[శ్రీమతి రాయప్రోలు సుజాతా ప్రసాద్ గారి ‘మథనం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[వెంకటరావు దగ్గర నుంచి బయల్దేరి, వాళ్ళంతా రమణమ్మ వాళ్ళింటికి వెళ్తారు. మీ అమ్మాయి ఎక్కడుందో తెలుసా? అని నీరజ్ అడగగా, చక్కగా పెళ్ళి చేశామని, అత్తారింట్లో ఉందని చెప్తాడు రాజయ్య. అప్పుడు నీరజ్ వాళ్ళకి అసలు విషయం చెప్తాడు. చిన్నపిల్ల చదువుకుంటానని చెప్పినా వినకుండా, ఓ రోగిష్టివాడికిచ్చి కట్టబెట్టారని తిడతాడు. వెంకటరావు నుంచి వాళ్ళకేమీ ఇబ్బంది రాదని, పిల్ల తమ వద్ద సురక్షితంగా ఉందని, ఆమెకి భవిష్యత్తు ఏర్పాట్లు చేస్తున్నామనీ చెప్తాడు. ఇంటికి వచ్చకా, జరిగినదంతా భార్యకి చెప్పి, మిత్రుడిని అభినందిస్తాడు మురళి. రమణమ్మ ముగ్గురికీ దండం పెడుతుంది. తాము చెప్పినట్టు నడుచుకోవాలని శరత్ ఆమెను గట్టిగా హెచ్చరిస్తాడు. తను తెచ్చుకున్న డబ్బు, బంగారం శరత్‌కి ఇస్తుంది రమణమ్మ. వాటిని రవళి వద్ద ఉంచమంటాడు. రమణమ్మ ఫోన్ తీసేసుకుని అందులోని అవసరమైన సమాచరాన్ని తమ ముగ్గురుకీ పంపించుకుని, ఆ ఫోన్ లోని నెంబర్లన్నీ డిలీట్ చేస్తాడు. ఓ వారం తరువాత శరత్ మురళికి ఫోన్ చేసి కలవమంటాడు. రమణమ్మ కేసులోని చిక్కుముడి గురించి చెప్పి ఎవరైనా లాయర్ని కలవాలని అంటాడు. రవళి వాళ్ళ కజిన్ శంకరరావు అనే లాయర్ని కల్సి జరిగినదంతా చెప్తారు. ఆయన మార్గం సూచించి, భరోసా ఇస్తాడు. కొత్త స్కూల్లో కూడా రవళకి సంధ్య, సీత అనే జంట దొరుకుతారు. వాళ్ళని చదువులతో పాటు, పాఠ్యేతర అంశాలలోనూ ప్రోత్సహిస్తుంది. రవళిని సత్యవతి అనే ఆవిడ వద్ద ఉంచి, బాగా తెలిసిన టైలర్ రాణి వద్ద చేరుస్తుంది రవళి. కాలేజీలో చేరేలోపు రాణియే కాకుండా కష్టమర్స్ కూడా రమణమ్మ శ్రమని గుర్తిస్తారు. – ఇక చదవండి.]
ఆ రోజు స్కూల్‌కి వచ్చేసరికి సంధ్య పెళ్ళి వార్త తెలిసింది. స్టాఫ్ రూమ్‌లో సంధ్య పెళ్ళి శుభలేఖ ఉంది. రవళికి మళ్ళీ మనసులో బాధ ‘రెడ్డొచ్చాడు మొదలెట్టడం’ చందంలా.
మొదలయింది.. ఏ పిల్ల గురించి నిశ్చింతగా ఉండడానికి వీలు లేదు. ఎప్పుడు ఏ నిమిషంలో పెళ్ళంటారో తెలియని పరిస్థితి. తను పిల్లలందరికీ కూడా ఏదో టైమ్‌లో చదువు విలువ, స్వావలంబన వాటి గురించి చెప్తూనే ఉంటుంది.
