Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మార్పు మన(సు)తోనే మొదలు-10

[ప్రసిద్ధ రచయిత్రి డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి రచించిన ‘మార్పు మన(సు)తోనే మొదలు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. తెలుగులో మానసిక ఆరోగ్యం కేంద్రంగా రచించిన నవల ఇది.]

[అమిత – గగన్‍తోను, పూర్ణిమతోనూ మాట్లాడాలని అంటుంది. గగన్, పూర్ణిమలిద్దరికీ మానసిక శాస్త్రంలో ప్రవేశం ఉంది గనుక వాళ్ళు మొదట మాట్లాడరు; ఓపిగ్గా వింటారు. కాసేపయ్యాకా అమిత చెప్పడం మొదలుపెడుతుంది. తాను సూపర్ ఉమన్ అని అనిపించుకున్నందుకు ఏ మాత్రం సంతోషం లేదని చెబుతుంది. చిన్నప్పటి నుంచి ఎంతో ఉత్సాహవంతురాలైన తాను మగపిల్లలతో సమానంగా పనులు చేయడం, ఆటలు ఆడడం చేసేదాన్నని అంటుంది. తనకి ‘ఆల్‌రౌండర్’ అనిపించుకోవాలన్న తపన బాల్యం నుంచి ఉండేదని అంటుంది. తన తెలివితేటలకి తగ్గ ఉద్యోగం సంపాదించుకున్నానని, గొప్పగా రాణించానని చెబుతుంది. అయినా తాను ఓ స్త్రీ కాబట్టి ఉద్యోగంలో వివక్షని ఎదుర్కున్నాని చెబుతుంది. పెళ్ళాయ్యాక – ఉద్యోగం, ఇంటి బాధ్యతల మధ్య సమతౌల్యం సాధించడం కష్టమైందని అంటుంది. భర్త, పిల్లల పట్టనితనం, అత్తమామల సహాయ నిరాకరణ వంటివి బాధించాయని అంటుంది. అందరికీ వాళ్ళకి కావలసినవి అమర్చి, తన అవసరాలేమిటో, అసలు తనక్కూడా అవసరాలనేవి ఉంటాయనీ మరచిపోయానని అంటుంది. అందరినీ పైకెత్తడం కోసం తనను తానే పాతాళంలోకి తోక్కేసుకున్నానని చెబుతుంది. తన బాధనంతా వెళ్ళగక్కుతుంది. ఓపిగ్గా విన్న పూర్ణిమ కాసేపు అమిత ఏడ్వమంటుంది. ఏడ్చేసి బరువు దింపుకోమంటుంది. కాసేపటి తర్వాత అమిత కుదుటపడ్డాకా, తనకి కొన్ని సూచనలు చెబుతుంది. అప్పుడు అమిత తనలో వస్తున్న శారీరక మార్పుల గురించి చెపుతుంది. అవన్నీ మానసిక రుగ్మతలో భాగమని అంటూ మార్పు కోసం ఏం చేయాలో చెబుతుంది పూర్ణిమ. గగన్‌తో మందులు రాయించుకుని అమిత ఉత్సహాంగా ఇంటికి తిరిగి వెడుతుంది. గగన్, పూర్ణిమ ఒకరింటికి వెళ్ళి, అక్కడున్న అమ్మాయిని, ఆమె తాతయ్యని పలకరిస్తారు. ఆయన తన కొడుకూ కోడళ్ల కథని చెప్పడం మొదలుపెడతాడు. – ఇక చదవండి.]

“డాక్టర్, ఒక సూయిసైడ్ ఫెయిల్యూర్ కేస్ ఉంది.. మీ సహాయం కావాలి”, అర్థించాడు జాయ్, ఒక ఆదివారం మధ్యాహ్నం. పక్క ఊళ్ళో జరిగిన ఉదంతం అది. హుటాహుటిన వెళ్ళాడు గగన్. ఎలాగూ పెళ్ళికి వెళ్ళడం లేదు కాబట్టి పిల్లిని, అదే ప్రభాత్‌ని వెంటబెట్టుకు తీసుకెళ్ళాడు.

@@@

అనగనగా ఓ రైతన్న ఋణ విమోచనం పొందలేక ఆత్మహత్య చేసుకున్నాడట. అతని భార్య పింఛను కోసం తిరిగి, తిరిగి అలసిపోయి, భర్తను అనుసరిద్దామనుకుందట. ఆ ఆలోచనని అమలు చేద్దామని, ‘మనుషులు మారాలి’ సినిమాలో లాగ పిల్లలకి ఎండ్రిన్ కలిపిన అన్నం పెట్టి, అదే అన్నాన్ని తనూ తిని చనిపోదామనుకుందట.

