Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మథనం-20

[శ్రీమతి రాయప్రోలు సుజాతా ప్రసాద్ గారి ‘మథనం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[రవళి, మురళి దంపతులు కుటుంబ సభ్యుల సహకారంతో రమణమ్మ కాలేజీ ఫీజు అధిగమిస్తారు. శరత్ చొరవతో రమణమ్మకు వెంకటరావుతో జరగాల్సిన బాల్యవివాహ గండం తప్పి అందరూ ఊపిరి పీల్చుకుంటారు. మరోవైపు, భర్తను, చిన్న కూతురిని కోల్పోయి పుట్టింటికి చేరిన పాత విద్యార్థిని దేవి బాధను చూసి చలించిన రవళి, ఆమెలో ఆత్మవిశ్వాసం నింపి ఒక డాక్టర్ దంపతుల పిల్లలను చూసుకునే కేర్ టేకర్ ఉద్యోగాన్ని ఇప్పించి ఆమె జీవితంలో కొత్త వెలుగులు నింపుతుంది. బార్‌లో పనిచేస్తూ కష్టపడి చదువుకుంటున్న దుర్గారావు నిజాయితీ, పాత విద్యార్థి శంకరరావు వచ్చి తను నేర్పిన సాంస్కృతిక కార్యక్రమాల వల్లే కాలేజీలో చొరవగా ఉండగలుగుతున్నానని చెప్పడం రవళికి ఉత్సాహాన్నిస్తాయి. ఇక కాలేజీలో తన వెనుక పడుతున్న ధనిక విద్యార్థి భాస్కర్‌ను దీప తన ఇరుకు ఇంటికి, కూరగాయల వ్యాపారం చేసే తల్లి మంగమ్మ వద్దకు తీసుకెళ్లి, తమ మధ్య ఉన్న సామాజిక, ఆర్థిక వ్యత్యాసాలను ప్రాక్టికల్‌గా వివరించి అతనికి కనువిప్పు కలిగించి మంచి స్నేహితుడిగా మార్చుకుంటుంది. రవళి సేవలను గుర్తించి స్టేట్ అవార్డుకు అప్లై చేయమని స్కూల్ హెడ్మాస్టర్ కోరగా, ఫోటోలు పెట్టి మనకు మనమే దరఖాస్తు చేసుకునే అవార్డుల కంటే పిల్లల మనసుల్లో స్థానం సంపాదించడమే తనకు ఇష్టమని ఆమె నిరాకరిస్తుంది.- ఇక చదవండి.]

రమణమ్మ ఫైనల్ ఇయర్‌లో ‘కేప్ జెమినీ’లో సెలక్ట్ అయింది. రవళి టీమ్ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ రోజు రమణమ్మను సినిమాకి, హోటల్‌కి తీసికెళ్ళి అంతా సెలబ్రేట్ చేసారు. రాజేశ్వరి, శరత్ కూడా వాళ్ళతో కలిసారు.

“నీకేమనిపిస్తోంది?” అని రమణమ్మను అంతా కలిసి ఇంటర్వూ చేస్తున్నట్లు అడిగారు.

“మేడమ్ నమ్మకాన్ని నిలబెట్టే అవకాశాన్ని భగవంతుడు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అలాగే మా అమ్మ, నాన్నలతో కలిసి ఉండే టైమ్ దగ్గర పడిందని సంతోషంగా ఉంది” అంది కన్నీళ్ళతో.

ఎంతగా తను పేరెంట్స్‌ని మిస్ అవుతోందో, ఆ లోటు ఎంత ఫీల్ అవుతోందో, అది గుండెల్లోనే దాచుకుని మామూలుగా ఉండేందుకు ఎంత ప్రయత్నించి ఉంటుందో అందరికీ అర్థం అయింది.

రవళి వెంటనే “రమణమ్మా! ఇప్పుడు నిన్ను చాలా సంతోషంగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారని నా నమ్మకం.. నీ సామర్థ్యం, నీ వ్యక్తిత్వం అర్థమవుతాయి కాబట్టి నిన్ను ఏ విధంగానూ వాళ్ళు డిస్టర్బ్ చేయలేరు.” అంది.

అటు దీప అప్పుడే తన ఫైనలియర్ లో టి.సి.యస్.లోనూ, ఇన్ఫోసిస్ లోనూ కూడా ఇంటర్వ్యూ క్లియర్ చేసింది. మంగమ్మ కస్టమర్స్ అందరూ చాలా హడావుడి చేసారు. దీపకి ఎన్నో కానుకలు ఇచ్చి మంగమ్మ సంతోషాన్ని పెంచారు.

