[శ్రీ వేదాంతం శ్రీపతి శర్మ రచించిన ‘మతి లేని మనిషి’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]
అమ్మలు అనగానే చిన్న పిల్ల అనుకునేరు – అది ఈ అరవై దగ్గర పడుతున్న సరళమ్మకు ఎనభై వైపు చూస్తున్న ప్రక్కింటి పిన్ని గారు ముద్దుగా పెట్టుకున్న పేరు!
“పని పూర్తి కాలేదా అమ్మలూ?” అన్నారు పిన్ని గారు చక్కని గమకం ఉట్టి పడే కంఠంలో.
“ఇదుగో ఇప్పుడే” అంటూ తలని గోడకి సమర్పించింది అమ్మలు. చాలా కాలం క్రితం రెండు కుటుంబాలూ పోట్లాడుకుని ఆ గోడని వంతులు వేసుకుని మరీ పెంచుకుంటూ వచ్చారు. వీళ్ల కోసమే కాబోలు ఇప్పటికైనా శాంతించి ఇక్కడితో వదిలేసారు.
“ఏవంటున్నారు సార్ వారు?” పిన్ని గారు అడిగారు.
నిట్టూర్చింది అమ్మలు.
“ధరలు మితి మీరిపోతే ఫరవాలేదు కానీ పిన్ని గారూ, మతిమరుపు కరకట్టలు దాటేస్తే ఎలా?”
“అస్సలేదీ గుర్తుండటం లేదా?”
“అలా అని కాదు. ఎవరైనా ఇంటికి వస్తే చక్కగా నవ్వుతూ ముందర కూర్చుంటారు. నాకోసం పేరంటానికి వచ్చిన వారైనా సరే ఆయన కోసం వచ్చినట్లు షర్ట్ మీద అత్తరు చల్లుకుని వచ్చి కుర్చీలో కూర్చుని చిరునవ్వు ప్రదర్శిస్తారు.”
“అయ్యో!”
“మరి? అర్థం చేసుకున్న వారైతే ఫరవాలేదు గానండీ, ఈ మధ్య పేరంటానికి వచ్చే వారికి క్షణం తీరిక ఉండటం లేదు.”
“అస్సలు.”
“మొన్న ఒక అమ్మాయి నన్ను రెండు సార్లు కేక వేసింది. నేను వంటింట్లో ఉన్నాను.”
“పనిలో ఉన్నావు నువ్వు.”
“మరండీ. ఆ అమ్మాయి ఆయన చేతికే తాంబూలం ఇచ్చి వెళ్లిపోయింది!”
“సరిపోయింది.”
“నేను వరండాలోకి వచ్చేసరికి తమలపాకులు చక్కగా సేవించి కూర్చున్నారు.”
“ఏం పనండీ ఇది? అని అడిగాను.”
“వరలక్ష్మి వచ్చి తాంబూలం ఇచ్చి కాళ్లకి నమస్కారం చేసింది ఎందుకో”, అన్నారు.
“ఆహా! బాగుంది. ఆయనకు పెడితే నీకు పెట్టినట్లేగా?”, పిన్ని గారు వ్యాఖ్యానించారు.
“అలాగే అనుకున్నాను. కానీ వాళ్లింట్లో పేరంటానికి కూడా ఆయనకే బొట్టు పెట్టి పిలిచింది. నేను తల బాదుకుని – ఇంతకీ ఆమె వరలక్ష్మి కాదు, భవాని అన్నాను.”
“పోనీలే. అమ్మాయి అని గుర్తించారు చాలు. అవునూ, అలా చెప్పినప్పుడు ఏమీ ఆలోచించరా?”
“ఎందుకు నవ్వుతారో నవ్వుతారు. నవ్వి నాలుక చూపించి పండిందా? అన్నారు!”
“బాగుంది వేళాకోళం. డాక్టర్ ఏవంటాడు?”
“ఎక్కువగా మాట్లాడిస్తూ ఉండమంటాడు.”
