[శ్రీమతి రాయప్రోలు సుజాతా ప్రసాద్ గారి ‘మథనం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[రమణమ్మ నిద్రకి ఉపక్రమించి, ఆమెకి నిద్రపట్టేవరకు, రవళి ఆ గదిలోనే కూర్చుంటుంది. రకరకాల ఆలోచనలు ఆమె బుర్రని తొలిచేస్తాయి. ముఖ్యంగా పల్లెల్లో మైనర్ బాలికల పెళ్ళిళ్ళు అనేది ఆమెను కలవరపరుస్తుంది. దీర్ఘాలోచన నుంచి తేరుకుని, తమ రూమ్ లోకి వచ్చేసరికి మురళి చాలా రెస్ట్‌లెస్‌గా ఉంటాడు. రమణమ్మ సమస్యలోని తీవ్రతని అర్థం చేసుకోలేదంటూ కసురుకుంటాడు. సారీ చెప్పి, వచ్చి రమణమ్మ పక్కన పడుకుంటుంది రవళి. భయంకరమైన నిజం ఏదో ఆ గదిలో తెలిసింది అన్న రమణమ్మ మాటలోని పాయింట్ తానెలా మిస్ అయ్యాడా అని మురళి ఆలోచిస్తాడు. ఉదయాన్నే మురళి తన ఫ్రెండ్, పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ అయిన శరత్ ఇంటికి వెళ్తాడు. రమణమ్మకు, రవళికి ఉన్న సాన్నిహిత్యం, సంవత్సర కాలం నుంచి రమణమ్మ ఫేస్ చేస్తున్న సమస్యలు టూకీగా వివరిస్తాడు. సాయం చేయమని అడుగుతాడు. ఆ ఏరియా ఎస్.ఐ. నీరజ్ తనకి మంచి ఫ్రెండ్ అనీ, అతని ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నిద్దామని అంటాడు శరత్. ఈలోపు ఇంట్లో రమణమ్మ లేచి ఫ్రెష్ అవుతుంది. మురళి రవళికి ఫోన్ చేసి రమణమ్మని పిలిచి, ఆ గదిలో ఏ నిజం తెలుసుకుని నువ్వు భయపడ్డావో చెప్పమంటాడు. వెంకటరావు ఎయిడ్స్ పేషెంట్ అనీ, విండో పీరియడ్ ఏనాడో దాటిపోయిందనీ. ట్రీట్మెంట్లో ఉన్నాడనీ, ఆ రిపోర్ట్స్ అన్నీ తాను ఫొటోలు తీసాననీ, షేర్ చెయ్యమంటే చేస్తానని చెప్తుంది రమణమ్మ. వాటిని జాగ్రత్తగా సేవ్ చెయ్యమని, ఫోన్‌ని రవళికి ఇచ్చేయమని, తాము వచ్చేవరకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంచమని చెప్తాడు. ఆ ఫోన్ సంభాషణ అయ్యాకా, రవళి అసలేం జరిగిందని అడిగి, రమణమ్మ ద్వారా అన్ని వివరాలు తెలుసుకుని బాధ పడుతుంది. తమని కాపాడినందుకు మంగమ్మ సోమశేఖరం గారికి కృతజ్ఞతలు చెబుతుంది. నీరజ్, శరత్ కలిసి వెళ్ళి వెంకటరావుని నిలదీస్తారు. అతను చేసింది ఘోరమైన తప్పిదమని, ఒక మైనారిటీ తీరని చిన్నపిల్లని పెళ్ళి చేసుకోవడం, అదీ పెద్ద డిసీజ్‌తో – అంటూ రమణమ్మ ఆత్యహత్య చేసుకోబోతే, మహిళా సంఘం వాళ్ళు కాపాడారని చెప్తాడు నీరజ్. తాము చెప్పినట్టు వినకపోతే, వెంకటరావు రహస్యాన్ని ప్రపంచానికి వెల్లడి చేస్తామని బెదిరిస్తాడు. కొన్నిరోజుల్లో కోర్టు నోటీసు వస్తుందనీ, మర్యాదగా విడాకులకి అంగీకరించమని హెచ్చరిస్తాడు. రమణమ్మకి సంబంధించిన బట్టలు వస్తువులు అన్ని తీసుకుని వస్తారు. జీపులోనే ఉండిపోయిన మురళికి, గెలిచాం అన్నట్టు ‘థమ్స్ అప్’ సింబల్ చూపిస్తాడు శరత్. వాళ్ళు వెళ్ళాకా, తన ప్లాన్ విఫలమయినందుకు, తన నుంచి రమణమ్మ తెలివిగా జారుకున్నందుకు బాధపడతాడు వెంకటరావు. – ఇక చదవండి.]