ఇక డిగ్రీ ఎగ్జామ్స్ దగ్గరగా ఉన్నాయనగా రవళి సెల్‌కి ఒక అన్‌నోన్ నెంబరు నుంచి మెసేజ్ వచ్చింది. రమణమ్మ ప్రేమలో పడినట్లు ఉందని, ఈ రోజు ఫలానా హొటల్లో, ఫలానా టేబుల్ దగ్గర కలుస్తున్నారని మెసేజ్ వచ్చింది. రవళి హతాశురాలయింది.

స్కూల్‌లో లంచ్ అవర్‌లో వచ్చిన ఆ మెసేజ్ రవళి మనశ్శాంతి ని హరించింది. డిగ్రీ కంప్లీట్ అయాక వాళ్ళ తల్లిదండ్రులకు సంతోషంగా రమణమ్మను అప్పచెప్పాలని అనుకుంటుంటే ఈ ఉపద్రవమేమిటో! రవళి మురళికి మెసేజ్ ఫార్వర్డ్ చేసింది. ఐదు నిమిషాల్లో మురళి కాల్ చేసాడు.

“రవళీ! ఎక్కువ టెన్షన్ పడకు. రమణమ్మ అలాటి, ఇలాంటి పిల్ల కాదు. మనం అసలు విషయం తెలుసుకోడానికి ప్రయత్నిద్దాం. శరత్‌కి చెప్పాను. ఇక అతను చూస్తాడు.” చెప్పాడు.

మురళి స్కూల్ నుంచి ఇంటికి రాలేదు. రాత్రి ఏడు దాటాక శరత్, మురళి కలిసి వచ్చారు. ప్రశాంతంగా ఉన్న ఇద్దరి మొహాలు చూసి రవళి ధైర్య పడింది.

రవళి ఇచ్చిన కాఫీ తాగాక శరత్ “రమణమ్మ, పరిస్థితులు సానపట్టిన వజ్రమమ్మా! తను పొరపాటు చేయదు. ఇదిగో ఇది విను” అని సెల్‌లో మెసేజ్ ఆన్ చేసాడు.

“చూడండి రమేష్! మీరు నన్ను ఇష్టపడడంలో తప్పు లేదు. కానీ నాకు చాలా బరువైన, బాధాకరమైన గతం ఉంది. సుడిగుండంలాంటి ఆ గతం లోంచి బయటకు లాగి నన్ను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్న మా మేడమ్, సర్‌ల విశ్వాసం ఉంది. వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకుంటూ నా లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇంకా నాకు టైమ్ ఉంది. మీకు నిజంగా అలాంటి ఇష్టమే ఉంటే నేను జాబ్‌లో జాయిన్ అయినాక మా మేడమ్ గారిని కలవండి. నాకు మా అమ్మ, నాన్నల బాధ్యత కూడా ఉంది. నన్ను చేసుకోబోయేవాడు దీనికి ఇష్టపడాలి. ఇందుకు మీరు సిధ్ధపడితే అప్పుడాలోచిద్దాం. కానీ ఈలోగా నన్ను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించవద్దు. మీ ప్రయత్నం పూర్తిగా వృథా!” రమణమ్మ గొంతు స్పష్టంగా దృఢంగా వినిపించింది.

రవళి కళ్ళల్లో నీళ్ళు ఆనందాకాశంలో ఇంద్రధనస్సుగా విరుస్తున్నాయి. “ముందు, వెనుక సంభాషణ అంతా కట్ చేసి మెయిన్ సమాధానం నీకు వినిపించానమ్మా.” అన్నాడు శరత్.

“ఇది ఎలా సాధ్యమయింది? అన్నయ్యా!” రవళి కాస్త ఆశ్చర్యంగా అడిగింది.

“శరత్ తలుచుకోవాలి గానీ అది రికార్డు చేయించడం ఎంత పని?” అన్నాడు మురళి.

“ఏమో అన్నయ్యా! నా మాటలు పట్టుకుని తను తన వాళ్ళని కాదని ఇక్కడకు వచ్చింది. తన గురించి నేను చెప్పిన మాటలు విని మీరిద్దరూ ఈ ఐదేళ్ళు అండగా నిలపడ్డారు. ఆఖర్న చేసి ఇదంతా ఎక్కడ దెబ్బతింటుందో, సిధ్ధాన్నం ఎక్కడ చెయ్యి జారిపోతుందో అని భయపడ్డాను, కానీ భగవంతుడి దయ వలన రమణమ్మ నిలబడింది. అది చాలు. డిగ్రీ పూర్తవగానే తనని వాళ్ళ ఊళ్ళో వాళ్ళ అమ్మ, నాన్నలకి అప్పచెప్తే మన బాధ్యత తీరుతుంది.” గొంతు గద్గదికం అయిపోగా చెప్పింది రవళి.

