Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మనకేంటి లాభం?

దయాన్నే దినపత్రిక చదువుకుంటున్న నా దగ్గరికి కాఫీ కప్పుతో వచ్చింది నా శ్రీమతి సుందరి.

“ఏవండీ! ఈ రోజు పేపర్లో చూశారుగా! సాయంత్రం ఆరుగంటలనుండి నెక్లేస్ రోడ్డులో వివిధ ఫల పుష్ప ప్రదర్శన జరుగుతుందట! చాలా బాగుంటుంది. వెళ్ళి చూద్దామండీ!…” ప్రాధేయపూర్వకంగా అడిగింది సుందరి.

“అలాగే చూద్దాం… అయితే, ఐదుగంటలకల్లా బయలుదేరుదాం” అని చెప్పాను.

“సరేనండి… ఐదింటికే వెళ్దాం” అంటూ వంటింటివైపు నడిచి వెళ్ళింది సుందరి.

కాఫీ తాగుతూ పేపరు చదవటంలో నిమగ్నమయ్యాను నేను.

***

అనుకున్నట్లే సాయంత్రం ఐదున్నర గంటలకు నెక్లెస్ రోడ్ చేరుకుని, పార్కింగ్ ఏరియాలో కారు పార్కు చేసి, రోడ్ క్రాస్ చేస్తున్నాము.

ఇంతలో ఓ ఆటో వేగంగా మమ్మల్ని దాటుకుంటూ వెళ్ళింది. ఆ ఆటోలోనుంచి ఎవరో… “సార్…. సార్….” అన్నట్లు వినిపించింది. ఎవరయ్యుంటారబ్బా! అనుకుంటూ ఒక్కక్షణం ఆగి చూస్తూ నిల్చున్నాను.

అంతలో ఆటోని ఓ ప్రక్కగా ఆపి పరుగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చిన డ్రైవర్…

“సార్! నమస్తే సార్! నన్ను గుర్తుపట్టారా సార్… నేను యాదయ్యని” అంటూ సంతోషంగా చెప్పాడు.

అప్పుడు నాక్కూడా గుర్తుకొచ్చింది.

“ఆ!… యాదయ్యా! ఎలా వున్నావ్? మీ వాళ్ళంతా ఎలా ఉన్నారు?” అని కుతూహలంగా అడిగాను.

“మీ దయవల్ల మేమంతా ఆనందంగా ఉన్నాం సార్!”

“అవునా! చాలా సంతోషం యాదయ్యా. అదిసరే, ఏంటి సంగతులు?”

“ఆ రోజు ఏమంటా మీరు అన్నారో… అలాగే మాకు మంచిరోజులొచ్చాయ్ సార్! నా కూతురు ఓ బంగారం షాపులో సేల్స్ గరల్‍గా చేరింది. నెలకు జీతం ఐదువేల రూపాయలు సార్! నా కోడలు కూడా ఓ బట్టల్ షాపులో సేల్స్ గరల్‍గా చేరింది. తనకీ నెలకు ఐదువేల రూపాయల జీతం సార్!”

“చాలా మంచి విషయాలు చెప్పావు యాదయ్యా”తృప్తిగా అన్నాను.

“ఇంకా వినండి సార్… నేను చెప్పానే ఓ అబ్బాయి రెండో పెళ్ళి గురించి… ఆ అబ్బాయిని పెళ్ళి చేసుకోడానికి మా అమ్మాయి ఒప్పుకుంది సార్! పదిహేను రోజుల క్రితమే వాళ్ళిద్దరికి రిజిస్టర్ మ్యారేజ్ చేశాను సార్!”

“ఓ… వెరీగుడ్”

“ఓ పెద్ద ఇల్లు అద్దెకు తీసుకుని ప్రస్తుతం మేమంతా కలిసే వుంటున్నాం సార్! మా అల్లుడైతే ఓ పెద్దకొడుకులా ఇంటి బాధ్యతలన్నిటినీ తన భుజాన వేసుకున్నాడు సార్! నన్ను కూడా… రాత్రిళ్ళు ఆటో తోలొద్దూ… పగలు తోలితే సరిపోద్దిలే అన్నాడు సార్!”

“మా ఇంటిదాన్ని మంచి డాక్టరుకి చూపించి మందులు వాడుతున్నాం సార్. అదికూడా బాగా కోలుకుంది సార్!”

“ఇక మా అబ్బాయి ఆరోగ్యం కూడా మెరుగుపడుతోంది సార్. వాడు కూడా రెండూ మూడు నెలల్లో ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటానంటున్నాడు సార్! నలుగురి సంపాదనతో కుటుంబం కూడా ఈ ఇబ్బందుల్లేకుండా నడుస్తుంది సార్!” పట్టరాని ఆనందంతో చెప్పాడు యాదయ్య.