మళ్ళీ వీళ్ళంతా రమణమ్మ వాళ్ళింటికి వెళ్ళారు. “మీ అమ్మాయి ఎక్కడుందో తెలుసా?” అడిగాడు నీరజ్ రాజయ్యని, నర్సమ్మని.
“లచ్చనంగా పెళ్ళి సేసాం. అత్తవారింట్లో ఉంది బాబూ!” రాజయ్య పోలీసులు ఎందుకు వచ్చారా? అని భయపడిపోతూ చెప్పాడు.
“రాజయ్యా! మీరు చేసిన పెళ్ళి లక్షణమైన పెళ్ళి కాదు. మాయదారి పెళ్ళి! నీ కూతురి ప్రాణం తీసే జబ్బున్న వాడితో! ఆ పిల్ల తెలివయింది. తప్పించుకుంది. సముద్రంలో పడబోతున్న ఆ పిల్లని ఒక మహిళా సంఘం వాళ్ళు రక్షించారు. ఇప్పుడు తను వాళ్ళ దగ్గరే ఉంది. చదువుకుంటానని దేవులాడే పిల్లకి అలాటి వాడితో పెళ్ళి చేయడానికి మీకు మనసెలా ఒప్పింది? నువ్వేదో గుండె జబ్బని చెప్పావుట కదా! ఆ రిపోర్ట్స్ చూపించు.” నీరజ్ గడగడలాడించాడు.
వాళ్ళిద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. “అదేం లేదు బాబు. దాన్ని పెళ్ళికొప్పించడానికి మా అప్ప అట్టా సెప్పింది.” నర్సమ్మ జంకుతూ జంకుతూ చెప్పింది.
“ఏం మూర్ఖత్వమయ్యా! రత్నం లాంటి పిల్లను.., పదహారేళ్ళు నిండని దాన్ని, చదువుకుంటానని మొర పెడుతున్నదాన్ని పెళ్ళో, పెళ్ళో అని వెంటపడి మాయదారి పెళ్ళి చెయ్యడానికి మనసెలా ఒప్పిందయ్యా?.. సరే అయిందేదో అయింది. కొన్నాళ్ళు, కాదు ఇక కొన్నేళ్ళు రమణమ్మ మా రక్షణలో ఉంటుంది. తను చదువుకుని తన కాళ్ళమీద తాను నిలబడేంత వరకూ మీ దగ్గరకు రాదు.” శరత్ కరాఖండీగా చెప్పాడు.
“బాబూ! అల్లుడు వచ్చి అడుగుతాడు. పిల్లని అక్కడే ఉంచేస్తే మావేటిసెయ్యాల? ఏమని ఆళ్ళకి సమాధానం సెప్పాల? ఇదేటి నిర్ణయం బాబూ?” రాజయ్య ధైర్యం మూటకట్టుకుని ఏదోలా అడిగాడు.
“అసలు ఆ పెళ్ళే చెల్లదని నేను చెప్తుంటే అల్లుడు అని గోల పెడతావేంటి? వెంకటరావుతో సంబంధం తెంచేసాం. అతని వల్లమీకు ఇబ్బంది రాదు.” శరత్ గట్టిగా చెప్పాడు.
“మావు అంతకాలం పిల్లని సూడకుండా ఉండలేం బాబూ!” రాజయ్య దీనంగా అన్నాడు.
“అవును బాబూ! ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నాము. దాన్ని సూడకుండా ఉండడమంటే మా బతికే బతుక్కి ఇలువ లేదు.” నర్సమ్మ దాదాపు ఏడుస్తూ అంది.
