[డా. జి.వి. పూర్ణచందు గారు రచించిన – మరచిపోయిన మహత్తర రచన ‘నీలగిరి యాత్ర’ – అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది రెండవ, చివరి భాగం.]
విశాఖపట్టణంలో జమీందారీ కుటుంబానికి చెందిన గోడే వెంకట జగ్గారావు గజపతి (1817) గొప్ప గణిత శాస్త్రవేత్త. అప్పట్లో గోడేవారు, అంకితం వారూ విశాఖపట్టణంలో జమీందారీ కుటుంబాలకు చెందినవారు. సామాజికంగా ప్రసిద్ధి చెందిన కుటుంబాలు. గోడె జగ్గారావు గజపతి తమ్ముడు గోడే నారాయణ విశాఖపట్టణంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనేవాడు.
గోడె జగ్గారావుగారికి ఖగోళశాస్త్రం అభిమానపాత్రం. మద్రాసు వెళ్లి అక్కడ ప్రభుత్వ ఖగోళ పరిశోధకుడిగా ఉన్న గ్లాన్ విల్లె టైలర్ అనే ఆంగ్లేయుణ్ణి ఆశ్రయించి మాగ్నెటిక్ అబ్జర్వేటరీలో ఖగోళశాస్త్ర శిక్షణ పొందాడు. ఈ అబ్జర్వేటరీలో రామానుజ నాయుడనే ఉద్యోగి కోలాశేషాచలకవికి స్నేహితుడు.
శేషాచలకవి గణితశాస్త్రాన్ని తన పై ఉద్యోగి మాంగాడు శ్రీనివాస మొదలియార్ దగ్గర అభ్యాసం చేశాడు. రామధేను రామానుజ నాయుడి ద్వారా మేగ్నెటిక్ అబ్జర్వేటరీ సహకారంతో ఖగోళ విద్యను కూడా కొంత పరిచయం పొందటానికి ప్రయత్నించాడు. ఆ విధంగా గోడే వెంకట జగ్గారావు, రామానుజనాయుడు, శేషాచలకవి ఈ ముగ్గురు తెలుగువాళ్లు సహజంగానే సన్నిహితులయ్యారు. “మితవచనుడు నా నొప్పు మాంగాడు శ్రీనివాస మొదలికి గణితశాస్త్ర శిక్షితుడు దీర్ఘమతి రామధేను రామానుజ నాయనికిని…… ముఖ్య హితుడ” అనటం వలన తన ఈ రచనకు ప్రేరకులు జగ్గారావు, రామానుజనాయుడు, మాందాడు శ్రీనివాస మొదలియార్ కావచ్చునని అర్థం అవుతోంది. ఆ పరిచయం నీలగిరి యాత్రని గోడె వెంకట జగ్గారావుకి అంకితం ఇవ్వటానికి ప్రేరేపించి ఉండవచ్చు.
జగ్గారావుగారు విశాఖపట్టణం తిరిగివచ్చి 1840లో స్వంతంగా ఒక ఖగోళ పరిశోధనాశాలను నిర్మించాడు. అందుకోసం తన తోటలోనే పెడ్డ డాబా కట్టించాడు. అందులో ఈ అబ్జర్వేటరీని నెలకొల్పాడు. అంత పెద్ద మేడ అదొక్కటే కావటాన ప్రజలు దాన్ని డాబాగార్డెన్స్ అని పిలిచేవాళ్లు. విశాఖపట్టణంలో ఈ పేరు ఇప్పటికీ నిలిచి ఉంది.
గోడె వెంకట జగ్గారావుగారు తన కుమార్తెని సాటి జమీందారు అంకితం నరసింగరావు కిచ్చి వివాహం చేశాడు. జగ్గారావుగారి తరువాత నరసింగరావుగారే ఈ అబ్జర్వేటరీని నిర్వహించారు. జగ్గారావుగారి కుమార్తె మూడు లక్షల రూపాయల మూలధనాన్నిచ్చి ఈ అబ్జర్వేటరీ ఎలాంటి ఆటంకం లేకుండా నడిచేందుకు తోడ్పడింది. దాదాపు 1898 వరకూ ఈ అబ్జర్వేటరీ ప్రభుత్వం వారి ఆధీనంలో పనిచేసింది.
