ఆదివారం… ఎన్నో పనులు చేయాలనుకునే రోజు… చివరకు ఏ పనీ చేయని రోజు… లేదంటే ఒక పని చేయాలనుకుని వేరేదో పని చేసే రోజు. మొత్తానికి అనుకున్న ఆర్డర్ తప్పే రోజు. ఇల్లు సర్దుదామని అనుకున్నా. ఇంటినిండా ఈ క్యాలెండర్లు ఒకటి.. ప్రతిగదిలో కాలాన్ని గుర్తు చేస్తూ.. అరె… ఈ గదిలో క్యాలెండర్లో ఇంకా జనవరి నెల పేజీ అలాగే ఉండిపోయింది. మే నెల కూడా అయిపోతుంటే ఇంకా జనవరిలోనా.. హూ.. కొత్త సంవత్సరం, కొత్త సంవత్సరం అంటే అప్పుడే పాతబడిపోయింది. అంతకు ముందే పేపర్లో ఇంటర్ పరీక్షా ఫలితాలు, అవకతవకలు, కొంతమంది విద్యార్థుల ఆత్మహత్యలు రేపిన దుమారం… గురించి చదివా. టీవీలో ఓ చర్చాకార్యక్రమం కూడా చూశాను. క్యాలెండర్లో అయిపోయిన నెలల పేజీలను తీసేద్దామని క్యాలెండర్లు అందుకున్నానో లేదో నా మనసు పరీక్షా ప్రపంచంలోకి పరీక్షగా తొంగి చూడసాగింది.
ఇంగ్లీషు క్యాలెండరు జనవరి ముఖాన్ని అలంకరించుకుని కొత్త సంవత్సరాన్నిమోసుకురాగానే కుర్రకారంతా ‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ మస్తీ చేసుకుంటారు. కానీ పాపం ఆ జోష్‌ను తగ్గించడానికి, మార్చి నెల కాచుకొని ఉంటుంది. అదే కదా మరి విద్యార్థులకు పరీక్షా కాలం. ఈ విషయం పైనే సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు ‘శివ’ చిత్రంలో కాలేజీ కుర్రకారు భావాలకద్దంపడుతూ ఓ చక్కని పాట రాశారు. అదే…
‘బోటనీ పాఠముంది.. మేటనీ ఆట ఉంది, సోదరా ఏది బెస్టురా…’ అని ఒకరంటే; ఇంకొకరు ‘బోటనీ క్లాసంటే బోరుబోరు హిస్టరీ రొస్టు కన్న రెస్టు మేలు’ అనీ; ‘పాటలూ, ఫైటులున్న ఫిల్ము చూడు బ్రేకులు, డిస్కోలు చూపుతారు…’ అని మరో రస హృదయుడు అంటాడు. బుద్దిమంతుడు మరొకరు ‘అయ్యో మార్చినే తలుచుకుంటే మూర్ఛలే ముంచుకొచ్చె మార్గమె చెప్పు గురువా.. కొండలా కోర్సు ఉంది ఎంతకీ తగ్గనంది ఏందిరా ఇంత గొడవ’ అని వాపోతాడు. ఇంకొకరు అభయమిస్తూ ‘ఎందుకీ హైరానా వెర్రినాన్నా వెళ్లరా సులువైన దారిలోన.. ఉందిగా సెప్టెంబరు మార్చి పైన – వాయిదా పద్ధతుంది దేనికైనా…’ అని తరుణోపాయం చెపుతారు..
