Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మనసు చేసే మాయ

[బాలబాలికల కోసం ‘మనసు చేసే మాయ’ అనే కథని అందిస్తున్నారు శ్రీ మాచిరాజు కామేశ్వర రావు. సంచిక నిర్వహించిన బాలల కథల పోటీ 2026లో బహుమతి పొందిన కథ.]

సిద్ధు ఏడవ తరగతి లోకి వచ్చాడు. ఆ రోజు లంచ్ బాక్స్ ఇస్తూ వాళ్ళ అమ్మ, “చూడు సిద్ధు, నువ్వు పెద్దవాడిని అయ్యావు. ఇక ఈ రాత్రి నుంచీ నువ్వు నీ గదిలో పడుకోవాలి!” అంది .

“ఎనిమిదవ తరగతి లోకి వచ్చాక నా గదిలో నేను పడుకుంటాను. అప్పటి దాకా మీ గది లోనే!” అన్నాడు సిద్ధు స్కూల్ ఆటో హారన్ విని బయటకు పరిగెత్తుతూ.

సిద్ధు వట్టి పిరికివాడు. చీకటి అంటే భయం. కుక్క ఎదురు వస్తే భయం. పిల్లి ‘మ్యావ్’ అంటే భయం.

చాలా కాలం తర్వాత వాళ్ళ అమ్మమ్మ సిద్ధూ వాళ్ళ ఇంటికి వచ్చింది. ఆ రాత్రి అందరూ కూర్చుని టీవీ చూస్తూ వుండగా, “బాబూ, సిద్ధూ, కాసిన్ని మంచి నీళ్ళు తెచ్చి పెట్టు నాయనా!” అంది అమ్మమ్మ.

సిద్ధు కూర్చున్న చోటు నుంచి కదలలేదు.

“వాడు తీసుకు రాడు లే అమ్మా! వాడికి చీకటి అంటే భయం!” అంటూ సిద్ధూ వాళ్ళ అమ్మ వంటింట్లోకి వెళ్ళి గ్లాస్‌లో నీళ్ళు తీసుకు వచ్చింది.

వాళ్ళ అమ్మమ్మ నీళ్ళు తాగి, “పన్నెండు ఏళ్లు వచ్చాయి. ఇంకా ఈ పిచ్చి భయాలు ఏమిటి?” అంటూ బుగ్గలు నొక్కుకుంది.

మరునాడు సాయంత్రం సిద్ధు స్కూల్ నుంచి వచ్చి పెరట్లో అరుగు మీద కూర్చుని పాలు తాగుతున్నాడు. సిద్ధు పక్కనే కూర్చుని, “ఈ రోజు నీకొక కథ చెబుతాను సిద్ధూ!” అంది అమ్మమ్మ.

“చెప్పు, అమ్మమ్మా! ఈ రోజు నాకు హోం వర్క్ కూడా లేదు!” అన్నాడు సిద్ధు ఉత్సాహంగా.

అమ్మమ్మ కథ చెప్పడం మొదలు పెట్టింది.

ఒక అడవిలో ఒకే ఒక పులి వుండేది. అది పిరికిది. అయితే అడవిలో మరొక పులి లేకపోవడంతో దానినే రాజును చేశాయి అడవిలో జంతువులు. దాని పిరికితనం గురించి అడవిలో జంతువులు కథలుగా చెప్పుకుని నవ్వుకునేవి. ఆ అడవిలో ఒక కోతి, ఒక కుందేలు, ఒక ఎలుగుబంటి స్నేహంగా వుండేవి. అవి తమలో తాము కూడబలుక్కుని ఎలాగైనా పులి రాజు పిరికితనం పోగొట్టాలని నిర్ణయించుకున్నాయి. అవి సమయం కోసం చూస్తూ పులి గుహ దగ్గరే నివాసాలు ఏర్పాటు చేసుకున్నాయి.

ఒక రోజు రాత్రి పులి గుహలో నుంచి బయటకు పరిగెత్తుకు వచ్చి, “నా గుహలో దయ్యం దూరి గోల చేస్తోంది!” అంటూ కేకలు పెట్టింది.

ఆ మాటలకు ఆ పక్కనే పొదలో వున్న కుందేలు బయటకు వచ్చి, “అది దయ్యం గోల కాదు మహారాజా! గాలి వేసే ఈల. కావలిస్తే నా పొదలోకి వచ్చి చూడు.! అయినా దయ్యాలు, భూతాలు వున్నాయని అనుకోవడం మూఢ నమ్మకం. మన పాలిట మనుషులే దయ్యాలు” అంది కుందేలు.

కుందేలు పొదలో కూడా గాలి హోరు అలాగే వుండటంతో, తన గుహలో దయ్యం లేదని తృప్తిపడి వెళ్లిపోయింది పులి.

మరో రోజు రాత్రి, “బాబోయ్, ఆకాశం కూలిపోయింది! పెద్ద శబ్దం అవడం నేను విన్నాను!” అంటూ అరుస్తూ గుహలో నుంచి బయటకు పరిగెత్తుకు వచ్చింది పులి.

కోతి క్రింద పడిన తాటి పండును పులికి చూపిస్తూ, “ఈ పండు క్రింద పడిన శబ్దం విని మీరు ఆకాశం కూలింది అంటూ భయపడిపోయారు మహారాజా! అయినా ఆకాశం అంటే శూన్యం! అది పడిపోవడం ఏమిటి?” అంది కోతి.

