Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మథనం-6

[శ్రీమతి రాయప్రోలు సుజాతా ప్రసాద్ గారి ‘మథనం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మొదలయ్యే సమయంలోనే వరల్డ్ కప్ క్రికెట్ ప్రారంభం కావడంతో, ఆ ఆట మీద ఉన్న ఆకర్షణ వల్ల రవి సరిగా చదవలేకపోతాడు. ఫలితాలు వెలువడుతాయి. ఉమ స్కూల్ ఫస్ట్ వస్తుంది. రవికి ఆమె కంటే నలభై మార్కులు తక్కువ వస్తాయి. సరస్వతి, మహేశ్వరి తరవాత స్థానాలు సాధిస్తారు. ఉమకు ఒక ప్రైవేటు కాలేజీ వాళ్ళు ఫ్రీ సీటు ఇస్తారు. రవి, మహేశ్వరి గవర్నమెంట్ కాలేజ్‌లో జాయిన్ అవుతారు. సరస్వతికి మాత్రం తల్లిదండ్రులు పెళ్ళి చెయ్యాలని నిర్ణయించి, పై చదువులు చదివించరు. విషయం తెలిసి బాధపడుతుంది రవళి. కాలేజీ చదువులకి ప్రత్యామ్నాయాలను సరస్వతికి సూచిస్తుంది రవళి. ఒక రోజు స్కూలుకి తొందరగా వెళ్ళేసరికి ఒక కుర్రాడు నోటీస్ బోర్డు మీద బొమ్మ వేస్తూ ఉంటాడు. అతడిని డిస్ట్రర్బ్ చేయడం ఇష్టం లేక, స్టాఫ్ రూమ్‍కి వెళ్ళి కాసేపటి తర్వాత వచ్చి చూస్తే, ఆ అబ్బాయి అక్కడ ఉండడు. పొలం గట్టున మేస్తున్న ఆవు, దాని దూడ బొమ్మలు గీసి ఉంటాయి. కొంతమంది పిల్లలు అక్కడికి రావడంతో, ఆ బొమ్మ గీసిన అబ్బాయెవరని అడుగుతుంది రవళి. అతని పేరు రాఘవ అని, కిందటేడు టెంత్ పోయిందని, మళ్ళీ కట్టలేదని తెలుస్తుంది. తాను పిలిచానని చెప్పి అతన్ని మరునాడు బడికి పిల్చుకు రమ్మంటుంది. కానీ అతను రాడు. ఓ రోజు బస్ కోసం ఎదురుచూస్తున్నప్పుడు అక్కడ రాఘవ కనబడతాడు. అప్పుడు డ్రాయింగ్ గురించి, డ్రాయింగ్ ఎగ్జామ్స్ గురించి చెప్పి, అతను తిరిగి చదువుని కొనసాగించేలా ఒప్పిస్తుంది రవళి. ఒకరోజు రవళి క్లాసులో చదువు ప్రయోజనం గురించి గొప్పగా చెప్తుంటే, నారాయణ అనే పదో తరగతి కుర్రవాడు అదంతా తప్పని అంటూ, తమ కుటుంబంలో జరిగిన సంఘటన గురించి చెప్తాడు. రవళి అతన్ని ఓదార్చి నచ్చజెప్పబోతుంది. అతను వినడు, వాదిస్తాడు. మర్నాడు తానొక గేమ్ ఆడించి దాని ద్వారా అతని చేతే ఆన్సర్ చెప్పిస్తానని అంటుంది. మొదట కాదన్నా, తర్వాత ఒప్పుకుంటాడు నారాయణ. దీప, రమణమ్మలతో పాటు మిగతా పిల్లలు కూడా ఆ గేమ్ పట్ల ఆసక్తి ప్రదర్శిస్తారు. – ఇక చదవండి.]

మర్నాడు రవళి వచ్చేసరికి పిల్లలంతా చెట్టుకింద ఉన్నారు. రవళి డైరెక్టుగా ముందు రూమ్ లోకి వెళ్ళి పది నిమిషాల్లో పిల్లల దగ్గరకు వచ్చింది.

“నారాయణా! క్లాస్‌లో కొన్ని బహుమతులు ఉన్నాయి. వెళ్ళి తీసుకురా!” అంది.