“మత్కృతిపతులగు గోడె వేంకట జగ్గరాయలు గారికి కోలా శేషాచలకవి వలన సమర్పితంబగు నీలగిరి్యాత్ర” అని దీని వ్రాత ప్రతి మీద ఉండటం చేత ఆయన స్వయంగా జగ్గారావుగారికి వ్రాతప్రతిని అందచేసి ఉంటాడనే ఈ గ్రంథాన్ని 1953లో ప్రచురించిన క్యురేటర్ చంద్రశేఖరన్ అభిప్రాయపడ్డారు.
గ్రంథం చివర వ్రాసిన పద్యాలలో శేషాచలకవి “……..క్రైష్టు శకమున నొక వేయి శతము లెన్మిది పదు లయిదును మరి నాల్గు హాయనములు నడుచు నానంద వర్షంబున” అనటం ద్వరా 1854 ఆనందనామ సంవత్సరంలో ఈ రచన పూర్తి చేసి అనతికాలంలోనే దాన్ని జగ్గారావుగారికి సమర్పించి ఉండాలి.
జగ్గారావుగారు 1856లో మరణించినట్టు వికీపీడియా ఆధారం. ఆయన చివరి రోజుల్లో ఈ పుస్తకం కృతిని పొందటం వలన అది ఆనాడు అచ్చయ్యిందో లేదో తెలీదు. ప్రాచ్యలిఖిత భాండాగారంలో చేతివ్రాతప్రతి మాత్రమే లభించింది. బహుశా, అనారోగ్యం వంటి కారణాల్లో జగ్గారావుగారు దీని ముద్రణను పట్టించుకుని ఉండకపోవచ్చు. ఆయన మరణానంతరం శేషాచలకవిగారు కూడా ఆ పుస్తకం మీద ఆశలు వదులుకుని ఉండవచ్చు. మొత్తం మీద విద్యార్థుల ప్రయోజనం అనే కవిగారి లక్ష్యం నెరవేరలేదు. అంతేగానీ ఆరుద్రగారు కించపరచినట్టు ఇందులోని గ్రాంధిక భాషవలన అది ముద్రణ పొందలేదనటం సరికాదు.
నా ఈ వ్యాసం మొదటి భాగాన్ని చదివిన ఒకరిద్దరు 10వతరగతి వాళ్లకి పాఠ్యాంశంగా ఈ పుస్తకంలోంచి కొంత భాగాన్ని 1992-93ల్లో పెట్టారని తెలిపారు. ఆమేరకు కొంతైనా ఆ కవికి న్యాయం జరిగిందనుకోవాలి!
అనివార్య యాత్ర
“శ్రీమంతులు ధీమంతులు గుణవంతులునగు హిందూ ప్రముఖ నిఖిలజన పరంపరం బెంపారుచు మిగులం జెన్నగు చెన్న ఫరంబునకు గవర్నర్ అండు కమాండెర్ యిన్ చీఫ్ అనంబడు నధిపతియు నఖిల సేనాపతియు గాసియుక్తుండయి యుండు యూరోబ్దేశ ‘సముద్భవుండగు హిస్ ఎక్సల్లెన్సీ లెప్టన్ జనరల్ ‘దీ మోస్ట్ నోబిల్ జార్జి నూర్క్విస్-ఆఫ్-ట్వీడేల్ కె. టి.ఆండ్ సీ. పీ. యను ‘పుడమిరేడు’ దనపరివారంబుతోడ నీలగిరికి నరుగునెడ దత్పరిజిన ప్రవరులలో నొక్కరుండగు క్విన్న్స్ డిప్టీ అజిటన్. జనరల్ ఆను నుద్యోగము వహించి యుండెడు ‘లెప్టన్ కర్నల్ తామస్ సిమ్సన్ షాట్, సి. బి. దొర వెంట నతని యాఫీసులో హెడ్ క్లార్క్ అనంబడు లేఖక ప్రముఖుండును, మత్సఖుండునగు మాంగాడు శ్రీనివాస మొదలారికిని క్లార్క్ అనంబడు ‘లేఖకుండనగు నాకు నయ్యహార్యవర్యంబునకుం జను ‘కార్యంబనివార్యంబయ్యె”
ఇది నీలగిరి యాత్ర పుస్తకంలో మొదటి పేరా! ఇందులో అప్పటి ఆంగ్లేయాధికారులు నీలగిరికి తరలి వెడుతుంటే హెడ్ క్లార్క్ మాంగాడి శ్రీనివాసరావు, క్లార్క్ కోలా శేషాచల కవి అనుసరించి వెళ్ళటం అనివార్యం అయ్యిందని పేర్కొన్నాడు.