తమ కాళ్ళ మీద తాము నిలబడడం, , ఆర్థిక స్వాతంత్య్రం ఉంచుకోవడం అబ్బాయిలకు ఎంత అవసరమో అమ్మాయిలకు కూడా అంతే అవసరమని ఎన్నోసార్లు క్లాస్‌లో చెప్తూ ఉంటుంది. కానీ పిల్లలందరికీ అది అంత త్వరగా అర్థమయే విషయం కాదు. ఆడపిల్లల్లో చాలామంది చిన్నప్పటినుంచి ఇంట్లో తమ పెళ్ళి విషయమే మాట్లాడుతూ ఉంటే విని దానికి ట్యూన్ అయిపోయిన వాళ్ళు, సిధ్ధపడిన వాళ్ళే ఎక్కువమంది. వైవాహిక జీవితం మీదున్న క్యూరియాసిటీ, సినిమాల వల్ల వచ్చిన హాఫ్ నాలెడ్జ్‌తో దానికోసం ఎదురు చూసే వాళ్ళు కూడా ఉండడం గమనించింది. అలాంటి వాళ్ళంతా సంతోషంగా ఎగురుకుంటూ పెళ్ళికి సిధ్ధమయిపోతుంటారు. రవళి మాటలు అర్ధం కావడానికి వాళ్ళకి టైమ్ పడుతుంది.
కానీ.. సంధ్య స్కూల్లో టెంత్ టాపర్. ఫస్ట్ రేంక్ వస్తుందని ఎక్స్పెక్టేషన్ ఉంది. వాళ్ళ అమ్మ, నాన్న కూడా స్కూల్‌కి వచ్చేవారు. టీచర్స్ని కలిసి సంధ్య గురించి కనుక్కునేవారు. సంధ్యని చదివిస్తామనే వారు. అలాంటిది తనకి పెళ్ళేమిటి? ఈ శుభలేఖల పర్వమేమిటి? రవళికి అర్థం కాలేదు. ఎన్ని సార్లు? ఎన్ని సార్లు ఈ సమస్య తన కెదురు వచ్చి తన మనసుని తూట్లు పొడుస్తుంది? ఊహకు అందడం లేదు. ముందు ఆత్రంగా డేట్ చూసింది. టెంత్ పరీక్షలయ్యాకనే.
ఈలోగా గీత మేడమ్ వచ్చారు. “చూసారా మేడమ్! సంధ్యకి పెళ్ళిట” అన్నారు.
“సంధ్య ఎంత బాగా సెటిల్ అవుతుందో అనుకున్నాను. ఆఖరికి తను కూడా ఈ దరిద్రపు దుష్టాచారానికి బలి అయిపోతోంది కదండీ.” కంఠం బొంగురు పోతుండగా అంది రవళి.
“మనం చెయ్యగలిగేది లేనపుడు ఎంత బాధపడీ ఏం ప్రయోజనమండీ! పదండి అసెంబ్లీకి వెళ్దాం. టైమయింది” గీతా మేడమ్ అన్నారు.
“కొంతలో కొంత ఊరట ఏంటంటే పూర్తిగా టెంత్ పరీక్షలయ్యాకే పెళ్ళి ముహూర్తం పెట్టారు. లేకపోతే ఈ పెళ్ళి హడావిడికి, పుట్టింటికి అత్తారింటికి మధ్య తిరగడానికే మొత్తం టైమ్ సరిపోను. ఈ టెంత్ కూడా ఏదో ఆర్డినరీగా, అత్తెసరు మార్కులతో పూర్తి చేసి ఉండేది. ఎంత తెలివైన వాళ్ళయినా పరీక్ష ముందు రివిజన్ కావాలి కదండీ.” గీతా మేడమ్‌తో బాటు అసెంబ్లీకి నడిచింది రవళి.
“పోనీండి. పెళ్ళి అయ్యాక చదువుతుందని మంచిగా ఆశిద్దాం.” గీతా మేడమ్ ఆశాజనకంగా అన్నారు. రవళి ఆవిడవైపు వింతగా చూసింది.
“మేడమ్! నా ఈ హైస్కూల్ సర్వీసులో ఎంతమందికి చదువు మధ్యలో పెళ్ళిళ్ళు జరగడం చూసాను! ఏ ఒక్కరూ కూడా హయ్యర్ స్టడీస్ చదవలేదు. చిన్న వయసులో అన్ని విషయాల్లో అప్టుడేట్గా ఉంటారు కానీ ఫేమ్లీ ప్లానింగ్ పాటించరు. లేత వయసు! పెళ్ళయిన ఏడాది లోపే బిడ్డని కని, వంటింటికి అంకితమయిపోతారు. ఇంకేం ఉంది సాధించేందుకు?” నిరాశగా అంది రవళి.