పిల్లలతో ఈలోగా నాలుగు లేక ఐదు అక్షరాల పదాలతో వర్డ్ బిల్డింగ్ ఆడించడం ఆరంభించింది. నారాయణ వెళ్ళి రెండు నిమిషాల్లో వచ్చాడు. అతని చేతిలో ఒక పెన్సిల్, స్కేలు, నోట్ బుక్ ఉన్నాయి. “ఇంకా ఉంటాయి, మళ్ళీ వెళ్ళు” అంది రవళి.

నారాయణ వెళ్ళి ఈసారి ఓ పెన్, చాక్లేట్, ఓ స్వీట్ తెచ్చాడు. “ఇంకా ఉన్నాయి నారాయణా! ఇదే నీకు లాస్ట్ ఛాన్స్! ఫైవ్ మినిట్స్ తరువాత నువ్వు వచ్చేయాలి.” అంది సీరియస్‌గా. నారాయణ ఈసారి ఐదు వస్తువులు గర్వంగా తెచ్చాడు. రవళి చప్పట్లు కొట్టింది. నారాయణ గర్వంగా ఫీల్ అయాడు.

“గుడ్! బాగా తెచ్చావు. కానీ ఇంకా ఉన్నాయి. ఈసారి ఛాన్స్ దీపది. దీపా! నువ్వు వెళ్ళి చూడు” అంది

“మేడమ్! మేము ఇద్దరం కలిసి వెతుకుతాం. ప్లీజ్! ఛాన్సివ్వరా?” ఆరాటంగా రమణమ్మ అడిగింది. దీప కూడా ఆశగా చూస్తోంది.

“సరే! ఈ యూనిటీని మీరు ఎప్పుడూ ఉంచుకోవాలి సరేనా! వెళ్ళండి. మీకు టెన్ మినిట్స్ టైమ్!” అంది. నారాయణ “మేడమ్! ఇది అన్యాయం! వాళ్ళకి టెన్ మినిట్సా? నాకు ప్రతీసారీ ఫైవ్ మినిట్సే ఇచ్చారు.” అన్నాడు ఉడుకుమోత్తనంగా!

“వెళ్ళగానే కనపడే ప్లేసెస్ అన్నీ నువ్వు చూసేసావు. వాళ్ళ వెదుకులాటకి టైమ్ పడుతుంది. అదీ కాక నువ్వు టోటల్ పదిహేను నిమిషాలు తీసుకున్నావు. బాగానే తెచ్చావు. ఐ యామ్ హ్యాపీ!” అంది.

“మేడమ్! పుస్తకాల బ్యాగ్‌లలో కూడా మేము వెతకాలా?” అడిగింది రమణమ్మ.

“యస్! వెతకండి” అంది.

పరుగెట్టబోతున్న రమణమ్మను చెయ్యి పట్టి ఆపి దీప “మేడమ్! అన్ని బ్యాగ్‌లు పది నిమిషాల్లో వెతకడం అవదు. అంటే ఏదో ప్రత్యేకమైన లైన్ ఉంటుంది. అదేమిటో చెప్పండి.” అడిగింది.

రవళికి ముచ్చటేసింది. “వెరీ గుడ్! అమ్మాయిల వైపు ఆఖరిలైన్ లో ఉన్న నాలుగు బ్యాగ్‌లు చూడండి. ఆ లైన్ లోకూచునే ఆ నలుగురు అమ్మాయిలకీ దీప వాళ్ళు ఆ బ్యాగ్స్ చూస్తే అభ్యంతరం ఏమీ లేదు కదా!” అంది. వాళ్ళు లేదన్నారు.

నారాయణకి తనకి వాళ్ళకి తేడా తెలిసింది. సరిగ్గా టెన్ మినిట్స్ అయాక అందర్నీ తీసుకుని క్లాస్ లోకి వెళ్ళింది రవళి. దీప రమణమ్మ వాళ్ళు పోగు చేసిన వస్తువులు ఇరవై దాకా టేబుల్ మీద పోసారు. అంతా ఆశ్చర్యపోయారు. చప్పట్లు మాట్లాడాయి.. రకరకాల పెన్నులు, పెన్సిళ్ళు, చాక్లెట్లు ఉన్నాయి.

