[శ్రీమతి రాయప్రోలు సుజాతా ప్రసాద్ గారి ‘మథనం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[సముద్రం ఒడ్డున్న కూర్చున్న రమణమ్మ, తనకి రవళి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. ఇక ఖాళీగా ఉండకూడదని నిశ్చయించుకుని, తాతగారి పక్కింటి వాళ్ళ వద్ద బ్లౌజులు కుట్టడం, కొత్త రకం మోడల్స్ నేర్చుకుంటుంది. మంగమ్మ, దీప కొత్త ఊరిలో ఓ చిన్న ఇల్లు అద్దెకు తీసుకుంటారు. ఓ రోజు హెచ్.ఎమ్. గారు పిలిస్తే ఆయన రూమ్‌కి వెడుతుంది. ఓ రాజకీయ నాయకుడి అల్లుడు రవళి ప్లేస్‌లో ఈ ఊరికి రావాలనుకుంటున్నాడనీ, ఆపించుకోడానికి ఏమైనా ప్రయత్నిస్తే ప్రయత్నించమనీ చెప్తారు. వద్దంటుంది. కొత్త ఊరికి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. విషయం తెలిసిన పిల్లలు వెళ్ళొద్దని బ్రతిమాలుతారు. రవళికి ఏదోలా అనిపిస్తుంది. టెన్త్ చదివే హరిని వాళ్ళమ్మ సముద్రం మీద పడవలో పనికి పెడదామని నిర్ణయించుకుంటే, రవళి ఆమెతో మాట్లాడి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేస్తుంది. కాలేజీలో మొదట దీపని హేళన చేసిన పిల్లలంతా, ఆమె ప్రతిభని గుర్తించి, తమలో కలుపుకుంటారు. ఇంగ్లీష్ ప్లూయెన్సీ మెరుగుపరుచుకుంటుంది దీప. మంగమ్మ కూరగాయల వ్యాపారం పెట్టుకుంటుంది. సమీపంలోని అపార్టుమెంట్ నివాసులతో మంచిగా ఉంటూ వాళ్ళ ఆదరాభిమానాలు పొందుతుంది. క్రమంగా మంగమ్మ గురించి, దీప గురించి వాళ్ళందరికీ తెలిసి, వాళ్ళు మంగమ్మని, దీపని మెచ్చుకునేవారు. వాళ్ళందరిలోనూ వీరిద్దరి పట్ల మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. – ఇక చదవండి.]
“అమ్మా! మనం మన ఊరు కాక ఈ పెద్దమ్మ వాళ్ళ ఊర్లో ఎందుకున్నాం? నాన్నెందుకు ఇంత చిక్కిపోయాడు?” రమణమ్మ తల్లిని ఆశ్చర్యంగా అడిగింది.
నర్సమ్మ రమణమ్మను దగ్గర కూచోబెట్టుకుని “మేమిక ఆ ఊర్లో ఉండలేకపోనామమ్మా! ఉన్న కాడికి అంతా సెటిల్ సేసుకుని ఈ ఊరొచ్చినాము. సముద్రం ఎక్కడయినా ఒకటే కదా! నాన్న ఇక్కడే పడవ యేస్తున్నాడు. ఊళ్ళో వాళ్ళంతా మాకే సపోర్ట్ చేయడంతో వాసు వాళ్ళ నాన్నకి మన డబ్బులు ఎనక్కి ఇయ్యక తప్పలేదు. ఆళ్ళ పీడ ఇరగడయింది.” చెప్పింది నర్సమ్మ.
రమణమ్మ కూచున్నది కాస్తా చివ్వుమని లేచి వెళ్ళిపోబోయింది. నర్సమ్మ చెయ్యి పట్టి లాగి కూచోబెట్టింది. ఒక్కో సంఘటన ఒక్కక్కరికీ ఒక్కో పాఠం నేర్పుతుంది. వాసు చేసిన ద్రోహం రమణమ్మకు పెళ్ళి మీద విరక్తిని, చదవు మీద రక్తిని పెంచింది. ఎలాగన్నా పై చదువులు చదివి ఉద్యోగం చెయ్యాలన్న పట్టుదలను రగిల్చింది.
కానీ రాజయ్య, నర్సమ్మలకు అలాక్కాదు. మళ్ళీ ఎంత త్వరగా ఇంకా మంచి సంబంధం చూసి, పెళ్ళి చేసి రమణమ్మ జీవితాన్ని చక్కచేయాలా? ఈ సమాజంలో తామూ గర్వంగా ఎంత త్వరగా తలెత్తుకు తిరగాలా? అన్న ఆలోచన కుమ్మరి పురుగులా దొలిచేస్తోంది. ఎక్కడయితే పడిపోయారో అక్కడే నిలబడాలన్న పట్టుదల, తమని చులకనగా చూసిన వాళ్ళ కళ్ళల్లో తమ స్థానాన్ని పెంచుకునే ప్రయత్నం పట్టుదలగా చేసారు. వాళ్ళ నిర్ణయం పదిమంది దగ్గర అనడంతో కొంతమంది చేసుకుంటామని వచ్చారు. ఆ సంబంధాలలో వాళ్ళకి వెంకటరావు సంబంధం బాగా నచ్చింది. చాలా ఆస్తి, అంతస్తు ఉన్న సంబంధం. రమణమ్మ ఫొటో చూపించారు. వాళ్ళకీ నచ్చింది. ఆ సంబంధం ఖాయం చేసుకున్నారు. ఇదేమీ రమణమ్మకి తెలీదు. జరిగిన దానికి పశ్చాత్తాప పడుతూ, తను కోరినట్లు చదివిస్తారని కొండంత ఆశతో వచ్చింది. అందుకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతుంటే మనసంతా తిరస్కారంతో నిండిపోయింది.