“ఎంత మంచి విషయాలు చెప్పావు యాదయ్యా! ఇప్పటికి ఆ దేవుడు మిమ్మల్నందర్నీ కరుణించాడు. దేనికైనా టైం రావాలంటారు. ఆ టైం మీకు ఇప్పుడొచ్చిందన్నమాట” అంతే ఆనందంతో చెప్పాను నేను.

“అవున్సార్…. మీరు మాకు శుభం జరగాలని కోరుకున్నారు కాబట్టే ఆ దేవుడి దయా మా మీద పడింది సార్. మిమ్మల్ని మీరు చేసిన మేలుని మేమంతా ఈ జన్మలో మరచిపోం సార్” అంటూ చేతులు జోడించి నమస్కరించాడు యాదయ్యా.

ప్రతి నమస్కారం చేస్తూ “అదేం లేదులే యాదయ్యా! మీ కష్టాలు తీరే సమయం వచ్చింది. అందుకే… అంతా మంచే జరుగుతుంది” అని చెప్పి, “ఇక బయలుదేరుదామా?” అని అడిగాను.

“అలాగే సార్ (కొంచెం ఆగి) సార్… సార్! ఒక చిన్న విషయం సార్! వచ్చే ఆదివారం మా బంధువులు, స్నేహితులకి దావత్ ఇస్తున్నాన్ సార్! దానికి మీరు కూడా రావాలి సార్” అని చెప్తూ సుందరివైపు తిరిగి…

“అమ్మగారూ! మీరుకూడా సార్‍తో కలిసి రావాలమ్మా! చెప్పాడు యాదయ్యా.

“అలాగే వస్తాంలే కాని, ఆటోలో ఎవరో ఉన్నట్లున్నారు. వాళ్ళకి లేటవుతుందేమో… ఇక బయలుదేరు” అని చెప్పాను.

“ఫరవాలేదు సార్! వాళ్ళు మనోళ్ళే సార్! సమయం, స్థలం మొబైల్‍లో మెసేజ్ పంపిస్తాను. నంబరివ్వండి సార్! (నంబరు తీసుకుని) ఇద్దరూ రావాలి సార్!” అని చెప్తూ… ఆటోవైపు పరుగెత్తుకుంటూ వెళ్ళాడు యాదయ్యా.

ఈ తతంగం అంతా ఏంటో అర్థం కాక తదేకంగా చూస్తూ, నిశ్చేష్టురాలైంది సుందరి.

“సుందరీ… సుందరీ…” అంటూ పిలిచాను.

పరధ్యానం వీడిన సుందరి నాతోపాటు నడుస్తుంది.

“కాసేపు లాన్‍లో కూర్చుని తరువాత ఎగ్జిబిషన్‍కు వెళ్దామండి” అంది సుందరి.

“సరే పద”మన్నాను.

లాన్‍లో కూర్చుంటే… చుట్టూ సేదతీరుతున్న కుటుంబాలు, సరదా ఆటలతో పిల్లల అల్లర్లు, తినుబండారాలు అమ్ముతూ… అందరినీ కొనమని అర్థించే చిరువ్యాపారులు, హుస్సేన్‍సాగర్ పైనుండి వీస్తున్న చల్లటి సాయంకాలపు వాయుతరంగాలు… మొత్తానికి హాయిహాయిగా ఉంది వాతావరణం.

“ఏవండీ!” పిలిచింది సుందరి.

“ఆ! ఏంటి చెప్పు”

“ఇంతకీ ఎవరండీ ఆ ఆటో డ్రైవర్ యాదయ్యా. మీకెలా పరిచయం? ఎక్కడ పరిచయం? ఏమిటో కష్టాలంటాడు! మీవల్లే మంచిరోజులంటాడు! మీ మేలు జన్మలో మరచిపోమంటాడు! ఏంటండీ! అసలేం జరిగింది?” నిలదీసి అడిగింది సుందరి.

“అదో పెద్ద కథ! అంతిమంలో సుఖాంతమైన ఓ కన్నీటి గాథ!” అంటూ గాఢంగా ఊపిరి పీల్చుకున్నాను.

“ఆహా! ఆ కథేంటో నాకూ చెప్పొచ్చు కదా! విని తరిస్తాను”

“వినే ఓపిక నీకుండాలే కాని చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు!”

“అయితే చెప్పండి వింటాను”

“సరే విను చెప్తాను”

***

ఆ రోజు సాయంత్రం ఆరుగంటలకు హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే ఓ కార్యక్రమానికి తప్పక వెళ్ళాలనుకున్నాను. అందుకు కారణం లేకపోలేదు.