“దానికీ ప్లాన్ చేద్దామమ్మా! ముందు పరీక్షలయ్యాక రమణమ్మతో మాట్లాడి అప్పుడాలోచిద్దాం.” శరత్ చెప్పాడు.

అనుకున్నట్లుగానే డిగ్రీ పరీక్షలు అయి రిజల్ట్ వచ్చేసరికి రమణమ్మకి ఆఫర్ లెటర్ వచ్చింది. హైదరాబాద్ లోనే పోస్టింగ్ ఇచ్చారు. రమణమ్మకి ఆర్డర్ వచ్చాక రవళి రమణమ్మకి నాజూకుగా ఉన్న పట్టీలు కానుకగా ఇచ్చింది. “ఇదేంటి మేడమ్! ఇన్నాళ్లూ మీ దయే కదా నన్ను పోషించింది! మళ్ళీ కానుకలేమిటి?” అంది రమణమ్మ మొహమాటంగా. “మేము నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టినందుకు, మా సంతోషానికి ఇది చిరు కానుక అనుకో!” రవళి చెప్పింది.

శరత్ “నీకేం కావాలి? నువ్వు ఎన్నోసార్లు స్టేజ్ మీద మాట్లాడుతుంటే చూసి సరదా వేసింది. నీకు ఏమన్నా పుస్తకాలు కొని ఇస్తాను.” అని అడిగాడు.

“సర్! గురజాడ వారి వర్క్స్ వీలయితే కొని ఇవ్వండి సర్! అసలు నా యాత్ర ఆరంభమే ఆయన రచనల మీద. మేడమ్ ఆయన గురించి చాలా చెప్పారు. అవి పూర్తిగా చదవాలని ఉంది.” రమణమ్మ అడిగింది. రమణమ్మ మాటలకి శరత్ ముగ్ధుడయాడు.

బజారుకి వెళ్తుండగా శరత్ “నిన్ను ఇక మీ వాళ్ళకి అధికారకంగా అప్పచెప్పే సమయం వచ్చినట్లుంది.” అన్నాడు.

“ఇప్పుడే కాదు సర్! జాబ్ లో చేరిన కొన్ని నెలలు అయాక జరగాలండి. అమ్మ, నాన్నలకి ఏవో కొనాలని ఉంది. టీచర్స్ డే న మా స్కూల్లో మేడమ్ గారిని సన్మానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. నారాయణ అప్పటి మా స్కూల్‌మేట్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నాడు. ఆ రోజు ఆదివారం కాబట్టి స్కూల్ డిస్టర్బ్ అవదు. ఆ స్కూల్‌లో ఎక్కడయితే మా వాళ్ళు మేడమ్ గారి మాట కాదని నన్ను తీసికెళ్ళారో అక్కడే ఆవిడ ఏం చేసారన్నది ఆ ఊరికి తెలిసేటట్లు చేయాలని నా కోరిక. ఈ గెలుపు కొంతమందినైనా మార్చాలి. ఇదంతా మేడమ్ గారికి సర్ప్రైజింగ్‌గా జరగాలి సర్!” అంది.

“అమ్మా! ఏ ముహూర్తాన నిన్ను కలిసానో కానీ, అప్పటినుంచి నువ్వు నాకు ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తున్నావు. నీ ఆలోచన చాలా బావుంది. నేను కూడా ఏం చేయాలో, ఏం చేయగలనో అది చేస్తాను.” అన్నాడు శరత్. తనతో సెలెక్ట్ అయిన వాళ్ళు తోడు ఉండడంతో రమణమ్మ వాళ్ళతో వెళ్తానంది. కానీ మురళి రమణమ్మతో వెళ్ళి జాయినింగ్ అయాక ఒక పి.జి. సెంటర్‌లో చేర్చి వచ్చాడు.

అటు దీప కూడా ఇన్ఫోసిస్‌లో చేరడానికి హైదరాబాద్ ప్రయాణం అయింది. మంగమ్మ దిగులుపడింది. కానీ తన స్నేహితురాలి ఫాదర్ వస్తున్నారని, ఆయన సాయంతో తను జాగ్రత్తగా జాయిన్ అయి ఫోన్ చేస్తానని ధైర్యం చెప్పి వెళ్ళింది. మంగమ్మ సర్కిల్‌లో ఉన్న వాళ్ళందరూ ‘బెస్ట్ ఆఫ్ లక్’ చెప్పారు.

