[శ్రీమతి రాయప్రోలు సుజాతా ప్రసాద్ గారి ‘మథనం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[రవళిని పడుకోమని చెప్పి, మురళి, కూతురు వీణ సాయంతో వంటిల్లు సర్దుతాడు. అది చూసిన కాంతం రవళిపై విసుక్కుంటుంది. నానమ్మ ప్రవర్తన అర్థం కాదు వీణకి. కూతురికి వివరంగా చెప్తాడు మురళి. ఆ పని అయ్యాకా, బెడ్ రూమ్ లోకి వెళ్ళి కాసేపు పుస్తకం చదువుకుంటాడు. పడుకునే ముందు, భార్యతో మాట్లాడి ఆమెకి ఓదార్పునిస్తాడు. ఆమె భావాలతో ఏకీభవించేవారితో ఒక గ్రూప్ ఏర్పర్చి సంఘటితంగా పరిష్కారాల గురించి ఆలోచించమని సలహా ఇస్తాడు. తరువాత రవళి, ఆమె భావాలతో ఏకీభవించిన వారు అంతా ‘వాత్సల్య’ అనే గ్రూప్‌గా ఏర్పడతారు. ప్రతీ నెల జీతంలోంచి కొంత అమౌంట్ తీసి ఒక దగ్గర ఉంచాలని, అవసరాన్ని బట్టి హయ్యర్ ఎడ్యుకేషన్‌కి సహాయం చేయాలని నిర్ణయించుకుంటారు. ఒకరోజు సీనియర్ విద్యార్థుల కోసం మండల స్థాయిలో పర్యావరణ పరిరక్షణపై వ్యాస రచన పోటీ ఉందని ఇన్‌ఛార్జ్ హెచ్.ఎమ్.గా ఉన్న రావుగారు చెప్పడంతో, తమ స్కూల్ తరఫున పాల్గొనాలని అంటుంది రవళి. కొందరిని పిలిచి డిక్టేషన్ ఇస్తుంది, దస్తూరీ, ప్రెజెంటేషన్ తదితర అంశాలు పరిశీలించి రవి అనే విద్యార్థిని ఎంపిక చేస్తుంది. రవికి తగిన విధంగా శిక్షణనిచ్చి, ప్రసాద్ మాస్టారి గారితో పోటీకి పంపుతుంది. అయితే రవి జిల్లా స్థాయికి సెలెక్ట్ అవడు. రవళి నమ్మలేకపోతుంది. రవికి తను బాగా శిక్షణనిచ్చానని, అతను బాగా రాయగలడని బలంగా నమ్ముతుంది. అందువల్ల ఫలితాలను ఛాలెంజ్ చేయమని ప్రసాద్ గారితో అంటుంది. దాంతో ఫస్ట్ వచ్చిన కుర్రాడి పేపర్‌ని, రవి వ్రాసిన వ్యాసాన్ని, పేర్లు లేకుండా, విజయనగరంలోని ఓ ప్రముఖ ఉపాధ్యాయుడి పరిశీలనకు మురళి ద్వారా పంపుతారు. ఆయన ఆ రెండిటినీ పరిశీలించి రవి వ్రాసిన వ్యాసమే బాగుందని చెప్పి, రవిని జిల్లా స్థాయి పోటీకి ఎంపిక చేయమని సూచిస్తారు. రవి జిల్లా స్థాయిలో పాల్గొని కన్సోలేషన్ ప్రైజ్ సాధిస్తాడు. టెంత్ పరీక్షల కోసం పిల్లల్ని బాగా సిద్ధం చేస్తుంది రవళి. మర్కట న్యాయం, మార్జాల న్యాయం గురించి చెప్పి, ఫస్ట్ వచ్చిన వారికి స్కాలర్‌షిప్, పుస్తకాలు ఇస్తానని ప్రోత్సహిస్తుంది. ఓ రోజు టెంత్ క్లాస్ అమ్మాయి మహేశ్వరి రవళికి ఉత్తరం రాస్తుంది. – ఇక చదవండి.]