రాష్ట్ర స్థాయిలో వివిధ రంగాలలో విశిష్టసేవలందిస్తూ సమాజసేవకు అంకితమైన ప్రముఖులకు సన్మానంతోపాటు, సేవారత్న బిరుదు ప్రధానం.

వారిలో వైద్యరంగంలో విశేష సేవలందిస్తున్న నా చిరకాల మిత్రుడు డాక్టర్ ప్రశాంత్ ఒకరు. అందుకే ఆ కార్యక్రమానికి వెళ్ళి నా మిత్రునికి జరుగబోయే సత్కారాన్ని చూసి ఆనందించాలనుకున్నాను.

సమయం నాలుగున్నర గంటలు కావస్తున్నది. కనీసం ఐదుగంటలకన్నా బయలుదేరకపోతే నిర్ణీత సమయానికి  రవీంద్ర భారతికి చేరుకోలేను. బయట చూస్తే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం జోరుగా కురుస్తుంది.

మామూలు రోజుల్లోనే ఈ హైదరాబాద్ ట్రాఫిక్‍లో కారు నడపడానికి ఇబ్బందిపడే నేను, ఇక వర్షంలో… అమ్మో! చాలా కష్టమే… పైగా ప్రమాదం కూడా.

కాని వెళ్ళితీరాలని నిర్ణయించుకున్నాను. చక్కగా ముస్తాబయ్యాను. వర్షం మాత్రం కొంచెం కూడా తగ్గుముఖం పట్టలేదు. క్యాబ్‍లో వెళ్ళడం తప్ప మరో మార్గం లేదనుకుని, క్యాబ్‍కోసం ప్రయత్నం చేశాను. అదృష్టంకొద్దీ వెంటనే దొరికింది. ఐదునిమిషాల్లో వచ్చింది కూడా. ఏమైతేనేం రవీంద్రభారతికి అనుకున్న సమాయానికి చేరుకోగలిగాను.

అప్పటికీ ఆహూతులంతా వచ్చి వారి వారి కుర్చీల్లో కూర్చున్నారు. అంతపెద్ద హాల్లో డాక్టర్ ప్రశాంత్‍ని కలుసుకోడానికి, నాకు అట్టే సమయం పట్టలేదు. ఎందుకంటే ఆనాటి సన్మానగ్రహీతలందర్నీ ముందువరుసలో ప్రత్యేకంగా కూర్చోబెట్టారు.

డాక్టర్ ప్రశాంత్ దగ్గరకు చేరుకుని శుభాకంక్షలు తెలిపాను. తరువాత వెనుక వరుసలో కూర్చుని ఉత్సాహంగా, ఉత్తేజంగా సాగుతున్న పాట కచేరీలో గాయనీ గాయకుల శ్రుతి మధురంగా ఆలాపిస్తున్న వీనుల విందైన పాటలను వింటూ ఆనందిస్తున్నాను.

పాట కచేరీ పూర్తయ్యే సమయానికి ముఖ్య అతిధికూడా వచ్చారు. కార్యక్రమ నిర్వాహకులు, ఒక్కొక్క సన్మాన గ్రహీతను వేదికపైకి ఆహ్వానించి, విశేషమైన వారి సమాజసేవా నిరతిని కొనియాడుతూ, వారు చేస్తున్న సేవాకార్యక్రమాల గురించి వివరంగా చెప్పారు. తదుపరి సన్మాన కార్యక్రమం బిరుదు ప్రదానం.

మిత్రుడు డాక్టర్ ప్రశాంత్‍కు జరిగిన సత్కారాన్ని కళ్ళారా చూసి ఆనందభరితుడనయ్యాను. తన సేవలను గుర్తించి, అంతటి పురస్కారాన్ని అందించిన కార్యక్రమ నిర్వాహకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తూ, డాక్టర్ ప్రశాంత్ చేసిన ప్రసంగం, సభికులను బాగా ఆకట్టుకుంది. అందుకు నిదర్శనం, హాలంతా మారుమ్రోగిన ఆ చప్పట్లే.

ఆ సమయంలో ‘కీర్తిశేషులు’ నాటకంలో ‘మురహరి’ చెప్పిన మరపురాని డైలాగ్ నా మదిలో మెదిలింది.

“వినరా ఆ చప్పట్లు…. ఆ చప్పట్లే కదరా.. కళాకారుని ఆకాశానికెత్తే నిచ్చెనలు… ఆ చప్పట్లే కదరా… కళాకారునికి పంచ భక్ష్యపరమాన్నాలు”

ఎందుకో తెలియదు నా కళ్ళు చెమ్మగిల్లాయ్!

