“సక్సెస్.. గ్రాండ్ సక్సెస్.. అనుకున్నది సాధించాను” తను పదేళ్ళుగా ప్రయోగాలు చేస్తున్న లేబొరేటరీ గోడలు ప్రతిధ్వనించేలా అరిచాడు విశ్వం. అతని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఎన్నాళ్ళ కోరికో.. ఈ నాటికి తీరింది. చిన్నప్పుడు తన మతిమరుపుకు ఎన్ని తిట్లు తినేవాడో.. స్కూల్లో మాస్టార్ల చేత బెత్తం దెబ్బలు కూడా తప్పేవి కాదు. కష్టపడి చదివేవాడు. తీరా పరీక్ష రాయడానికి కూచుంటే ఒక్కటీ గుర్తొచ్చేది కాదు. పరీక్షలు తప్పడం.. నాన్న చేత తన్నులు తినడం ఆనవాయితీగా మారింది. అమ్మ వెనకేసుకొచ్చేది. అమ్మకు తనంటే ఎంతిష్టమో.
పరీక్షల్లో అరకొర మార్కులు తెచ్చుకున్నా కొత్త కొత్త ప్రయోగాలు చేయడంలో అమితమైన ఆసక్తి ఉండేది. సమయం దొరికినపుడల్లా తమ వీధిలో ఉండే ఆయుర్వేద డాక్టర్ రంగాచారి దగ్గర శిష్యరికం చేసేవాడు. రంగాచారి వయసు అరవైకి పైనే. ఐనా ఆరోగ్యంగా, చలాకీగా ఉండేవాడు. ఔషధ మొక్కల కోసం అడవిలోకి అతన్తోపాటు వెళ్ళినపుడు ఉత్సాహంతో ఉరకలేస్తూ “నా పటుత్వానికి కారణం ఏమిటో తెలుసా.. మనకు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన ఈ మొక్కలూ, మూలికలే” అనేవాడు. జ్ఞాపక శక్తి పెరగడానికి విశ్వానికి సరస్వతీ లేహ్యం ఇచ్చేవాడు. అప్పటినుంచి విశ్వం పరీక్ష తప్పడం తప్పినా పాస్ మార్కులు వచ్చేవి తప్ప చదివిన ప్రతి ముక్కా గుర్తుండిపోయేంత అద్భుత జ్ఞాపక శక్తి మాత్రం అలవడలేదు. విశ్వం దాన్ని సాధించడం కోసం కలలు కనేవాడు.
డిగ్రీ పూర్తయ్యాక పట్నంలో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. దాంతో పాటు ఇంటినే ప్రయోగశాలగా మార్చుకుని తనకు అబ్బిన ఆయుర్వేద వైద్య పరిజ్ఞానంతో జ్ఞాపకశక్తిని పెంచే మందు కనుక్కోవడంలో నిమగ్నమైపోయాడు. రకరకాల మొక్కల పసర్ల మిశ్రమాలతో ప్రయోగాలు చేశాడు. ఏవీ తాను ఆశించిన ఫలితాల్ని ఇవ్వలేదు. చివరికి ఆయుర్వేద వైద్యశాస్త్రంలో ఉల్లేఖించని మొక్కల మీదకు దృష్టి మళ్ళించాడు. అడవిలో చాలా అరుదుగా దొరికే మొక్క కంటపడింది. కేవలం అడుగు ఎత్తు మాత్రమే పెరిగే మొక్క. దాని తెల్లటి పూలలో జ్ఞాపక శక్తిని పెంచే గుణాలున్నాయని తెల్సుకుని దాని మీద విస్తృతంగా ప్రయోగాలు చేసి, అద్భుతమైన మందుని కనుక్కున్నాడు.