రవళి మొహంలో కాస్త నిరాశ కదలాడింది. ‘ఇంకోటి ఉంచేసారు’ అనుకుంది. అందరినీ సైలెంట్‌గా కూచోమని తను చెప్పాల్సింది చెప్పబోయింది.

ఈలోగా దీప, రమణమ్మ మళ్ళీ వచ్చారు. “మేడమ్! ఇంకా ఈ కంపాస్ బాక్స్, ఈ కవరు ఉన్నాయి.” అంటూ టేబుల్ మీద పెట్టారు. “వెరీ గుడ్! అన్నీ తెచ్చేసారు.” అని రవళి వాళ్ళను మెచ్చుకుని కూచోమంది.

“ఈ రోజు ఇది ఓన్లీ గేమ్ కాదు. ఒక పాఠం. ఇది నా ఐడియా కూడా కాదు.. ‘ కోహల్’  అనే ఒక ప్రఖ్యాత మానసిక శాస్త్రవేత్త తన కొడుకు పుట్టినరోజు నాడు ఆ అబ్బాయికి నేర్పిన అమూల్యమైన పాఠం. ప్రకృతి, మన కోసం ఇలా జీవించడానికి ఎన్నో ఛాన్స్‌లు ఉంచుతుంది. కొన్ని రహస్యంగా, కొన్ని ఓపెన్‌గా! వాటిని అన్వేషించాలి. ఎంత కష్ట సమయంలోను ఆత్మహత్య పరిష్కారం కాదు. కొంత వరకూ చూసి లేదనుకుంటాం. అన్ని దారులూ మూసుకుపోయాయి అనుకుంటాం. కానీ అది తప్పు. ఆయుష్షు ఉన్నంతవరకూ ఈ ‘అన్వేషణ’  ఆగకూడదు. నారాయణ కొన్ని తెచ్చి కొన్ని వదిలేసాడు. మన కోసం దాచినవి మనం ఉపయోగించుకోకపోతే అవి అలానే ప్రకృతిలో ఉండిపోతాయి. ఏం! అర్థమైందా?” నారాయణ వైపు తిరిగి అడిగింది.

నారాయణ అర్థమైంది అనలేదు కానీ, ప్రయత్నం చేస్తున్నట్లు అనిపించింది.

“నేను నిన్న స్కూల్ వదిలాక, రూమ్‌లో కనపడని జాగాలలో కొన్ని పెట్టాను. మీరు చేసిన ప్రాజెక్టుల మధ్య, బోర్డు వెనుక, టేబుల్ డ్రాయర్ లోను ఇలా ఆలోచించి పెట్టాను. మీద వెంటిలేషన్ కోసం ఉన్న చిన్న కిటికీలో మన వాచ్‌మన్ చేత ఈ కంపాస్ బాక్స్, కవరు పెట్టించాను. ఈ రోజు మరికొన్ని చిన్న వస్తువులు పెట్టాను. నారాయణ కిటికీ ఎక్కి తీస్తాడని అనుకున్నాను. దీపా! మీకెందుకు ఆ మీదకి చూడాలనిపించింది?” అడిగింది.

“మేడమ్ ఎప్పుడూ లేనిది ఆ పెద్ద స్టూల్ ఇక్కడ ఉండడం, కంపాస్ బాక్స్ లోని మిగతా వస్తువులు విడివిడిగా ఉండడంతో బాక్స్ కూడా ఉండాలని వెతికాం. దొరికింది. ఆ స్టూల్ మీంచి రమణమ్మ కిటికీ లోకి ఎక్కి వెంటిలేటర్లో బాక్స్ వెతికింది. దొరికింది. అందులోనే ఈ కవరు ఉంది.” అంది దీప.

రవళికి వాళ్ళ లాజిక్‌కి ఆనందంతో కళ్ళలో నీళ్ళు తొణికిసలాడాయి. ఇద్దరినీ రమ్మనమని చెరో చేత్తో దగ్గరకు తీసుకుంది. “శభాష్! ఇలాగే ఉండాలి. చదువు మీకు ఇచ్చే జ్ఞానాన్ని రియల్ లైఫ్‌లో ఉపయోగించాలి. ప్రాక్టికల్‌గా దాన్ని ఉపయోగిస్తే చాలా స్ట్రగుల్స్ తప్పుతాయి.” అంది.