ఈ చివరి వాక్యం ఆ కాలపు అధికార యంత్రాంగం, ఉద్యోగుల జీవనవాస్తవాలు, బ్రిటిష్ పాలనా విధానాన్ని మన కళ్లముందు నిలుపుతుంది. ఆ ‘అనివార్యం’ వెనుక ఎంతటి జీవనభారం దాగి ఉందో ఊహించవచ్చు. ఇల్లూ వాకిలీ, భార్యాబిడ్డలు, స్వస్థల సౌఖ్యాలను విడిచి నెలల తరబడి పరాయి నేలల్లో తిరుగుతూ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాల్సిన స్థితి అది. దొరల వెంట ప్రయాణించిన ఈ పరివారానికి ప్రత్యేకమైన వసతి, భోజన సౌకర్యాలు కల్పించినట్లు గ్రంథంలో ఎక్కడా సూచన కనిపించదు. చెట్ల నీడల్లో వంటలు చేసుకుంటూ, దారిపొడవునా దొరికిన ఆశ్రయాల్లో బస చేస్తూ ప్రయాణం సాగించినట్లు తెలుస్తుంది. మొదట ఇలా అయిష్టంగానే బయల్దేరినా నీలగిరి అందాలు చూశాక “పరమేశ్వరుండు నాకు కొంతదేశము చూపించుటకై.. దొరగార్లతోను మొదటి పరియాయం నీలగిరికి పోవడమునకు నాజ్ఞాపించినాడు” అని చెప్పుకున్నాడు.
అందుకే ఈ యాత్ర శేషాచలకవికి కేవలం ఉద్యోగపరమైన బాధ్యతగా మాత్రమే మిగలలేదు. అనివార్యంగా ప్రారంభమైన ఆ ప్రయాణం క్రమంగా ఒక సౌందర్యాన్వేషణగా మారింది. నీలగిరుల ప్రకృతి వైభవం, అక్కడి ప్రజల జీవనశైలి, ఆచారవ్యవహారాలు, వాతావరణ విశేషాలు ఆయనను మంత్రముగ్ధుణ్ని చేశాయి. అందుకే తొలి పేరాలో ప్రస్తావించిన ఆంగ్లేయ దొరలు తరువాత గ్రంథమంతటా దాదాపుగా కనుమరుగైపోతారు; వారి స్థానంలో కొండలు, మేఘాలు, అడవులు, గ్రామాలు, మనుషులు ప్రవేశిస్తారు.
ఉద్యోగం ఆయనను నీలగిరులకు తీసుకెళ్లింది; కానీ రచయిత హృదయం ఆ యాత్రను సాహిత్యంగా మలిచింది. వృత్తి ముగిసిన చోట ప్రవృత్తి ప్రారంభమైంది. అందుకే ‘నీలగిరి యాత్ర’ ఒక అధికారిక ప్రయాణ నివేదికగా కాక, ప్రకృతి–సమాజ–సంస్కృతి దర్శనంగా నిలిచిపోయింది. దొరలవెంట నడిచినవాడు ఒక ఉద్యోగి. కానీ, నీలగిరులను చూసి తరించి తనివిపొంది తిరిగివచ్చింది మాత్రం ఒక కవ హృదయం. వృత్తి ఆయన్ని కొండలపైకి తీసుకుపోతే, ప్రవృత్తి ఆ కొండలకు ఒక వచనకావ్య రూపాన్నిచ్చింది.