దురదృష్టవశాత్తు ఆ సంవత్సరం టెంత్ పరీక్షల ముందే వరల్డ్ కప్ క్రికెట్ ప్రారంభం అయింది. రవిని టీచర్స్ అందరూ హెచ్చరించారు. రవళి పరీక్షల్లో క్రికెట్ చూడవద్దని ఎంతలాగానో నచ్చచెప్పింది. అందరూ చెప్పినపుడు ఆమాట వినాలనే రవి మనస్ఫూర్తిగా అనుకున్నాడు. కానీ చూడకుండా ఉండడం రవి వశమవలేదు. పరీక్షల ముందు, పరీక్షలలో కూడా మేచ్‌లు చూసి సరిగ్గా రివిజన్ చేయకుండా వెళ్ళి కొన్ని పరీక్షలు వ్రాసి వచ్చాడు.
టెంత్ రిజల్ట్స్‌లో అనుకున్నట్లుగానే ఉమ అప్పటి వరకూ ఆ స్కూల్‌లో ఎప్పుడూ రానన్ని మార్కులతో స్కూల్ ఫస్ట్ వచ్చింది. ఎప్పుడూ నువ్వా? నేనా? అన్నట్లు ఉమతో పోటీపడే రవి నలభై మార్కులు ఉమ కంటే వెనుక పడి పోయాడు.. రవి పది సంవత్సరాల తెలివిని, కృషిని, క్రికెట్ వెనక్కి నెట్టేసింది. సరస్వతి, మహేశ్వరి తరవాత స్థానాలు సాధించారు. ఉమకు ఒక ప్రైవేటు కాలేజీ వాళ్ళు ఫ్రీ సీటు ఇచ్చారు. రవి, మహేశ్వరి గవర్నమెంట్ కాలేజ్‌లో జాయిన్ అయ్యారు.
***
“అదేమిటి సరస్వతీ! నువ్వు కాలేజీలో చేరకపోవడం ఏమిటి? స్కూల్ సెకెండ్ వచ్చావు. ఏమయింది?” ఆశ్చర్యంగా అడిగింది రవళి.
“దానికి మనువు కుదిరిందమ్మా! అందుకని కాలేజీకి పోదు.” సరస్వతి వాళ్ళమ్మ చెప్పింది. రాధ తరువాత ఈ సంవత్సరంలో ఐదారుగురికి పెళ్ళిళ్ళయిపోయాయి. ఆశ్చర్యం ఏంటంటే శుభలేఖ చేతికి వచ్చేవరకూ సస్పెన్స్ గానే ఉంచుతారు. ఈ చేదుని బలవంతంగా మింగడం రవళి అలవాటు చేసుకుంటోంది. కానీ సరస్వతి చాలా తెలివైంది. హయ్యర్ స్టడీస్‌కి వెళితే తప్పకుండా ఉద్యోగం సాధిస్తుంది. స్వంత రెక్కల మీద ఎగురుతుంది. ఈ పిల్లని కూడా ‘మైనర్ బాలికా వివాహం’ అనే రాటకి కట్టేసి, ఎగరడం మాట అటుంచి, అసలు నడిచేందుకు కూడా గిరి గీసేస్తున్నారన్న నిజం రవళికి గొంతు దిగని చేదులాగ ఉంది.
“పెళ్ళెప్పుడండీ?” నూతిలోంచి వచ్చినట్లున్న స్వరంతో అడిగింది రవళి.
“ఇంకా టైముందండీ. కాస్త డబ్బులు కూడేసుకోవాల. పై ఏడాదో, ఆ పైఏడాదో సేస్తాం.” అంది ఆవిడ.
“అయితే మరి చదవించడానికి ఏమిటి అభ్యంతరం? ఈలోగా తను ఇంటర్ పూర్తి చేస్తుంది. మీరు ఒప్పుకుంటే ఫీజుల సంగతి నేను చూస్తాను.” ఆత్రంగా అడిగింది రవళి.
“అలా కాదమ్మా! పెళ్ళికొడుకు మా పిన్ని కొడుకే. ఆడు పదే సదివాడు. అంతకంటే పిల్ల ఎక్కువ సదివితే సేసుకోడు. ఆళ్ళంతా తెలిసినోళ్ళు. పిల్ల అక్కడ సుకపడతాది అని మా నమ్మకం. అందుకే నిశ్చయం సేసుకుంటున్నాం.” సరస్వతి తల్లి మొత్తం వివరంగా చెప్పింది. రవళికి ఇక మాట్లాడడానికి ఏమీ మిగిలినట్లనిపించలేదు.