శరత్‌కి వాళ్ళ బాధ అర్థమైంది. జాలి వేసింది కూడా. కానీ వాళ్ళకి రమణమ్మని అప్పచెప్తే ఏం జరుగుతుందో తెలుసు. లక్ష్యం మంచిదైనపుడు కఠినంగా ఉన్నా ఫర్వాలేదనుకున్నాడు. తీయటిఫలితం కోసం ఈ బాధ అనివార్యమనుకున్నాడు. వాళ్ళ దగ్గరగా వచ్చి..
“కొన్నాళ్ళు పారాదీప్‌లో వదిలి ఉన్నట్లే అనుకోండి. నా ఫోన్ నంబరు ఇది. మీమీద నమ్మకం కలిగాక నేనే రమణమ్మ విషయాలు చెప్తాను. సరేనా?” అన్నాడు. వాళ్ళకీ ఇంకో ఆఫ్షన్ లేదు. రెండు చోట్ల కూడా రవళి సంగతి రాకుండా మేనేజ్ చేసాడు శరత్. మురళికి టెన్షన్ అంతా తగ్గి రిలీఫ్‌గా అనిపించింది. వీళ్ళంతా వెళ్ళాక నర్సమ్మ కూతురికి ఫోన్ చేసింది. కానీ అది స్విఛ్ఛాఫ్ వచ్చింది.
***
శరత్ రవళి ఇంటికి వచ్చేసరికి సాయంత్రమయింది. మురళి “రవళీ! ఈ రోజు శరత్ వల్ల పని సానుకూలమయింది. అట్నుంచి నరుక్కు వచ్చాడు. పొమ్మన లేదు. కానీ పొగపెట్టాడు. అంతే!” అని జరిగిందంతా చెప్పాడు.
రవళి ఎంతో హాయిగా నవ్వుతూ “రెండు చోట్లా అన్నయ్య తాంబూలాలు ఇచ్చేసారన్నమాట. తన్నుకు చావడమే ఇక వాళ్ళ పని.” అంది.
రమణమ్మ వెంటనే ముగ్గురి కాళ్ళకీ దండం పెట్టింది. “ఇదేమిటి?” అని అడిగిందిరవళి.
“మనసులో రెండు రకాలుగా రిలీఫ్ వచ్చిందండీ! పెళ్ళి నుంచి విముక్తి వచ్చింది. మా నాన్నకి ఏ జబ్బు లేదని తెలిసింది.” అంది కన్నీళ్ళతో.
శరత్ సీరియస్‌గా “ఇప్పుడు కాదు, నువ్వు చదువయేంత వరకూ ఏ వేషాలు వెయ్యకూడదు. నీకు ఆశ్రయమిచ్చిన వాళ్ళని ఇబ్బంది పెడితే నేను సహించను. ఇప్పుడున్న పట్టుదల, వేడి, చివరివరకూ ఉండాలి. నా దృష్టి ఎప్పుడూ నీ మీద ఉంటుందని మరిచిపోకు. రవళీ! రమణమ్మ ఫోన్ తీసుకురా! ఆ ఫోన్ లోంచి ఆ మెడికల్ రిపోర్ట్స్ మన ముగ్గురి ఫోన్లలోకి ఫార్వర్డ్ చెయ్యాలి.” అన్నాడు.
రవళి తెచ్చి రమణమ్మ ఫోన్ ఇచ్చింది. శరత్ అన్నట్లుగానే రిపోర్ట్స్ ఫార్వర్డ్ చేసాడు. ఆ తరువాత “దీన్లోకి సిమ్ కొత్తది తెచ్చాను. అది వాడాలి. ఫోన్ మెమరీలో ఉన్నవి అన్నీ డీలిట్ చేసేస్తాను. పాత జ్ఞాపకాలు, పాత కాంటాక్ట్స్ ఏవి ఉన్నా నీ ఉనికికే ప్రమాదం. ఖాళీ ఫోను నీకిస్తాను. మా ముగ్గురి నంబర్లే ప్రస్తుతం నీ కాంటాక్ట్స్‌లో ఉంటాయి. మీ అమ్మ నాన్నలతో నేను మాట్లాడించినపుడే మాట్లాడాలి. వాళ్ళ పాత నంబరు కూడా అక్కడి మా కానిస్టేబుల్ మార్చేస్తాడు. నువ్వు ఈ బాధలో, ఈ వేడిలో చదువుకుందామనుకుని, మళ్ళీ మనసు మార్చుకుని ఊరికి వెళ్ళిపోవడం లాంటివి చేస్తే మర్యాదగా ఉండదు. అవన్నీ ఆలోచించుకునే నిర్ణయం తీసుకో. లేదంటే ఇప్పుడే వెనక్కి వెళ్ళడం మంచిది రమణమ్మా!” కాస్త కఠినంగా చెప్పాడు.
