[శ్రీమతి రాయప్రోలు సుజాతా ప్రసాద్ గారి ‘మథనం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[దుర్గారావు అనే విద్యార్థి, హెడ్ మాస్టరు గారిని ఎదిరించి మాట్లాడుతున్నాడనీ, మీరేమైనా హాండిల్ చేయగలరేమో చూడండి అంటూ రామారావు సర్ వచ్చి చెప్పడంతో రమణి స్టాప్ రూమ్ నుంచి లేచి, హెచ్ఎమ్ గారి గదికి వెళ్తుంది. సాయంత్రం ఆరు నుండి స్పెషల్ క్లాసులు పెట్టి పదో తరగతి పిల్లలని మళ్ళీ రమ్మంటారు హెచ్ఎమ్. అది దుర్గారావుకి నచ్చదు. ఎందుకు రాలేనో కారణం చెబుతుంటే, హెచ్ఎమ్ పట్టించుకోవడంలేదు. దాంతో దుర్గారావు కాస్త దురుసుగా మాట్లాడుతాడు. మెల్లగా అసలు విషయం కనుకుని, దుర్గారావుని ప్రస్తుతానికి స్పెషల్ క్లాసులకి వెళ్ళమంటుంది. మంగమ్మ తనని లెక్కజేయకుండా వెళ్ళిపోయి స్వతంత్ర్యంగా బతకడం ఆమె భర్త చలపతికీ, సవతి కొడుకు రాజేష్‌కి నచ్చదు. మంగమ్మని సాధించడానికి ఇద్దరూ కలిసిపోతారు. రాజేష్, అతని మిత్రులు రోజూ, కాలేజీకి వెళ్తున్నప్పుడు దీప వెంటపడి వేధిస్తారు. వాళ్ళెవరో తెలుసుకున్న దీప తల్లికి చెబుతుంది. పోలీస్ అధికారి సోమశేఖర్ గారికి చెప్దామని వాళ్ళింటికి వెళితే, వారు ఊరెళ్ళారని, వచ్చే సరికి రెండు రోజులు పడుతుందని తెలుస్తుంది. రెండు రోజుల తర్వాత దుర్గారావు స్కూలుకే రాకపోయేసరికి కంగారు పడి కబురు చేస్తుంది రవళి. పది లంఖణాలు చేసిన వాడిలా మొహం పీక్కుపోయి ఉంటాడతను. తనకి భరించలేని చెవి నొప్పని, ఇద్దరు ముగ్గురు డాక్టర్లకి చూపించినా నయం కాలేదనీ, అమ్మ దగ్గర ఇంక డబ్బుల్లేవనీ చెప్తాడు. మర్నాడు సాయంత్రం దుర్గారావును తనతో పాటు విజయనగరం తీసుకెళ్ళి ఓ ఇఎన్‌టి స్పెషలిస్ట్‌కు చూపిస్తుంది. డాక్టరు జబ్బు ముదిరాకా వచ్చారని ముందు తిట్టినా, మంచిగా చెక్ చేసి, చక్కని మందులు రాసిస్తాడు. వీరి కథ విన్న ఆయన ఫీజు కూడా తీసుకోడు. దుర్గారావుకి మందులన్నీ కొని ఇచ్చి ఆ ఊరి ఆటో ఎక్కించేసి ఇంటికి వచ్చేస్తుంది రవళి. మర్నాడు ఉదయం స్కూలుకి కాస్త తొందరగా వెళ్ళి, ఏదో పుస్తకం చదువుకుంటుండంగా, దుర్గారావు వచ్చి పాద నమస్కారం చేస్తాడు. అతనికి ఆ మందుల వల్ల చెవిపోటు సర్దుకుందని అర్థమవుతుంది. దుర్గారావు ధన్యవాదాలు చెప్తే, బాగా చదువుకోమని, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చెప్పి పంపిస్తుంది. – ఇక చదవండి.]
ఆ రోజే జాతర. నాగమ్మ మాటల్లో రమణమ్మ అతను రాత్రి తొమ్మిది లోపల ఊర్లోకి వచ్చి, జాతర ఆరంభం చేస్తాడని, ఆ అమ్మవారి ఊరేగింపుతో పాటు ఇంటికి వస్తాడని తెలుసుకుంది. ఆ రోజు ఊర్లో చాలా హడావుడిగా ఉంటుందని అర్థం చేసుకుంది. పైఊరి ఆటోలు వస్తాయి కాబట్టి ఊరు దాటిపోవచ్చు అని నిర్ణయించుకుంది.