“రవణా! నా మాట ఇనుకో! ఓ పెద్ద సమ్మంధం కోరి వచ్చింది. ఆళ్ళకి ఐదారు మోటారు పడవలున్నాయి. లంకంత ఇల్లు, పడవంత కారు ఉన్నాయి. ముసిలి తల్లిదండ్రులు తప్ప ఎవరూ లేరు. చాలా ఆలస్యంగా పుట్టిన మగ నలుసు. అతడి మీదే ఆళ్ళ ప్రాణాలన్నీ ఉన్నాయి. ఇక్కడికి దగ్గరున్న ఊరే! నీ ఫొటో చూసి ఇష్టపడినాడు. మూర్తాలు కుదిరినాయి. ఈ మూడం అయిపోగానే పెళ్ళనుకుంటున్నాం.” రమణమ్మ పిచ్చిదానిలా చూసింది.
“అమ్మా! మీకు మతులు పోయాయి కానీ నాకు పోలేదు. నేను చదువుకోవాలి. ఉద్యోగం చెయ్యాలి. అదే నా నిర్ణయం” దృఢంగా చెప్పింది రమణమ్మ.
“నీ గురించి నువ్వే నిర్ణయం తీసుకుంటే ఇక మేమెందుకు? నర్సమ్మా! పదయే! మనం ఏడకన్నా పోదాం. దానికివ్వాల్సినది ఇచ్చేసి మన సావు మనం సద్దాం. దాని బతుకు అది బతుకాదిలే!” రాజయ్య కోపంగా అన్నాడు.
“నాన్నా! ఓ సారి మీ ఇష్టాన్ని, నిర్ణయాన్ని గౌరవించాను. కానీ ఏం జరిగింది? తిన్న దెబ్బకి నన్ను నేను కూడదీసుకోవడానికి ఏడెనిమిది నెలలు పట్టింది. మళ్ళీ నేను వచ్చేసరికి ఇదే సీనా? చచ్చిపోవడం మీకే వచ్చా? నాకు రాదా?” ఇంకా కోపంగా అంది రమణమ్మ.
రమణమ్మ వాళ్ళ పెద్దమ్మ నూకాలు రమణమ్మను అక్కడనుంచి చెయ్యిపట్టి తీసుకొచ్చేసింది.
తన ఇంటికి తీసికెళ్ళి నూకాలు “రవణా! అసలు ఇసయం ఇను. మీ నాన్నకి ఈ మద్దెనే గుండె నొప్పి వచ్చింది. డాటరు మళ్ళీ వస్తే కట్టమన్నారు. అందుకని ఆళ్ళ తాపత్రయం అలా ఉంది. పెళ్ళయినా నువ్వు సదూకోడానికి ఆళ్ళని నేను ఒప్పిస్తా! నువ్వు ఎంటనే బిడ్డల్ని కనక్కరలేదు. సదూకో! కానీ పెళ్ళి సేసుకోయే! మీ అమ్మ, నాన్న మరి కొన్నాళ్లు నిన్ను సూసుకుంటూ ఈ బూమ్మీద ఉంటారు.” అంది. రమణమ్మ మూగదయిపోయింది.
తన బతుకుని ఇన్ని వంకరలతో ఇలా మలుపులు తిప్పుతున్న ఆ దేవుడి మీద రమణమ్మకు చెప్పలేనంత కోపం వచ్చింది. అక్కడనుంచి బాధతో, నిరాశతో లేచి వెళ్ళి పోయింది.
తను ఎలాగన్నా చదువుకోవాలి అనుకుంటే తల్లిదండ్రుల మాట వింటూ చేయగలనా అని రెండు రోజులు దీర్ఘంగా ఆలోచించింది. మళ్ళీ వాళ్ళు ఆ విషయం అడిగినపుడు “నావి మూడు షరతులు. ఒకటీ, నాకు నిశ్చితార్థం వద్దు, పెళ్ళికి ముందు కాపురం వద్దు.. రెండూ, నేను చదువుకుని తీరాలి. మూడు, నేను ఉద్యోగం చేసేవరకూ పిల్లల్ని కనను. ఇవి మీరు సరే అనడం కాదు. మగ పెళ్ళివాళ్ళు నాతో చెప్పాలి. అప్పుడు పెళ్ళి గురించి ఆలోచిస్తాను.” అంది రమణమ్మ.
అన్నట్లుగానే పెళ్ళికొడుకు తల్లిదండ్రులు వచ్చి రమణమ్మతో బాగా మాట్లాడారు. వాళ్ళింటి దగ్గరకే కాలేజ్ బస్ వస్తుందని ఇబ్బంది లేదని కావలసినట్లు చదువుకోవచ్చని చెప్పారు. చదువుకోవచ్చనే ఆశ, తండ్రి ఆరోగ్య స్థితి, తల్లి కన్నీళ్ళు , రమణమ్మను రెండోసారి పెళ్ళికి సిధ్ధపడేటట్టు చేసాయి. పెళ్ళికొడుకు బిజినెస్ పని మీద బీహార్ వెళ్ళాడని రమణమ్మ ఫొటో చూసి నచ్చుకున్నాడని, పెళ్ళికే డైరెక్టుగా వస్తాడని చెప్పారు. కావాలంటే ఫోన్ నంబరు ఇస్తాము మాట్లాడమన్నారు. కానీ రమణమ్మకి ఇష్టంగా అనిపించలేదు. తల్లిదండ్రులు చూసి సరే అన్నారంటే బాగానే ఉంటాడు అనుకుంది.
