[శ్రీ కస్తూరి రాజశేఖర్ గారి ‘మనో విహారి’ అనే అనువాద కవితాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ చీఫ్ జనరల్ మేనేజర్‌గా పదవీ విరమణ చేసిన శ్రీ పసుపులేటి దినకర రావు గారు ఆంగ్లంలో రచించి ప్రచురించిన ‘Echoes of Life’ అనే కవితా సంపుటిని ‘మనో విహారి’ పేరిట అనువదించి అందించారు శ్రీ కస్తూరి రాజశేఖర్. ఆంగ్లంలో 8 విభాగాలలో 180 కవితలు ఉండగా, తెలుగులో 5 విభాగాలలో 108 కవితలను అందించారు అనువాదకులు.
“ఈ అయిదు భాగాలను ఆయన జీవన ప్రయాణపు పంచ పార్శ్వాల భావానా లహరిగా అనుశీలనాత్మకంగా అనువదించారు” అని వ్యాఖ్యానించారు శ్రీ. పత్తిపాక మోహన్ తమ ముందుమాటలో.
దైవం – సృష్టి:
ఈ విభాగంలో భగవంతుని గురించి, ఆయన లీలా విలాసాల గురించి సృష్టి గురించి 23 కవితలున్నాయి.
భగవంతుని ఉనికి ఎక్కడో ‘అనుభూతి’ కవిత అత్యంత సరళంగా, ప్రభావంతంగా చెబుతుంది. “సమస్తం అతడి కొలవు/అణువణువు అతడి నెలవు!” అంటారు కవి/అనువాదకులు.
సర్వాంతర్యామి ఒకడే అయినా, భక్తులు పూజించే రూపాల వేర్వేరని, అందువల్ల వాళ్ళల్లో పొంతన లేని వైరుధ్యాలు చేలరేగి విధ్వంసాలు సృష్టిస్తున్నారనీ, భూమిపైకి వచ్చి పరిస్థితిని ఎప్పుడు చక్కదిద్దుతావని భగవంతుని ఆర్తితో ప్రశ్నిస్తుంది ‘సర్వోన్నతుడు’ కవిత.
ప్రకృతితో సహా సమస్త సృష్టి భగవంతుని సంకల్పం వల్ల జరిగిందని చెబుతూ, “ప్రకృతీ../నీ రూపకర్త అద్భుత స్రష్ట/అద్వితీయ సృష్టికి నీవు పరాకాష్ఠ!” అంటారు ‘విశ్వరూపం’ కవితలో.
‘ప్రచండ మారుతం’, ‘ఇసుక తుఫాను’, ‘అమృతవర్షిణి’ కవితలలో ప్రాకృతిక శక్తుల ఘనతని గుర్తిస్తూ, ప్రార్థనాపూర్వక కృతజ్ఞతలు చెప్తారు కవి.
సర్వాంతర్యామి ఉనికి ఓ రహస్యమంటారు ‘నీవెక్కడ?’ కవితలో. “ఓ రహస్యమా?/అదృశ్యమా!/సర్వ సృష్టికర్తా!/నీవెక్కడ?/ప్రకటించు” అని వేడుకుంటారు.
ప్రకృతికీ, మానవాళికీ నశ్వరతని అన్వయిస్తూ, ఎల్లప్పుడూ భగవంతుని నుతించమంటుంది ‘సదా స్మరామి’ కవిత.
తొలిప్రేమ – అనుబంధం:
ఈ విభాగంలో 23 కవితలున్నాయి.
ఈ విభాగంలోని మొదటి కవిత శీర్షిక విభిన్నంగా ఉంది, ‘మన్మథనం’ అంటూ. మన్మథ మథనం అని స్ఫురించినప్పుడు వలపురేడు శరీరాన్ని మథిస్తున్నాడన్న భావం కలుగుతుంది; మన్మ ధనం అని చదువుకుంటే యవ్వన సంపద అని అనిపిస్తుంది. చక్కని శీర్షిక. తనువులో కొత్త తపన రేగినప్పుడు – “మన్మథునికి ఎందుకిచ్చావు అనుమతి?” అంటూ ప్రణయదేవతని నిలదీస్తుందో యువతి ఈ కవితలో.
ప్రేమలో పడినప్పుడు ప్రియురాలి కోసం ఏదైనా చేద్దామనుకుంటాడు ప్రియుడు. ప్రేమ మైకం కమ్మేసినప్పుడు అసాధ్యమైనవి కూడా చాలా సులువుగా సాధించగల్గేవిగా భావిస్తారు ప్రేమికులు. అందుకే ఆకాశం నుంచి నక్షత్రాలు తెంపుకురానా, సముద్రం నుంచి ముత్యాలు ఏరుకురానా అని ప్రియురాలిని అడుగుతాడు ప్రియుడు. అలా నిజంగా తేవాలనుకోడం అతని ఉద్దేశం కాదు.. ఆమెని మెప్పించడం కోసం ఎంతటి కష్టానికైనా వెరువను అని చెప్పడం అతని అభిమతం. ఈ భావన ‘నీ కోసం’ కవితలో చక్కగా వ్యక్తమైంది.