బహుశా నేను నాటకాలాడే పాతరోజులు…

గుర్తుకొచ్చినందుకనుకుంటా….

కార్యక్రమం పూర్తవడానికి మరింత సమయం పట్టేటట్టుంది. హాలు బయటికొచ్చి చూశాను.

వర్షం కాస్త తగ్గుముఖం పట్టినట్లనిపించింది. వేదికపైనే కూర్చున్న డాక్టర్ ప్రశాంత్‍కి, నేను ఇంటికి బయలుదేరదామనుకుంటున్నానని, మొబైల్‍లో మెసేజ్ పంపాను. మెసేజ్ చూసుకున్న డాక్టర్ ప్రశాంత్, ఓ.కే అని తిరుగు మెసేజ్ పంపాడు.

ఆన్‍లైన్‍లో క్యాబ్ కోసం ప్రయత్నిస్తే ఆ సమయంలో అందుబాట్లో లేదు. పోనీ ఆటోల కోసం చూస్తే, అవీ లేవు. చేసేది లేక రవీంద్రభారతి నుండి బయటొకొచ్చి, ఆ వర్షపుజల్లులోనే తడుచుకుంటూ ఎదరురోడ్డుమీద ఆటోకోసం ఎదురుచూస్తూ నిల్చున్నాను.

ఒక ఆటో వచ్చి ఆగింది. నేను వెళ్ళాల్సిన చోటు చెప్పగానే 180 రూపాయలని చెప్పాడు ఆటోడ్రైవర్. 150 రూపాయలు ఇస్తానన్నాను. మారు మాట్లాడకుండా ఆటోని విసురుగా ముందుకు నడుపుకెళ్ళాడు డ్రైవర్. అంతలోనే మరో ఆటో వచ్చి ఆగింది. బేరం కుదరలేదు. ఆ ఆటోకూడా వెళ్ళిపోయింది.

ముచ్చటగా మూడో ఆటో వచ్చింది 180 రూపాయలు అడిగాడు డ్రైవర్. 150 రూపాయలు ఇస్తానన్నాను. పోనీ 160 రూపాయలు ఇవ్వండని డ్రైవర్ అడిగాడు.

“లేదు లేదు 150 రూపాయలే ఇస్తాను” అని ఖరాఖండీగా చెప్పాను.

“సార్! నేనో ఆటోడ్రైవర్‍ని నా స్థాయికి 20 రూపాయలు తగ్గించాను. మరి మీరు చాలా గొప్పవారు. మీ స్థాయికి ఓ పదిరూపాయలు పెంచలేరా సార్!”

ఆ ఆటోడ్రైవర్ అన్న ఆ మాటలు నా చెంపల్ని చెళ్ళుమనిపించాయి. నా హృదయాన్ని సూటిగా తాకాయి. మొట్టమొదట సారి నన్ను చూస్తే నాకే అసహ్యం వేసింది. లేకపోతే ఏంటి? ఒక ఆటోడ్రైవర్ 20 రూపాయలు త్యాగం చేయగలిగితే నేను ఓ 10 రూపాయలు త్యాగం చేయడానికి వెనుకాడటమేంటి? ఛ…ఛ…! ఎందుకంత ఖచ్చితంగా మాట్లాడాను అనుకుంటూ నన్ను నేను నిందించుకుంటూ మారుమాట లేకుండా ఆటోలో ఎక్కి కూర్చున్నాను.

ఆటో బయలుదేరింది. వర్షం ఎక్కువైంది. రోడ్లన్నీ జలమయమై ఉన్నాయి. దారి సరిగా కనిపించడం లేదు. ఆటో హెడ్ లైట్ ద్వారా వచ్చే స్వల్పకాంతిలో నిదానంగా, జాగ్రత్తగా నడుపుతున్నాడు ఆటోని డ్రైవర్.

“ఏం చేస్తాం బాబూ! ఇంటి ఖర్చులు పెరిగిపోతున్నాయి. వాటికోసం నా సంపాదన సరిపోవడం లేదు” అంటూ వెనక్కి తిరిగి చెప్పి, మరలా ముందుకు చూస్తూ, ఆటోని నడుపుతున్నాడు డ్రైవర్.

ఆ కొద్దిక్షణాల్లో నేను ఆటోడ్రైవర్‍ని తేరిపార చూశాను. సుమారు 65 సంవత్సరాల వయసు. నెరిసిన జుట్టు, మాసిన గడ్డం, నిద్రలేనట్టు ఎర్రబడ్డకళ్ళు, నిరాశ, నిస్పృహ, నిస్సహాయతా… అన్నీ కలగలపినట్లున్న ఆ ముఖకవళికలు… ఎందుకో నాకు అతన్ని చూస్తే విపరీతమైన జాలి కలిగింది.