రమణమ్మ భయంగా “మీరు చెప్పినట్లే చేస్తానండి. ఊరికి వెళ్ళను. నేను చదువుకుంటాను. ఈ నిర్ణయం నా కాళ్ళ మీద నేను నిలబడేంత వరకూ మార్చుకోను.” అంది.
శరత్ రమణమ్మను హెచ్చరించిన తీరుకి, తీసుకున్న జాగ్రత్తకీ మురళి మనసులోనే అతన్ని మెచ్చుకున్నాడు. రవళికి కూడా ఈ జాగ్రత్త అవసరమనిపించింది.
“రమణమ్మా! రెండు మూడు రోజుల్లో అమ్మాయిల హాష్టల్ ఏదో ఒకటి చూసి అందులో జాయిన్ చేస్తాం. కాలేజీలు ఓపెన్ అయేసరికి టైమ్ ఉంది. ఈ లోగా టైం పాస్ ఎట్లా?” మురళి సాలోచనగా అన్నాడు.
“మేడమ్! మీరంతా ఏమీ అనుకోనంటే నేను ఒక మాట చెప్తాను. సర్! నేను పారాదీప్‌లో ఖాళీగా లేను. బ్లౌజ్ డిజైనింగ్ నేర్చుకున్నాను. అప్పుడు కొన్ని కుట్టాను. ఆ డబ్బులు, అమ్మ వాళ్ళిచ్చినవి కలిపి నా దగ్గర పదిహేను వేల దాకా ఉన్నాయి. అమ్మ వాళ్ళు చేయించిన సూత్రాలు, రెండు తులాల గొలుసు ఉన్నాయి. ఇవన్నీ ఎలా ఉపయోగపడితే అలా ఉపయోగించండి.” అంటూ బ్యాగ్ లోంచి బంగారం, సొమ్ము తీసి ఇచ్చింది. రమణమ్మ చురుకు తనానికి, స్వాభిమానానికి, తెలివికీ, మురళీ, శరత్ ముగ్ధులయారు.
“ఉపయోగించినా, ఉపయోగించక పోయినా తన దగ్గర అవన్నీ ఉండడం సేఫ్ కాదు. రవళీ నీ దగ్గర ఉంచమ్మా.” శరత్ చెప్పాడు.
అలా తీసుకోవడం ఇష్టం లేకపోయినా సేఫ్ కాదు అన్న మాటకి తీసుకుంది రవళి.
శరత్ డీలిట్ చేసిన అన్ని నెంబర్లతో పాటు ముందురోజు సేవ్ చేసుకున్న దీప నెంబర్ కూడా పోతూ ఉంటే రమణమ్మ ప్రాణం విలవిలలాడింది. దీప తన విషయం రవళి మేడమ్ దగ్గర చెప్పవద్దు అనడంతో రవళితో ఆ మాట చెప్పడానికే వీలు కాలేదు. కలిసినట్లే కలిసిన తన ప్రియ మిత్రురాలు మళ్ళీ విడిపోవడం రమణమ్మకి చాలా బాధ కలిగించింది.
***
ఒక వారం తరువాత శరత్ మురళీకి ఫోన్ చేసి తనని సాయంత్రం కలవమన్నాడు. మురళి వెళ్ళాక “వెంకటరావుని భయపెట్టి ఏదో హంగు చేసాను కానీ, రమణమ్మకి విడాకులు అనేవి ఇప్పుడే ఏ కోర్టు నుంచి రావడం కష్టమనిపిస్తోంది.. ఎందుకంటే పద్దెనిమిదేళ్ళ లోపు జరిగిన ఆడపిల్లల పెళ్ళిళ్ళని రిజిష్టర్ చేసేందుకు అవదు. మైనారిటీ తీరకపోవడమే దానికి కారణం. అలాంటప్పుడు రిజిష్టర్ కాని పెళ్ళికి కోర్టు ఎలా విడాకులు ఇస్తుంది? నిన్నటినుంచి ఇదే ఆలోచిస్తున్నాను. ఏం చేయాలా? ఎలా పరిష్కరించాలా? అని.”
