు మాస్టారూ!” భావోద్వేగంతో అంది ఇందిర.
“జీవితంలో నీకు జరిగిన అన్యాయాన్ని మరిచిపోవడానికి ప్రయత్నిస్తూ, మరచిపోలేక బాధను మనసులోనే దాచుకుని నీవు ఉండలేదా ఇందూ!” అన్నారు మాస్టారు నవ్వుతూ.
“మీరు చెప్పింది నిజమే!” ఇందిన అంది.
ఇద్దరూ ఒకరి బాధలు మరొకరు చెప్పుకున్నందుకు ఇద్దరి హృదయాలూ తేలికపడ్డాయి.
అధ్యాయం 50
ఇందిరకి తెల్సింది శేషు మాష్టారి అబ్బాయని. తృప్తిగా శ్వాస విడిచింది. ఇన్నాళ్ళూ ఎంతో భయపడింది. సింధు ప్రేమించిన వాడు ఎవడో? ఎలాంటి వాడో మంచి వాడయితే పరవాలేదు కాని లేకపోతే సుమిత్ర మోసపోయినట్టు, సింధూ కూడా మోసపోతుంది అని భయపడింది. ఇప్పుడు నిశ్చింత.
“నేను బ్యాంకుకి వెళ్తున్నానమ్మా!” సింధు అంది.
“సాయంత్రం శేషుని మనింటికి తీసుకురా, మాట్లాడాలి.”
“అలాగే” అని అంది సింధు. కాని ఆమె మనసులో అనేక సందేహాలు. అమ్మ శేషుతో ఏు మాట్లాడుతుంది? శేషు వస్తాడా? అని.
“ఏుటి ఆలోచిస్తున్నావు సింధూ! నీ సందేహాలకు స్వస్తి పలికి నేను చెప్పింది చెయ్యి.”
“అలాగే అమ్మా” అంటూ సింధు బ్యాంకుకి బయలుదేరింది. ఇందిర క్లినిక్‌కి వెళ్ళడానికి తయారవుతోంది.
***
“శేషూ! ఈ రోజు సాయంత్రం మీరు మా ఇంటికి రావాలి. అమ్మ మీతో మాట్లాడుతుందట,” సింధూ అంది శేషుతో.
“నాతోనా? ఏం మాట్లాడుతారు?” కంగారుగా అన్నాడు శేషు. అతని శరీరం అంత ఏ.సి. రూమ్‌లో కూడా చెమట్లు పడుతోంది.
“ఏమో నాకేం తెలుసు?” ముసి ముసి నవ్వులు నవ్వుతూ అంది సింధు.
ఈ మధ్యనే డాక్టరు ఇందిరా దేవి ఒకప్పుడు తన స్టూడెంట్ అని, ఆమెతో తనకున్న అనుబంధం అన్ని విషయాలు శేషుకి చెప్పాడు తన తండ్రి.
“ఈవిడికి నేను మాస్టారు అబ్బాయినని తెలిసిపోయి ఉంటుంది. ఎలా తనని రీసివ్ చేసుకుంటోందో లేకపోతే సింధుని తను పార్కుల వెంట తిప్పుతున్నందుకు క్లాసు పీకుతుందో? ఏదైతేనేం వెళ్ళక తప్పదు. లేకపోతే తను చేసిన నిర్వాకం తండ్రికి తెలిసిపోతుంది,” ఇలా ఆలోచిస్తున్నాడు శేషు.
“ఓకే యేనా?”
“ఏు చేస్తాం రోట్లో తలపెట్టి రోకటి పోటు ఎలా ఉంటుందో అని జడిసిపోకూడదు కదా!”
సాయంత్రం బ్యాంకు అయిన తరువాత సింధూ, శేషూ ఇద్దరూ ఇందిరా దేవి ఇంటికి బయలుదేరారు. ఆ రోజు సాయంత్రం ఇందిరా దేవి క్లినిక్‌కి వెళ్ళలేదు. ఇంట్లోనే ఉండిపోయింది. ముఖ్యంగా సింధు శేషుని తీసుకు వస్తుందని ఆమెకి తెలుసు.
ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? ప్రస్తావన ఎలా తీసుకురావాలి అని ఇవతల ఇందిరా దేవి ఆలోచిస్తూ ఉంటే అవతల శేషు ‘ఆవిడ ఏం అడుగుతుంది? ఎలా సమాధానాలు ఇవ్వాలి? కంగారు పడకూడదు. నిజం నిర్భయంగా చెప్పాలి. తను సింధుని త్రికరణ శుద్ధిగా ప్రేమిస్తున్నాను. అంగీకరిస్తే పెళ్ళి చేసుకుంటాను అని చెప్పాలి,’ అని ఆలోచిస్తున్నాడు.
ఇంటికి వెళ్ళేటప్పటికి ఇందిరా దేవి సోఫాలో కూర్చుంది. ఆమెకి ఎదురుగా సింధూ, శేషు కూర్చున్నారు. ఓ పరీక్షాధికారి దగ్గర అతను వేసే ప్రశ్నలకి తికమక పడుతూ జవాబు చెప్పే విద్యార్థిలా శేషు ఇందిరా దేవి ఎదురుగుండా కూర్చుని ఉన్నాడు. సింధూని టీ, బిస్కట్లు తెమ్మనమని పురమాయించింది ఇందిరా దేవి. సింధు లోనికి వెళ్ళింది.
“ఎందుకలా కంగారు పడుతున్నావు? రిలాక్సు.. రిలాక్సు” అంది ఇందిరా దేవి. చిన్నగా నవ్వి సర్దుకుని కూర్చున్నాడు శేషు.
“మీ నాన్నగారి స్టూడెంట్‌ని నేను,” అంది మాట్లాడ్డం మొదలు పెట్టి.
“తెలిసింది.”
“మాస్టారు చాలా మంచివారు. చాలా ఉత్తములు. మానవత్వానికి మారుపేరు మాస్టారు. అన్ని మంచి గుణాలు అతనిలో ఉన్నాయి.”
‘అంత మంచి మాష్టారికి అమ్మాయిల్ని పార్కుల వెంట తిప్పే కొడుకుగా ఎలా పుట్టావురా త్రాష్టుడా!’ అని అంటుందేమో ఆవిడ అని భయపడ్డాడు శేషు.
“వింటున్నావా?”
“వింటున్నాను. చెప్పండి ఆంటీ!”
“ఆంటీ కాదు. అక్కా అని పిలు. నేను మాస్టారు గారికి కూతురులాంటి దాన్ని. నేను నీకు పెద్దక్కను,” అంది. ఆవిడ మాటలు వింటూ అలా కూర్చున్నాడు శేషు. ఇంతలో సింధూ అందరికీ టీ, బిస్కట్లు ఇచ్చింది.
టీ త్రాగుతూ ఇందిరా దేవి – “సింధు నా కన్న కూతురు కాదు. పెంచుకున్న కూతురు. తెలుసా?” అడిగింది.
“ఈ మధ్యనే తెలిసింది.”
“మీరిద్దరూ ఒకర్ని మరొకరు ఇష్టపడ్డారు. పెళ్ళి చేసుకుందామనుకుంటున్నారు. అలాంటప్పుడు సింధూ తల్లి గురించి, నా గురించి తెలుసుకోవాలి. మా జీవితాల్లో ఏు దాపరికం లేదు. మా జీవితం తెరచిన పుస్తకం,” అంది ఇందిరా దేవి.
“నేను సింధుని ఇష్టపడ్డాను. పెళ్ళి చేసుకుందామనుకుంటున్నాను. మిగతా వేటితోనూ సంబంధం లేదు,” నిదానంగా అన్నాడు శేషు.
“నిజమే! ఇప్పుడు నీకు అవసరం లేకపోవచ్చు. ముందు ముందు ప్రేమ వేడి తగ్గిన తరువాత మీ అమ్మ ఇలాగ, అలాగ అన్న వాళ్ళు ఎంతమంది లేరు. అందుకే ముందే చెప్తున్నాను. నీ ఉద్దేశం తెలిసిన తరువాత మీ నాన్నగారితో మాట్లాడుతాను,” అన్న ఇందిరా దేవి సుమిత్ర జీవితం గురించి, తన జీవితంలో జరిగిన చేదు అనుభవాల గురించి చెప్పింది. శేషు సావదానంగా విన్నాడు.
‘ఈవిడ జీవితం ఇంత విషాదంగా ముగిసిందా?’ అనుకుంటున్నాడు మనసులో.