“అమ్మా! నువ్వెళ్ళు. నేను ఒక్క పావుగంటలో వచ్చేస్తాను.” సరస్వతి తల్లికి చెప్పింది.
తల్లి వెళ్ళాక “మీరు ఎప్పుడూ క్లాస్‌లో చెప్తున్నట్లే చదువుకుని, ఉద్యోగం చేయాలని ఉందని, ఇప్పడే పెళ్ళి వద్దని మా అమ్మా, నాన్నలని ఒప్పించడానికి చాలా ప్రయత్నించాను. వాళ్ళు వినలేదు సరికదా! గోల చేసి ఏడ్చి మొత్తుకుని నా చేతే ఔననిపించారు. నేను ఇక్కడ మా తాతగారింట్లో ఉండి చదువు కుంటున్నాను. అమ్మ వాళ్ళది ఇంకా చిన్న ఊరు. ఇప్పుడు వాళ్ళతో నేను వెళ్ళిపోతున్నాను. జీవితంలో నేను ఏమైనా సాధించగలనా? చెప్పరా?” అడిగింది సరస్వతి.
మనసు ద్రవించిపోయింద రవళికి. “సరస్వతీ! చదువు అంటే జ్ఞానం. ఆర్థిక స్వాతంత్ర్యం! ముఖ్యంగా ఆడపిల్లలకి ఈ ఆర్థిక స్వాతంత్య్రం ధైర్యాన్ని, సంసారంలో నిర్ణయాధికారాన్ని ఇస్తుంది. రకరకాల ఒకేషనల్ కోర్సులలో ట్రైనింగ్ ఇచ్చే సంస్థలున్నాయి. కావాలంటే అవి నేర్చుకోవచ్చు. నీకు ఆ వివరాలు ఇస్తాను. నువ్వు తెలివైనదానివి. ఇంట్లో ఉండీ కూడా టైలరింగ్ లాంటి వాటితో సంపాదించగలవు. ఆర్థికంగా నిలబడగలవు. నీకు ఎప్పుడు ఎలాంటి సహాయ, సహకారాలు కావాలన్నా నాకు ఫోన్ చెయ్యి. సరేనా? జ్ఞానం కోసం లైబ్రరీకి వెళ్ళు. మంచి పుస్తకాలు చదువు. అదీ వీలుకాకపోతే పేపర్ రోజూ చదువు. ఒక సమగ్రమైన పేపర్లో అన్ని సబ్జెక్టులు ఉంటాయి. తెలుసా?” సరస్వతికి తన మాటలతో ధైర్యాన్ని ఇచ్చింది రవళి. సరస్వతి నమస్కరించి వెళ్ళిపోయింది.
సరస్వతి కళ్ళలో తొంగి చూస్తున్న నీటి పొరను చూసి ‘చదువు రాని, చదువు కోని, చదవని ‘మగరాయుళ్ళు’ ఈ బంగారు తల్లుల నుదుటి రాతలు వ్రాసేస్తున్నారు’ అనుకుంది రవళి కోపంగా.
***
ఒకరోజు రవళి ఎర్లీగా స్కూల్ కి వచ్చింది. నోట్స్ కరెక్షన్ వర్క్ ఎక్కువ ఉండిపోయింది. హెచ్.ఎమ్.గారు తప్ప ఇంకా స్టాఫ్ ఎవరూ రాలేదు. పిల్లలు మెల్లగా ఒకరొకరూ వస్తున్నారు. స్టాఫ్ రూమ్ లోకి వస్తూ నోటీస్ బోర్డ్ మీద ఏదో వ్రాస్తున్న అబ్బాయిని చూసింది. రవళికి ఆ అబ్బాయిని ఏ క్లాస్ లోనూ చూసిన జ్ఞాపకం రాలేదు. కొంచెం పరీక్షగా చూస్తే ఆ అబ్బాయి వ్రాయడం లేదు, ఏదో బొమ్మ వేస్తున్నాడు అని అర్థమయింది. వెళ్ళి చూడాలనిపించింది. కానీ తను అక్కడికి వెళ్తే ఎంతో కొంత అలజడి అవుతుంది. అతని ధ్యానం చెడగొట్టినట్లవుతుంది అని వెళ్ళలేదు..