***
టెంత్ పరీక్షలు అయ్యాయి. ఇక స్పాట్ హడావిడి ఆరంభమైంది. స్పాట్ వేల్యువేషన్కి ఆరోజు రిలీవ్ అవుతుంటే ఒక లెటర్ వచ్చింది రవళికి. సంధ్య వ్రాసింది.
“మేడమ్! నాకు ఈ పెళ్ళి జరగడం మీకు ఇష్టం ఉండదని తెలుసు. నాకూ ఇష్టం లేదు. బాగా చదువుకుని ఉద్యోగం చేయాలనే ఉంది. కానీ అమ్మ, నాన్న వాళ్ళ బాధ చూడలేకే ఈ సంబంధం ఒప్పుకున్నాను. నేను మళ్ళీ చదువుతాను. అతను ఇంటర్ చదివాడు. అందుకే నాకు ఆశ ఉంది. అక్కడ వాళ్ళ ఇంటి ఎదురుగానే జూనియర్ కాలేజ్ ఉంది. నేను తప్పకుండా కాలేజ్‌లో జాయిన్ అయి వచ్చి మిమ్మల్ని కలుస్తాను. మిమ్మల్ని తప్పకుండా సంతోషపడేలా చేస్తాను.” అని ఉంది.
అలా జరిగితే అంతకన్నా ఆనందమా? చూద్దాం. ఏం జరుగుతుందో? పెళ్ళి కోసమని ఇరు పక్షాల వారూ అబధ్ధాలాడతారు. రమణమ్మ విషయంలో ఇది తనకు అనుభవమే కదా! అలా కాకుండా నిజంగానే చదివితే అదొక చరిత్ర అవుతుంది. అలా జరిగితే సంధ్య వాళ్ళ ఆయనకు, ఆ అత్తవారికి హారతులెత్తచ్చు అనుకుంది రవళి.
***
రవళి ఒక సెలవురోజున రమణమ్మను తల్లి దగ్గరకు తీసికెళ్ళింది. అప్పటికే ఫోన్లో చెప్పడం వలన రాజేశ్వరికి సంగతంతా తెలుసు. మంచి కబుర్లు చెప్పి, స్వీట్ చేసి పెట్టి, “ఇప్పుడున్న పట్టుదల నీలో ఎప్పటికీ ఉండాలని ఆశీర్వదిస్తున్నాను రమణమ్మా! కొంచెం సర్దుకున్నాక మళ్ళీ నీకు ఇదంతా విసుగు రావచ్చు. రవళి దగ్గర మొహమాటంగా అనిపించినా ఎలాంటి విషయమైనా నాతో షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే నీకు నేను అమ్మమ్మ లాంటి దాన్ని. నువ్వు నన్ను అలాగే పిలువు. మన ఇద్దరం కలిసి కోవెళ్ళకీ, సినీమాలకీ వెళ్ళచ్చు. ఏమంటావ్? వీలయినపుడల్లా వస్తూ ఉండు. మంచి పుస్తకాలు ఉన్నాయి. అవి కూడా కలిసి చదవుకోవచ్చు” అంది.
రమణమ్మ ఆవిడకి నమస్కరించింది.. రాజేశ్వరి మాటలకి, ఆవిడ ఇచ్చిన ధైర్యానికి రమణమ్మకి మనసు నిండిపోయింది. రవళి మేడమ్ ఆలోచనల వెనక ఆవిడ సంస్కారమే పునాది అనుకుంది. ఆ రోజంతా అక్కడ బాగా గడిపారు.
***
స్పాట్ అయిపోయాక స్కూల్‌కి వచ్చి జాయినవగానే రవళి దుర్గారావుకి కబురు పెట్టింది. అతనిని డాక్టర్ దగ్గరికి తీసికెళ్ళాలన్న మాట రవళి మర్చిపోలేదు. కానీ దుర్గారావు ఇంట్లో లేడనీ, విజయవాడ వెళ్ళిపోయాడని వాళ్ళ అమ్మ చెప్పింది. రవళికి నమ్మలేనట్లనిపించింది. ఆ డాక్టరు గారు అంత చెప్పారు. ఈ పిల్లాడికి ఏమీ పట్టలేదే! అనుకుంది అశాంతిగా.