రోజూ తనూ తోడు ఉన్నానంటూ రమణమ్మను జ్వరం వచ్చి పలకరిస్తూనే ఉంది. మాత్ర వేసుకుంటే చెమట్లు పడతాయి. కానీ మళ్ళీ మామూలే. జాతరరోజు వంటింట్లో హడావుడి పడి, రమణమ్మను పెట్టి ఏవో పిండివంటలు చేసింది నాగమ్మ కానీ, ఊరేగింపు ఇల్లు దాటాకే కోడలు భోంచేయాలంది. రమణమ్మకి నీర్సంతో చికాకు కలిగినా, ఏమీ అనలేదు. తల్లి ఇచ్చిన చిరుతిళ్ళు తిని మందు వేసుకుంది. సాయంకాలం ఆరు దాటింది. రమణమ్మ నాగమ్మ దగ్గరకొచ్చి టి.వి. తదేకంగా చూస్తున్న ఆవిడతోను ఆయనతోను మెల్లగా..
“నాకు మళ్ళీ ఒంట్లో బావులేదండి. పడుకుంటాను. ఊరేగింపు వచ్చినపుడు లేపండి లేస్తాను” అని అంది.
“ఈ మూడు రోజులూ బాగానే ఉన్నావు. చూడ్డానికి బాగానే కనిపిస్తున్నావు. ఏమిటో అస్తమాను బావులేదంటావు. నిన్ను హారతి ఇచ్చినపుడు అందరూ చూస్తారని, నిన్ను బాగా తయారయి ఉండమని వాడు చెప్పాడు. ఒక్కసారిగా ఈ ఊరికి నిన్ను చూపించి ఆ తరువాత అందరికీ భోజనాలు ఎట్టాలని ఆడు సూస్తన్నాడు. అందుకే ఈ లోగా నిన్ను ఎవరికీ సూపించలేదు. ఇంకో గంటలో వాడు ఊర్లోకి వచ్చేస్తాడు.” అంది నాగమ్మ విసుగ్గా.
“అలాగేనండీ. పది నిమిషాలలో తయారయిపోతాను. మీరు చెప్పినట్లే చేస్తాను. బావుంటే మీతో పాటే ఇక్కడ ఎందుకుండను? రోజూ మీతోనే కూచుంటున్నాను కదా! రోజూ మాత్రలు వాడితేనే లేవగలుగుతున్నాను. ఈ రోజు చాలా నీర్సంగా ఉంది. ఉదయం నుంచీ భోజనం కూడా లేదు కదా! అందుకనే అయి ఉండచ్చు. ఇంకా రెండు గంటల పైనే టైమ్ ఉందికదా! మీరు కేక వేయగానే వచ్చేస్తాను.” అంది.
సూరయ్య కల్పించుకున్నాడు. “అబ్బ! ఏటి నీ గోల! సెప్తోంది కదా! గంటలోగా లేస్తానని. నస పెట్టకు. నువ్వెల్లమ్మా! ఎల్లి రెస్ట్ తీసుకో” అన్నాడు. రమణమ్మ తేలిగ్గా నిట్టూర్చి లోపలికి వచ్చేసింది. నాగమ్మ ఇంక ఏమీ చేయలేక ఊరుకుంది.
ఆ తరువాత రమణమ్మ గదిలోకి వచ్చి తలుపు వేసుకుంది. ఎవరొచ్చినా తనని పరిచయం చేయకపోవడానికి కారణం రమణమ్మకు బోధపడింది. ఊరందరిముందు తనని ఒక్కసారిగా ప్రెజెంట్ చేస్తాడన్నమాట. ఆవిడ ఏ కారణానికి తనను ఊర్లోవాళ్ళకి చూపించకపోయినా, అది తనకు మేలే అయిందనుకుంది. రోడ్ మీద తనని ఈ ఊరివారు గుర్తు పట్టడం కానీ, అతనికి ఆచూకీ చెప్పడం కానీ జరగదు. అక్కడి నుంచి ఓ అరగంటలో తనకు సంబంధించినవి, తను ఇంపార్టెంట్ అనుకున్నవి అన్నీ ఓ బ్యాగ్‌లో సర్దుకుని చున్నీతో మొహం పూర్తిగా కప్పుకుని ప్రయాణానికి సిధ్ధమైంది. ఈ ఊరి జనాలకి ఎలానూ తను తెలియదు, కానీ తనను ఎరిగిన వారు ఎవరన్నా జాతరకు వస్తే! మళ్ళీ విషయం మందుకొస్తుంది. అందుచేత మరెవ్వరూ తనని గుర్తుపట్టకుండా రమణమ్మ అన్ని జాగ్రత్తలు తీసుకుంది.