అనుకోకుండా ఆ సమయానికి ఆమె అన్న రావడం తటస్థించిందట. ఆసుపత్రిలో స్పృహలోకి వచ్చిన ఆమె ‘నా పిల్లల్ని నేనే చంపేశాను’, అంటూ హిస్టీరియా వచ్చిన మనిషిలా అరుస్తూ ఉందట.

@@@

వీళ్ళు వెళ్ళేసరికి ఆమె ఇంచుమించు అదే పరిస్థితిలో ఉంది. ఆసుపత్రిలోని డాక్టర్లు ఆమెకిచ్చిన మత్తు మందు జస్ట్ అప్పుడే ప్రభావం చూపించడంతో వాళ్ళ కళ్ళెదుటే ఆమె నిద్రలోకి జారుకుంది. ముందు ఆమె ట్రౌమాకి చికిత్స చేసే నిమిత్తం ఏవో మందులు రాసిచ్చి, ప్రభాత్‌తో కలిసి, బయటకు నడిచాడు గగన్. “పేపర్లో చదువుతున్నప్పుడు లేని విపరీతమైన బాధ కళ్ళారా చూస్తే ఉంటుంది”, అని కళ్ళజోడు తీసి జేబు రుమాలుతో రాబోయే కన్నీటి ధారని ఆపేశాడు ప్రభాత్.

గగన్ అతణ్ణి నిశితంగా గమనించాడు. సాధారణంగా స్కిజోఫ్రెనియా రోగులు తాము ఊహించుకున్న బాధలే ప్రపంచంలోకెల్లా అతి పెద్ద కష్టాలన్నట్టు ఫీల్ అవుతారు. మిగిలిన వారి బాధలకి, కష్టాలకి స్పందించరు. ఆ బాధలతో తాదాత్మ్యం చెందరు. ఇప్పుడు ప్రభాత్ ఇలా రియాక్ట్ అయ్యాడంటే ఖచ్చితంగా జబ్బునుండి బాగానే కోలుకున్నట్టు లెక్క. తను అతణ్ణి తోడు తీసుకుని రావడానికి కారణం కూడా అతడిలో స్పందన గమనించడానికే.

ఇంతలో జాయ్ వచ్చి, “సమయానికి మత్తు మందు ఇచ్చే డాక్టర్ దొరక్కపోతే, మీకు ఫోన్ చేశాను. మీరు వచ్చేసరికి ఆయన వచ్చేశారు. మీకు దొరికే ఒక్కగానొక్క సెలవు రోజున శ్రమ పెట్టాను, సారీ సార్”, అన్నాడు. “నో ప్రాబ్లం, కానీ మీకు.. ఈ రైతు కుటుంబం ఎలా..?” అని అడిగాడు గగన్.

“ఇదో మెడికో-లీగల్ కేసు”, జవాబిచ్చాడు జాయ్. “అదెలా? ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడంలో విఫలమైతే కేసు పెట్టకూడదు కదా!” అని, ఏదో గుర్తొచ్చిన వాడిలా ఒక్క క్షణం ఆలోచిస్తూ ఉండిపోయాడు. “యు ఆర్ రైట్ సార్, పిల్లలని చంపినందుకు”, అన్నాడు జాయ్. బాధగా మొహం పెట్టాడు గగన్. “చట్టం దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. ఏమీ చేయలేం సార్”, అన్నాడు జాయ్.

బయటకి వచ్చాక, “అంటే ఆవిడ జైల్లో మగ్గాల్సిందేనా?” బాధగా అడిగాడు ప్రభాత్. “ఆవిడ పేరు కామాక్షి. ఆ సంఘటన జరిగిన సమయంలో ఆవిడ మనఃస్థితి దృష్ట్యా కోర్టు వారు కరుణ చూపించొచ్చు. ప్రస్తుతానికి మాత్రం ఆమె తరఫున ఏమీ చెప్పలేం”, అన్నాడు జాయ్. “ఒక్క క్షణం ఆగితే చాలు, ఆ ఆలోచన మానుకోవడానికి. ప్చ్..” అని ప్రభాత్ దారంతా మథన పడుతూనే ఉన్నాడు. ‘నువ్వు కూడా ఒక్క క్షణం ఆగకుండా మృగనయనికి విడాకులివ్వలేదూ? ఈమె కూడా నీబోటిదే’, అని మనసులో అనుకున్నాడు గగన్.