ఎదురింటి బాల్కనీలో ఓ పెద్దాయన ఒక్క అక్షరం పోనివ్వకుండా ఈ సంవాదం వింటూ ఉంటాడు.
“ఇంకొక్క మాట మాట్లాడ్డానికి వీల్లేదు తెలిసిందా?” – ఆయనకు లోపలి నుండి ఎవరో ఎందుకో చెబుతున్నారు!
***
“నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడు ముద్దు” అన్నాడు ఆత్రేయ. సార్ వారు మామూలుగా నడుస్తూ ఉంటేనే అన్ని అవయవాలూ స్వాతంత్ర్యం ప్రకటించి స్వచ్ఛందంగా నాట్యం చేసేస్తాయి. అయినా సరే ఆయన వాకింగ్ మానరు. కనిపించిన వారిని చూసి చక్కగా నవ్వుతారు. పూర్తిగా మతిమరుపా? తెలియదు. ఎవరైనా ఎదురుగా వచ్చి “ఎలా ఉన్నారు?” అని అడిగితే కళ్లెగరేసి తల ఆడిస్తారు.
ఆ మధ్య ఒకాయన కొద్ది సేపు ఆయనతో కలసి వాకింగ్ చేద్దామనుకున్నాడు.
“మా వాడు శలవులకి వస్తున్నాడు. మీ వాడు?” అని అడిగాడు.
“మామిడి పండ్లు తినొద్దన్నాడండీ డాక్టరు” అన్నారు సార్ వారు.
“అది కాదండీ.. మా వాడూ..”
“మా మావగారా? పోయి చాలా కాలం అయింది.”
ఆయన నమస్కారం పెట్టేసాడు. ఈయన ప్రేమగా భుజం తట్టాడు.
ఈ వ్యవహారం అమ్మలుకి పూర్తిగా తెలిసేసరికే చాలా కాలం పట్టింది. కొత్తల్లో వినికిడి సమస్య అన్నారు డాక్టర్లు. అది కాదని తేలిపోయింది. ఆ తరువాత ఎవరూ పలుకనివి ఏవో వినిపిస్తున్నాయన్నారు. అన్ని పరీక్షలూ చేసి అది కూడా కాదన్నారు ఇద్దరు ముగ్గురు డాక్టర్లు. వయసు బాగా మీద పడ్డ ఒక పెద్ద డాక్టరు గారు మటుకూ కళ్లు మూసుకుని చక్కని తత్త్వ బోధ చేసాడు. చేతిని చిన్ ముద్ర లోకి తీసుకెళ్ళాడు. “తల్లీ..” అన్నాడు, “..ఇది వయసు సమస్య. మామూలుగా ఒక సమయంలో ప్రేమగా దుప్పటీ కప్పుతారు. కొంత కాలం తరువాత దానిని మనిషి మీదకి విసిరేస్తారు – అలా జరిగినప్పుడు ఆ దుప్పటీది అస్సలు దోషం ఉండదు సుమా! అది మీదకొచ్చి ప్రేమగా వాలిపోతుంది. వయసు కూడా అంతే ప్రేమగా మీదకొచ్చి అలా పడిపోతుంది.”
“మరి ఏం చెయ్యాలి?”
“హ హ! దుప్పటీ మంచిదా చెడ్డదా, అన్నది అప్రస్తుతం. దానిని మనం కూడా ప్రేమగా, ఎంతో ఆప్యాయతతో గట్టిగా చక్కగా దగ్గరకి తీసుకుని దానితో అనిర్వచనీయమైన అనుబంధాన్ని ఏర్పరచుకుని, నెత్తి మీదకి తోసి-కాదు నెత్తి మీద పెట్టుకుని కళ్ళు మూసుకుని గుడ్డిగా ప్రేమించాలి. శేష జీవితం దానితోనే గడవబోతోందన్నది ఎంత త్వరగా అవగాహనలోకి వచ్చేస్తే భవిష్యత్తుకు అంత మంచిది.”
