[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారి కలం నుంచి జాలువారిన ‘మలుపులు తిరిగిన జీవితాలు’ అనే నవలని సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]
[తమ శక్తికి మించి పరుగులు పెట్టకూడదనుకున్న భుజంగరావూ, రామ్మూర్తీ అప్పు చేయకుండా చాలా క్లుప్తంగా శాంతమ్మ శ్రాద్ధకర్మ జరిపిస్తారు. గ్రామస్థులు రకరకాలుగా అనుకుంటారు. ఎవరి విమర్శలు పట్టించుకోడు రామ్మూర్తి. ఆ రోజు నుండి తాను ఏకాకిననీ, అందరూ ఉన్నా ఎవరూ లేనట్టే అని అనుకుంటాడు. ఆ సాయంత్రం గోదారి ఒడ్డున కూర్చుని ఉండగా జేబులో తల్లి వ్రాసిన ఉత్తరం తగులుతుంది. ఆ ఉత్తరం బయటకు తీసి చదువుతాడు. రామ్మూర్తి జీవితం పాడయిపోడానికి తానే కారణమని తల్లి భావించింది. సుమతి ప్రవర్తనని సహనంతో భరించమని సూచిస్తుంది. అతని జీవితం బాగుండాలని భగవంతుని కోరుకుంటూ ఉత్తరాన్ని ముగుస్తుందామె. చదవడం పూర్తాయ్యాకా, చదువుకుని మరింత దుఃఖానికి లోనవుతాడు. ఇంట్లో సుమతి ఓ రకంగా, మావయ్య ఓ రకంగా ఉండడం చూసి, డీలా పడవద్దని మావయ్యకి నచ్చజెప్తాడు రామ్మూర్తి. కొడుకు దేశాలు పట్టిపోయాడనీ, కూతురు చూస్తే ఇలాగయిపోయిందని బాధపడతాడు భుజంగరావు. స్కూళ్ళు తెరిచే సమయమాసన్నమైంది. మర్నాడే రామ్మూర్తి ప్రయాణం. – ఇక చదవండి.]
అధ్యాయం 15
పరీక్షలయిపోయాయి. వేసవి సెలవులు ఇచ్చారు. రామూర్తి తన గ్రామానికి వచ్చాడు. సుందరం దంపతుల కోసం ఎదురు చూస్తున్నాడు. “మేము ఇద్దరం మీ గ్రామానికి వస్తున్నాం. ఇది మాకు హనీమూన్ ట్రిప్, అలాగే మీ దంపతులిద్దరూ మా ఊరు రావాలి. అది మీకు హనీమూన్” సుందరం నవ్వుతూ చెప్పాడు.
దుమ్ము రేపుతూ బస్సు రావడం. సుందరం దంపతులు రావడం ఒక్కసారే జరిగిపోయాయి. సుందరం తన భార్యని రామూర్తికి పరిచయం చేశాడు. “ఈవిడేరా నా లైఫ్ పార్టనర్ సులోచన” అన్నాడు సుందరం. తిరిగి “వీడు నాకున్న మంచి స్నేహితుడు,” అని రామూర్తిని పరిచయం చేశాడు సులోచనకు. ఇలా పరిచయాలు పూర్తయ్యాక ఇంటికి వెళ్లారు.
“నా పేరు సులోచన. మీవారి స్నేహితుడు సుందరం గారి భార్యని” సులోచన సుమతి భుజంపై ఆప్యాయతగా చేతులు వేసి అంది. సుమతి కూడా చిన్నగా నవ్వుతూ ఆప్యాయతగా ఆమె చేయి మీద చేయి వేసింది. ‘ఈవిడ పేరుకు తగ్గట్టు ఎంత ఆప్యాయత ఉంది ఈమెలో’ అనుకుంది.
“మీరు ఏం అనుకుంటున్నారో నాకు తెలుసు.”
విస్తుపోయింది సుమతి సులోచన మాటలకి.
“ఇదేంటి ఈ అమ్మాయితో అంతకు మునుపు ఎలాంటి పరిచయమే లేదు. ఇంత చనువుగా ఎలా మాట్లాడుతోంది, అని అనుకుంటున్నారు కదూ!”
సులోచన మాటలకి సుమతి ఏు మాట్లాడకుండా మౌనం వహించింది.
