[టి.వి.యెల్. గాయత్రి గారి ‘మమతల పందిరి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
విజయవాడ నగరంలోని ప్రసాదంపాడులో చిన్న రేకుల ఇల్లు. వాన పడితే పైకప్పు కారుతుంది. ఎండ వస్తే ఇల్లు పొయ్యిలా మండుతుంటుంది.
ఆ చిన్న ఇంట్లో బిక్కు బిక్కు మంటూ కూర్చుంది ఆదిలక్ష్మి. ముందురోజు పుట్టింటినుంచి పిల్లలతో సహా వచ్చిందామె.
ఆమె ఒడిలో మూడు నెలల పసిపాప. పక్కనే ఇంకో రెండేళ్ల చిన్నారి. మూలన కూర్చొని బిస్కెట్ తింటున్న నాలుగేళ్ల పెద్దపాప.
ఇంట్లో నిశ్శబ్దం. కానీ ఆ నిశ్శబ్దం వెనుక ఒక పెద్ద తుఫాను దాగి ఉంది.
భర్త మల్లేశం కోపంగా ఇంట్లో అటూ ఇటూ తిరుగుతున్నాడు.
“మళ్లీ ఆడపిల్లని కన్నదానివి ఏ ముఖం పెట్టుకొని ఇంటికొచ్చావ్?”
ఆదిలక్ష్మి మౌనంగా తలదించుకుంది.
“ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇంకో ఆడపిల్ల.. నేను సాకలేను!” అని గట్టిగా అరిచాడు.
ఆ అరుపుకు ఒళ్ళో పసిపిల్ల జడుసుకొని కేర్ మంటూ ఏడవటం మొదలుపెట్టింది.
“దరిద్రపుగొట్టుది! ఆ ఏడుపు చూడు!” కాలితో ఆదిలక్ష్మి వీపు మీద ఒక్కటి తన్నాడు. పెద్దపిల్ల లిద్దరు భయంతో తల్లిని కరుచుకొన్నారు.
మాట్లాడకుండా నిలువుగుడ్లేసుకొని చూస్తూ ఉంది ఆదిలక్ష్మి.
“నిన్ను నీ పిల్లల్ని నేను సాకలేను. ఇంక నీ మొహం చూడ్డానికి నేను రాను.. నీ బతుకు నువ్వు బతుకు!”అని విసురుగా బయటికెళ్ళిపోయాడతడు.
మూడు రోజులు ఎదురు చూసింది. తండ్రి ఇచ్చిన కాసిని డబ్బులు.. ఎంత కాలం వస్తాయి? పసిదానికి తన దగ్గర పాలున్నాయి. పెద్ద పిల్లలకి ఎట్లా?
మొగుడు లేకుండా ఎలా బతకాలి?
మళ్ళీ పుట్టింటికి వెళ్తే? అక్కడమాత్రం ఎవరు చూస్తారు?
అన్నా వదిన ఉన్నారు. వాళ్ళ సంసారం వాళ్ళది. అమ్మానాన్న ఉండి ఏం చేస్తారు? తనతో పాటు ఏడవటం తప్ప. ఏదో ఒక పని వెతుక్కోవాలి.
చంటిదాన్ని చంకనేసుకొని, ఇద్దరు పిల్లల్ని నడిపించుకుంటూ వెళుతోంది. కాసేపటికి రాములవారి ఆలయం కనిపించింది. అక్కడ అడుక్కుతినే వాళ్ళున్నారు. అభిమానంగా అనిపించింది ఆదిలక్ష్మికి. ఒంట్లో సత్తువుంది. అడుక్కుతినటమెందుకు?
గుడిలోకి వెళ్ళింది. కాసేపు కూచుంది. ఆకుదొప్పల్లో ప్రసాదం పంచుతున్నారు. పిల్లలకు పెట్టింది.