అమ్మలు సామాన్యురాలు కాదు. వేయి రూపాయలు ఫీసుగా ఇచ్చింది ఇది వినటానికా అనుకుని చక్కగా మోకాళ్ల మీద వ్రాలి ఆయన పాదాలకు నమస్కారం చేసుకుంది. ఆ ఆసుపత్రిలో అలా ఎన్నడూ జరగలేదు! అంచాత కాబోలు ఎందుకైనా పనికొస్తుందని ఆసుపత్రి సిబ్బందిలో వారొకరు లటుక్కున ఒక ఫొటో కూడా తీసేసాడు.
***
గోడ దగ్గర మరల సమావేశం అయ్యారు ఇద్దరూ.
“సార్ వారు ఏవంటున్నారు?”
“నా వల్ల కావటం లేదు పిన్ని గారూ!”
“నీ వల్లే కావటం లేదంటే ఇంకేం మాట్లాడతాం? మీ బాబాయి సంగతి అడగవేం? “
“అవును పిన్ని గారూ! బాబాయి గారు ఎలా ఉన్నారు?”
“ఏదైనా జరిగిన దానిని మరచిపోతే మతిమరుపు అంటారు.”
“దాదాపుగా కరెక్ట్!”
“జరగని దానిని గుర్తు చేసుకుంటే ఏవంటారు?”
“అయ్యో.. అలా కూడా ఉందా?”
“మరి? మొన్న ఓ కుర్రాడు బైక్ మీద వచ్చి మందులిచ్చాడు. వాడిని వెళ్లనీయకుండా ఒకటే గోల.”
“ఓ!”
“ఆ బైక్ ఆయనదంటారు. కాలేజీ రోజుల్లో నడిపే వారట!”
“నడిపే వారేమో పాపం!”
“సరిపోయింది. జీవితంలో నా నెత్తి మీద ఎక్కి తొక్కటమే కానీ సైకిల్ కూడా తొక్కలేదు! ఆ రాత్రి అర్ధరాత్రి లేచి కూర్చున్నారు.”
“ఎందుకు? దాహమేమో?”
“దాహమైతే గడ గడా తాగి పడుకుంటారు. నా నిద్ర చెడగొట్టారు. ఆ కుర్రాడు ఆయన బైక్ నడుపుతున్నట్లు శబ్దం అలా వినిపిస్తోందట!”
“మరి ఏం చేసారు పిన్ని గారూ?”
“ఖర్మ. మెల్లగా చెబుతా విను. నేను గురక పెట్టను. అయినా అది నా గురక తాలూకు శబ్దం అని నచ్చజెప్పి పడుకోమన్నాను ఖర్మ, ఏం చేస్తాం?”
“ఊ.. కొంత మందికి జీవితంలో చేయాలనుకున్నది చేయలేకపోతే అది చేసేసినట్లు ఊహించుకుని సతాయించుకుని తింటారు!”
“మరే! ఒక పని అయితే ఒక రోజుతో సరిపెట్టుకోవచ్చు. ఏ రోజు ఏమి ఆలోచిస్తారో తెలియదు!”
“చిన్నప్పుడు ఎక్కువ ఊహలుండి ఉంటాయి.”
“ఆ కాలంలో పెళ్లిచూపుల్లో మాట్లాడనిస్తే ఖచ్చితంగా అడిగేసి ఇప్పుడు కడిగేసి లిస్టు వ్రాసుకుని జాగ్రత్త పడేదాన్ని!”
ఇద్దరూ నవ్వుకున్నారు కొద్ది సేపు. బాల్కనీలోని పెద్దాయన కూడా అటూ ఇటూ జాగ్రత్తగా చూస్తూ చిన్న నవ్వు నవ్వి మరల పేపరులో తల దాచేసుకున్నాడు.
“నా సంగతేమిటి చెప్పాలి పిన్ని గారూ!”