చీకటి పడ్డాక పెరటి వైపు నుంచి రోడ్ మీదకు వచ్చి స్పీడ్‌గా నడక ప్రారంభించింది. తన ప్రయత్నం సక్సెస్ కావాలని ఆ దేవుడిని కోరుకుంటూ చిన్నగా ఆ ఇంటి నుంచి పరుగు పెట్టింది. అక్కడ రోడ్డు రెండుగా చీలి ఉంటుంది. మీదది మెయిన్ రోడ్డు. క్రింద సముద్రం ఒడ్డున సన్నపాటి మట్టి రోడ్డు. దాని మీద వెళ్ళి ఊరి చివరకి మెయిన్ రోడ్డుకి కలియవచ్చు. అక్కడే ఆటో స్టేండ్! రమణమ్మ ఆ రోడ్లో చిన్నగా పరుగు ప్రారంభించింది. తను ఇంట్లో లేదన్న సంగతి వాళ్ళు గుర్తించే లోపలే ఈ పొలిమేర దాటేయాలి. ప్రతీ రోజూ తను అలాగే తలుపు వేసుకునే పడుకుంటుంది కాబట్టి ఆ టైమ్ వరకూ వాళ్ళు చూసే అవకాశం లేదు. అదే తనకు ధైర్యం.
కొంచెం దూరం వెళ్ళిందో లేదో వెనుక నుంచి “హేయ్! ఆగు! ఆగు!” అన్న అరుపు వినిపించింది. రమణమ్మకి ప్రాణాలు పోయినట్లనిపించింది. వెనక్కి చూసేసరికి ఎవరో ఒక అతను తన వెంటే పరుగు పెట్టి వస్తున్నాడు. రమణమ్మ పరుగు వేగం బాగా పెంచింది. కానీ కొన్ని సెకెండ్ల లోనే అతను రమణమ్మని చేరుకున్నాడు. ఒక్క ఉదుటున రమణమ్మ జెబ్బ పట్టుకొని ఆపి తన వైపు తిప్పుకుని “ఏయ్! ఏం చేస్తున్నావు? సముద్రంలో పడడానికేనా ఈ పరుగు?” అని అరిచాడు ఆవేశంగా!
ముందు భయంతో వణుకు పుట్టినా, కాస్త ధైర్యం తెచ్చుకుని అతని వైపు చూసింది. వెంటనే రమణమ్మ కళ్ళు పెద్దవయాయి. అతను స్కూల్లో తన సీనియర్ నారాయణ. రవళి మేడమ్‌తో ముందు గొడవపడి తరువాత ఆవిడకి అభిమాని అయిపోయినవాడు. “నారాయణా!” అంది విభ్రాంతిగా!
“నువ్వు..!” అన్నాడు నారాయణ సందిగ్ధంగా!
కప్పుకున్న చున్నీ తీసింది రమణమ్మ! “నువ్వా, రమణమ్మా! నువ్వేంటి ఇక్కడ! ఇలా!” ఆశ్చర్యంగా అన్నాడు.
“నారాయణా! నన్ను ప్రశ్నలేమీ అడక్కు. ఇప్పుడు అవన్నీ చెప్పలేను. చెప్పడానికి టైమూ కాదు. నేను విజయనగరం రవళి మేడమ్ దగ్గరకు వెళ్ళాలి. నాకు హెల్ప్ చేస్తావా?” అని అడిగింది. రమణమ్మ ఏదో ప్రమాదంలో ఉన్నట్లు నారాయణకు అర్థమైంది. ఒక్క క్షణంలో నారాయణ సర్దుకున్నాడు.