“నీవు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. ఈవిడ జీవితం ఇంత విషాదమా? అనుకున్నావు కదూ.” అంది ఇందిరా దేవి. మళ్ళీ ఆమే మాట్లాడుతూ, “శేషూ! ఈ రోజులో ప్రేమించుకుంటున్నాము అంటున్నారు. ఆడ మగా చెట్టాపట్టా లేసుకుని తిరుగుతున్నారు. అది ఆకర్షణో తెలియదు. ప్రేమో తెలియదు. ఈ ప్రేమ ముసుగులో పెళ్ళికి ముందరే ఎందరో ఆడపిల్లలు తమ సర్వస్వం అర్పించుకుని మోసపోతున్నారు. అన్ని సంవత్సరాలు ఎంతో స్నేహంగా తిరిగాము నవీన్, నేను, పెళ్ళి చేసుకుందామనుకునే సరికి ఎలా మోసం చేశాడో విన్నావు కదా! అందుకే సింధు గురించి నా బాధంతా.” అంది.
“మా ప్రేమ అలాంటిది కాదు.”
“నీవు అలా అనవచ్చు. ఆడ మగ కల్సి పెళ్ళి కాకుండా తిరుగుతే కొన్ని కుటుంబాల్లో హర్షించవచ్చు. సమ్మతించవచ్చు కాని అలా హర్షించలేను నేను. ఎందుకంటే నాకు ఎదురయిన చేదు అనుభవం బట్టి ఇలా ఉంటుంది నా భావజాలం. ఆ రోజు సింధూ, నీవూ పార్కులో కలుసుకోవడం నేను చూసాను. అయితే ఆడా మగ కలిసి తిరిగి ఆ తరువాత ప్రేమ పెళ్ళి వరకూ రాకపోతే ఆడదాన్ని నిందించినట్లు మగవాడ్ని నిందించలేరు. నష్టపోయేది, నింద పడేది ఆడదే. అందుకే ఆనాడు సింధుని హెచ్చరించాను.”
“తెలుసు,” అన్నాడు శేషు.
“నేను మీ నాన్న గారితో మాట్లాడి మీ ప్రేమ సుఖాంతం అయ్యేటట్లు చూస్తాను,” ఇందిర అంది. మౌనంగా విన్నాడు శేషు. అక్కడ నుండి బయటపడ్డాక రీలిఫ్‌గా శ్వాస తీసుకున్నాడు.
అధ్యాయం 51
కోమలి మానసిక చికిత్సా ఆశ్రమంలో పది రోజుల నుండి చికిత్స తీసుకుంటున్న సుమతి ఇప్పుడు మానసికంగా ఆరోగ్యవంతురాలయింది. ఆమెలో ఉన్న నూన్యతా భావం తొలగిపోయింది.
“ఎన్నో విధాలా మీ మనస్సు కష్టపెట్టాను నన్ను క్షమించండి,” అంది రామ్మూర్తితో.
“జీవితంలో అందరూ తెలిసో, తెలియకో తప్పులు చేస్తూ ఉంటారు. ఒకరి తప్పుల్ని మరొకరు క్షమించుకుంటేనే జీవితం సాఫీగా సాగుతుంది,” రామ్మూర్తి సుమతితో అన్నాడు. సుమతి ఆరోగ్యం సరిగా లేదని చూడ్డానికి సుందరం, సులోచన, సుధాకర్ వచ్చారు.
అందరూ కలుసుకోవడం అపార్థాలు తొలగిపోవడం అందరికీ ఆనందం కలిగిస్తోంది. ముఖ్యంగా ఇందిరకు మిక్కిలి ఆనందం కలిగిస్తోంది. ఆ సందర్భంలో గెట్ టు గెదర్ పార్టీ ఏర్పాటు చేసింది ఇందిర. ముందుగా రామ్మూర్తి మాష్టారితో శేషు, సింధూ ప్రేమించుకున్న విషయం చెప్పి, వాళ్ళిద్దరికి పెళ్ళి చేయాలన్న విషయం కూడా అతనితో చర్చించింది.
“నీ ఇష్ట ప్రకారమే కానీ ఇందూ!” అన్నారాయన.
