Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మనసులోని మనసా-50

ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారదమనసులోని మనసా” శీర్షిక.

చిన్నప్పుడు రైలు ప్రయాణమంటే చాలా సరదాగా వుండేది.

మేం చాలా ఎక్కువే ప్రయాణాలు చేసేం.

మీటర్ గేజ్, బ్రాడ్ గేజ్, నేరో గేజ్‌లలో కూడ మా నాన్నగారి ఉద్యోగ రీత్యా తిరుగుతూనే వుండే వాళ్ళం.

మా నాన్నగారిని చేరడానికి రెండేసి రోజులు పట్టేది. మధ్యలో విజయవాడలో హాల్ట్! రైళ్ళు మారడం – అయినా బోర్ కొట్టేది కాదు.

ఆవిరి  మీద నడిచే ఆ రైలు ప్లాట్‍ఫామ్ చేరుతుంటే చెప్పలేని సంతోషం! అసలెంత హడావిడిగా అరుచుకుంటూ, ప్లాట్‌ఫామ్‌ని అంతా కుదిపేస్తూ నానా హడావిడిగా వచ్చేదో!

కిటికి దగ్గర సీటు కోసం మేమంతా నానా హడావిడి, పోటీ పడిపోయేవాళ్ళం. కిటికి లోంచి తొంగిచూస్తూ ప్రకృతినంతా పరిశీలిస్తూ, ఎలక్ట్రిక్ పోల్స్‌నీ, టెలిపోన్ పోల్స్‌నీ లెక్కపెడుతూ, పచ్చటి పొలాల్నీ, చెరువుల్ని, నదుల్ని, కొండలని చీకటి పడేదాకా చూస్తూ, కళ్ళల్లో బొగ్గు నలుసులు పడితే అమ్మ చేత తిట్లు తింటూ – అయినా మళ్ళీ కళ్ళు నులుముకుంటూ చూస్తూనే వుండేవాళ్ళం.

రాత్రయితే మిణుగురులు కంపార్ట్‌మెంటుల్లో జొరబడేవి. దూరంగా కనబడితే వాటిని కొరివి దెయ్యాలని చెప్పేవారు. కొంత భయమేసినా ఆసక్తిగా చూసేవాళ్ళం.

ఉదయాన్నే గోదావరి జిల్లాల్లో రైలు అడుగుపెడితే ఆ ఆనందమే వేరు! ఆ మనోహరమైన ప్రకృతి దృశ్యాల్ని నోరావలించి చూసేవాళ్ళం. కొబ్బరి తోపుల మధ్య నుండి ఉదయించే ఎర్రటి సూర్యబింబం, కనుచూపు మేర పరుచుకున్న వరిపొలాలు, వాటి పైన పసుపు జల్లినట్టుగా వుండే లేత ఆకుపచ్చ కాంతి – గాలికి ఒక వెల్వెటు క్లాత్‌లా అవి మెత్తగా కదులుతున్న తీరు – కాలువలు, వాటిలో సాగుతున్న తెరచాపల పడవలు, చేపల కోసం కాలువ మీద ఎగిరే కొంగల బార్లు – చెప్పనలవి కాని సౌందర్యం చూస్తూ మనసు గాలిలో తేలిపోతూండేది.

పెద్దయ్యే కొలది అంతా బ్రాడ్‌ గేజ్‌గా మారిపోయింది. డైరక్ట్ డెస్టినేషన్‍కి రైళ్ళు వచ్చేసేయి. ఆ వెంటనే స్లీపర్ కోచ్‌లు, ఎలెక్ట్రిసిటీతో నడిచే రైళ్ళు వచ్చేసేయి. ప్రయాణం సుగమం అయినా, ఆ అందాల్ని చూసే అవకాశాలు లేకుండా రాత్రి ప్రయాణాలు మొదలయ్యేయి.

కొన్ని ట్రెయిన్స్‌లో అయితే  ప్రయాణీకులు మరీ దారుణంగా ప్రవర్తిస్తారు. ఎక్కిన వెంటనే బాక్స్‌లు తెరుచుకుని తినేయడం, బెర్త్‌లు పరుచుకుని పడుకోవడం! ఎక్కడ బెర్త్ ఛార్జీలు వేస్టు అవుతాయేమోనని భయపడుతున్నట్లుగా వుంటుంది వీరి ప్రవర్తన. కాసేపు కూడ కూర్చోనివ్వరు.

మరికొన్ని ట్రెయిన్స్‌లో మరొక దారుణ ప్రవర్తన.

పేకాట రాయుళ్ళు చేరి తెల్లవార్లూ లైట్లు వేసి అరుచుకుంటూ, నవ్వుకుంటూ పేకాట మొదలుపెట్టి ఎవర్నీ పడుకోనివ్వకుండా గోలగోలగా ఆడేవారు. మిగతా ప్రయాణీకులు చిరాకు పడినా, వద్దని వారించినా లక్ష్యపెట్టేవారు కాదు.

మరికొంత మంది గ్రూపులుగా చేరి అంత్యాక్షరి పాటలూ, నవ్వులు – పక్క ప్రయాణికుల గురించి వీళ్ళకి బాధే లేదు.

ఒకసారి నేను కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ వెళ్తున్నాను. సికింద్రాబాద్‌లో ఎక్కి కిటికి దగ్గర కూర్చున్నాను (అదే నా సీటు) కూర్చున్నాను. ఒక పెద్ద కుటుంబం వచ్చి నా కిటికి ఎదురుగా ప్లాట్‌ఫారమ్‌ మీద దుప్పట్లు పరుచుకుని గోలగోలగా టిఫిన్స్ తింటున్నారు. ఏ ట్రెయిన్‌కో వెళ్తున్నారు కాబోలని నేను చూస్తున్నాను.