ఆంగ్లపదాల పరిచయం
ఆంగ్లేయుల పేర్లను, ఆంగ్లపదాలను అచ్చంగా అదే ఉచ్చారణతో తెలుగులో వ్రాసిన తొలి ప్రయత్నం ఈ రచన. శేషాచల కవికి యాబై యేళ్ల తరువాత కన్యాశుల్కం నాటకంలో కానిస్టెబుల్ని కనిస్టీబు అనటం, కలక్టర్ని కలకటేరనటం గమనిస్తే విదేశీ పదాల ప్రయోగాల పరిణామక్రమం అర్థం అవుతుంది. తొలినాటి ప్రయాస కూడా అర్థం అవుతుంది. కానిష్టేబుల్ అంటే బహువచనం అయినట్టు ఏకవచనంలో పిలవటానికి కనిష్టీబు అన్నారాయన.
అసిస్టెంట్ అని ఇప్పుడు పలుకుతున్నాం. అప్పట్లో అసిస్టాంటు అనేవారు. బహువచనం అసిస్టాంట్స్. దాన్ని శేషాచలకవి ‘అసిస్టాంటుసులు’ అన్నాడు. గురజాడవారు ఏకవచనానికి ఏకవచన రూపాన్ని కనిస్టీబు అని ప్రయోగిస్తే శేషాచలకవి బగువచనానికి బహువచన రూపాన్ని చేర్చి అసిస్టాంటుసులు అన్నాడు.
“ఆఫీసరులనంబడు పడవాళ్లు గొందరును” అంటాడు. ఆఫీసర్ని మనం అధికారి అంటున్నాం. 175 యేళ్ళ క్రితం ఆఫీసర్లని పడవాళ్లు అనేవాళ్లు కాబోలు. పడవాలు/పడవాలుడు అనేది ఏకవచనం. ఆర్మీ కమాండర్ అని దానికి నిఘంటు అర్థం. పడవ అనే తెలుగు మాటకి సంబంధించిన పదం ఇది. పడవ అంటే యుద్ధం, ప్రళయం. దాన్ని నడిపించేవాడు పడవాలుడు. సివిల్ ఉద్యోగాల్లోను ఉన్నతాధికారిని పడవాలు అనేవాళ్ళని అర్థం చేసుకోవచ్చు. “వేల్పు పడవాలు” అంటే దేవతల సేనాని కుమారస్వామి అని!
క్లార్క్ని గుమాస్తా అనటం హిందీ సాహిత్యంలోంచి మనకి అలవాటయ్యింది. “హెడ్ క్లార్క్ అనంబడు లేఖక ప్రముఖుండును” అని శేషాచలకవి వ్రాయటాన్ని బట్టి క్లార్క్ అంటే లేఖకుడని, హెడ్ క్లార్క్ అంటే లేఖక ప్రముఖు డని వ్యవహరించేవారని అర్థం అవుతోంది. ‘మున్షీ’ కూడా మరాఠీ హిందీల లోంచి వచ్చి చేరిన పదమే! ఇంజనీరును యంత్రవేది అనటం గొప్పగా ఉంది. మనకు ఇంజనీర్లు లేరు కాబట్టి మన భాషలో దానికి పేరుండదు, అందుకని ప్రజలకు ఇంజనీర్ అనే మాట బాగా తెలిసేందుకు యంత్రవేది అని శేషాచలకవిగారే అనువాదం చేసి ఉండాలి.