ఆటోడ్రైవర్ అయినా, అతని మాటల్లో అనుభవసారం, సంస్కారం ప్రస్ఫుటంగా కనిపించాయి. ఎందుకో అతనితో మాట్లాడాలనిపించింది.

“ఏం పేరు బాబు నీది?”

“యాదయ్యండి”

“ఏ ఊరుమీది?”

“అసలైతే కరీంనగర్ జిల్లాలో ఓ మారుమూల పల్లెటూరు. అక్కడ చేసేందుకు చేతినిండా పనులు లేకపోవడం వల్ల, కుటుంబాలను పోషించుకోలేక, మా పూర్వీకులందరూ… నా చిన్నతనంలోనే హైదరాబాద్‍కు వచ్చారు. ఆ పన్లూ… ఈ పన్లూ… చేసుకుంటూ బతుకుల్ని నెట్టుకొస్తున్నమయ్యా”

“నిన్ను చూస్తుంటే పెద్దవయసులా వుంది. మరి ఇంత పెద్దతనంలో కూడా ఇంతలా కష్టపడుతున్నావేంటి?”

“ఏం చేస్తానండి తప్పట్లేదు మరి”

“నీకు పిల్లలెంతమంది?”

“పోయినోళ్ళు పోగా ఉన్నది ఓ కొడుకు, ఓ కూతురు”

“నీ కొడుకేం చేస్తున్నాడు?”

“అప్పుడేదో ఓ చిన్న ఉద్యోగం చేసేవాడు. అక్కడేవాడు ఒకమ్మాయిని ప్రేమించాడట. ఈ ప్రేమలు, గీమలు మనకొద్దురా అన్నాను. వాడు నా మాటలు వినే పరిస్థితుల్లో లేడు. ఆ అమ్మయినే పెండ్లి చేసుకున్నాడు. వాడికిప్పుడు బి.పి, షుగర్ ఇంకెయ్యో జబ్బులు… ఏ పనీ చెయ్యలేక ఇంటిపట్టునే ఉంటున్నాడు. ఇప్పుడు వాడికి తోడు వాడికో కొడుకు.”

“మరి నీ కోడలేం చేస్తుంది?”

“నా కోడలు ఏ పనీ చెయ్యదు సార్! మొగుడ్ని, కొడుకుని చూసుకుని ఇంట్లోనే ఉంటుంది.”

“కొడుకు పరిస్థితి బాధాకరమే… మరి నీ కోడలలైనా పిల్లోడ్ని భర్త దగ్గర వదిలేసి, ఏదైనా పని చేసుకోవచ్చు కదా!”

ఓ బట్టల షాపులోనో, ఓ బంగారు షాపులోనో  హెల్పర్‍గానో, సేల్స్ గరల్‍గానో పనిచేస్తూ, నెలకో ఐదువేలైనా సంపాదించవచ్చు కదా! ఏదో వేడినీళ్ళకు చన్నీళ్ళు తోడన్నట్లు నీకూ కొంచెం చేదోడు వాదోడుగా ఉండొచ్చు కదా!”

“మీరు చెప్పేది నిజమేనండి… ఏదో ఒక పని చేసి నాలు డబ్బులు సంపాదించాలని, కుటుంబానికి సహాయపడాలని తనకుండాలి కాని, నేనైతే బలవంతంగా పని చేయించలేను కదా సార్!”

“అవున్లే! మరి నీ కూతురు సంగతేమిటి యాదయ్యా?”

“దాని సంగతి మరీ ఘోరమయ్యా! కొద్దోగొప్పో చదువుకుంది. ఏదైనా పని చేసుకోవే అంటే వినదు. ఏ కుట్టుమిషనో నేర్చుకుని, బట్టలు కుట్టుకుంటూ, ఇంటి పట్టునే ఉంటూ, ఎంతో కొంత సంపాదించవచ్చు కదా అంటే వినకుండా మొరాయించింది. ఎప్పుడూ ఆ టీ.వి ముందు కూర్చుని గుడ్లప్పగించి చూస్తుంటది. లేకపోతే సెల్‍ఫోన్ చూస్తుంటది. ఏం చేస్తాం అంతా నా ఖర్మ” అంటూ తలబాదుకున్నాడు యాదయ్యా.

“పోనీ అలాంటప్పుడు పెండ్లి చేసి అత్తారింటికి పంపించకపోయావా! నువ్వు తల్చుకుంటే గంతకుతగ్గ బొంత దొరక్కపోతుంతా!” అంటూ ఓ ఉచిత సలహా ఇచ్చాను.