“దేవుడా! దారి చూపించు తండ్రీ!”అనుకుంటూ గుడి బయటికి వచ్చింది. గుడికెదురుగ్గా ఒక పెద్ద భవనం నిర్మాణంలో ఉంది. కూలీలు పనిచేస్తున్నారు. ఆడవాళ్లు కూడా ఉన్నారక్కడ. ఏదన్నా సాయం దొరుకుతుందేమోనని ఆశగా అక్కడికి వెళ్ళిందామె.
ఇటుకలు మోస్తున్న ఆడమనిషి దగ్గర నిల్చుంది.
“ఎవరమ్మా?” అడిగిందా ఆడమనిషి.
“దిక్కులేని దాన్నక్కా! ఇక్కడేదన్నా పని దొరుకుతుందేమోనని.”
ఆ మాట విని, “ఓ నారన్నా! ఇటు రా!” అంటూ కేక పెట్టిందా ఆడమనిషి.
ఆ కేక విని అటువైపు వచ్చాడొక నడివయసు మనిషి.
“పని కావాలంట!”
“ఎవరు నువ్వు?నీ పెనిమిటేం చేస్తాడు?” ఆరా తీస్తున్నట్టు అడిగాడు నారన్న.
“ఆడపిల్లల్ని కన్నానని వదిలేసి పోయాడన్నా! ఏదన్నా పని చూపెడితే చేసుకుంటా!” తనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆదిలక్ష్మికి.
చుట్టూ ఇంకా నలుగురైదుగురు మూగారు.
“ఎక్కడుంటావు? అమ్మా నాయనా లేరా? మీ పుట్టిల్లే వూరు?” అంటూ ప్రశ్నలు వేశారు.
అన్నిటికీ సమాధానాలు చెబుతోంది.
“సరే! రేపటి నుండి పొద్దున్నే తొమ్మిదింటికి ఇక్కడి కొచ్చెయ్! మా సారు చేతిలో నాలుగు బిల్డింగులున్నాయి. ఎక్కడో ఒక చోట చేద్దువుగాని!” అన్నాడు నారన్న.
అతడు పెద్ద మేస్త్రి అని తెలుసుకొంది ఆదిలక్ష్మి.
“పెద్ద పిల్లల్ని గంగవ్వ దగ్గర వదిలెయ్! చంటిదానికి ఇక్కడే ఉయ్యాల వేసి చూసుకో!”
అంటూ కూలీ ఎంతిస్తారో చెప్పారు అక్కడి వాళ్ళు. వాళ్ళతో మాట్లాడుతుంటే ధైర్యం వచ్చింది ఆదిలక్ష్మికి.
రెండోరోజు నుండి కూలీ పనిలో చేరింది
పెద్ద పిల్ల పద్మజను, రెండో పిల్ల పావనిని గంగవ్వ దగ్గర దింపి చంటిపిల్ల పరిమళని చంకనేసుకొని పనికి వచ్చింది. తోటి కూలీ పని వాళ్ళ దగ్గర తెలియని విషయాలు తెలుసుకుంటూ పని చేసుకుంటోంది.. సాయంత్రం ఇంటికి వస్తూ వస్తూ పిల్లలకు గుళ్లో ప్రసాదాలు తినిపించి ఇంటికి వచ్చేది. ఆదివారాలు గుడి కెళ్ళి అక్కడి ప్రాంగణం అంతా ఊడ్చి వచ్చేది. గుడి వాళ్ళు అడిగితే తన గోడు చెప్పుకొంది.
నెల రోజులు గడిచాయి. మల్లేశం ఇంటికి రావటం లేదని చుట్టు పక్కల వాళ్లకు తెలిసిపోయింది.
“మొగుడు లేకుండా ఒక్క దానివే ఎలా ఉంటావు? ఆడదానివి ముగ్గురు పిల్లల్ని ఎట్లా సాకుతావు? నీకు తెలీదు మగతోడు లేకుండా కష్టం తెలుసా!” ఇలాంటి మాటలెన్నో వినిపిస్తున్నాయి. మౌనంగా ఉండేది ఆదిలక్ష్మి.
