Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మథనం-19

[శ్రీమతి రాయప్రోలు సుజాతా ప్రసాద్ గారి ‘మథనం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[తన విద్యార్థినులు, తెలిసిన వారి జీవితాల్లో ఎదురైన కష్టాలను అధిగమించి, వారు స్వయంసమృద్ధి సాధించేలా చేసిన స్ఫూర్తిదాయకమైన ప్రయత్నాలు చేస్తుంది రవళి. భర్త ఆదరణ కరువై నిరాశలో ఉన్న సంధ్యకి రవళి ధైర్యం చెప్పి, ఆమెకి గాజుల తయారీ, కొవ్వొత్తుల తయారీ నేర్పించి, చిన్న కుటీర పరిశ్రమను స్థాపించేలా చేస్తుంది; ఆర్థిక స్వాతంత్ర్యం సాధించిన సంధ్యని కాపురానికి రమ్మంటారు అత్తగారు, భర్త. అత్తగారింట్లో స్వేచ్ఛకు భంగం కలగదని హామీ పొంది అత్తవారింటికి వెళ్తుంది సంధ్య. తండ్రి చనిపోవడంతో తల్లిని పోషించడానికి ఆటో నడుపుతున్న నారాయణ రవళిని కలుస్తాడు. ఆర్మీలో చేరమని అతన్ని ప్రోత్సహిస్తుంది. రమణమ్మ కాలేజీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తుంది. తల్లి అనారోగ్యం వల్ల, రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఇంజనీరింగ్ ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్న దీపకి ఒక టీచర్ సాయం చేసి, దాతను వెతికిపెట్టి కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేరేలా చేస్తారు. తొమ్మిదో తరగతిలోనే రహస్యంగా పెళ్లి చేసేసిన సరోజని, వెంటనే కాపురానికి పంపకుండా, కనీసం ఆమె టెన్త్ క్లాస్ పూర్తి చేసే వరకైనా ఆపాల్సిందిగా ఆమె తల్లిని ఒప్పిస్తుంది రవళి.- ఇక చదవండి.]

రమణమ్మ కూడా ఇంటర్ కాలేజీ ఫస్ట్ వచ్చింది. కంప్యూటర్స్ గ్రూప్‌తో డిగ్రీలో జాయిన్ చేసారు. ఫీజ్ కట్టేందుకు మళ్ళీ కాస్త ఇబ్బంది అయింది.

“రవళీ! బహుశా మన ఊపిరికి కొంచెం కష్టంగా ఉంది. వీణ ఇంజనీరింగ్‌కి వచ్చింది. రెండేళ్ళలో శృతి వస్తుంది. ‘వాత్సల్య’ పెట్టి ఎవ్విర్ మంత్ మీ స్నేహితులతో కలిసి అందులో కొంత ఇస్తున్నావు. ఇంకెవరో ఇంజనీరింగ్ స్టూడెంట్‌కి మీ కొలీగ్ ద్వారా ఎవ్విర్ ఇయర్ ఇస్తానని కమిట్ అయ్యావు. నా వాగ్దానాలు కొన్ని ఉన్నాయి. మనం ఫుల్‌ఫిల్ చేయగలమో లేదో అనిపిస్తోంది” ఎప్పుడూ లేనిది మురళి కాస్త దిగులుగా అన్నాడు.

“నాన్నా! నా చదువుకని ప్లాన్ చేసి ఉంచారు కదా! ఆ దాచినది రమణమ్మ ఫీజ్‌కి వాడండి. నాకు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుందాం. నేను లోన్ తీర్చేస్తాను..” వీణ చెప్పింది.

మురళి, రవళి మొహాలు చూసుకున్నారు. ఇద్దరికీ ఆశ్చర్యమే. రవళి కూతుర్ని దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. “ఈ ఒక్క మాట చాలదూ మురళీ మనకి ధైర్యం రావడానికి. మన పిల్లలు కూడా మనలాగే ఆలోచిస్తున్నారు. ఇదే మన ఆస్తి. ఇదే మనకు బలాన్నిస్తుంది.” గర్వంగా అంది.