“అదీ అయ్యింది సార్! ఏం చెప్పమంటారు. కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుందంటారు. మా బంధువుల్లోనే ఓ అబ్బాయి వున్నాడు. చాలా మంచోడు. వాడికి నా అన్నవారవరూ లేరు. తాతలు సంపాదించిన ఓ చిన్న ఇల్లు ఉంది. గవర్నమెంటు ఆఫీసులో అటెండరుగా ఉద్యోగం చేస్తున్నాడు. నెలకు పదిహేనువేల రూపాయల జీతం. వాడికి మూడు సంవత్సరాల క్రితమే పెళ్ళి అయింది. భార్య అదేదో పెద్ద జబ్బొచ్చి సంవత్సరం క్రిందట కాలం చేసింది. వాడు ఇంకా చిన్నోడే కదా! మళ్ళా పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడు” ఉత్సాహంగా చెప్పుకుపోతున్నాడు యాదయ్యా.

“నీకిష్టమైతే ఆ అబ్బాయితో మాట్లాడి మీ అమ్మాయినిచ్చి పెండ్లి చేస్తే బాగుంటుంది కదా! ఆలోచించకపోయావా?”

“అదీ జరిగింది సార్! ఆ అబ్బాయికి మొదటి నుండి ఆ అమ్మాయంటే చాలా ఇష్టం. పెళ్ళి చేసుకుందామనుకున్నాడు కాని… అప్పట్లో పరిస్థితులు అనుకూలించక వేరే మనువు చేసుకున్నాడు… ఈ మధ్యనే నా దగ్గరికొచ్చి మా అమ్మాయిని చేసుకుంటానని అడిగాడు కూడా”

“మరి నువ్వేమన్నావ్?”

“నాకూ ఇష్టమే సార్. కాని మా అమాయి ఉందే అది పిచ్చిది. నామీదే పోట్లాడింది. రెండో పెళ్ళోడికిచ్చి పెళ్ళిచేస్తావా… అని ఏడుస్తూ నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది సార్” అంటూ నిరాశగా చెప్పాడు యాదయ్యా.

“ఏదో ఒక విధంగా నయానో, భయానో చెప్పి ఒప్పించకపోయావా?”

“లాభం లేదు సార్! ఈ కాలం పిల్లలు పెద్దోళ్ళ మాటలు వినేట్లు వున్నారా సార్! దానికి సుఖపడేంత రాతా ఆ భగవంతుడు రాయలేదు. పైగా ఆ అబ్బాయి అన్నాడు…. ఉన్న ఆ ఒక్క ఇంటిని తన తదనంతరం మా అమ్మాయికి చెందేట్లు ఇప్పుడే రాసిస్తానన్నాడు. పదిలక్షల ఇన్సూరెన్స్ ఉందంట సార్. తనకేమైన అయి చనిపోతే, ఆ ఇన్సూరెన్స్ సొమ్ము కూడా మా అమ్మాయికే వచ్చేట్లు ఇప్పుడే రాస్తానన్నాడు. కావాలంటే ఓ పెద్ద ఇల్లు అద్దెకు తీసుకుని అందరం కలిసే వుందామన్నాడు. నాకైతే ఆ సంబంధం వదులుకోవడం అస్సలు ఇష్టం లేదు సార్. కాని మా అమ్మాయి అదొక జగమొండి… ఎంత నచ్చచెప్పిన ఒప్పుకోలేదు” అంటూ నిట్టూర్పు విడిచాడు యాదయ్యా.

“సరే కాని… నీ భార్య విషయం చెప్పలేదేంటి యాదయ్యా?”

“చెప్పుకోడానికేముందయ్యా! అదీ ముసల్దయిపోయింది. ఆరోగ్యం అంతంతమాత్రం. అటు కూతురు సహాయం కాని, ఇటు కోడలు సహాయం కాని లేక… ఇంటెడు చాకిరీ చేసుకుంటూ ఉసూరుమంటూ చావలేక బతుకుతుంది” అంటూ కళ్ళనీళ్ళు పర్యంతమయ్యాడు యాదయ్యా.

నిజంగా యాదయ్య చెప్పిన మాటలు వింటుంటే గుండె తరుక్కుపోయింది. చాలా బాధనిపించింది. అదృష్టవంతుడ్ని చెడగొట్టలేం దురదృష్టవంతుడ్ని బాగుచేయలేం… అంటే ఇదేనేమో!