తరువాత కాసేపయ్యాక వెళ్ళి చూసేసరికి ఆ అబ్బాయి లేడు. బొమ్మ చూసి ఆశ్చర్యపోయింది. అంత సజీవంగా ఉంది. పొలం గట్టున మేస్తున్న ఆవుని, దాని దూడని వేసాడు.. స్కూల్ బిల్డింగ్ బాగా ఎత్తుగా ఉండడంతో అక్కడికి కొంచెం దూరంలో ఉన్న పొలం కన్పిస్తోంది. ఆ పొలంలో గడ్డి మేస్తున్న ఆవుని, దూడని వేసాడు. ప్రస్తుతం అక్కడ ఆవు లేదు. అంతక్రితం అక్కడే ఉండి మేసి ఉండచ్చు లేదంటే ఆ ఏరియాని బ్యాక్‌గ్రౌండ్‌గా ఆవుని, దూడని ఊహించి వేసి ఉండచ్చు. కానీ ఏదైనా చాలా బావుంది.
రవళి అక్కడికి వచ్చి చూడడంతో చాలా మంది పిల్లలే పోగయారు. “ఇప్పుడు ఇక్కడ బొమ్మ వేసిన అబ్బాయి ఎవరు?” అని ఆ పిల్లల్ని అడిగింది
“రాఘవ మేడమ్ గారూ! క్రిందటేడు టెంత్ పోయింది. మళ్ళీ కట్టలేదు.” ఒక అబ్బాయి చెప్పాడు.
“సరే! అతనిది ఏ ఊరు? ఆ ఊరి వాళ్ళెవరున్నారా? అతనిని ఒకసారి నేను పిలిచానని రేపు స్కూలుకి తీసుకురాగలరా?” అడిగింది.
అందులో ఒక పిల్లాడు “ఆడి ఇల్లు మా ఇంటికి చాలా దగ్గరే! నేను పిలుచుకొస్తాను.” అన్నాడు.
కానీ అది వెంటనే జరగలేదు. రాఘవ రాలేదు. ఓ పది రోజుల తరువాత స్కూల్ వదిలాక బయట ఆటో కోసం వెయిట్ చేస్తోంది. డైరెక్ట్ విజయనగరం ఆటో దొరికితే మధ్యన మారక్కరలేదు అనుకుంది. ఇంతలో అక్కడికి రాఘవ వచ్చాడు.
రవళిని విష్ చేసి “ఏంటి మేడమ్ రమ్మన్నారుట.” అని అడిగాడు.
“అవును. ఆ రోజు నోటీస్ బోర్డ్ మీద డ్రాయింగ్ చాలా బాగా వేసావు. ఎవరి దగ్గరన్నా నేర్చుకుంటున్నావా?” అడిగింది రవళి.
“డ్రాయింగ్ నేర్చుకోవడమేమిటి మేడమ్! అదీ మా ఊళ్ళో!” అని నవ్వాడు.
“అలా అయితే నీ అంతట నువ్వే వేసావా? ఏదయినా, ఎవ్వరి నయినా చూసి వేసెయ్యగలవా?”
“వెయ్యగలను. కొంప తీసి మీ బొమ్మ వెయ్యమంటారా? సారీ! అలాటి ఇంట్రెస్ట్ నాకు లేదండీ” అన్నాడు చాలా నిర్మొహమొటంగా.
“నాదేం వద్దులే. నాకూ అలాంటి ఇంట్రస్ట్ లేదు. కానీ నువ్వు టెంత్ ఎందుకు సప్లిమెంటరీ ఎగ్జామ్‌కి కట్టలేదు?” రాఘవ మనస్తత్వాన్ని అంచనా వేస్తూ అడిగింది.
“నాకిష్టం లేదండి. అందుకే కట్టలేదు. అయితే ఏటి?”
“రాఘవా! డ్రాయింగ్‌లో కూడా ఎగ్జామ్స్ ఉంటాయి తెలుసా నీకు.” అడిగింది రవళి.
“డ్రాయింగ్ లో పరీక్షలా? అవెలా రాయాలండీ. చెప్తారా? అవి రాస్తాను.” అన్నాడు ఆత్రంగా.