***

‘బ్రోకెన్ ఈస్ బ్యూటిఫుల్’ అనే అంశంపై ఆనంద్ విరగ్గొట్టి, అందంగా తయ్యారు చేసిన రకరకాల షోకేస్ వస్తువుల ప్రదర్శన ఏర్పాటు అయ్యింది. వీటితోపాటు వివిధ అంశాలలో బీటలని హైలైట్ చేస్తూ కొన్ని చిత్రాలున్నాయి. ఉదాహరణకి బీడు వారిన భూమిపై తొలకరి జల్లు అందరి మన్ననలూ పొందింది. ఇవన్నీ ఆనంద్ గీసినవే.

దీనికి సూత్రధారి శశాంక్. ప్రముఖ చిత్రకారుడైన తనకి చిత్ర ప్రదర్శనశాలల ప్రముఖులూ తెలుసు; ఇటు మానసిక వైకల్యం ఉండే వారికి బ్రతుకు తెరువు కోసం చిత్రలేఖనం నేర్పించే సంస్థలూ తెలుసు. రెంటినీ చేర్చి ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన సూపర్ హిట్ అయ్యి, ఆనంద్‌కి మంచి పేరు తెచ్చిపెట్టింది.

మానసిక వైకల్యం ఉన్నవారికి అభయమిచ్చే ఓ ఎన్‌జి‌ఓ నిర్మల్ ఆఁచల్ [పరిశుభ్రమైన పైబట్ట (అంటే ఒంటిని కప్పే బట్ట అన్న మాట)] వారు ఆనంద్‌ని, అతని తల్లిదండ్రుల్నీ జీవితాంతం చూసుకునేందుకు ముందుకు వచ్చారు. పిట్ట ఎగిరిపోవలసిన సమయం వచ్చిందని గ్రహించారు గగన్ కుటుంబం, ప్రభాత్‌లు. మనసులో కన్నీళ్ళు పొంగుతున్నా, అతని భవిష్యత్తు మంచి వాళ్ళ చేతుల్లో ఉందని తలచి, సంతోషంగా సాగనంపారు వాళ్ళు.

***

ఇదంతా జరుగుతుండగా నిరూప్ ఎక్కడా కనిపించలేదు. ఈ విషయం గమనించిన గగన్ ఒకటి, రెండు సార్లు మొబైల్లో మాట్లాడడానికి ప్రయత్నించాడు కూడా! కానీ, అది స్విచ్ ఆఫ్ అయివుంది. గగన్ ఏదో కీడు శంకించాడు. ఓ వారం రోజుల తరువాత నిరూప్ రానే వచ్చాడు.

“సార్, ఏమయ్యిందంటే..” అని ఏదో చెప్పబోయాడు. గగన్ అతణ్ణి పట్టించుకోలేదు. ఇలా రోజంతా గడిచింది. సాయంత్రం, “మీ బౌన్సర్ ఉద్యోగానికి వెళ్ళిరండి”, అని ఎటో చూస్తూ నిరూప్‌తో అన్నాడు గగన్. “నా ఉద్యోగం ఊడిపోయింది సార్”, తల దించుకుని అన్నాడు నిరూప్. “అవును మరి, ఏరు ఎలాగూ ప్రవహిస్తోంది కదా, కొంచెం పుచ్చుకుంటే ఏమీ కాదనుకుని, పడిపోయే రేంజ్‌కి తాగితే ఊడక ఏమౌతుంది?” కోపంగా అన్నాడు గగన్.

“అంటే మీరు నా గురించి పబ్‌లో వాకబు చేశారన్న మాట. ఎందుకు తాగానో చెప్పుకునే అవకాశం ఇవ్వండి డాక్టర్ గారూ, ప్లీజ్”, అని బతిమాలాడు నిరూప్. “సరే”, అన్నాడు గగన్. విషయం చెప్పసాగాడు నిరూప్.