“తల్లీ! చాలా బాగా చెప్పావమ్మా! నీకేం భయం వద్దు. రమణమ్మ చదువు మధ్యన వదిలేయము. ఏదో ఆలోచిద్దాం. ఇప్పటి వరకూ తాతగారిని ఎప్పుడూ ఏమీ అడగలేదు. ఒకసారి అడిగి చూస్తాను ఏమంటారో?” మురళి సాలోచనగా అన్నాడు.

“అడిగి చూడు. ఎంత వీలయితే అంత. మనం దిగులు పడక్కరలేదు. ఎడ్యుకేషన్‌కి హెల్ప్ చేసేవాళ్ళు మన ఫేమ్లీలో ఇంకా ఉన్నారు. అమ్మ ఆల్రెడీ అభయమిచ్చింది. రమణమ్మకు అవసరమైతే తను సాయం చేస్తానని. కాబట్టి వర్రీ కావద్దు”. అంది.

మురళి తండ్రితో వివరంగా విషయం చెప్పాడు. ఎన్నడూ లేనిది కొడుకుని అలా బెంగగా చూసి వెంకటరావు “నేను కొంత వరకూ సర్దుతాను మురళీ. మిగతాది నువ్వు ఏర్పాటు చేసుకో.” అన్నాడు.

వెంకటరావు, రాజేశ్వరిల సహకారంతో ఆ సమస్యను దాటారు. శరత్, శంకరరావుల చొరవతో రమణమ్మకు మైనారిటీ తీరాక వెంకటరావుతో పెళ్ళి అనే దరిద్రం వదిలింది. శరత్‌కి థాంక్స్ చెపుతూ రమణమ్మ చాలా ఏడ్చింది. రవళి తనని ఓదారుస్తూ “నిజంగా అన్నయ్యా! ఈ విషయంలో నీ ఋణం తీర్చలేనిది.” అంది. మురళి శరత్‌ను హగ్ చేసుకున్నాడు. చీడ వదిలినట్లు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

***

ఆ రోజు బిందూ టీచర్ ద్వారా స్కూల్‌లో రవళికి తెలిసిన వార్త, దేవీ వాళ్ళ ఆయన యాక్సిడెంట్‌లో పోయాడని. రెండోసారి పుట్టిన పాప ఆరు నెలల్లోనే చనిపోయింది. ఉన్న ఒక్క కూతురితో పుట్టిల్లు చేరుకున్న దేవి విషయం రవళి మనసును కావలసినంతగా కలచివేసింది. దేవిని ఇప్పుడు చూడగలదా? పదిహేడేళ్ళకే పెళ్ళి, రెండు పురుళ్ళు, కడుపుకోత, మొగుడి మరణం ఇన్ని అనుభవాలా? స్టాఫ్ అందరూ కూడా చాలా బాధపడ్డారు. వెధవ సంప్రదాయాల పేరుతో ఇంకా తనని ఏ చిత్రవధలకి గురి చేస్తున్నారో? రవళి మనసు బాధతో రెపరెపలాడుతూ కొట్టుకుంటోంది.

రవళి ఫోన్ మ్రోగడంతో ఉలిక్కిపడి ఈ లోకం లోకి వచ్చింది. అన్నోన్ నెంబరు. మూడ్ బాగు లేక లిఫ్ట్ చేయాలనిపించలేదు. అదే పనిగా వస్తుంటే తప్పనిసరిగా తీసింది. “నమస్తే మేడమ్! బావున్నారా? నేను దుర్గారావుని. నా చెవిపోటుకి ట్రీట్మెంట్ ఇప్పించారు. జ్ఞాపకం వచ్చానా?” అడిగాడు.

“నువ్వా? దుర్గారావు? నిన్ను నేను మర్చిపోగలనా? మీ ఇంటికి కబురు చేస్తే విజయవాడ వెళ్ళిపోయావని అన్నారు. అక్కడ ఎవరున్నారు? ఏం చేస్తున్నావో? ఎలా ఉన్నావో? అని పదిసార్లనుకున్నాను. నీ సంగతులు చెప్పు..” రవళి సందడిగా అడిగింది.