***

“ఏమిటి? ఎంతసేపు ఆ ఆలోచన? అందులోంచి లేచి పైకి వస్తావేమో అని పది నిమిషాల నుంచీ ఎదురు చూస్తున్నాను. కానీ ఎప్పటికీ ఇటువైపు చూడడం లేదు.” కిటికీ దగ్గర వెన్నెలను చూస్తూ సుదీర్ఘమైన ఆలోచనలతో గతంలో కూరుకు పోయిన రవళి మురళి మాటలకి ఉలిక్కిపడింది. తను పడక్కుర్చీలోంచి మళ్ళీ ఎప్పుడు లేచి కిటికీ దగ్గరకు వచ్చింది? తనలో దాగిన తన గతం తన ఉనికిని కూడా తనలో దాచేసుకుందా! మెల్లగా మంచం దగ్గరకి వచ్చి కూచుంది.

“నువ్వెప్పుడు లేచావు?” గాఢ నిద్ర లోంచి మెలకువ అప్పుడే వచ్చినట్లు అడిగింది. “అదంతా వదిలెయ్ గానీ రేపటి కోసం దేనికి అంత టెన్షన్? నా దృష్టిలో కష్టమైన కాలాన్ని మనం దాటాం. రమణమ్మ కూడా బాధ్యతగా చదువుకుని ఉద్యోగంలో సెటిల్ అయింది. మరి దేనికి నీ చింత?” మురళి అడిగాడు. “రమణమ్మ తల్లిదండ్రుల గురించి మీకు తెలియదు. ఇన్నాళ్లూ ఎవరో మహిళా సంఘం రక్షణలో ఉందనుకుని ఊరుకున్నారు. తను మన దగ్గరే ఉందని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో? నామీద ఏ నిందలు వేస్తారో అని చిన్న భయం మనసులో కదులుతోంది.” రవళి చెప్పింది.

“అలా ఏం జరగదులే. అయినా ఇక ఆ పూచీ మనది కాదు. రమణమ్మది. నిస్వార్థంగా నువ్వు చేసిన ఈ మేలు అందరి మన్ననలు పొందుతుంది. హాయిగా పడుకో!” ప్రేమ నిండిన మురళీ మాటలకి రవళి నిశ్చింతగా నిద్రకి ఉపక్రమించింది.

***

ఆ స్కూల్ ఆ రోజు.. సంతోషం అలలుగా లేచి పడుతున్న సంద్రంలా ఉంది. పట్టపగలు పున్నమి వెలుగుల వర్షంలో తడిసిన అవనిలా ఉంది. మిణుక్ మిణుక్ మనే కాంతితో నక్షత్రాలు పరుచుకున్న అందాల ఆకాశంలా ఉంది. అందమైన పువ్వులు, మధురమైన పళ్ళతో నిండిన నందనవనంలా ఉంది.

మురళితో పాటు శృతి, వీణ, రాజేశ్వరి కూడా రవళితో బయలు దేరారు. కారు రమణమ్మ వాళ్ళింటికి కాక స్కూలు దగ్గరకి మురళి తీసుకు రావడం రవళికి ఆశ్చర్యం వేసింది. ఏదో అడిగే లోగా నారాయణ, రమణమ్మ, వచ్చి “రండి మేడమ్! సార్! రండి! అందరూ మీ కోసమే ఎదురు చూస్తున్నారు” అంటూ ఆహ్వానించారు.

లోపల హాల్ అంతా సందడిగా ఉంది. అక్కడ ఆనందం అర్ణవంగా కనిపిస్తోంది. బోర్డు మీద అందంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అని ఆ రోజు ప్రత్యేకత వ్రాసి ఉంది. పాత స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు చాలామందే వచ్చి రవళికి నమస్కరిస్తున్నారు. రవళి ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది.