శరత్ మాటలకి మురళీకి మళ్ళీ కొంచెం టెన్షన్ వచ్చింది. “అయితే ఏం చేద్దాం మరి?. పల్లెటూర్లో పంచాయతీలో పెట్టి వాళ్ళ ఇద్దరికీ ఎటువంటి సంబంధం లేదని, ఇక మీదట వెంకటరావుకు రమణమ్మ మీద ఏ రకమైన అధికారాలు లేవనీ, వెంకటరావు దగ్గర సంతకాలు తీసుకుందామా?” సాలోచనగా చూస్తూ అడిగాడు మురళీ.
“ఉహూ! లాభం లేదు. వెంకటరావుని తక్కువగా అంచనా వేయకు. మనకున్న ఒకే ఒక ఆయుధం అతని రహస్యం. అది మనం వాళ్ళ ఊర్లో నలుగురు పెద్దల ముందు బయటపెట్టిన నాడు అతని రియాక్షన్‌ని ఊహించలేవు. అతను గట్టిగా అనుకుంటే రమణమ్మ ఉనికిని కనిపెట్టేయగలడు. అతనికి ఉన్న సర్కిల్ అలాంటిది. అది అతనికి తెలిసిననాడు రమణమ్మను ఎంత టార్చర్ పెట్టవచ్చో అంతా పెడతాడు. మున్నూట అరవై ఘడియలూ మనం రమణమ్మకి కాపలా కాయలేం.” మురళి ఆలోచనను ఖండిస్తూనే కారణాలు వివరించాడు శరత్.
శరత్ మాటలు వింటుంటే మురళికి ఆ ప్రమాదం కళ్ళ ముందు కనబడి వెన్ను జలదరించింది.”అతను అంత ప్రమాదకారి అని నేను ఊహించలేదు శరత్! ఆ రోజు నువ్వు చెప్పిన మాటలతో అతను స్వార్థపరుడనుకున్నాను గానీ ఇంతలాగ?” మురళి నివ్వెర పోయాడు.
“నేనూ ముందు అనుకోలేదు. రమణమ్మ విషయంలో గేప్ లేకుండా మనం వెంటనే యాక్షన్ లోకి దిగిపోయాం. తరువాత అతని గురించి నీరజ్ బాగా కూపీ లాగి ఇవన్నీ చెప్పాడు. రమణమ్మ చాలా తెలివిగా వ్యవహరించింది. ఆవేశంలో గానీ, బాధలో గానీ ఈ విషయం అక్కడైనా, లేక వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరైనా బయటపెట్టి ఉంటే ఏం జరిగేది నువ్వు ఊహించలేవు. అనుకోవడానికి కష్టంగా ఉన్నా రమణమ్మ చరిత్ర అక్కడికి ముగిసిపోయేది. అలా ఏమీ జరగకుండా భగవంతుడు ఆ అమాయకపు పిల్లని మీ దగ్గర చేర్చాడు. ఆ అమ్మాయికి ఆయుష్షు, భవిష్యత్తు రెండూ గట్టివని అనుకోవడానికి ఇదే పెద్ద నిదర్శనం అనుకో.” శరత్ అంతా వివరించాడు.
“సరే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయగలం? ఏమాలోచిస్తున్నావు?” మురళి అడిగాడు.
“నీ సర్కిల్లో ఎవరన్నా మంచి లాయర్ ఉన్నారా? మంచి క్లోజ్ అయిన వాళ్ళు ఉంటే మంచిది. నాకు తెలిసిన ఒకళ్ళిద్దరు ఉన్నారు. కానీ కేవల పరిచయమే. మనలాగే రమణమ్మ బాగు గురించి ఆలోచించేవాడు ఉంటే మంచిది.” శరత్ చెప్పాడు.
