[విప్లవనారి దుర్గాభాభీ నేపథ్యంలో ఈ కథని రచించారు శ్రీమతి దాసరి శివకుమారి.]
“కుముదా రా కూర్చో. ఇవ్వాళ ఆఫీస్‌కు శెలవు పెట్టావా?”
‘అవును’ అన్నట్లుగా తల ఊపింది. గుండె మీద చెయ్యి పెట్టి చూపింది బాగా లేదన్నట్లుగా కుడి చేతి వేళ్లు తిప్పింది.
“ఒంట్లో బాగాలేదా? ఏమైంది?”
‘కాద’న్నట్లుగా తల మళ్లీ అడ్డంగా తిప్పింది. కుముద పేరు తగ్గట్టే కుందనపు బొమ్మలాగా వుంటుంది. కాని నోరు విప్పి మాట్లాడలేని దురదృష్టవంతురాలు. మనమేమడిగినా వేగంగా జవాబులకు సైగలు చేసి చూపిస్తుంది. మొదట్లో నాకు బాగా కొత్త కొత్తగా అనిపించింది. క్రమేపీ అలవాటు పడ్డాను.. ఏమైనా ఎక్కువగా మాట్లాడదలుచుకున్నప్పుడు పేపరు పెన్ను పెట్టి వ్రాసి చూపిస్తుంది. ఒక్కోసారి ఆఫీసులో వున్నప్పుడు ఏదైనా చెప్పాల్సిన అవసరం ముంటే ఫోన్‌లో మెసేజ్ పెడుతుంది. తను మా ఎదురింట్లోకి వచ్చి మూడు నెలలయ్యింది. ఒక్కతే వుంటున్నది. వచ్చిన రోజే పలకరింపుగా నవ్వింది. పుస్తకాలు బాగా చదవటం నాకూ, మా వారికీ బాగా అలవాటు. కుముద కూడా ఆఫీసు నుంచి వస్తూ చేతిలో ఏవో పుస్తకాలతో వస్తుంది. గ్రంథాలయ శాఖ వారి సంచార పుస్తకాలయం పుణ్యమా అని మరిన్ని పుస్తకాలు తెప్పించుకుని మరీ చదువుతున్నాం. ఒక రోజు నేను వెళ్లి పుస్తకాలు తిరగేస్తుంటే తను వచ్చింది. నాకు కావాలి అన్నట్లు సైగ చేసింది. సంచార పుస్తకాలయం అతనితో మాట్లాడి తనక్కావలసిన పుస్తకాలు ఇప్పించాను. ఇంకేమైనా పుస్తకాలు కావాలంటే మా ఇంటికొచ్చి తీసుకొమని చెప్పాను. వస్తానన్నట్లుగా తల ఊపింది. అప్పట్నుంచి తను మా ఇంటికి రాకపోకలు సాగిస్తున్నది. తెలుగు పుస్తకాలతో పాటు ఇంగ్లీషు పుస్తకాలు కూడా చదువుతుంది. ఈ రోజే ఎందుకో బాగా మూడీగా వున్నది. నిదానంగా కనుక్కోవాలనుకున్నాను. ఏమైవుంటుందా అని ఆలోచిస్తుంటే కుముద గతం గురించి నాకు తెలిపింది కళ్ల ముందు మెదిలింది.
***
“చీటీలో వున్న మందులన్నీ ఇచ్చారుగా. బిల్ ఇవ్వండి” అన్నాడు రమేష్.