@@@

ఒకనాడు తను డ్యూటీలో ఉండగా ఫోన్ వచ్చింది. పబ్ ఓనర్‌తో విషయం చెప్పి సెలవు తీసుకుని తక్షణం బయలుదేరాడు. తెలియని ఊళ్ళు ఎన్నో దాటి ఒక ఊరు చేరుకున్నాడు. అక్కడ అతడి కోసం ఒక వ్యక్తి ఎదురు చూస్తున్నాడు. అతణ్ణి వెంటబెట్టుకుని ఒక పెద్ద కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాడు. ఆసుపత్రి బెడ్ మీద భుజాలదాకా చేతులు కోయబడిన నిశిథ్!

‘మగాళ్ళు ఏడవకూడదు అన్న వాడో అడ్డగాడిద’, అనుకుని మనసు తేలికపడేవరకూ విలపించాడు తను. నిశిథ్ మెల్లగా, ‘నన్ను క్షమిస్తావా నిరూప్?’ అని అడిగాడు తనని. అయోమయంగా చూస్తున్న తనతో, ‘నువ్వు తాగిన మందులో నిషేధించిన పదార్థాన్ని కలిపింది నేనే. నాకు దక్కనిది నీకు దక్కకూడదనే పంతం ఉండేది ఆ రోజుల్లో. అందుకే అసూయతో ఆ పని..’ అని ఏడ్చాడు నిశిథ్.

తను మంచానికి దగ్గరగా జరిగాడు, అతణ్ణి ఊరడించే ఉద్దేశ్యంతో. ‘నీ ఫోన్ నెంబర్ దొరకడానికి ఎన్ని రోజులు పట్టాయో.. రోడ్డు ప్రమాదం జరిగి నెల రోజుల పైనే అయ్యింది.. నేను ఒక చేత్తో మందులో డ్రగ్ కలిపితే, దేవుడు నా రెండు చేతుల్నీ ను..జ్జు.. ను..జ్జు..’, అని వాక్యాన్ని మధ్యలోనే ఆపేసి, ‘నీ కాళ్ళు, కనీసం చేతులు పట్టుకునేందుకు వీల్లేకుండా, దేవుడు నాకు ఈ శిక్ష విధించాడు’, అని మళ్ళీ వెక్కి వెక్కి ఏడ్చాడు నిశిథ్.

‘అయినదేదో అయిపోయింది. నేను అన్నీ మరచిపోయి కొత్త జీవితం ప్రారంభించాను’, అని తను తన డీ-అడిక్షన్ అనుభవాలు చెప్పి నిశిథ్‌ని ఓదార్చడానికి ప్రయత్నించాడు. తన మొబైల్ స్విచ్ ఆఫ్ అయిన సంగతి తను గమనించనే లేదు. అక్కడి పరిస్థితి అలాంటిది.

ఓ రెండు-మూడు రోజులుండి, నిశిథ్‌ని ఊరడించాక, తను తిరిగి వచ్చే సమయానికి రాత్రయ్యింది. ఉద్యోగానికి వెళ్ళే వేళయ్యింది. పనికి వెళ్ళాడన్న మాటే గాని తన మనసు మాత్రం నిశిథ్ దగ్గరే ఉండిపోయింది. తనని ఆజన్మాంతం వెయిట్ లిఫ్టింగ్ నుండి నిషేధించినప్పుడు, సుడిగుండంలో కూరుకుపోయి, తాగుడుకి బానిస అయినప్పుడు కూడా లేనంత బాధ ఇప్పుడు వెయ్యసాగింది.

తను ఎవరిపైనా తన మనస్తాపాన్ని రుద్దలేదే! తన పతనానికి కారణమైన వాణ్ణి కనిపెట్టి, వాడి మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకోలేదే! మరి, నిశిథ్‌కి ఎందుకు ఇంతటి శిక్ష పడింది? అతను ఒక ట్రైనింగ్ అకాడెమీని స్థాపించాడని చెప్పుకున్నాడే? తన శిష్యులు ఆసియా క్రీడల్లో పతకాలు కూడా పొందారని అతడు చెప్పాడు కదా! ఇప్పుడు రెండు చేతులూ రోడ్డు ప్రమాదంలో పోతే, మరి వెయిట్ లిఫ్టింగ్‌లో మెళుకువలు ఎలా నేర్పించగలడు? పాపం! కర్మంటే ఇదేనేమో!