ఇప్పుడయితే సెప్టెంబర్ దాకా ఆగే పనిలేకుండా ఇన్‌స్టంట్లు వచ్చాయి. టేకిట్ ఈజీ పాలసీ వాళ్లకి పరీక్షలంటే డోంట్ కేర్ వైఖరే ఉంటుంది మరి. నిజమైన విద్యార్థులకు మాత్రం అది పరీక్షా కాలమే. అన్నట్లు విద్యార్థులకే కాదు, తల్లిదండ్రులకూ పరీక్షాకాలమే. వారు కూడా బిడ్డల మానసిక యాతనలో కొంత భాగం అనుభవిస్తూనే ఉంటారు. ఇప్పుడందులోనూ ఎమ్‌సెట్లు, ఇంకా రకరకాల సెట్లు, ర్యాంకులు, సీట్లు ఇదో చదువుల యుద్ధ దృశ్యం. యుద్ధమంటే గుర్తుకొస్తోంది. రామరావణ యుద్ధం తర్వాత సీతకు ఎదురైన అగ్నిపరీక్ష. మాయలేడి పన్నాగంతో దుష్టరావణుడు సీతనెత్తుకుపోగా, అశోకవనాన శోకమూర్తిగా ఆమె కాలం గడిపింది, ఎట్టకేలకు తన రాముడు వచ్చి రావణ సంహారం చేసి, తనకు బంధవిముక్తిని కలిగించాడని సంతోషించినంతలోనే ఆమెను అల్లంత దూరాన ఆపివేశాడు రాముడు. అవమానాగ్ని చల్లారిందన్న ఆనందం ఆవిరయ్యేలా దుస్సహమైన అనుమానం తాలూకు అవమానాగ్నిని రగల్చడంతో సీత మనసు భగ్గుమంది. మండే మనసు ముందు అగ్నిపరీక్ష సీతకేపాటిది? ఆ సన్నివేశాన్ని కళ్లకు కట్టే పాటను నా చెవి గుర్తు చేసుకొంటోంది..
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా..
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా….
చేరవచ్చు ఇల్లాలిని చూసి శీల పరీక్షను కోరె రఘుపతి
అయోనిజపైనే అనుమానమా?
ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలికా ఈ పరీక్షా..
పతి ఆనతి తలదాలిచి అగ్ని దూకె సీత
హుతవాహుడు చల్లబడి శ్లాఘించెను మాత
సురలు పొగడ ధరణిజతో పురికి తరలె రఘునేత..
ఇప్పుడు అగ్నిపరీక్షల్లేవుకానీ అనుమానాసురులు నిశ్శబ్దంగా అర్ధాంగిని అగ్నికి ఆహుతి చేసిన సంఘటనలు అడపాదడపా జరుగుతుండటం తెలిసిందే. లిటరల్‌గా అగ్నిపరీక్షలు కాకపోయినా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాలి వస్తే వాటిని అగ్నిపరీక్షలుగానే పరిగణిస్తున్నాం. ఒకప్పుడు పరీక్షలంటే పెద్దయ్యాకే అనుకునేవాళ్లు. అందుకే చీకు, చింతా లేని బాల్యంలోనే ఉండగలిగితే ఎంత బాగుండు అనుకుంటుంటారు. కానీ ఆ రోజులు ఎప్పుడో మారిపోయాయి. ఇప్పుడు ఎంట్రన్స్ పరీక్షతోనే పిల్లలకు స్కూల్లో సీటు వస్తోంది. అంటే ఆ వయసు నుంచే పరీక్షలకు అలవాటుపడాలి. సరే మౌఖిక పరీక్షలకదా అనుకుంటే స్కూల్లో చేరగానే వాళ్లకు నిత్యం పరీక్షలానే ఉంటుంది. అలా ఎల్‌కేజీ నుంచే జీవితంలో పరీక్షల హంగామా మొదలవుతోంది. ఆపైన ఏడాది పొడుగునా ఎస్సైన్‌మెంట్లు, స్లిప్ టెస్ట్‌లు, యూనిట్ టెస్ట్‌లు, ఇంకా క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ… ఇవన్నీ మామూలే. టెన్త్ కొచ్చేసరికి పరిస్థితి మరింత వేడిగా మారుతుంది. ఉదయానే మేల్కొలుపులు, అలారం మోగగానే దాని పీకనొక్కి మళ్లీ ముసుగుతన్నడాలు, అమ్మ వచ్చి అరవడం, అప్పుడు పుస్తకం ముందేసుకోవటం, అమ్మ అటు వెళ్లగానే పుస్తకంమీదే ఒరిగి నిద్రపోవడం, ఈసారి నాన్నదృష్టి లోపడటం, ఇంక అమ్మానాన్నలిద్దరి ‘ఆశీర్వచనాలు’. అమ్మ టీ వగై రాలు అందించడం, పక్కనే కూర్చొని తన నిద్రను త్యాగం చేయడం… అమ్మగాక ఇంకెవ్వరు చేయగలరు? ఈ పరీక్షల గొడవ ఈనాటిదేం కాదు, నానాటిదే. ‘పెళ్లిచేసి చూడు’ చిత్రంలో పరీక్షలకు చదవకుండా, పరీక్షలు ఎగ్గొట్టే పిల్లల గురించి ఓ చక్కని పాట ఉంది. పరీక్షలు ఇష్టంలేని ఆ పిల్లవాడు ఇలా మొదలెడతాడు.