“సుందరం గారు, నేనూ పుట్టిన వాతావరణం తెలియక పోయినా పెరిగిన వాతావరణం అటువంటిది. ప్రేమ సమాజంలో ఎవరు ఎక్కడ పుట్టినా చేరింది అక్కడే కాబట్టి అందరూ కలిసిపోతాం ఇట్టే. అందరి కష్టాలు మావే, సుఖాలూ మావే. అందరి బాధలు మావే. అందరి భావోద్వేగాలూ మావే. అన్నింటిని అందరూ సమంగా పంచుకుంటాం,” సులోచన అంది.
“మిమ్మల్ని చూస్తుంటే తెలుస్తోంది. మీ అంత నేను చదువుకున్న దాన్ని కాకపోయినా మీ మనోభావాలు నాకు అర్ధమవుతున్నాయి.”
“మన వ్యవహార శైలికి చదువుకీ ఏు సంబంధం లేదు. ముఖ్యంగా మనం పెరిగిన వాతావరణమే ప్రధానం. చదువుకున్న వాళ్ళలో అహంభావులు ఉన్నారు. వినమ్రతతో మెలిగిన వారూ ఉన్నారు,” అంది సులోచన.
సుమతికి సులోచన వ్యక్తిత్వం నచ్చింది. ఆమె మాట తీరు నచ్చింది. ఆమె ప్రవర్తన నచ్చింది. ఆమె నడవడి నచ్చింది. మొత్తంగా ఆమెలో ఉన్న అన్నీ నచ్చాయి. అందుకే ఆమెతో అరమరకలు లేకుండా కలిసిపోయింది.
“చూశావా రామూ, ఆడవాళ్ళిద్దరూ అంతకు పూర్వం పరిచయం లేక పోయినా ఇట్టా ఎలాగ కలిసిపోయారో?” సుందరం నవ్వుతూ అన్నాడు. నిజమే అనిపించింది రామూర్తికి.
సుమతీ సులోచన ఇద్దరూ వంట పనిలో పడ్డారు. గలగలమని సెలయేరు ప్రవహిస్తున్నట్లు సులోచన మాట్లాడుతూ ఉంటే శాంతంగా గంభీరంగా పారుతున్న నీటి ప్రవాహంలా ఉంది సుమతి వైఖరి.
భుజంగరావు ఆలోచన్లు మరోలా ఉన్నాయి. ‘గంభీరంగా ఉండే ఇంటి వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉంది? ఎప్పుడు ఇల్లు ఇలా సందడిగా ఉంటే ఎంత బాగుండును?’ భుజంగరావు అనుకుంటున్నాడు.
“మీ ఆవిడి వైఖరిలో ఏమైనా మార్పు ఉందా?” సుందరం అడిగాడు.
“ప్చ్..!” అన్నాడు రామూర్తి నిరాశగా. కొద్దిగా బాధనిపించింది సుందరానికి.
“రామూ! మనకి ఒక సమస్య వచ్చిందంటే దానికి గల కారణాలు. పర్యవసానాలను గుర్తించి పరిష్కార మార్గం వేపు అడుగులు వేయాలి. కొన్ని సమస్యలు పరిష్కారం కానంత కాలం మానసిక ఒత్తిడిని ఎదుర్కోక తప్పదు. ఇది తొలగాలంటే విమర్శనాత్మకంగా, సృజనాత్మకంగా ఆలోచించి నిర్ణయిం తీసుకోవాలి. ముఖ్యంగా మనం మన భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే ఆరోగ్య సమస్యలు తోడవుతాయి. మానసిక సమస్యలతో కూడా.
మన భావాల్ని మన ఆత్మీయులతో పంచుకుంటే చాలా మంచిది. లేకపోతే ఒత్తిడి పెరుగుతుంది. దాని ప్రభావం హానికరంగా ఉంటుంది. అందుకే నీ భావాల్ని నాతో పంచుకుంటే నీ మనస్సు తేలిక పడుతుంది. మా సహకారం నీకు లభిస్తుంది” సుందరం అన్నాడు.
“నా సమస్య చెప్పడానికి ఏం ఉంది? అన్నీ నీకు తెలిసినవే. నా జీవితం అంతా తెరిచిన పుస్తకం.”
“ముఖ్యంగా దాంపత్య జీవితంలో కావల్సింది అంకిత భావం. అంతే కాదు దంపతులకి పరిపక్వత ఉండాలి. ఒకరిని మరొకరు మనస్సు గాయపరచే ప్రస్తావన ఉండకూడదు. భార్యాభర్తల్లో ఇద్దరూ సమానులే. ఒకరు ఎక్కువాలేదు. మరొకరు తక్కువాలేదు. కుటుంబ జీవితం ఇద్దరి సహకారం వల్లనే సాధ్యపడుతుంది,” సుందరం అంటున్నాడు. రామూర్తి వింటున్నాడు.