దురదృష్టం యాదయ్యని వదలకుండా అంతగా వెంటాడుతుంటే… పరిస్థితులు అలా కాక ఎలా వుంటాయ్? యాదయ్యని అతని కుటుంబాన్ని కాపాడాలని మనస్పూర్తిగా ఆ భగవంతుని వేడుకోవడం తప్ప నేనేం చేయగలను! హే భగవాన్! ఈ అభాగ్యులను వాళ్ళ కష్టాల నుండి నువ్వే కడతేర్చి, వాళ్ళకి శుభం చేకూర్చు తండ్రి! అంటూ మనసులోనే ప్రార్థించాను.

మరికాసేపట్లో నేను దిగాల్సిన స్థలం రాబోతుంది. ఈ లోపల యాదయ్యకు నావంతుగా కొంచెం ధైర్యం చెప్పాలనిపించింది.

“చూడూ యాదయ్యా! కష్టాలనేవి మనుషులకు కాక మానులకొస్తాయా? ప్రతి ఒక్కరికీ కష్టాలనేవి ఏదో ఒక రూపంలో, ఎప్పుడో ఒకసారి, వస్తూనే వుంటాయి.

ఆ మాటకొస్తే రామయ్య, సీతమ్మ లాంటి దైవస్వరూపులు కూడా ఎన్నెన్నో కష్టాలు పడ్డారని రామాయణం చెప్తుంది! వారితో పోల్చుకుంటే మానవమాత్రులం మనమెంత?

ఒక్కసారి ఆలోచించు! రాత్రి చీకటి తరువాత పగటి వెలుగు వస్తుంది కదా… అలాగే కష్టాలు కలకాలం ఉండవు. ఏదో ఒకరోజు మీ కష్టాలన్నీ… మబ్బుల్లా తొలగిపోతాయి. మీ అందరినీ మంచి రోజులు వెతుక్కుంటూ వస్తాయి. ఆరోజు మరెంతో దూరంలేదులే… నీకంతా మంచే జరుగుతుంది. నువ్వు ధైర్యంగా వుండు!” అంటూ యాదయ్యకు ఉపశమనం కలిగించే మాటలు చెప్పాను.

ఇంతలో మా అపార్టుమెంట్ రానే వచ్చింది. ఆటోని ఆపమన్నాను. రెండొందల రూపాయల నోట్లు ఇచ్చాను. తిరిగి నలభై రూపాయలు ఇవ్వబోతుంటే వద్దులే… ఉంచుకోమని చెప్పి బయలుదేరాను.

అప్పుడే ”అయ్యా!” అని ఓ గద్గద స్వరం నన్ను పిలిచినట్లనిపించింది.

వెనక్కి తిరిగి చూస్తే యాదయ్యా!ఆశ్చర్యం! ఏడుస్తున్నాడు! రెండు కళ్ళవెంట నీళ్ళు జలజల రాలుతున్నాయ్!!

“అయ్యో! ఏంటిది యాదయ్యా! ఏడుస్తున్నావా!! నువ్వే ఇలా డీలా పడిపోతే ఇక నీ కుటుంబానికి దిక్కెవరు? త్వరలోనే నీకు అంత శుభమే జరుగుతుంది నువ్వింకేం బాధపడొద్దు!” అంటూ యాదయ్యా భుజం తట్టాను.

కళ్ళు తుడుచుకున్న యాదయ్య… నా రెండు చేతులను, తన రెండు చేతుల్లోకి తీసుకుని…

“సార్! మీ మాటలు వింటుంటే చాలా సంతోషమైంది సార్… ఏడుపొచ్చింది సార్! నా బాధలన్నీ విన్నారు.. నన్ను ఓదార్చారు. మాకు మంచి జరగాలని మీరు కోరుకున్నారు. ఆ దేవుడే మీ రూపంలోవచ్చి నాకు అభయం ఇచ్చినట్లనిపించింది సార్! మీ మేలు ఈ జన్మలో మరిచిపోనండి.

మీరు, మీ భార్య, మీ పిల్లలు, మీ మనవళ్ళు, మీ మనవరాళ్ళు… అందరూ సల్లగుండలయ్యా! సల్లగుండాలయ్యా!!” అంటూ నా చేతుల్ని వదిలేశాడు యాదయ్య.

“సరే యాదయ్యా! ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో ఒకచోట, మరలా మనం కలుసుకుంటాంలే… అప్పుడు శుభవార్తలు చెబుదువ్ గాని… ఇక వెళ్ళిరా!”

“తప్పక కలుసుకుంటాం సార్! ఆ దేవుడే మనల్ని కలిపిస్తాడు. ఉంటాన్ సార్! నమస్తే సార్!” అంటూ ఆటోని వెనక్కి తిప్పుకుని వెళ్ళిపోయాడు యాదయ్యా!

ఆటో కంటికి కనిపించినంతసేపూ చూస్తూ నిల్చున్నాను.