‘పరీక్షలు, పరీక్షలు, పరీక్షలు, పాడుపరీక్షలు పాఠాలు రాకపోయినా కూచున్నాయి. పరీక్షలెలా ఎగొట్టడం..ఆ.. కడుపులో నొప్పి వచ్చిందని వంక పెడితే సరి’ అనుకొని వెంటనే అందుకొంటాడు…
‘అమ్మా నొప్పులే, అమ్మమ్మా నొప్పులే… ఫస్టుక్లాసులో పాసవుదామని పట్టుపట్టి నే పాఠాల్ చదివితే పరీక్షనాడే పట్టుకున్నదే, బడికెట్లాగే వెళ్లేదే.. అమ్మా…’
అంతలో అతడి మాటలు నమ్మిన అమ్మమ్మ వచ్చి ‘బాబూ లేవరా ఈ మందు తాగరా పరీక్ష కోసం దిగులుపడకురా, వచ్చే ఏటికీ పాసవుదువులే నువ్వు బాగుంటే మాకు చాలురా నిక్షేపంగా ఇంటనుండరా” అంటుంది పాపం అమాయకంగా.
కానీ అమ్మకు మాత్రం పిల్లవాడిది దొంగవేషమని తెలుసు. అందుకే ప్లేట్లో గారెలు, బూరెలు తెచ్చి.. ఇలా పాడుతుంది.
‘అయ్యో గారెలా, అయ్యయ్యో బూరెలా పరీక్షలొచ్చే బాబుకోసమని కమ్మకమ్మగా నేను చేస్తేనే అయ్యనోట శని పట్టెను ఏమో మాయలమారి నొప్పులొచ్చేనే…’ అంటుంది.
గారెలు, బూరెలు చూసిన కుర్రాడికి నోరూరిపోతుంది, వెంటనే ‘అమ్మా పాయెనే, అమ్మమ్మా పాయెనే; అమ్మా ఒక్కటే, అమ్మమ్మా ఒక్కటే’ అంటే
‘బాబూ తినకురా, నీ కడుపునొప్పిరా..’ అని అమ్మమ్మ అమ్మా,
‘ఒక్కటే… అమ్మమ్మా ఒక్కటే’- పిల్లవాడు
‘బుద్ధివచ్చెనా నీకు బుద్ధివచ్చెనా’-తల్లి
‘బుద్ధివచ్చెనే… బడికిపోదునే, బాగా చదువుకుందునే’ -పిల్లవాడు
అలా తల్లి తెలివిగా గారెలు, బూరెలతోనే పిల్లవాడి దొంగాట కట్టిస్తుంది. అన్నట్లు పరీక్ష ఎగ్గొట్టేందుకు దొంగనాటకం ఆడిన పిల్లవాడిగా నటించింది ప్రముఖులు మోహన్ కందా గారు. ఆయన ఐఎఎస్ అయి, గతంలో ఆంధ్రపదేశ్ ప్రభుత్వ సీఎస్‌గా పనిచేసి రిటైరయ్యారు. ఇప్పుడు కూడా కొంతమంది పిల్లలు స్కూలుకు వెళ్లడం ఇష్టంలేకపోతే కడుపునొప్పి మంత్రం పఠించడం తెలిసిందే.