అలాగే అన్నట్లుగా చిరునవ్వ నవ్వింది ఆ అమ్మాయి. కంప్యూటర్‌లో మందుల బిల్ తయారు చేసి రమేష్ చేతిలో పెట్టింది. రమేష్ ఇచ్చిన డబ్బులు తీసుకున్నది. వేరే పేషెంట్ తాలూకు మందులు వెదికిచ్చే పనిలో పడింది. ఎవరేం అడిగినా చిరునవ్వు నవ్వటం, తల ఊపటం చేతి వేళ్లు కదిలించి ఉందనో, లేదనో చెప్పటం తప్పితే నోరు విప్పి ఒక్క ముక్కా మాట్లాడదేంటి? అనుకున్నాడు రమేష్. మూగతనం వలన మాట్లాడలేదని తెలుసుకుని చాలా బాధపడ్డాడు. అమ్మకు న్యుమోనియా జ్వరం రావటం వలన ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. తగ్గినట్లే తగ్గి మరలా జ్వరం పెరిగింది. “చాలా జాగ్రత్తగా వుండాలి. ఒక్కోసారి న్యూమోనియా ప్రాణాంతకమవుతుంది” అన్నారు డాక్టరుగారు. తరచూ సెనైన్ బాటిల్స్, మందులు కొనుక్కురావాలిసి వచ్చేది. ఆస్పత్రిలోనే వున్న మందుల షాపులో ఆ అమ్మాయికి తోడుగా మరొకరు కూడా వున్నారు. కాని ఈ అమ్మాయే వేగంగా స్పందించి త్వరత్వరగా మందులు ఇచ్చి పంపుతూ వుండేది.
రమేష్‌కు ఆ అమ్మాయిని అలా చూస్తూ వుండిపోవాలనిపించేది. మాటే మాట్లాడలేదు గాన మిగతా అవలక్షణాలు ఏవీ లేవు. చెముడు లేదు. చెప్పగానే మన మాట గ్రహించి వేస్తుంది. ఆ అమ్మాయంటే చాలా ఇష్టం, ఆకర్షణ కలిగింది. ఆ పదిరోజుల్లోనూ ఆ ఆకర్షణ ప్రేమగా మారింది. పరిశీలించి చూస్తే ఆ అమ్మాయికి పెళ్లైన లక్షణాలు ఏం కనపడలేదు. చుడీదార్ డ్రస్ మీద చిన్న గొలుసు వేసుకుని వుండేది. కుడి చేతికొక గాజు ఎడమ చేతికి సన్నని స్ట్రాప్ వున్న వాచీ మాత్రం కనుపించేది. పాపం మాటలు రాని బంగారు బొమ్మ అనిపించేది.
ఆస్పత్రి నుంచి అమ్మ ఇంటికొచ్చేసింది. నాన్న కూడా డ్యూటీ కెళ్లిపోతున్నారు. తనూ తన జాబ్‌కి వెడుతున్నాడు. ఒకటి రెండు సార్లు ఆ అమ్మాయిని చూడాలనిపించి మందుల షాపుదాకా వెళ్లి వచ్చాడు. అమ్మను చెకప్ చేయించటానికి నాన్న వెళతానన్నా వద్దని తనే ఆస్పత్రికొచ్చాడు. ఆ వంకతో ఇంకోసారి ఆ అమ్మాయిని చూసొచ్చాడు. ఆ తర్వాత ప్రయత్నించి ఆ అమ్మాయి వివరాలు తెలుసుకున్నాడు. తల్లిదండ్రునొప్పించి పెళ్లి దాకా తీసుకొచ్చాడు. కోరి చేసుకున్నాడు కబట్టి రమేష్‌కు ఏమీ ఇబ్బంది అనిపించటం లేదు. పైగా సంతోషంగా కూడా వున్నది. కుముదను కూడా సంతోషంగా వుంచటానికే ప్రయత్నించేవాడు. రెండేళ్లు గడిచాయి. రోడ్ యాక్సిడెంట్‌లో రమేష్ చనిపోయాడు. కుముదకు ప్రపంచమే తల్లకిందులయింది. కారుణ్య నియమకం కింద పంచాయితీ రాజ్ డిపార్ట్‌మెంట్లో కుముదకు ఈ ఊళ్లో ఉద్యోగమిచ్చారు. తనకు తెలిసిన కంప్యూటర్ పని కాబట్టి అలవాటుగా తేలిగ్గానే ఆఫీసులో పూర్తి చేయగలుగుతున్నది. ఇంట్లో వున్న టైంలో కూడా లాప్‌టాప్ ముందు కూర్చుని మూగ, చెమిటి వారికి ఎలా శిక్షణ ఇవ్వాలో కంటితో చూస్తూ ముఖాన్ని ఆడిస్తూ చేతుల్ని తిప్పుతూ సైగలు చేయటం నేర్చుకుంటూ వుంటుంది. తనకు తానే, చూసి నేర్చుకుంటూ మరింత నైపుణ్యాన్ని సంపాదించింది. ప్రతి ఆదివారం ఇక్కడే ఈ వూళ్లోనే వున్న మూగ చెవిటి వారి పాఠశాలకెళ్లి వాళ్లకు శిక్షణ ఇచ్చి వస్తూ వుంటుంది. ఆదివారమే కాదు ఏ శెలవు రోజొచ్చినా వాళ్ల మధ్య కెళ్లిపోతుంది. పగలంతా ఆఫీసు పని. రాత్రి పూట పొద్దుపోయే వరకూ పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేస్తూ వుంటుంది. చదివి బాగా అర్థం చేసుకోగలదు కూడా. తన కంటే చిన్నవాడు తమ్ముడున్నాడు. కాలేజీ చదువుతున్నాడు. తండ్రికి గురజాడలో వుద్యోగం. తల్లీ తండ్రీ తమ్ముడూ ఎప్పుడో వీలున్నప్పుడొచ్చి కుముదను చూసి వెళుతూ వుంటారు. నోరు లేకపోయినా ఒక్కతే ధైర్యంగా వుంటున్నది. ఆఫీసుకు దగ్గరగా వున్నదని ఈ ఇంటిని నెంచుకున్నానని చెప్పింది. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్‌లో వుండటం ఇష్టం లేదన్నది. ధైర్యంగల పిల్లే అనుకున్నాను. అలాంటి కుముద ఈ రోజు ఇలా డీలా పడి వున్నది. ఆరోగ్యం బాగా లేదా అంటే కాదన్నది. అంటే మనసు బాగా లేదన్న మాట. ఏమయిందో? ఎలా కనుక్కోవాలి? అడిగితే ఏమయినా అనుకుంటుందా? చెప్పే విషయమైతే తనే చెప్తుందని నేను లేచి వెళ్లి టీ పెట్టుకుని వచ్చి తనకు ఇచ్చి తాగుతూ కూర్చున్నాను.
“ఏంటి ఇవాళ కుముదమ్మ ఇంట్లోనే వున్నది!” అంటూ మావారొచ్చి పలకరించారు. నవ్వి వూరుకున్నది. బయటకెళ్లి ఓ గంటలో తిరిగొస్తానని మా వారు బయటికెళ్లారు.
టీ తాగిన కప్పు తీసుకెళ్లి సింక్‌లో కడిగి పెట్టి వచ్చింది. వద్దని చెప్పినా వినదు. మనిషికి శుభ్రత ఎక్కువే. పొందిగ్గా వుంటుంది. మేమిద్దరం తరచూ వాడే లెటర్ పాడ్ చేతిలోకి తీసుకున్నది. ఎలా మెదలు పెట్టి వ్రాయాలా అన్న ఆలోచనలో పడింది. ఆ తర్వాత నింపాదిగా వ్రాయసాగింది.
“ఆఫీసుకు వెళ్లాలనిపించటం లేదు. ఎందుకంటే సెక్షన్ ఆఫీసర్ బాగా వేధిస్తున్నాడు. తట్టుకోలేకపోతున్నాను. వత్తాసుగా మిగతా వాళ్లు వుంటున్నారు. ఎవరికి చెప్పే ఏం ప్రయోజనం లేదు. జాబ్ మానేసి వెళ్లిపోవాలనుకుంటున్నాను” అని వ్రాసింది.