“బావున్నాను మేడమ్. వరసకి అక్క అవుతుంది మేడమ్. తన దగ్గరికి వచ్చాను. వాళ్ళ దగ్గర కూడా నా చదువు సాగదని తెలిసింది. సింగిల్ సెక్షన్ ఉన్న కాలేజ్ వెతుక్కున్నాను మేడమ్. ఒక పూట కాలేజ్‌లో చదువుతూ, రెండో పూట హోటల్లో పని చేసాను మేడమ్. చాలీ చాలని సంపాదన తోనే నేను ఇంటర్ 80%తో పాసయాను మేడమ్!” చెప్పాడు.

రవళికి నోట మాట రాలేదు. “నిన్ను ఎలా మెచ్చుకోవాలో తెలియడం లేదు దుర్గారావు! నీకు మరీ ఇబ్బంది అయినపుడు నన్ను మర్చిపోకు. నీ ఆత్మాభిమానం, నీ స్వయంకృషి , నీ చదువు అన్నీ నాకు చాలా ఆనందానిచ్చాయి. తరువాత ఏం చేద్దామనుకుంటున్నావు?”

“డిగ్రీ కంప్యూటర్స్‌లో జాయిన్ అయ్యాను. కానీ దానితో బాటే యానిమేషన్ కోర్సు కూడా చేయాలనుంది. అందుకే నేను ఒక బార్‌లో జాయిన్ అయ్యానండీ. దానిలో అయితే టిప్స్ బాగా వస్తాయి. కానీ రాత్రి పన్నెండు వరకూ ఉండాలి. అదే చాలా కష్టంగా ఉంది.” అన్నాడు.

ఉలిక్కిపడింది రవళి. “బార్ లోనా? ఒక మంచి లక్ష్యాన్ని సాధించడానికి మార్గం కూడా ఉత్తమంగా ఉండాలి. ఎక్కువ సంపాదిద్దామని నువ్వు బార్‌లో చేరి, ఆ వాతావరణానికి జారిపోతే.. కష్టమయిపోతుంది. ఆలోచించు. మరేదన్నా ఉందేమో!” రవళి తన భయాన్ని బయట పెట్టింది.

“చాలా ప్రయత్నించాను మేడమ్! ఇంత సంపాదన ఎందులోనూ లేదు. తాగిన వాళ్ళ విశ్వరూపాలు చూస్తూ, నేను తాగితే నా అంత దౌర్భాగ్యుడు మరొకడు ఉండడు. నేను నా లక్ష్యం నుంచి జారిపోను. ఐ ప్రామిస్ యూ. నేను ఏదన్నా సాధించగలనన్నారు మీరు. నేను సాధించే తీరుతాను” దుర్గారావు మాటల్లో నిండి ఉన్న నిజాయితీ రవళికి ఊరట నిచ్చింది..

“సరే! ఆల్ ది బెస్ట్! నీ ఫోన్ నెంబరు ఇదేనా? అప్పుడప్పుడు చేస్తుంటాను.” అని చెప్పింది.

“కాదు మేడమ్! ఇది నా ఫ్రెండ్‌ది. వీలయినపుడు నేనే చేస్తుంటాను. నమస్తే!” ఫోన్ పెట్టేసాడు దుర్గారావు. ఇలాంటి పిల్లలు తన విద్యార్థులు అనుకుంటే గర్వంతో ఛాతీ పొంగింది. ఒక కంట కన్నీరు, మరో కంట పన్నీరు అంటే ఇదేనేమో! దేవి విషయంలో బాధ పడుతున్న టైమ్‌లో ఈ ఫోన్!

***

రవళి నిర్వేదంగా చేతిలోని కాగితం చూస్తోంది. లైబ్రెరియన్ గారు పంపిన ఇంటర్ స్కూల్ కల్చరల్ కాంపిటీషన్స్ వివరాలున్న కాగితం అది. కానీ ఈసారి మనసుకి ఉత్సాహం రావడం లేదు. హెచ్. యమ్. గారిని బతిమాలుకోవడం, పిల్లలని ఎక్స్‌ట్రా టైమ్‌లో ప్రిపేర్ చేయడం, కొంతమంది టీచర్స్ చేత కామెంట్స్ పడడం ఇదంతా ఒక ఎత్తు అయితే, క్రితం సారి తను పోటీలకు తీసికెళ్ళిన పిల్లలకు మరునాడు తెలుగు టీచర్ ఆవిడ పీరియడ్ అంతా క్లాస్ బయట మోకాళ్ళు వేయించి పనిష్మెంట్ ఇచ్చారు. ఆవిడ పీరియడ్‌లో ముందు రోజు క్లాస్‌లో లేరన్న కారణం చెప్పారు. ఇంత బాధ పడడం అవసరమా అనిపిస్తోంది. ఒక రకం నిరాశలో కొట్టుకుపోతున్న రవళి “నమస్తే మేడమ్” అన్న మాటకి తలెత్తి చూసింది.