పరీక్షలంటే మాటలా? హాల్ టికెట్లు, పెన్నులు వగైరాలు మరచి పోకుండా తీసుకెళ్లాలి, నిముషం ఆలస్యం కాకుండా ట్రాఫిక్ విషవలయంలో చిక్కకుండా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి, తోటి విద్యార్థులతో మాట్లాడితే ఒక్కోసారి భయం పోవచ్చు, మరికొన్నిసార్లు భయం పెరగనూవచ్చు. ప్రశ్నాపత్రాలు లీక్ కావడం తీరని సమస్య. ఇక పరీక్షాహాలులో తాచెడ్డ కోతి వనమెల్లా చెరచిన చందాన కాపీ రాయుళ్ల డిస్టర్బెన్స్, చిట్టీల గోలలు, ఫ్లయింగ్ స్క్వాడ్ల హడావుడి, ప్రశ్నాపత్రం వేరే సబ్జెక్టుది ఇస్తేనో, ప్రశ్నల్లోనే లోటుపాట్లు ఉంటేనో చేయగలిగేదేమీ ఉండదు. రాసే పిల్లలకు చేతులాడవు, అంతే. ఈ ఘట్టాలన్నీ దాటి, హమ్మయ్య పరీక్షలయ్యాయి అనుకొంటే కుదరదు. పరీక్షాపత్రాలను దిద్దే ప్రక్రియ అదృష్టాలను తారుమారు చేసేస్తుంది. నిలదీసి అడిగితే ఎవరికివారు నేనెరుగ, నేనెరుగ అంటూ నెపం ఇంకొకరిపై నెట్టివేయడం తప్ప జవాబు దొరకదు. రీవాల్యుయేషన్లు, రీకౌంటింగ్లు కాలహరణం తప్ప కలిసొచ్చేదేమీ ఉండదు. ఇంతకు పూర్వం పరీక్ష బాగా రాయాలి, ఫస్ట్ క్లాస్లో పాసవ్వాలి, మంచి ర్యాంక్ రావాలి అని దేవుడికి దండం పెట్టుకునే పిల్లలు, పెద్దలు ఇప్పుడు పరీక్షలు సజావుగా జరగాలి, పేపర్లు సక్రమంగా దిద్దాలి, మా న్యాయమైన మార్కులు మాకు రావాలి అని కూడా దండం పెట్టుకోవలసి ఉంటుంది.
కాలేజీ స్థాయి కెదిగారు, ఇక ఫర్వాలేదు అనుకోవటానికి లేదు, వాళ్లకు చదువు పరీక్షలతో పాటు ప్రేమ పరీక్షలు కూడా ఎదురవుతాయి. ఇతిహాసాల్లో రాజకుమార్తెల పెళ్లిళ్లంటే స్వయంవరాలే. రాజకుమారులు ఆ స్వయంవర పరీక్షల్లో నెగ్గాల్సిందే. రాముడు శివధనస్సు విరిచే సీతను పెళ్లాడింది, అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించే ద్రౌపదిని పెళ్లాడింది. అంతెందుకు ఎన్నో జానపద కథల్లోనూ ఈ పరీక్షలు పరిపాటే.