“మేడమ్! ఏదన్నా ఎగ్జామ్పుల్ చెప్పండి”. టెంత్ క్లాస్ లోంచి రమేష్ అడిగాడు.

“ఇప్పుడు మీరు సైన్స్ లెసన్‌లో పురుషుడిలోనే ‘ఎక్స్, వై’  క్రోమోజోమ్ లు ఉంటాయని, స్త్రీలో కేవలం ‘ఎక్స్, ఎక్స్’  మాత్రమే ఉంటాయని, చదివే ఉంటారు. మగ లేదా ఆడ సంతానానికి బాధ్యత పురుషుడిదేనని మీకు అర్థమయే ఉంటుంది. మీరు మీ ఇంట్లో ఇలాంటి సిట్యువేషన్ వచ్చినపుడు వివరించగలగాలి.” అని మగ పిల్లల వైపు తిరిగి.. “ఇంట్లోను పైన కూడా ఆడపిల్లలని కన్నదని మీ ఇంట్లో ఆడవాళ్ళని నిందిస్తుంటే దానికి కారణం ఆడవాళ్లు కాదు, మగవాళ్ళు అని ఆ నిందలు వేసిన వాళ్ళకి మీరు చెప్పాలి. వాళ్ళని ఎడ్యుకేట్ చెయ్యగలగాలి. అది ప్రాక్టికాలిటీ! చదువు ఇచ్చిన జ్ఞానాన్ని, తెలివిని, రియల్ లైఫ్‌లో ఉపయోగించుకోకపోతే ఆ చదువు వ్యర్థం అవుతుంది. ఏమర్రా? అలాంటి సిట్యువేషన్ మీకే వస్తే మీ పెద్దల నిందల నుంచి, సమాజం కోరల నుంచి మీ ఇంటి ఆడపిల్లలని కాపాడతారా?” మగ పిల్లల వైపు చూసి అడిగింది. మగ పిల్లలు ఉత్సాహంగా హేండ్స్ రైజ్ చేసారు.

“ఒ.కే. వెరీ గుడ్! ఈ రోజు ఈపాఠం నుంచి ఏ కొద్దిమంది ఇన్స్పైయిర్ అయినా నాకు చాలా సంతోషమే. ఒక పరీక్షలో, పోటిలో గెలవాలంటే, ఎంతో ప్లానింగ్‌తో పనిచేయాలి. ఫస్ట్ రావాలనుకునే వాళ్ళు తక్కిన వాళ్ళకంటే డిఫెరెంట్‌గా ఆలోచించాలి. కొత్త దారులు అన్వేషించాలి. అలాంటిది జీవితంలో గెలుస్తూ ఉండాలంటే ఎంత ఏక్టివ్‌గా, క్రియేటివ్‌గా ఉండాలి! ఆలోచించండి. అందరూ ఒకే దగ్గర, ఒకేలాగ గెలవక్కరలేదు. వేరు, వేరు ఛానెల్స్ ఉంటాయి. మనకి ఏది నప్పుతుందో తెలుసుకోవాలి. ఒకోసారి మనకి ఇష్టమైనది దొరకదు. కానీ మనకి లభించినదాన్ని ఇష్టపడడం, దానిలో ఆనందం అన్వేషించడం తెలియాలి. ఈ రోజుకి ఈ క్లాస్ చాలు.” అనగానే

“మేడమ్! మళ్ళీ ఇలాంటి లెసన్ ఎప్పుడు చెప్తారు” అని అరిచారు పిల్లలు.

“వీలు చూసుకుని చెప్పుకుందాం”. రవళి ప్రసన్నంగా అంది.

“మేడమ్! ఈ వస్తువులన్నీ ఏం చేస్తారు? ఇవన్నీ ప్రకృతి రూపంలో మీరు మాకు ఇచ్చినట్లు కాదా?” నారాయణ బ్యాచ్ లోని రాజేష్ రవళిని అడిగాడు.