తన పాత స్కూల్ స్టూడెంట్ విజయ్ శంకర రావు వచ్చాడు. “నువ్వా శంకర్! బావున్నావా? ఏం చదువుతున్నావు?” ఆప్యాయంగా అడిగింది.

“బి. ఫార్మసీలో జాయిన్ అయాను మేడమ్! మా మావయ్య వాళ్ళింటికి ఈ ఊరు వచ్చాను. మీరిక్కడ ఉన్నారని తెలిసి చూద్దామని వచ్చాను.” అన్నాడు.

“చాలా సంతోషం. ఏంటి విశేషాలు? ఎన్నాళ్ళుంటావు? నీ కాలేజ్ కబుర్లు చెప్పు” అడిగింది రవళి.

తన కాలేజ్ కబుర్లు కాసేపు చెప్పి, ఉమ, రవి ఇద్దరూ డైట్ ట్రైనింగ్ అవుతున్నారని చెప్పాడు. “మేడమ్! మీరెప్పుడూ కల్చరల్‌కి మమ్మల్ని ఎంకరేజ్ చేసి, ఫోర్స్ చేసి పాల్గొనేలా చేసేవారు. అప్పుడు ఆ విలువ తెలిసేది కాదు. కొంచెం విసుగ్గా కూడా ఉండేది. కానీ ఇప్పుడు సెమినార్ ఇవ్వమంటే తక్కిన వాళ్ళు భయపడినట్లు నాకు భయం వెయ్యదు. జిల్లా పరిషద్ స్కూల్ వాడివి. నీకింత చొరవ ఏమిటి? అంటారండీ మా ప్రొఫెసర్స్! ఇదంతా మీ కారణం గానే మేడమ్! ఇది మీతో పంచుకోవాలనే వచ్చాను.” అన్నాడు. రవళికి ఆనందం తన్నుకు వచ్చింది. అతనికి ఫైవ్ స్టార్ చాక్లెట్ తెప్పించి ఇచ్చింది. కాసేపుండి శంకరరావు వెళ్ళిపోయాడు.

రవళికి ఆనందాశృవులు ఆగలేదు. తను పడే యాతనకి శంకరరావు రూపంలో తన బాధను భగవంతుడే తీర్చాడని అనిపించింది. కర్తవ్యం కూడా బోధపడింది. పిల్లలకి లాభిస్తుందన్నపుడు తక్కిన వాళ్ళని పట్టించుకోనక్కరలేదు అనిపించింది. పిల్లలకి ప్రస్తుతం ఇబ్బంది అయినా, తనని ఎవరు ఎంత కామెంట్ చేసినా ‘డోన్ట్ కేర్’ అనుకోవచ్చు. పుంజుకున్న కొత్త ఉత్సాహంతో ఆ పేపర్ పట్టుకుని హెచ్.ఎమ్. గారి రూమ్ వైపుకి వెళ్ళింది రవళి.

***

“మేడమ్! సంధ్య అక్కకి మంచి దారి చూపించారని అంతా చెప్పుకుంటున్నారు. నాకూ నా కూతురు అనే ఆశ లేకపోతే బతకాలనే లేదు. నన్ను బరువు దించుకుందామని మా వాళ్ళు పెళ్ళి చేసారు. కానీ పాపను తీసుకుని ఇలాగ మళ్ళీ రావలసి వచ్చింది. వాళ్ళకి భారం కాకుండా, నా పిల్లను బాగు చేసుకోవడానికి నా దారిన నేను బ్రతకడానికి ఏదన్నా దారి చూపించగలరా?” దేవి రవళితో తన బాధ వెళ్ళబోస్తూ, తన కోరిక చెప్పింది. వెలిసి పోయిన చీర సరిగ్గా దువ్వుకోని జుత్తు ఏ భావం లేని చూపు.

