Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మార్పు మన(సు)తోనే మొదలు-18

[ప్రసిద్ధ రచయిత్రి డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి రచించిన ‘మార్పు మన(సు)తోనే మొదలు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. తెలుగులో మానసిక ఆరోగ్యం కేంద్రంగా రచించిన నవల ఇది.]

[ఒక రోజున నిరూప్, కామాక్షిలు వచ్చి, తాము పెళ్ళి చేసుకోవడానికి నిశ్చయించుకున్నామని, తన చేతుల మీద జరిపించమని గగన్‌ని కోరతారు. గగన్ ఎంతో సంతోషిస్తాడు. కోవిడ్ కాలంలో పెళ్ళి కనుక పరిమిత సంఖ్యలో అతిథులతో వివాహం జరిపిస్తారు గగన్, పూర్ణిమ. దివిజ్, శశి హడావిడి చేస్తారు. నిరూప్ చెల్లి, ఆమెకి కాబోయే భర్త పెళ్ళికి వస్తారు. ఈ హాడివిడిలో జాయ్, దివిజ్‍ని పక్కకి పిలిచి, ‘మీరిస్తారన్న షేర్‍కి ప్రమీల గారు ఒప్పుకున్నారా’ అని దివిజ్‍ని అడుగుతాడు. ఆవిడ వద్దన్నారని చెప్పి, ఎందుకు వద్దన్నారో చెప్తాడు దివిజ్. విదేశాల్లో ఇలా లాభాల్లో షేర్ ఇవ్వడం కామన్ అని, కానీ ఆవిడ నిరాకరించారని, ఆ మొత్తాన్ని డొనేషన్‍లా ఇచ్చేసారని చెప్తాడు దివిజ్. ఇది తాను ముందే ఊహించానని జాయ్ చెప్పి, ఆవిడని క్షమాపణలు అడగమంటాడు. కొన్ని రోజులకి ఆవిడని కలిసిన దివిజ్ క్షమాపణలు కోరతాడు. తీర్థయాత్రలు ముగించుకుని మల్లిక భర్తతో ఊరికి తిరిగి వస్తుంది. గొప్ప కార్యాలకి తొలి మెట్టు నమ్మకమని తెలిసిన గగన్ ఆమె సంతోషాన్ని తగ్గించే ప్రయత్నం ఏదీ చేయడు. చినభూపతి బాగుపడాలని మనసారా కోరుకున్నాడు. కరోనా పరిస్థితి మరికాస్త మెరుగుపడి, జనజీవనం సామాన్య స్థాయికి చేరుకుంటుంది. ఈ సమయంలో తనవాళ్ళందరిని పిలిచి ఒక షాకింగ్ న్యూస్ చెప్తాడు గగన్. తాను మరో జిల్లాకి వెళ్తున్నట్టు, ఈ జిల్లాకి తన స్థానంలో మరో డి‌ఎం‌హెచ్‌పి డాక్టర్ వస్తారని చెప్తాడు. కొత్త డాక్టరుకి కూడా వారందరిని సహకరించమని అర్థిస్తాడు. జాయ్, ప్రభాత్, దివిజ్ – గగన్ వెళ్ళిపోతున్నందుకు చాలా బాధపడతారు. అందరికీ నచ్చజెప్తాడు గగన్. తన రిలీవర్ కోసం ఎదురుచూస్తుంటాడు. ఆ సమయంలో ఓ ప్రఖ్యాత నటుడు ఆత్మహత్య చేసుకుంటాడు. మళ్ళీ హెల్ప్ లైన్‍కి ఫోన్ కాల్స్ పెరిగిపోతాయి. డేటాబేస్‍లో ఉన్న నెంబర్లతో ఓ వాట్సప్ గ్రూప్‍ని ఏర్పరిచి పెద్దలు చెప్పిన ఆశావాదపు మాటలతో సందేశాలు పంపుతారు. ఈ పనిలో అనామిక చురుకుగా పాలుపంచుకుంటుంది. ఈ పనిలో పూర్ణిమ కృషిని అభినందిస్తాడు గగన్. ఒకరోజు ఓ పాతికేళ్ళ అమ్మాయి వచ్చి గగన్‍కి నమస్కరిస్తుంది. ఆరోగ్యవంతురాలిగా ఉన్న ఆమెను చూసి గగన్ ఆశ్చర్యపోతాడు. తాను గగన్ రిలీవర్‍నని చెప్తుంది. ఇంత చిన్నవయసులో డి‌ఎం‌హెచ్‌పిలో అని ఆశ్చర్యపోతూ ఆ మాట పైకే అనేస్తాడు. అప్పుడు ఆ యువతి తన గురించి తాను చెప్తుంది. తనకి పాత్రికేయురాలు గీతా ఇళంగోవన్, గగన్ స్ఫూర్తి అని చెప్తుంది. తాను మానసిక ఆరోగ్యం రంగంలోకి ఎందుకు వచ్చిందో చెప్తుంది. తన పేరు నిర్విష అని చెప్తుంది. ఆమెకి అపాయింట్‍మెంట్ ఆర్డర్ ఇప్పించి, బస ఏర్పాటు చేసి, టీమ్‍ని పరిచయం చేస్తాడు గగన్. – ఇక చదవండి.]