“నీకు దాని మీద ఏ విధంగా అధికారం ఉందో చెప్తే, అప్పుడు ఆలోచిస్తాను.” అంతకంటే గట్టిగా చెప్పింది రవళి. నారాయణని పిలిచి దీప వాళ్ళు తెచ్చిన కవర్లోంచి వంద రూపాయల నోటు తీసి “ఇందులో థర్టీ రుపీస్‌తో నీకు నచ్చిన చాక్లెట్లు కొనుక్కో. మిగతా అమౌంట్‌తో ఈ రోజు క్లాస్‌కి అటెండ్ అయిన వాళ్ళందరికీ చాక్లెట్లు కొని ఇవ్వు. ఈ కంపాస్ బాక్స్ దీప, రమణమ్మలకు బహుమతి. మీరు వెతికి తెచ్చిన చాక్లేట్స్ అన్నీ మీ ముగ్గురికీ సమానం. మిగతా వస్తువులను కవర్లో పెట్టి నాకు ఇచ్చేయండి.” చెయ్యవలసింది చెప్పేసి రవళి క్లాస్ లోంచి పైకి వెళ్తుంటే పిల్లల చప్పట్లతో క్లాస్ మారుమోగింది.

***

ఆ ఏడాది టెక్స్ట్ పుస్తకాలు రావడం లేటయింది. దాంతో పిల్లల దగ్గరనుంచి కలెక్ట్ చేసిన పాత పుస్తకాలు నైన్త్ క్లాస్ పిల్లకు పంచమని హెచ్.ఎమ్.గారు రవళికి చెప్పారు. వాటి డిటెయిల్స్ రిజిస్టర్‌లో నోట్ చేయాలని చెప్పారు. కారణం ఏమైనా గానీ మేథ్స్ టెక్స్ట్‌లు చాలా తక్కువ ఉన్నాయి. వాటిని క్లాస్‌లో తను తెలివయిన వాళ్ళు అనుకున్న వాళ్ళకి ప్రియారిటీ ఇస్తూ ఇచ్చింది. పుస్తకాలు ఇవ్వడం ప్రారంభం అయిన దగ్గరనుంచి సత్తిబాబు అనే అబ్బాయి మేథ్స్ పుస్తకం కోసం అడుగుతూనే ఉన్నాడు. కానీ రవళి చూసినంతవరకూ సత్తిబాబు చాలా డల్ స్టూడెంట్. అతని కంటే ఆ పుస్తకమే మరో చదివే పిల్లడికి ఇస్తే ఎంతో లాభం అనిపించింది. పుస్తకాలు పంచడం అయేసరికి సత్తిబాబు “మేడమ్ అన్ని సార్లడిగినా నాకు టెక్స్ట్ పుస్తకమే ఇవ్వలేదండీ.” అన్నాడు.

“ఈసారి మొట్ట మొదట నీకే ఇస్తాను. ఇప్పుడు స్టాక్ చాలా తక్కువ ఉంది. ఏమీ అనుకోకు” అని చెప్పేసి వెళ్ళిపోయింది. సత్తిబాబు కళ్ళలో నిరాశ రవళిని వెంటాడుతున్నట్లే ఉంది.

మర్నాడు గుర్తుగా మేథ్స్ సర్‌తో ఈ విషయం చెప్పింది. “కొంచెమే పుస్తకాలు ఉన్నాయి. కొంచెం బాగా చదువుతారనుకున్న వాళ్ళకి ఇచ్చేసరికి అయిపోయాయి. మిగతా అందరూ ఊరుకున్నారు గానీ కారణం తెలీదు సత్తిబాబు మాత్రం అలాగ అడుగుతూనే ఉన్నాడు. ఈసారి మళ్ళీ పుస్తకాలు రాగానే అతనికి ఇవ్వాలి.” అంది.

మేథ్స్ సర్ చక్రవర్తి వెంటనే “లేదు మేడమ్! సత్తిబాబు లెక్కలు బాగా చేస్తాడు. లాజిక్ ఉపయోగిస్తాడు. రీజనింగ్ కూడా ఫర్వాలేదు. క్లాస్‌లో ఫస్ట్ అని చెప్పను గానీ ఫస్ట్ టెన్ ప్లేసెస్‌లో ఉంటాడెప్పుడూ. అయ్యో! వాడికివ్వాల్సింది మేడమ్! మీకు తెలియదు కదా! పోన్లెండి. ఈసారి మీరన్నట్లు ముందుగా ఇద్దాం.” అన్నాడు.

