Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మాతృత్వపు మధురిమలు

[అనుకృతి గారు రచించిన ‘మాతృత్వపు మధురిమలు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

అరవింద, శ్రీలత బ్యాంక్ ఉద్యోగినులు. అరవింద భర్త రమేష్, శ్రీలత భర్త సుగుణాకర్ కూడా మంచి స్నేహితులు.

అరవిందకు ముందు కూతురు, తర్వాత కొడుకు. శ్రీలతకి ముందు కొడుకు తర్వాత కూతురు. ఇద్దరూ మొదటి సంతానానికి బయటి మ్యాచెస్ చేశారు. అరవింద కొడుకు వరుణ్, శ్రీలత కూతురు శ్రీజతో వివాహం చేయాలని, అలా ఇద్దరూ వియ్యపురాళ్లు అవ్వాలని, పిల్లల చిన్నప్పటినుంచీ అనుకొన్నారు.

వరుణ్ కొంచం వీరశైవం, కానీ శ్రీజ చాలా నెమ్మది. వరుణ్ జలపాతం లాంటి వాడు, శ్రీజ నెమ్మదిగా ప్రవహించే నదిలాంటిది. వరుణ్ స్వభావానికి శ్రీజ కరెక్ట్ అని అరవింద నమ్మకం.

శ్రీజకి ఇంజనీరింగ్ ఫైనల్ సెమిస్టరు చేస్తుండగానే, క్యాంపస్ సెలక్షన్‌లో జాబ్ వచ్చింది. వరుణ్ నాలుగేళ్ల నుండి బెంగళూర్‌లో జాబ్ చేస్తున్నాడు. వెంటనే పెళ్లి పెళ్ళి చేద్దామని సరదాపడ్డారు స్నేహితురాళిద్దరూ.

“ఇప్పుడేమి పెళ్లి” అంటూ ఎగరగొట్టాడు వరుణ్ వాళ్ళ ఆలోచనని.

శ్రీజ కిప్పుడు ఇరవై మూడు. వరుణ్ సరిగా మాట్లాడటం లేదనీ, ఫోన్ కూడా చేయటం తగ్గించాడని, ముందుగా గమనించింది సుగుణాకరే. హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా, ఇంటికి రావటం తగ్గించాడని గమనించి, శ్రీలతని ఆ విషయమై అడిగాడు. ‘ఒక నెలనుండి అనుకుంటా, ఫోన్ చేయటం లేదు, ఒకవేళ చేసినా, ముక్తసరిగా మాట్లాడుతున్నాడ’ని శ్రీజ చెప్పిందని అన్నది భర్తతో శ్రీలత.

ఇద్దరిలోనూ ఆందోళన మొదలయ్యింది. పిల్లల చిన్నప్పటినుండీ అనుకున్న మ్యాచ్, ఇద్దరి మనసుల్లో రకరకాల అనుమానాలు. వరుణ్, శ్రీజలది అందమైన జోడీ, అటు చదువులోనూ ఇద్దరూ సమఉజ్జీలు. ఇద్దరూ వెంటనే బయల్దేరి అరవింద ఇంటికి వెళ్లారు.

విషయం విని కలవరపడింది అరవింద. ఆమెకు కూడా ఈ విషయం చాలా ఆందోళన కలిగించింది. వెంటనే భర్తతో కలిసి బెంగుళూరు వెళ్ళింది. ఉదయం బెంగుళూరు చేరేసరికి, వరుణ్ ఇంకా నిద్రపోతున్నాడు. హఠాత్తుగా వచ్చిన వాళ్ళిద్దర్నీ చూసి, ఆశ్చర్య పోయినా, సంతోషంగా ఆహ్వానించాడు.

బ్రేక్‌ఫాస్ట్ తర్వాత సూటిగా అడిగింది కొడుకుని, “శ్రీజకు ఫోన్ చేయటం లేదా ఈ మధ్య, ఏమైంది?” అని.

“ఏమీ కాలేదు, తను చెప్పిందా నీకు?”