“చెప్పు అమ్మలూ! మతి లేని వారి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటేనే మనకున్న కాసింత మతి అలా ఇంకా కొద్ది రోజులు పని చేయగలదు!”
“బంగారం మాటల్లో పెట్టి మూట గట్టారు పిన్ని గారూ! మ దూరపు బంధువొకరు మొన్ననే కంటి ఆపరేషన్ చేయించుకుని వచ్చాడు. నల్ల కళ్లద్దాలు పెట్టుకున్నాడు.”
“పాపం. పెద్దవాడా?”
“పెద్దవాడే కానీ అలా కనిపించడు.”
“ఓహో! మిగతా వాళ్లని సరిగ్గా చూడాలని ఆపరేషన్ చేయించుకున్నట్లున్నాడు.”
“సర్లేండి వేళాకోళం! ఈయనను చూసి నవ్వాడు.”
“ఎందుకు?”
“మీరు బావున్నారు పిన్ని గారూ! మొదటిసారి కనిపించినప్పుడు ఏడవకూడదు. బాగుండదు.”
“అస్సలు.”
“ఈయన పేరడిగారు.”
“ఫరవాలేదే?”
“అడుగుతారు కానీ.. సర్లేండి. రాజశేఖర్ అని పేరు చెప్పాడు. ఎక్కడినుండి, ఎలా వస్తున్నావు? అన్నారు.”
“మందులు పని చేస్తున్నాయన్నమాట.”
“నేనూ అలానే అనుకున్నాను. ఆయన రైల్లో వచ్చానని చెప్పాడు. అంతే! అమాంతం లోపలికి వచ్చి తలుపులు వేసేసారు.”
“ఎందుకు?”
“ఎవరో పోకిరీట! రాజశేఖర్ అను మాట అలా లోపలికి వెళ్లిందన్న మాట. ఎవరో పోకిరీ.. జైల్లోంచి నేరుగా ఇక్కడికే వచ్చేసాడన్నారు. నాకు జాగ్రత్త కూడా చెప్పారు. రైలు అన్న మాట జైలులా వెళ్లింది. అదీ సంగతి.”
ఎదురింటి బాల్కనీ నుంచి న్యూస్ పేపర్ క్రిందికి పడింది. క్రింద గేటు దగ్గర కూరగాయలు బేరమాడుతున్న వాళ్లావిడ గొంతు లేచింది.
“ఆ! ఆఖరుకి కూరగాయలు అమ్మేది కూడా కావాలా ఆడుకునేందుకు? ఏమిటి ఈ పోకిరీ పనులు?”
***
కాకపోతే కొద్ది రోజులుగా గోడ దగ్గర మీటింగులు ఆగిపోయాయి. పిన్ని గారు చాలా సేపు రోజూ గోడ దగ్గర నిలబడి అటూ ఇటూ చూసి నిట్టూర్చి వెళ్లిపోయేవారు. బాల్కనీలోంచి ఆ పెద్దాయన భోజనానికి కేక వచ్చేవరకూ రెండు ఇళ్లల్లోని జాగాని తీవ్రంగా సమీక్షించి లోపలికి వెళ్లిపోయేవాడు. గేటు దగ్గర నిలబడే వాళ్లావిడ అనుమానంగా ఎదురింట్లోకి చూసి వెళ్లిపోయేది..
అమ్మలు సార్ వారి మతిమరుపు వ్యవహారానికి విసిగి వేసారిపోయింది. చిన్న పిల్లాడిలా ఏంటండీ అని కసురుకుని అంతలోనే తమాయించుకుని తనలో తాను బాధపడి తన మొబైల్లోనే తల దాచుకుని కాలక్షేపం చేస్తోంది. కాకపోతే సార్ వారు మొక్కలకి నీళ్లు పోయటానికి ట్యూబ్ పట్టుకుని వాకిట్లోకి వెళ్లినప్పుడు గబగబా పరుగులు తీసి ఆరేసిన బట్టలని ప్రక్కకి నెట్టటం, వాష్ రూమ్ లోకి వెళ్లినప్పుడు నల్లా కట్టారో లేదో చూడటం, మందుల డబ్బా తీసి టాబ్లెట్స్ వేసుకుంటున్నప్పుడు కొంపదీసి అన్నీ వేసేసుకుంటున్నారేమోనని దగ్గరుండి చూడటం, ఇలాంటివి అలవాటైపోయాయి.