“సారీ! దేవీ! నీ విషయం విని చాలా బాధపడ్డాను. కానీ నిన్ను కలవడానికి కూడా మనసు రాలేదు. నువ్వు కనీసం ఈ నిర్ణయానికి రావడం చాలా సంతోషంగా ఉంది. నువ్వేమి చేయగలవో చెప్తే దాన్ని బట్టి ఆలోచిస్తాను.” రవళి చెప్పింది.

“ఈ ప్రపంచంలో సెవెన్త్ కూడా చదవని నాలాంటి వారికి ఏ అవకాశాలు ఉంటాయో నాకేం తెలుసు మేడమ్? మీరే చెప్పండి. మీ సలహాను నేను పాటిస్తాను.” దేవి చెప్పింది.

“వయసు మళ్ళిన పెద్ద వాళ్ళుంటారు. వాళ్ళకి కేర్ టేకర్‌గా పెట్టుకుంటారు. వాళ్ళని బాగా చూడాలి. ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేస్తే ఒకలాగ ఉంటుంది. పగలూ, రాత్రి అక్కడే ఉండిపోతే ఇంకా ఎక్కువ ఇస్తారు. ఇంకోటి తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా వెళ్ళిపోతే, వాళ్ళ పిల్లలని చూడాలి. ఈ రెండింటిలో నీకు ఏది ఇష్టమో చెపితే నేను ప్రయత్నిస్తాను.” సంధ్య కోసం తల్లితో ఆలోచించిన వాటిల్లో ఇవి కూడా ఉండడంతో వెంటనే చెప్పగలిగింది.

“చిన్న పిల్లలని చూస్తాను మేడమ్. అలాంటిది చూడండి.” వెంటనే ఉత్సాహంగా అంది.

“సరే! నేను ఆ ప్రయత్నంలోనే ఉంటాను. ఏదో ఒకటి సెట్ అయాక చెప్తాను.” రవళి చెప్పింది.

***

దీప ఇంజనీరింగ్ కాలేజ్‌లో చాలా మందిని ఆకర్షించింది. కానీ తన చదువే తన లోకంగా దీప ఉండడంతో వాళ్ళ ప్రయత్నాలు ఫలించలేదు. భాస్కర్! అందం, తెలివితేటలు, ఐశ్వర్యం ఉన్నవాడు. అతన్ని ఆకర్షించడానికి కాలేజ్‌లో ప్రతీ ఆడపిల్లా ప్రయత్నించేది. కానీ అసలు తనని పట్టించుకోని దీప అంటే అతనికి ఆకర్షణ పెరిగింది. దీప మాట్లాడినా అవసరం ఉన్నంత వరకే తప్ప వేరే ఒక్క అక్షరం కూడా మాట్లాడదు. తన స్నేహితురాలు ప్రణీతతో కాస్త నవ్వుతూ మాట్లాడుతుంది తప్ప మిగతా ఎవరితోనైనా కేజువల్ టాక్. అంతే.

ఎవరికీ తన వివరాలే తెలియవు. ఆ కాలేజ్‌కి డ్రెస్ కోడ్ ఉండడం వలన తన డ్రెస్సింగ్ సెన్స్ కానీ, తన ఆర్థిక పరిస్థితి కానీ ఏమీ తెలియదు. భాస్కర్ దుర్మార్గుడు కాదు కానీ దీపని తనదాన్ని చేసుకోవాలన్న కోరిక చాలా బలంగా పెరిగిపోయింది.

***

తనకి తెలిసిన ఒక డాక్టరు దంపతులకి ట్విన్స్ కలగడంతో, వాళ్ళు బాధ్యతగా ఉండే ఒక అమ్మాయి కోసం చూస్తున్నారని తెలిసి, రవళి దేవి గురించి చెప్పి తన పేరు సూచించింది. వాళ్ళు సరే అన్నాక దేవిని పిలిపించి చెప్పింది.

