Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మథనం-18

[శ్రీమతి రాయప్రోలు సుజాతా ప్రసాద్ గారి ‘మథనం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[ఒక రోజు సంధ్య తల్లిదండ్రులు రవళిని కలవడానికి వస్తారు. అత్తవారింటికి వెళ్ళనంటోందని, తనకి నచ్చజెప్పమని, మీ మాటంటే తనకి గురి అని బ్రతిమాలుకుంటారు. అసలు ఎందుకు వెళ్ళనంటుందో కారణం కనుక్కున్నారా అని అడిగితే, సంధ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతోందని అంటారు. సంధ్యని పిలిపించి మాట్లాడుతుంది. బదులుగా మీరేం చేయగలరు, నన్ను ఆ పాడు జీవితం నుంచి తప్పించి మళ్ళీ చదివించగలరా అని దూకుడుగా ప్రశ్నిస్తుంది సంధ్య. హాతాశురాలైన సంధ్య, తనకు ఆ అధికారం, అవకాశం లేవని అంటూ, సంధ్య ఆశించిన కోణంలో సంధ్య సమస్య తీర్చలేనపుడు ఆమెని ప్రశ్నించకూడదని అని, ఇంకేదైనా మాట్లాడుకుందాం అని అంటుంది. సంధ్య వెక్కి వెక్కి ఏడుస్తుంది. తనని వదిలేయవద్దని సరైన గైడెన్స్ ఇచ్చి దారి చూపించమని వేడుకుంటుంది. ఆ తర్వాత తన అత్తవారింటి గురించి, భర్త గురించి చెప్తుంది. ఏదో ఒకటి చేద్దాం బాధపడకు అని భరోసా ఇస్తుంది రవళి. ఒకరోజు రమణమ్మ దీప గురించి చెప్పి, వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి శరత్ అనుమతి అడుగుతుంది. దీప కూడా రవళి స్టూడెంటే అయితే, రవళి ఆ మాట ఎందుకు చెప్పలేదో శరత్‌కి అర్థం కాదు. మర్నాడు మాటల సందర్భంలో బాగా చదివే ఇతర పిల్లల గురించి ప్రస్తావిస్తే, దీప గురించి చెప్పి, ఆమె ఇప్పుడేం చేస్తోందో తనకి తెలియదని రవళి శరత్‍తో చెబుతుంది. మరుసటి ఆదివారం రమణమ్మ దీప ఇంటికి వెళ్తుంది. మంగమ్మ చూపించిన ఆప్యాయతలో తన తల్లిని గుర్తు చేసుకుంటుంది. ఆనందంగా గడిపి సాయంత్రానికి హాస్టల్‌కి వచ్చేస్తుంది. సెప్టెంబరు 5వ తేదీ కాలేజీలో రమణమ్మ స్టేజ్ మీద మాట్లాడినది, ప్రైజ్ తీసుకుంటున్నది వీడియో రికార్డు చేయిస్తాడు శరత్. ఆశ్చర్యపోయి, ఆ వీడియోలను రమణమ్మ అమ్మానాన్నలకి, మురళికి, రవళికి పంపుతాడు. వాళ్ళు కూడా సంతోషిస్తారు. సంధ్యలో చదువు పట్ల విపరీత ధోరణికి పెరిగిపోతుంది. ఆమె తల్లిదండ్రులు బాధపడుతుంటారు. సంధ్య సమస్య ఎలా పరిష్కరించాలో అర్థం కాక, తల్లి సలహా తీసుకుందామని, రాజేశ్వరి దగ్గరకు వెళ్తుంది రవళి. – ఇక చదవండి.]

“సంధ్య, మీరేం చేయగలరు? నన్ను చదివిస్తారా? అని అడిగేసరికి నోట మాట రాలేదమ్మా! ఇప్పటికే రమణమ్మ బాధ్యత ఉంది. మురళీకి ఈ విషయంలో ఇక టెన్షన్ ఇవ్వలేను. సంధ్య మామూలుగా అయి, తన జీవితం చక్కబడడానికి ఏదన్నా ఉపాయం ఉందా?” తల్లి ఒడిలో తలపెట్టుకు పడుకున్న రవళి అశాంతిగా అడిగింది.