“మనం ఇద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాం. సహ విద్యార్థులం. ఆమాత్రం నీకు సహాయం చేయలేనా? పద! నా ఆటోయే ఉంది. నిన్ను త్వరగా విజయనగరం చేరుస్తాను. రా! భయపడకు. నిన్ను నేను వివరాలు అడగను, నీ గురించి ఎక్కడా చెప్పను. ఇందాకటి లాగే చున్నీ కప్పుకో!” అన్నాడు.
ఇద్దరూ వీలయినంత త్వరగా ఆటో దగ్గరకి వచ్చి ఆటో ఎక్కేసారు. వెంటనే ఆటో స్టార్ట్ చేసి విజయనగరం వైపు తిప్పాడు నారాయణ. కొంచెం దూరం వెళ్ళాక “అమ్మకి బావులేదు. విజయనగరం హాస్పిటల్లో జాయిన్ చేసాను. తెలిసిన వాళ్ళని తోడుగా ఉంచాను. అందుకని మన ఊరు కాకుండా విజయనగరం నుంచి ఆటో తిప్పుతున్నాను. విజయనగరం నుంచి జాతరకి కొంతమందిని తీసుకుని ఈ ఊరు రావడంతో నిన్ను కలియగలిగాను. విజయనగరంలో మేడమ్ గారి దగ్గర నిన్ను దించేసి వెంటనే హాస్పిటల్‌కి వెళ్తాను నేను” అన్నాడు నారాయణ.
రమణమ్మకి ఇది ఇంకా నిజమని నమ్మకం కలగలేదు. దడదడలాడుతున్న గుండెలతో టెన్షన్‌గా కూచుంది. రమణమ్మ మాట్లాడకపోయేసరికి వెనక్కి తిరిగి చూసిన నారాయణ “రమణమ్మా నిన్ను విజయనగరం క్షేమంగా చేర్చే పూచీ నాది. నువ్వు ఏ రకంగానూ టెన్షన్ పడకు” అని స్పీడ్ పెంచాడు.
కానీ హైవే మీద పేద్ద యాక్సిడంట్ అయి ట్రాఫిక్ జామ్ అయింది. రమణమ్మ భయంతో ఏడుస్తూ నారాయణతో “రవళి మేడమ్ తప్ప నాకు ఇంకో దిక్కు కానరావడం లేదు నారాయణా! నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. నన్ను మేడమ్ గారి దగ్గరకి ఎలా చేరుస్తావో?” అంది.
నారాయణ “కాస్త ఆలస్యమవుతుందేమో గానీ, అలాగే తీసికెళ్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు. నువ్వు అలా ఏడిస్తే నాకు బావులేదు.” అన్నాడు. రమణమ్మ పరిస్థితి ఏమిటో? పాపం! అనుకున్నాడు నారాయణ.
***
పగలు తమ వెంటబడుతుంటే పట్టించుకోక పోవడంతో రాత్రుళ్ళు కూడా రాజేష్ గ్యాంగ్ యాక్షన్ లోకి దిగింది. ఇంట్లోకి రాళ్ళు, చెత్త విసిరేసి పారిపోయేవారు.. వీధి గుమ్మం తలుపు తట్టేవారు. తలుపు తీసే సరికి పారిపోయి ఇంటి వెనక్కి వెళ్ళి పెరటి తలుపు తట్టేవారు. రకరకాలుగా వంటింటి కిటికీ దగ్గర నుంచి, ఆ ఇంట్లో వాళ్ళకి మాత్రమే వినబడేటట్లు కూతలు కూసేవారు. నాలుగు రోజులు వాళ్ళకి కంటి మీద కునుకు లేదు. ఇరుగు పొరుగుకి విషయమంతా చెప్తే సాయం చేస్తారు. కానీ అది శాశ్వత పరిష్కారం కాదు. ఎలాగన్నా వాళ్ళు దీప జోలికి రాకుండా చేయాలి. దానికి సోమశేఖరం గారయితేనే కరెక్ట్.
సోమశేఖరం గారు వాళ్ళు ఆ రోజు ఊరినుంచి వచ్చారు. ఇక ఆ రోజు ఎలాగన్నా వాళ్ళ అల్లర్లకి చరమ గీతం పాడాలనిపించింది దీపకి. సోమశేఖర్ గారింటికి వెళ్ళి వాళ్ళకి జరుగుతున్న తతంగమంతా చెప్పింది. వాళ్ళు ఊరి నుంచి వచ్చినరోజే ఇవన్నీ చెప్పడం ఇష్టం లేకపోయినా తప్పలేదు.