అయ్యో! నోరు లేని ఈ పిల్లనూ వేధిస్తున్నారా? కోలీగ్స్ వేధిస్తే సెక్షన్ ఆఫీసర్‌తో చెప్పేదేమో? అతనే వేధిస్తే ఎలా? ఇంకా పై ఆఫీసర్‌కు చెప్పుకోవాలి. ఆ ఆఫీసర్లు చెప్పినా వీళ్లు వినాలి, మారాలి. కుముద ఒంటరి ఆడపిల్ల. నోరు లేనిదని గాభరా పడుతున్నది. అక్కడ మరీ ఇబ్బంది అయితేనే ఉద్యోగం మానేసి పోతానంటున్నది. భర్త పోవటంతో అత్తగారింటితో బంధం తెగిపోయినట్లంది. నష్టజాతకురాల్ని చేసుకుని కొడుకు అకాల మరణం పొందాడని వాళ్లు కుముద మీదే నిందేశారట. ఉన్న ఆస్తిపాస్తులు మామగారి స్వార్జితం కాబట్టి ఆయనిష్టం వచ్చినట్లు చేసుకుంటానన్నాడు. “మావాడిని చేసుకుని మింగేశావు. మీ మటుకు నీవు ఉద్యోగం దక్కంచుకున్నావు. దాంతో నీ బతుకు నువ్వు బతుకు” అంటూ తలపులు మూసేశారు. ఇక పుట్టింటి వారే ఆధారం. అదృష్టమో, దురదృష్టమో ఈ రెండేళ్లలో కాపురంలో కుముదకు సంతానం కలగలేదు. ఇప్పుడు తనే కుముదకు ధైర్యం చెప్పాలి. ఇటువంటి స్థితిని దాటుకుని కాస్త తెప్పరిల్లితే చాలు. పరిస్థితుల్ని ఎదుర్కొనే చాకచక్యం కుముదకున్నది. ఇప్పుడు ఆ చాకచక్యం కాస్త మసకేసింది. అంతే. అని ఆలోచిస్తూ పేపరూ, పెన్నూ నేను తీసుకున్నాను.
“కుముదా! నువ్వింకా ధైర్యంగా వుండాలి. వెకిలి మనుషులకు భయపడి నువ్వు ఉద్యోగం మానేద్దామన్న అభిప్రాయానికి రావటం మంచిది కాదు. ఏ ఊర్లోనైనా, ఏ ఆఫీసులోనైనా ఇలాంటి వాళ్లు కనిపిస్తూనే వుంటారు. వాళ్లచేతా, వీళ్ల చేతా చెప్పించినా మీ సెక్షన్ ఆఫీసర్ లాంటివాళ్లకు మార్పు రాదు. నీకు నువ్వే అతనంటే లెక్కలేనట్లుగా వుండు. అవసరమైతే చట్టం సహాయం తీసుకోవచ్చును. నువ్వుంటే మీ అంకుల్‌కూ నాకూ చాలా ఇష్టం. నువ్వు బాధపడుతుంటే మాకు బాధ కలుగుతుంది. అంకుల్‌తో కూడా మాట్లాడతాను. మా ఇద్దరి అండ నీకెప్పుడూ వుంటుంది. మరేం భయం లేదు” అంటూ వ్రాశాను.