“చాలా వరకూ సమస్య వచ్చినపుడే దాని పరిష్కార మార్గాన్ని కూడా తీసుకు వస్తుంది. కానీ అది బాహాటంగా కనిపించదు. మనం జాగ్రత్తగా అన్వేషించాలి. కాస్త టైమ్ తీసుకుని దీన్ని మనం పట్టుకుందాం. సరేనా? నువ్వు ధైర్యంగా నిశ్చింతగా ఉండు.” రాజేశ్వరి తన మాటలతో రవళి మనసులోని అశాంతి పోగొట్టొంది. ‘అటు మురళి, ఇటు తల్లి, ఇద్దరూ భగవంతుడు తనకు ప్రసాదించిన వరాలు’ అనుకుంది రవళి. అటు తరువాత వారం, పది రోజుల పాటు ఫోనులోసాగిన అన్వేషణలో వాళ్ళకి కొన్ని మార్గాలు దొరికాయి.

***

మళ్ళీసారి సంధ్య వచ్చినప్పుడు సంధ్య మాటల్లో కాస్త నిలకడ రావడం గమనించింది. దాంతో కాస్త రిలీఫ్‌గా అనిపించింది. “సంధ్యా! ఈ మధ్య మీవారు వచ్చారా?” అని అడిగింది తన రియాక్షన్ చూడాలన్నట్లుగా.

“అతను నన్ను చూడడానికి రావడం ఏంటి మేడమ్! అతనికి నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు.. పెళ్ళాం అంటే వాళ్ళ డిక్షనరీలో డెఫినేషన్ వేరు లెండి. అది తలుచుకుంటే, కాదు జ్ఞాపకం వస్తే బతికుండగానే చచ్చి పోయినట్లనిపిస్తుంది. నా జీవితం అయిపోయినట్లనిపిస్తుంది. ఆ మధ్య లైబ్రరీలో చూసిన పాత చందమామలో బేతాళుడి కథలో బొమ్మలో లాగ నా శవాన్ని నేనే మోసుకు తిరుగుతున్నట్లుంటుంది. అసలు..”

ఇంకేదో అనబోతున్న సంధ్య నోటి మీద చెయ్యి వేసి ఆపేసింది. ఈ పసిగొంతులో ఇంత బరువైన మాటలు ఎలా వస్తున్నాయి?

“ఒద్దొద్దు. ఎప్పుడూ అలాంటి కన్‌క్లూజన్‌కి రాకూడదు. అయిపోయిందనుకోవడానికి లేదు. ఏదో ఒకటి చెయ్యడానికి ప్రయత్నం చెయ్యాలి. ఇంత చిన్న వయసుకి ఇలాంటి మాటలు తగినవి కావు.. మనం ఒకలా జీవితం ఉండాలి అనుకుంటాం, కానీ వేరే రకమైన జీవితం వస్తుంది. అలాంటప్పుడు దానిలో పాజిటివ్స్ చూడడానికి, ఆ జీవితాన్నే ప్రేమించడానికి ప్రయత్నించాలి” ఓ విధమైన అధికారంతో ధైర్యంతో, సంధ్యను దెబ్బలాడింది రవళి.

“పోనీ మేడమ్! మీరు చెప్పండి. నేను ఏం చేయగలను?” సంధ్య ఆశగా అడిగింది.

“చదువుకు లక్ష్యం, మొదటిది జ్ఞానం. రెండవది అది పది మందిలో తెచ్చే గుర్తింపు. మూడవది అది ఇచ్చే ఆర్థిక స్వాతంత్ర్యం. జ్ఞానం కేవలం సర్టిఫికేట్ చదువు వల్లనే వస్తుందనుకోకూడదు. అది మనం చాలా రకాలుగా ఆర్జించగలం.. ఇక గుర్తింపు, ఆర్థిక స్వాతంత్ర్యం వేరే విధంగా ఎలా సాధించగలమో ఆలోచించాలి.” రవళి ఆశాజనకంగా చెప్పింది.

“ఎలా మేడమ్? మార్గం చెప్పండి.” సంధ్యలో కుతూహలం మొలకెత్తింది.