***
రవళి కొత్త ఊర్లో జాయిన్ అయి నాలుగు నెలలయింది. స్కూల్ మారింది గానీ పరిస్థితులు మాత్రం అవే. ‘అవ్వ పేరే ముసలమ్మ’ అని అర్థమయింది. ఊర్లో మంచి నాయకులున్నారు. అవేర్నెస్ కనిపిస్తుంది. కానీ ఆడపిల్లలకి టెంత్ లోపల పెళ్ళి చేసే ఆ దుష్ట సంప్రదాయం మాత్రం అలానే ఉంది.
“ఒకే రకపు తోలుబొమ్మ లొకేవైపు, ఒకే నడక!
ఎక్కడికే తల్లీ – ఇట ఏదో కత్తుల నది!”
అన్నట్లే ఉంది. ఆ ఊరిలో కూడా రవళి తన వ్యవసాయం ఆరంభించింది. పాత ఊరిలో తన సక్సెస్ రేటు వన్ పర్సెంట్ కూడా లేకపోయినా ఆశావహ దృక్పథంతో తన ప్రయత్నం వదలలేదు. సైన్స్ క్లబ్ పెట్టడం, పిల్లల్ని పోటీలకు తీసికెళ్ళడం, స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్‌కి నడుం కట్టడం అన్నీ ఆరంభించింది. టీచర్స్‌లో కూడా వ్యతిరేకత ఎక్కువగానే ఉన్నా తన భావాలతో కలిసే వాళ్ళు కూడా ఉన్నారు. తనలాగే చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకుంటున్న వారిని ఆపడానికి ప్రయత్నించి విసిగిపోయిన వాళ్ళున్నారు. ఆ నిరాశతోనే రవళి ప్రయత్నంలో నీళ్ళు పోయడానికి వెనుకాడడం లేదు.
ఆ రోజు అందరూ స్టాఫ్ రూమ్‌లో బ్రేక్‌లో ఉన్నపుడు సెవెన్త్ చదివే దేవి వచ్చింది. దేవి చాలా తెలివైంది. నల్లగా ఎత్తుగా బలంగా టెంత్ చదివే అమ్మాయి లాగా ఉంటుంది.
తను అందరినీ విష్ చేసి “మా అమ్మ, నాన్న ఊర్లో కార్డులు పంచడానికి ఎల్లారండి. స్కూల్లో నన్నే ఇమ్మన్నారండి” అంటూ తన పెళ్ళి శుభలేఖలు అందరికీ తలా ఒకటీ పంచబోయింది.
“ఒకటి చాల్లే. అదే అందరమూ చూస్తాము.” గొంతులో విసుగుని దాచుకుంటూ బిందూ టీచర్ అన్నారు. రవళి దేవిని దగ్గరకు పిలిచింది.
“దేవీ! నీ తోటి వాళ్ళతో పాటు నీకు కూడా చదువుకోవాలని లేదా? పెళ్ళి చేసుకుంటున్నావు!” అని అడిగింది..
“ఉంది కానీ మరి అమ్మ నాన్న మాట వినాలి కదండీ! నా వెనక ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. ఒకళ్ళ తరవాత ఒకళ్ళకి సెయ్యాలి. అందుకే నేను పెళ్ళి చేసుకోవాలి.” అంది స్పష్టంగా.
‘ఆ వయసేమిటి? ఆ మాటలేమిటి? ఆడపిల్లలకి పరిస్థితుల పట్ల ఉన్న ఈ అవగాహన కూడా తల్లిదండ్రులకి వరమేమో’ అనుకుంది వేదనగా రవళి. తను వచ్చిన ఈ కొద్ది రోజుల్లోనే రవళి గమనించిన విషయం ఏంటంటే దేవి చాలా దండు పిల్ల. ఒక మార్కు తగ్గినా టీచర్స్‌తో గొడవాడే పిల్ల.. అన్నింటిలోనూ ఫస్ట్ తానే ఉండాలని తాపత్రయ పడే అమ్మాయి. ఆఖరికి పెళ్ళి కూడా క్లాస్‌లో అందరికన్నా ఫస్టే చేసేసుకుంటోంది అనుకుంది రవళి విరక్తిగా.
పెళ్ళయాక కూడా “నా పెళ్ళి స్వీట్ తినండి” అని అరిసె తెచ్చి రవళికి ఇచ్చింది దేవి.
“పరీక్షల వరకు ఉంటావా లేకపోతే ఈ లోగానే అత్తవారింటికి. వెళ్ళిపోతావా?” అని అడిగింది రవళి.
“మా ఆయన గారు నిన్న గోదావరికి హైదరాబాద్ వెళ్ళిపోయారండి. పది రోజుల తరవాత అమ్మ వాళ్ళు సారెతో నన్ను తీసికెళ్తారండి” అంది. అంత చిన్న పిల్ల ‘మా ఆయనగారు’ అని మాట్లాడుతుంటే కడుపులో దేవేసినట్లయింది రవళికి.
ఆశ చావనట్లు “అక్కడ నువ్వు చదువుకోవడం అవుతుందా?” అని అడిగింది. ఏదో అజ్ఞానిని చూసినట్లు చూసి నవ్వింది దేవి.
“పెళ్ళి సేసుకున్నాక అంతా ఆళ్ళ ఇష్టమే కదండీ. నేను అడుగుతాను కానీ చదవగలనని హామీ ఇవ్వలేనండీ” అంది.
ఈ సెవెన్త్ క్లాస్ అమ్మాయి ఈ రోజు ఎంత బోధించింది. ఆటపాటల్ని, చిన్నతనాన్ని వదిలేసుకుని లేని పెద్దరికం ఆపాదించేసుకుంది. ముందునుంచి ఆడ జాతి ఇంతేనేమో! మొగుడు చచ్చిపోయాడు, నువ్వూ మంటల్లో దూకేయాలి అంటే దూకేసి, మొగుడు చచ్చిపోయాడు నువ్వు అలంకారాలన్నీ తీసేయాలి అంటే తీసేసి, నీ సాటి ఆడదాని ఆ వికార రూపాన్ని మంచి నక్షత్రం చూసి చూడు అంటే చూసి, నువ్విపుడు పనికిమాలినదానివి అంటే కాబోలు అనుకుని ఒక వారగా ఉండిపోయే జన్మలు!! విదేశాలలోలాగ మన దేశపు ఆడవాళ్ళు అంతా కలిసి తమ మీద జరిగే ఏ అత్యాచారానికైనా వ్యతిరేకించినట్లు ఒక్క ఉదాహరణ కూడా తనకి తెలియదు. రవళి మనసు బాధల సుడిగుండంగా మారిపోయింది.