చెంచులక్ష్మి చిత్రంలో పాట మదిలో మెదిలింది.. అది.. ‘చెట్టులెక్కగలవా, ఓ నరహరి పుట్టలెక్కగలవా? చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలవా? ఓ నరహరి చిగురు కోయగలవా?’ అని అడిగితే ’చెట్టులెక్కగలనే, ఓ చెంచిత పుట్టలెక్కగలనే.. చెట్టులెక్కిఆ చిటారు కొమ్మల చిగురుకోయగలనే…’ అంటూ అమ్మాయి విసిరే సవాళ్లన్నిటికీ సై అనగలగాలి, ఆ ప్రేమపరీక్షలో నెగ్గితేనే అమ్మాయి వరించేది. పాతాళ భైరవి సినిమాలో ‘ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడు అయ్యో.. పాపం పసివాడు’ కథ తెలిసిందే.
ఇక భక్తులకు దేవుడు పెట్టే పరీక్షలు ఇన్నీ, అన్నీ కావు. ముఖ్యంగా హరిశ్చంద్ర మహారాజు సత్యవాది. ఆయన సత్యవ్రతాన్ని పరీక్షకు గురిచేస్తాడు భగవంతుడు. అడవిలో విహరిస్తున్న హరిశ్చంద్రుడికీ ఓ స్త్రీ కేక వినపడగా, ఆమెను కాపాడాలన్న తలంపుతో హరిశ్చంద్రుడు వేగంగా ముందు కెళ్లి విశ్వామిత్రుడి ఆశ్రమంలో అడుగిడతాడు. దాంతో హరిశ్చంద్రుని వల్ల తపోభంగం జరిగిందని ఆగ్రహెూదగ్రుడవుతాడు విశ్వామిత్రుడు. అతణ్ని శాంతింప జేయడం కోసం పరిహారంగా తన రాజ్యాన్ని ఇచ్చేస్తానంటాడు హరిశ్చంద్రుడు. విశ్వామిత్రుడు దాంతో సంతృప్తిపడక మరి దక్షిణ ఏదంటాడు. రాజ్యం మొత్తం కోల్పోయిన హరిశ్చంద్రుడి దగ్గర ఇవ్వడానికేముంటుంది? అందుకే ఒక మాసం గడువుకోరుతాడు. సరేనంటాడు విశ్వామిత్రుడు. హరిశ్చంద్రుడు రాజ్యాన్ని వీడి, భార్యాబిడ్డలతో కాశీజేరతాడు. కానీ అక్కడ ధనార్జన ఏమీ చేయలేకపోతాడు. గడువు దగ్గరపడుతుండటంతోభర్త బాధను చూడలేక తనను ఎవరికైనా బానిసగా అమ్మేయమంటుంది. ఆమె చెప్పినట్లే ఓ బ్రాహ్మణుడికి భార్యను అమ్మేస్తాడు హరిశ్చంద్రుడు. వారు వెళ్లిపోతుండగా కొడుకు లోహితాస్యుడు ఏడవటంతో అతణ్ని కూడా బ్రాహ్మణుడికి అమ్మేస్తాడు. అయినా దక్షిణకు సరిపడ ధనం పోగవలేదు. అందుకని తనన – సైతం ఓ చండాలుడికి అమ్ముకుంటాడు. అలా విశ్వామిత్రుడికి దక్షిణ చెల్లించి, కాటికాపరిగా పనిచేస్తుంటాడు హరిశ్చంద్రుడు. అంతలో ఓరోజు చంద్రమతి, పాముకాటుతో మరణించిన లోహితాస్యుడి శవాన్ని మోసుకు వస్తుంది. హరిశ్చంద్రుడు కాటి సుంకం చెల్లించాలంటాడు. ఆమె తన వద్ద ఏమీలేదంటుంది. నీ మంగళసూత్రం అమ్మమంటాడు హరిశ్చంద్రుడు. భర్తకు తప్ప తన మంగళసూత్రం ఎవరికీ కనపడదు కాబట్టి, కాటికాపరిగా ఉన్నది భర్తేనని గుర్తిస్తుంది. ఇంకేముంది, ఆమె దుఃఖసముద్రమవుతుంది. అయినప్పటికీ అతడికి ప్రతభంగం కాకూడదని ఆమె తనకున్న ఏకైక ఆస్తి తాను ధరించిన చిరేనని, అందులో సగం సుంకంగా చెల్లిస్తానని, చీరెను తీయబోతుంది. అప్పుడు దేవతలు ప్రత్యక్షమయి, హరిశ్చంద్రుడు పరీక్షలో ఉత్తీర్ణుడయినట్లు పేర్కొంటారు. ఇలా భక్తి పరీక్షలెదుర్కొన్న భక్తులెందరో పురాణాల్లో ఉన్నారు. పరీక్షల్లో ‘శల్య పరీక్ష’ ఒకటి. భారతంలో కర్ణుడికి రథ సారధిగా ఉన్న శల్యుడు ఏమాత్రం సహకరించకపోగా, తన నిరుత్సాహపు మాటలతో కర్ణుడికి పెద్ద పరీక్షలా తయారవుతాడు.