అది తీసుకుని చదివింది కుముద. “థాంక్ యూ” అంటూ పేపరు మీద వ్రాసింది. ఆ తర్వాత లేచి పుస్తకాల రాక్ వంక చూపించి పుస్తకం కావాలంటున్నట్లుగా సైగ చేసింది. మనసుకు బాధగా వున్నప్పుడు పుస్తకాన్ని మించిన తోడు ఏముంటుంది అనుకుంటూ నేను రాక్ దగ్గరకు నడిచాను. పుస్తకాలు పేర్లు చూస్తూ ‘విప్లవనారి దుర్గాభాభీ’ అన్న పుస్తకం తీసిచ్చాను. “ఇది చదువు కుముదా. నువ్వేదో విప్లవం చెయ్యాలని కాదు., ధైర్యంగా జీవితం గడపాలని చెప్తున్నాను. జీవితంలో భర్తను చిన్న వయసులోనే కోల్పోయినా కుంగిపోకుండా దుర్గాభాభీ తన భర్త ఆశయాలు పూర్తి చేయటానికి ఎలా ముందుకు నడిచిందో గమనించు. భగత్‌సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లతో పాటు కలిసి దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న స్త్రీ. ఎంతో ఆలోచనాపరురాలు. తోటి వారి కోసం ఎన్నో కష్టాలను భరించిన స్త్రీమూర్తి. ఈ పుస్తకాన్ని ఇప్పుడే చదవటం మొదలుపెట్టు. నీలో కొత్త ఆలోచనలు వస్తాయి. ఆల్ ది బెస్ట్” అని చెప్పాను. “కుముదా ఒక్క మాట. ఈ పూట వంట చేసినట్లుగా లేదుగా. కూరిస్తాను, తీసుకెళ్లు.” అన్నాను.
వద్దు వద్దని తల అడ్డంగా తిప్పుతూ ఆ పుస్తకం తీసుకుని వెళ్లిపోయింది. వంట చేసుకోవాలి. తినాలి అన్న ధ్యాసే లేకుండా పుస్తకం తీసుకుని మంచం మీద పడుకుంది. పేజీలు తిప్పసాగింది. అలహాబాద్‌లో 1907, అక్టోబర్ 7న దుర్గాభాబీ జన్మించింది. పదకొండవ యేటే భగవతీ చరణ్ వోహ్రాతో పెళ్లి జరిగింది. ఆ తర్వాత లాహోర్‌లో కాపురం పెట్టారు. లాహోర్‌లో మహిళా పాఠశాల వుండేది. అక్కడ హిందీ టీచర్‌గా పని చేస్తూ ఖాళీ సమయాల్లో విప్లవ సాహిత్యం, కరపత్రాలు పంచిపెట్టేది. స్వయంగా భగవతీ చరణ్ వోహ్రా స్వరాజ్య ప్రేమికుడు. విప్లవవాది కూడా. ఒకసారి ఒక అమరవీరుని చిత్రపటాన్ని కప్పటానికి ఒక తెల్లని ఖద్దరు గుడ్డను తన చేతి రక్తంతో తడిపి ఎర్రగా మార్చింది దుర్గాభాభీ. మరోక సారి భగత్‌సింగ్‌ని లాహోర్ నుండి కలకత్తా చేర్చటానికి, తన కొడుకుతో సహ బయలుదేరింది దుర్గాభాభీ. ఈ ప్రయాణంలో ఆమె ఒక దొరసాని, భగత్‌సింగ్ ఒక దొర వేషంలో రైల్లో కూర్చుని వెళ్లి గమ్యం చేరారు. పోలీసుల కళ్లు గప్పి ఎంతో యుక్తిగా, ధైర్యంగా ప్రయాణం చేసింది ఆమె.