***
మూఢాలు పోయాక రమణమ్మ పెళ్ళి ఓ కోవెలలో సింపుల్ గా అయిపోయింది. పెద్దగా జనం ఇరు పక్షాలవారు లేరు. హడావిడీ లేదు. పెళ్ళికొడుకుని చూసి రమణమ్మ విస్తుపోయింది. చాలా నల్లగా, లావుగా ఉన్నాడు. చూడగానే భయమేసింది రమణమ్మకి. మాట మాత్రం మెత్తగా మాట్లాడాడు. తల్లిదండ్రులని చూస్తే చాలా కోపం వచ్చింది. డబ్బుండి మగాడయితే చాలా? ఈడు జోడు చూడక్కరలేదా? అనుకుంది. వాళ్ళకి తాను పెళ్ళితోనే సెటిల్ అవ్వాలని అంత పట్టుదల ఏంటో రమణమ్మకి అర్థం కాలేదు. నర్సమ్మ, రాజయ్యలు పిల్లతో బాటు వాళ్ళింటికి వెళ్ళి, మంచి చెడ్డ అన్నీ చూసి, ఓ వారంరోజులుండి పిల్ల కాపురం చూసి రావాలని వాళ్ళనుకున్నారు.
కానీ పెళ్ళికొడుకు తల్లిదండ్రులు రమణమ్మతో నర్సమ్మని, రాజయ్యని రానీయలేదు. అతని కారులో రమణమ్మను తీసుకుని పెళ్ళవగానే వాళ్ళ ఊరికి తీసికెళ్ళిపోయారు. వాళ్ళ ఇద్దరికీ రెండు మూడు రోజులాగి తాము ఫోన్ చేస్తామని అప్పుడు రమ్మని చెప్పారు. రమణమ్మ గుండె గుబగుబలాడింది. తల్లి తండ్రులని వదిలి అలా పూర్తిగా తెలియని వాళ్ళతో వెళ్ళాలంటే నచ్చలేదు. చాలా ఏడ్చింది. కానీ టైమ్ అయిపోతోందని వాళ్ళు తొందర పడ్డారు. నర్సమ్మ, రాజయ్యలు ధైర్యం చెప్పి పంపారు. వాళ్ళకీ ఆ పరిస్థితి ఇబ్బంది గానే ఉంది. కానీ ఆ సమయంలో వాళ్ళు చేయగలిగింది లేదు. ఇప్పుడు బాల్ మగ పెళ్ళివారి కోర్ట్‌లో ఉంది.
***
కార్లో అత్తమామలు రమణమ్మతో ఒకటే పరాచికాలు. ఆ మధ్యలో, వాళ్ళ మాటల్లో రమణమ్మకి తెలియని, రమణమ్మ ఊహించని నిజాలు బయట పడ్డాయి.
“ఎన్ని సంబంధాలు సూసేమని? ఏ అమ్మాయిని సూసినా వద్దనేవాడు. అసలు ఎన్నాళ్ళు బతిమాలినామని? మాట పూర్తిగా ఇనకుండానే వద్దనేవాడు. వాడిని పెళ్ళికి ఒప్పించేందుకే మాకు చాలా టైమ్ పట్టింది. తీరా ఔనన్నాక పిల్ల నచ్చడమే కష్టమయిపోయింది. మీ ఇద్దరికీ రాసేడు ఆ దేవుడు. అందుకే నీ ఫొటో సూసీ సూడగానే ఒప్పేసుకున్నాడు.” మామగారు హాస్యంగా చెప్పాడు. డ్రైవ్ చేస్తున్న పెళ్ళికొడుకు వెంకటరావు మొహంలో నవ్వు కదలాడింది.
“ఏటే పిల్లా? నువ్వు ఎంటనే బిడ్డల్ని కనవా? సదూకుంటావా? ఇయ్యన్నీ నీ సరతులా! మేమాడిన మాటలు నిజాలు కావు సుమా! మరి నీలాంటి ముత్తెమంటి పిల్ల కోడలిగా రావాలంటే ఆ మాత్రం అబద్దమాడకపోతే ఎట్టా? సక్కగా మా కోడలు ఇంటి పట్టునే ఉండాల, మాకు రెండు పూట్లా బువ్వ వండాల. మా వంశాన్ని పెంచాల. అదే నీ పని.” గట్టిగా నవ్వుతూ అంది అత్తగారు.
రమణమ్మ జ్ఞానేంద్రియాలు పని చేయడం మానేసాయి. ఆ చదువు మీద ఆశతో కాదూ? ఈ సంబంధం ఒప్పుకుంది. ఇంత వయసులో పెద్దవాళ్ళు ఇలా అబధ్ధాలాడతారనుకోలేదు. చదువు అనేది లేనినాడు ఇక ఈ పెళ్ళిలో, రాబోయే జీవితంలో రుచి ఏముంది? ఒక్కసారిగా లోతు తెలియని తమ ఊరి చీకటి బావిలోకో, అగాధంలోకో కూరుకుపోతున్న భావన కలిగింది. పట్టలేని కోపం వచ్చింది. మరింకో ఆలోచన లేకుండా ఆవేశంగా కారు డోర్ తీసి దూకేయబోయింది.