ప్రయోగ ఫలితం తెల్సుకోవడం కోసం ఆ మందుని తన మీదే ప్రయోగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. నాలుగు రోజుల్లోనే ఆ మందు ప్రభావం కన్పించసాగింది. డిగ్రీలో తనకు పాఠాలు చెప్పిన మాస్టార్లందరి పేర్లు గుర్తొస్తున్నాయి. వారం రోజులు వాడేటప్పటికి పదో తరగతిలో చదువుకున్న పాఠాలు గుర్తుకు రాసాగాయి. నెల రోజుల తర్వాత తమ పల్లెటూరిలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుకునే రోజుల్లో జరిగిన సంఘటనలన్నీ కళ్ళముందు కదలాడసాగాయి. మండలం రోజులు వాడి ఆపేశాడు. జ్ఞాపకాల వరద.. వూహ తెలిసినప్పటినుంచీ జరిగిన సంఘటనలు… అన్నీ చేదు జ్ఞాపకాలే.. ఎంత దుర్భరమైన బాల్యమో.. అమ్మ కన్నీళ్ళతో తడవని రోజంటూ లేని బాల్యం.
కళ్ళ ముందు కన్పిస్తున్న దృశ్యాలు కన్నీళ్ళుగా మారి ప్రవహిస్తున్నాయి. నాన్న తాగొచ్చి అమ్మని గొడ్డుని బాదినట్టు బాదుతున్నాడు. కిందపడేసి కాళ్ళతో తంతున్నాడు. అమ్మ నోటినిండా రక్తం.. తనకు మూడేళ్ళ వయసుంటుందేమో.. ఏడుస్తూ అమ్మను చుట్టుకుపోయాడు. నాన్న తనని లాగి గోడకేసి విసిరికొట్టాడు. నుదురు చిట్లి రక్తం ధారగా కారసాగింది. అమ్మ తన దెబ్బల్ని మర్చిపోయి పరుగెత్తుకుంటూ వచ్చి తనని ఎత్తుకుని గుండెలకు హత్తుకుంది. గాయం మీద చక్కెర అద్ది పాత చీరని చింపి కట్టుకట్టింది.
విశ్వం అసంకల్పితంగా తన నుదుటిని ముట్టుకున్నాడు. గాయం లేదు. ఎప్పుడో మానిపోయింది. ఇన్నేళ్ళలో ఎప్పుడూ గుర్తుకు రాలేదు. ఎక్కడో మెదడు పొరల్లో అడుగున పడిపోయింది. చదువు, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలూ.. బాధ్యతల బరువు మోస్తూ మోస్తూ ఈ జ్ఞాపకాన్ని ఎక్కడో వదిలేశాడు. ఇప్పుడు మందు ప్రభావం వల్ల అప్పటి గాయం ఇప్పుడే అయినంత కొత్తగా సలుపుతోంది. రక్తం నుదుటికైన గాయంలోంచి కాకుండా ఇప్పుడు గుండెలోంచి కారుతోంది.. ధారగా..
ఏడేళ్ళ వయసులో మరో జ్ఞాపకం.. నాన్న ఎవర్తెనో యింటికి తెచ్చుకున్నాడు. అమ్మను జుట్టుపట్టుకుని బైటికీడ్చేశాడు. అమ్మతో పాటు విశ్వాన్ని కూడా.. అదుగో నాన్న మొహం ఎంత క్రూరంగా ఉందో.. ధడాల్న తలుపేసుకున్నాడు. తనని చుట్టుకుని అమ్మ హృదయవిదారకంగా ఏడుస్తోంది. తను అమ్మ చేయి పట్టుకుని నడుస్తున్నాడు. వేరే వూరికి ప్రయాణం… ఆకలి, అలసట.. ఎవరి గుడిసె ముందో నిలబడి మంచినీళ్ళు అడిగింది అమ్మ. మొదట తనకు తాపించి తర్వాత అమ్మ తాగింది. ‘ఎవరింటికమ్మా’ అని అడిగిందావిడ. అమ్మ కన్నీళ్ళతో సమాధానమిచ్చింది. ఎంత దుర్భరమైన రోజులో అవి.. ఒక్కో రోజు కడుపులో దిగిన ఒక్కో కత్తిపోటులా.. ఎంత బాధగా గడిచేదో.. అవన్నీ స్పష్టంగా కళ్ళముందు కదలాడటంతో విశ్వానికి కన్నీళ్ళు ఆగడం లేదు.