రవళి లోపలికి రాగానే వెంటనే సభ ఆరంభం చేసారు. అదే సమయంలో నర్సమ్మని, రాజయ్యని శరత్ స్కూలుకి తీసుకొచ్చాడు. నారాయణే ప్రార్థనా శ్లోకం చదివి సభకు ఆహ్వానం పలికాడు., “రవళి మేడమ్ గారి విద్యార్థులు అంతా తాము సాధించిన అభివృద్ధిని వాళ్ళే ఒకరొకరుగా వచ్చి చెప్తామన్నారు. ముందుగా మేడమ్ గారి అతి ప్రియమైన విద్యార్థినులు రమణమ్మ, దీప మాట్లాడతారు.” అని చెప్పాడు.. “దీప.. దీప వచ్చిందా?” రవళి గుండె చప్పుడు పైకే వినిపిస్తున్నట్లనిపించింది మురళికి. రమణమ్మ, దీప ఇద్దరూ స్టేజ్ మీదకు వచ్చారు. తీరైన శరీర సౌష్టవం, మొహంలో జ్ఞాన కాంతి, కళ్ళలో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసంతో వాళ్ళు మెరిసిపోతున్నారు. వాళ్ళ మీదనుంచి చూపు తిప్పుకోవడం కష్టమయింది అందరికీ.

ముందుగా రమణమ్మ మాట్లాడింది. “అందరికీ నమస్కారం. చేపకి బతకడానికి నీరు, పక్షికి ఎగరడానికి రెక్కలు ఎంత అవసరమో మనిషికి చదువు అంత అవసరమని నమ్మిన రవళి మేడమ్ గారి దయవలన మేమంతా ఈ రోజున ఇలా ఉన్నాం. మేడమ్ నాకు అప్పుడే పెళ్ళి చేయవద్దని బాగా చదివించమని మా తల్లిదండ్రులకు ఎంతో నచ్చచెప్పారు. కానీ వాళ్ళు నన్ను పెళ్ళి అనే అందలమే ఎక్కించాలని చాలా ప్రయత్నించారు. విఫలమయిన నిశ్చితార్థం ఒక జీవిత పాఠం నేర్పింది. ఆ తరువాత అమ్మ వాళ్ళు ఇంకో పెళ్ళి చేసారు. భయంకరమైన జబ్బుతో ఉండీ నన్ను మోసంతో చేసుకున్నవాడి నుంచి తప్పించుకుని, వెళ్తే మేడమ్ గారి దగ్గరకు వెళ్ళాలి, లేకపోతే సముద్రంలో పడాలి అనుకుని ఇల్లు వదిలి బయలుదేరాను. నాకు నారాయణ కలిసి తన ఆటోలో విజయనగరం తీసుకువెళ్ళాడు. ఆశ్చర్యం ఏంటంటే విజయనగరం కోట జంక్షన్‌లో ఇంకో సమస్యతో పోరాడుతున్న నా స్నేహితురాలు దీప కనిపించింది. దీప కూడా నా నిర్ణయాన్ని సమర్ధించి తనూ వచ్చి నన్ను మేడమ్ గారింటి దగ్గర దింపింది.” రవళి, మురళీ ఇద్దరూ ఆశ్చర్య పోయారు.

“ఆవిడను చేరుకున్నాక నా జీవితం గాడిన పడింది. నా ఇంటర్ పూర్తయేసరికి నాకు ఫేమ్లీ కోర్టు ద్వారా ఆ పెళ్ళి నుంచి విముక్తి వచ్చింది. దీనికి కారణమైన మా శరత్ అంకుల్ ఋణం తీర్చుకోలేనిది. ఇంటర్, డిగ్రీ, పూర్తి చేసి ఈ రోజు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాను. ఒక ఆడపిల్ల బాధ్యత తీసుకోవడం సామాన్యమైన విషయం కాదు. ఆ పని మేడమ్, సర్ చేసారు. అమ్మా! ఎన్నోసార్లు మీ దగ్గరకు మన ఊరికి రావాలని నా మనసు పరితపించిపోయింది. కానీ అనుకున్నది సాధించేవరకూ ఉండాలని చాలా కష్టపడి ఉన్నానమ్మా! అమ్మ, నాన్నా! మేడమ్ చెప్పిన మాటల్లో నిజాన్ని అర్థం చేసుకున్నారా? మీరు అప్పుడే మాట విని ఉంటే మనం ఇంత కష్టపడాల్సి వచ్చేదా? మీరు చేసిన పనికి ఏ మూలనో పడి ఏడుస్తూ ఉండాల్సిన నాకు ఇటువంటి రోజును ఇచ్చిన మేడమ్ గారికి మనమేమివ్వగలం? చెప్పండి.” ఆఖరాఖరికి గొంతు రుధ్ధమవగా ఆగిపోయింది.

దీప రమణమ్మ భుజం మీద సాంత్వనగా చెయ్యి వేసింది. రెండు నిమిషాల్లో రమణమ్మ తనని తాను కంట్రోల్ చేసుకుంది.

(ముగింపు వచ్చే వారం)

Exit mobile version