స్కూల్ నుంచి ఆటో స్టేండ్ వైపు తిరిగి వస్తుంటే “మేడమ్ బావున్నారా?” అన్న పిలుపుకి రవళి తిరిగి చూసింది. సెవెన్త్ లోనే పెళ్ళి చేసుకున్న దేవి తన వైపు వస్తూ కనిపించింది. అప్పుడే నెల తప్పి పురిటికి వచ్చినట్లుంది. పెళ్ళికి ముందు వయసుకి మించి బలంగా ఎత్తుగా కనిపించే దేవి ఇప్పుడు చాలా బలహీనంగా కనిపిస్తోంది. పదమూడేళ్ళకే తల్లిదండ్రులు కట్టబెట్టిన సంసారం పిల్ల బలాన్ని, శక్తిని లాగేసిందని అర్థమయింది. ఒక్క పొట్ట తప్ప పిల్ల ఏమీ కనిపించడం లేదు. ఎనిమిది నెలల క్రింద పెళ్ళయి ఏడు నెలల కడుపుతో కనిపించిన విద్యార్థినిని ఎలా పలకరించాలో తెలియలేదు.
“ఏం దేవీ? ఎలా ఉన్నావు? అప్పుడే విశేషంతో తిరిగి వచ్చావే” అంది రవళి.
“పది రోజులయిందండీ. అమ్మ వాళ్ళు పురిటికి తీసుకొచ్చి. మిమ్మల్ని కలవాలని చాలా అనిపిస్తోంది. స్కూల్ కి రాలేకపోయాను. ఒకసారి గేట్ దగ్గర కొచ్చాను. ఎవర్నైనా కబురు పెడదాం. మీరు బయటికి వస్తే చూద్దామని. కానీ మీరు పేపర్లు దిద్దడానికి ఎల్లారని చెప్పారు. ఈ లోపల సెలవులొచ్చేసాయి. ఇక మిమ్మల్ని ఈ లోపల కలియలేననుకున్నాను. పోనీలెండి. ఇలాఅన్నా మిమ్మల్ని చూడగలిగాను.” అంది చిన్నగా, నిర్మలంగా నవ్వుతూ.
ఆ అమ్మాయికి తన మీద ఉన్న ప్రేమకు సంతోషించాలా? ఆ పిల్ల ఉన్న పరిస్థితికి బాధపడాలా? తెలియలేదు. అజ్ఞానం ఎంత సుఖాన్నిస్తుందో తెలిసింది.
“జాగ్రత్త దేవీ! ఆరోగ్యం జాగ్రత్త. చిన్న వయసులో నెల తప్పావు. డాక్టరు దగ్గరికి వెళ్తున్నావా? వాళ్ళు చెప్పినట్లుగా అన్నీ చెయ్యి. వెళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకో. అలా నిలబడిపోయావు.” అంది.
“ఫర్వాలేదండీ. ఇక్కడికి వచ్చేవరకూ మా అత్తారింట్లో అన్ని పనులూ నేనే చేసాను కదా! ఇలా నిలబడడం కష్టం కాదు. అలవాటే నండీ!” అంది.
అయ్యో! అయ్యో! అయ్యో! ఎలా ఈ కఠిన సత్యాలను అరిగించుకోవడం. ప్రస్తుతం చాలా ఇళ్ళలో చదువుకునే పిల్లలకు వాళ్ళు ఉండే దగ్గరికే తల్లులు అన్నీ అందిస్తుంటే ఈ చంటిది సంసార భారాన్ని, అత్తవారినీ తన చాకిరీతో మోస్తూ, మొగుడితో కాపురం చేస్తూ, ఓ పక్క ఎంతో బాధ్యత గల తల్లి పోస్టుకు రెడీ అయిపోతూ.. అసలు వీటన్నింటిలో దేవి అనే అమ్మాయికి అస్తిత్వమెక్కడుంది? అసలలా తన ఉనికిని వెతుక్కోవడమే తెలియని పరిస్థితి! రవళి మనసులో సంక్షోభం ఇంకా చల్లారనే లేదు.. దేవి వాళ్ళమ్మ వచ్చింది. “అమ్మా! మా రవళీ మేడమ్” అంది దేవి.
“వచ్చిన కాడనుంచి ఒకటే గింజుకుపోతోందమ్మా! మిమ్మల్ని సూడాలని. మొన్నోపాలి స్కూల్ కాడకే వచ్చేసింది. కానీ మీరు లేరంట. పోన్లెండి ఏదోలా కలిసినారు. సాలు.” అంటూ దేవి వైపు తిరిగి..