రవళి తెల్లబోయింది. “అవునా? నా సబ్జెక్ట్‌లో అతను చాలా వీక్‌గా ఉన్నాడు. కాస్త సులభమైన సబ్జెక్ట్ లోనే అలా ఉన్నాడు కష్టమైన మేథ్స్ ఏం చేస్తాడులే అనుకున్నానండీ. సారీ! ఎంత పనయింది? నేను వెళ్ళి పాత పుస్తకాలలో మరోసారి వెతికి ఉంటే అతనికి ఇస్తాను.” అంది.

“చూడాలంటే చూడండి. అందులోంచి తీసినవే కదా మీరు ఇచ్చారు. ఫర్వాలేదు లెండి. నేను ఏదోలా మేనేజ్ చేస్తాను.” అన్నారు.

రవళి మనసు వ్యాకులత చెందింది. తెలియకుండానే తన వల్ల ఒక పిల్లడికి అన్యాయం జరిగిపోయింది. తరువాత మళ్ళీ ఒకసారి పాత పుస్తకాలలో జల్లెడ పట్టింది. దొరకలేదు. ఆ తరువాత ఇంక మురళీకి ఫోన్ చేసింది.

“మురళీ! మీ దగ్గర పాత నైన్త్ క్లాస్ మేథ్స్ బుక్ ఉంటే తీసుకురావా? ఇక్కడ ఒక అబ్బాయికి తగ్గింది. అతనికి ఎలా అన్నా ఇవ్వాలి” అంది.

“చూస్తానులే. ఉంటే తీసుకొస్తాను. ఎక్కడా ఇంకా కొత్త పుస్తకాలు రాలేదు కదా. అందుకు ప్రతీ స్కూల్ లోను ఆ షార్టేజి ఉంది. అయినా నేను ట్రై చేస్తాను.” అని ఫోన్ పెట్టేసాడు.

తరువాత రవళి జరిగిన సంఘటన వివరంగా మురళికి మెసేజ్ పెట్టింది. “నా వల్ల అనుకోకుండా జరిగిన పొరపాటు నేను దిద్దుకుంటే బావుంటుంది.” అని ముగించింది. తనకి తెలుసు. విషయం అర్థమైతే మురళి తన కోసం ఆ పని చేసి పెడ్తాడు.

మద్యాహ్నం బ్రేక్‌లో నైన్త్ క్లాస్ మార్క్స్ రిజిష్టర్ తీసుకుని సత్తిబాబు మార్కులు చూసింది. నిజంగానే అన్ని సబ్జెక్ట్స్ కంటే మేథ్స్ బావున్నాడు. ఇక మీదట ఇలాంటి పొరపాటు జరగకూడదు అనుకుని తన సబ్జెక్ట్‌లో ఎవరెవరు వీక్‌గా ఉన్నారో లిస్ట్ చేసుకుని వాళ్ళు మిగతా సబ్జెక్ట్స్‌లో ఎలా ఉన్నారో చూసింది. అన్నింటిలోను వాళ్ళు వెనుకబడితే దానికి వేరే జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నింటిలో బాగుండి తన సబ్జెక్ట్‌లో బావులేరంటే తను తీసుకోవలసిన స్టెప్స్ ఎలాంటివో ఆలోచించి పెట్టుకోవాలి.

ఈ రోజు ఈ సంఘటన తనకొక కొత్త పాఠం నేర్పింది. మర్నాడు మురళి తెచ్చిన పాత పుస్తకం సత్తిబాబుకి ఇచ్చేవరకూ రవళికి మనశ్శాంతి అనిపించలేదు. సత్తిబాబు కళ్ళలో ఓ కెరటంలా తొంగి చూసిన ఆనందం రవళి బాధను, మందురోజు నుంచి పడుతున్న గిల్ట్‌ను పోగొట్టింది.

***

“లేదు మేడమ్! దీప, రమణమ్మ వాళ్ళు టెంత్ కదా! ఈ సారి కాంపిటీషన్స్‌కి వాళ్ళు వద్దు.” హెచ్.ఎమ్. గారి మాటలకి హతాశురాలయింది రవళి.