ధ్యాహ్నం భోజనానికి ప్రభాత్ కుటుంబాన్ని కూడా పిలిచి, నిర్విషని తన కుటుంబానికి, వాళ్ళ కుటుంబానికీ పరిచయం చేశాడు. సాయంత్రానికి సామానుతో సహా ప్రభాత్ ఇంటికి షిఫ్ట్ అయ్యింది ఆమె. అనామిక, నిర్విష స్నేహితులవడానికి ఎక్కువ కాలం పట్టలేదు.

వీడుకోలు చెప్తూ, “డా. నిర్విష కూడా ఉన్నతాశయాలతో డి‌ఎం‌హెచ్‌పికి సేవలు అందించడానికి వచ్చారు. ఆవిడ తరువాతి తరం వారు కనుక మానసిక ఆరోగ్యాన్ని సమకూర్చేటప్పుడు కొత్త పంథాలో ప్రయాణిస్తారని, ఈ చిన్ని ఆసుపత్రికి మరింత ఖ్యాతిని తెస్తారని ఆశిస్తూ ఆవిడకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.”

“మనమంతా ఒక కుటుంబంలా మెలిగాం. ఆవిడతో కూడా అలాగే మెలిగి మీ పనిని ఎప్పటిలాగే ఏకాగ్రతతో చేస్తారని భావిస్తున్నాను. నేను ఎక్కడ ఉన్నా మీ వాణ్ణే. ఇన్నేళ్ళుగా పని చేసిన చోటు, ఉన్న ఊరు వదిలి వెళ్ళడం కష్టమే. కానీ, మన చుట్టుపక్కల వాళ్ళు, తద్వారా మనమూ మానసికంగా ఎదగాలంటే కదలిక తప్పదు. సెలవు”, అని బాధాతప్త హృదయంతో వీడ్కోలు పలికాడు గగన్.

అక్కడ ఉండడానికి అవసరమైన కొద్దిపాటి సామానుతో కొత్త ఊరికి బయలుదేరారు గగన్, పూర్ణిమలు. వాళ్ళు వెళ్తున్నారంటే ఊరంతా వీడ్కోలు పలకడానికి రైల్వే స్టేషన్‌కి వచ్చింది. మల్లిక, పూర్ణిమతో, “మేడమ్, మీరు కథలు రాస్తారట కదా! సార్ మా జీవితాలని ఎలాగ బాగుచేశారో ఓ నవల రాయండి, ప్లీజ్, ఇది నా విన్నపం”, అని ప్రాధేయపడింది.

అది విన్న నిరూప్, “ప్లీజ్ రాయండి మేడమ్”, అని మల్లిక మాటలకి వత్తాసు పలికాడు. ఈ హడావుడి ఏమిటో అన్న కుతూహలంతో వచ్చిన ప్రభాత్, తానూ ఈ ఆలోచనకి పచ్చ జెండా ఊపాడు. కొంత సేపటికి వీళ్ళందరినీ ప్లాట్‌ఫాంపై విడిచి, రైలు కదిలిపోయింది.

***

వెళ్ళిన వెంటనే వంట, వగైరాలు చూసుకుంటూ, నవలా రచనకి పూనుకుంది పూర్ణిమ. ఇంచుమించు ముప్ఫై యేళ్ళ జీవిత యాత్రలో ఎన్ని మనసుల్ని గగన్ బాగు చేశాడో కదా! ఒక పరిశోధనా పత్రం తయారు చేయడం సుళువేమో అని ఆమెకు అనిపించింది.

కానీ, మానసిక ఆరోగ్యంపై సామాన్య ప్రజల అవగాహన పెంచాలంటే నవలే వ్రాయాలి. రెండు మూడు రకాలుగా మొదలు పెట్టింది. నచ్చలేదు. అప్పుడు గగన్ ఆమెకు ఓ సలహా ఇచ్చాడు, ముందు విషయం వ్రాయమని, తరువాత మొదలు, చివర చూసుకోవచ్చని. ఈ ఆలోచన ఆమెకు నచ్చి, అలాగే కొనసాగిస్తోంది.

***

కొత్త ఊళ్ళో వృత్తిపరంగా నిలదొక్కుకున్నా, ఇంట్లో ఏవో కొన్ని సర్దుళ్ళు మిగిలిపోయాయి. పైగా ఇప్పుడు పూర్ణిమ రచనా వ్యాసంగమొకటి! అందుకే, ఆ దంపతులిద్దరూ దానికోసం ఆదివారం, లేకపోతే మరేదైనా సెలవు దినమో కేటాయించేవారు.