కానీ ఏం చేస్తుంది? తనకీ వయసు రోజూ కనీసం ఒకసారైనా కాలింగ్ బెల్ కొట్టేస్తోంది! ఆడదానికి ఆటవిడుపు ఎక్కడిది? తల్లైనా, పిల్లైనా, కూతురైనా, కోడలైనా సాగని ఆలోచనలతో కొంత, ఆగని పనులతో కొంత, దైనందిన సన్నివేశాలతో, అందరి వేషాలతో, ఆవేశాలతో ఆవిరైపోయే ఆయువే కదా ఆడది?
ఒక రోజు తను కష్టపడి సంపాదించుకున్న పెయింటింగులన్నీ చెల్లా చెదురుగా పడేసి ఉన్నాయి. లోపలికెళ్లి గదులలో చూస్తే పుస్తకాలన్నీ క్రింద పడి ఉన్నాయి. ఇటు బెడ్ రూమ్ లోకి వెళ్లి చూస్తే చీరెలు, విలువైన వస్తువులన్నీ బెడ్ మీద పడి ఉన్నాయి. ఎక్కడ ఈ మనిషి అని గొంతెత్తి అరచుకుంటూ ఇల్లంతా కలయ జూసింది. సార్ వారు ఎక్కడా లేరు. కోపంలో ఊగిపోతూ వాకిలి వైపు నడచింది. అక్కడ ద్వారం మెట్ల మీద అటు తిరిగి కూర్చున్న ఆయనను దాదాపు తోసెయ్య బోయింది. ఆయన ఎక్కడి నుండో ఓ చిప్స్ పాకెట్ పట్టుకుని తీరిగ్గా నములుతున్నారు. దానిని లాక్కుని విసిరి కొట్టింది.
“నన్నడిగితే తెచ్చి ఇయ్యనా?”, గట్టిగా అరచి లోపలికి వెళ్లిపోయింది. సార్ వారు వెంట నడిచారు.
“ఏమైంది?”, అడిగారు.
“ఏంటిదిదంతా? ఎందుకు చేసారు ఈ పని? సద్దుకోలేక చావాలి. ఇదేంటి? ఈ ఆల్బమ్స్, పెళ్లి ఫొటోలు.. అన్నీ.. ఒకటి కాదు, భగవంతుడా!”
అంతకు మించి మాటలు రాలేదు అమ్మలుకి. అలా ఆవేదనలో, అలసటలో బెడ్ మీద కూలబడి కుమిలిపోయింది. సార్ వారు చుట్టూతా ఎందుకో పరికించి ఆమె భుజం తట్టారు.
“నే సద్దుతాగా?”
టక్కున లేచి నమస్కారం పెట్టింది.
“పుణ్యం ఉంటుంది. దయ చేసి ఆ పని చేయకండి!”
అమ్మలుకి ఆ రాత్రి పడుకునేసరికి పదకొండు దాటింది. ఎలాగో అలాగ ఇల్లంతా సద్ది వాగుతున్న టి.వి.ని కట్టబోతూ ఒకసారి ఆగింది. అందులో ఓ పెద్దాయన చిప్స్ తింటూ ఏదో వాణిజ్య ప్రకటన ఇస్తున్నాడు.. టి.వి గట్టిది. పగలలేదు..