“రాఘవా! డ్రాయింగ్‌లో లోయర్, హయ్యర్ ఎగ్జామ్స్ ఉంటాయి. వాటి తరువాత కాకినాడలో ట్రైనింగ్ ఉంటుంది. గవర్నమెంటే కండక్ట్ చేస్తుంది. అన్నింటికీ నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు కట్టచ్చు. కానీ నువ్వు ఇంటర్మీడియేట్ పాసయి ఉండాలి. ముందు టెంత్‌లో ఉండిపోయిన సబ్జెక్ట్ క్లియర్ చేసి ఇంటర్‌లో జాయిన్ అవు. అదయ్యాక చెప్తే నాకు తెలిసిన డ్రాయింగ్ టీచర్ ఉన్నారు. ఆవిడకి పరిచయం చేస్తాను. ఆవిడే నిన్ను గైడ్ చేస్తారు. ముందు మాత్రం చదవాలి.” వివరంగా చెప్పింది.
“మీరు చెప్పినవన్నీ కంప్లీట్ చేస్తే ఉద్యోగం వస్తుందండీ?” అడిగాడు రాఘవ.
“డ్రాయింగ్ టీచర్ గా అప్లై చేసేందుకు అర్హత వస్తుంది. జిల్లాలో ఆ పోస్ట్‌లు తక్కువే. కానీ టీచర్స్ రిటైర్ అయితే ఆ పోస్ట్ ఫిల్ చేస్తారు. అయినా మనం ముందు మొహం కడుక్కుని రెడీగా ఉండాలి. అది ఒక్కటే కాకుండా ఇంకా ఏమన్నా వేరే సోర్స్ ఉందా? అన్నీ ఆ మేడమ్ చెప్తారు. సరేనా?” రవళి అడిగింది.
“సరే మేడమ్! మీరు చెప్పినట్లు చేస్తాను. టెంత్ పూర్తి చేసి కాలేజ్‌లో చదువుతాను.” తనకు ఇష్టమైన మార్గంలోకి వెళ్ళడానికి అప్పటివరకూ తను నిర్లక్ష్యం చేసిన చదువును ఆలంబన చేసుకునేందుకు ఒప్పుకున్నాడు రాఘవ.
***
“చదువు! చాలా గొప్పది. జీవితాన్ని, మనుషుల్ని, సమాజాన్ని అర్థం చేసుకునే శక్తినిస్తుంది. కష్టంలో ఉన్నపుడు ధైర్యాన్నిస్తుంది. ఎటువంటి పరిస్థితి నైనా ఎదుర్కొనే మనోబలాన్నిస్తుంది. నేర్చుకున్న విద్య అవసరానికి తప్పకుండా అక్కరకు వస్తుంది. ఒంటరితనంలో తోడవుతుంది. చదువు కేవలం మార్కుల కోసం కాదు. చదువుకున్న చాలా విషయాలు జీవితంలో అన్వయించుకోగలగాలి. లాంగ్వేజెస్‌లో ఉన్న మంచి కథలను అర్థం చేసుకుని స్ఫూర్తి పొందాలి. మీరు చదివే ప్రతీ సబ్జెక్ట్‌ని అలా ఎంజాయ్ చేస్తూ చదివితే అసలు చదువు కారణంగా టెన్షన్ రాదు.” రవళి క్లాస్‌లో చక్కగా చెప్పింది.
“అబధ్ధం! మేడమ్! మీరు చెప్పేదంతా అబధ్ధం!” వరండాలో నించుని వింటున్న టెన్త్ క్లాస్ నారాయణ అరిచాడు.
రవళికి నారాయణ తన మాటలను అదీ చదువు గురించి చెప్తుంటే ఖండిస్తూంటే కాస్త వింతగా అనిపించింది. అత్తెసరు మార్కులు తప్ప రావు. అవీ కూడా చదివే పిల్లలని భయపెట్టి, కాపీ కొట్టి వ్రాస్తాడని ప్రతీతి. క్లాస్‌లో అందర్నీ భయపెట్టే పెర్సనాలిటీ! అలాంటివాళ్ళు స్కూల్‌లో ఏడెనిమిది మంది ఉన్నా అందరికీ లీడర్ ఈ నారాయణే! ఇతన్ని జాగ్రత్తగా హాండిల్ చెయ్యాలనిపించింది.
“నారాయణా! నేను చెప్పేది నిజమనడానికి ఓ వంద ఉదాహరణలు చూపగలను. అబధ్ధమని నీకు ఎందుకు అనిపిస్తోంది? చెప్పగలవా?” రవళి అడిగింది.