ఇలా మనసు పరిపరి విధాల ఆలోచించి, తనను కలవరపెట్టింది. కాస్సేపు ఓపిక పట్టాడు. మరి కొంత సేపయ్యాక తలపై ఎవరో మొత్తేస్తున్నట్టు నొప్పి పెట్టింది. ఇంక, ఈ బాధ తట్టుకోలేక డ్యూటీలో ఉన్నాడన్న సంగతి మరచిపోయి, మందు కొట్టాడు. బార్‌టెండర్ వద్దన్నా వినిపించుకోలేదు. ఈ మధ్య మందుకి దూరమయ్యాడనేమో, తను చిన్న మొత్తాన్ని మింగిన కొద్ది సేపటికే అది తనని పూర్తిగా దిగమింగేసి బొక్క బోర్లా పడేటట్టు చేసింది. ఇంకేముంది, ఉన్న చిన్నకారు ఉద్యోగం కాస్తా ఊడింది!

@@@

“డాక్టర్ గారూ, నేను చేసింది సమర్థించుకోవడం లేదు. కానీ, నాకు ఇంకొక ఛాన్స్ ఇస్తారని ఆశిస్తున్నాను”, అన్నాడు నిరూప్. అతణ్ణి దీక్షగా గమనించాడు గగన్. అతను చేసిన తప్పుకి నిజంగా బాధ పడుతున్నాడు. మళ్ళీ ఆ మహమ్మారి జోలికి పోకూడదని ఆశ పడుతున్నాడు.

తాగుబోతులు మళ్ళీ తాగడం అనేది ఒక సాధారణ విషయమని ఇప్పటి వరకూ చేయబడిన పరిశోధనలు ఘోషిస్తున్నాయి. ఒక మానసిక వైద్యుడిగా ఈ విషయం గగన్‌కి తెలుసు. ఎటొచ్చీ అతణ్ణి ఒక పట్టు పట్టకపోతే, చేజారిపోతాడేమోనని జాగ్రత్త పడుతున్నాడు, అంతే!

మళ్ళీ యథా ప్రకారం ప్రభాత్ ఇంట్లో బస, తోటపని వగైరాలు మొదలుపెట్టాడు నిరూప్. ఆనంద్ లేకపోవడం వల్ల వెలితి అనిపించినా, అతను ఒక మంచి చోట స్థిరపడడానికి వెళ్ళినందుకు సంతోషించాడు. అతడు లేకపోవడం వల్ల దొరికే ఖాళీ సమయాన్ని ధ్యానానికి, తత్త్వ శాస్త్రం మీద ఉండే పుస్తకాలని చదవడానికి ఉపయోగించుకున్నాడు.

***

కొన్నాళ్ళకి వార్తాపత్రికలతో ఒక కరపత్రం వచ్చింది- త్రయంబకేశ్వర్ అనే ఆయన బై-పోలార్ డిజార్డర్ గురించి తన అనుభవాలు పంచుకుంటారని. దాన్ని ప్రభాత్‌కి చూపించి, “నేను వెళ్దామనుకుంటున్నా. మీరూ వస్తారా?” అని అడిగాడు గగన్. “ఇంట్లో కూర్చుని నేను చేసేదేముంది? అసలే ఆనంద్, వాళ్ళ నాన్న, ఇద్దరూ వెళ్ళిపోయాక వస్తువులు పగలడం లేదు, వాటిని అతికించడం, అందంగా తీర్చి దిద్దడం- ఇవేవీ లేక టైమ్ గడపడం కష్టంగా ఉందంటే నమ్మండి!” అన్నాడు ప్రభాత్.

“ఆ మాట ముందే చెప్పరేం? మీకో అందమైన పుస్తకం ఇస్తాను. ‘బ్యూటిఫుల్ మైండ్’- చదవండి. డౌట్లుంటే అడగండి. జీవితంలో ‘జీనియస్’ గా పేరున్న వాళ్ళని చూసి కొందరు మెచ్చుకుంటారు, కొందరు కుళ్ళుకుంటారు. మిగిలిన వాళ్ళు చూడలేనివి చూసే అటువంటి ఒక మహా మేధావి మనో మథనమే ఈ కథ”, అని చిన్న ఉపోద్ఘాతం ఇచ్చి, పుస్తకాన్ని కూడా ఇచ్చాడు గగన్. అక్కడే ఉన్న నిరూప్, “డాక్టర్ గారూ, నేనూ రావచ్చా?” అని అడిగాడు. “వై నాట్?” అన్నాడు గగన్.