పరీక్షలు ఎన్నో రకాలు. క్లాస్ టెస్ట్‌లు, స్లిప్ టెస్ట్‌లు, యూనిట్ టెస్ట్‌లు, ఓరల్ టెస్ట్‌లు, రిటెన్ టెస్ట్‌లు, పబ్లిక్ పరీక్షలు, పెద్ద పరీక్షలు, క్విజ్ పరీక్షలు వగైరాలు. నేటికాలంలో ఆన్లైన్ పరీక్షలు మామూలైపోయాయి. రాతపరీక్ష ఎంత బాగా రాసినా, మౌఖిక పరీక్షలో తడబడి విఫలులవుతుంటారు కొందరు. కొంతమంది ఎంతయినా నోటితో ధాటి చూపగలరు కానీ రాయలేరు.
పెళ్లిచూపుల్లో పరీక్ష అదోరకం. ‘ఏం చదివావు, ఉద్యోగం చేస్తున్నావా, చేస్తావా, చేయవా? పాడతావా? వంటొచ్చా?’ వగైరా ప్రశ్నలుంటాయి. అయితే ఇప్పుడిప్పుడు ఇలాంటి పరీక్షలు తగ్గుతున్నాయనే చెప్పాలి. అబ్బాయి, అమ్మాయి పరస్పరం మాట్లాడుకోవడంతో అమ్మాయికి పెళ్లిచూపుల పరీక్ష కొంతమేరకు తగ్గిందనే చెప్పాలి.
బేతాళ కథల్లో బేతాళుడు, శవాన్ని మోస్తున్న విక్రమార్కుడికి కథ వినిపించి, ‘రాజా! కథ విన్నావుగా, ఇప్పుడు నేనో ప్రశ్న అడుగుతా. సమాధానం చెప్పావా, సరే. జవాబు చెప్పలేకపోయావా, నీ తల వేయి వక్కలవుతుంది’ అంటూ భీకరంగా బెదిరిస్తుంటాడు. కానీ విక్రమార్కుడు ఎప్పుడూ దీటైన జవాబులిస్తూ, బేతాళుడితో పాటు, పాఠకుల్ని సైతం అలరిస్తాడు.
జీవితం ప్రశ్నల మయం. పరీక్షలంటే ప్రశ్నలే కదా.
బాటసారి చిత్రంలో ఇద్దరు స్నేహితురాళ్ల మధ్య సంవాదంలా నడిచే ఓపాట ఇలా ..