ఇంకో రెండు నెలలు గడిచాయి.
ఆ రోజు సాయంత్రం ఇంటికి వస్తోంది ఆదిలక్ష్మి.
వీధిలోనే ఎదురుపడింది పక్కింటి రాణి.
“అక్కా! అక్కా! మీ ఆయన వేరే పెళ్లి చేసుకున్నాడంట!” ఎంత దాచుకున్నా రాణి కంఠంలో అదొకరకమైన ఉత్సాహం.
ఉదాసీనంగా రాణి వైపు చూసి మౌనంగా నడవసాగింది ఆదిలక్ష్మి.
“ఏంటక్కా మాట్లాడవు?” ఈసారి రాణి గొంతులో కాస్త నిరుత్సాహం.
“ఏం లేదు. ఎవరెటుపోతే నాకెందుకు?”
“అవునులే! అయినా మొగుడారకం అయితే నువ్వేం చేస్తావులే!”
మొగుడి పెళ్లి వార్త వినంగానే భోరున ఏడుస్తుందను కున్న చుట్టు పక్కల వాళ్లకు నిజంగానే నిరుత్సాహం కలిగింది.
ఈ వార్త ఎలా తెలిసిందో పుట్టింటి వాళ్లకు తెలిసింది. వచ్చిపడ్డారందరు.
పంచాయతీ పెట్టిద్దామని.. నలుగురిని పిలిచి అల్లరి చేద్దామని అన్న ఎగిరాడు.
“అదేమీ వద్దు! కనాకష్టంగా నా కొచ్చే కూలీ డబ్బులతో నా పిల్లల్ని పోషించు కుంటున్నా! మీరు ఎక్కువ రోజులు ఇక్కడ ఉంటే మీకు తిండి పెట్టటానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. పొదుపుగా చేసుకుంటూ నా పిల్లల్ని సాక్కుంటా! మీ రేదైనా నాకు సహాయం చెయ్యాలంటే ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి వెళ్ళండి! నాకు పనికొస్తాయి!”
డబ్బుల మాట వినంగానే అన్న చల్లబడ్డాడు. తల్లీ దండ్రి ఏమీ మాట్లాడలేదు. రెండోరోజుకు అందరూ వెళ్లిపోయారు. తన పనిలో తాను పడింది ఆదిలక్ష్మి.
రోజులు గడుస్తున్నాయి.
పిల్లల్ని చూసుకుంటూ, పని చేసుకుంటూ రోజుల్ని గడుపుతోంది ఆదిలక్ష్మి.పిల్లలు పెరుగుతున్నారు.
ఒకళ్ళ తర్వాత ఒకర్ని గవర్నమెంట్ స్కూల్లో వేసింది.
పెద్దమ్మాయి పద్మజ బాగా చదివేది.
రెండో పిల్ల పావని అయితే అసలు పుస్తకమే అయ్యేది.
స్కూలు నుంచి వచ్చాక కూడా పుస్తకాలే.
అక్కలిద్దరు చంటి దానికి పాఠాలు చెప్పేవాళ్ళు.
ఒక సినిమా లేదు ఒక టివి లేదు. ఆ రేకుల గదిలో చదువు గురించిన మాటలు తప్ప మరేమీ వినిపించేవి కావు.
స్కూలు టీచర్లు, హెడ్మాస్టరు ఆదిలక్ష్మిని చాలా గౌరవించేవాళ్ళు. ముగ్గురు ఆడపిల్లలు పోటాపోటీగా చదువుతున్నారని చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పుకొనే వాళ్ళు. టెన్త్ క్లాసు పరీక్షలు వ్రాసింది పద్మజ.
అనుకున్నట్లుగా మంచి మార్కులు తెచ్చుకొంది. ఆ తర్వాత ఎలాగా?