మసీదుని “యవనదేవభవనము” అనీ, పోస్టాఫీసుని అంచెలచావడి అనీ తెనిగించాడు. ఆ రోజుల్లో పోస్టల్ రన్నర్లు ఉండేవారు. ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ఈ రన్నర్లు మొత్తం ఉత్తరాల కట్టని ఒక గోనె సంచిలో వేసుకుని మరొక పోస్టాఫీసుదాకా మోసుకెళ్ళి అందించేవాడు. అక్కడి నుండి మరొక రన్నర్ వేరొక పొస్టాఫీసుకు చేరవేసేవాడు. ఇలా అంచెలంచెలుగా ఉత్తరం గమ్యస్థానానికి చేరేది. అందుకని పోస్టాఫీసుని అంచెలచావడి అనటం చాలా సబబుగా ఉంది ఇప్పుడిలాంటి పోస్టల్ రన్నర్ల అవసరం లేదుకాబట్టి ఈ అంచెలంచెల మోక్షం గురించి మనకు అంతగా తెలీదు. అంచెలచావడి అనే పదం వెనక ఇంత కథ ఉంది.
ఒక మైలు అంటే 1760 గజాలని, ఒక గజం అంటే మూడు అడుగులని, ఒక ఆడుగుకి 12 అంగుళాలని వివరించాడు. మాగ్నెటిక్ అబ్జర్వేటరీని అయస్కాంత పరీక్షాశాల అనీ, సోల్జరుల్ని సైనికులని, కమాండింగ్ ఆఫీసర్ని దళనాయకుడని, సివిల్ సర్జన్ని అనువెజ్జు అనీ, చాప్లెయిన్ని అనువెజ్జ అనీ, పెన్షన్ని అనుజీవిక అనీ ఇలా ఆంగ్ల పదాల్నీ ఈ రచనలో పేర్కొంటూ, వాటికి సరైన తెలుగు అర్థాన్ని ఇవ్వటం ఈ గ్రంథంలో ముఖ్యమైన విషయం. తద్వారా లౌకిక జ్ఞానాన్ని కలిగించటానికి శేషాచలకవి విశేషంగా ప్రయత్నించాడు.
కాఫీ ఆనాటి ప్రజలకు ఒక వింత. “ఆ శిలోచ్చయంబుపై నెంగిలీషు భాషఁ గాఫీ యని పేర్కొనంబడు బీజ విశేషంబులు మెండుగఁ బండుచుండు.” నీలగిరుల్లో కాఫీ ఎక్కువగా పండుతుందంటూ, దాన్ని ఆయన ఎంగిలీషు పంట అన్నాడు, కాఫీ పుట్టు పూర్వోత్తరాల సంగతి ఎలా ఉన్నా మన దేశంలో ఈ పంటకి యూరోపియన్లే కారణం కాబట్టి! కాఫీని, ఆలూ దుంపల్ని స్వాతంత్ర్యం వచ్చేవరకూ జాతీయోద్యమకారులు సేవించకపోవటానికి కారణం ఇదే!
క్లబ్ హవుస్ అంటే “పూటకూళ్లు వెట్టించువారి సభాసదనము” అన్నాడు. ముల్లంగిని రెడిష్ అని పలికాడు.
“పద్యకావ్యాలలోని వచనాలు ఎంత జటిలంగా ఉన్నా సాధారణంగా నిత్య వ్యవహారాలలో మన పూర్వులు శిష్ట వ్యావహారికాన్ని వాడేవారు. కుంఫిణీ యుగం తొలి రోజులలో సాగిన వచన రచనలన్నీ సహజ సజీవ భాషలోనే ఉండేవి. అయితే ఏదో అజ్ఞాతమైన చిన్నతనం వల్ల చెన్నపట్టణంలోని పండితులు చేటపెయ్య లాంటి కృతక భాషను క్రమేణా తయారు చేసుకొని సాహిత్య దుగ్గాలను చేపడం మొదలుపెట్టారు. దినచర్యలు, యాత్రా చరిత్రలు వంటి రచనలను కూడా గడ్డు గ్రాంథికంలో వ్రాయసాగారు. ఇటువంటి వాళ్లలో కోలా శేషాచలం ఒకడు” అని ఆరుద్ర కుంఫిణీ యుగంలో రచనలపై విశ్లేషణ చేస్తూ కోలాశేషాచలకవిపై బాణం విసిరాడు.