“పదయే సానా సేపయింది. కాసేపు నడుం వాలుద్దువు గానీ. మళ్ళీ ఆ ఎ.ఎన్.ఎమ్. వచ్చిందంటే నన్నంటాది.” అంది దేవితో.
“రాంబాబు ఎలా ఉన్నాడండి? అని అడిగింది రవళి. దేవీ వాళ్ళన్నయ్య రాంబాబు రవళి స్టూడెంట్ కాడు. అంతకు ముందు సంవత్సరం స్కూల్ ఫస్ట్ వచ్చినవాడు. తను ఎప్పుడూ స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్థికి ఆగష్ట్ పదిహేనుకి ఇచ్చే స్కాలర్షిప్ ఈ కొత్త స్కూల్లో అతనికి ఇచ్చింది. అదే పరిచయం. ఆ తరువాత అతనెప్పుడు వచ్చినా కనిపించి విష్ చేసేవాడు. తరువాత బిందూ టీచర్ మాటల్లో రాంబాబు, దేవి అన్నా, చెల్లెళ్ళు అని తెలిసింది. ఇద్దరు పిల్లలు చాలా తెలివయిన వాళ్ళే అని ముచ్చట పడింది. కానీ ఆ ముచ్చటకి దేవి పెళ్ళి ముచ్చటతో తెర పడిపోయింది..
“ఆడి కేటమ్మా! ఆడు బంగారం. సక్కగా చదువుతున్నాడు. పరీచ్చలయినాయి. మొదటేడు అయిపోయినట్టే.” అంది.
“దేవి మాత్రం బంగారం కాదా ఏమిటి? తనని చదివిస్తే ఇంకా ఎంత బావుండేదో..” అని ఇంకా రవళి ఏదో అనబోతుంటే..
“ఆడపిల్లలు సదువుల్లో బాగున్నా ఏటి లాబం? ఆళ్ళు ఉజ్జోగం సేసినా ఆ సంపాదన అత్తోరికే కానీ అందులో పైసా అయినా కన్నోరికి వస్తదా? మగపిల్లలు సదివితే మమ్మల్నెత్తుతారు. ఈ పిల్ల కూడా సానా, సానా బంగారమే. మేమనుకున్నట్లు అత్తారింట్లో మెరుస్తాంది. ఎవ్వరికీ ఎదురుసెప్పకుండా, ఆళ్ళు సెప్పినవన్నీ సేస్తూ ఎంత బాగా ఉందనుకున్నారు? మా అల్లుడికి కాస్త కోపమెక్కువే. ఒంటి మీద ఓ దెబ్బపడినా ఓర్సుకోయే అని సెప్పినా. అలాగే ఉంటది. ఇంకేటి కావాల? మాకు మంచి పేరు వస్తంది కదా!” అని దేవి చెయ్యి పట్టుకుని వెళ్ళడానికి సిధ్ధపడింది.
తల్లి చెప్తున్న మాటలకి దేవి రియాక్షన్ చూడాలనిపించింది కానీ తను మొహం, కళ్ళు రెండూ దించుకుని ఉండడంతో ఏమీ తెలియలేదు. తల్లి వెనకాలే వెళ్తున్న దేవిని చూస్తూ అలానే ఉండిపోయింది.
***
ఏదీ? స్వతంత్ర భారతం? ఇదేనా ఆకాశంలో సగమంటే! స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళయినా ఈ ప్రాంతాలతో బాటు ఆడపిల్లల బ్రతుకులు వెనుకబడే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ప్రాంతం కంటే కూడా వీళ్ళ జీవితాలే అభివృద్ధికి ఎన్నో యోజనాల దూరంగా ఉన్నాయి. తమకి ఏ లాభమూ లేదు కాబట్టి ఆడపిల్లను చదివించము అని నిర్ణయంలో కన్నవారుంటే.. ఎలా వాళ్ళు బాగుపడేది. ఒక్కసారి చదివించి చూస్తే కదా! ఏమవుతుందో తెలిసేది. తనకి తెలిసి చాలా మంది లేడీ టీచర్స్ తల్లిదండ్రులను తెచ్చి తమతో పెట్టుకున్నారు. తమ హెల్త్ కార్డ్‌లో వాళ్ళని డిపెండెట్స్గా కూడా ఉంచి ఆరోగ్య సమస్యలలో తోడు ఉంటున్నారు. కొంతమంది తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. కొంతమంది పక్కనే ఇల్లు తీసుకుని అక్కడ ఉంచి వాళ్ళ మంచి చెడు చూస్తున్నారు. వాళ్ళలో మగ సంతానం లేని వాళ్ళున్నారు. పెన్షన్ రాని వాళ్ళున్నారు. కొడుకు పట్టించుకోని వారున్నారు. ఆడవాళ్ళకి ఆర్థిక స్వాతంత్ర్యం ఇచ్చిన ఈ అధికారాన్ని చూసి పరిస్థితి మారుతోందని చాలా సంతోషించింది కూడా. కానీ కొన్ని ప్రాంతాలకే ఆ మార్పు పరిమితమనుకుంటే మనసు క్షోభిస్తోంది.