“రవళి వాళ్ళ కజిన్ శంకరరావు ఉన్నాడు. అతన్ని అప్రోచ్ అవుదాం. రవళి అంటే చాలా ఇష్టం. బాగా రియాక్ట్ అవవచ్చు. నువ్వు ఎప్పుడంటే అప్పుడు అతనికి ఫోన్ చేసి చెప్తాను. అతను ఇచ్చిన టైమ్‌కి వెళ్ళి కలుద్దాం.” అన్నాడు.
“సరే! సగం సమస్య తీరినట్లే అనుకో. లాయర్లు తలుచుకోవాలి గానీ ఇలాటి సమస్యలు ఎలాగన్నా సాల్వ్ చేస్తారు. తిమ్మిని బమ్మి చేస్తారు. అవతల ఆ వెంకటరావుకి ఇవన్నీ తెలియవు కాబట్టి వాడి పీడ రమణమ్మకి అతనే ఏదోలా వదలగొడతాడు.” శరత్ హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు.
మర్నాడు శంకరరావుని కలిసినపుడు అతను అంతా సానుభూతితో విని సేఫ్టీ కోసం “ముందు రమణమ్మకు తనకు ఎటువంటి సంబంధం లేదనీ, ఆ అమ్మాయి జీవితంలోకి తొంగి చూడనని వెంకటరావు ఒప్పుకున్నట్లు స్టాంప్ పేపరు మీద సంతకం పెట్టించుకుందాం. రమణమ్మకి మైనారిటీ తీరేసరికి అతని డిసీజ్ గురించి చెప్పి ఫేమ్లీ కోర్టు నుంచి విడాకులు తీసుకోవచ్చు, అవసరమైతే అప్పుడే పెళ్ళి అయినట్లు చెప్పడమో ఏదో చెయ్యవచ్చు.” అని భరోసా ఇచ్చాడు.
***
కొత్త స్కూల్లో కూడా రవళికి మరో జంట దీప, రమణమ్మల లాగే దొరికారు. వాళ్ళంత షార్ప్ కాకపోయినా సంధ్య, సీత కూడా బాగానే శ్రమించారు. వీళ్ళని బాగా తయారు చేసి తీసికెళ్ళడం అలవాటయింది. ఫస్ట్ రాకపోయినా ఏదో పొజిషన్ వచ్చేది. ఒకసారి శ్రీశ్రీ గారి గురించి వక్తృత్వం, శ్రీకృష్ణదేవరాయల వారి సాహితీ సేవ గురించి వ్యాసరచన వచ్చాయి. వాళ్ళిద్దరికీ స్కూల్ లైబ్రరీ నుంచి ఆ టాపిక్స్‌కి సంబంధించిన పుస్తకాలు ఇచ్చి ఇంపార్టెంట్ పాయింట్స్ అనుకున్నవి నోట్ చెయ్యమని చెప్పింది. స్కూల్ నుంచి వెళుతూనే పుట్టింటికి వెళ్ళిపోయింది. తండ్రి పుస్తకాలు చాలానే తెచ్చేసుకుంది గానీ, కొన్ని ఇంకా అక్కడే ఉండిపోయాయి. మురళీకి తను లేట్‌గా వస్తానని ఇన్ఫార్మ్ చేసి తల్లి ప్రేమను అనుభవిస్తూ, ఆవిడ ఇచ్చిన కాఫీ టిఫిన్లు సేవిస్తూ కావాలనుకున్న కొటేషన్స్, పద్యాలు అన్నీ నోట్ చేసుకుంది. ఇప్పటి వరకూ ఇది టచ్ చేయని టాపిక్.
మర్నాడు పిల్లలు నోట్ చేసుకుని వచ్చినది, తను వ్రాసుకుని వచ్చినది అన్నీ కలిపి మేటర్ ప్రిపేర్ చేసి వాళ్ళని తయారు చేసింది. ఇద్దరినీ తీసుకుని మండల స్థాయి పోటీలకు వెళ్ళింది. అక్కడ టీచర్స్, వచ్చిన టీచర్స్ లోంచి రవళిని, మరొకరినీ తమ స్కూల్ టీచర్‌తో కలిపి వక్తృత్వానికి న్యాయమూర్తులుగా ఉండమన్నారు. సంధ్య మాట్లాడినదానికి అందరూ టాప్ మార్క్స్ వేసారు. సంధ్యకి ఫస్టు వచ్చింది. రెండు పొజిషన్స్ మాత్రమే ఇవ్వాలనడంతో పొజిషన్స్ చెప్పలేకపోయినా రవళి మంచి మేటర్, బాగా చెప్పారనిపించిన పిల్లల స్కూల్స్ వివరాలు కనుక్కుని వాళ్ళతో బాగా ఎంకరేజింగ్‌గా మాట్లాడింది.