ఆ విషయం కూడా పార్టీలో ఎనౌన్సు చేయాలనుకుంది ఇందిర. పార్టీ జరగవల్సిన రోజు రానే వచ్చింది. అంతకు మునుపే సుందరం కుటుంబాన్ని పరిచయం చేశారు రామ్మూర్తి మాస్టారు ఇందిరకి. అంతేకాదు సుధాకర్‌కి శాంతికి పెళ్ళి జరిపిస్తే బాగుంటుందని కూడా తన అభిప్రాయం తెలియ చేశారు ఇందిరకి.
పార్టీ రోజు ఎంతో సందడి. అందరి మనస్సులు ఆహ్లాదకరం. పండుగ వాతావరణం. కోమలిని కూడా ఆహ్వానించింది ఇందిర. రామ్మూర్తి మాస్టారు నిదానంగా కూర్చుని ఒక్కొక్కరి జీవితాన్ని విశ్లేషించుకుంటూన్నారు. తన జీవితంలో అంతా సుఖం కంటే కష్టాలు సమస్యల్తోనే జరిగిపోయింది. సుందరం జీవితం, సులోచన జీవితం మారుటి తండ్రి, మారుటి తల్లి బాధల్తోనే తీరింది. సుమతి మొదట అహంభావిగా, ఆ తరువాత మూర్ఖురాలిగా, అసంతృప్తిగా జీవితం గడిపి చివరకు తన తప్పు తాను తెలుసుకుని పశ్చత్తాపం పడి క్షమాపణ కోరింది తనని.
మొదట తనని అమితంగా ప్రేమించిన శేషు ఆ తరువాత తల్లి భావాల్ని వొంటబట్టించుకుని కౌమార వయస్సులో తనని ద్వేషించాడు. కరుకు, కఠిన మాటల్తో తన మనస్సుకి బాధ కలిగించాడు.
ఆ తరువాత తన తప్పు తాను తెలుసుకుని సాఫ్ట్‌గా మారి తనని క్షమాపణ కోరాడు. శాంతి విషయానికి వస్తే సుమతిని తనకీ మధ్య సరియైన మంచి సంబంధాలు లేవని కుమిలి పోయింది. శాంతికి ఇద్దరూ కావాలి. ఇద్దరూ సుఖంగా ఉండాలని అనుకునేది శాంతి. ఇక సుధాకర్ విషయానికి వస్తే తల్లిదుడ్రుల్ని ప్రేమించి అభిమానించే మంచి కొడుకుగా పేరు తెచ్చుకున్నాడు.
ఇక సింధు తల్లి లేని పిల్లగా అనాథ ఆశ్రమంలో గడిపి, ఆ తరువాత ఇందూ దగ్గర మాతృ ప్రేమను పొందగలిగింది. ఇందూ విషయమే తనకి ఎంతో బాధ కలిగిస్తోంది. చిన్నతనంలో ప్రేమరాహిత్య జీవితమే. పెద్దాయ్యాక ప్రేమరాహిత్య జీవితమే. జీవితంలో లభించవల్సిన లభించలేదు ఇందిరకి ఉన్న తండ్రి ప్రేమ లభించలేదు. తల్లి మరణంతో తల్లి ప్రేమ కూడా లభించలేదు.
తను విన్న దాన్ని బట్టి సుమిత్ర జీవితం కూడా విషాదకరంగా ముగిసిపోయింది. మనుష్యులందరూ విధి చేతిలో వింత బొమ్మలు. ఆ బొమ్మల చేత విధి వింత వింత విన్యాసాలు చేయిస్తుంది.
“ఈ సంతోష సమయంలో కూడా మీరు ఇలా గతం గురించి తలుచుకోవడం నాకు నచ్చలేదు. గతం తాలూకా చేదు జ్ఞాపకాలికి తాళం వేసి వర్తమానంలో బ్రతుకుదాం. ఆస్వాదిద్దాం”ఇందిర రామ్మూర్తి మాస్టారుతో అంది. “అందరం తాత్కాలికంగానేనా చేదు అనుభవాల్ని మరిచిపోయి సంతోష వాతావరణాన్ని ఆస్వాదిద్దాం. ఇది నా మనవి” తిరిగి ఇందిర అందరితో అంది. అందరూ ఆమోదించారు.