***

“అదన్నమాట జరిగింది” అంటూ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను.

“అంతా బాగానేవుంది కాని, ఇందులో మీరు చేసిందేముందండీ? అంతగా మిమ్మల్ని పొగడాల్సిన అవసరం ఏముంది? జీవితమంతా గుర్తుంచుకోదగ్గ పని… మీరు ఏం చేశారని? ఏదో శుభం జరగాలని మామూలుగా కోరుకున్నారు. అంతేగా… అంత మాత్రానికే అంత ఇదైపోవాలా ఆ యాదయ్యా! మరీ అతికాక పోతేను!” అంటూ వ్యంగ్యం, వెటకారం జోడించింది సుందరి.

“ఓసి వెర్రిముఖం! అంతేనా నీకర్థమయింది!!” అడిగాను.

“సరే… నా కర్థం కాందేందో, మీ కర్థం అయిందేదో… నాకూ చెప్పండి. తెలుసుకుంటాను!” ఎగతాళిగా అంది సుందరి.

“చూడు సుందరి! పెద్దలు చెప్పారు. మనసులోని బాధలను, కష్టాలను ఇతరులతో పంచుకుంటే సగం భారం తగ్గిపోతుందని…

కాని అలా పంచుకునే మనిషి దొరకాలి కదా!

దొరికినా ఆ మనిషికి పూర్తిగా వినడానికి సమయం ఉండాలి కదా!

సమయం ఉన్నా వినే ఓర్పు ఉండాలి కదా! ఓదార్చే నేర్పు ఉండాలి కదా! ధైర్యం చెప్పే సుగుణం ఉండాలి కదా!

బాధల్లో ఉన్నవారికి శుభం జరగాలనే బలీయమైన ఆకాంక్ష కూడా ఉండాలి కదా! అందుకు దేవుడ్ని తగిన రీతిలో ప్రార్థించాలి కదా!

అలాంటి మనిషి, స్నేహితుల్లోనో, బంధువుల్లోనో, సహచరుల్లోనో, సహోద్యోగుల్లోనో వుండవచ్చు… వెతుక్కుంటే దొరక్కపోరు!

అలాగే కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న యాదయ్యకు తన బాధలు చెప్పుకునేందుకు, సరైన వ్యక్తిగా, ఆ రోజు నేను కాకతాళీయంగా తారసపడ్డాను” చెప్పడం కొంచెం ఆపాను.

“మీ చెప్పింది నిజమేనండి! నా మట్టిబుర్రకి ఆ సంగతి తట్టనేలేదు… ఆ…ఆ… తరువాత…” కుతూహలంగా అడిగింది సుందరి.

“మానవసేవయే, మాధవసేవ అంటారు. ఇప్పుడు నేను చేసింది కూడా ఒకవిధంగా సేవనే” అన్నాను.

“అదెలా?” ఆశ్చర్యంగా అడిగింది సుందరి.

“యాదయ్యా తన బాధలను నాతో పంచుకున్నాడు. భారాన్ని తగ్గించుకున్నాడు. నేనా సౌలభ్యాన్ని అతనికి కలగజేశాను.

ఓపిగ్గా విన్నాను, నేర్పుగా ఓదార్చాను, అతనికి అతని కుటుంబానికి శుభం చేకూర్చాలని భగవంతుడ్ని ప్రార్థించాను. ఇదే యాదయ్యకు నేను చేసిన సేవ!”

“ఇలా సేవ చేశారు బాగానే ఉంది కాని మనకేంటి లాభం?” అడిగింది సుందరి.

“ఎప్పుడైతే మనం ఎదుటివారి కష్టాలు తొలగిపోవాలని కోరుకుంటామో అప్పుడే ఆ దేవుడు మన కష్టాలనుకూడా తొలగిస్తాడు”

“ఎప్పుడైతే మనం ఎదుటివారికి శుభాలు కలగాలని కోరుకుంటామో… అప్పుడే ఆ దేవుడు మనకు శుభాలు కలుగజేస్తాడు! అర్థం అయిందనుకుంటాను!” అంటూ ముగించాను.

“చాలా బాగా అర్థమయిందండి. మీరు చెప్పిన విషయాలన్నీ… ఆదర్శప్రాయమైనవి. ఆచరణయోగ్యమైనవి… ఎంతైనా మీరు చాలా గ్రేట్ అండీ!” మెచ్చుకోలుగా అంది సుందరి.

“ఇందుకేం తక్కువలేదు! పద ఎగ్జిబిషన్‍కి వెళ్దాం” అంటూ నవ్వుతూ బయలుదేరాను.

తలొంచుకుని నన్ను అనుసరించి సుందరి…

Exit mobile version