వెంటనే మరో జ్ఞాపకం… అమ్మ పొలం పనికెత్తే తను గుడిసె బైట మట్టిలో ఆడుకుంటున్నాడు. రాళ్ళు రప్పలూ… చేయి పెట్టి దేనికోసమో వెతికాడు. సర్రున మంట.. ఏదో కుట్టింది.. తేలు.. ఎంత పెద్దగా ఉందో.. మంటను తట్టుకోలేక మట్టిలో పడి దొర్లుతూ ఏడ్చాడు. ఎవరో అమ్మకు కబురు పెట్టారు. అమ్మ పెద్దగా శోకాలు పెడ్తూ వచ్చింది. తనని ఎత్తుకుని ఆయుర్వేద డాక్టర్ రంగాచారి దగ్గరకు పిల్చుకెళ్ళింది. ఆయనేదో పసరు మందు నోట్లో వేసి తేలు కుట్టిన చోట ఏదో తైలంతో మర్దన చేశాడు. అప్పటివరకూ తను నరకం అనుభవించాడు. ఎప్పుడో మర్చిపోయిన సంఘటన.. ఇపుడు గుర్తొచ్చి… అదే నొప్పి… ఇప్పుడు అనుభవిస్తున్నట్లే బాధ…
విశ్వానికి చప్పున భయమేసింది. ఎవరి జీవితమైనా పూలపాన్పు కాదు… ముళ్ళుంటాయి. గాజు పెంకులు గుచ్చుకుంటాయి. దారి ఎడారిలా కఠినంగా ఉంటుంది. మధ్యలో ఎప్పుడో కొద్దిసేపు ఏ నీటి చెలమో కన్పించి వూరడిస్తుంది. అంతే. మళ్ళా ప్రయాణం తప్పదు. కష్టాలు కన్నీళ్ళు లేకుండా సంసార సాగరాన్ని ఈదడం ఎవ్వరి తరమూ కాదు. బతకడం అంటే పోరాటం చేయడమే.. ఎన్ని గాయాలో మనసుకి.. ఎన్ని చేదు అనుభవాలో మనిషికి… కాలం గాయాల్ని మాన్పుతుంది. మెదడు పొరల్లో ఎక్కడో లోలోపల వాటిని దాచిపెట్టి, మనిషికి వూరట కల్పిస్తుంది. మరుపు మనిషికి వరం.
జ్ఞాపక శక్తి అవసరమైనంత మేర ఉండటమే శ్రేయస్కరం. అమోఘమైన, అద్భుతమైన జ్ఞాపకశక్తి వరం కాదు శాపం. ఎప్పుడో అగాధాల్లో పాతి పెట్టిన బాధాకరమైన అనుభవాల్ని కూడా తవ్వి బైటికి తీసి నిరంతరం గుర్తుచేస్తూ చిత్ర వధకు గురిచేసేంత జ్ఞాపకశక్తి వద్దుగాక వద్దు. కొన్ని అనుభవాల్ని కొన్ని జ్ఞాపకాల్ని శాశ్వతంగా పూడ్చిపెట్టడంలోనే మనిషికి మనశ్శాంతి లభిస్తుంది.
మెదడు చాలా గొప్పది. దానికి తెలుసు.. లోపలి పొరల్లో వేటిని దాచి పెట్టి పై పొరలో వేటిని జ్ఞాపకాలుగా అమర్చి పెట్టాలో.. దాని పని దానిని చేసుకోనివ్వడమే మంచిది. అమోఘమైన మేధస్సు కావాలనుకుని మందుల్తో దాని పనిలో జోక్యం చేసుకోవటం అభిలషణీయం కాదనే విషయం అర్థమై విశ్వం తను తయారు చేసిన మందుని గొయ్యి తీసి అందులో ఒలకబోసి గోతిని పూడ్చేశాడు.
సలీం కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన కథా, నవలా రచయిత. మానవత్వం ఉట్టిపడే రచనలకు పెట్టింది పేరు. “రూపాయి చెట్టు”, “ఒంటరి శరీరం”, “రాణీగారి కథలు”, “నీటిపుట్ట” వీరి కథా సంపుటులు. “కాలుతున్న పూలతోట”, “అనూహ్య పెళ్ళి”, “గుర్రపు డెక్క”, “వెండి మేఘం” వంటివి వీరి నవలలు.