“దేవీ! ఇలాంటి వాళ్ళని ఒక సంస్థ నుంచి తెప్పించుకోడానికి ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ నడవడికి ఆ సంస్థ బాధ్యత వహిస్తుంది. ఇక్కడ నా మీద విశ్వాసంతో వాళ్ళు నిన్ను ఒప్పుకున్నారు. ఏ మాత్రం పిల్లల పెంపకంలో అజాగ్రత్తగా ఉండకూడదు. వాళ్ళు చెప్పినవన్నీ పిల్లలకి ఆ టైమ్స్‌లో జాగ్రత్తగా ఇవ్వాలి. చాలా శుభ్రంగా ఉండాలి, శుభ్రాన్ని పాటించాలి. వాళ్ళ ఇంట్లో కెమెరాలు ఉంటాయి. నువ్వేం చేస్తున్నావో వాళ్ళు అక్కడనుంచి గమనిస్తూ ఉంటారు. నెలకి పదిహేను వేలు జీతం. మద్యాహ్నం భోజనం పెడతారు. చెయ్యగలవా?” రవళి అడిగింది.

“కాస్త భయంగానే ఉంది కానీ, ప్రయత్నిస్తాను మేడమ్! ఉద్యోగం చెయ్యడానికి చదువు లేదు. నా వరకూ ఇది మంచి అవకాశమే.” దేవి మెల్లగా అంది.

“తరువాత నీ వేషం మార్చాలి. ఈ వయసులో ఈ చీరలు కట్టక్కరలేదు. చూడీదార్‌లు వేసుకో. చక్కటి నొక్కుల జుత్తు బాగా సంరంక్షించుకుని జడ వేసుకో. ఆ మొహాన్న పెట్టుకున్న స్టిక్కర్ కాస్త కనపడట్టు పెద్దది పెట్టుకో. అలా ఉంటే గానీ అక్కడ ఒప్పుకోరు.” రవళి ఖచ్చితంగా చెప్పింది.

“నేను చూడీదార్లా? నాకు ఒకటి కూడా లేదండి. పెళ్ళయిన దగ్గరనుంచీ వాళ్ళు చీరలే కట్టించారు. ఇన్ని మార్పులకి అమ్మ వాళ్ళు ఏమంటారో? మీరు వచ్చి చెప్తారా?” దేవి భయంగా అడిగింది.

“ఉహూ! నేనేం చెప్పను. సంధ్య అత్తవారితోనే తన కండిషన్స్ చెప్పి మాట్లాడగలిగింది. నువ్వు మీ అమ్మ వాళ్ళని ఒప్పించ లేవా? వాళ్ళతో మాట్లాడగలిగే దృఢత్వం, వాళ్ళని ఒప్పించగలిగే చాకచక్యం, జీవితంలో ఇంత పోగొట్టుకున్నాక అయినా రావాలి. నీ ప్లాన్ నువ్వు వేసుకుని ఒప్పించు. ఎందుకంటే నా సర్వీసులో మీలాంటి పిల్లల కోసం నేను కలుగ చేసుకున్నన్నాళ్ళూ ఏమీ లాభం లేకపోయింది. కానీ ఎవరికి వారు పోరాడిన నాడు గెలుపు మీదయింది. ఇది నా పాఠం. వాళ్ళని ఒప్పించి నాకు ఫోన్ చెయ్యి.” రవళి మాటలకు దేవిలో కూడా ఒక నిశ్చయం పురుడు పోసుకుంది.

***

ఆ రాత్రి దీపకు నిద్ర పట్టలేదు. దీప ఒక విధంగా భాస్కర్ రాయబారాల తోను, అతను పంపే మెసేజ్‌ల తోను విసిగి పోయింది. అసలు ఎలా ఈ గొడవ నుంచి విడిపించుకోవడం తెలియలేదు. తల్లికి చెప్పి తన తలనొప్పి పెంచడమూ ఇష్టం లేదు. తనే ఈ ప్రోబ్లమ్‌ను సాల్వ్ చేసుకోవాలి. తల బద్దలయేట్లు ఆలోచిస్తూ ఎలాగో పడుకుంది. మనకి పడుకునే వరకూ తట్టని ఆలోచనలు, పరిష్కారాలు కలలోనో, లేక ఏ తెల్లవారుఝామునో తడుతూ ఉంటాయి. అలాగే దీపకి తెల్లవారుఝామున రమణమ్మ “ఎంతో డిఫరెన్సు ఉన్న రెండు జీవన విధానాలు కలవడం సినిమాల్లో చూపించినంత సులభం కాదే!” అన్నట్లు జ్ఞాపకం వచ్చింది. దీపకి తన సమస్యకి పరిష్కారం దొరికినట్లనిపించింది. ఎంతో రిలీఫ్‌గా ఫీలయి నిద్రపోయింది.