“లేకపోతే ఏమిటి మేడమ్! రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? వాళ్ళల్లో చాలా మంది చదువుకున్నవాళ్ళుంటున్నారు. వాళ్ళకి కష్టాల్లోను, ఒంటరితనంలోను చదువు తోడుంటే వాళ్ళెందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు? ఇంతవరకెందుకు? ఈ స్కూల్ లోనే చదువుకుని అన్ని చోట్ల రేంకులు తెచ్చుకుంటూ టీచర్ అయింది మా అక్క లక్ష్మి. ప్రేమించిన వాడితోనే పెళ్ళి అయింది. రెండేళ్ళ క్రితం ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. దీనికేం సమాధానం చెప్తారు?” రోషం, దుఃఖం, కోపం కలగలిపిన స్వరంతో అడిగాడు నారాయణ.
చాలా షాకింగ్ గాను, బాధగాను అనిపించింది రవళికి. ‘మేడమ్ ఏం చెప్తారా?’ అన్నట్లు క్లాస్ అంతా ఎదురు చూస్తోంది.
రవళి టేబుల్ దగ్గరనుంచి నారాయణ దగ్గరకు వచ్చింది. నారాయణ చెయ్యి పట్టుకుని క్లాస్‌లో కూచోబెట్టి రెండో చేయి తల మీద చెయ్యి వేసి నిమిరింది.
“సారీ నారాయణా, వెరీ వెరీ సారీ! ఇంత బాధని మనసులో దాచుకున్నావని తెలియదు.” నారాయణ లేచి నిలబడ్డాడు. అతని కళ్ళ నిండా నీళ్ళున్నాయి.
“అవును. నారాయణ చెప్పింది నిజమే! చదువుకున్న వాళ్ళు కూడా చాలామందే సిల్లీ రీజన్స్‌కే ఆవేశంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అఫ్‌కోర్స్ మనకి అవి సిల్లీగా అనిపించవచ్చు. వాళ్ళకి అవే బలమైన కారణాలు! ఎందుకంటే తమ దగ్గర ఉన్న చదువును, అది ఇచ్చిన జ్ఞానాన్ని వాళ్ళు ఉపయోగించడం లేదు. సాధారణంగా ఎవరి జీవితంలోనైనా ప్రకృతి అనండి, దైవం అనండి, పూర్తిగా చీకటి నింపదు. ఏదో వైపు నుండి వెలుగు వచ్చే దారి ఉంచుతుంది. ఎటొచ్చీ మనకి కావలసింది ఏమిటంటే వెలుగు వస్తుందనే విశ్వాసం, ఆ వెలుగు వచ్చే మార్గాన్ని ‘అన్వేషించే’ ఓపిక, ధైర్యం. అవి ఉంటే ఇన్ని ఆత్మహత్యలు ఉండవు.” రవళి వివరంగా చెప్పింది.
క్లాస్ అంతా రవళితో ఏకీభవించినట్లనిపించింది కానీ, నారాయణ కన్విన్స్ అయినట్లనిపించలేదు. “నారాయణా! అసలు..” రవళి ఇంకా ఏదో చెప్పబోయింది. ఈ లోపల ఆ పిరీయడ్ అయిపోయినట్లు బెల్ అయిపోయింది.
“రేపు, మార్నింగ్ ప్రేయర్ బెల్‌కి ముందు ఒక ఎక్స్‌ట్రా క్లాస్ తీసుకుంటాను. నారాయణా! రేపు నువ్వు తప్పకుండా రావాలి. నారాయణ రేపు క్లాస్ ‘లీడ్’ చేస్తాడు.” అంది.
“మేడమ్! నాకిలాంటి సరదాలు లేవు. ఇంట్రెస్టు అసలే లేదు. నాకు చాలా బోర్ ఇవన్నీ. నన్ను వదిలేయండి” అన్నాడు కాస్త విసుగ్గా.
రవళి నవ్వింది. “నువ్వు నేను చెప్పింది అబధ్ధమని ఒక ఛాలెంజ్ చేసావు. ఆ ఛాలెంజ్‌ని నేను స్పోర్టివ్‌గా తీసుకుని, అందరికీ అర్థమయేటట్లు నీ చేతే ఆన్సర్ చెప్పిస్తానని ఆఫర్ ఇస్తుంటే వద్దంటున్నావు. అంటే ఆన్సర్ తెలుసుకోవాలని నీకు లేదనిపిస్తోంది. నిజానికి నువ్వు నిలబడి ఏమీ ఎక్స్‌ప్లెయిన్ చేయనక్కరలేదు. ఇదో గేమ్! సరే! నీవల్ల కాదంటే మరొకరికి ఈ ఆఫర్ ఇస్తాను.” అంది.