‘ఇది ఒక్కరి వల్ల సాధ్యపడే విషయం కాదు. పరస్పర సహకారంతోనే ఇది సాధ్యమవుతుంది’ అని అనుకుంటున్నాడు రామూర్తి.
“మీరు బాగా సంపాదిస్తున్నారు. డబ్బుకి లోటు లేదు. మీకు మంచి చీరలు కట్టుకోవాలని, నగలు పెట్టుకోవాలని ఆలోచన ఉండదా?” సుమతి అడిగింది. సులోచన ఓమారు సుమతి వేపు చూసింది. ఆ చూపులో అనేక భావాలు, ‘మానసిక పరిపక్వత పూర్తిగా ఉంటే ఇలాంటి వాటి మీద వ్యామోహం అంత ఉండదు’, అనుకుంది.
“నేను పెరిగింది ఎక్కడా? ప్రేమ సమాజంలో. అక్కడ జీవితం ఎలా ఉంటుందో మీకు తెలియదు. సాదా సీదాగా ఉంటుంది. ఏ పట్టు బట్టలూ, బంగారు నగలూ లేకపోయినా అక్కడ మా జీవితం ప్రశాంతంగా ఆనందంగా గడిచిపోయింది. పెళ్ళయిన తరువాత కూడా అలాగే గడిచి పోతోంది. నాకు ఏ ఆడంబరాలు అక్కర్లేదు. ఇలా ప్రశాంతంగా జీవితం గడిచిపోతే అదే చాలు,” సులోచన అంది.
‘ఏ కోరికలూ లేని సులోచన అదృష్టవంతురాలు. కోరికలు ఉండబట్టే కదా నా జీవితంలో అసంతృప్తి. ఇవేవీ లేని జీవితం ఎందుకు అని తను అనుకుంటే ఇవేవీ లేని జీవితమే ప్రశాంతమైనది అని సులోచన అంటోంది. తను మాత్రం ఇలాంటి జీవితంతో రాజీపడి బ్రతకలేకపోతోంది. చివరకు రంగి అప్పన్నా కూడా గంజి నీళ్ళు త్రాగుతూ ఆడంబరమైన జీవితానికి దూరంగా ఉంటూ ఎంత ప్రశాంతంగా జీవితం గడిపేస్తున్నారు’ సుమతి ఆలోచన్లు ఇలా సాగిపోతున్నాయి.
సాయంత్ర సమయంలో నీరెండలో సుమతీ సులోచనా చెరువు గట్టున వడివడిగా నడుస్తూ మాట్లాడుకుంటున్నారు. రామూర్తికి సుమతిలో కొత్తకోణం అగుపించింది. తాను రోజూ చూస్తున్న సుమతేనా అనిపించింది రామూర్తికి. సులోచనని, సుమతిని చూస్తూ మగవాళ్ళిద్దరూ వెనక నడుస్తున్నారు.
రాత్రి తొమ్మిది గంటల సమయం వెన్నెల రాత్రి. వేసవి కాలం రెండు జంటలూ కుర్చీలు ఆరు బయట వేసుకుని మాట్లాడుకుంటున్నారు. మల్లె పందిరి నుండి వస్తున్న మల్లె పువ్వుల సువాసన మత్తెక్కెస్తోంది. సుందరం సులోచన సరసోక్తుల్తో, చలోక్తుల్తో వాతావరణం వేడి ఎక్కిస్తున్నారు. అదే పనిగా సరసాలు ఆడుకుంటూ మాట్లాడుకుంటున్నారు. వారి తీరు రామూర్తికి వినోదంలా అగుపిస్తే సుమతికి ఎబ్బెట్టుగా అనిపిస్తున్నాయి. మరీ ఒకరి మీద ఒకరు పడి సరసాలు ఆడుకోవడం ఆమెకి నచ్చలేదు.
ఇదేంటి వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు? రంగి, అప్పన్నా ఇలా ప్రవర్తించడం చూసి వీళ్ళు చదువురాని వాళ్ళు అందుకే నాలుగు గోడల మధ్యా జరగవల్సిన తంతుని ఇలా బహిర్గతం చేస్తున్నారు అని అనుకుంది. కాని సుందరం సులోచన చదువుకున్న వాళ్ళు ఎదురుగా మనుష్యులున్నారని తెలిసి కూడా ఇలా ప్రవర్తిస్తున్నారేంటి అనుకుంటున్న సుమతిలో క్రమంగా మార్పు!