ఆ మర్నాడు భాస్కర్‌తో “కాలేజ్ అయిపోయాక నువ్వు నాతో ఒక చోటుకి రాగలవా?” అని అడిగింది. భాస్కర్ పొంగిపోయి “సరే” అన్నాడు.

“ఈ రోజు మీ డ్రైవర్‌ని కారు తేవద్దని ఫోన్ చెయ్యి. మనం వేరేగా వెళ్దాం.” అంది.

భాస్కర్ కి దీప అభిప్రాయం అర్థం కాకపోయినా ఒప్పుకున్నాడు. కానీ అతను ఫోన్ చేసే సరికే కారు ఆన్ ది వే ఉండడంతో దీపని ఒప్పించి కారులో వెళ్ళచ్చులే అనుకున్నాడు. కానీ దీప కారులో వద్దని ఆటో పిలిచింది. ఆటోలో ఎక్కడికి తీసుకెళ్తోంది అనేది సస్పెన్స్‌గా ఉంది భాస్కర్ కి.

దీప భాస్కర్‌ని తిన్నగా ఇంటికి తీసుకొచ్చింది. ఆ లొకాలిటీయే భాస్కర్‌కి ఏదోలాగ అనిపించింది. ఇంటి మీద ఇల్లున్నట్లు ఇరుకుగా ఉన్నాయి. అందులో ఒకింటికి తీసికెళ్ళి “అమ్మా!” అంటూ తలుపు కొట్టింది దీప. మంగమ్మ తలుపు తీసింది. చాలా సాధారణంగా ఉన్ళ మంగమ్మను చూసి భాస్కర్ ఉలిక్కి పడ్డాడు. రాజ్ కమల్ కుర్చీ వేసి కూచోమంది. “మంచి నీళ్ళు కావాలా?” అని అడిగింది. వద్దన్నట్లు తలతిప్పాడు. దేవకన్యలాగ తన కలల్లో నిండిపోయిన దీప వాస్తవ రూపం ఇదా? మనసులో అలజడి కనబడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు.

దీప “ఇదే భాస్కర్ నా నిజం. నీకు నాకు ఒక్క చదువులో తప్ప మిగతా అన్నింటిలో భూమ్యాకాశాల తేడా ఉంది. మా నాన్న తాగుబోతు, తిరుగుబోతు. అతన్నించి వేరే వచ్చి నన్ను చదివించాలన్న ఒకే దీక్షతో మా అమ్మ చాలా కష్టబడుతోంది. తనది కూరగాయల వ్యాపారం. ఇంకా కొంతమందికి వంట కూడా వండుతుంది. దయామయులైన కొందరు డోనర్స్ నా చదువుకు సాయం చేస్తున్నారు. నా స్థానంలో నువ్వుంటే ఈ టైమ్‌లో చదువుకు కాక ప్రేమకి ప్రియారిటీ ఇస్తావా? సిన్సియర్‌గా నీ సమాధానం చెప్పు.” దీప అడిగింది.

“లేదు దీపా! అలా చెయ్యలేను. మీ అమ్మగారి సాహసం చాలా గొప్పది. దానికో చరిత్ర సృష్టించడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం ఇంకా గొప్పది. ఐ హార్ట్ ఫుల్లీ అప్రిషియేట్ యూ.” భాస్కర్ మనస్ఫూర్తిగా అన్నాడు.