“తనేమీ చెప్పలేదు, వాళ్ళ నాన్న, అదే మామయ్య గమనించి మమ్మల్ని అడిగాడు. ఏమిజరిగింది? ఎందుకు వద్దంటున్నావు శ్రీజని, అసలు కారణం చెప్పు, చిన్నప్పట్నుంచీ అనుకొన్న మ్యాచ్,” బాధగా అన్నది అరవింద.

“ఫోన్ చేస్తే రెండు నిమిషాలు కూడా మాట్లాడదు హైదరాబాద్ వచ్చినప్పుడు సినిమా కెళదాం అంటే వద్దు అంటుంది, పోనీ ఎటన్నా తిరిగి వద్దాము అంటే ఇంట్లోనే మాట్లాడుకొందామంటుంది,ఆ సత్తెకాలం సత్తెమ్మ నాకొద్దు, వెళ్ళి చెప్పండి తనతో ఇలా అన్నానని” కోపంగా అన్నాడు వరుణ్.

అరవింద, రమేష్ నవ్వేశారు. “చాల్లే ఊరుకో, సత్తెకాలం సత్తెమ్మ తోనే నీ పెళ్లి, పిచ్చి వేషాలెయ్యకు, నువ్వు సెలవు పెట్టి మాతో రా, ముందు ఎంగేజ్మెంట్ చేస్తేగానీ నీ తిక్క తిరగదు.” అన్నది అరవింద.

ఇంకా ఆలస్యం చేస్తే ఎక్కడ జారిపోతాడో అని భయపడి, ఒక వారం తర్వాత ముగ్గురూ హైదరాబాద్ వచ్చారు. ముందు ఎంగేజ్మెంట్, తర్వాత పదిహేను రోజుల్లో పెళ్ళి చేసేసారు. నెల రోజుల తర్వాత తను కూడా బెంగుళూరు ట్రాన్స్‌ఫర్ చేయించుకొని, వరుణ్ దగ్గిరికి వెళ్ళింది శ్రీజ.

శ్రీజ తాను అనుకొన్నంత డల్ కాదని తెల్సింది వరుణ్‌కి. ‘ఏదైనా పెళ్ళి తర్వాతే’ అన్నది ఆమె సిద్ధాంతమని, అందుకే అలా ఉండేదని తెలిసి, నవ్వుకున్నాడు వరుణ్. నవ్వుతూ సరదాగా ఉంటోంది. కమ్మగా వండిపెడుతోంది. వరుణ్ కూడా ప్రతి పనిలో సాయం చేయటం అలవాటు చేసుకొన్నాడు. పొరపొచ్చాలు లేకుండా మూడేళ్లు గడిచాయి.

ఈలోపల అరవింద, శ్రీలత మూడేసిసార్లు మనవళ్ల కోసం అమెరికా తిరిగారు. వాతావరణం పడక, ఆరోగ్యం సరిగాలేక, కాళ్ళ నొప్పులూ, కీళ్ల నొప్పులతో సతమతమవుతున్నారు ఇద్దరూ. అప్పుడే నెల తప్పింది. శ్రీజ. మధ్య మధ్యలో అరవింద, శ్రీలత ఇద్దరూ వచ్చి వెళుతుండేవారు.

శ్రీజ ప్రెగ్నెన్సీ ఒక భారంగా భావించడం లేదు. వంటతో సహా అన్నీ చేసుకొని, తిని, తిరుగుతున్నది. వరుణ్‌కి శ్రీజని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటోంది.

డెలివరీ టైంకి రెండు నెలల ముందే లీవ్ పెట్టింది. బాబు పుట్టాడు, అరవింద, శ్రీలత వంతులేసుకొని, మనవడి సేవ చేశారు. బాబుకి స్నానం చేయించటం, డైపర్ మార్చటం అన్నీ స్వయంగా చేసుకునేది శ్రీజ. “మేమున్నాముగా” అని అరవింద కానీ, శ్రీలత కానీ అంటే, “వాడి పనులన్నీ నేనే చెయ్యాలనిపిస్తుంది.” అని జవాబిచ్చేది.