ఏమీ ఆలోచించలేక పోతోంది ఆదిలక్ష్మి. స్కూల్లో టీచర్లు మాత్రం పిల్లల్ని పెద్ద చదువులు చదివించమని సలహా ఇచ్చారు.
‘తనకు సాధ్యమవుతుందా?’ అనుకుంటూ కూలీ పని అయ్యాక అలవాటుగా గుడికి వచ్చి కూర్చుంది ఆదిలక్ష్మి.
“ఏం ఆదిలక్షమ్మా! కూతురికి ఎన్ని మార్కులు వచ్చాయి?” పలకరించాడు పూజారి రామశాస్త్రి.
“ఎన్నొచ్చినా ఏముంది స్వామీ! పై చదువులు చదివించాలంటే డబ్బులు కావాలి. నా దగ్గరేముంది?”
“నీ పిల్లలు తెలివైన పిల్లలు. ఎవరైనా సహాయం చేస్తారు. మన గుడి ధర్మకర్త పరశురామయ్య గారు దానశీలి. రేపు మార్కుల లిస్ట్ తీసికొని ఒకసారి ఇక్కడికి వచ్చెయ్! పక్కవీధి లోనే వాళ్ళ ఇల్లు. నేను కూడా ఒకమాట చెప్తాను. ధర్మప్రభువులు. నీకు తప్పకుండా సహాయం చేస్తారు.” భరోసా ఇచ్చాడు రామశాస్త్రి.
దేవుడే దారి చూపించినట్లుగా అనిపించింది ఆదిలక్ష్మికి. పరశురామయ్య గారు ముగ్గురు పిల్లలకు అండగా నిలబడతానన్నారు.
ఇంటర్లో పద్మజ రాత్రింబవళ్లు కష్టపడి చదివింది. ఇంటర్లో 984 మార్కులు వచ్చాయి. ఆ రోజు గట్టిగా ఏడ్చింది ఆదిలక్ష్మి.
ఎంసెట్లో మంచి ర్యాంకును సాధించి జె.ఎన్.టి.యు. కాకినాడ కళాశాలలో సివిల్ ఇంజినీరింగులో చేరింది. ఇంజినీరింగ్ పూర్తయ్యాక ఏపీపీఎస్సీకి సిద్ధమైంది.
ఉదయం నుంచి రాత్రి వరకూ చదువు.
ధైర్యం కోసం తల్లిని పట్టుకొని “అమ్మా… నాకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది కదూ!” ఆదుర్దాగా అడిగేది పద్మజ.
“నాకు నీ మీద నమ్మకం ఉంది తల్లీ! తప్పకుండా వస్తుంది!” అనేది ధైర్యం చెబుతూ ఆదిలక్ష్మి
ఫలితాలు వచ్చిన రోజు ఇంట్లో టెన్షన్.
వెబ్సైట్ ఓపెన్ చేసింది పద్మజ. కొన్ని క్షణాలు నిశ్శబ్దం.
తర్వాత ఒక్కసారిగా అరిచింది “అమ్మా! నాకు ఉద్యోగం వచ్చింది!”
ఆలాగే కూతుర్ని చూస్తూ ఉంది ఆదిలక్ష్మి.
“అవునమ్మా! నేను సెలెక్ట్ అయ్యాను!”
ఆదిలక్ష్మి వెంటనే కూతురిని గట్టిగా హత్తుకుంది.
“నీ నాన్న వదిలి వెళ్లిన రోజు నేను భయపడలేదు తల్లీ! నాకు దేవుడు ముగ్గురు రత్నాల నిచ్చాడనుకున్నాను.” అంటూ ఏడ్చింది.
ప్రస్తుతం పద్మజ గుంటూరు జిల్లాలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈగా పనిచేస్తోంది.
రెండో కుమార్తె పావని అమరావతిలో సచివాలయంలో ఉద్యోగి.
చిన్నకుమార్తె పరిమళ పీహెచ్డీ చేస్తోంది.