ఆమెలో ఆడతనం తట్టిలేపుతోంది. భార్యా భర్త అంటే ఇలా ఉండాలి కాబోలు అని అనుకుంటోంది. మరి అక్కడ ఉండలేక గబగబా లోనికి వెళ్ళింది. సులోచనా, సుందరం ముఖముఖాలు చూసుకున్నారు. రామూర్తి కూడా లోపలికి వెళ్ళడంతో అందరూ నిద్ర పోవడానికి ఇంటి లోపలికి వచ్చారు. తమకు కేటాయించిన గదిలో సుందరం సులోచనా నిద్రపోతుంటే హాలులో సుమతి సోఫాలో పడుకుంది. “సుమతీ! గదిలో పడుకో! నేను సోఫాలో పడుకుంటాను” అన్నాడు రామూర్తి. “నేను ఇక్కడే పడుకుంటాను” అంది సుమతి. మరి మాట్లాడకుండా రామూర్తి గదిలోకి వెళ్ళాడు.
సుమతికి నిద్ర పట్టడం లేదు. భార్యాభర్తల జీవితం ఇలా సరస సల్లాపాల్తో చతురోక్తుల్తో జరగాలా? అలా ఉంటేనే దాంపత్య జీవితమా? ఇన్నాళ్ళూ తనలో ఏ స్పందనా లేకుండా జడపదార్ధంలా ఉంటిపోయింది. బావను బాధ పెట్టింది. తను బాధపడింది. ఇప్పుడు తనలో మరో సుమతి బహిర్గతమవుతోంది. ఈ సుమతికి ఏదో కావాలి. ఆనంద డోలికల్లో తేలిపోవాలన్న కోరిక. ఒళ్ళంతా వెచ్చని ఆవిర్లు. ఏవేవో మనో వికారాలు.
నెమ్మదిగా రామూర్తి గది వేపు వెళ్ళింది. అతను అసహనంగా మంచంపై అటు ఇటు దొర్లుతున్నాడు. నెమ్మదిగా అతని మంచం దగ్గరకు వెళ్ళి అతడ్ని పెనవేసుకుంది. అతను ఉలిక్కిపడి లేవడానికి ప్రయత్నించాడు. అతడ్ని లేవనీయలేదు సుమతి. ఆమె వెచ్చని కౌగిల్లో అతనిలో కోరికలు బుసకొట్టాయి. అంటే ఆమెను పొదివి పట్టుకున్నాడు. ఆనంద లోకాల్లో తేలియాడారు సుమతి రామూర్తి.
మర్నాడు రామూర్తి ముఖంలో వింత వెలుగు చూశాడు సుందరం. “నీ ముఖం చూస్తేనే తెలుస్తోంది. నీవు ఎంత సంతోషంగా ఉన్నావో అని. నిజమైన శోభనం నీకు ఇప్పుడు జరిగింది. అదే నిన్న రాత్రి నాడు. ఇక్కడికి వస్తున్నప్పుడు సులోచనా, నేను ఓ పధకం వేసుకుని వచ్చాం. ఎలాగయినా మీ శోభనం జరిగేటట్టు చూడాలి అని. మా పధకం సక్సెస్ అయింది. నిన్న మా చతురోక్తులు, సరస సంభాషన్లు, మాటలు, చేతలూ ఈ పథకంలో భాగమే. ఇక మా పథకం పూర్తయింది. మా హనీమూన్ పూర్తయింది. ఇక మీ హానీమూన్‌కి ప్లాను వేసుకోండి,” అన్నాడు సుందరం రామూర్తితో.
ఇలా జరుగుతుందని రామూర్తి కలలో కూడా ఊహించలేదు. అతనికిదంతా కలలా అనిపిస్తోంది. జడ పదార్థం, మూర్ఖురాలిలా ఉంటే సుమతి ఇంత తొందరగా టెంప్ట్ అవుతుందనుకోలేదు.
“దేనికేనా ప్రేరణ ఉండాలి. ప్రేరణ లేనిదే ఏ పనీ జరగదు. నిన్న మా ప్రవర్తన సుమతిని ప్రేరేపించింది. నీ కోరిక తీరింది. ఇక హ్యేపీయేనా?” రామూర్తి వేపు కొంటెగా చూస్తూ అన్నాడు సుందరం.