“ఆ.. ఆ..” అంటూ వెంకటరావు రమణమ్మ చెయ్యి లాగి ఆపేశాడు.
“అమ్మా! నీ పిచ్చి మాటలతో అమ్మాయిని బెదరగొట్టకు.” వెంకటరావు అరిచాడు.
“పిచ్చి మాటలేటి? మనం ముందు అనుకున్నదేగా?” గొణిగింది ఆవిడ.
వెంకటరావు తల్లిని మిర్రి మిర్రి చూసాడు. ఇక రమణమ్మకి జీవితేచ్ఛ పోయింది. దీన్ని ఎలా ప్రతిఘటించాలో తెలియని పరిస్థితి. కీ ఇచ్చిన బొమ్మలా, గాజుకళ్ళతో వాళ్ళు చెప్పినట్లు చేసింది.
పెళ్ళికొడుకు వాళ్ళ ఇల్లు చాలా పెద్దది. ఆ పల్లెటూళ్ళో అది ఒకటే అంత పెద్ద ఇల్లు లాగా ఉంది. రమణమ్మకి ఆశ్చర్యం కలిగింది. ఊర్లో ఇంత పరపతి ఉన్నవాడు, ఊరికి పెద్దయినవాడు పెళ్ళి అంత సింపుల్‌గా కోవెలలో చేసుకోవడమేమిటో అర్థం కాలేదు. తమలో పెళ్ళికి అందరికీ భోజనాలు పెట్టడం చాలా కామన్.
వాళ్ళు ఇంటికి వచ్చిన కాసేపటిలోనే వెంకటరావుకి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్‌కి అతను చాలా కంగారు పడ్డాడు. “నేను వెంటనే ఊరికి వెళ్ళాలి” అన్నాడు. కాసేపు గది మధ్యలో నిలబడి దీర్ఘాలోచనలో ఉండిపోయాడు. ఆ తరువాత గదిలో ఉన్న తల్లి దగ్గరకి వెళ్ళాడు.
“అమ్మా! రాత్రికి అందరికీ టిఫిన్ తెచ్చి ఇమ్మనమని పండు బాబుకి ఫోన్ చేసి చెప్తాను. నువ్వేమీ హైరానా పడకు. రెస్ట్ తీసుకో. కానీ ఇంకో మాట. ఆ అమ్మాయి జాగ్రత్త. నువ్వు నీ పిచ్చి మాటలతో తనని బెదరగొట్టావనుకో, మర్యాదగా ఉండదు. నేనొచ్చేసరికి అంతా సవ్యంగా ఉండాలి” అని చెప్పడం వినిపించింది. అతని గొంతులో హెచ్చరిక ఉంది. అతని తల్లి ఏదో గొణిగింది కానీ అది వినపడలేదు.
అతను రమణమ్మ సూట్‌కేస్ తనే బెడ్ రూమ్‌లో పెట్టాడు. బీరువాలోంచి ఏవో అవసరమైనవి తీసుకున్న శబ్దం వినిపించింది. చిన్న బ్యాగ్ సర్దుకుని బట్టలు మార్చుకుని హాల్లో కూచున్న రమణమ్మ దగ్గర ఆగాడు.
“అదే మన బెడ్ రూమ్. నువ్వు ఫ్రీగా ఉండు. పక్క ఊర్లోనే పని. అయిపోతే ఏ రాత్రికన్నా వచ్చేస్తాను. లేకపోతే కేంప్ బీహార్ వెళ్ళాలి. కొన్ని రోజులు పట్టచ్చు. మా అమ్మ, నాన్నల మాటలేమీ సీరియస్‌గా తీసుకోకు. నీకు ఎలా ఇష్టమైతే అలా జరుగుతుంది.” అని చెప్పి హడావుడిగా కారు తీసుకుని వెళ్ళిపోయాడు.
రమణమ్మకి మళ్ళీ ఆశ చిగురించింది. నిజంగా ఇతను తన మాట మన్నించి కోరిక తీరుస్తాడా? తనని మళ్ళీ చదివిస్తాడా? ఈ మోటు మనిషిలో మరో మంచి మనిషి ఉన్నాడా? రమణమ్మ ఆలోచనలో పడిపోయింది.
అతను చెప్పినట్లే చీకటి పడేసరికి అందరికీ టిఫిన్లు వచ్చాయి. అవి తిన్నాక అత్తగారు..
“ఆడు ఎప్పుడొస్తాడో తెలియదు. రాత్రికి రాలేకపోతే అప్పుడే ఫోన్ సేస్తాడు. ఆడి దగ్గర ఇంకో తాళం ఉంది. ఆడొచ్చేస్తాడులే. అదే మీ గది. సెప్పాడుగా. అక్కడకెల్లి పడుకో!” చెప్పేసి తన గదిలోకి వెళ్ళి పడుకుంది.
ఆ గది లోకి వెళ్ళిన రమణమ్మ పరీక్షగా చూసింది. సినిమాల్లో సెట్టింగ్ లాగా ఉంది. ఇవన్నీ చూసే అమ్మ వాళ్ళు మరేమీ ఆలోచించకుండా ఈ పెళ్ళి చేసేసారు అనుకుంది. ఆ మంచం మీద ఎందుకో పడుకో బుధ్ధి కాలేదు. అక్కడే సోఫాలో ఒళ్ళు మరిచిపోయినట్లు ఓ గంటసేపు పడుకుంది.