రామాలయంలోని పూజారులు, సిబ్బంది ముగ్గురు పిల్లల్ని తెగ పొగుడుతూ ఉంటారు. ఇక ధర్మకర్త పరశురామయ్య తెలిసిన వాళ్లకు, తెలియని వాళ్లకు కూడా ఆదిలక్ష్మి పిల్లల గురించి గొప్పగా చెబుతూ ఉంటాడు.
పిల్లలతో కలిసి మూడుగదుల పోర్షనులోకి మారింది ఆదిలక్ష్మి.
పిల్లలు తల్లిని ఇటుకల నెత్తే కూలీ పనికి పంపించటం లేదు. పని లేకపోతే తోచదని రామాలయంలో స్వీపరుగా చేరింది ఆదిలక్ష్మి.
ఆ రోజు సాయంత్రం ఇంటి కొస్తుంటే ఫోన్ వచ్చింది. మల్లేశానికి యాక్సిడెంట్ అయిందని. రెండో భార్య, కొడుకు గవర్నమెంట్ ఆస్పత్రిలో చేర్పించారని దూరాపు బంధువులు చెప్పారు.
నిర్లిప్తంగా విని ఫోన్ పెట్టేసింది ఆదిలక్ష్మి.
పిల్లలకు కూడా వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు. పిల్లలు ముగ్గురూ తల్లి దగ్గర కూర్చున్నారు.
తల్లీ పిల్లలు చాలా సేపు మౌనంగా ఉన్నారు.
మళ్ళీ బంధువుల దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది.
మల్లేశం పరిస్థితి బాగలేదని, అతడి సంపాదన అంతంత మాత్రమేనని, కొడుకు చిన్నవాడని ఈ పరిస్థితుల్లో పంతం పెట్టుకోవటం మంచిదికాదని చెప్పుకొచ్చారు.
వాళ్ళు చెప్పింది విని కూడా స్పందించలేదు ఆదిలక్ష్మి. ‘ఇన్నేళ్లల్లో ఒక్కసారి కూడా పిల్లల్ని తనని చూడ్డానికి కూడా రాని మనిషి కోసం తన కెందుకారాటం?’
మాట్లాడకుండా కూర్చుందామె.
అర్థరాత్రయింది. ఎవ్వరూ నిద్రపోవటం లేదు. బయట వాన పడుతున్న చప్పుడు. కిటికీ తలుపు వేసింది పద్మజ.
ఇంతలో కరెంట్ పోయింది. టార్చిలైట్ తీసికొచ్చింది పరిమళ. లేచి కూర్చుంది ఆదిలక్ష్మి.
“నిద్రపట్టటం లేదమ్మా!”అంది పావని.
“ఏం చేద్దాం?” పద్మజ ప్రశ్న విని కూడా మౌనంగా ఉంది ఆదిలక్ష్మి.
“నువ్వేం చెబితే అంత. వద్దు అనుకుంటే పొయ్యేదేమీ లేదు. కాస్త గిల్టీగా ఉంది.. కన్నతండ్రి అని.. ప్రాణం పోతుంటే కూడా చూడలేదని..”
పావని మాటలు గుండెను కోస్తున్నట్లుగా ఉన్నాయి.
‘పిల్లలు తనని ప్రేమిస్తున్నారు. కానీ కనీసం తమని ఒక్కరోజయినా చూడని తండ్రి గురించి ఆలోచిస్తున్నారు. ఓడిపోయినట్లుగా ఉందిప్పుడు. రాయిలాగా కూర్చుంది ఆదిలక్ష్మి.
“చెప్పమ్మా! ఏం చేద్దాం?” పద్మజ ప్రశ్నకు తలతిప్పి చూసింది.
“డబ్బులు తీసికొని వెళ్లండి! పెద్దాసుపత్రిలో చేర్పించండి.” ఎంత ఆపుకున్నా కన్నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయామెకు.