***
దాదాపు రెండున్నరకి ఆ రాత్రి ఎందుకో మెలకువ వచ్చింది. ఎక్కడో లైట్ వెలుగుతోంది. మళ్లీ కొంపలంటుకున్నాయేమోనని అనుకుంది. సార్ వారి గదిలో లైట్ వెలుగుతోంది. మెల్లగా నిద్ర మత్తులో వెళ్లి చూసింది. కుర్చీలోనే దిండు వేసుకుని వెనక్కి ఆనుకుని నిదురుస్తున్నారు సార్ వారు. నోరు ఎంతో అలసిపోయిన వారు పెట్టినట్లు తెరచి ఉంది. టేబిల్ మీద ఎక్కడిదో ఒక తెల్లని కాన్వాస్ స్టాండ్ మీద క్లిప్‌కి తగిలించి ఉంది. దాని మీద ఏదో బొమ్మ గీస్తున్నట్లు తెలుస్తోంది. దగ్గరగా వెళ్లింది. ఆ కాన్వాస్‌కి ప్రక్కగా కొడుకు, కూతురి పెళ్లి ఫొటో నిలబెట్టి ఉంది. దీనిని వెతకటానికా ఇల్లంతా గుల్ల చేసారు? ఇప్పుడు ఇంతలో ఈ పరిస్థితులలో గొప్ప కళాకారులైపోవాలా? జాగ్రత్తగా చూసింది. స్కెచ్ బాగానే వస్తోంది. ఎందుకో నిట్టూర్పులు వస్తున్నాయి. మాసిన గెడ్డంతో సార్ వారు ఆయన పరిస్థితికి ఆయనే వ్యంగ్యంతో రంగులు నింపుకుంటున్నట్లుంది..
కళ్లు తెరిచారు సార్ వారు. అమ్మలుని చూసి “మన పెళ్లి ఫొటో వెతికి వెతికి తీసా. బొమ్మ గీస్తున్నాను. ఎలా ఉన్నాం ఇందులో?”
అమ్మలుకి నవ్వు ఆగలేదు. అది ఆయన పెళ్లి ఫొటో అనుకుంటున్నారు.. కాన్వాస్‌లో ఇంకెవరో కనపడుతున్నారు! నవ్వుని ఎక్కడ ఆపాలో తెలియలేదు. ఆయనా నవ్వుతున్నాతు.. ఎందుకో మరి!
వార్ధక్యం ఒక వాయిద్యం లాంటిది. పలికించకుండానే పలుకుతూ ఉంటుంది. ఎవరూ కెలకకున్నా ఎందుకో కులుకుతూ ఉంటుంది. లోపలి కదలికలు పదనిసల్లా అనిపిస్తాయి. వెలుపలి విసిగింపులు సరిగమల్లా ఉంటాయి. ప్రతి ఆగమూ అర్థం కాని రాగంలా ఉంటుంది. అందరూ అక్కడ ఓ గీత గీసేసినా ప్రేమతో మీటిన వారికి ఒక అరుదైన పాట రెండు మూడు మాటల్లో వినిపిస్తుంది..
***
ఒక రోజు తెల్లారంగానే పిన్ని గారు అక్కడ మొక్కల దగ్గర అమ్మలుని చూసి “అమ్మలూ..”, అని గట్టిగా పిలిచారు. అమ్మలు పిట్టగోడ వద్దకు చేరే ముందరే ఈసారి ఎదురింటి బాల్కనీలోని పెద్దాయన ఏకంగా క్రిందకి వచ్చి గేటు వద్ద నిలబడ్డాడు. వాళ్ల ఆవిడ కూడా అక్కడే ఉంది. పిన్ని గారు చేతిలో ఏదో ఫొటో ఫ్రేమ్ పట్టుకుని ఉన్నారు. ఎట్టకేలకు ఇద్దరూ మరల గోడకి తలకాయలు ఆంచేసారు.
“నాలుగు రోజులు కనిపించకపోయే సరికి నాలుగు దిక్కులూ మూసుకున్నట్లయింది అమ్మలూ! ఏమయిందేమిటి? సారు వారు కులాసాయే కదా?”
“కులాసాయే పిన్ని గారూ! మీరెలా ఉన్నారు? చేతిలో ఇదేంటి?”