రవళి ఫోన్‌లో యూ ట్యూబ్‌లో థ్రెడ్ వర్క్‌తో గాజులు చేయడం చూపించింది. “వీటికి ప్రస్తుతం చాలా డిమాండ్ ఉంది. నువ్వు మార్కెట్ కంటే కొంచెం తక్కువ కాస్ట్‌తో ఇస్తే.. అందరూ తీసుకుంటారు. నేను దీనికి సంబంధించిన సామాను రేపు తెస్తాను. స్కూల్ అయాక ప్రయత్నిద్దాం. నువ్వు ఎంత త్వరగా ఈ వర్క్ ఫైన్‌గా చేయడం నేర్చుకుంటే అంత త్వరగా నీకు గుర్తింపు, ఆర్థిక స్వాతంత్ర్యం వస్తాయి.. ఇంతే కాదు. మన ఊరికి బ్యాంక్ వస్తోందని విన్నాను. ఆ మేనేజర్‌తో నేను మాట్లాడతాను. అక్కడ డిఫరెంట్ ఫారమ్స్ నింపే పని ఉంటుంది. అది నేర్పుతాను. చదువు రాని వాళ్ళు చాలా మంది బ్యాంక్‌కి వస్తారు. వాళ్ళకి కావల్సిన ఫారాలు నింపుతూ ఉండాలి. దానికి కూడా కొంత అమౌంట్ వస్తుంది. అక్కడికి వెళ్ళి చూడు. నీకు ఏది నచ్చితే అది చేయి.” రవళి మాటలు సంధ్యకు ఊపిరి పోసాయి. ఆ కళ్ళలో మళ్ళీ ఆశ నిండింది.

ఒక వారం రోజుల పాటు స్కూల్ వదిలాక ఇద్దరూ కలిసి బాంగిల్స్ చేసారు.. ముందు తడబడినా సంధ్య తరువాత చాలా తొందరగా పుంజుకుంది. ఇక వేరే ఆలోచన లేకుండా ప్రయత్నించడంతో పదిహేను రోజుల్లో రెండు జతలు చేయ గలిగింది. మొదట స్టాఫ్ లోనే ఇద్దరు టీచర్స్ సంధ్యని ఎంకరేజ్ చేసినట్లుంటుందని తీసుకున్నారు. ఆ డబ్బులు చేతితో పట్టుకుని క్రింద కూలబడిపోయి సంధ్య ఆనందంతో ఏడ్చింది. అదే శుభారంభం! తరువాత సంధ్య ఆరోగ్యం కుదుట పడింది. తనని కాపురం పేరుతో తొందర పెట్టద్దని, తనే వెళ్ళే రోజు వస్తుందని రవళి చెప్పడంతో సంధ్య తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. సంధ్యకి ఊర్లో గుర్తింపు, డబ్బు కూడా వచ్చాయి. ఒక పూట బ్యాంక్‌కి కూడా వెళ్ళి వస్తుండేది. రవళి తెచ్చి ఇచ్చిన పెర్సనాలిటీ డెవలప్‌మెంట్ పుస్తకాలు చదివేది. తనకు ఇష్టమైన పనులు చేయడమే టానిక్‌గా పని చేసి పూర్వపు సంధ్యలాగ మారింది.

***

తరువాత రవళి థ్రెడ్ వర్క్ ఆర్నమెంట్స్ ఒక ట్రెండ్ అని, ఆ ఫేషన్ ఎన్నాళ్ళుంటుందో తెలియదు కాబట్టి ఎప్పటికీ డిమాండ్ ఉన్నది నేర్చుకోవాలని కొవ్వొత్తుల తయారీ కూడా నేర్చుకోమంది. పల్లెల్లో కరెంటు కోత ఉంటుంది కాబట్టి, కొవ్వొత్తులకి ఎప్పుడూ గిరాకీ ఉంటుందంటే సంధ్య అది కూడా నేర్చుకుంది. మరో ఆరు నెలల్లో పూర్తిగా చిన్న కుటీర పరిశ్రమ లాగ సంధ్య బిజినెస్ విస్తరించింది.