“అవునా, నిజమా?” అంటూ తన గుహ లోకి వెళ్లి పోయింది పులి.

ఒక అమావాస్య రోజు రాత్రి, “రక్షించండి! నా గుహ కాలిపోతోంది.. త్వరగా రండి!” అంటూ కేకలు పెట్టింది పులి.

ఆ అరుపులు విని పులి గుహ లోకి పరుగు తీసింది ఎలుగుబంటి. పులి గుహలో గుంపులు గుంపులుగా మిణుగురులు ఎగురుతున్నాయి. వాటిని చూసి నిప్పు కణికలు అనుకుని వణికిపోతోంది పులి.

“భయపడకు మహారాజా, ఇవి మిణుగురు పురుగులు! చీకట్లో ఇలా మెరుస్తూ కనిపిస్తాయి!” అంటూ గుప్పెడు మిణుగురులను పట్టుకుని పులికి చూపించింది ఎలుగు బంటి.

తరువాత అది మిణుగురులను గుహలో నుంచి బయటకు తోలేసి, “మహారాజా! మీకు ఒక విషయం చెప్పాలి! ఈ భయం అనేది మనసు చేసే మాయ! నిజం తెలుసుకుంటే ఆ మాయ పటాపంచలు అయిపోతుంది. భయం పారిపోతుంది. ఏ విషయంలో నైనా భయం వేసినప్పుడు ముందు అందులో నిజమెంతో గ్రహించండి. నిజం తెలుసుకుంటే అనవసరపు భయాలు వుండవు!” అంది.

ఎలుగుబంటి మాటలు పులి మీద బాగా పనిచేసాయి. ఆ తరువాత అది ఎప్పుడూ అనవసరంగా భయపడ లేదు.

ఈ కథ చెప్పి లోపలికి వెళ్ళి పోయింది అమ్మమ్మ. ఆమె వెళ్లిపోయిన చాలా సేపటి వరకూ ఆ కథలో ‘భయం అనేది మనసు చేసే మాయ! ముందు అందులో నిజం ఎంతో గ్రహించండి!’ అంటూ ఎలుగు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ అరుగు మీదనే కూర్చుండి పోయాడు సిద్ధు.

ఆ తరువాతి రోజు ఆటో రాక పోవడంతో స్కూల్‌కి నడచి వెళుతున్నాడు సిద్ధు. కొద్ది దూరం వెళ్ళ గానే ఒక కుక్క ఎదురు వచ్చింది. దానిని చూడగానే హడలిపోయి వెనక్కి తిరిగి వెళ్లిపోదాం అనుకున్నాడు సిద్ధు. వెంటనే వాడికి అమ్మమ్మ చెప్పిన కథ గుర్తుకు వచ్చింది. ఆ కుక్క ఎటువంటిదో ముందు కనిపెట్టాలని అక్కడే నిలబడ్డాడు. అది తోక ఊపుకుంటూ సిద్ధు దగ్గరకు వచ్చింది. అది తన స్నేహం కోరుతోందని అర్థం అయి, తన లంచ్ బాక్స్‌లో నుంచి రెండు బిస్కట్లు తీసి దాని ముందు వేసి, ధైర్యంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు సిద్ధు.

సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక పెరట్లో అరుగు మీద కూర్చుని పాలు తాగుతున్నాడు సిద్ధు. ఇంతలో ‘మ్యావ్’ అంటూ ఒక నల్ల పిల్లి కిటికీలో నుంచి అరుగు మీదకు దూకింది. సిద్ధు భయంతో లోపలికి పరిగెత్తుకు వెళ్ళబోతూ, ఒకసారి పిల్లి కేసి పరిశీలనగా చూశాడు. అది ఆశగా తన చేతి లోని పాల గ్లాసు వైపే చూస్తోంది. లోపలికి వెళ్ళి ఒక పళ్లెం తీసుకు వచ్చి, అందులో కొన్ని పాలు పోసి పిల్లి ముందు పెట్టాడు సిద్ధు. పిల్లి ఆతృతగా పాలు తాగి వెళ్లి పోయింది.

రాత్రి టీవీ చూస్తున్నప్పుడు అమ్మమ్మ నీళ్ళు అడిగితే, “నేను తీసుకు వస్తాను” అంటూ లేచాడు సిద్ధు. అయితే చీకటిగా ఉన్న వంట గది కిటికీలో నుంచి ఎవరో తొంగి చూస్తున్నట్లు కనబడి, దొంగ అనుకుని కేకలువేద్దామని నోరు తెరిచిన సిద్ధు, ఒక క్షణం ఆగి నిజం తెలుసుకుందామని లోపలికి వెళ్ళి లైటు వేశాడు. కిటికీలో చిన్న స్టీలు బిందె వుంది. చీకట్లో అది మనిషి తలలా కనబడింది. తన భయానికి తనకే నవ్వు వచ్చింది సిద్ధూకి.

ఇలా అనేక సందర్భాలలో భయపడే ముందు నిజం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఆ భయాల నుంచి బయట పడ్డాడు సిద్ధు.

ఆ రోజు స్కూల్‌కి వెళ్లే ముందు, “అమ్మా! ఈ రోజు నుంచి నా గదిలోనే నేను పడుకుంటాను!” అన్నాడు సిద్ధు.

సిద్ధులో వచ్చిన మార్పు గమనిస్తున్న అమ్మకి ఇప్పుడు సిద్ధు అన్న మాటలు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి.

Exit mobile version