ఆవిడ దీపకి ధైర్యం చెప్పింది. సోమశేఖరం గారు “ఇలాంటి వెధవలకి బుధ్ధి చెప్పడం ఎంతసేపు? కానీ రాత్రి వాళ్ళు గొడవ స్టార్ట్ చెయ్యగానే నాకు మెసేజ్ చెయ్యి. మీరేం చేయాలో అప్పుడు చెప్తాను. అమ్మని బెంగ పెట్టుకోవద్దను.” అన్నారు ఎంతో తేలిగ్గా.
అలాగే ఆ రాత్రి వాళ్ళు గొడవ ప్రారంభించగానే సోమశేఖరం గారికి మెసేజ్ పెట్టింది. ఆయన వెంటనే
“నువ్వూ, అమ్మ కలిసి తెలిసిన ఆటో ఎక్కి కోట వరకూ రండి. వాళ్ళు మిమ్మల్ని తప్పకుండా ఫాలో చేస్తారు. నేను స్టేషన్ నుంచి బయలుదేరుతాను. వాళ్ళ సంగతి చూద్దాం” అని మెసేజ్ పెట్టారు.
దీప, మంగమ్మ వెంటనే ఇల్లు తాళం వేసి రెండిళ్ళ అవతల ఉన్న ఆటో సూరి ఇంటికెళ్ళారు. మంగమ్మ సూరితో “అన్నా! ఒకసారి అర్జెంట్‌గా కోటవరకు మమ్మల్ని తీసికెళ్తావా? నీకు విషయమంతా తరువాత వివరంగా చెప్తాను.” అంది. అప్పుడే భోజనం చేసి రెస్ట్ తీసుకోబోతున్న సూరి వాళ్ళ టెన్షన్ చూసి వెంటనే ఆటో తీసి బయలు దేరాడు. వీళ్ళ ఆటోను అడ్డుకుంటూ, అల్లరి చేస్తూ రాజేష్ వాళ్ళు కూడా కోట వరకూ వచ్చారు.
అప్పటికే జీప్తో రెడీగా ఉన్న సోమ శేఖర్ గారు “నేను వాళ్ళని ఛేజ్ చేస్తాను. మీరు ఇంటికెళ్ళండి” అని రాజేష్ వాళ్ళ ఆటోని ఫాలో చేసారు. అయోమయంగా ఉన్న సూరిని గమనించిన దీప సూరితో రాజేష్ వాళ్ళ గురించి, కొన్ని రోజుల నుంచి పగలు రాత్రి తేడా లేకుండా వాళ్ళు తమని ఇబ్బంది పెట్టిన తీరు గురించి, సరిగ్గా టైమ్‌కి రెస్పాండ్ అయిన సోమశేఖర్ గారి గురించి చెప్పింది.
“మమ్మల్నెందుకు పిలవలేదమ్మా! మక్కెలిరగతందుము కదా! పనికి మాలినఎదవలు! అయినా నీ నిర్ణయం బాగుందిలే. ఆ విషప్పురుగుల కోరలు పీకాలంటే అట్టాంటోళ్ళే ఉండాల. బాగా శాస్తి సెయ్యాల ఆ బాబు ! మీరు ఆటో ఎక్కండమ్మా మనం పోదాం” అన్నాడు సూరి. ఆటో ఎక్కి వెళ్ళిపోబోతున్న దీప సడెన్‌గా తన పేరు పెట్టి ఎవరో పిలిచినట్టయి ఆగింది.
దీప తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. రమణమ్మ ఆటోలోంచి దిగుతోంది. వేరు వేరు విషాద కారణాల వలన వీడ్కోలు చెప్పుకోకుండా విడిపోయిన స్నేహితురాళ్ళను అకస్మాత్తుగా విధి కలిపింది. ‘రమణా’ అంటూ దీప పరుగున వచ్చి రమణమ్మను చుట్టుకుపోయింది. రమణమ్మ ఒక్కసారిగా బరెస్ట్ అయిపోయినట్లు ఏడిచింది.