సంధ్య నిలకడ, సంపాదన అన్నీ తెలిసిన అత్తవారే కాపురానికి పిలిచారు. సంధ్య తల్లిదండ్రులు రవళి దగ్గరకు పరుగున వచ్చి సంధ్యని ఒప్పించమని అడిగారు.

“సంధ్యకి ఆ మెచ్యూరిటీ వచ్చిందనే నా నమ్మకం. నిర్ణయం సరిగ్గానే తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. తనేమంటుంటుందో ముందు చూడండి. ఆ తర్వాత ఆలోచిద్దాం.” అంది.

అత్తవారు వచ్చినపుడు సంధ్య భయపడడమో, చికాకు పడడమో చేయలేదు. వాళ్ళతో చాలా బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడింది. “నాకు రావడానికి ఏమీ అభ్యంతరం లేదు. కానీ పూర్వంలా కాకుండా నాకు ఆ ఇంట్లో స్వేచ్ఛ నివ్వాలి. అది జైలులా కాక నా ఇల్లులాగ అనిపించాలి. నా ఇష్టాల్ని గౌరవించాలి. నేనిప్పడు చేస్తున్న ఈ పనులకు అడ్డు రాకూడదు. నన్ను ఆ ఇంట్లో బానిసగా కాక ‘మనిషి’గా బతకనివ్వాలి. అలా అయితే వస్తాను. మీరు మాట తప్పితే మీ కోడలు ఇక మీ ఇంటికి రాదు. మిమ్మల్ని వదిలేసి నా దారి నేను చూసుకుంటాను.” అంది. వాళ్ళకి అందులో వినపడ్డ హెచ్చరిక అర్థమయింది. సంపాదించే కోడలి మాటకి గౌరవం వచ్చింది. వాళ్ళు ఒప్పుకున్నారు.

సంధ్య తల్లిదండ్రులు సంధ్యతో కూడా కలిసి స్కూల్‌కి వచ్చి విషయం చెప్పారు. “మేడమ్! మమ్మల్ని క్షమించండి. మొత్తానికి మా కూతుర్ని, దాని కాపురాన్ని కూడా దారిలో పెట్టారు. మీ ఋణం జన్మలో తీర్చుకోలేం.” అన్నారు కన్నీళ్ళతో.

సంధ్య రవళి కాళ్ళకి నమస్కరించి “అమ్మ వాళ్ళు చెప్పినట్లు నాకు మాటలు కూడా రావడం లేదు మేడమ్! ఏ మాట చెప్పినా అది మీరు చేసినదానికి సరిపోదనిపిస్తోంది. ఏదో పుస్తకంలో చదివాను. కృతజ్ఞత మాటల్లోకి వస్తే పలచబడిపోతుందట. అందుకే మీకు ఏమీ చెప్పలేను. కానీ జీవితాంతం మిమ్మల్ని మరచిపోలేను.” అంటూ తను స్పెషల్‌గా చేసిన గాజులు, ఇయర్ రింగ్స్, హారం సెట్ రవళికి కానుకగా ప్రెజెంట్ చేసింది.

“చాలా బాగుందమ్మా! మంచి కలర్ కాంబినేషన్! నేను ఈ కాంబినేషన్లో వెతికి చీర కొనుక్కుని వీటన్నింటితో నీకు ఫొటో షేర్ చేస్తాను. సరేనా?” అంది రవళి నవ్వు మొహంతో..

తొణికిపోయే జీవన స్వప్నాన్ని ధైర్యంతో ఒడిసి పట్టిన సంధ్య, ఆ కల నిజమయి వెన్నెలగా జీవితంలో పరుచుకుంటుందన్న నమ్మకంతో కాపురానికి వెళ్ళింది.

***

నారాయణ కూడా తరువాత వచ్చి రవళిని కలిసాడు. స్కూల్‌లో ఉన్నప్పటి కంటే చాలా బాగా వినయంగా మాట్లాడాడు. తన పరిస్థితి అంతా చెప్పాడు.