“సర్! ప్లీజ్! అలా అనవద్దు. పిల్లలు నిరాశ పడతారు. ప్లీజ్! గివ్ దెమ్ పర్మిషన్!” రిక్వెస్ట్ చేసింది రవళి.

“మీరేమో ఇలా అంటారు. మిగతా సబ్జెక్టుల వాళ్ళు పిల్లలని మీ దగ్గరకి పంపడానికి సిధ్ధంగా లేరు. వాళ్ళ పీరియడ్స్ పోతున్నాయని గోల పెడుతున్నారు. వాళ్ళమాట కూడా నేను తోసేయలేను కదా!” అన్నారు హెచ్.ఎమ్. తనమీద నేరం ఉంచుకోకుండా.

“సర్! ఒక్క రోజుకి అలా అంటున్నారా? అసలు ఒక మంచి ప్రయత్నానికి సపోర్ట్ చేయకపోగా,” అని ఒక్క నిమిషం ఆగి “సరే! ఎవరి పీరియడ్స్ లోను నేను పిల్లలను పంపమని అడగను. ఈవినింగ్ స్కూల్ అయాక నేను, వాళ్ళు ఉంటాము. వాళ్ళని తీసికెళ్ళడానికి మీరు ఒప్పుకుంటే చాలు.” అంది. రవళి.

“ఎందుకు మేడమ్! అంత ప్రయాస! ప్రైజు వీళ్ళకే వస్తుందని గ్యారంటీ ఏమిటి?” అప్పుడే అటు వచ్చిన మేథ్స్ సర్ అన్నారు. రవళి కోపం ఆపుకుంది.

“రాదని మీరెలా చెప్తారండీ? ఈ రోజు వరకూ వాళ్ళు స్కూల్‌కి ఏదో ఒక బహుమతి తెచ్చారు. అయినా బహుమతి అనేది మోర్టల్! దానికోసం ఎంతో కొంత నేర్చుకుని ఎదగడమన్నది ఇమ్మోర్టల్. నేను వాళ్ళకి ఇది చెప్పే తీసికెళ్తాను.” అని హెచ్.ఎమ్. గారి వైపు తిరిగి

“సర్! జిల్లా మొత్తం మీద టెంత్ లో 9.5 పాయింట్స్ దాటేవాళ్ళు చాలా మందే ఉంటారు. కానీ ఈ పోటీలో గెలిస్తే జిల్లా అంతటికీ ఒకరిగా గుర్తింపు వస్తుంది. పేపర్‌లో న్యూస్ వస్తే ఫలానా స్కూల్ విద్యార్థినులు అని మన స్కూల్ పేరు వస్తుంది గానీ నాకేమీ ఇందులో లాభం లేదని గుర్తించండి. ఇక మీ ఇష్టం. నేను చెప్పడానికి కూడా ఏమీ లేదు. ఇంత మంది అభిప్రాయానికి వ్యతిరేకంగా నేను మాత్రం ఏం చేయగలను?” అంతులేని నిరాశతో వెను తిరిగింది రవళి.

“ఆగండి మేడమ్! ఇక వాళ్ళిద్దరిని మాత్రమే ఎందుకు? జూనియర్స్‌లో కూడా సెలక్ట్ చేసి తీసికెళ్ళండి. వాళ్ళని స్కూల్ అవర్స్‌లో మీ దగ్గరకి పంపుతాను. కానీ దీప, రమణమ్మలని మాత్రం మీరన్నట్లు స్కూల్ అవర్స్ అయాకే ప్రిపేర్ చెయ్యండి. ఇంతకీ ఏమిటి? గురజాడ అప్పారావు గారి వర్ధంతి కేనా ఈ పోటీలు” ఏమూలో ఉన్న సాఫ్ట్ కార్నర్ కరిగినట్లు హెచ్.ఎమ్. గారన్నారు.

“థాంక్యూ సర్! థాంక్యూ వెరీ మచ్! అవునండీ. గురజాడ వారి వర్ధంతి సందర్భంగానే ఈ పోటీలు.” చెప్పేసి తేలికయిన మనసుతో రూమ్ లోంచి పైకి వచ్చింది.

(ఇంకా ఉంది)

Exit mobile version