[మందస లోని వాసుదేవ పెరుమాళ్ ఆలయం సందర్శించి ఆ అనుభవాలను, అనుభూతులను పంచుకుంటున్నారు సుధా ఆత్రేయ.]
శివరాత్రి వేళ శ్రీముఖలింగం దర్శనానికి బయలుదేరినప్పుడు, మందస గురించి తెలియదు. అక్కడ పలికిన ఒక్క పేరు మనసులో చిరుగంట మోగించింది. చరిత్ర తెలిసేకొద్దీ ఆ గంట చప్పుడు పెద్దది అయింది. అటునుంచే బయలుదేరాం., ఆ పిలుపు వెంట.
శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి పటంలో చివరన ఉండవచ్చు, కానీ చరిత్ర పుటల్లో మొదటి వరుసలోనే నిలబడుతుంది. త్రిమతాచార్యులు పావనం చేసిన శ్రీకూర్మం ఇక్కడే ఉంది. జీడిపప్పుకు తన పేరిచ్చిన పలాస నుండి పద్దెనిమిది కిలోమీటర్లు లోపలికి వెళ్తే మహేంద్రగిరుల నీడలో, రెండు నదుల సంగమంలో మందస శిథిల చరిత్రకు సాక్షిగా నిలబడింది. చూసేందుకు చిన్న పల్లె. కానీ గుండెలో దాచుకున్న కథలు యుగాల బరువు మోస్తున్నాయి.
ఆ కథ మొదలవడానికి ఉత్తరాన పాంచాల దేశానికి వెళ్ళాలి. నేటి పంజాబ్‌లో జన్మించిన చంద్రవంశపు యువరాజు వామనసింగ్ దేవ్ పదవి వద్దు, పట్టాభిషేకం వద్దు అని రాజ్యాన్ని వదిలేశాడు. తపస్సు కోసం దేశమంతా తిరిగాడు. చివరికి కళింగ సాగరం ఒడ్డున, మహేంద్రగిరుల చెంత ఆగిపోయాడు. పాండవ గుహలకు పక్కనే కుంతిగుహలో కూర్చుని తపమాచరించాడు. ఒకనాడు ధ్యానం అనంతరం కళ్ళు తెరిచి అద్భుతమైన సూర్యోదయాన్ని చూసి సంభ్రమాశ్చర్యభరితుడయ్యాడు. సముద్రపు అలలపై బంగారు కిరణాల నాట్యాన్ని చూసి ఆనందభరితుడై భగవదాజ్ఞగా క్రీ.శ. 1206లో ‘మంజూష’ అనే రాజ్యాన్ని స్థాపించాడు.
మరో కథనం మరింత కవితాత్మకంగా ఉంటుంది. ధ్యానంలో మునిగిన రాజు చేతి ఉంగరం జారి సమీపంలోని నదిలో పడిపోయింది. ఆ ఉంగరం కొట్టుకుపోయిన చోటే రాజ్యానికి నాంది పలికాడు. ఆ నది నేటికీ ప్రవహిస్తోంది అదే సున్నముద్ది. ఉత్కళ భాషలో బంగారపు ఉంగరం అని అర్థం. నది పేరు చెప్పగానే చరిత్ర కళ్ళ ముందు కదులుతుంది.
సంస్కృతంలో మంజూష అంటే ఆభరణాల పెట్టె. పచ్చని కొండలు, గలగలమని పారే మహేంద్రతనయ, సున్నముద్ది నదులు అన్నీ కలిసి ఒక భరిణెలో భద్రపరిచినట్టు ఉందని స్థానికులు అంటారు. ఒరియా ప్రజలకు మాత్రం మంజు + ఉష అంటే మనోఙ్ఞమైన సూర్యోదయం. ఆ ప్రదేశం చూస్తే రెండూ నిజమే అనిపిస్తుంది.
అలా మనసు నిండుతుండగా వాసుదేవ పెరుమాళ్ ఆలయం ముందు నిలబడ్డాం. వామనసింగ్ దేవ్ క్రీ.శ. 1206లో స్థాపించిన రాజ్యంలో ఈ ఆలయం మొదట ఎవరు కట్టారో చరిత్రకు తెలియదు. కేవలం పునర్నిర్మాణం జరిగిన ఆధారాలు మాత్రమే ఉన్నాయి. క్రీ.శ. 1206 నుండి 1227 వరకు పరిపాలించిన వామనసింగ్ దేవ్ తర్వాత తరాలు గడిచాయి. 43వ రాజైన హరిహర రాజమణిదేవ్ క్రీ.శ. 1744లో అప్పటికే శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని జీర్ణోద్ధరణ గావించి శ్రీదేవి భూదేవి సమేత పరవాసుదేవుణ్ణి పునఃప్రతిష్ఠించాడు.