“మేడమ్! టెంత్ అయ్యాక ఇంటర్‌లో జాయిన్ అయ్యాను. సెకెండ్ ఇయర్‌లో ఉంటుండగా నాన్నగారు పోయారు. ఇంటర్‌తో ఏం జాబ్ వస్తుంది? ఆర్మీ కైనా, నేవీ కైనా ప్రయత్నిద్దామంటే అమ్మ నొక్కర్తినీ వదలలేను. అందుకే ఆటో తీసుకుని నడుపుతున్నాను. సంపాదన బాగానే ఉంది. అమ్మ సంతోషంగా ఉంది.” తను తీసుకున్న నిర్ణయం వెనుక కారణాలు చెప్పాడు.

“చాలా మంచి మాట నారాయణా! తల్లిదండ్రులను గూర్చి ఆలోచించే వారు బాగుపడి తీరుతారు. నారాయణా! నువ్వు ఆర్మీ సెలక్షన్స్‌కి వెళ్తూ ఉండు. ఆటో నడపడం ప్రస్తుతానికి తప్ప పెర్మెనెంట్‌గా నీ లక్ష్యం కాకూడదు. సెలక్షన్ వచ్చిందనుకో, ట్రైనింగ్ కొన్ని రోజులే ఇబ్బంది. తరువాత నువ్వెక్కడ ఉంటే అక్కడకే అమ్మని తీసికెళ్ళిపోవచ్చు. అప్పుడు నీ సెటిల్మెంట్ కూడా బావుంటుంది.” నారాయణను మెచ్చుకుంటూనే తను చెయ్యాల్సిన పని కూడా చెప్పింది.

“మిమ్మల్ని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. మేడమ్! మీరు క్లాస్‌లో చెప్పిన మాటల్ని నిజ జీవితంలో ఆచరించి చూపుతున్నారు. మీ మీద నమ్మకంతో వచ్చిన రమణమ్మను ఇంతలాగ ఆదుకున్నారు. ఒక ఆడపిల్ల బాధ్యత తీసుకోవడం అంటే మాటలు కాదు కదా!” అన్నాడు.

“ఇందులో నాదేంలేదు. నారాయణా! నా ఊహలకి, ఆశలకి వాస్తవ రూపం ఇవ్వడానికి సర్ చాలా శ్రమిస్తారు. ఆయనదే క్రెడిట్ అంతా. సమస్యని ఆయన ముందు పెట్టడంతో నా పని అయిపోతుంది. ఆ సమస్య పరిష్కారానికి, నా కలో, కోరికో, సాకారం చెయ్యడానికి ఆలోచన అంతా ఆయనదే. ఆయన సహకారమే లేకపోతే నేనేమీ చేయలేను నారాయణా!” అంది రవళి.

“ఈసారి వచ్చినపుడు సర్‌ని కూడా కలిసి వెళ్తాను మేడమ్! ఇంకో రిక్వెస్ట్ మేడమ్! మా కజిన్ ఈ ఊర్లోనే ఉందండి. రమణమ్మను ఈసారి పండుగకో, ఆదివారమో అక్కడికి తీసికెళ్తానండి” అని అడిగాడు.

“అయ్యో! అలాగే తీసికెళ్ళు. ఆ అడ్రెస్ నాకు ఇవ్వు. బయలుదేరేటప్పుడు, మళ్ళీ హాస్టల్‌లో వదిలిపెట్టాక నాకు కాల్ చేసి చెప్తుండు. ఒక పరాయి ఆడపిల్ల బాధ్యత తీసుకున్నపుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. మరోలా అనుకోకు.” అంది.

రమణమ్మకి సత్యవతితో చనువు పెరిగాక పండగలకి అప్పడప్పుడు హాస్టల్ లోనే ఉండిపోయేది. ఒకోసారి నారాయణ వాళ్ళ కజిన్ ఇంటికి, రాజేశ్వరి దగ్గరకీ వెళ్ళేది. దీప వాళ్ళిల్లు సరేసరి. మెల్ల మెల్లగా రమణమ్మ అక్కడ జీవితానికి అలవాటు పడింది.

ఫస్టియర్ రమణమ్మ కాలేజ్ సెకెండ్ వచ్చింది. అందరికీ ఆనందం కలిగింది. పరిస్థితులను ఎదిరించి పట్టదలగా చదివిన రమణమ్మను అందరూ గ్రీట్ చేసారు. “దీప సంగతి కూడా తెలిస్తే బావుండును.” అనుకునేది రవళి.