అధ్యాయం 16
సుమతిలో ఇంత త్వరగా మార్పు రావడం ముఖ్యంగా భుజంగరావుకి చాలా సంతోషం కలిగింది. సుమతి ముఖంలో అంతకు మునపన్న భావాలు కాకుండా ఓ వింత కాంతి అగుపించింది. ‘ఇలాగే ఎప్పుడూ ఉంటే ఎంత బాగుండును?’ అతను అనుకున్నాడు.
సుందరానికి విశాఖపట్నానికి దగ్గరగా ఉన్న ఓ జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అందుకే విశాఖపట్నంలో అద్దెలు తక్కువుగా ఉన్న ఓ ప్రాంతంలో ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. సులోచన ఓ ప్రైవేటు పాఠశాలలో అధ్యాపకురాలుగా పని చేస్తోంది.
సుందరం మొదటే చెప్పాడు “ఈ పల్లెటూరులో మా హానీమూన్ అయిపోయింది. ఇక మీ హానీమూన్ ట్రిప్ విశాఖ పరిసర ప్రాంతాల్లో” అని. రెండు జంటలూ బయలుదేరాయి.
భుజంగరావు “నేను ఉంటాను మీరందరూ వెళ్ళి రండి” అన్నాడు. ‘ఇదంతా సుందరం వల్లనే జరిగింది. అతను అసంభవం అన్న దాన్ని సంభవం చేసి చూపించాడు’ అనుకున్నాడు భుజంగరావు.
ఆంధ్రా ఊటీ అరకు బయలుదేరారు. ట్రైన్లో అరుకు వెళ్తూ ఉంటే వచ్చే గుహలు మొదట సుమతికి ఆనందం ఇచ్చినా ఆ తరువాత తరువాత విసుగు అనిపించింది. తరువాత అరకు వెళ్ళిన తరువాత అక్కడ ప్రాకృతిక దృశ్యాలు సుమతిని కట్టి పడేసేయి. ఇంత వరకూ ఆ పల్లె పరిసరాలు వదిలిరాలేదు. అందుకే ఆమెకి ఇదంతా వింత అనుభవంలా అనిపిస్తోంది.
అరుకులో చూడవల్సిన ప్రదేశాలు అన్నీ చూసిన తరువాత బొర్రా గుహలు చూడ్డానికి వెళ్ళారు. ఈ గుహలు గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటారు. ఇవి పది లక్షల సంవత్సరాల క్రితమే ఏర్పడ్డాయని చెప్తారు. మీద నుండి పడుతున్న నీటి బిందువులు ఘనీభవించి వివిధ రూపాల్లో మార్పు చెందుతాయి. తవ్వకాల్లో ఇక్కడ ప్రాచీనకాలపు పనిముట్లు లభించాయని చెప్తూ ఉంటారు. ఇవి విశాఖ నుండి తొంభై కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. అక్కడ బస చేయాలంటే సమీపంలోని అనంత గిరిలో ఉన్న రిసార్ట్స్‌లో ఉండచ్చు.
“విశాఖపట్నానికి దగ్గరగా ఉన్నవి తరువాత చూడచ్చు. మనం లంబసింగి ప్రాంతంలో ఒక రోజు విశ్రాంతి తీసుకుని చూద్దాం. దాన్ని ఆంధ్రా కాశ్మీర్ అంటారు. చూస్తే ఈ వేసవిలోనే చూడాలి. డిసెంబరు, జనవరి నెలలో ఇక్కడ జీరో డిగ్రీ ఉష్ణోగ్రత ఉంటుంది” అన్నాడు సుందరం. అలాగే అన్నారు అందరూ.
విశాఖ జిల్లాలో నర్సీపట్నం – చింతపల్లి మధ్య ఉన్న గిరిజన గ్రామమే లంబసింగి. నవంబరు నుండి ఫిబ్రవరి వరకూ మంచు కురుస్తూ కాశ్మీరు లోయలా వింత అందాలతో మెరిసిపోతుంది. ఎండలు ఉన్నా అక్కడ మాత్రం ఐదు నుంచి 10 డిగ్రీలు ఉష్ణోగ్రత మాత్రమే ఉంటుంది. వేసవి కాలంలో కూడా రాత్రి పూట దుప్పటి కప్పుకోవల్సిందే. ఈ సిజన్లో జీరో డిగ్రీ ఉష్ణోగ్రత ఉంటే వాతావరణ చల్లగా ఉంటుంది అన్నీ మంచుతో కప్పబడి పోతాయి.