“జంటగా గడిపిన అనుభూతులు/మా మదిలో నిరంతరం నిలిచిపోనీ” అని హృద్యంగా ప్రేమదేవతని వేడుకుంటుందో జంట ‘నిరంతరం’ కవితలో.
ప్రేమలో కొంతకాలం గడిచాకా, ప్రేయసిపై ఆధిపత్య భావన కలుగుతుంది కొందరికి. మాట తూలుతారు. మనసు గాయపరుస్తారు. ప్రేయసికి బాధ కల్గించామని గ్రహించాకా, ఆమె మనసు నొచ్చుకుందని అర్థమయ్యాకా, పశ్చాత్తాపం చెంది క్షమించమంటే ఆమె మన్నించినా, గాయపు మచ్చ మాత్రం ఎంతో కొంత మిగిలే ఉంటుంది. అటువంటి ఓ ప్రేమికుడి పశ్చాత్తాపాన్ని ప్రదర్శిస్తుంది ‘అశ్రు కణాలు’ కవిత.
ప్రేమలో సంశయం కలిగినప్పుడు, సలహా అవసరమైనప్పుడు – ఓ ప్రేమికుడు భగవంతుడినే మార్గం చూపమంటాడు ‘కలయిక’ కవితలో. “ఓ భగవాన్/నీ అనంత విజ్ఞతాభాండం లోంచీ నాకు/వికాసాన్ని ప్రసాదించు/విధ్యుక్తాన్ని ప్రబోధించు” అని వేడుకుంటాడు. దేవుడిది విజ్ఞతాభాండం అనడంలోనే ఆ భాండం నుంచి కాసింత అందిపుచ్చుకున్నట్టు విజ్ఞత కనబరిచాడతడు. లోతైన భావన ఉన్న కవిత ఇది.
కష్టసుఖాలలో, చివరికి మరణంలోనూ కలిసుందామంటూ ఓ జంట చేసుకున్న బాసని ‘జతి స్వరం’ కవిత గొప్పగా వినిపిస్తుంది.
ఈ విభాగంలో చివరి కవిత ‘కొమరిత’. కూతురిపై తండ్రికి ఉండే ప్రేమని గొప్పగా వ్యక్తీకరించింది.
అన్వేషణ – వేదన:
ఈ విభాగంలో 13 కవితలున్నాయి.
“విశదంగా మనసుల్ని కొలిచేందుకు/నిజమైన మనిషిగా నిలిచేందుకు!/భ్రమాపొరల్ని వలిచేందుకు” యంత్రమో మంత్రమో ఉందా? అని అడుగుతూ మనిషి అంతఃసౌందర్యాన్ని గుర్తించేగలిగే శక్తినివ్వమని వేడుకుంటున్నాడు ‘లోపలి మెరుపు’ కవితలో.
ఒక అనివార్యమైన విషయాన్ని గుర్తు చేస్తూ, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని ప్రగతిపథంలో సాగమని ‘ప్రాపంచిక పథం’ కవిత గొప్పగా చెబుతుంది.
మనసులో ఎంతో మథనం జరిగితే కాని, భావాలు అక్షర రూపం ధరించవు. భావాలు పదాలై అనుభూతులవ్వాలంటే త్రచ్చుట అవసరం. ఇదే విషయాన్ని అర్థవంతంగా ప్రదర్శిస్తుంది ‘మనో విహారి’ కవిత.
పంచభూతాలు నేర్పే సమానాత్వాన్ని మనిషి గ్రహించడంలేదని వాపోతుంది ‘పంచామృతం’ కవిత. కష్టాలు నష్టాలు ఎన్ని ఉన్నా, “ఆవిరవని ఆశ ఉంటే చాలు” శిఖరాలకు ఎగరవచ్చునంటుంది ‘ఫీనిక్స్’ కవిత. గొప్ప ఆశావాదాన్ని ఇముడ్చుకున్న కవిత.
అంతరంగాన్ని అర్థం చేసుకుని, తనని తాను పరిశీలించుకునే మనిషి భావాలను అద్భుతంగా వెల్లడిస్తుంది ‘ముసుగు’ కవిత.
అనుభవం – విజ్ఞత:
ఈ విభాగంలో 25 కవితలున్నాయి.
లక్ష్యం ఏమైనా, గమ్యం ఏదైనా చివరికి వరకు సాగమని, అడ్డంకులు కల్పించే నిరాశానిస్పృహలకి వెరవద్దని సానుకూల దృక్పథం అవసరాన్ని చాటుతుంది ‘వదలకు’ కవిత.
‘గతం’ ఎంత ముఖ్యమో చెప్తారు కవి. “గతాన్ని అనుభూతించు అది నీ స్వగతం/ప్రస్తుతంలో జీవించు – అది రేపటి నీ గతం” అంటారు కవి.