ఆ శుభ సందర్భంలో నర్సమ్మని, రాజయ్యని విజయనగరం రప్పించి రమణమ్మను చూపించాడు శరత్. ముగ్గురి సంతోషానికి హద్దులు లేవు.

“బాబూ! మా పిల్లని తీసికెళ్ళి బట్టలు కొంటాం. చాలా రోజులయిపోయింది.” అడిగింది నర్సమ్మ.

“ఈ రోజంతా మీదే. ఎలా గడుపుతారో మీ ఇష్టం. కానీ రమణమ్మా! మన షరతులు మర్చిపోకూడదు సుమా! సాయంకాలం అమ్మా వాళ్ళని మీ ఊరు పంపేసి నాకు ఫోన్ చెయ్యి. వస్తాను.” శరత్ చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆరోజు వాళ్ళు ముందు కోవెలకు వెళ్ళి, తరువాత షాపింగ్ చేసి, సినిమాకి వెళ్ళి బాగా గడిపారు. అది మొదలు వాళ్ళు ప్రతీ రెండునెలలకీ కలుసుకునే ఏర్పాటు జరిగింది.

***

రమణమ్మ ఫస్టియర్ పూర్తి అయేసరికి దీప ఇంటర్ పూర్తయింది. కాలేజీకి టాపర్ అయింది. యమ్.సెట్ పరీక్షలప్పుడు దీపకు పచ్చ కామెర్లు రావడంతో అనుకున్నట్లు రేంక్ రాలేదు. వైట్ కార్డ్ పెడితే తనకు రీఎంబర్స్‌మెంట్‌లో సీట్ వస్తుంది. కానీ మంగమ్మ దగ్గర వైట్ కార్డ్ గానీ, రేషన్ కార్డ్ గానీ లేవు. అన్నీ స్వంత ఊర్లో చలపతి దగ్గర ఉన్నాయి. అందువలన ఫీజ్ రీఎంబర్స్‌మెంట్‌ స్కీమ్‌లో ఇంజనీరింగ్‌లో దీపకి సీట్ రాలేదు. గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఫీజ్ చాలానే ఉంది. దీప తెలివితేటలో, మంగమ్మ ధైర్యమో పని చేయని సమయం వచ్చింది. బంగారం పెట్టి బ్యాంక్ లోన్ తీసుకున్నారు. అయినా చాలలేదు. మంగమ్మ కన్నీరు మున్నీరయింది. పడిన కష్టం వృథా పోతుందన్న ఆలోచన ఇద్దరికీ నిద్ర పట్టకుండా చేసింది. తను దీపని తీసుకుని వచ్చాక ఇంత బాధ ఎప్పుడూ పడలేదు. కాళ్ళూ, చేతులూ ఆడని పరిస్థితి అయిపోయింది మంగమ్మకి.

దీప తమకి బాగా తెలిసిన టీచర్ మూర్తి గారి ఇంటికి వెళ్ళి సమస్య అంతా వివరించింది. తన అవసరమూ, ఆయన చేయవలసిన సహాయం గురించి అభ్యర్ధించి వచ్చింది. ఆయన రెండు రోజుల్లో ఏ సంగతీ చెప్తానన్నారు. ఆ రెండు రోజులు క్షణాలు యుగాలుగా గడిపిన వాళ్ళ ఇద్దరికీ మూర్తిగారు మంచి మాట చెప్పారు. వాళ్ళ హృదయాలు చల్లనయ్యాయి. దీపకి ఈ సంవత్సరమే కాకుండా ప్రతీ సంవత్సరం అమౌంట్ అడ్జెస్ట్ చేసే డోనర్ దొరికారు.