“అందరికీ అర్థమయ్యే పదాలు కాకుండా పాండిత్య ప్రకర్షంగా ఉండాలని మూలనున్న పదాలను కూడ తట్టి లేపుతాడు” అని మచ్చ హరిదాసు గారు కూడా “తెలుగులో యాత్రా చరిత్రలు” గ్రంథంలో శేషాచలకవి మీద ఒక విసురు విసిరారు. కొత్త మాటల్ని పరిచయం చేయటాన్ని పాండిత్య ప్రకర్ష అనటం అన్యాయం.
ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తిగారు తన తెలుగు సాహిత్య చరిత్ర ఐదవ భాగంలో శేషాచలకవి వ్రాసిన నీలగిరియాత్రని వచనకావ్యం అనటాన్ని నిరసించారు. ఇంకా చాలామంది విమర్శకులు నీలగిరి యాత్రని పరామర్శించారుగానీ ఈ కవి రచనాశైలిని పెద్దగా మెచ్చుకోలేదు.
పునరవలోకనం అంటే పూర్వ రచయితల ప్రాధమిక ప్రయోగాలను అవమానించటం కాకూడదు. పూర్వకవులంతా శిష్టవ్యవహారంలో వ్రాసినవారే నని ఆరుద్రగారు సర్టిఫికేటు ఇవ్వడం కూడా విచిత్రమే!
“పల్లికొండ యను నూర న్యూనాధిక్యంబుగ మున్నూఱగారంబులును నగ్రహారంబును నాపణవారంబును దాలూకు కచ్చేరియ నెంగిలీషు బాటసారుల విడిమట్టును గనుపట్టెడు” ఇలా ఉంటుంది శేషాచలకవి శైలి.
ధనికులు బీదవారు కలిసి మున్నూరు గడప (300 ఇళ్లు) ఉన్న ఆ ఊళ్లో అగ్రహారం, అంగడివీధి, తాలూకాఫీసు, ఇంగ్లీషు అధికారుల బస కోసం రహదారి బంగళా ఉన్నాయట!
విద్యార్థులకు తెలుగు పదాలు తెలిసేందుకు దీన్ని వ్రాస్తున్నానన్నాడు శేషాచలకవి. అంతేగాని నవల లాగా చదువుకోవటానికి ఆయన ఈ రచనని ఉద్ధేశించలేదు. అగారం= ఇల్లు, ఆపణం= అంగడి ఇలాంటి పదాల్ని విద్యార్థులకు పరిచయం చేయాలని కవి చేసిన లక్ష్య ప్రస్తావనను ఆరుద్ర పట్టించుకోకుండా “చేటపెయ్యలాంటి కృతకభాష” అనే ముద్ర వేశారు. విద్యార్థులకు ఈ గ్రంథం అందకపోవటమే మేలన్న భావనను వ్యక్తపరిచారాయన.
భాష పరిణామక్రమంలో ఈ తొలి కవుల్ని పునాదులుగా భావించకుండా, తక్కువచేసి, తమ ఆధిక్యతను కనబరిచే భావాల్ని రుద్దటం వలన చాలా పదాలు మన తరానికి తెలీకుండా పోయాయి. ఆ రోజుల్లో ఆ స్థాయికి ఒక బ్రాహ్మణేతరుడైన సామాన్యుడు చేరుకుని ఉన్నత లక్ష్యాన్ని ప్రకటించుకోవటం తక్కువ విషయమేమీ కాదు.
విద్యార్థులు భాషని సాహిత్యం ద్వారానే కదా నేర్చుకోగలిగేది. సాహిత్యంలో కాకుండా తెలుగు పదాలను ఇంకెక్కడ ప్రయోగిస్తారు? కొత్తమాటల్ని కృతక భాష అనటం మన కృతకత్వాన్నే చాటుతుంది.
(సమాప్తం)
డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వివిధ సాహిత్య ప్రక్రియలలో సృజనాత్మక, సామాజిక, వైఙ్ఞానిక రచనలు చేసిన సాహితీవేత్త. 130 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి. 50 అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న ‘హంస’ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సద్గురు శివానంద మూర్తి వికారి నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆర్కాటు ప్రసాదరావు ధర్మనిథి పురస్కారం ఇంకా 50కి పైగా సంస్థల పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 4 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు.