“ఇదా? ఇది మీదే! సారు వారు వీధి చివర ఫొటో ఫ్రేమ్ వాడి దగ్గర ఫ్రేమ్ కట్టమని ఇచ్చారుట. మామూలుగానే మరచిపోయినట్లున్నారు. అతను నా చేతికిచ్చి మీకిమ్మన్నాడు.”
“మరి డబ్బులు?”
“నేనివ్వలేదు..”
“అయ్యో నేనిస్తాలెండి “
పిన్ని గారు చెయ్యి అడ్డం పెట్టారు. “అమ్మలూ, డబ్బు మీ బాబాయి గారిచ్చేసారు.”
“అవునా?”
“అవును. అసలు ఈ ఫ్రేమ్ లో ఒక కవిత ఉన్నది. తీరా చూస్తే దానిని మీ బాబాయి ఆయన చిన్నప్పుడు వ్రాసిందంటారు అలవాటుగా!”
“ఏమో ఆ అలవాటుందేమో!”
“సరిపోయింది. కవ్వాలు, కావ్యాలు, కవితలు ఆయనకు ఆమడ దూరం. అదలా ఉంచు. ఇది తొందరగా ఆయన పడుకునున్నప్పుడే తీసేసుకో మరి.”
అమ్మలు ఆ ఫ్రేమ్ తీసుకుంది. అందులో ఒక కవిత వ్రాసి ఉంది. ఆమెకు ఇది చిత్రంగా తోచింది.
“అర్థమైంది..”, అంది, “..ఒక బొమ్మ స్కెచ్ వేసి దానిని ఫ్రేమ్ కట్టిస్తానన్నారు. అలవాటుగా మరచిపోయి ఈ కాగితాన్ని అతనికిచ్చి కట్టమని ఉంటారు. ఆఖరుకి అదీ మరచిపోయారు. ఇంతకీ ఏం వ్రాసారు?..”
అందరూ చెవులు చార్జ్ చేసి మరీ వింటున్నారు. అమ్మలు గట్టిగానే చదువుతోంది,
“ఇంత అతిగాడికి మతి పోవటమేమిటో?
అది ఎక్కడికీ పోలేదు, గతి మార్చి మనసులో కలసిపోయింది..
మందగా గుర్తులన్నీ అందంగా మారిపోయాక ఒక్క గుర్తు కోసం
ఒక్క పసందైన బొమ్మని ఇవతలికి లాగాలని కూర్చున్నాను!
ఓడిపోయిన వాని వలన మరొకరి గెలుపు కనిపిస్తుంది
గోడ మీద నిలచిన బొమ్మ గోడ వలన నిలబడుతుంది
రాలిపోయినా అది తాకిన చోటు గోడకి గుర్తుంటుంది
నేనిలా వాలిపోయినా దయ చేసి పటంలోకి చేర్చవద్దు!
ఎన్నో పటాలను నిలబెట్టిన గోడను నేను
నున్ననైన గోడలా, అప్పుడే వేసిన సున్నంలా
నా మనసును పది కాలాలు మననీయండి!
కావాలంటే ఒక సారి తల వాల్చి చూడండి
అడ్డుగోడను కాను, ఆదుకుంటాను!”
అమ్మలుకు గొంతు పెగలలేదు. నిండిన కళ్లతో పిన్ని గారి కళ్లల్లోకి చూసింది. ఆ పిట్టగోడ దగ్గర ఇద్దరూ కొద్దిసేపు గోడల్లా నిలబడ్డారు! బాల్కనీ పెద్దాయన ఎందుకో ఈ సారి ధైర్యంగా వాళ్లావిడ కళ్లల్లోకి చూసాడు.
వేదాంతం శ్రీపతిశర్మ కథా రచయిత. నవలా రచయిత. వ్యంగ్య హాస్య రచనలకు పెట్టింది పేరు. “ఆరోగ్య భాగ్యచక్రం” అనే పుస్తకాన్ని వెలువరించారు.