దేవుడా! రక్షించు నా దేశాన్ని!
ఆడపిల్లలని రక్షించ లేని చట్టాల బారినుండి!
దేవుడా! రక్షించు నా పల్లెల్ని!
మైనర్ బాలికా వివాహ వ్యవస్థ నుండి!
దేవుడా! రక్షించు ఈ ఆడ పిల్లల్ని!
తల్లిదండ్రుల బూజెక్కిన భావజాలం నుండి!
***
అప్పటికి రమణమ్మ వచ్చి నాలుగు నెలలయింది. శరత్ రమణమ్మని బాగా అబ్జర్వ్ చేసాడు. బాగానే స్థిరంగా ఉంది అని అనిపించింది. మధ్య, మధ్య శరత్ నర్సమ్మ, రాజయ్యలతో మాట్లాడుతున్నాడు. రమణమ్మ క్షేమ సమాచారం వాళ్ళకి, వాళ్ళ క్షేమం రమణమ్మకి అందిస్తున్నాడు. ప్రతీసారి రమణమ్మ మౌనంగా బింకంగా వింటుంది కానీ నర్సమ్మ, రాజయ్య గొంతులో, మాటల్లో కూతుర్ని చూడాలన్న కోరిక అంతర్లీనంగా వినిపిస్తుంటుంది. డైరెక్ట్‌గా అడగడానికి ధైర్యం ఉండదు. ఆసారి రమణమ్మను రవళి వాళ్ళింట్లో కలిసినపుడు, తన ఫోన్ లోంచి నర్సమ్మకి చేసి ఇచ్చాడు. రవళి లోపల గదిలోకి వెళ్ళి మాట్లాడుకోమని సైగ చేసింది.
నర్సమ్మ ఫోన్ లిఫ్ట్ చేసి “అమ్మా” అన్న రమణమ్మ గొంతు వినగానే “రమణా నువ్వేనా? నువ్వేనా? ఎలా ఉన్నావే అమ్మా? ఎన్నాళ్ళయిందే నీ గొంతుక విని” అని గట్టిగా ఏడ్చేసింది. ప్రపంచంలో ఎవరెంత ఆదరించినా, తల్లి దండ్రులతో ఎంత భేదాభిప్రాయాలు ఉన్నా వాళ్ళ దగ్గరున్న చేరిక, చనువు, ప్రేమ పిల్లలకు అమృతప్రాయంగానే ఉంటాయి. తల్లి మాటలు వినగానే రమణమ్మ పరిస్థితీ అదే. పైకి తల్లికి తెలియకుండా బిగ పట్టుకుంటోంది. కానీ శబ్దంతో పని లేని కన్నీళ్ళు మాత్రం ఆగనంటున్నాయి.
ముందు నర్సమ్మే తేరుకుంది. “రమణా! నువ్వెవరో సంగం వాళ్ళ దగ్గర ఉన్నావని పోలీసాయన చెప్పాడు. ఎలా ఉన్నావు? బువ్వ సయిస్తందా? ఏటోనే. మాకయితే కూడు నోట్లోకి ఎల్లనంటందే! కూకున్నా, పడుకున్నా ఏం సేస్తున్నా నీ మీదే మనసుంటది. ఏటి సేస్తున్నావో? ఎలా ఉన్నావో? అని ఒకటే మనసు పీకుతోందే. ఎట్టా ఉన్నావు? మాట్టాడమ్మా!” రుధ్ధమైన కంఠంతో ఆపింది నర్సమ్మ.