నర్సమ్మ ఫోన్‌కి తెలివి వచ్చింది. తల్లితో బాగా మాట్లాడలేదు. ముక్తసరిగా మాట్లాడి పెట్టేసింది. గదంతా చూస్తూ ఉంటే టేబిల్‌కి బీరువా కి మధ్యన పడిపోయిన ఫైల్, అందులోంచి జారిపోయిన కాగితాలు కనిపించాయి.. అంత క్రితం బీరువాలోంచి కావల్సినవి తీసుకుంటున్నపుడు జారిపోయినట్లుంది. తీసి జారిపోతున్న కాగితాలు సర్దుతూ అవేమిటా? అని పరీక్షగా చూసేసరికి రమణమ్మ నవనాడులు స్తంభించిపోయాయి. దాన్ని అక్కడే టేబిల్ మీద పెట్టేసి మళ్ళీ సోఫా దగ్గరికి వచ్చింది. ప్రపంచం అంతా గిర్రున తిరుగుతోంది. ఉదయం నుంచి ఒకదాని మీద తరువాత ఒకటిగా జరుగుతున్న సంఘటనలకీ, ఒకటొకటిగా తగులుతున్న షాక్‌లకి కళ్ళు తిరిగి క్రిందన పడిపోయింది. తెల్లవారి అత్తగారి కేకలకి రమణమ్మకి తెలివి వచ్చింది.
లేవాలని ప్రయత్నించినా నేలమీంచి రమణమ్మ లేవలేకపోయింది. అత్తగారు సణుగుతూ వచ్చి “ఏటయింది? లేచి మొహం కడుక్కో. టీ ఇస్తాను. తాగి మందు వేసుకుందువుగానీ! ఏటో సుకపడే గీత నా నుదుటిన ఎక్కడుంది? కోడలివి వచ్చావు. నాకు సేసి పెడతావు సుకపడాలనుకున్నాను. నీకే నేను సేవలు సెయ్యాల్సివస్తోంది మల్ల.” విసుక్కుంటూ ఆవిడ వెళ్ళింది.
మెల్లగా ఓపిక తెచ్చుకుని మొహం కడుక్కునే సరికి ఆవిడ కొడుకు ఫోన్ తెచ్చింది.
“ఇదిగో నా కొడుకు ఉన్నాడు లైన్లో మాటాడు” అని ఇచ్చింది.
“రమణా! ఏటి జ్వరమా? అమ్మ వాళ్ళ గదిలో షెల్ఫ్‌లో మందుల డబ్బా ఉంది. అందులో ఏ మందు దేనికన్నది వివరంగా రాసి పెట్టాను. అది తీసి వేసుకో. అందులోనే నా నంబరు రాసి పెట్టాను. ఏం కావాలన్నా ఫోన్ చెయ్యి. నేను వచ్చేసరికి వారం రోజులు పట్టచ్చు. ఊర్లో జాతర నేను కొబ్బరికాయ కొడితేనే గాని ప్రారంభమవదు. ఆ టైమ్‌కి ఎలాగన్నా వస్తాను. వెంటనే వచ్చేసాను. ఏమీ అనుకోకు.” అని పెట్టేసాడు.
ఈలోపల నాగమ్మ మందుల డబ్బా, టీ తెచ్చింది. రమణమ్మ టీ తాగి మందు వేసుకుంది. రాత్రి కూడా సరిగ్గా తిండి లేకపోవడం చాలా నీర్సంగా ఉంది. ఆవిడ వరస చూస్తే మద్యాహ్నం వరకూ ఏమీ పెట్టేటట్లు లేదు. బ్యాగ్‌లో తల్లి ఏమన్నా పెట్టిందేమో అని చూసింది. రమణమ్మకి ఇష్టమైన నాలుగయిదు రకాల చిరుతిళ్ళు చేసి పెట్టింది నర్సమ్మ. అవి తింటుంటే తల్లి ప్రేమకి కళ్ళంట నీళ్ళు ఆగలేదు. వెక్కి వెక్కి ఏడ్చింది. కాస్త సర్దుకున్నాక ఆలోచించడం ఆరంభించింది. ముందు తన అనుమానం నిజమో కాదో రూఢి చేసుకోవాలి.
ఫోన్లో నెట్ ఆన్ చేసి ఒక గంటన్నర పైనే దాని గురించి సెర్చ్ చేసింది. రవళి ఇచ్చిన ప్రాక్టీస్ ఇక్కడ పనికొచ్చింది. అర్థం కాకపోతే ‘తెలుగులో అనువదించు’ ఆప్షన్ సెలక్ట్ చేసుకుని చదివింది. తరువాత తన అనుమానమే నిజమయేసరికి ఏం చేయాలో తోచలేదు. గుండె రగులుకుపోయింది. ఎంత మోసం! ఎంత ఘోరం! ఎంత వంచన! అసలు తన జీవితంలో ఇన్ని అడ్డంకులేమిటి? తన జీవితంతో ఆడుకోడానికి వీళ్ళకి ఎవరు ఇచ్చారు అధికారం? ఎంత మంచిగా, మెత్తగా మాట్లాడుతున్నాడు? ‘మేకవన్నె పులి’ అని తెలుగు మేడమ్ చెప్పారు. ఇలాంటి వాళ్ళ కోసమేనేమో! తను ఈ ఇంట కాపురం చేయదు. చేయలేదు. పిచ్చి పట్టినట్లున్న ఆలోచనలతో తల పేలిపోతుందేమో అనిపిస్తోంది., బుర్ర బద్దలయిపోయే నొప్పితో నీర్సంతో కళ్ళు మూసుకుంది. మద్యాహ్నం నీర్సంగా ఉన్నా వంటింట్లోకే వెళ్ళి తింది.
ఈ లోపల తల్లి ఫోన్ వచ్చింది. తల్లి ఎంతో ఆత్రంగా అత్తవారింటి సంగతులు అడిగింది.