లాహోర్ జైల్లో 63 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి జతీన్ దాస్ చనిపోతే అతని, భౌతికకాయాన్ని కలకత్తా తీసుకెళ్లిన బృందంలో కూడా దుర్గాభాభీ చేరింది. ఏ అరెస్టుకూ, ఏ జైలు శిక్షకు భయపడేది కాదు. 1930వ సంవత్సరంలోనే బాంబును పరీక్షిస్తుంటే అది చేతిలోనే పేలి భగత్ చరణ్ వోహ్రా మరణించాడు. విషయం తెలిసిన దుర్గాభాభీ కన్నీటిని కిందకు జారనివ్వకుండా ఆయన లేకపోయినా ఆయన ఆశయం కొనసాగవలసిందే, వెనుకంజనేసేదిలే అని చంద్రశేఖర్ ఆజాద్ లాంటి సహచరులకు తానే ధైర్యం చెప్పింది. స్వాతంత్ర్య పోరాటంలో తన వ్యక్తిగత దుఃఖం ఏపాటిదని ఆలోచించింది. భగత్‌సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‍ల ఉరి శిక్షను ఇర్విన్‌తో మాట్లాడి రద్దు చేయించాలని దుర్గాభాభీ గట్టిగా కోరుకున్నది. ఆ పని కోసం గాంధీజీని వెళ్లి కలసి మాట్లాడింది. ‘ముందు నీవు అరెస్టవు. నిన్ను నేను విడుదల చేయిస్తాను’ అన్న గాంధీజీ సూచనను కూడా తిరస్కరించి వెనక్కు వచ్చేసింది. ఆ రోజుల్లో ఆమె ఎక్కడికి వెళ్లినా చివరకు బాత్‍రూమ్‌కి వెళ్లినా రివాల్వర్‌ను వెంటే వుంచుకునేది. అంత జాగ్రత్తగా మసలుకునేది. పోలీసులు ఎదురు పడినపుడు చాకచక్యంగా మాట్లాడేది. కొన్ని సార్లు అరెస్టయింది. జైలు శిక్షా అనుభవించింది. తనకంటూ ఉన్న ఆస్తినంతా దేశ స్వాతంత్ర్య పోరాటం కోసమే ఖర్చు పెట్టేసింది. ఆ రోజుల్లోనే నలభై వేల రూపాయిల్ని పోగొట్టుకున్నది. ఆస్తి పంపకాలలో వచ్చిన మూడు ఇళ్లను బ్రిటిష్ ప్రభుత్వం జప్తు చేసేసింది. ఎవరెవరి ఆశ్రయం లోనో తన బిడ్డతో పాటు వుండవలసి వచ్చేది. అటువంటి స్థితిలో కూడా నిరాశపడలేదు. లక్ష్యానికి దూరం కాలేదు. 1937వ సంవత్సరంలో ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి దుర్గాభాభీ అధ్యక్షురాలిగా ఎన్నికైంది. పలు ఉద్యమాలలో పాల్గొన్నది. ఆ తర్వాత మద్రాస్ లోని అడయార్‌లో మాంటిసరీ శిక్షణ పొందింది. లక్నోలో మొట్టమొదటి మాంటిస్సోరీ బాలికా పాఠశాలను స్థాపించింది. తర్వాతి రోజుల్లో ఆ పాఠశాలే, కో-ఎడ్యుకేషన్‌గా మార్చబడింది. ఇంటర్ కాలేజీ గానూ రూపొందింది. అదే చోట అమరవీలురుల స్మృతులను భద్రపరచటం కోసం ‘షహీద్ స్మారక్’ కేంద్రాన్ని స్థాపించింది. 1993లో మీరట్ విశ్వవిద్యాలయం దుర్గాభాభీకి గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. ఆమె పేరు దుర్గే. కాని చంద్రశేఖర్ ఆజాద్, రాజ్ గురు లాంటి స్వాతంత్ర్య సమరయోధులందరి చేతా భాభీ అని పిలువబడి దుర్గాభాభీగా స్థిరపడిపోయింది. ఈ విధంగా దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆమె పడిన కష్టాలకు లెక్కలేదు. పరిస్థితులలోను పోలీసులతోనూ యుద్ధమే జరిపింది. అలాంటి క్లిష్ట పరిస్థితులలోనే తనకున్న ఏకైక కుమారుణ్ణి పెంచి పెద్ద జేసి ప్రయోజకుణ్ణి చేసింది. నిండైన జీవితం గడిపి తన తొంభై రెండవ యేట 1999 అక్టోబరు 27వ తారీఖున చనిపోయింది.