అరికాలి మంట నెత్తికెక్కినట్లయింది నారాయణకి. ఏదో చాలా ఫోర్స్‌గా అనబోయి అంతలోకే ఆగి “సరే ఆ ఆఫర్ ఏదో నేనే చూస్తాను.” అన్నాడు.
రవళి ఒక్క క్షణం ఆలోచించింది. ఈ క్లాస్ టెంత్ వాళ్ళకి కూడా చాలా హెల్ప్ ఫుల్ అవుతుంది అనిపించి “రేపు మార్నింగ్ క్లాస్ కోసం హెచ్.ఎమ్. సర్‌ని పర్మిషన్ అడుగుతాను. నారాయణా! మీ టెంత్ పిల్లలను కూడా రమ్మంటాను. వన్ అవర్ బిఫోర్ అందరమూ రావాలి. బుక్స్ ఇక్కడే ఉంచి మీరంతా చెట్టు కింద కూచోండి. రేపు అక్కడే క్లాస్ స్టార్ట్ చేస్తాను.” అని చెప్పి వెళ్ళిపోయింది. దీప, రమణమ్మ బ్రేక్‌లో కలుసుకున్నారు.
“మేడమ్! నారాయణ సరైనవాడు కాదు. అదో రకం స్వభావం. రేపు క్లాస్ పాడు చేస్తాడేమో అని భయంగా ఉంది.” రమణమ్మ చెప్పింది.
“అందుకే అతన్ని రేపు క్లాస్‌కి లీడర్‌ని చేసాను. అతని విషయం వదిలేసి మీ సంగతి చెప్పండి” అంది.
ఇద్దరి కళ్ళూ తమాషాగా మెరిసాయి. “చాలా ఉత్సాహంగా, కుతూహలంగా ఉంది మేడమ్! మీరు ఏంచెప్తారా? అని ఎదురుచూస్తున్నాం” దీప చెప్పింది.
“మరేం? నిశ్చింతగా వెళ్ళండి.” రవళి చిరునవ్వుతో వాళ్ళని పంపేసింది..
(ఇంకా ఉంది)
రాయప్రోలు సుజాతా ప్రసాద్ విశ్రాంత ఉపాధ్యాయిని. వీరి స్వస్థలం విజయనగరం. ప్రస్తుత నివాసం హైదరాబాద్. శ్రీ చాడ.లక్ష్మణమూర్తి, కళావతి దేవి గార్లు వీరి తల్లితండ్రులు. వీరి భర్త పేరు శ్రీ రాయప్రోలు సత్య ప్రసాద్. అమ్మాయి – మృదుల, వంశీకృష్ణ (అల్లుడు), ప్రహిత, శ్రీదస్తువన్ (మనుమలు); అబ్బాయి సిద్దార్థ, అనూష (కోడలు), విభాకర శ్రీప్రద్, విభాశ్రీ అనఘ. (మనుమలు).
సుజాతగారు ఎమ్.బియడ్., డిప్లొమా ఇన్ మ్యూజిక్ (వీణ) చేశారు. పుస్తకాలు చదవడం, రచనలు చేయడం, పాడడం, వీణ వాయించడం, త్రెడ్ వర్క్ తో ఆభరణాలు తయారు చేయడం వీరి ప్రవృత్తి.
వీరి కలం పేరు ‘సుప్రజ’. కథలు, నవలలు, వ్యాసాలు వ్రాశారు. ‘విధి విన్యాసం’, ‘తల్లిదండ్రులు’ బహుమతి పొందిన నవలలు. ‘గోవు మా లచ్మికి’, ‘యాత్ర’, ‘నాణేనికి రెండో వైపు’, ‘మనమెవరమని?’, ‘సరైన తండ్రి’, ‘చందన గంధి,’ ‘ముడుచుకున్న రెక్కలు’, ‘దేవతలే శపిస్తే’, ‘మార్పు’ మొదలైనవి వివిధ పోటీల్లో బహుమతి పొందిన కథలు.