సంధ్యకు, సీతకు ఆశ్చర్యం కలిగింది. “మేడమ్‌కి మన స్కూల్ పిల్లలనే కాదు, ఎవరు బాగా చదివినా మెచ్చుకుంటారు.” అని కబుర్లు చెప్పుకున్నారు. వ్యాసరచనలో సీతకు సెకెండ్ వచ్చింది. రవళి లోపలకి వెళ్ళి రెండు పేపర్లూ చూసింది. ఖచ్చితంగా సీత వ్రాసిందే బావుంది. ఇద్దరి ప్రెజెంటేషన్ బావుంది. వాళ్ళు అంతకుముందు నాన్ డిటైయిల్డ్లో కృష్ణదేవరాయల మీద ఉన్న మేటర్ దాటి వ్రాయలేదు. అక్కడ అనవసరం చర్చ అని వచ్చేసింది. ఆ పేపర్స్ జిల్లా స్థాయికి పంపుతారని అక్కడినుంచి సర్టిఫికెట్లు వస్తాయని చెప్పారు. సీత చాలా అఫెండ్ అయింది. తనకి ఈ సారి ఫస్టు వస్తుందని ఎక్కువ ఆశ పెట్టేసుకుంది. “ఏంటి మేడమ్? ఇలాగ అయింది?” అని చిన్నబుచ్చుకుంది.
రవళి నచ్చచెప్పింది. “ఇప్పటికి మీరు నేను వచ్చాక మూడింటికి వెళ్ళారు. మూడింటిలోనూ ఏదో ఒక ప్రైజు వచ్చింది. కానీ ఎప్పుడూ గెలుపే మనలను వరించదు. అన్నింటికీ సిధ్ధం గానే ఉండాలి. అలా అని ప్రయత్న లోపం ఉండకూడదు. అయినా సెకెండ్ రావడం తక్కువేమీ కాదు. ఇంతక్రితం వక్తృత్వంలో సెకెండ్ కంటే హాఫ్ మార్క్ తక్కువలో థర్డ్, అంతకంటే హాఫ్ మార్క్ తక్కువలో ఫోర్త్ పోజిషన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పెర్మార్మెన్స్ కూడా బావుంది. అందుకే వాళ్ళని పలకరించి ప్రోత్సాహకరంగా మాట్లాడాను. నీలాగే నిరాశ పడతారేమో, మళ్ళీ పోటీలకు రారేమో అనిపించింది. అలా వాళ్ళు మానేయకూడదు అని ఏదయినా గిఫ్ట్ ఇస్తే బావుంటుంది అనిపించింది. అయినా ఏదో గిఫ్ట్ ఇవ్వడం ఎందుకు? వాళ్ళ స్కూల్స్, ఆ టీచర్స్ నాకు తెలుసు. నేనే పెర్సనల్ గా వాళ్ళకి శ్రీశ్రీ గారి మహాప్రస్థానం కొని పంపుతాను. అది వాళ్ళకి మంచి జ్ఞాపకంగా ఉండిపోతుంది.” రవళి ఆఖరి మాటలు తనకు తాను చెప్పుకున్నట్లు అంటుంటే సంధ్య, సీత ఎంతో ఆశ్చర్యపోయారు.
ఆ తరువాత నెలరోజులయిపోయాక సీత వ్రాసిన పేపరు సర్టిఫికేట్ వచ్చాయి. అక్కడ సెకెండ్ అని వ్రాసింది కొట్టేసి మండలం ఫస్ట్ అని ఉంది. సర్టిఫికేట్ కూడా సీత మండలం ఫస్ట్ అనే వచ్చింది. సీత పట్టలేనంత సంతోషాన్ని అనుభవించింది. అక్కడెవరో సరిఅయిన వాళ్ళు చూసారు అనుకుంది రవళి. మండలంలో వచ్చిన జడ్జ్మెంట్ రాంగ్గా ప్రూవ్ అయి తనకు ఇలా గెలుపు రావడం రెండోసారి అనుకుంది రవళి అంతకు ముందు రవితో జరిగిన సంఘటన తలుచుకుని.