***

“మీరు చెప్పింది కరెక్ట్ అంకుల్.. ఈ కార్పొరేట్ ప్రపంచం ఒక మృగతృష్ణ. ఎంత వెతికినా విజయం మన నుండి దూరం వెళ్ళిపోతూ ఉంటుంది”, ఒక ప్రవక్తలా మాట్లాడాడు దివిజ్. “ఏమిట్రోయ్ గ్రాంథిక తెలుగు పదాలు వాడేస్తున్నావ్.. ఏ ఏ‌సీ రూమ్‌లో నీకు జ్ఞానోదయం అయ్యిందిరా బాబూ?” సరదాగా అన్నాడు గగన్.

“మ్యాన్‌హట్టన్‌లో ఉద్యోగం దొరకడమంటే పూర్వ జన్మ సుకృతం అని అమెరికన్లే భావిస్తారు. మరి నాబోటి వాడు గాల్లో తేలిపోడూ? నాకొచ్చిన జాబ్ ప్రొఫైల్ మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్. అంటే, ఏదైనా కంపెనీ కష్టాల్లో ఉంటే, వాళ్ళ అప్పులు తీర్చి, అక్కడి షేర్ హోల్డర్స్‌కి కొంత ధనం ముట్టచెప్పి, దాన్ని టేకోవర్ చేసి, దాన్ని లాభసాటిగా తయారు చేయడం. వీటిలో చాలా తికమక లెక్కలుంటాయ్. వాటిని అలవోకగా చేసే ప్రతిభ నాకుంది గనుకే ఈ ఉద్యోగం నాకు దక్కిందనుకుని పొంగిపోయాను.”

“లెక్కలు తేల్చుకున్నాక, నష్టాల కంపెనీ వాళ్ళతో బేరసారాలు మొదలుపెట్టాలి. అక్కడే ఉంది కిటుకు. మా కంపెనీకి ఎంత లాభం తెస్తామో అంత పెద్ద బోనస్ వాళ్ళు మనకి ఇస్తారు. నాకు రెండో ఏటిలోనే అర మిలియన్ డాలర్ల బోనస్ ఇచ్చారు. అది కాక అలాస్కాకి లగ్జరీ క్రూస్‌లైనర్‌లో వెళ్ళి, అక్కడ రెండు వారాల హాలిడే జరుపుకునే అవకాశం కూడా కల్పించారు.”

“ఒక సగటు మధ్య తరగతి కుటుంబానికి చెందిన నాకు స్వర్గ సౌఖ్యమంటే ఇదే! ఇలా మరి కొన్నేళ్ళు గడిచాయి. నా పని గురించి తెలుసుకున్న ఒక పెద్ద పెట్టుబడి బ్యాంక్, అదే ఇన్వెస్ట్‌మెంట్ వాళ్ళు నన్ను సి‌ఈ‌ఓగా రమ్మన్నారు. అవకాశం బాగుందని దాన్ని వాడుకున్నాను. ఇంకా ఎక్కువ జీతం, బోనస్, పెర్కులు. చెడు అలవాట్లేవీ లేవు గనుక నేను డిమాండ్‌లో ఉన్న ఒక బ్రహ్మచారిని అయ్యాను.”

“నాకు పిల్లనిద్దామని అనుకునే వాళ్ళు, నేను అక్కడ బ్రైన్ స్టార్మింగ్ లాంటి పనులు చేస్తాను, అని అనుకుంటారు. కొత్త ఆలోచనలు చెప్పి, నష్టాల్లో ఉన్న ఆ కంపెనీలకి లాభాలు సంపాదించే దారులు సూచిస్తానని అనుకుంటారు. వాళ్ళకి పాపం తెలియదు, పైకెళ్ళిన కొద్దీ పక్క వాణ్ణి ఓడించే వ్యూహాలే ఎక్కువని.”

“కొన్నాళ్ళ తరువాత మనం ముందుకు వెళ్తున్నామా, లేక మనం ముందుండడం కోసం మిగిలిన వాళ్ళని వెనుకకు నెట్టేస్తున్నామా, అన్న సందిగ్ధం బుద్ధున్న వాళ్ళకి రావాలని వాళ్ళకేం తెలుసు? ఇంత చదువుకున్న నాకే ఇన్నాళ్ళూ రాలేదు కదా!..” ఇంకా ఏదో చెప్పబోతున్న దివిజ్‌ని అడ్డుకుని, గగన్, “ధర్మం-చట్టం-న్యాయం లాంటి చర్చలు జరిపేటప్పుడు ఒకరి సమక్షంలో మరొకరు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను దివిజ్,” అన్నాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version