“నేను బావున్నానమ్మా! ఇక్కడొక హాస్టల్లో ఉంటున్నాను. భోజనం బావుంటుంది. నేను కాలేజీలో జాయిన్ అవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మళ్ళీ చదువుకోవాలనే కోరిక తీరుతోంది. నాన్న ఎలా ఉన్నాడమ్మ? ఒకసారి నాన్నకి ఫోన్ ఇవ్వు” రమణమ్మ అడగ్గానే రాజయ్య లైన్లోకి వచ్చాడు.
“నాన్నా! బావున్నావా? నీ ఒంట్లో ఎలా ఉంది? నీరసం తగ్గిందా?” రమణమ్మ ఆప్యాయంగా అడిగే సరికి రాజయ్యకి సంతోషం, ఏడుపు రెండూ ఒకదాన్ని తన్నుకుంటూ ఇంకోటి పైకి వచ్చినట్లనిపించింది.
“బావున్నాను తల్లీ. నువ్వు దగ్గరలేవన్న బెంగ అయితే ఉంటుంది. ఆ పోలీసాయన నువ్వు బావున్నావని చెప్పినా నీ మాట వింటే ఇంకా మనసుకి బావుంటది కదమ్మా!” రాజయ్య అన్నాడు.
“నిజమే నాన్నా! నాకూ అలాగే ఉంటుంది. కానీ పరిస్థితి వేరేగా ఉంది కదా! కొన్నాళ్లు అంటే ఈ పరిస్థితి చక్కబడేవరకూ మనకి ఈ దూరం తప్పదు. ‘వేట’ కని సముద్రం మీద ఇదివరకులా తరుచుగా వెళ్ళకు నాన్నా! మనకున్నది చాలు. నా సంగతులు అమ్మకి చెప్పాను. నీకు చెప్తుంది. ఉంటాను. మళ్ళీ ఎప్పుడు వీలయితే అప్పుడు మాట్లాడతాను.” చెప్పింది రమణమ్మ.
“మావు అనుకున్నపుడు నీతో మాట్లాడడానికి వీలయితే బావుండును రమణా!” నర్సమ్మ అంది.
“కుదరదమ్మా! కొన్నాళ్లు ఇంతే. ఇద్దరూ జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యాలు జాగ్రత్త.” చెప్పవలసినది చెప్పి ఫోన్ కట్ చేసింది.
తొందరగా పది నిమిషాలలోపే తను హెచ్చరించకుండా కాల్ ముగించిన రమణమ్మను కళ్ళతోనే ప్రశంసించాడు శరత్.
(ఇంకా ఉంది)
రాయప్రోలు సుజాతా ప్రసాద్ విశ్రాంత ఉపాధ్యాయిని. వీరి స్వస్థలం విజయనగరం. ప్రస్తుత నివాసం హైదరాబాద్. శ్రీ చాడ.లక్ష్మణమూర్తి, కళావతి దేవి గార్లు వీరి తల్లితండ్రులు. వీరి భర్త పేరు శ్రీ రాయప్రోలు సత్య ప్రసాద్. అమ్మాయి – మృదుల, వంశీకృష్ణ (అల్లుడు), ప్రహిత, శ్రీదస్తువన్ (మనుమలు); అబ్బాయి సిద్దార్థ, అనూష (కోడలు), విభాకర శ్రీప్రద్, విభాశ్రీ అనఘ. (మనుమలు).
సుజాతగారు ఎమ్.బియడ్., డిప్లొమా ఇన్ మ్యూజిక్ (వీణ) చేశారు. పుస్తకాలు చదవడం, రచనలు చేయడం, పాడడం, వీణ వాయించడం, త్రెడ్ వర్క్ తో ఆభరణాలు తయారు చేయడం వీరి ప్రవృత్తి.
వీరి కలం పేరు ‘సుప్రజ’. కథలు, నవలలు, వ్యాసాలు వ్రాశారు. ‘విధి విన్యాసం’, ‘తల్లిదండ్రులు’ బహుమతి పొందిన నవలలు. ‘గోవు మా లచ్మికి’, ‘యాత్ర’, ‘నాణేనికి రెండో వైపు’, ‘మనమెవరమని?’, ‘సరైన తండ్రి’, ‘చందన గంధి,’ ‘ముడుచుకున్న రెక్కలు’, ‘దేవతలే శపిస్తే’, ‘మార్పు’ మొదలైనవి వివిధ పోటీల్లో బహుమతి పొందిన కథలు.