ఎర్రని ఇసుకరాయిపై కళింగ శైలిలో చెక్కిన ఆ ఆలయం కళ్ళు తెరవగానే ఒక్కక్షణం మాట పోతుంది. నక్షత్రాకారపు విశాలమైన ప్రదక్షిణాపథంపై నిర్మించబడిన అధిష్ఠానం, స్తంభవర్గం, ప్రస్తరం, ఎనిమిది వరుసల విమానం, దానిపై గంటాకార శిఖరం. ప్రతి రాయీ ఒక కవితలా మలచబడింది. గర్భాలయం, అర్ధమండపం, మహామండపం గోడలు అణువణువూ అలంకార శిల్పాలతో నిండి శిల్పుల పనితనానికి అద్దం పడతాయి. లోపలికి అడుగుపెడితే శ్రీదేవి భూదేవి సమేతుడైన నిలువెత్తు సాలగ్రామ పరవాసుదేవ మూర్తి తిరుపతి వెంకటేశ్వరుని పోలి నిలబడి చూపరుల మనసును కట్టిపడేస్తాడు. ఒరియా ప్రజలు ఆ దేవేరులను ప్రేమగా ‘మాఖిల్ల మోండ’ అని పిలుచుకుంటారు.
ఆ సన్నిధిలో నిలబడితే, ఇక్కడ జరిగిన అద్భుతం గుర్తొస్తుంది. గత శతాబ్దం చివరివరకూ ఈ ఆలయం గొప్ప వేదాధ్యయన కేంద్రంగా విలసిల్లింది. మందస రామానుజాచార్యులు అను గొప్ప వేదపండితుడు కాశీ వరకు పండితులను వేదాంత చర్చలలో ఓడించిన విద్వాంసులు ఈ ఆలయ ప్రాంగణంలోనే వేదవిద్య నేర్పేవారు. వారి కీర్తి విన్న పెద్దజీయరు స్వామివారు, వారి మిత్రులు గోపాలాచార్యస్వామివారితో కలిసి వారివద్ద శ్రీభాష్యం అధ్యయనం కొరకు రాజమండ్రి నుండి కాలినడకన మందస చేరుకున్నారు. ఒకనాడు రాత్రి ఆలయ ప్రాంగణంలో నిద్రించిన శిష్యులిద్దరికీ గోదావరి వంతెన వరదలో కొట్టుకుపోయిన కల వచ్చింది. భయపడిన శిష్యులను గురువు స్వామి సన్నిధికి తీసుకెళ్ళాడు. సాష్టాంగ నమస్కారం చేసిన మరుక్షణం మూలవిరాట్టు నుండి ఒక కాంతిపుంజం వెలిగి మాయమైంది. వారి రెండేళ్ళ అధ్యయనం కేవలం ఆరు నెలల్లో పూర్తయింది. జ్ఞానప్రదాత, అభయప్రదాత అని ఆ స్వామి బిరుదులు అకారణంగా రాలేదు అని అర్థమైంది.
1988లో ఈ చరిత్ర తెలుసుకున్న చిన్నజీయరు స్వామివారు మందసకు వేంచేసి ఆలయ ప్రాచీనతకు భంగం కలుగకుండా పునర్నిర్మించాలని సంకల్పించారు. ఒడిషా నుండి శిల్పులను రప్పించి యథాతథంగా నిర్మింపచేసారు. 2009 ఫిబ్రవరిలో గురువు పెద్దజీయరు స్వామివారి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పునఃప్రతిష్ఠ జరిగింది. శ్రీ రామానుజాచార్యుల విగ్రహం ప్రాంగణంలో వెలిసింది. మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు జరిగే సంప్రదాయం కూడా అప్పటి నుండే మొదలైంది.