ఈ గ్రామ జనాభా సుమారు ఐదు వందలు ఉంటుందట. పంచాయితీ పరిధి. చిన్న చిన్న పల్లెలు ఉంటాయి. ఇళ్ళు కూడా దూరం దూరంగా ఉంటాయి. ఇక్కడ వాళ్ళు వ్యవసాయం చేసి జీవిస్తారు. ఇక్కడ గిరిజనులకి మంచే శాపం. ఆ చలిలో బయలుదేరి కాయకష్టం చేయకపోతే వాళ్ళకి తిండే దొరకదు. కొందరు చలికి బయపడి ఇంటిలోనే ఉండిపోతే వాళ్ళకి పస్తులే.
“అయితే అక్కడ పరిసరాలు అందంగా అగుపడ్తున్నా కాశ్మీరులా పర్యాటకంగా అభివృద్ధి చెందలేదు. దానికి కారణం పర్యాటకులు ఉండటానికి తగిన వసతులు లేవు. ఇక్కడకు వెళ్ళానుకునేవారు తమ వెంట ఏదేనా తీసుకు వెళ్ళవల్సిందే. గ్రామస్తులు వారానికొకసారి సంతకు వెళ్ళి కూరగాయలు కొనుగోలు చేస్తారుట,” సుందరం తన కోలీగ్ చెప్పిన విషయాలు చెప్తున్నాడు శ్రోతలు వింటున్నారు.
రెండు రోజులు విశ్రాంతి తీసుకున్న తరువాత లంబసింగి ప్రాంతం చూడ్డానికి బయలుదేరారు నలుగురు. వెంట తినడానికి తగిన సరంజామా అంతా పట్టుకున్నారు. నిజంగా ఆ ప్రాంతం చాలా బాగుంది. గొప్ప పర్యాటక ప్రదేశం అనిపించింది.
మధ్యాహ్న సమయం అయినా వెలుతురు అస్పష్టంగా ఉంది. అప్పుడే తెల్లారినట్టుంది. మనుష్యులు ఎదురెదురుగా ఉన్నా మంచు వల్ల ఒకరి ముఖాలు మరొకరికి కనిపించటం లేదు. పట్ట పగలు కూడా లైట్లు వెలిగించి రోడ్డు మీద తిరుగుతున్నారు. వేసవిలో కూడా ఇక్కడ ఉష్ణోగ్రత చాలా తక్కువ ఉంటుందని అక్కడి వాళ్ళు చెప్పారు.
అందరికీ ఆకలి వేసింది. ఇంత తిని ప్రకృతి సౌందర్యాన్ని పరిసరాలను అవలోకిస్తున్నారు. వీళ్ళతో పాటు మరికొంత మంది పర్యాటకులు కూడా వచ్చారు. ఇంత రమణీయమైన గ్రామలో మిట్ట మధ్యాహ్నమైనా సూర్యుడు జాడలేదు. చలి ఎక్కువుగా ఉంది. శీతాకాలంలో నీరు గడ్డ కటుతుందట. పగలే చలి మంటలు వేసుకుంటారుట.
కొండలపై నుంచి దిగి వస్తున్నట్లు అగుపించే తెల్లని మబ్బులు అందర్నీ ముగ్దుల్ని చేస్తాయి. పోగులు పోసినట్లు మంచు బిందువులు మంచి ముత్యాల్లా కనిపిస్తున్నాయి. అక్కడ మంచు ముత్యాల్లా కురుస్తుంది. కొమ్మ కొమ్మకు పూలు ఉన్నట్లు ఎటు చూసినా మంచు బిందువులే రాలుతున్నాయి.
తెల్లని మబ్బులు పిల్ల గాలుల్తో సయ్యాట లాడుతున్నాయి. మబ్బులు నేలను తాకుతున్నాయా అన్నంత భ్రమ చూసిన వాళ్ళకి. కాఫీ పూలు తెల్లని చేమంతుల్లా కనువిందు చేస్తున్నాయి. ఎత్తైన కొండల మధ్య చుట్టూ పరుచుకున్న లోయలు మధ్య అలరారుతోంది ఆ ప్రాంతం. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తోటలు, లేలేత ఎరుపులో నవనవలాడుతున్నాయి యాపిల్ కాయలు. కాశ్మీరును గుర్తుకు తెస్తుంది ఆ ప్రాంతం.