పిల్లలు ముగ్గురూ తల్లిని పట్టుకున్నారు. తెల్లవారింది.
మల్లేశం రెండో భార్య ఫోన్ నెంబర్ కనుక్కొని వైద్యానికి డబ్బులు వేసింది పద్మజ.
పది రోజులకు మల్లేశం కోలుకుంటున్నాడని కబురొచ్చింది.
పిల్లలు ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు.
నెలరోజులు గడిచాయి.
ఆ రోజు ఆదివారం. పిల్లలు ముగ్గురు ఇంట్లోనే ఉన్నారు. ఆదిలక్ష్మి వంటిట్లో పనిచేసుకుంటోంది.
బెల్లు మోగింది. తలుపు తీసింది పరిమళ.
మల్లేశం.
పిల్లలకు ఊహ తెలిశాక అతడిని ఎప్పుడూ చూడలేదు కాబట్టి గుర్తు పట్టలేదు.
“నేను.. నేను.. మీ నాన్నని.”
పిల్లలు ముగ్గురు అలాగే చూస్తున్నారు. అతడి గొంతు విని వంటిట్లోంచి వచ్చింది ఆదిలక్ష్మి.
ఇద్దరి కళ్ళు కలుసుకొన్నాయి. ఒక్కసారి అసహ్యంగా అతడిని చూసి గిరుక్కున తిరిగి లోపలికి వెళ్లిపోయింది ఆదిలక్ష్మి.
అక్కడున్న కుర్చీలో కూర్చోబోయాడు మల్లేశం.
“మీరు మా నాన్ననా? ఆ పదానికి అర్ధం తెలుసా మీకు?” తీవ్రమైన స్వరంతో పద్మజ గట్టిగా అరిచింది.
కుర్చీలో కూర్చోబోతున్న వాడల్లా నిటారుగా నిల్చున్నాడు.
“మాకు చిన్నప్పటి నుండి నాన్న లేడు.. ఇప్పుడూ లేడు. ఇక ముందు నాన్న అవసరం మాకు లేదు. రాదు కూడా. మాకు మీరెవరో తెలియదు. లేని బంధుత్వాన్ని తవ్వుకుంటూ రావటమెందుకు? తక్షణం ఇక్కడి నుండి వెళ్లిపొండి!” కర్కశంగా చెబుతున్న పావని కళ్ళల్లో నుంచి నిప్పులు రాలుతున్నాయి.
“మీకు మేము డబ్బు సహాయం చేశామని వచ్చారు కదూ! అలాటి స్థితిలో ఉంటే ఎవరికైనా చేస్తాం! మానవత్వం అంతే! మీతో బంధుత్వం కలుపుకోవాలని మాకు లేదు.” అంటూ పరిమళ కూడా అక్కల ప్రక్కన నిల్చుంది.
భయంకరమైన నిశ్శబ్దం.
ఏమీ మాట్లాడలేదు మల్లేశం. తలవంచుకొని మెల్లగా వెళ్లిపోయాడు.
పిల్లలు ముగ్గురూ వంటింట్లోకి వచ్చారు.
“అమ్మా!” అంటూ పిలిచారు.
వెనక్కి తిరిగి చూసింది ఆదిలక్ష్మి.
“అమ్మా! నువ్వే మాకు ప్రాణం! మనల్ని వదిలి వెళ్లిన వాడితో మాకే చుట్టరికమూ లేదు. మా కోసం నువ్వు. నీ కోసం మేము! అంతే!” అంటూ పద్మజ తల్లిని చుట్టుకొంది. చిన్న పిల్లలు వచ్చి తల్లి భుజాల మీద చేతులు వేశారు. కళ్ళనీళ్లు తుడుచుకొని పిల్లల్ని దగ్గరికి తీసుకొంది ఆదిలక్ష్మి. ఆమె మనసిప్పుడు తేలికగా ఉంది.
(సమాప్తం)