“అమ్మా! ఇంత పెద్ద ఇల్లు, ఊరికి పెద్ద మనిషిలా కనిపిస్తున్నాడు. కానీ పెళ్ళి ఎవరికీ భోజనాలు అవీ పెట్టకుండా, ఏ హడావిడి లేకుండా ఎందుకు చేసుకున్నాడంటావు? నీకేమీ వింతగా అనిపించడం లేదా?” రమణమ్మ ఆరాగా అడిగింది.
“అసలు ఏ విషయాన్నైనా అంత వంకరగా ఎలా సూస్తావే నువ్వు? నువ్వు ఎక్కడ సిన్నబుచ్చుకుంటావో అని హడావిడి పెళ్ళి వద్దన్నాడు. జనం లేకపోవడం మనకే మంచిదయింది కదా! అనవసర ఖర్చు తగ్గింది. మేము ఆ ఇల్లు అదీ సూసినాం. ఆళ్ళు ఈలు సూసుకుని ఊరందరికీ భోజనాలు పెట్టుకుంటామన్నారు. ఏం తప్పుంది అందులో? అసలు ఆళ్ళలో మంచే కనపడదా నీకు?” నర్సమ్మ దెబ్బలాటకి దిగింది.
పుండు మీద కారం జల్లినట్లయింది రమణమ్మకి. “అమ్మా! అసలు వాళ్ళు వయసులో అంత పెద్దవాళ్ళయి అన్ని అబధ్ధాలు ఎలా ఆడారో నీకు తెలియదు. చదువు, ఉద్యోగం ఏమీ వద్దు, వంటింటి పని చూడడం, పిల్లల్ని కనడమే నా పని అంటున్నారు. ఎంత అన్యాయమో చూడు.” రమణమ్మ దాదాపు ఏడుపు గొంతుతో చెప్పింది.
నర్సమ్మ ‘దీని సదువు పిచ్చి మీద బండ బడ!’ అని మనసులోనే తిట్టుకుని పైకి మాత్రం తియ్యగా “మా బంగారం కదా! అయ్యన్నీ వదిలేయమ్మా! పెళ్ళయాక ఆళ్ళిష్టమే కదే! అత్తోరు, మొగుడు సెప్పినట్టే మనం ఇనాలి. సదివి, ఉజ్జోగం సేసే అవసరం నీకేటి? అంత ఇల్లు, అంత ఆస్తి నా తల్లి రాజ్జెమేలతాదని నేను సూస్తుంటే!” అంది.
“అమ్మా! ఒక్క మాట నామీద ఒట్టు వేసి నిజం చెప్పు. నీకు కూడా ఈ మోసంలో భాగం ఉందా? పెళ్ళయాక వాళ్ళు చదివించరని నీకు ముందే తెలుసా?” సూటిగా అడిగింది.
నర్సమ్మకి గొంతుకకి ఏదో అడ్డు పడినట్లయింది. “ఇంత చిన్న విషయానికి ఒట్లెందుకే? అమ్మని ఇంత బయపెట్టాలా? నువ్వు నా బంగారువి. నీ మేలు కోరి నీ కోసం తీసుకున్న ప్రతీ నిర్ణయం ఎంత బావుంటదో ముందు ముందు నీకే తెలుస్తాది.” కర్ర విరక్కుండా పాము చావకుండా జవాబు చెప్పింది నర్సమ్మ.
గండి తెగిన చెరువయింది రమణమ్మ పరిస్థితి. “ఈ పెళ్ళి వల్ల నాకు మేలా అమ్మా? నాకు భవిష్యత్తా? ఏమంటున్నావు? ముందు ముందు కాదమ్మా ! ఇప్పుడే నా బతుకేంటో నాకు తెలుస్తోంది.” అస్పష్టమైన మాటలంటూ రమణమ్మ ఏడుస్తుంటే నర్సమ్మకి కాళ్ళు చేతులూ ఆడలేదు. “మా తల్లి కాదూ! ఊరుకోయే! ఊరుకోయే” అంటూ బ్రతిమలాడింది.
రమణమ్మ తనని తాను సంబాళించుకుంది. “అమ్మా! నాకు ఎంత ఇబ్బంది అయినా, నచ్చక పోయినా, ఎలాటి పరిస్థితి లోనైనా నేను ఇక్కడే ఉండాలా?” తల్లి మాటలను కట్ చేస్తూ రమణమ్మ సీరియస్‌గా అడిగింది.
“నిన్న పెళ్ళి సేసుకుని ఎల్లి ఇయాల ‘నేనిక్కడే ఉండాలా?’ అని అడుగుతుంటే ఏటర్దం? నలుగురూ మొహాన్న ఉమ్ముతారే! అసలు..” ఇంకా ఏదో అనే లోపల రమణమ్మ ఫోన్ కట్ చేసింది.
మళ్ళీ నర్సమ్మ ఫోన్ చేసింది కానీ రమణమ్మ స్విచ్చాఫ్ చేసేసింది. రమణమ్మకి ఒకటి బాగా అర్థమయింది. తల్లిదండ్రులు తనని ఇల్లాలుగా తప్ప మరోలా చూడరు. తను చదువుకుంటానంటే ఒప్పుకోరు. తనకు అతని గురించి తెలిసిన భయంకర నిజం చెప్పి నిరూపిస్తే గుండెలు బాదుకుని వీళ్ళతో పోట్లాడి తనని తీసికెళ్తారు. మరో ఏడాదికి మరో తలకు మాసిన సంబంధం చూస్తారు. తన తల్లిదండ్రుల మీద, కట్టుకున్న మోసగాడి మీద, అబధ్ధాలాడిన పెద్దవాళ్ళ మీద, పరిస్థితుల మీద, దేవుడి మీద కూడా పట్టలేనంత కోపం వస్తోంది. వీళ్ళందరు అనుకున్నట్లు కాకుండా వేరేగా చెయ్యాలి.