***
అనుకున్నట్లుగానే రమణమ్మను ఒక తెలిసినావిడ ఇంట్లో ఉంచారు. ఆవిడ మురళీ స్నేహితుని భార్య. పేరు సత్యవతి. అతను అర్ధాంతరంగా యాక్సిడెంట్లో చనిపోయాడు. అతనిది ప్రైవేటు ఉద్యోగం. సత్యవతి కూడా ఏమీ చదువుకోలేదు. కానీ తన కాళ్ళ మీద నిలబడడానికి మార్గం కావాలంటే మురళీయే ఈ మార్గం చెప్పి కావలసిన ఆర్థిక సాయం చేసాడు. వాళ్ళ ఇల్లు వారసత్వంగా వచ్చిన పెద్ద ఇల్లు, పాతగా ఉంటుంది. ఇండివిడ్యువల్‌గా కూడా ఉండడంతో కేవలం ఎనమండుగురు పిల్లలుండేట్లు ఆ ఇంటిని రీ మోడల్ చేయించుకుని తనకి వచ్చిన వంటతో సత్యవతి మేనేజ్ చేస్తోంది.
రవళి రమణమ్మకి కావలసిన ప్రతీ చిన్న అవసరాన్ని చూసి అమర్చిపెట్టింది. రమణమ్మ కోరిక మీద రవళి బాగా తెలిసిన లేడీస్ టైలర్ రాణి దగ్గర రమణమ్మను చేర్చింది. ఉదయం మూడు గంటలు, సాయంత్రం రెండు గంటలూ పని చేయడానికి రమణమ్మ ఒప్పుకుంది.
రోజులు గడిచేకొద్దీ రమణమ్మ సిన్సియారిటీకి, కష్టపడే తత్వానికి రాణి చాలా సంతోషించేది. కాలేజీలో జాయిన్ అయేలోపల రాణియే కాకుండా అక్కడ కష్టమర్స్ కూడా రమణమ్మని గుర్తించారు. ఆ చిన్న వయసులో ఎంతో అంకిత భావంతో పనిచేసేది రమణమ్మ.
(ఇంకా ఉంది)
రాయప్రోలు సుజాతా ప్రసాద్ విశ్రాంత ఉపాధ్యాయిని. వీరి స్వస్థలం విజయనగరం. ప్రస్తుత నివాసం హైదరాబాద్. శ్రీ చాడ.లక్ష్మణమూర్తి, కళావతి దేవి గార్లు వీరి తల్లితండ్రులు. వీరి భర్త పేరు శ్రీ రాయప్రోలు సత్య ప్రసాద్. అమ్మాయి – మృదుల, వంశీకృష్ణ (అల్లుడు), ప్రహిత, శ్రీదస్తువన్ (మనుమలు); అబ్బాయి సిద్దార్థ, అనూష (కోడలు), విభాకర శ్రీప్రద్, విభాశ్రీ అనఘ. (మనుమలు).
సుజాతగారు ఎమ్.బియడ్., డిప్లొమా ఇన్ మ్యూజిక్ (వీణ) చేశారు. పుస్తకాలు చదవడం, రచనలు చేయడం, పాడడం, వీణ వాయించడం, త్రెడ్ వర్క్ తో ఆభరణాలు తయారు చేయడం వీరి ప్రవృత్తి.
వీరి కలం పేరు ‘సుప్రజ’. కథలు, నవలలు, వ్యాసాలు వ్రాశారు. ‘విధి విన్యాసం’, ‘తల్లిదండ్రులు’ బహుమతి పొందిన నవలలు. ‘గోవు మా లచ్మికి’, ‘యాత్ర’, ‘నాణేనికి రెండో వైపు’, ‘మనమెవరమని?’, ‘సరైన తండ్రి’, ‘చందన గంధి,’ ‘ముడుచుకున్న రెక్కలు’, ‘దేవతలే శపిస్తే’, ‘మార్పు’ మొదలైనవి వివిధ పోటీల్లో బహుమతి పొందిన కథలు.