ఆ తరువాత వివిధ వినోద కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. పాటలు పాడిన వాళ్ళు పాటలు పాడారు. డాన్సులు వేసిన వాళ్ళు డాన్సులు చేసారు. ఆ తరువాత జోక్‌లు, మిమిక్రీలు ఇలా సందడి సందడిగా పార్టీలో సమయం గడిచిపోయింది. ఇంతలో భోజనాల సమయం అయింది.
“ఇక భోజనాలకి సమయం అయింది. భోజనాలు అయిన తరువాత మీకు ముఖ్యమైన ఎనౌన్సుమెంటు ఉంటుంది,” అని అందర్నీ ఊరించింది ఇందిర. అది ఏంటా అని అందరిలో కుతూహలం.
అందరూ భోజనాలు చేసారు. కొంతసేపు విశ్రాంతి కూడా తీసుకున్నారు. తిరిగి అందరూ ఒక దగ్గరికి చేరుకున్నారు. తిరిగి సందడి ఆరంభం. ఎనౌన్సుమెంటు కోసం ఎదురు చూపు.
“నా ఎనౌన్సుమెంటు మీకు ఆనందాన్ని కలిగించేదే. త్వరలోనే సింధుకి, శేషుకి, శాంతికి సుధాకర్‌కి పెళ్ళిళ్ళు జరగబోతున్నాయి.”
ఈ మాట వినగానే అందరూ ఒక్కసారి విస్తుపోయారు. వెంటనే అందరి ముఖాల్లో ఆనందం.
“నాకూ శాంతికి వివాహం జరగదు,” సుధాకర్ అన్నాడు.
“ఎందుకని?” శేషు ప్రశ్న.
“నేను కులం గోత్రం లేనివాడ్ని,” అన్నాడు. ఆ మాటలకి సుమతి బాధగా ముఖం పెట్టింది. “సుధా! ఇప్పటికే సిగ్గుతో, పశ్చత్తాపంతో బాధపడుతున్నాను. నన్ను మరింత బాధపెట్టద్దు,” అన్నది సుమతి.
“తప్పకుండా శాంతిని నా కోడలిగా చేసుకుంటాను,” అని సుందరం మాట ఇవ్వగానే వాతావరణం సుఖాంతమయింది. పూర్వ స్థితికి వచ్చింది.
“మనిషి జీవితం నదీ ప్రవాహంలాంటిది. నది చిన్న పాయిగా కొండల్లో పుట్టి మైదాన ప్రదేశంలో ప్రవేశించి విశాలమైన ప్రవాహంగా మారి అనేక మలుపులు తిరిగి తిరిగి చివరికి సాగరంలో కలిసిపోతుంది. అలాగే మనిషి జీవితం కూడా అనేక మలుపులు. వాటిని అధిగమించి అధిగమించి..!”
“ఆఁ అధిగమించి అధిగమించి ఎక్కడ కలుస్తుంది ఆంటీ? ఆఁ తప్పు తప్పు అక్కయ్యా!” అన్నాడు శేషు కొంటెగా. అతని మాటలకి ఇందిర కూడా నవ్వింది. “చివరకు సుఖ సాగరంలో కలుస్తుంది తమ్ముడూ!” అంది ఇందిర. అందరూ మనస్పూర్తిగా నవ్వుకున్నారు.
“ఇందూ! నువ్వు ఎంత మంచిదానివి? చివరికి మనిద్దరం వియ్యపురాళ్ళమయ్యామన్న మాట,” అంది సుమతి ఆప్యాయతగా ఇందు భుజం మీద చెయ్యి వేసి.
“లేదు అమ్మా! నీ కూతురుగా ఉండటమే నాకు ఇష్టం. ఇలాగయినా తల్లి ప్రేమ లభించిదన్న తృప్తి నాకు ఉంటుంది” అంది ఇందిర. సుమతి హృదయం మీద తల ఉంచి. ఆమె తలను ఆప్యాయతగా నిమిరింది సుమతి.
(సమాప్తం)
విజయనగరం వాస్తవ్యులైన శ్రీ గూడూరు గోపాలకృష్ణమూర్తి హిందీ ఉపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. వారు రాసిన కథలు వివిధ వార్తపత్రికల్లో ప్రచురితమయ్యాయి. కొన్ని కథలు సంకలనంగా వెలువడ్డాయి.