కానీ తనేం చేయగలదు? వీళ్ళ కోరికలకి, నిర్ణయాలకి, శాసనాలకి దొరక్కుండా ఏదో చెయ్యాలన్న కోరిక తీవ్రమైపోయింది. సడెన్‌గా వచ్చిన ఆలోచన ‘చనిపోతే?’ అని. చనిపోయి అందరిమీద కోపం తీర్చుకోవాలన్న పిచ్చి కోరిక పెరిగిపోయింది. ఇలాటి క్రిటికల్ సిట్యువేషన్ హాండిల్ చెయ్యడం ఎలాంటి వాళ్ళకైనా కష్టమే. ఒంటరిగా ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవడం అంటే అది మరింతగా వాళ్ళ మతి పోగొడుతుంది. దీనిని బ్యాలెన్సెడ్‌గా డీల్ చేయడానికి రమణమ్మకున్న వయసెంతని? తన అనుభవమేపాటిదని! చనిపోయి అందరిమీద కసి తీర్చుకోవాలనే కోరిక పుట్టి, అది కొంచెం సేపటికి బలపడిపోయి, అదే నిశ్చయమైపోయింది. అంతవరకూ రమణమ్మ చుట్టూ ఉన్న వాతావరణం అదే! కోపానికి, నిరాశకి, బాధకి అన్నింటికీ సముద్రమే పరిష్కారం అనుకునే జనం మధ్య అంతవరకూ గడిపిందేమో, అదే పరిష్కారమన్న నిర్ణయంతో పడుకుంది.
కానీ తల్లిదండ్రులు, టీచర్స్ చెప్పిన మంచి మాటలు సబ్కాన్షస్ మైండ్‌లో నిక్షిప్తమై ఉంటాయి. అవి అవసరమైనపుడు ఒక మెరుపులా మెరిసి సహాయకారిగా మారుతాయి. ఆ రోజు రమణమ్మకి అలాగే జరిగింది. నిద్రలో కల వచ్చింది. రవళి ఆ కలలో “జీవితంలో ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోకూడదు. ఎంత వ్యతిరేక పరిస్థితులలోనూ అనుకూలత ఉంటుంది. ఆలోచించాలి. ఎంత చీకటి కమ్మినట్లున్నా మనకి తెలియని దారి నుండి వెలుగు వస్తుంది. మనం దాన్ని కనుక్కోవాలి. మనం పుట్టినందుకు ఏదో ఒకటి సాధించి ప్రపంచానికి చూపించాలి” అని అంటున్నట్లు స్పష్టంగా వినిపించింది.
రమణమ్మ ఉలిక్కిపడి లేచి కూచుంది. ఒక్కసారిగా మేడమ్ తన నిర్ణయానికి దెబ్బలాడుతున్నట్లు అనిపించింది. తనని ప్రాణంగా ప్రేమించే తల్లిదండ్రుల సపోర్ట్ ఈ విషయంలో ఉండదు. అలాంటప్పుడు ఈ పరిస్థితుల్లో తనకి అనుకూలత ఏమిటా? అని ఆలోచించింది. వెంటనే మెరుపు మెరిసినట్లు అర్థమయింది. ఆ పెద్దావిడ కారులోనే నోరు జారి అసలు విషయం చెప్పడం, అతనికి అర్జెంట్ పని పడి వెళ్ళిపోవడం, ఆ ఫైల్ తన కంటబడడం, అతని గురించిన వాస్తవం తనకు తెలియడం, తను ఆలోచించడానికి సమయం దొరకడం, ఇవన్నీ తనకి అనుకూలతలే అని అర్థమయేసరికి తను వీళ్ళ బారి నుంచి బయట పడతానని నమ్మకం వచ్చింది. ఎలాగో ఒకలా రవళి మేడమ్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఈ సమస్యకు పరిష్కారం ఆవిడని అడగాలి. ఆవిడ ఏం చెప్తే అది చేయాలి అనుకుని నిశ్చింతగా పడుకుంది.
(ఇంకా ఉంది)
రాయప్రోలు సుజాతా ప్రసాద్ విశ్రాంత ఉపాధ్యాయిని. వీరి స్వస్థలం విజయనగరం. ప్రస్తుత నివాసం హైదరాబాద్. శ్రీ చాడ.లక్ష్మణమూర్తి, కళావతి దేవి గార్లు వీరి తల్లితండ్రులు. వీరి భర్త పేరు శ్రీ రాయప్రోలు సత్య ప్రసాద్. అమ్మాయి – మృదుల, వంశీకృష్ణ (అల్లుడు), ప్రహిత, శ్రీదస్తువన్ (మనుమలు); అబ్బాయి సిద్దార్థ, అనూష (కోడలు), విభాకర శ్రీప్రద్, విభాశ్రీ అనఘ. (మనుమలు).
సుజాతగారు ఎమ్.బియడ్., డిప్లొమా ఇన్ మ్యూజిక్ (వీణ) చేశారు. పుస్తకాలు చదవడం, రచనలు చేయడం, పాడడం, వీణ వాయించడం, త్రెడ్ వర్క్ తో ఆభరణాలు తయారు చేయడం వీరి ప్రవృత్తి.
వీరి కలం పేరు ‘సుప్రజ’. కథలు, నవలలు, వ్యాసాలు వ్రాశారు. ‘విధి విన్యాసం’, ‘తల్లిదండ్రులు’ బహుమతి పొందిన నవలలు. ‘గోవు మా లచ్మికి’, ‘యాత్ర’, ‘నాణేనికి రెండో వైపు’, ‘మనమెవరమని?’, ‘సరైన తండ్రి’, ‘చందన గంధి,’ ‘ముడుచుకున్న రెక్కలు’, ‘దేవతలే శపిస్తే’, ‘మార్పు’ మొదలైనవి వివిధ పోటీల్లో బహుమతి పొందిన కథలు.