పిల్లాడికి అయిదవ నెల వచ్చింది, ఇంక జాబ్‌లో జాయిన్ అవ్వాల్సిన టైం అయ్యింది, కానీ శ్రీజ జాబ్ మాటే ఎత్తక పోవటంతో, ఒక రోజు వరుణ్ అడిగేశాడు. అప్పుడు చెప్పింది జాబ్ రిజైన్ చేశానని.

వరుణ్‌కి కోపంతో ఒళ్ళు తెలియలేదు, “నీకేమైనా ఆలోచన ఉందా, అంత మంచి జాబ్ అంత ఈజీగా ఎలా వదిలేసావు? నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా అలా ఎలా మానేసావు? అయినా, అమ్మా, అత్తయ్య వున్నారు కదా వాడిని చూసుకోవటానికి? వాడి పనులన్నీ నువ్వే చేసుకుంటుంటే ఏమో అనుకున్నాను, ఇదన్నమాట అసలు సంగతి” కోపంగా అరిచాడు.

శ్రీజ మౌనంగా ఊరుకొంది. కొంచమాగి నెమ్మదిగా అన్నది, “అత్తయ్యని, అమ్మని గమనించారా మీరు? మూడేసి సార్లు అమెరికా వెళ్ళి, సేవలు చేశారు. వాళ్లకి అస్సలు చేత కావటం లేదు. అయినా పళ్ళ బిగువున ఇంకా చాకిరీ చేస్తున్నారు. అమెరికాలో వాళ్ళకి తప్పదు. ఇక్కడ అవసరం లేదుగా, వాళ్ళకి ఇకనైనా విశ్రా౦తినివ్వకపోతే ఎలా? నేను జాబ్ మానేసి, వాడిని చూసుకోవాలని డిసైడ్ అయ్యాను. పాపం వాళ్ళ కిప్పుడైనా ఎటైనా సరదాగా వెళ్ళే అవకాశం ఇవ్వాలని మీకు తోచటం లేదా?

అయినా నేను వాడి బాల్యాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చెయ్యాలని కోరుకున్నా, మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం రాదుగా. ఏ కేర్ సెంటర్ లోనో వేసి, నేను శాంతిగా ఉండలేను.నా ఫ్రెండ్స్ కొంతమంది కేర్ సెంటర్స్‌లో పిల్లల్ని వదిలి వచ్చి, వాళ్ళ గురించి చాలా బెంగ పడేవాళ్ళు. వాళ్ళ పరిస్థితులు అటువంటివి, అయినా మామయ్యా వాళ్లకి, అమ్మావాళ్ళకి మంచి పెన్షన్స్ వస్తున్నాయి, మీకు మంచి జాబ్ వుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా” అన్నది.

నోట మాట రాక, శ్రీజకేసి చూస్తుండి పోయాడు వరుణ్. అంతలో “ఏయ్, వాడు చూడండి, పాకటానికి పొజిషన్ తీసుకొంటున్నాడు, చూడండి, చూడండి” అంటూ గట్టిగా అరిచి, ఫోటో తీసింది.

మాతృత్వపు శోభతో మెరిసిపోతున్న శ్రీజ కళ్ళలోని ఆనందాన్ని చూస్తూ తన కోపాన్ని మరిచిపోయి, గట్టిగా నవ్వేసాడు వరుణ్. వంగి, తల్లిపాలతో, బొద్దుగా, ముద్దుగా వున్న కొడుకుని చేతుల్లోకి తీసుకొని, ముద్దాడి, శ్రీజని దగ్గరికి తీసుకొని, “నీ ఇష్టం శ్రీజా, హాయిగా నీ కొడుకుతో ఉండు, మొత్తానికి సత్తెకాలపు సత్తెమ్మననిపించావు” అంటూ పక పక నవ్వాడు.

Exit mobile version