‘కనులకు దోచి చేతికందని ఎండమావులున్నయ్
సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని
కనులకు దోచి చేతికందని ఎండమావులున్నయ్
సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని
భూమి జనించి ఆకలి కొదగని ఫలములున్నవి కొన్ని
మనసున నిండి పలుకగరాని తలపులున్నవి కొన్ని
తలపులున్నవి కొన్ని
సృష్టి చేసినది దేవుడైన మరి నాశము నేల సృజించే
పలుకు నొసగినది దేవుడైన మరి మూగలనేల సృజించే
కనుల నొసగినది దేవుడైన మరి అంధులనేల సృజించే
వెలుగునిచ్చినది దేవుడైన మరి చీకటినేల సృజించే
పెను చీకటినేల సృజించే
వేద శాస్త్రములు చదివినవారే ఎరుగరు సృష్టి విలాసం
అల్పబుద్దితో జ్ఞానదాతనే సలుపకు పరిహాసం …
సలుపకు పరిహాసం
బ్రతుకంతా పలు ప్రశ్నలమయమై బ్రతుకును జనసముదాయం
బదులు కోసమై వెదకుటమాని బ్రతుకుటయే న్యాయం…’
ఆలోచింపజేసే పాట.
జీవితం అడుగడుగనా పరీక్షలు తప్పవు. ప్రయత్నలోపం లేకుండా చూసుకోవడమొక్కటే మన విధి. ప్రయత్నం బాగున్నప్పుడు చాలాసార్లు ఫలితమూ బాగుంటుంది. ఒక్కోసారి విధి ప్రతికూలించి ఓటమి ఎదురైనా కుంగిపోవటం, జీవితాన్నే తుంచేసుకోవాలనుకోవటం మూర్ఖత్వం. మనకు లభించిన జీవితాన్ని సంపూర్ణంగా జీవించడంలోనే ఉంది విజ్ఞత. మళ్లీ మళ్లీ ప్రయత్నం చేయవచ్చు. ఎడిసన్ విద్యుత్ బల్బు కనుగొనే ప్రయత్నంలో తొంభై తొమ్మిదిసార్లు ఓటమి చవిచూశాడు. వందోసారి వెలుగును జయించాడు. ‘పరీక్షలు అభివృద్ధికి దారితీసేవిగా ఉండాలి కానీ అంతానికి కారణమయ్యేవి కాకూడదు. ముఖ్యంగా చదువుకునే పిల్లలు, యువతకు ఈ విషయమై తల్లిదండ్రులు, స్కూల్లో టీచర్లు కూడా అర్థమయ్యేలా చెప్పాలి’ అనుకుంటూ ఉండగా పదో తరగతి పరీక్షా ఫలితాలు ప్రకటించబోతున్నారని టీవీ ఘోషించడంతో ఉలిక్కిపడ్డాను. ‘మళ్లీ ఈ ఫలితాలు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో’ అనుకుంటూ క్యాలెండర్లను పక్కనపెట్టి, వేడెక్కిన బుర్రకు ఉపశాంతిగా ఓ కప్పు టీ తాగాలని, పరీక్షల తాలూకు ఆలోచనా రీలును మనసులో చుట్టేస్తూ, అక్కడి నుంచి లేచాను.
జొన్నలగడ్డ శ్యామల సీనియర్ జర్నలిస్టు. ఉదయం దినపత్రికలో పని చేసేవారు. వార్త దినపత్రికలో ఆదివారం అనుబంధం ఇన్ఛార్జ్ గా పని చేశారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. వృత్తి ధర్మంగా అసంఖ్యాకమైన కవర్ స్టోరీలు, ఫీచర్లు, పుస్తక సమీక్షలు రాసినవారు. శ్యామల 70కి పైగా కథలు రాశారు. ఆంధ్రప్రభ, యువ, ఉదయం, వార్త, ఇండియా టుడే లలో వీరి కథలు ప్రచురితమయ్యాయి. ముఖ్యంగా వీరి ‘పడక్కుర్చీ’ కథ అనేక ప్రశంసలు పొందింది. పలు హస్య కథలు కూడా రచించారు. కొన్ని కథలు ఇతర కథాసంపుటాలలో వచ్చాయి. కొన్ని కథల పోటీలలో బహుమతి గెలుచుకున్నారు. పూతరేకులు, సాలోచనం, సాధన, మానస సంచరరే, అన్నింట అంతరాత్మ వంటి కాలమ్‌లు రాశారు.