ఒక సెలవు రోజు సోఫాలు ఎక్కడ పెట్టినా ఎవరో ఒకరికి అసౌకర్యంగా ఉంటోంది. “ఛా, ఇప్పుడు గానీ మన శశి ఉంటేనా, ఈస్తెటిక్‌గా అరేంజ్ చేసి ఉండేవాడు”, అంటూ చేతులెత్తేసి, ఫ్యాన్ వేసుకుని, సోఫాలో కూలబడిపోయాడు గగన్. జేబులోంచి రుమాలు తీసుకుని, నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంటున్నాడు.

“పడిన కష్టం చాల్లే, ముందు ఈ మజ్జిగ తాగు”, అంటూ స్టీలు గ్లాసు అందించింది పూర్ణిమ. వచ్చి గగన్ పక్కనే కూర్చుంటూ, “అబ్బా, ఈ ఊళ్ళో కాస్త ఎండలెక్కువే సుమీ..” అంటూ గడగడా తను తెచ్చుకున్న గ్లాసులోని మజ్జిగ ఖాళీ చేసింది.

కాస్త తేరుకున్నాక, గగన్ పక్కకి వచ్చి, “ఏమిటి గగన్, కొత్త రకం మజ్జిగిస్తే మెచ్చుకోవడం లేదు? అదే వ్యాపార ప్రకటనలో, ‘మసాలా ఛాస్.. అల్లం, ఇంగువ, కొత్తిమీర, జీలకర్రల రుచులతో మిళితమైన మసాలా ఛాస్’, అని ఎవడైనా డబ్బా కొడితే, ఒకే సారి రెండు గ్లాసులు లాగించేస్తావ్”, అని అతణ్ణి ఆట పట్టిస్తోంది పూర్ణిమ.

ఇవేమీ పట్టించుకోకుండా, “బట్ సీరియస్లీ, మన శశి వ్యాపారానికి పనికొచ్చే పెయింటింగ్స్ చేయకుండా, లైఫ్ స్కిల్స్ విద్యలో భాగంగా, మానసిక వ్యాధుల తీవ్రత తగ్గిన పేషంట్స్‌కి బ్రతకడానికి పనికొచ్చే పెయింటింగ్స్ నేర్పిస్తున్నాడు చూడు, అప్పుడే నేను పుత్రోత్సాహాన్ని పొందాను”, అన్నాడు గగన్.

“నిజమే గగన్, ప్రతీవాళ్ళూ తమకున్న తెలివితేటల్ని ధనార్జనకే వాడుకుంటే ఎలా? డబ్బులుంటే అన్నీ ఉన్నట్టేనా? ఒక విషయం చెప్పనా? ఒక తల్లిగా కూడా నాకు శశి మీద బెంగలేదు. మంచి చేసే వాళ్ళని దేవుడు చల్లగా చూస్తాడనే నమ్మకం నాకుంది.”

“మన దివిజ్‌ని చూడు, మనలాంటి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుండి రాకపోయినా, ముందుండడం కన్నా మిగిలిన వాళ్ళని ముందుకి నడపడంలో సంతోషాన్ని కనిపెట్టాడు. ఇలాంటి మంచి వాళ్ళున్నంత కాలం, ఏడాదికి మూడు పంటలు పండుతాయి”, అంది ఉత్సాహంగా.

తలుపు మీద వేళ్ళ చప్పుడైంది. గొంతుకు సవరించుకుంటూ, “నన్ను తలుచుకుంటున్నారా?” అంటూ ఎంట్రీ ఇచ్చాడు దివిజ్. తనతో పాటు అనామిక కూడా ఉంది. మజ్జిగ తేవడానికి పూర్ణిమ లోపలికి వెళ్ళింది. “సూపర్ టేస్ట్ ఆంటీ, దీన్ని ఒక హెల్త్ డ్రింక్‌గా మార్కెట్ చేద్దామా?” అన్నాడు దివిజ్. కొద్ది సేపటి క్రితం వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణని గుర్తుకు తెచ్చుకుని నవ్వారు గగన్, పూర్ణిమలు.

“’తీవ్ర మానసిక రుగ్మతల బారిన పడ్డ వాళ్ళు పెయింటింగ్ నేర్చుకుంటే గుణముంటుందా?’ అనే అంశం మీద జరగబోయే పరిశోధనలో తోడ్పడవలసిందిగా హార్వర్డ్ యూనివర్సిటీ నుండి శశికి పిలుపు వచ్చింది. అంటే, మనవాడు చేసే మంచి నలుదిశలూ వ్యాపిస్తోందన్న మాట!”

“జెస్ట్ మేం బయలుదేరే ముందరే ఈమెయిల్ వచ్చింది. మీ కళ్ళలో ఆనందం చూద్దామని నేను డైరెక్ట్‌గా చెప్తానని రిక్వెస్ట్ చేశాను. మీ లైఫ్ ఎలా ఉంది?” అడిగాడు దివిజ్.

ఆ ఊళ్ళో తన పయనాన్ని టూకీగా గుర్తు తెచ్చుకున్నాడు గగన్.

(ముగింపు వచ్చే వారం)

Exit mobile version