“రమణా! ఈ వేళప్పుడు ఎక్కడినుంచి వస్తున్నావు? అమ్మ వాళ్ళు ఏరి? ఏంటయింది చెప్పు. ఏమీ చెప్పకుండా ఏడిస్తే ఎలాగే?” రమణమ్మ వీపు నిమురుతూ దీప అడిగింది.
నారాయణకి మళ్ళీ ఫోన్ వచ్చింది. నారాయణ దీపని పలకరించి “రమణమ్మా! నువ్వు తొందరగా వస్తే నిన్ను దింపేసి నేను హాస్పిటల్‌కి వెళ్ళాలి.” అన్నాడు.
ఈ లోగా మంగమ్మ అక్కడికి వచ్చింది. “ఏటి రమణా! ఎట్టాగున్నావు? దీప అస్తమాను నిన్ను తలుస్తూనే ఉంటది. ఏడకి బయిల్దేరావు? నారాయణ నిన్ను ఎక్కడ దింపాల?” అడిగింది మంగమ్మ ఆప్యాయంగా.
రమణమ్మ “దీపా! నేను రవళి మేడమ్ గారి దగ్గరకు బయల్దేరాను. నా పరిస్థితి మేడమ్ గారికి చెప్పి ఆవిడ తీర్పు విన్నాకే నేను ఏం చేయాలో తెలుస్తుంది.” అంది రుధ్ధ కంఠంతో.
“పోనీ ఈ రాత్రి మా ఇంటికి వస్తావా?” దీప అడిగింది.
“వద్దు. తను ఏదో సమస్యలో ఉంది. వెళ్ళనీ. ఇక్కడే ఉంటాం కదా! తరువాత కలుద్దాం.” అంది మంగమ్మ. మళ్ళీ నారాయణకి ఫోన్ వచ్చింది. అప్పుడు దీప “నారాయణా! నువ్వెళ్ళు. సూరిమామతో మేము వెళ్ళి రమణమ్మని మేడమ్ గారింటి దగ్గర దింపుతాం. ఇది వరలో ఉండే ఇల్లే కదా!” అంది. వాళ్ళు చదువుకునేటప్పుడు తరుచూ రావడంతో అందరికీ రవళి వాళ్ళ ఇల్లు తెలుసు.
నారాయణ వెళ్ళిపోయాక అందరూ సూరి ఆటోలో బయలుదేరారు. రమణమ్మకి టెన్షన్ గానే ఉంది. కళ్ళంట తుడుచుకుంటున్నా ఆగకుండా కన్నీళ్లు వస్తున్నాయి. దీప, మంగమ్మ ఓదారుస్తూనే ఉన్నారు.
దీప “రమణా! నన్ను కలిసినట్లు మాత్రం మేడమ్ గారికి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకే. నారాయణే దింపాడని చెప్పు. నేను మేడమ్ గారు ఆశించినట్లు ఏదో ఒకటి సాధించాక ఆవిడ ఎదురు పడతాను. ఇది జ్ఞాపకం ఉంచుకో.” అంది.
ఇద్దరూ ఒకరి ఫోన్ నంబరు మరొకరు ఇచ్చి పుచ్చుకున్నారు. రవళి వాళ్ళింటి దగ్గర రమణమ్మను దింపేసి కాస్త దూరంలో లైట్లాపి దీప, మంగమ్మ వెయిట్ చేసారు రవళి పైకి రాగానే వెళ్ళిపోవాలని వాళ్ళ ఉద్దేశ్యం.
***
రాత్రి పదిన్నర దాటింది. అలిసిపోయిన రవళి గాఢంగా నిద్రపోతోంది. ఇంతలో గేట్ కొట్టిన చప్పుడు కంటిన్యూగా వినిపిస్తోంది. మురళి లేచాడు. ఆ చప్పుడులో ఒక ఆదుర్దా, ఆందోళన వినిపించడంతో ముందు లైట్ వేసి తరువాత రవళిని లేపాడు. ఇద్దరూ గాభరాగా పోర్టికోలో లైట్ వేసి పైకి వచ్చారు. గేట్ తీయగానే అంతవరకూ గేట్‌ని ఆనుకున్న రమణమ్మ నిలబడలేనట్లు రవళి మీద వాలిపోయింది. రమణమ్మ ని చూసిన రవళి, మురళి నిర్ఘాంత పోయారు.