ఆ ప్రాంత ప్రకృతి అందాల్ని మనసులో నింపుకుని నలుగురూ తిరుగు ప్రయాణమయ్యారు. చల్లని ప్రదేశంలో తిరగడం అందులోనూ మంచులో తడవడం వల్ల అస్వస్థతకి గురయి రెండు రోజులు వరకు తేరుకోలేక పోయారు. రెండు రోజులు విశ్రాంతి తీసుకున్న తరువాత విశాఖపట్నం చుట్టు ప్రక్కల ప్రాంతాలు చూద్దామనుకున్నారు.
సులోచన వంట చేస్తుంటే సుమతి కూడా ఆమెకి సహాయపడుతోంది. సుమతికి ఇదంతా కొత్త అనుభవంలా అనిపిస్తోంది. ఇన్నాళ్ళు గ్రామంలో గిరిగీసుకుని ఉండిపోయింది. ఇప్పుడు బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టింది. అంతా అబ్బురంగా అనిపిస్తోంది.
బాగా విశ్రాంతి తీసుకున్న తరువాత విశాఖకి చుట్టూ ప్రక్కల ప్రదేశాలు చూడ్డానికి బయలుదేరారు. తూర్పున నీలి సముద్రం, పడమట దిశలో ఎత్తైన పచ్చని కొండలు మనస్సుని ఆకర్షించే ప్రకృతి అందాలు ఇక్కడ. దేశ, విదేశాల నుండి పర్యాటకులు వస్తూ ఉంటారు ఇక్కడికి. సముద్రంలో విహారం, తీరంలో షికారు, నగరంలో పర్యటన నూట ఇరవై కిలో మీటర్ల సముద్ర తీరం విశాఖ సొంతం.
నగరానికి వచ్చే ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే ప్రాంతం రుషికొండ. పర్యాటకులు ఉండడానికి సదుపాయాలు ఉన్నాయి. ఇది ఒక రమణీయ ప్రదేశం. ఆర్టీసి కాంప్లెక్సు నుండి పదమూడు కిలో మీటర్ల దూరంలో ఉంది. రామకృష్ణ మిషన్ బీచ్ ఆర్.కె. బీచ్ అని పిలుస్తారు. ఆర్టీసీ కాంప్లెక్సు నుండి మూడు కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇది కూడా ప్రసిద్ధి పర్యాటక కేంద్రం. ఈ బీచ్‌కి ఎదురుగా ఉన్న కాళీ మాత గుడికి వెళ్ళి దేవిని దర్శించుకున్నారు. మొదట రుషి కొండ చూసి, ఆ తరువాత ఆర్.కె. బీచ్ చూశారు.
“తరువాత చూడవల్సింది యారాడ బీచ్. ఇక్కడ సినీ షూటింగ్‌లు కూడా జరుగుతాయి. ఎత్తైన కొండల మధ్య యారాడ తీర ప్రాంతం ఎంతో సుందరంగా ఉంటుంది. తరువాత చూడవల్సిన ప్రదేశం డాల్ఫిన్ నోస్. సముద్ర మట్టానికి సుమారు మూడు వందల ఏభై మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కొండ డాల్ఫిన్ చేప ముక్కు ఆకారంలో ఉంటుంది. అందుకే ఆ పేరు వచ్చింది. దాని మీద లైట్ హౌస్ కూడా ఉంది,” సుందరం వివరించాడు.
ఆ మరుసటి రోజు వారి ప్రయాణం. సింహాచలం వెళ్ళి దేవుని దర్శించుకుందామనుకున్నారు. విశాఖలో చూడవల్సినవి ముఖ్యమైనవి చూసిన తరువాత సింహాచలం కొండ మీదున్న వరహా నరిసింహ స్వామిని దర్శించుకుందికి బయలుదేరారు.
వరాహా నరిసింహ స్వామి దేవాలయం కీ॥శ॥ పదకొండవ శతాబ్దంలో నిర్మింపబడిన ప్రాచీన దేవాలయం. ఈ దేవాలయం శిల్ప కళా సంపదకు పెట్టింది పేరు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో సింహాద్రి అప్పన్న చందనోత్సవం అదే స్వామి నిజరూప దర్శనం ఉంటుంది. మిగతా రోజుల్లో చందనంతో కప్పబడిన దేువుడు వైశాఖ మాసంలో అక్షర తదియ నాడు ఒక్క రోజు మాత్రమే నిజరూప దర్శనముంటుంది. ఆర్.టి.సి కాంప్లెక్సు నుండి పదిహేడు కిలో మీటర్లు. రైల్వే స్టేషను నుండి ఎనిమిది కిలో మీటర్లు గుడికి దూరం ఉంది. కొండ దిగువునా, పైనా లాడ్జీలు, టిటిడి కాటేజీలు ఉన్నాయి.