మా ట్రెయిన్‌కి సిగ్నల్ ఇవ్వగానే వాళ్ళు గబగబా దుప్పట్లు మడిచి కంపార్టుమెంటు ఎక్కేసి, నా సీటు ఎదురు సీటు ఆక్రమించేసారు. ఇక అక్కడ మళ్ళీ తినడం, వాయిస్ కంట్రోల్ లేనట్టు మాట్లాడడం, నన్ను ఓ మూలకి తోసేసి కిటికిలోంచి చూడడం – భరించలేకపోయాను. ‘ఎలా వీళ్ళని భరిస్తూ ప్రయాణం చేయాలా?’ అని బాధపడుతుండగా, వాళ్ళు వరంగల్‌లో దిగిపోయారు. అంత మాత్రం దానికి వాళ్ళు దారి పొడుగునా తింటూనే వున్నారు.

మరోసారి కాకినాడ వెళ్తున్నాను. అదే ట్రెయినో గుర్తు లేదు. ఏలూరు వచ్చేసరికి రాత్రి తొమ్మిది దాటింది. నా ఎదురుగా ఒకామె మనవరాలితో ప్రయాణం చేస్తున్నారు. చిన్నపాప కావడం వలన అందరం ఆ పాపని చూసి నవ్వుతూ ఆడుతూ ప్రయాణం చేస్తున్నాం. ఆమె టాయ్‌లెట్‌కి వెళ్తూ పాపని పడిపోకుండా చూడమని మాకు చెప్పి వెళ్ళింది. పాపకి రెండేళ్ళ వయసుండొచ్చు. మేమందరం పాపని పడిపోకుండా ఓ కంట గమనిస్తున్నాం. మా కంపార్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌లో స్టేషన్ దాటి చీకట్లో ఆగింది. తిరిగి వచ్చి ఆమె పాప ఒక చేతికున్న బంగారు మురుగు పోయిందని కంపార్టుమెంటులో అందర్నీ శాపాలు పెడుతూ తిట్టడం ప్రారంభించింది.

అసలా అమ్మాయి చేతికి  బంగారు మురుగులున్నది మేం గమనించనే లేదు. ఏలూరులో దొంగతనాలెక్కువ, జాగ్రత్తగా వుండమని రైల్వే వారు హెచ్చరికలు చేస్తూనే వున్నారు. చిన్న పాపని జాగ్రత్తగా చూసినందుకు ఆమె వంకలు పెట్టి తోటి ప్రయాణీకుల్ని దొంగలు చేసి తిడుతుంటే చూసి చూసి అందరూ ఆమెకు వార్నింగ్ ఇచ్చేక ఆమె నోరు మూసింది.

అసలు ప్రయాణాల్లో ఆ నగల ప్రదర్శన ఎందుకో అర్థం కాదు. కొందరు పెళ్ళికి వెళ్ళినట్లుగా అన్నీ తగిలించుకుని బయల్దేరుతారు. పోయాక గోల గోల!

మొన్నా మధ్య మా చెల్లెలి కూతురు కెనడా నుండి వచ్చి అటు రాజమండ్రి వెళ్ళి వచ్చి ఒకటే గోల!

ఏమిటంటే ఈ సీనియర్ సిటిజెన్స్‌తో చాలా న్యూసెన్స్‌గా వుందంటూ!

నేను గతుక్కుమని ‘ఏమయింది?’ అనడిగాను.

“క్రింద సీట్లన్నీ వాళ్ళకే పిన్నీ! అందరూ చచ్చినట్లు పైకి ఎక్కాల్సిందే! నా ఎదురుగా ఒక చిన్న పిల్ల తల్లి మిడిల్ సీట్‌లో నానా సతమతమవుతున్నా వాళ్ళు నిర్దయగా ఆరోగ్యంగా వున్నా సీట్ యివ్వలేదు” అంది.

వెంటనే మా యింట్లో వున్న పిల్లలందరూ దానికే వంతపాడారు. “అవును కాలు బాగోకపోయినా, ప్రెగ్నన్సీ వున్నా క్రింద సీటు దొరకటమే లేదు. ఏదో పారేసుకున్నట్టు టికెట్ కన్సెషన్ వుందనీ, ఫాట్ పెన్షన్స్ వస్తున్నాయని తెగ తిరుగుతున్నారు” అని ఒకరన్నారు.

మరొకరు “అవును. ఆయనెవరో ప్రతి నెలా తిరుపతి వెళ్ళిపోయి దర్శనం చేసుకుంటాడట. మరి గుడి దగ్గర రష్ పెరిగిపొమ్మంటే పెరిగిపోదా!” అన్నారు కోపంగా.

“ఇలా అవసరం లేని ప్రయాణాలు చేసి చిన్నవాళ్లని కూడా విసిగిస్తున్నారు. కొందరయితే ఇంట్లో చిన్నవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా పడి విసిగిస్తున్నారు. కొంత మానసిక వైరాగ్యం కూడ తెచ్చుకోవాలి కదా!” అని ఇంకొకరు.

‘దేవుడా, ఉరుమురిమి మంగలం మీద పడటం అంటే ఇదేనా?’

‘అఫ్‌కోర్స్, నేనలా అన్నిటికీ బయల్దేరననుకోండీ!’

Exit mobile version