దీప ఇంజనీరింగ్ కంప్యూటర్స్ బ్రాంచ్‌లో జాయిన్ అయింది. మంగమ్మకి తన ఆదాయం పెంచుకోవాల్సిన అవసరం అర్థమయింది. తన ఆదాయాన్ని పెంచుకునేందుకు ‘అరవిందో’లో పనిచేసే ఐదుగురికి వండి పెట్టేందుకు ఒప్పుకుంది. ఉదయం కూరగాయల వ్యాపారం, తరువాత తను ఒప్పుకున్న కొత్తపని. ముందు కొంచెం ఇబ్బంది పడినా, తరువాత టైమ్ మేనేజ్మెంట్ తెలిసింది. కానీ మంగమ్మకి విశ్రాంతి తక్కువయింది. దీపని చదివించాలనే తీవ్రమైన కోరిక ముందు ఈ శ్రమ లెక్కకు రాలేదు. దీప కూడా ఇంటిపనిలో మంగమ్మకి సాయం చేస్తూ తనకి విశ్రాంతి దొరికేలా చూసేది.

***

ఆ రోజు స్టాఫ్ రూమ్‌లో బిందూ “మేడమ్! ఈ సంగతి తెలుసా? ఈ రోజే నైన్త్ క్లాస్ సరోజకి పెళ్ళి. వాళ్ళ ఊరు మనం వచ్చే దార్లోనే కదా! టీచర్స్ ఎక్కడ ఏమంటారో అని కాబోలు మన ఆటోలన్నీ వచ్చేసాక స్కూల్ టైమ్ అయ్యాక వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టారుట. ఎంత కుళ్ళు తెలివితేటలో చూడండి! డి.ఇ.ఒ. ఆఫీసుకి వెళ్ళి లేట్‌గా వచ్చిన మన మేథ్స్ సార్ చెప్పారు” అన్నారు.

రవళి ఆశ్చర్యంగా “క్రితం లక్ష్మివారమే మిగతా పిల్లలతో తనని విజయనగరంలో జిల్లాస్థాయి ప్రైజ్ అందుకునే ఫంక్షన్‌కి తీసికెళ్ళాను. వాళ్ళ మామయ్య ఆటో లోనే వెళ్ళాం. అస్సలు చెప్పనేలేదండి. ఎక్కడా బయట పడకుండా అంత గుంభనగా ఎలా ఉందో?” అంది.

“ఆ మావయ్య తోనే పెళ్ళండి. సరోజ పుట్టినపుడే నిర్ణయమైపోయిన సంబంధం. పెద్ద వాళ్ళ జాగ్రత్తలు ఇవన్నీ.” అంది పి.ఇ.టి. శైలజ.

“ఆ అబ్బాయి బాగానే ఉన్నాడు. ఇద్దరి జంట బాగానే ఉంది. కానీ నిశ్చయమైపోయిన సంబంధం కొన్నాళ్ళాగి చేసుకుంటే నేమి? ఏమిటో! ఈ పిల్లలు దగ్గరగా ఉంటూనే చాలా దూరం మెయిన్‌టెయిన్ చేయగలరండి” అంది రవళి విషాదంగా.

“భలే వారండీ. ఆ అబ్బాయి టెంత్ దాటి చదవలేదు. మరి సరోజని ఎలా చదివిస్తారు? ఎక్కువ చదివేసి వాళ్ళ మామయ్యని చేసుకోనంటే? లేకపోతే ఆ అబ్బాయినే మరే అమ్మాయన్నా బుట్టలో పడేస్తే? ఎన్ని సందేహాలు, ఎన్ని ప్రశ్నలూ ఉంటాయండీ వాళ్ళ మనసుల్లో!” నిరాశా, నిస్పృహలు నిండిన గొంతుతో బిందూ టీచర్ అన్నారు. అందరూ నిస్సహాయతతో మౌనాన్ని ఆశ్రయించారు.

మరో వారం రోజుల తరువాత సరోజ వచ్చింది. రవళితో కళ్ళు కలపడానికి మొహమాటపడింది. “అన్ని కార్యక్రమాలు అయిపోయే ఉంటాయి కదూ! ఏమయినా ఒకసారి అడిగితే బావుంటుందేమో!” అన్నారు బిందు టీచర్. ఎలా అడగాలి అని అందరూ మొహమాటపడి రవళికే ఆ పని అప్పచెప్పారు.