ఆ తరువాత ప్రోగ్రాం కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకుని కైలాసగిరి వెళ్ళారు. అలవాటు లేని సుమతి చాలా హైరాన పడుతోంది. అందుకే నాలుగు రోజులు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తరువాత బావికొండ, తొట్లకొండ చూడ్డానికి బయలుదేరారు. ఈ రెండు కొండలు బౌద్ధ మతానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్న కొండలు. ఇవి విశాఖ నగరానికి పద్దెనిమిది కిలో మీటర్లు దూరంలో విశాఖ, భీమిలి బీచ్ రోడ్డులో తొట్లకొండ ఉంది. అక్కడికి ఒక కిలో మీటరు దూరంలో బావికొండ ఉంది. బుద్ధుని ఎముక ముక్కలతో కూడిన భరిణె లభించిందని చెప్తారు. తొట్లకొండ దిగువన తీరంలో రిసార్ట్స్ నిర్మాణం అప్పుడప్పుడే జరుగుతోంది.
ఆ త్రోవలోనే ఉన్న భీమిలి వెళ్ళారు. దాన్నే భీమునిపట్నం అని కూడా పిలుస్తారు. తూర్పు తీరంలో అతి ప్రాచీనమైన ఓడ రేవు దేశంలో రెండో పురాతన మునిసిపాలిటీ డచ్ పాలకులకు చెందిన సమాధులు, పురాతన లైట్ హౌస్ ఇక్కడ ఉన్నాయి. గోస్తనీ నది ఇక్కడ సముద్రంలో కలుస్తోంది.
“ఇప్పటికి ఇది చాలు మరి నాకు చూసే ఓపిక లేదు” అంది సుమతి. అందరికీ అలాగే అనిపించింది. అందరం అలిసిపోయారు. “మీరు విజయనగరం వస్తే రామతీర్థంలో ఉన్న రాముల వారి ప్రాచీన మందిరం ఉంది అది చూద్దాం. అంతేకాదు ప్రాచీన కాలంలో కోటలు, మందిరాలు, ఇంకా ప్రాచీన కాలానికి చెందిన ఎన్నో అవశేషాలు, చారిత్రాత్మక స్థలాలు ఉన్నాయి,” అన్నాడు రామూర్తి సుందరంతో.
“అవును రామతీర్థంలో ఉన్న ఆ గుడి గురించి విన్నాను. త్రేతాయుగంలో శ్రీరాముడు వనవాస సమయంలో ఆంధ్ర ప్రదేశ్‌లోని దండకారణ్య ప్రాంతంలో నివసించాడు. ఆ సమయంలో రామతీర్థంలో ఉన్న ప్రదేశానికి వచ్చాడు సీత, లక్ష్మణునితో అని విన్నాను. ఆ ప్రాంతం హిందూ, బౌద్ధ, జైన మతాల సంగమ స్థలమని విన్నాను. ఈసారి తప్పకుండా వెళ్దాము. అక్కడ కొండ మీద ఓ గుడి, క్రింద విశాలమైన పెద్ద మందిరం ఉన్నాయని విన్నాను. అక్కడ కొండను బోడి కొండ అని పిలుస్తారని, అది చాలా నునుపుగా ఉంటుందని కూడా విన్నాను,” సుందరం అన్నాడు తిరిగి.
నలుగురూ ఈ విధంగా చూడవల్సిన వాటిని చూసి ఇంటికి బయలుదేరారు. మరికొన్ని ప్రదేశాలు మరో పర్యాయం వచ్చినప్పుడు చూడవచ్చు అని అనుకున్నారు.
(ఇంకా ఉంది)
విజయనగరం వాస్తవ్యులైన శ్రీ గూడూరు గోపాలకృష్ణమూర్తి హిందీ ఉపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. వారు రాసిన కథలు వివిధ వార్తపత్రికల్లో ప్రచురితమయ్యాయి. కొన్ని కథలు సంకలనంగా వెలువడ్డాయి.