“రమణమ్మా! నువ్వా! ఏమయింది?” రవళి ఆదుర్దాగా అడిగింది.
“ఆ అమ్మాయి నీర్సంగా ఉంది. ముందు పాలో, నీళ్ళో ఇచ్చి అప్పుడు అడుగు.” మురళి చెప్పాడు. రమణమ్మను హాల్లో సోఫాలో కూచోబెట్టి రవళి పాలు వెచ్చబెట్టి తెచ్చింది. రవళిని చేరేవరకూ ఒకరకం టెన్షన్! ఇప్పుడు మేడమ్, సర్ ఏం చెప్తారో అని ఇంకో టెన్షన్! ఉదయం నుంచి భోజనం లేకపోవడం, ప్రతీ స్టేజ్ లోను అనుభవించిన ఆందోళన, అన్నీ పరాకాష్ఠకి చేరి రమణమ్మ సుడిగాలిలో గాలిపటంలా అల్లల్లాడుతోంది. జడివానకు తడిసిన పిచ్చుకలా వణుకుతోంది. డేగ భయానికి శిబి చక్రవర్తిని ఆశ్రయించిన పావురంలా తెలియని నిశ్చింతగా కూడా ఉంది. రవళి ఇచ్చిన పాలు వెంటనే తీసుకు తాగింది రమణమ్మ.
మురళికి, రవళికి ఇద్దరికీ రమణమ్మ ఏదో పెద్ద ప్రమాదం తప్పించుకుని వచ్చిందని అర్థమయింది. గ్లాస్ కింద పెట్టిన రమణమ్మ సడెన్‌గా రవళి, కాళ్ళ మీద పడిపోయింది. రవళి గాబరాగా విడిపించుకో బోయింది.. కానీ రమణమ్మ లేవలేదు.
“మేడమ్! నాకు చదువుకొని, ఉద్యోగం చేయాలని ఉంది. బతికితే అలాగే మంచిగా బతకాలని ఉంది. మీరేం చెపితే అది చేస్తాను. దారి నాకు తెలీదు. మీరే ఏదో చెయ్యండి” అంది వెక్కిళ్ళ మధ్య.
రవళి బలవంతాన లేపి పక్కన కూచో పెట్టుకుంది. మురళికి అప్పుడసలు రమణమ్మను వివరాలు అడిగి కష్టపెట్టడం ఇష్టంగా అనిపించలేదు, కానీ ఏ పరిస్థితుల్లో ఎలా వచ్చిందో తెలియక పోతే తరువాత చాలా ఇబ్బంది అనిపించి విషయం అడిగాడు.
“మేడమ్! మా అమ్మ, నాన్న నా జీవితాన్ని బాగుచెయ్యాలన్న ఒకే ఒక వెర్రి కోరికతో నాకు పెళ్ళి చేసారు. అది జరిగి ఈ రోజుకి వారం రోజులు.” రవళి, మురళి ఉలిక్కిపడి మొహాలు చూసుకున్నారు.
“పెళ్ళవగానే నన్ను వాళ్ళింటికి తీసికెళ్ళారు. ఇంట్లో మమ్మల్ని దింపి అర్జెంట్ ఫోన్ రావడంతో అతను కేంప్‌కి వెళ్ళిపోయాడు. ఆ రోజు అతని గదిలో నాకు భయంకరమైన వాస్తవాలు తెలిసాయి. భయంతో తెలివి తప్పిపోయాను. తెల్లవారాక తెలివి వచ్చింది. కానీ విపరీతమైన జ్వరం. ఈ రోజు ఊర్లో జాతరకి అతను వస్తాడని, వాళ్ళ అమ్మ చెప్పింది. ఈ రోజు మీ దగ్గరికి వచ్చే ప్రయత్నంలో నేను ఫెయిల్ అయితే వాళ్ళకి దొరకడం కంటే సముద్రంలో దూకి చనిపోవడమే మంచిది అన్న నిర్ణయంతోనే ఇల్లు వదిలి వచ్చాను మేడమ్!”
“హుష్! ఏమిటా పిచ్చి మాటలు. ఏంకాదు. అసలేం జరిగిందో పూర్తిగా చెప్పు.” అంది రవళి మందలింపుగా.