రవళి సరోజని ఒక్కర్తినీ పిలిపించి “ఏం సరోజా! అతనితోనే నీ పెళ్ళి అని ఆరోజు విజయనగరం వచ్చినపుడు కూడా చెప్పలేదు. అంత రహస్యమా?” కాస్త నిష్ఠూరంగా అంది.

“మేడమ్! మీరు చదువుకుని ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్తారు. మా బాగు కోసం ఆలోచిస్తారు. మీకు నచ్చినట్లు చేయలేని దాన్ని. నా పెళ్ళి గురించి ఏమని చెప్పాలి?” కళ్ళు వాల్చుకుని సంకోచంగా అంది.

“తరువాత ముచ్చట్లు కూడా మీ వాళ్ళు తీర్చేసుకున్నారా?” రవళి అడిగింది.

“లేదు మేడమ్! ముహూర్తం రోజుకి నేను మెన్సెస్ అయిపోయాను. తరువాత ముహూర్తం వెంటనే కుదరలేదు. ఈ లోగా నెలగంట పెట్టేసారుకదా! మళ్ళీ పెద్ద పండుగయాకే అవుతుందన్నారండి” అంది కళ్ళు దించుకుని.

ఒక్కసారిగా కొత్త ఆశ ఫౌంటెన్ లాగ రవళి హృదయంలో చిమ్మింది. “సరోజా! సిన్సియర్ గా నాకోసం ఒక పని చేస్తావా?” అని అడిగింది.

“చెప్పండి మేడమ్! నా వల్ల అవుతుందంటే తప్పకుండా చేస్తాను” అంది ఉమ.

“మీ అమ్మగారిని ఒకసారి రేపు తీసుకొస్తావా? ఆవిడకి ఏదన్నా ఇబ్బంది అంటే స్కూల్ నుంచి వెళ్తున్నపుడు నేనే మీ ఇంటికి వస్తాను.” అంది ఆత్రంగా.

“రేపు తప్పకుండా తీసుకొస్తాను మేడమ్!” అంది సరోజ.

మర్నాడు సరోజ, వాళ్ళమ్మ దుర్గని తీసుకు వచ్చింది. రవళి ఎంతో నెమ్మదిగా “అమ్మా! సరోజ ఎంతో మంచి పిల్ల. పెంకిది కాదు. ఆ అమ్మాయి దృష్టి చదువు మీద తప్ప వేరే దాని మీద ఉండదు. ఎలాగూ మీ తమ్ముడికి ఇచ్చి పెళ్ళి చేసారు. తరువాత కార్యక్రమం కొన్నాళ్ళు పోస్ట్‌పోన్ చేయండి. తనకి ఇష్టం, అదృష్టం ఉంటే పై చదువు ప్రైవేటుగా చదువుతుంది. అంగన్‌వాడి టీచర్‌గా నైనా ఉద్యోగం చేస్తుంది. ఆరు సబ్జెక్ట్‌ల టెంత్ ఇప్పుడు తప్పిందంటే ప్రైవేటుగా చదవడం అసాధ్యం. ఇప్పుడు సంసారంలో పడేస్తే వెంటనే పిల్లలతో సతమతమయిపోతుంది. తన అభివృద్ధి అక్కడితో ఆగిపోతుంది. ప్లీజ్! తన టెంత్ అయేవరకూ కాపురం అనే విషయం తన దగ్గర తేవద్దు.” కన్విన్సింగ్‌గా చెప్పింది. దుర్గ ఏమీ మాట్లాడలేదు. అందరికీ సస్పెన్స్‌గా ఉంది.

“మీకేమీ కాని మా పిల్ల కోసం మీరింత బాధపడుతున్నారు. నేను మా వాళ్ళతో మాట్లాడి తప్పకుండా మీరు చెప్పినట్లు చేస్తాను.” అంది ఆఖరికి. రవళి ఆనందంతో ఆవిడ చెయ్యి పట్టుకుని ఊపేసింది. తక్కిన టీచర్స్ గట్టిగా చప్పట్లు కొట్టారు. చిన్న విజయం. కానీ ఒక రకంగా రవళిని బూస్ట్ చేసిన సంఘటన అది.

(ఇంకా ఉంది)

Exit mobile version