ఆలయం నుండి బయటికొచ్చాక చరిత్ర మరింత లోతుగా తెరుచుకుంటుంది. 44వ తరం రాజు హరిశరణ్ రాజమణి రాజ్‌దేవ్ (1761-79) చండీశ్వరాలయాన్ని కట్టించారు. తర్వాత వచ్చిన లక్ష్మణరాజ మణిదేవ్ (1779-1823) శత్రువుల దాడుల నుండి రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఒక కోటను నిర్మించారు. చక్కటి ఆర్చీలు, పోర్టికోలు, బాల్కనీలు, బురుజులతో నిండిన ఆ కోటలో 18వ శతాబ్దపు వర్ణచిత్రాలున్న ఇటాలియన్ గాజుపలకలు ఒకప్పుడు మెరిసేవి. నేడు మాత్రం గాలికి తెరలు కదిలే నిర్జన గదులు, రాలిపోతున్న గోడలు ఆనాటి వైభవానికి మూగసాక్షులుగా మిగిలాయి.
తర్వాత రాజు శ్రీనివాస రాజమణి రాజ్‌దేవ్ కేవలం కోటలు కట్టడం మాత్రమే కాదు, ఆనందగిరి కొండపై గరుడ-గోవిందాలయం నిర్మించాడు, సున్నముద్ది నదిపై ఆనకట్ట వేయించాడు. పండితుడైన ఆ రాజు అమరుశతకం, మితాక్షర, భాగవతాలను ఒరియాలోకి అనువదించడమే కాక ముక్తలతావళి అనే గ్రంథాన్ని రచించాడు. కత్తి పట్టిన ఆ చేయే కలం పట్టింది.
ఆ వంశంలో మరో మేటి 47వ తరం రాజు జగన్నాథ్ రాజమణి రాజ్‌దేవ్ (1860-1890). ఆంధ్రభాషా విశారద, తర్కవేదాంత కవిగా బిరుదులు పొందిన ఈ రాజును 1877 జనవరి 1న క్వీన్ ఎలిజబెత్ CIE బిరుదుతో సత్కరించింది. వైస్రాయ్ లార్డ్ డఫెరిన్ రెండు ఫిరంగులు బహుకరించారు. అవి ఇప్పుడు ఎక్కడున్నాయో తెలియదు, కానీ ఆ వివరాలు మంజూష గ్రంథాలయంలో నేటికీ భద్రంగా ఉన్నాయి. నరసింహ, దుర్గాలయాలు నిర్మించిన ఈ రాజు స్థానిక చేతికళలను లండన్‌లో ప్రదర్శించి పలు అవార్డులు సాధించాడు. గంజాం జిల్లాలో మొదటి ఇంగ్లీషు పాఠశాల స్థాపించి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ పేరిట ఉపకారవేతనాలిచ్చాడు. అన్నిటికంటే మించి ఒరియా, తెలుగు, ఇంగ్లీషు పుస్తకాలతో నిండిన మంజూష గ్రంథాలయం స్థాపించాడు. ఆ గ్రంథాలయం ఒకప్పుడు ఎందరికో మంజూష.
ఇప్పుడు 51వ తరంలో రాజా ఛత్రపతి సింగ్ దేవ్ సైన్యంలో సేవచేసి రిటైరైన కల్నల్ సికింద్రాబాద్‌లో నివసిస్తున్నారు. రాజ్యం లేదు, కోట శిథిలమైంది, కానీ వంశం నిలిచే ఉంది.
అలసిన మనసుకు ఊరట అందించింది మందస పాలకోవ. మహేంద్రగిరుల అడవుల్లో ఔషధమొక్కలు మేసిన ఆవుల పాల నుండి తయారయ్యే ఆ రుచి ఒక్కసారి తిన్నాక మళ్ళీ రావాలనిపిస్తుంది. కానీ మందస మళ్ళీ రావాలనిపించడానికి పాలకోవ మాత్రమే కారణం కాదు.
వెళ్ళేటప్పుడు మనసులో ఒక గాయం మిగిలింది. ఇంత చరిత్ర మోస్తున్న ఊరికి సరైన రోడ్డు లేదు, సరైన సంకేత ఫలకాలు లేవు, పర్యాటకులకు సదుపాయాలు లేవు. శిథిలమవుతున్న కోట, మూసుకుపోతున్న గ్రంథాలయం, మర్చిపోయిన చరిత్ర. మంజూష అంటే మణిపెట్టె. కానీ ఆ పెట్టె తాళం చెవి పోగొట్టుకున్నారు అని బాధగా అనిపించింది. అభివృద్ధి చేస్తే ఎంత బాగుంటుందో కదా అని నిట్టూర్చకుండా ఉండలేకపోయాను.
మందస నగరీస రామానుజ రసాయచ।
శ్రీ భూసమేతాయ శ్రీ వాసుదేవాయ మంగళం॥