“అతను రాత్రికి ఇంటికి వచ్చే లోపల ఊరు దాటేయాలని సముద్రం ఒడ్డున పరుగు పెట్టాను. ఊరి ఆటోలో ఏది ఎక్కినా అతను పట్టేయగలడు. ఆ టైమ్‌లో మన స్కూల్లో చదివిన నారాయణ తన ఆటోలో వెళ్ళిపోతూ నన్ను చూసి తనతో విజయనగరం తీసుకు వచ్చాడు. మీ ఇంటికి ఇదివరకు నాలుగయిదు సార్లు వచ్చాను కాబట్టి బాగానే గుర్తు పట్టాను. మీ ఇంటి దగ్గరకు వచ్చాక నన్ను ఇక్కడ దింపి, మీరు తలుపు తీసే వరకూ ఆగి నారాయణ వెళ్ళిపోయాడు. ఎందుకంటే అప్పటికే హాస్పిటల్లో వాళ్ళ అమ్మకి తోడుగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయి. జరిగింది అంతా చెప్పాను. ఇక నిర్ణయం మీది. మీరేం చెప్తే అదే చేస్తాను.” రమణమ్మ మాటలు విని రవళికి మురళికి ఇద్దరికీ మాటలు రాలేదు. వాళ్ళేం చెప్తారా అన్నట్లు ఆదుర్దాగా చూస్తోంది రమణమ్మ.
“రవళీ! ఫ్రిజ్‌లో ఏమున్నాయో చూసి రమణమ్మకు పెట్టు. పిల్లల గదిలో తనకి పక్క ఏర్పాటు చెయ్యి. జ్వరం ఉందా చూసి టేబ్లెట్ ఇవ్వు. రమణమ్మా! ప్రశాంతంగా పడుకో! రేపు ఏం చేయాలన్నది ఆలోచిద్దాం.” మురళి చెప్పేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు.
మురళీ చెప్పినట్లే అన్నీ చేసి “నా మీద నా కంటే సార్ మీద నాకు ఎక్కువ నమ్మకం. ఏదో ఒకటి ఆయన చేస్తారు. పడుకోమ్మా! నీకు నిద్ర పట్టే వరకూ నేనిక్కడే ఉంటాను.” ఆర్ద్రంగా చెప్పింది రవళి.
ఎన్ని నెలల తరువాతో నిశ్చింతగా కమ్మటి నిద్ర ఒడిలోకి జారింది రమణమ్మ.
(ఇంకా ఉంది)
రాయప్రోలు సుజాతా ప్రసాద్ విశ్రాంత ఉపాధ్యాయిని. వీరి స్వస్థలం విజయనగరం. ప్రస్తుత నివాసం హైదరాబాద్. శ్రీ చాడ.లక్ష్మణమూర్తి, కళావతి దేవి గార్లు వీరి తల్లితండ్రులు. వీరి భర్త పేరు శ్రీ రాయప్రోలు సత్య ప్రసాద్. అమ్మాయి – మృదుల, వంశీకృష్ణ (అల్లుడు), ప్రహిత, శ్రీదస్తువన్ (మనుమలు); అబ్బాయి సిద్దార్థ, అనూష (కోడలు), విభాకర శ్రీప్రద్, విభాశ్రీ అనఘ. (మనుమలు).
సుజాతగారు ఎమ్.బియడ్., డిప్లొమా ఇన్ మ్యూజిక్ (వీణ) చేశారు. పుస్తకాలు చదవడం, రచనలు చేయడం, పాడడం, వీణ వాయించడం, త్రెడ్ వర్క్ తో ఆభరణాలు తయారు చేయడం వీరి ప్రవృత్తి.
వీరి కలం పేరు ‘సుప్రజ’. కథలు, నవలలు, వ్యాసాలు వ్రాశారు. ‘విధి విన్యాసం’, ‘తల్లిదండ్రులు’ బహుమతి పొందిన నవలలు. ‘గోవు మా లచ్మికి’, ‘యాత్ర’, ‘నాణేనికి రెండో వైపు’, ‘మనమెవరమని?’, ‘సరైన తండ్రి’, ‘చందన గంధి,’ ‘ముడుచుకున్న రెక్కలు’, ‘దేవతలే శపిస్తే’, ‘మార్పు’ మొదలైనవి వివిధ పోటీల్లో బహుమతి పొందిన కథలు.