ఇలాంటి వివరాలన్నీ చదవగానే కుముద కనుకొలనుల్లో నీళ్లు నిలిచాయి. మనసులో దేశభక్తి పెల్లుబికింది. పరవశురాలైపోయింది. అదే సందర్భంగా తన్ను తాను పరిశీలించుకున్నది. తనను వేధించే వాళ్లు బ్రిటీషి పోలీసులకంటే ఎక్కువ ప్రమాదకరమైన వాళ్లా? తుపాకులను, నాటు బాంబులను మోస్తూ దుర్గాభాభీ ఎంత ధైర్యంగా తిరిగింది? ఎక్కడా అధైర్యపడలేదు. నిరాశపడలేదు. తను కూడ ధైర్యంగా వుండాలి. పరిస్థితులకు భయపడి దూరంగా పారిపోకూడదు. ఎదుర్కోవాలి. తను ఎదుర్కోగలదు. తనకు నోరు లేకపోవచ్చు. తెలివితేటలున్నాయి. తనకీ పుస్తకమిచ్చి ఆంటీ ఎంతో ఉపకారం చేసింది. తనకొక మార్గదర్శకమయింది. ఇప్పుడు కావలిసినంత ఆత్మస్థైర్యం కూడా తోడయింది. తనను వేధించే వారి నుండి తన్ను తాను కాపాడుకుంటుంది. ఇక ఏమాత్రం వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. సెక్షన్ ఆఫీసర్ వాళ్ళింకా శృతి మించితే పై వారికి రిపోర్ట్ చేస్తుంది. అప్పటికీ సాధ్యం కాకపోతే చట్టం సహాయం తీసుకుంటుంది. మహిళా కమీషనుంది. పోలీసులున్నారు. అంతే కాని ఉద్యోగం వదిలిపెట్టి పోవాలన్న పిరికి ఆలోచనలు ఇంక చేయదు. ఇలా ఆలోచించుకుని మంచం దిగింది. శుభ్రంగా వంట చేసుకుని భోజనం చేసింది.
మర్నాడు కొత్త ఉత్సాహంతో కొత్త ఆలోచనలతో ఆఫీస్‌కు బయలుదేరింది. ఇప్పుడు తను తనకంటూ ఒక ధ్యేయాన్ని ఏర్పరుచుకుంటుంది. తనలాంటి వారికి తన చేతనైన సాయం చేస్తుంది. దుర్గాభాభీ లాగా స్వంతంగా విద్యాలయాలు స్థాపించలేకపోవచ్చు. కానీ తన లాంటి వారికి సహాయం చెయ్యటానికి, వాళ్ల ఉన్నతికి తన శాయశక్తులా పాటు పడాలన్న దృఢ నిశ్చయంతో ముందుకడుగేసింది కుముద.
శ్రీమతి దాసరి శివకుమారి గారు విశ్రాంత హిందీ ఉపాధ్యాయిని. వీరు 125 సామాజిక కథలను, 5 నవలలను, 28 వ్యాసములను రచించారు. ఇవి కాక మరో 40 కథలను హిందీ నుండి తెలుగుకు అనువదించారు. వీరు బాల సాహిత్యములో కూడా కృషి చేస్తున్నారు. పిల్లల కోసం 90 కథల్ని రచించారు. మొత్తం కలిపి 255 కథల్ని వెలువరించారు. వీరి రచనలు వివిధ వార, మాస పత్రికలతో పాటు వెబ్ పత్రికలలో కూడా వెలువడుతున్నాయి.
వీటితో పాటు అక్బర్-బీర్బల్ కథలు, బాలల సంపూర్ణ రామాయణం కథలు, బాలల సంపూర్ణ భాగవత కథలు రెండు వందల నలభై రెండుగా సేకరించి ప్రచురణ సంస్థకు అందించారు. మరికొన్ని ప్రచురణ సంస్థల కొరకు హిందీ నాటికలను కథలను అనువదించి ఇచ్చారు. వీరి రచనలు 24 పుస్తకాలుగా వెలుగు చూశాయి.