“ఏ గుణానికి, ఏ లక్షణానికి కేరాఫ్ అడ్రస్ ఒకళ్ళే ఉండరు. మీ అమ్మ, నాన్నగారి సమాజంలో అన్వేషించు. నీకు నచ్చే అమ్మాయి దొరుకుతుంది. నువ్వు నా వరకు ఏదన్నా మనసు విప్పి చెప్పుకునే మంచి స్నేహితుడిగా ఉండు. మీ అమ్మ, నాన్నగార్లను ఈ ఇంటికి తీసుకొచ్చి నన్ను, మా అమ్మని పరిచయం చేయడం అసాధ్యం. అలా చేసినా వాళ్ళకేమాత్రం సంతోషం ఉండదు. సినిమాల్లో ప్రేమకి హద్దులుండవు. కానీ నిజ జీవితంలో ఉంటాయి.” చాలా స్పష్టంగా తన మనసులో మాట చెప్పింది.

“థాంక్యూ! దీపా! నువ్వు ఓపెన్ అయి అన్ని వివరాలు చెప్పినందుకు సంతోషంగా ఉంది. నువ్వు చెప్పింది డైజెస్ట్ చేసుకోవడానికి నాకు కాస్త టైమివ్వు. ఈలోగా నన్ను మాత్రం అవాయిడ్ చెయ్యకు.” అని “కాస్త టీ పెడతారా ఆంటీ?” అని మంగమ్మని అడిగి టీ తాగి బై చెప్పి వెళ్ళిపోయాడు భాస్కర్.

పెద్ద ప్రమాదం లోంచి బయట పడినట్లుంది దీపకి. మంగమ్మ దీపను గట్టిగా పట్టుకుని ముద్దులాడింది.

***

దేవికి తల్లిదండ్రులకు నచ్చ చెప్పడానికి రెండు రోజులు పట్టింది. ఒక ఆదివారం దేవిని తీసికెళ్ళి ఆ ఇంట్లో పరిచయం చేసింది రవళి. దేవికి రెండు కొత్త చూడీదార్లు కొంది. వీణవి కొన్ని తీసి ఇచ్చింది. చిన్న చిన్న మార్పులతో దేవి నిజంగా బావుంది. దేవికి కూడా ఏదో కొత్తగా, సంతోషంగా అనిపించింది. ఓ వారం రోజులు గడిచి ఆ డాక్టరు దంపతుల దగ్గరనుంచి, దేవి దగ్గర నుంచీ కూడా పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాక హాయిగా ఫీలయింది రవళి. మొదటి జీతంలో రవళికి స్వీట్స్ ఇచ్చి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయింది దేవి.

పూర్వపు నైరాశ్యపు ముఖం, నవ్వుల పువ్వులతో, సరికొత్త కళలు విరిసి మురిపిస్తోంది.

***

“మేడమ్! మీరు పిల్లల పట్ల ఎంతో కన్సర్న్‌తో ఉంటారు. స్కూల్ కి, పిల్లలకి కూడా మీరు చాలా ప్రైజులు తెచ్చారు. మీరు సోషల్ సర్వీసు కూడా చేస్తారని విన్నాను. మీకు స్టేట్ అవార్డుకి అర్హత ఉంది. ఇప్పటివరకూ డిస్ట్రిక్ట్‌కే అప్లై చేయలేదు. ఈసారి చేయండి మేడమ్! మీకు అవార్డ్ గ్యారంటీ” రవళితో హెడ్మాస్టర్ గారు చెప్పారు.

“వద్దు సర్! నేను ఇది చేసాను అని చెప్తూ, దానికి సాక్ష్యంగా ఫొటోలు పెడుతూ మనకి మనమే అప్లై చేసే ఆ విధానమే నాకు నచ్చదు. ఆ కారణంగానే నేను ప్రయత్నించలేదు. ప్రభుత్వం పరిశీలించి ప్రైవేటు స్కూళ్ళతో పోటీ పడుతూ ప్రైజులు తెచ్చుకుంటున్న స్కూళ్ళని, దాని వెనుక నున్న వారి కృషిని ప్రశంసిస్తే.. అప్పుడు బావుంటుంది కానీ ఈ పధ్ధతిలో వద్దండీ. మీరేమీ అనుకోవద్దు. థాంక్స్ ఫర్ ది ఆఫర్. నాకు ఇంతకంటే ఆ పిల్లల మనసుల్లో ఉండడమే ఇష్టం” స్పష్టంగా చెప్పి వచ్చేసింది రవళి.

(ఇంకా ఉంది)

Exit mobile version