“మనోవాక్కాయ కర్మలు ఒక్కటైనప్పుడు/సాధన సాధ్యం – /విజయం తథ్యం” అంటుంది ‘లక్ష్యం’ కవిత. గొప్ప స్ఫూర్తినింపుతుంది.
కదిలే మనుషుల్ని కదిలించే వ్యవస్థకు పునాదులేవో ‘జీవన వేదం’ కవిత వెల్లడిస్తుంది. ఆధ్యాత్మికతని అవగతం చేసుకునే మార్గాన్ని చూపుతుందీ కవిత.
డాంబికాలని కట్టిపెట్టి, ఆర్ద్రంగా వినిపించే దైవ వాణిని వినమంటుంది ‘దివ్య స్వరం’ కవిత. ఎనిమిదే వాక్యాలలో బ్రతుకుబాటని చూపించింది.
వార్ధక్యం – మరణం:
ఈ విభాగంలో 24 కవితలున్నాయి.
‘విజ్ఞతా వారసత్వం’ నేటి యువతలోని తొందరపాటుని, అలసత్వాన్ని ప్రశ్నిస్తుంది. ఐశ్వర్యం, అధికారం, అంతస్తులు, సాధన లేకుండా సమకూరవన్న వివేకాన్ని మరోసారి గుర్తుచేస్తుంది.
ముదిమిని మిసిమిగా ఎలా మార్చుకోవచ్చో ‘మీమాంస’ కవిత గొప్పగా చెబుతుంది.
‘వీడ్కోలు’ కవిత హృదయాన్ని తాకుతుంది. మరణమాసన్నమైన ఆత్మీయులకు వీడ్కోలు చెప్పాల్సివచ్చినప్పటి వేదనని అక్షరాలలో పొదిగి ఆ అనుభూతిని అజరామరం చేశారు కవి.
“ఏ జన్మ కూడా ప్రయోజన శూన్యం కాదు” అంటారు కవి ‘దేవులాడకు’ కవితలో. “ఒక జీవితం ముగింపు/మలిజన్మకి తొలి మలుపు” అని వ్యాఖ్యానిస్తారు.
అహం నశించి, భౌతిక శక్తి అంతరించి, అంతిమ క్షణాలలో నిజం తెలుసుకున్న మనిషి చేసే నిజమైన అధ్వేషణని ‘ప్రార్థన’ కవిత అద్భుతంగా ప్రదర్శిస్తుంది.
‘మ-రణం’, ‘మృత్యువు’ కవితలు మనిషి విగతుడయ్యే క్షణాలను అత్యంత వాస్తవికంగా ప్రదర్శిస్తాయి.
ఈ విభాగంలోని కవితలు సున్నితమైన హెచ్చరికల వంటివి. నడతను సరిచూసుకుని ఋజుమార్గంలో నడక సాగించమని అవ్యక్తంగా చెబుతాయి.
~
ఇవన్నీ చదివాకా, అనువాద కవితలంటే నమ్మడం కొంచెం కష్టం. నేరుగా తెలుగులో వ్రాసిన కవితల్లానే అనిపిస్తాయి.
“సృజనాత్మకత, మానవీయత, అనుభూతివాదం వంటి జీవితానికి కావలసిన సహజ సౌందర్య పోషకాలతో ‘మనో విహారి’ని రూపుదిద్దారు రాజశేఖర్” అని వ్యాఖ్యానించిన శ్రీ మద్దాళి రఘురామ్ గారి అభిప్రాయంతో తప్పక ఏకీభవిస్తారు పాఠకులు.
***
ఆంగ్ల మూలం: దినకర రావు పసుపులేటి
తెలుగు సేత: కస్తూరి రాజశేఖర్
ప్రచురణ: కస్తూరి ప్రచురణలు, హైదరాబాద్
పేజీలు: 127
వెల: ₹ 100/-
ప్రతులకు:
కస్తూరి నాగేశ్వరరావు,
ఫ్లాట్ నెంబర్ 301, సిరి నిలయం,
కాకతీయ నగర్, రోడ్ నెం. 3,
హబ్సీగూడా
హైదరాబాద్ 500007
ఫోన్: 98493 30930, 9848378034
ఆన్‍లైన్‍లో:
https://www.amazon.in/Kasturi-Rajasekhar/dp/9334387882
~
శ్రీ కస్తూరి రాజశేఖర్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-kasturi-rajasekhar/
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’ అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ అనువదించారు. ప్రముఖ హిందీ గీత రచయిత ఆనంద్ బక్షి జీవితచరిత్రని తెలుగులోకి అనువదించగా, ఇటీవల పుస్తక రూపంలో వెలువడింది.
ఓ ప్రముఖ ప్రచురణ సంస్థ కోసం అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు (అముద్రితం).
ప్రస్తుతం డా. సాధనా శంకర్ రచించిన Ascendance అనే సైన్స్ ఫిక్షన్ నవలని, డా. సుధాంశు మణి గారి My Train 18 Story ని అనువదిస్తున్నారు.
‘దేవుడికి సాయం’, ‘ఆహ్లాదపురం ఆరో వీధి’ అనే కథాసంపుటాలు, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
